
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక మూడేళ్లలో 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,066 రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని గుర్తించింది. అందులో వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై 1,808 కేసులను తీసుకొని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు విచారణ చేపట్టాయి. చివరకు 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఈ కేసుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 168 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 144 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 109 మంది ఆత్మహత్య చేసుకోగా, ఇప్పటికే 846 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు నివేదికలో వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందజేశారు. మిగిలిన కుటుంబాల్లో చాలామందికి ఆగస్టు తర్వాత పరిహారం అంది ఉండొచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆగస్టు తర్వాత రైతు ఆత్మహత్య కేసుల నమోదుపై ఎలాంటి సమాచారం అందలేదని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.