World Telugu Conference
-
ఏ భాష అయినా నేర్చుకోండి.. తెలుగులోనే మాట్లాడండి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయాలు, ఆర్థికం, సినిమా ఇలా ఏ రంగంలోనైనా రాణించాలంటే నాలెడ్జ్ సంపాదించండి. ఏ భాష అయినా నేర్చుకోండి. కానీ తెలుగులోనే మాట్లాడుకోండి. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండో భాషగా తెలుగు నిలిచింది. సుమారు 18 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతారు. కానీ ఈ స్థాయిలో దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నాం. దీనికి గల కారణాలను విశ్లేషించుకోవాలి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్ సభల ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్.. తర్వాత కాకా, జైపాల్‌రెడ్డి వంటివారు ప్రభావం చూపించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లింది. తర్వాత చట్టసభల్లో తెలుగువారు ఎవరు మాట్లాడుతారా? అని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అయితే ఎన్టీ ఆర్ ప్రారంభించిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్ ప్రపంచం ముందు తెలుగు ప్రజలు తలెత్తుకునేలా ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మన బాధ్యతను గుర్తుచేసినట్టు అవుతుంది. ఎవరెస్ట్ ఎక్కి చూసినా అక్కడో మలయాళీ ఉంటాడనే నానుడి ఉంది. ఇప్పుడలా తెలుగువారు కనిపిస్తున్నారు. సినిమా రంగంలో హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్నాం.గత పాలకులతో అభివృద్ధి రాజీవ్‌గాంధీ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేశారు. హైదరాబాద్ ప్రాంతం సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంతో పోటీపడేలా ఆర్థికంగా అవకాశాలు కల్పింస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్ఫ్రా ప్రాజెక్టులు కట్టి ఐటీ, ఫార్మా కంపెనీల ఏర్పాటును ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. విడిపోయి పోటీపడే కంటే కలసి ఉండి అభివృద్ధి వైపు నడిస్తే కచి్చతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు నిలుస్తాయి. దేశాల మధ్య యుద్ధాలకే చర్చలు పరిష్కారం చూపిస్తుంటే.. రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చలు దారి చూపవా?.అందరినీ ఆహ్వనిస్తున్నాం... హైదరాబాద్ విశ్వనగరంగా రాణిస్తుందని భరోసా ఇస్తున్నాం. రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తున్నాం. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఔటర్ రింగురోడ్డు ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడింది. ఇకపై రీజనల్ రింగ్‌రోడ్డుతో తెలంగాణ రాష్ట్రాన్ని 60 శాతం పట్టణీకరణ చేసేలా ప్రభుత్వం పనిచేస్తోంది. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్ స్లోగన్‌తో 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాం. అందరినీ సాదరంగా ఆహ్వనిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’అని రేవంత్ పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైటెక్‌సిటీలోని హెచ్ఐసీసీ కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ మహాసభల్లో దేశవిదేశాలకు చెందిన 2 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తునట్టు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ వీఎల్.ఇందిరాదత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆవిర్భవించినట్టు చెప్పారు. వ్యాపార, వాణిజ్య సంబంధాల విస్తరణ తెలుగు వారి మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మహాసభల్లో మొదటి రోజు పలు వ్యాపార అంశాలపై సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక తెలుగు సాహిత్యం వరకు జరిగిన పరిణామాన్ని, సినీ, సాహిత్య రంగాల్లో వచి్చన మార్పులను కళా ప్రదర్శనల్లో ఆవిష్కరిస్తారు. మిగతా రెండు రోజుల సభల్లో వివిధ దేశాల నుంచి, తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమావేశాలు, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఇదీ ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే చోటకు చేర్చాలనే లక్ష్యంతో 1993లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. రెండేళ్లకో సారి మహాసభలను నిర్వహిస్తున్నారు. ఇప్ప టివరకు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ, సింగపూర్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలో ఈ మహాసభలు జరిగాయి. హైదరాబాద్‌లో రెండవసారి మహాసభలు వచ్చే జనవరిలో జరగనున్నాయి. -
భాషకు ప్రాంతీయ హద్దులెందుకు?
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు! నమస్కారం! భాష పుట్టుక, నది జన్మ ఎవ్వరికీ తెలియదు. మనస్సులోని భావాలను ఇతరులతో పంచుకునే గొప్ప సాధనమే భాష. భాష నది వంటిది రాష్ట్రాలుగా మనల్ని కలుపుతుంది. సముద్రం పర భాష వంటిది దేశాలుగా విభజిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తనలో ఉండే అహాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, మనస్సుని సమన్వయం చేసుకోవాలి. సమన్వయము చేసుకునే జ్ఞాపక శక్తి ప్రవహించే నది తియ్యని జలాలతో మనకి ఇస్తుంది. ఆ నది పేరే సరస్వతి. సరస్వతీ నదికి సమ న్వయము చేసే శక్తి ఉంటుంది అక్కడ నుంచి వచ్చినదే అతి పురాతనమైన తెలుగు భాష. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ నగ రంలో జరగడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. సమ్మే ళనం తెలుగు పేరు మీద జరిగింది. తెలుగు అంటే తెలం గాణ ప్రాంతం వారిదే కాదు. తెలుగు మాట్లాడే, మాట్లా డిన వారి సొంతం ఈ సమ్మేళనం. సమ్మేళనానికి వేల సంఖ్యలో అతిథులు విచ్చేసారు. పండితులైన శ్రీనాథ, అన్నమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ, రాయ ప్రోలు, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర వంటి వారి ప్రస్తావన చేసి ఉంటే సభకు మరింత వన్నెను ఇచ్చేది. తెలుగు వారిగా ఆధునిక కవులను గౌరవించాలి. సాహి త్యానికి హద్దులు లేవని చాటాలి. గౌరవనీయ రాష్ట్రపతి గారు తమ ప్రసంగంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రతినిధిగా విదేశాలలో ఉన్న తెలుగు వారిని ఆహ్వానించినట్లే ఆంధ్రా ప్రజలను కూడా ఆహ్వానించి ఉండాల్సింది. రాజకీయ ఇతర కారణాలను పక్కనపెట్టి చంద్ర బాబు నాయుడుగారిని కూడా సభలలో ఉండేలా చేసి ఉంటే తెలుగువారు ఒక్కటే అనే సందేశం అందరికీ అంది ఉండేది. అందమైన లేజర్ షోలో రచయితల చిత్రాలతో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమం నిండుతనాన్ని ఇచ్చేది. బతుకమ్మ మన రచయితలను మించినది అని చెప్పడం మనల్ని మనం మోసం చేసు కోవడమే. హైదరాబాద్ నగరం తన సంస్కృతితో పాటు లక్షల కుటుంబాలను కాపాడుతూ వచ్చింది. వందల సంవత్సరాలుగా మేము అందరము ఇక్కడ నివసి స్తున్నాము. ప్రఖ్యాత రచయిత మహాకవి గుంటూరు శేషేంద్ర గారి భార్యగా మాకు ఆహ్వానం అందలేదు. కానీ మా కోరిక మీముందు ఉంచడం బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో జరిగే సభలలో ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ప్రతి ఒక్క తెలుగు రచయితను గుర్తు చేసుకోవాలి. రచయితలను, వారి కుటుంబాలను అవమానకర పరిస్థితులలో ఉంచ కూడదు. మీరు తెలివైన వారు. ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. తెలుగు భాష రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక వారధి. భాష ఇరు రాష్ట్రాల ప్రజలను కలిసి ఉండేలా చెయ్యాలి. ఆంధ్రా వారు, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఉండటం కారణంగా మీమీద మరింత బాధ్యత ఉన్నది. మీరు తెలుగు ప్రజ లందరికీ ముఖ్య నేత అనే విషయాన్ని గమనించాలి. రాష్ట్రానికి హద్దు ఉంటుంది. భాషకు హద్దు ఉండదు. వివక్ష జరిగింది అని గుర్తు చేసుకుంటూ ఉంటే కక్ష పెరు గుతుంది. కక్షలు, వివక్షలు లేకుండా ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. అభిమానం, అభి లాష, ఉత్సుకత సాంద్రతతో తెలియనిది తెలుసుకో వాలి అని వచ్చే వారికి తెలిపే ప్రయత్నం చెయ్యాలి. – ఇందిరా దేవి ధనరాజ్ గిరి, గుంటూరు శేషేంద్రశర్మగారి సతీమణి జియాన్ బాగ్ ప్యాలెస్ 97015 02653 -
దీపాలా? ద్వీపాలా?
