
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి గాయంతో వైదొలిగిన అమెరికన్ పవర్‌స్టార్ సెరెనా విలియమ్స్ ‘వింబుల్డన్’పై ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కుడి భుజం కండరాల గాయంతో బాధపడుతున్న ఆమె... షరపొవాతో మ్యాచ్‌కు కొన్ని క్షణాల ముందు వైదొలగుతున్నట్లు ప్రకటించింది. కనీసం 60 శాతం ఫిట్‌నెస్ లేనిదే బరిలోకి దిగనని అమెరికన్ స్టార్ చెప్పింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన సెరెనా... తల్లి అయ్యాక బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే.
కానీ గాయంతో వైదొలగడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పింది. ‘వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ వేటలో ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేను. ఈ వారం ఇక్కడే ఉండి వైద్యులను సంప్రదించాకే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. ముందుగా ఎఆర్‌ఐ స్కాన్ తీయిస్తా. ఆ తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు చేయించుకున్న తర్వాత వారి సూచన మేరకే తదుపరి గ్రాండ్‌స్లామ్ ఆడేది లేనిది చెబుతా’నని 36 ఏళ్ల సెరెనా వెల్లడించింది.