వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ దరఖాస్తుపై వాదనల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి డబ్ల్యూ. చంద్రకాంత్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ దరఖాస్తుపై వాదనల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి పి.చిదంబరం, కేంద్రం హోం మంత్రి షిండేతోపాటు ‘పలువురు కాంగ్రెస్ ప్రముఖుల’ను కూడా కలిసేందుకు వారి అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
16న భేటీ.. 18న వాదనలు : సీమాంధ్రకు సంబంధించి చర్చల పేరిట ఈ నెల 16న చంద్రబాబు రాజధానికి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ నెల 18న జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చిదంబరంతో అపాయింట్‌మెంట్‌లో మరో ‘అంతర్గత అపాయింట్‌మెంట్’ కూడా చంద్రబాబు కోరుతున్నట్లు తెలిసింది. అంటే.. రాష్ట్ర విభజనపై పార్టీ నేతల సమక్షంలో చిదంబరంతో మాట్లాడిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా మరికొంత సేపు ఆర్థిక మంత్రితో రహస్యంగా సమావేశమవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జగన్ కేసులో కీలక వాదనలొస్తే చాలు: జగన్‌మోహన్‌రెడ్డి కేసులో కీలక వాదనలు జరిగే ప్రతి సమయంలోనూ బాబు ఢిల్లీ వెళుతుండడం, ఆయన, ఆయన పార్టీ ఎంపీలు ఏదో ఒక పేరుతో కాంగ్రెస్ పెద్దలను కలవడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అంటున్నారు. గతంలో మరుసటి రోజు జగన్ బెయిల్‌పై తీర్పు ఉందనగా.. టీడీపీ ఎంపీలు వెళ్లి చిదంబరాన్ని కలవడం, కలిసిన రెండు గంటల్లోనే ‘సాక్షి’ ఆస్తుల జప్తునకు ఈడీ ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అలాగే ఢిల్లీలో చంద్రబాబు ఒక్కరే రహస్యంగా వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిదంబరం పార్లమెంటులో టీడీపీ ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు కూడా ఇటు చంద్రబాబు.. చిదంబరం, షిండేలతో భేటీకి అపాయింట్‌మెంట్ కోరగా.. అటు టీడీపీ ఎంపీలు.. ఈడీ, సీబీఐ అధికారులతో సమావేశమవడానికి సిద్ధమవుతున్నారు. జగన్ కేసులో దర్యాప్తును వేరే అధికారికి బదలాయించడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందంటూ నిరసన వ్యక్తం చేయడానికి వారు భేటీ అవుతున్నారు.