అక్షర తూణీరం సోమనకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడిపోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు ఆర్భాటంగా మొదలై ఆనందోత్సాహాలతో సాగి, విజయవంతంగా ముగి శాయి. తెలుగువారందరికీ ఒక మధుర స్మృతి. జరిగిన తెలుగు తిరునాళ్లవల్ల తెలుగు విస్తృతి పెరిగిందా తరిగిందా అన్నది ప్రశ్న. తెలుగు వైతాళికులను తమకు కావల్సిన రీతిలో జల్లెడపట్టి పాలకులు వారిని మాత్రమే ప్రదర్శిం చారన్నది నిజం. ఈ వడపోతవల్ల తెలుగు ప్రాభవం అందగించిందో, మందగించిందో ఆలోచించుకోవాలి. అందరూ కలిసి మాట్లాడితే పదికోట్ల గొంతులు, చీలి పోతే ఆరూ మూడూ! పంచతంత్ర నిర్మాత, తెలుగు వ్యాకరణవేత్త అయిన చిన్నయసూరిని మద్రాసీ వంకన వదిలేస్తామా? తెలుగు భాషికి దాసుడై తెలుగుతల్లికి సేవచేసిన సీపీ బ్రౌన్‌ని ఆంగ్లేయుడని కడగా పెడదామా? షాజహాన్ కొలువులో గౌరవాలందుకున్న అలంకారవేత్త మన పండితరాయ లకు ఇలాంటి ఉత్సవాలలో పేరు దక్కద్దా? తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానసపుత్రిక. ఆయన ముద్దుబిడ్డగా వన్నెలు, చిన్నెలు సంతరించుకుంది. బుద్ధ పూర్ణిమ పథకంతో భాగ్యనగరానికి వెన్నెల తెచ్చింది తారక రామారావు. ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు పట్టాకనే తెలుగుదనం పరిమళించింది. హైదరాబా దులో కమ్మని తెలుగుమాటలు వెరపులేక వినిపించసా గాయి. ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అనే సూక్తి నందమూరితోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. జీవనది గోదావరి ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. పాయలు వేరైనా నీరొకటే. ఆ నీటి గుణా లొక్కటే. అక్కడి జలచరాలు అన్ని పాయల్లో స్వేచ్ఛగా కలుపుగోలుగా తిరుగాడుతూ ఉంటాయ్. ఆ అలలు నేర్పిన భాషలోనే మాట్లాడుకుంటాయ్. బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి. ఆచార్య సినారెని ఆది నించి కడదాకా సమాదరించారు అన్న గారు. దాశరథిని అక్కినేని అక్కున చేర్చుకున్నారు. ఆస్థాన కవి పదవిలో జలగం గౌరవించారు. ఎంత పాతబడినా నిజాలు చెరిగిపోవు. ప్రారంభ సభలో ఎన్టీఆర్ పేరెత్తడానికి సంకోచించారు వెంకయ్యనా యుడు. అంతేకాదు మరెన్నో చెప్పదగిన, చెప్పాల్సిన పేర్లను దాటవేశారు. అప్పుడు డైలాగులు మర్చిపోయిన నటుడిలా ఉపరాష్ట్రపతి కనిపించారు. చివరి రోజు రాష్ట్ర పతి స్పష్టంగా పింగళి వెంకయ్యని, అల్లూరిని సైతం స్మరించుకున్నారు. ప్రథమ పౌరునికి ధన్యవాదాలు. ఇవ్వాళ కవులుగా, కథ, నవలా రచయితలుగా ప్రసిద్ధులై సభల్లో కళకళలాడుతూ తిరిగిన వారంతా– పెరిగిందీ పేరు తెచ్చుకుందీ కోస్తా ప్రాంతపు పత్రి కల్లోనే. తొలి రచనలు ప్రచురించి, సానలు దిద్దిన పత్రికా సంపాదకుల్ని, తెలుగుమీరిన పాఠకుల్ని పూర్తిగా విస్మ రించి స్వయంభూలుగా ప్రవర్తించక్కర్లేదు. అలిశెట్టి ప్రభాకర్‌ని గమనించిందీ, గుర్తించిందీ, నెత్తిన పెట్టుకు వూరేగించిందీ కోస్తా ప్రాంతం. సోమ నకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడి పోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు. పద్యనాటకం తెలుగువారి హంగు. బుర్రకథ తెలుగోడి పొంగు. చెక్కభజన, హరికథ తెలుగు భుజకీర్తులు. దీపంచెట్టు తెలుగు పల్లెల ఆనవాలు. ఇవన్నీ అలా ఉంచి ఇంతకీ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ సభలు ఎలాంటి అంచనాలు కలిగించాయి. ఒకజాతి దీపాల్లా వెలుగులు పంచాలిగాని ద్వీపాల్లా మిగలకూడదు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అన్నీ కలిసి ఉన్న ప్పుడే తెలుగు అక్షరమాల సంపూర్ణమవుతుంది. అప్పుడే మాటలన్నీ పలుకుతాయ్. ఉచ్ఛారణ స్వచ్ఛంగా, స్పష్టంగా, సలక్షణంగా వర్ధిల్లుతుంది. జై తెలుగుతల్లి! వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ -
ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదు...
