
ప్రపంచ తెలుగు మహా సభల్లో ఉద్యమ కారులను అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల్లో ఉద్యమ కారులను అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఉద్యమ కారులైన గద్దర్, విమలక్క లాంటి వారిని మహాసభల్లో పక్కకు పెట్టారన్నారు. అదే విధంగా రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించకుండా కించపరిచారని ఆరోపించారు. ప్రపంచ మహా సభలు.. టీఆర్‌ఎస్ పార్టీ మహా సభలుగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిపాలన అంతా తెలుగులోనే జరగాలన్నారు.
ఆదివాసీ, లంబాడీల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. గోండు, లంబాడీ సభలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరయ్యారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఓ ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతిచెందినా.. ఇప్పటి వరకు అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మరో వైపు సోమవారం అరెస్టు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను వెంటనే విడుదల చేసి, వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని చాడ డిమాండ్ చేశారు.