
సీతానగరం (రాజానగరం): రాష్ట్రంలో అవినీతి మారాజుగా పేరొందిన చంద్రబాబుకు ప్రజల రక్షణ కవచం అవసరమా అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. మంగళవారం సీతానగరంలో ప్రజా సంకల్ప యాత్రపై పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబులో భయాందోళనలు ప్రారంభమయ్యాయని, తాను చేసిన రూ.లక్షలాది కోట్ల దోపిడీకి కేంద్రం లెక్కలు చెప్పాలని అడగడంతో చంద్రబాబు భయాందోళనలో ఉన్నారన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు ఎక్కడ విరుచుకుపడుతుందోనని ఆందోళనలో ఉన్నారని, అందుకే ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా ప్రజలను రక్షణ కవచంగా ఉండాలని అడుగుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమి చేశావని నీకు రక్షణగా ఉండాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వందలాది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయని ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.
అవినీతి ఆకాశాన్ని తాకింది
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి ఆకాశాన్ని అంటిందన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఇప్పుడు ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారని అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావన, కుంభకోణానికి సంబంధించి ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించడంతో చంద్రబాబు అవినీతి ఎల్లలు దాటిందని ఆక్షేపించారు. కుంభకోణాలు, అవినీతి బయట పడడంతో చంద్రబాబుకు మానసిక ఆందోళన, భయాందోళన, మానసిక స్థితి బాగాలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోందన్నారు.
తను చేసిన తప్పును మరిచి ఎమ్మెల్యేలను కొంటారా అని బీజేపీని నిలదీయడం, ప్రజలు రక్షణ కవచంగా ఉండాలనడం చంద్రబాబుకు జైలుకు వెళ్లిపోతానని తెలిసిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు భరోసా కల్పిస్తుందని, ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి పాదయాత్ర మంచి అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని, అందుకే ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి పాదయాత్రలో బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పుడు ఘన స్వాగతం పలుకుదామా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.