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. గత ఏడాది తిరుపతిలో ఈ సమావేశాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాలకు సంబంధించిన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అన్ని ఏర్పాట్లు చేసి ప్రతినిధుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇపుడు వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. దేశ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం నిర్ణయం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారంటూ ఇలాంటి సభలు నిర్వహించకపోవడం తెలంగాణకు అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్‌కు ఇష్టం లేదని, ద్వేషపూరితంగానే ఓయూలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌ను కేసీఆర్ వాయిదా వేశారన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా విద్యార్థులతో బీజేపీ మాట్లాడుతుందని చెప్పారు. టీఆర్ఎస్ మహా సభలా ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహా సభలులాగా జరిగాయని, ఒక లక్ష్యం లేకుండా నిర్వహించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలుగు మహాసభ పేరుతో సీఎం సొంత భజన చేసుకున్నారని, రాచరికపు పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించిందా అని ప్రశ్నించారు. తెలుగు కళాశాలకు ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని నిలదీశారు. టిఆర్ఎస్ నాయకులను ఏ అర్హతతో ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ వేదిక కింద ఉంటారు.. అసదుద్దీన్ ఒవైసీ వేదిక పైన ఉంటారు.. ఇవి ఏమి తెలుగు మహాసభలోఅర్థం కాలేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, మొదటి పొగడ్త కేసీఆర్‌కు వస్తే రెండో పొగడ్త నిజాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. -
సినిమా యాక్టర్లు కూడా భయంతోనే వచ్చారు..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ధనవంతులకు, పెత్తందార్లకు మాత్రమే చోటు కల్పించారు తప్ప పేదవారిని, పేద కవులను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. పేదవారిని గౌరవించాల్సిన అవసరం ఏముందనే ధోరణితో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. పేదవారి సొమ్మంతా పెద్దలకు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరుపై గురువారం మోత్కుపల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో తెలుగువారిని మద్రాసీలు అనేవారని... అలాంటిది తెలుగు వారి ప్రాముఖ్యత ఢిల్లీకి చెప్పింది ఎన్టీఆరేనని అలాంటి ఆయనను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. తనకు, కేసీఆర్‌కు రాజకీయ గురువు ఎన్టీఆరేనని, ఆయన నుంచే తామిద్దరికీ చైతన్యం వచ్చిందన్నారు. అలాంటి ఆయన గురించి నాలుగు మాటలు చెబితే కేసీఆర్ పదవి పోతుందా అని నిలదీశారు. ప్రపంచ తెలుగు పండగ అయినప్పుడు సీఎం చంద్రబాబును కేసీఆర్ ఎందుకు పిలవలేదని, అమరావతి శంకుస్థాపన సమయంలో, కేసీఆర్ యాగం సమయంలో ఇచ్చిపుచ్చుకున్నట్లు జరగలేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వరకు తెలుగు వారు (జస్టిస్ ఎన్వీ రమణ, చలమేశ్వరరావు, లావూరి నాగేశ్వరరావు) ఉన్నారని అలాంటి వారిని గౌరవిస్తే కేసీఆర్‌కే పేరొచ్చి ఉండేదని అన్నారు. కనీసం మీడియా పాత్ర కూడా ఈ సభల్లో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారంతా కూడా కేసీఆర్‌కు భయపడి భజన చేసిర్రా, నిజంగానే చేసిర్రా అనేది అర్ధం కాలేదని అన్నారు. తెలంగాణ దళిత కవులు విమలక్క, గద్దర్, వందేమాతరం, శ్రీనివాస్, అందెశ్రీని ఎందుకు కేసీఆర్ గౌరవించలేదని మండిపడ్డారు. సినిమా యాక్టర్లు కూడా భయంతో వచ్చినవారేగానీ, ప్రేమతో రాలేదని, చిరంజీవి కూడా భయంతోనే వచ్చినట్లుందని అనుకుంటున్నానని అన్నారు. బాలకృష్ణ కూడా అందరు యాక్టర్ల మాదిరిగా వచ్చిపోయారన్నారు. యాక్టర్లంతా గొర్రెల మాదిరిగానే దండలు వేయించుకున్నారని, వారు ఎన్టీఆర్ గురించి మాట్లాడాలని అనుకున్నా... కేసీఆర్ భయంతో మాట్లాడలేకపోయారని అన్నారు. కేసీఆర్‌ను పొగిడించుకునేందుకే రూ.కోట్లు ఖర్చుపెట్టారని, పేదవాడు సంతోషంగా లేని ఏ పండుగ పండుగ కాదన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ తీరు నిరంకుశ, నియంతృత్వవాదానికి ప్రతీకగా ఉందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే జనాలు సంతోషంగా ఉండే చర్యలు చేయాలని, ఆయనలో ప్రాంతీయవాదం ఆలోచన ఇంకా పోలేదన్నారు. 'కేసీఆర్ కేబినెట్లో ఒక్క మాదిగ, మాల లేరు, బీసీలు ఉన్నా వారికి వాయిస్ లేదు. మిత్రుడిగా నాకు రాజకీయ కక్ష లేదు. ప్రజలు మెచ్చేలాగా కేసీఆర్ ఉండాలి. ఆయన తీరు మారాలి. ఎన్టీఆర్ శిష్యుడిగా చెప్తున్నా కేసీఆర్ చర్యలు దుర్మార్గం. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే' అని మోత్కుపల్లి మండిపడ్డారు. -
బోధనాభాష–పాలనాభాషగా తెలుగు
ప్రపంచ తెలుగు మహాసభల పేరిట హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారి కంగా జరిగిన అపూర్వ సాంస్కృతిక ఉత్సవం ఇది. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం గుండె గొంతుకలో తెలుగు భాష ఇప్పటికీ సజీవంగా ఉండటం వల్లే ఈ సభలు ఇంతగా విజయవంతమయ్యాయి. తిరుపతిలో 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలని నిర్ణయించిన తీర్మానం కనీస అమలుకు కూడా నోచుకోకపోవడం అప్పటి పాలకుల చిత్తుశుద్ధిని చెబుతుంది. ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తేనే పాలనాభాషగా తెలుగు గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు న్యాయస్థానాల ద్వారా ఏవో లొసుగులతో ఈ యజ్ఞానికి గండి కొట్టే ప్రయత్నం చేయకుండా ఆపాలి. మున్ముందుగా పాలనా భాషను పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా తక్షణం అమలు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులన్నీ తెలుగులో వెలువరిస్తామని చెప్పినప్పటికీ అది నిరంతర ప్రక్రియ కావాలి. అందుకు అవసరమయ్యే భాషా నిఘంటువును అత్యాధునికంగా తయారు చేయించాలి. తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటాను ప్రకటించినప్పటికీ ఈ అంశాన్ని స్పష్టంగా ఏయే రకాలుగా అమలు చేస్తారో ఉత్తర్వులు ఇవ్వాలి. హైదరాబాద్, వరంగల్‌లో ఉన్న ప్రభుత్వ తెలుగు భాషా పండిత శిక్షణా కళాశాలను పునరుద్ధరించాలి. లబ్ధ ప్రతి ష్టులైన ఆచార్యులను అక్కడ నియమించాలి. ఐదు రోజుల సభలకు తండోపతండాలుగా వచ్చిన జనాల కోసం నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగేలా రవీంద్రభారతి లాంటి మరొక విశాల భవనాన్ని (కనీసం 5 వేల మంది ఒకేసారి పాల్గొనేలా) నిర్మించాలి. ఈసారి జరిగిన నిరంతర కవి సమ్మేళన ప్రక్రియ ఒక అపూర్వ ప్రయోగంలా నిలిచిపోతుంది. ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి దాకా కొనసాగిన కవి సమ్మేళనాలు కొత్త ప్రక్రియకు తెరలేపాయి. 42 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపే విధంగా తెలుగు విశ్వ విద్యాలయం, సాహిత్య అకాడమీల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థ పేర్లను తెలుగులోనే రాయాలనే ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి. తమిళనాడు తరహాలో న్యాయస్థానాల తీర్పులన్నీ ఇక నుంచి తెలుగులోనే వెలువడాలి. ప్రతి యేటా తెలుగు భాషా అభివృద్ధి కోసం పురస్కారాలు ప్రోత్సాహకాలు ఇస్తూ తెలుగు మహాసభలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తే తెలుగు వెలుగు నూరు వసంతాల పాటు గుబాళిస్తుంది. – డా‘‘ కె. రామదాస్, అఖిల భారత బీఎడ్, డీఎడ్ కళాశాలల ప్రధానాచార్యుల సంఘ ప్రధాన కార్యదర్శి -
బుద్ధుడికి నివాళులర్పించిన రాష్ట్రపతి
సాక్షి,హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఉదయం 10.20 గంటలకు గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలసి బుద్ధ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ బౌద్ధ గురువుల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం విశేషాలతో పాటు దేశంలోనే నాలుగో అతి పెద్ద జెండా అయిన సంజీవయ్య పార్కులోని జాతీయ పతాకం విశేషాలను హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఇతర అధికారులు వివరించారు. కార్యక్రమంలో సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మేయర్ రామ్మోహన్‌లు ఘనంగా వీడ్కోలు పలికారు. -
