
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతి, లంచగొండి తనం, తప్పుడు విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు ఇబ్బంది ఏర్పడిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చేసిన తప్పులు, అక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదించేందుకు టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గడిచిన ఐదేళ్లలో విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలు, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజూ ప్రజల పక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. మార్చి 2019 నాటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయిలు పడిందని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. కేంద్రానికి లేఖ రాయడంతో పాటు సింగరేణి నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని కోరారని వివరించారు. మరోవైపు విద్యుత్ కంపెనీల బకాయిలను చెల్లించుకుంటూ వస్తున్నారన్నారు. ఎన్టీపీసీకి రూ.3,414 కోట్లు, ఇతర విద్యుత్ సంస్థలకు రూ.1,200 కోట్లు చెల్లించామని తెలిపారు.