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు
-
వైభవంగా ముగిసిన ప్రపంచ మహాసభలు
-
భాషకు బ్రహ్మోత్సవం
తెలుగు ఉనికి నిజంగానే ప్రమాదంలో ఉందా? తేనెలూరే ఈ భాష మరో మూడు తరాల తర్వాత మరి వినిపించదా? సగటు తెలుగువాడిలో ఎక్కడో కలవరం! ఇంటా బయటా అన్ని స్థాయిల్లోనూ మార్పు రావాలి తప్ప ఇలా సభలూ సమావేశాలతో ఏమవుతుంది? ఎక్కడో తెలియని అనుమానం!! కానీ... ఇసుకేస్తే రాలనట్టుగా పోటెత్తిన జనం సాక్షిగా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలు సాగిన ఐదు రోజులూ తల్లి భాషకు అక్షరాలా బ్రహ్మోత్సవమే జరిగింది. ప్రారంభోత్సవానికే వన్నె తెచ్చిన బాణసంచా మిరుమిట్లు కూడా తెలుగు వెలుగుల ముందు చిన్నబోయాయి. ఎల్బీ స్టేడియం మొదలుకుని రవీంద్రభారతి దాకా వేదికలన్నీ తెలుగు సాహితీ రస ప్రవాహ ఝరిలో మునిగి తేలాయి. సాహితీ గోష్టి, కవి సమ్మేళనం, అవధానం... ఇలా అనేకానేక ప్రక్రియలతో ఆహూతులను ఉర్రూతలూగించాయి. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన జనాన్ని నియంత్రించేందుకు ఒక దశలో పోలీసులూ రంగంలోకి దిగాల్సి వచ్చింది!! సభా వేదికల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశువుగా పాడిన పద్యాలు సభలకే వన్నె తెచ్చాయి. ఇదంతా కళ్లారా చూసిన భాషాభిమానుల మనసులు ఉప్పొంగాయి. మన తేనెలూరు తెలుగుకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మహాసభల సాక్షిగా నిరూపితమైంది!! తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సభలు కావటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎల్బీ స్టేడియంతో పాటు మరో ఐదు వేదికల్లో ‘న భూతో’ అన్న రీతిలో సభలను నిర్వహించింది. ప్రతి రోజూ 30 వేల మందికి పైగా సభలకు పోటెత్తినట్టు అంచనా. 1,500 మంది కవులు, 500 మంది రచయితలు పాల్గొన్నారని, 100 సదస్సులు నిర్వహించి 250 కొత్త పుస్తకాలు, భాషా ప్రక్రియలపై 10 సీడీలు, 10 ప్రత్యేక సంచికలు ఆవిష్కరించినట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రకటించారు. భావి సదస్సులకు ఈ సభలు మార్గదర్శక ముద్ర వేశాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడిక సగటు భాషాభిమానులంతా తెలుగుకు మరింతగా జవసత్వాలు కల్పించే దిశగా జనవరిలో ముఖ్యమంత్రి వెలువరించబోయే నిర్ణయాల కోసం ఆశగా, ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
చేయి చేయి కలుపుదాం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతి ఒక్కరం చేయి చేయి కలపాలి’’అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన తెలుగులోనే ప్రసంగించారు. ‘‘తెలుగు మహాసభలు ముగిశాయి. కానీ మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. మాతృభాష పరిరక్షణ కుటుంబం నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లి, తండ్రి, గురువు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాలప్పుడు ఒక తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నా. ఐదు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అమ్మభాషకు తెలంగాణ ప్రణమిల్లింది. 15 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి విచ్చేసిన భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. అవధానాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, గోష్టులు, ఇతర సాహిత్య రూపాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, ఇంత గొప్ప పండుగలో పాలుపంచుకున్న వారికి, భాగస్వాములైన వారికి అభినందనలు’అని ప్రసంగాన్ని ముగించారు. -
ఇక ఏటా సంబురమే
సాక్షి, హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిసెంబర్లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. భాష పండితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలుగు భాషాభివృద్ధికి జనవరిలో సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తామని ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవం మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, ప్రపంచ తెలుగు మహాసభలు ఊహించిన దానికంటే ఘనంగా జరిగాయంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఎట్లా జరుగుతయో, ఎట్లా ఉంటుందో, మహా సభలను నిర్వహించే శక్తిసామర్థ్యా లు తెలంగాణ వాళ్లకు ఉన్నయో, లేవోననే సందేహాల మధ్య చాలా సంతోషంగా, అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పండించినం. ఒకప్పుడు సిటీ కాలేజీ విద్యార్థిగా ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక మూలన కూర్చుని ఇవే ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించిన. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో మహా సభలు సగౌరవంగా జరిగినయి. మన తెలంగాణ తన భాషా వైదుష్యాన్ని, తేజో మయ సాహితీ వైభవాన్ని, పాండితీ ప్రకర్షను, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటింది. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినం దుకు వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా గురుపూజ చేసి సంస్కారవంతంగా సభలను మనం ప్రారంభించుకున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ముగింపు సమావేశానికి వచ్చిన రాష్ట్రపతికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ నిబద్ధత సభల ద్వారా వెల్లడైంది తెలంగాణ భాష అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ సభల ద్వారా వెల్లడైంది. మన భాషను గౌరవించుకోవడమే గాక దేశంలోని అన్యభాషల ఉద్ధండులను, జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను గొప్పగా సన్మానించుకున్నాం. తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలనూ ఈ సభల్లో పదేపదే విన్నాం. నాకు కొంత బాధ కలిగింది. తెలుగు మృత భాష కాకూడదని ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అన్నారు. తెలుగు నేలలోనే, మన గడ్డమీదనే ఇలా మన మాతృభాషను మృత భాష అనో, బతికించుకోవాలనో వినాల్సి రావడం బాధాకరం. ఈ దుస్థితి మన భాషకు పట్టకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుంది. సభలు, సంబరాల తో సరిపెట్టకుండా, ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుంది. భాషా పండితుల సమస్యల విషయంలో ఇమిడి ఉన్న చిన్న న్యాయపరమైన సమస్యను పరిష్కరిస్తాం. భాషా పండితులుగా రిటైరైన వారికి పెన్షన్‌లో కొంత కోత విధిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా రద్దు చేస్తాం. తెలుగు భాష అభివృద్ధికి, తెలుగును అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి కొన్ని ప్రకటనలు ఈ రోజు చేయాలని భావించా. మొన్నటి ఉపన్యాసంలో ఆ మాట చెప్పగానే చాలామంది, చాలా రకాలుగా కొన్ని వందలు, వేల సూచనలు పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధంతరంగా ప్రకటించడం కంటే జనవరి తొలి వారంలో భాషా, సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి కచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటిస్తామని హామీ ఇస్తున్నా. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన మిత్రులు సిధారెడ్డికి, వారితో కలసి కృషి చేసిన బృందానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, డీజీపీకి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశానికి, ప్రభుత్వాధికారులకు హృదయపూర్వక అభినందనలు. కిట్ల పంపిణీలో ఇబ్బందులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం. 42 దేశాల నుంచి, మన దేశంలోని 17 రాష్ట్రాల నుంచి, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మహాసభలకు తరలివచ్చిన ప్రతినిధులు, భాషావేత్తలు, పండితులు, కవులు, గాయకులు, కళాకారులందరికీ వందనం, అభివందనం, శుభాభివందనం. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు మహాసభలను సుసంపన్నం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ నవ్వుపై కేసీఆర్ పద్యం... పద్యంతోనే ముగించిన సీఎం ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆద్యంతం పద్యాలు పాడి అలరించిన సీఎం కేసీఆర్, ముగింపు కార్యక్రమంలోనూ మరో పద్యం పాడి ఆహూతుల మది దోచారు. నవ్వు, నవ్వుల తీరును వివరిస్తూ ఆయన చెప్పిన పద్యానికి సభికుల హర్షధ్వానాలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. ‘‘మహాసభల ఆరంభంలో కొంత బెరుకుగా ఉన్నప్పటికీ సంతోషంతో, ఆనందంతో, సుసంపన్నమైన సందర్భంలో నవ్వులతో ఈ సంరంభాన్ని ముగించుకుంటున్నాం. కనుక నేను కూడా నవ్వుల పద్యంతో ముగిస్తున్నాను’అంటూ ప్రసంగం చివరలో ఆయన ఆలపించిన పద్యం... నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్ పువ్వుల వోలె ప్రేమరసమున్ విరజిమ్ము విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ -
దేశానికే వెలుగు తెలుగు
సాక్షి, హైదరాబాద్: ‘‘సజీవ భాష తెలుగు. ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మహత్తర దేశ పురోగతిలో తెలుగు వారి పాత్ర ఎనలేనిది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు బిడ్డల కృషి మహత్తరమైనది. దేశ సాహిత్యంలోనే గాక మానవ నాగరిక పరిణామ క్రమంలోనూ తెలుగు భాషకు విశిష్ట స్థానముంది. ఈ భాషా ప్రావీణ్యం ఖండాంతరాలు దాటి గొప్పగా వర్ధిల్లుతూ, తనకు ఎల్లలు లేవని నిరూపించింది. తెలుగువారు దేశ సరిహద్దులు దాటుకు వెళ్లి ప్రపంచ పురోగతిలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓగా గొప్పగా రాణిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్లే ఇందుకు నిదర్శనం’’అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఖ్యాతి పొందిన తెలుగు మున్ముందు మరింతగా తేజరిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని సుస్థిరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించిందని శ్లాఘించారు. దేశ విదేశాలకు చెందిన తెలుగు భాషాభిమానుల మధ్య ఐదురోజుల పాటు కన్నులపండువగా సాగిన ఈ మహాసభల ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు ఎంతో ఆనందిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన సభల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లాల్‌బహదూర్ క్రీడామైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి... తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను తన ప్రసంగంలో ఆద్యంతం స్మరించుకున్నారు. తెలుగులో ప్రసంగం ప్రారంభం... రాష్ట్రపతి తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులారా నమస్కారం, దేశభాషలందు తెలుగు లెస్స’అని ఆయన అనగానే ప్రాంగణంలో కిక్కిరిసిన భాషాభిమానులు పెద్దపెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘‘42 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు సభలకు తరలి వచ్చారని తెలిసి అబ్బురపడ్డాను. ఈ ఐదు రోజుల పండుగలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. చెప్పారు. తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించటం సంతోషాన్నిచ్చింది. ఐదు రోజుల పండుగతో మహత్తర తెలుగు భాషకు జనం ఘనంగా నీరాజనం పలికారు’’అంటూ అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాతృభాష అయిన తెలుగు 2008లో ప్రాచీన హోదా కూడా పొందిందని గుర్తు చేశారు. తెలుగువారు దేశానికెన్నో ఇచ్చారు తెలుగులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక సాహితీ ప్రతిభ ఉండటం అభినందనీయమంటూ రాష్ట్రపతి ప్రస్తుతించారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తిగానే గాక తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి ఆ భాషకు విశిష్టమైన గుర్తింపు తెచ్చారన్నారు. ‘‘తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతులుగా దేశానికి గొప్ప సేవ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు వాడైనందుకు ఈ నేల ధన్యమైంది. నన్నయ వెయ్యేళ్ల క్రితమే తెలుగు వ్యాకరణ నియమాలు రూపొందించారు. మహా భారతాన్ని తెలుగీకరించారు. శతాబ్దంలో గురుజాడ అప్పారావు సంఘ సంస్కర్తగా దేశానికే గొప్ప సేవ చేశారు. రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇక సామాన్య ప్రజలో నిలదీసే తత్వాన్ని శ్రీశ్రీ తన అక్షరాలతో నూరిపోశారు. వట్టికోట అళ్వార్ స్వామి, దాశరథి వంటి దిగ్ధంతులెందరో సాహిత్యంతో పాటు సమాజానికీ సేవ చేశారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి త్యాగయ్య తెలుగు కృతులే కీలకం. ఇక భక్తి పారవశ్యానికి అన్నమయ్య కీర్తనలు ఊతం. అడవి బిడ్డల హక్కుల కోసం ఉద్యమించిన కుమ్రం భీం, అంటరానితనంపై పోరాడిన భాగ్యరెడ్డి వర్మ , జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, ఆంగ్లేయులను వణించిన అల్లూరి, సామాజిక, రాజకీయ వ్యవస్థపై సామూహిక ఉద్యమానికి తెరతీసిన స్వామి రామానంద తీర్థ.. ఇలా ఒకరేమిటి, తెలుగువారు ఈ దేశానికి ఎన్నో ఇచ్చారు’’అంటూ ప్రశంసించారు. నేల నలుచెరగులా తెలుగువారు... తెలుగు మాట్లాడేవారు దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేయాసియా దాకా విస్తరించి అద్భుతాలు సృష్టిస్తున్నారని రాష్ట్రపతి కీర్తించారు. ‘‘ఖండాంతరాల్లో తెలుగు వారు గొప్ప ప్రతిభను చూపుతూ దేశానికి కీర్తి తెస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాల్లోకీ ఎన్నికవుతున్నారు. ఇంజినీర్లుగా, వైద్యులుగా, సాంకేతిక నిపుణులుగా ప్రశంసనీయ స్థానంలో ఉన్నారు. 1920, 1930ల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసిన ప్రసిద్ధ జీవరసాయన శాస్త్రవేత్త అయిన ఎల్లాప్రగడ సుబ్బారావూ ఇదే కోవలోకి వస్తారు. పిల్లలు తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలతో తెలుగులో మాట్లాడేందుకు మనబడి లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయి’’అన్నారు. ఉత్తర, దక్షిణాలకు తెలుగే వారధి ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అనుసంధానం కల్పిస్తూ వంతెనగా తెలుగు నిలుస్తోందని రాష్ట్రపతి అభినందించారు. ఎన్నో పరభాషా పదాలను ఇముడ్చుకుని సుసంపన్నమైంది తెలుగు. దేశంలోని ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు చిహ్నంగా, వాటి మధ్య వారధిగా హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడిది అంతర్జాతీయ నగరంగా కొత్త రూపు సంతరించుకుంటోంది’’అంటూ అభినందించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక పరిశ్రమ, ఫార్మా తదితరాల్లో దేశానికి హైదరాబాద్ ఎంతో సేవ చేసిందన్నారు. విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, సినిమా, వ్యాపార, వాణిజ్య, క్రీడా రంగాల్లో తెలుగు చక్కని గుర్తింపు పొందింది’’అన్నారు. బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి... హైదరాబాద్‌ను ప్రస్తుతిస్తూనే తనదైన చలోక్తితో సభికులను ఆకట్టుకున్నారు రాష్ట్రప్రతి. ‘‘హైదరాబాద్ అంటే... బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి గుర్తొస్తాయి. ఇక్కడి వంటలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. హైదరాబాద్ వంటకాలకు ఢిల్లీలో ఎంతో పేరుంది. ముఖ్యంగా ఇక్కడి పచ్చళ్లు అక్కడి వారికెంతో ఇష్టం. క్రీడారంగంలో ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారులను హైదరాబాద్ అందిస్తోంది. సినీ రంగానికి బాహుబలి వంటి గొప్ప సినిమాను అందించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీతో సంయుక్తంగా టాప్‌లో తెలంగాణ నిలిచింది. తెలంగాణ వంటి కొత్త రాష్ట్రాన్ని వేగవంతంగా ప్రగతి పథంలో నిలిపేందుకు వ్యాపార, పారిశ్రామిక సామర్ధ్యమున్న ప్రాంతంగా వస్తున్న ఈ పేరు దోహదపడుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి నా అభినందనలు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు అద్భుతంగా విజయవంతమైంది. రానున్న నూతన ఆంగ్ల సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు గొప్ప ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నా. తదుపరి తెలుగు మహాసభల కోసం ఎదురుచూస్తుంటా’’నన్నారు. రాయప్రోలు రాసిన ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము’పంక్తులతో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. -
భాష బతుకమ్మయి..
ప్రవాస తెలుగువారి సభలో ఎంపీ కవిత తెలుగు భాష, సాహిత్యంపై పట్టుతో రవీంద్రభారతిలో ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. అద్భుతమైన పదబంధాలు, ఉదాహరణలు, కవితలతో చేసిన ఆమె ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు రవీంద్రభారతిలో ‘ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు’ అంశంపై విదేశీ తెలుగువారితో నిర్వహించిన గోష్టిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ్రMీ స్తుపూర్వం మూడో శకం నాటి కోటి లింగాల శాసనంలోనే తెలుగుకు గొప్ప ఆధారాలున్నాయని చెప్పారు. ‘గోబద’, ‘నారన’, ‘సమవాస’ వంటి తెలుగు పదాల ఆధారంగానే మన భాషకు ప్రాచీన హోదా దక్కిందన్నారు. తెలుగుకు తొలి తొవ్వలు పరిచింది తెలంగాణ కవులే నని చెప్పారు. కరీంనగర్లో లభించిన కురిక్యాల శాసనంలో మూడు కందపద్యాలున్నాయని పేర్కొన్నారు. పాల్కురికి సోమనా«థుడు తొలి తెలుగు ఆది కవిగా ఆమె అభివర్ణించారు. ‘తెలుగు’ అనే పదాన్ని ఆయనే మొదటిసారి తన కావ్యరచనలో వాడినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోందన్నారు. బసవపురాణం స్వతంత్ర తెలుగు రచన అనీ, అది సంస్కృతం, ఇతర ఏ భాషలకు అనువాదం కాదని పేర్కొన్నారు. నన్నయ కంటే వందేండ్ల ముందే తెలుగులో కావ్య రచన జరిగిందన్నారు. పండితారాధ్యచరితము సోమన రాసిన మొదటి విజ్ఞాన సర్వస్వగ్రం«థమని పేర్కొన్నారు. కాకతీయుల నుంచి పద్మనాయకరాజులు, కుతుబ్‌షాహీ వరకు తెలుగు భాషా, సాహిత్యం వైభవోపేతమైన దశను పొందిందన్నారు. అసఫ్‌జాహీల పాలనలోనే ఆంధ్రుల చరిత్రను సురవరం ప్రతాప్‌రెడ్డి రాసినట్లు గుర్తు చేశారు. ఆధునిక సాహిత్యంలోనూ వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి కవులు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సినారె విరచిత ‘విశ్వంభర’ నుంచి కొన్ని కవితలను ఆమె ఉదహరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ తెలుగు సాహిత్య వైభవాన్ని వివరించారు. ‘42 దేశాల నుంచి 450 మందికిపైగా విదేశాల్లో స్థిరపడిన మనవాళ్లు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆమె అన్నారు. మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతం ....: ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి అభివర్ణించారు. వేదికలు జనంతో కిటకిటలాడుతున్నాయని, భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. తెలుగు భాషా, సాహిత్యాల విస్తరణకు ఈ సభలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తాను సినిమా షూటింగ్‌లకు వెళ్లినా మనస్సు మాత్రం మహాసభలపైనే ఉందని, షూటింగులు ముగించుకొనే సభలకు హాజరవుతున్నానని చెప్పారు. నారాయణస్వామి వెంకటయోగి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డాక్టర్ వంగూరి చిట్టెన్రాజు, ఆచార్య టి.గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా, బ్రిటన్, మారిషస్, మలేసియా, ఫిజీ, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన పలువురు పెద్దలను ఘనంగా సత్కరించారు. – పగిడిపాల ఆంజనేయులు తాతయ్య ఉంటే ఎంత సంతోషించేవారో! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభల సమయంలో తమ తాతయ్య ఉంటే ఎంతో సంతోషించేవారని జ్ఞానపీuЇ డాక్టర్ సి.నారాయణరెడ్డి మనవరాలు వరేణ్య అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఆమె మంగళవారం ‘సాక్షి’తో తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. పాట రాసి మాతో కూడా పాడించేవారు: 1974లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తాతగారు కామెంట్రీ చేసినట్లు చెప్పేవారు. తెలుగుపై ప్రేమతో ‘ కడలి అంచులు దాటి కదిలింది తెలుగు’ అనే పాట రాసి, తాను ఆనందంగా పాడుతూ, తమతో కూడా పాడించేవారు. ఆయన హృదయ కమలంలో తెలుగుకు అగ్రతాంబులం వేసేవారు. ప్రభుత్వం ప్రతి డిసెంబర్లో రెండ్రోజులపాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమయంలో సినారె మన మధ్య ఉండి ఉంటే ఆయన ఆనందానికి అవధులు ఉండేవి కాదు. తెలంగాణ ధన్యభూమి అని తాతయ్య ఎప్పుడూ చెబుతుండేవారు. తెలంగాణ యాసలో తీయటి మాధుర్యం ఉందనేవారు. కవులు, కళాకారులు, భాషా పండితులకు ఎక్కడ గౌరవం ఉంటుందో.. ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేవారు. తెలుగు విశ్వవ్యాప్తమవుతుంది: తెలంగాణ నుడికారాలు అద్భుతమైన జీవభాషకు ప్రతీకలు. తెలంగాణలో ఉన్న ఎంతోమంది తేజోమూర్తులను ఈ సభలు నేటి తరానికి పరిచయం చేశాయి. తేజోమూర్తుల పేర్లలో సినారె పేరును చెబుతూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం విని మా కుటుంబ సభ్యులందరం ముగ్ధులమయ్యాం. భవిష్యత్తులో తెలుగు విశ్వవ్యాప్తం అవుతుంది. మా కుటుంబ సభ్యుల తరఫున, యావత్ తెలుగు ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు. - సినారె మనవరాలు వరేణ్య ఇలా చేద్దాం... పండుగొస్తుందంటే పనులన్నీ పక్కన పడేసి, పండుగ సంబురాల్లో మునిగి తేలడం ఆనవాయితీ! పండుగ ముగిశాక తిరిగి పనుల బాట పట్టడం తెలుగునాట సంప్రదాయం. పండుగ ఇచ్చిన కొత్త హుషారు, స్ఫూర్తితో... ఎప్పుడూ చేసే పనే అయినా, పనిచేసే తీరులో ఉత్సాహం రెట్టింపుగా ఉంటుంది. అయిదొద్దులు జోరుగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగియడంతో... ఇక పనిబాట పట్టాల్సిన సమయం వచ్చింది. తెలుగు భాష వైభవం, ఔన్నత్యాన్ని చాటేలా సభల్ని పక్కా ప్రణాళికతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణను వాయిదా వేసింది. చివరి రోజున కీలక ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావే స్వయంగా చెప్పడంతో భాషాభిమానులు నిరీక్షించారు. కొంత సమయం తీసుకుని, జనవరిలో ఓ సాహితీ సదస్సు నిర్వహణ సందర్భంగా విధాన నిర్ణయాలు ప్రకటిస్తామని ముగింపు వేడుక వేదిక నుంచి ఆయనే వెల్లడించారు. బహుశా! ప్రస్తుత సభల్లో వెల్లడెన నిపుణుల అభిప్రాయాల్ని క్రోడీకరించి, వాటిని పొందుపరుస్తూ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారేమో! అది మరీ మంచిది. ఏమైతేనేం, తెలుగును జీవద్భాషగా వృద్ధి చేస్తామని, అవరోధంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఐదు రోజులపాటు ఆరు వేదికల నుంచి ముప్పైకి పైగా జరిగిన సభలు, భేటీల్లో తెలుగు భాష విభిన్న కోణాలూ మరోమారు చర్చకొచ్చాయి. సభలకు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రజాస్పందన లభించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో ప్రజలకు తల్లి భాషపైన అపారమైన ప్రేమాభిమానాలున్నాయని సందేహాలకతీతంగా రుజువైంది. ఆచరణాత్మక చర్యల ద్వారా తెలుగును అంతరించిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని అది నొక్కి చెప్పింది. సభల్లో వ్యక్తమైన దాన్ని బట్టి... ►ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే విద్యాబోధన జరగాలి. ►12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి అంశంగా ఉండాలి. ►తెలుగులో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించాలి. ఇతర ప్రోత్సాహకాలివ్వాలి. ►మాండలికాలు, ప్రాంతీయాలపై ఓ పరిశోధన జరిపి ప్రామాణిక భాషను రూపొందించాలి. ► తెలుగులో సమగ్ర నిఘంటువు నిర్మించాలి. ►పారిభాషిక పదకోశాలు తయారవాలి. ► శాస్త్ర–సాంకేతిక కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాల సృష్టి జరగాలి. ►ప్రసారమాధ్యమాలు వాడుక భాషనే ఉపయోగించాలి. ► పరిపాలన, న్యాయపాలనలో విధిగా తెలుగునే వాడాలి. ►తప్పనిసరిగా తమ పిల్లలు తెలుగునేర్చుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ►నిర్బంధం, అనివార్యం కాని ప్రతీచోట తెలుగులోనే మాట్లాడాలి. ► ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పెద్ద ఎత్తున పునః ప్రచురించి చవకగా అందుబాటులోకి తేవాలి. ఇటువంటి అన్ని కార్యాల ద్వారా అందరం తెలుగును కాపాడుకోవాలి. – దిలీప్‌రెడ్డి -
విశ్వభాషలందు తెలుగు లెస్స
‘‘మన తెలంగాణ ఓ రాష్ట్రంగా ఏర్పడటం ఆనందమే, కానీ సముద్రం లేని లోటు కలిచివేస్తోంది. తెలంగాణ తల్లీ.. మేం సముద్రాన్ని ఈ గడ్డ మీద చూడలేమా..?’ ఓ సగటు తెలంగాణ వ్యక్తి ఆవేదన. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతిలో తెలంగాణ తల్లి సరస్వతీ దేవి రుపంలో ప్రత్యక్షమైంది. ఈ నేల ఘన చరిత్ర తెలియక ఇలా చింతించటం తగదు. ఓసారి వాస్తవాన్ని గుర్తించు. ప్రపంచ సాహిత్యానికి అమూల్య సేవలందిస్తున్న నీ తేనెలూరు తెలుగు భాష ఔన్నత్యం గ్రహించు. మరే భాషలో లేని సాహితీ ప్రక్రియలకు నెలవైన ఆ మధురభాషకు నీ గడ్డే నెలవు. పద్యం, గద్యం, ప్రబంధం, వచనం, అవధానం, కావ్యం, గ్రంథం... ఇలా తెలుగు తొలి ప్రక్రియ పురుడుపోసుకుంది తెలంగాణ గడ్డమీదే. ఇంత గొప్ప సాహితీసంద్రం ఉండగా సముద్రం వెలితి కనిపిస్తోందా’ అనేసరికి ఆ భాషాభిమానిలో అవధులు లేని ఆనందం...’ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ గా«థ తెలంగాణ తెలుగు వైభవాన్ని చాటింది. ‘మీది అసలైన తెలుగు కాదు, అంతా సంక్రమణే...’ అన్న ఈసడింపులు చెవుల్లో మార్మోగుతుండగా... అసలు తెలుగు, అచ్చమైన తెలుగు పురుడు పోసుకున్నది ఈ మట్టిలోనే అన్న నిజం ఆధారసహితంగా అక్షరమే చాటింపువేసి చూపింది. మధ్యలో నిజాం నిరంకుశపాలనలో తెలుగు కాస్త మసకబారిందంతే. దానికే మాకు తెలుగు తెలియదంటారా... ఇప్పుడు చూడండి, అసలైన తెలుగు వైభవం పరిఢవిల్లిందిక్కడే అనటానికి సాక్ష్యాలివిగో... సగటు తెలంగాణ తెలుగు భాషాభిమాని ఆనందభరిత తాండవం. ఇంత అద్భుత చరిత్ర ఉన్న ఈ భాషనా అంతరించే తావులో ఉంది... అదెలా సాధ్యం. ఇప్పటి వరకు మేం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పాడుకున్నాం, నినాదంగా వాడుకున్నాం. కానీ... ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం ఈ ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ లెక్క.... ఇక ‘విశ్వభాషలందు తెలుగు లెస్స’ ఇది భాగ్యనగర వీధిలో ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన తెలుగు పండగ తెచ్చిన కొత్త ఉత్సాహం. ఐదు వేదికలపై అద్భుత సాహిత్య ఝరి జాలువారింది. ఎటు చూసినా వర్ణమాల అక్షరాలు తీరొక్క రకంగా నర్తించాయి. సాహితీ సభలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, బాల, మహిళా ప్రత్యేక భాషా గోష్టులు, సాంస్కృతిక విన్యాసాలు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది నోట పలికేది మా భాషనే, ఇప్పటికే ఖండాంతరాలు దాటి తన ప్రాభవానికి ఎల్లలే లేవని నిరూపించిన తెలుగు భాష ఇక విశ్వవిపణిలో కొత్త వెల్లువై ఎగిసి పడుతుందని ఊరుఊరంతా నినదించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యద్భుతంగా జరిగాయి. ఐదు రోజులపాటు గడపగడపా పండగే తరహాలో సాహితీ వేడుక కొనసాగింది. కేవలం ఉత్సవంలా నిర్వహించుకోవటానికే పరిమితం కాకుండా, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ మధుర భాష మరికొన్ని తరాలపాటు తెలుగు వారింట నాట్యం చేసే దిశగా అడుగులు పడ్డాయి. సభల నిర్వహణకు కొద్ది రోజుల ముందే... ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పుడు ప్రతి ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. వందల సంఖ్యలో సూచనలు అందినందున వాటిపై భాషావేత్తలతో చర్చించి జనవరిలో విధాన నిర్ణయాలు ప్రకటì స్తాన ని వెల్లడించారు. వెరసి భవిష్యత్తులో ఈ భాషకు తిరుగుండదనే శుభ సంకేతాలు వెలువడటంతో భాషాభిమానులంతా ఉత్సాహంతో సభలకు ముగింపు పలికారు. – గౌరీభట్ల నరసింహమూర్తి ►16 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. 1500 మంది కవులు, 500 మంది రచయితలు ఐదురోజుల పండగలో భాగస్వాములయ్యారు. ►100 సదస్సులు జరిగాయి. 20 సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. 250 కొత్త పుస్తకాలు, భాషలోని వివిధ అంశాలకు సంబంధించి 10 సీడీలు , ►10 సంచికలు ఆవిష్కరించారు. అక్షరాలు అక్కరకొచ్చాయ్! 1975 తొలి ప్రపంచ తెలుగు మహాసభలు.. ఎల్బీ స్టేడియం వేదిక.. నిర్మల్ సమీపంలోని దిలావర్పూర్కు చెందిన ఐదో తరగతి విద్యార్థి వీరాభిమన్యు ఏకపాత్రాభినయానికి సిద్ధమయ్యాడు. పద్యాలు రాగయుక్తంగా కంఠస్తం పట్టాడు. కానీ ఆ కార్యక్రమం రద్దు కావటంతో నిరుత్సాహానికి గురయ్యాడు. 2017.. తెలంగాణలో తొలి ప్రపంచ మహాసభలు.. అదే ఎల్బీ స్టేడియం.. పోతన వేదిక.. పాల్కురికి ఖ్యాతి, పోతన భాగవతంలో తేట తెలుగు ప్రయోగం, సుద్దాల హన్మంతు పల్లె సాహిత్యం, గోరటి వెంకన్న దుమ్మురేపే పాటలు.. ఒకటేమిటి భాషను తన నాలికపై ఆడిస్తున్న ఆయన తీరుకు ప్రేక్షకులు, అతిథులు మంత్రముగ్ధులయ్యారు! అప్పుడు ఏకపాత్రాభినయం చేయలేక ఢీలా పడ్డ ఆ బాలుడే ఇప్పుడు అదే వేదికపై తన భాషా ప్రాభవాన్ని సగర్వంగా ఆవిష్కరించాడు. ఆయనే మడిపల్లి దక్షిణామూర్తి! ఎక్కడ సాహితీ గోష్టి జరిగినా, ప్రభుత్వం నిర్వహించే సభలైనా, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకలైనా ఆయన గొంతు వినిపించాల్సిందే. ఆ సభలను తనదైన వ్యాఖ్యానంతో రక్తి కట్టించటం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఆయన ఆకాశవాణిలో సీనియర్ వ్యాఖ్యాతగా ఉన్నారు. భాషపై అంత పట్టు ఎలా సాధించారో ఆయన మాటల్లోనే... సాహితీ అభిలాషే గుర్తింపు తెచ్చింది: చిన్నప్పట్నుంచి తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకుని కొంత అవగాహన తెచ్చుకున్నా. మూడో తరగతి నుంచే ఏకపాత్రాభినయం, పుస్తక పఠనం.. ఇలా భాషపై మమకారం పెంచుకున్నా. సహజ కవి అయిన మా తండ్రిగారు, కవి అయిన మా అన్నయ్య, మేనమామల ప్రభావంతో భాషా సాంగత్యం అబ్బింది. సైన్స్ విద్యార్థిగా చదువు పూర్తి చేసినా తెలుగు భాషపై అభిమానాన్ని వదులుకోలేదు. వీలైనన్ని పుస్తకాలు, పద్యాలు చదవటంతో తెలుగులో అనర్గళంగా మాట్లాడటం, తప్పుల్లేకుండా చెప్పగలగటం, ఆశువుగా వివిధ అంశాలను వివరించటం అబ్బింది. అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆకాశవాణి వైపు మళ్లాను. ఓసారి అమెరికాలో ఆటా సభల్లో ఉన్నా. ఇంతలో సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తున్నందున వ్యాఖ్యాతగా మీరే రావాలి’ అని ఆ ఫోన్ సారాంశం. దీంతో అమెరికా నుంచి మధ్యలోనే వచ్చేశా. ఇప్పుడు తెలుగు మహాసభల్లో కూడా స్వయంగా సీఎం నా పేరు సూచించారని అధికారులు చెప్పటం సంతోషమనిపించింది. మడిపల్లి దక్షిణామూర్తి ప్రపంచ తెలుగు మహాసభల తళుకులు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఎల్బీస్టేడియంలో కన్నుల పండువగా ముగిశాయి. సాయంత్రం 6.45 గంటలకు సభ ప్రారంభమైనా సకాలంలోనే వేడుకలను ముగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అయితే ఈ మహాసభల ముగింపు సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేయకపోవడం సాహితీప్రియులను ఒకింత అసంతృప్తికి గురి చేసింది. ఇక నుంచి ఏటా ప్రతి డిసెంబర్లో రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం కొంత మేరకు ఊరట కలిగించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగంలో అక్కడక్కడా దొర్లిన తెలుగు పదాలు, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించిన మాటలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉత్సాహంగా సాగింది. నవ్వులపై వినిపించిన పద్యం హాయిగా నవ్వించింది. ఇదీ ముగింపు సభ తీరు ►సాయంత్రం వరకే ఎల్బీస్టేడియం జనంతో నిండిపోయింది. అన్ని వైపులా గ్యాలరీలు, ప్రధాన ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి. ►సాయంత్రం 5.11 గంటల నుంచి 5.28 వరకు దీపికారెడ్డి బృందం ‘తెలంగాణ వైభవం’ నృత్యప్రదర్శన సాగింది. జనం మంత్రముగ్ధులయ్యారు. ►అనంతరం దీపికారెడ్డితో పాటు, ప్రధాన వేదిక, తోరణాలు రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు అంబాజీని, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో 1700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన నాగరాజును, వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తిని సత్కరించారు. ►సాయంత్రం 5.45 గంటల నుంచి లఘుచిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. ►సాయంత్రం 6.11 గంటలకు మంగళవాయిద్యాలు, వేదమంత్రో చ్ఛారణలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సాదరంగా వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఆకట్టుకున్న కేసీఆర్ పద్యం... ►సీఎం కేసీఆర్ నవ్వుపై వినిపించిన పద్యం సభలో నవ్వుల పువ్వులు పూయించింది. ►‘నవ్వవు జంతువుల్... నరుడు నవ్వున్.. నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు... కొన్ని నవ్వులెటూ తేలవు...కొన్ని విషపూరితముల్..’ అంటూ పద్యంతో ప్రసంగం ముగించారు. ► రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ’సోదర సోదరీమణులారా..’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ మహామహులను ఆయన గుర్తుచేసినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. కేరింతలు వేశారు. ►హైదరాబాద్ పేరు వినగానే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి సినిమా గుర్తుకు వస్తాయని రాష్ట్రపతి చెప్పగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. తేట తెలుగుల వెలుగు అమ్మభాషను ఎలుగెత్తి చాటిన బృహత్ కవి సమ్మేళనం నాదో తీరని కోరిక.. తీరిక లేని లోకంలో నాదో తీరని కోరిక.. అంతు తెలియని అన్వేషణలో నాదో తీరని కోరికనాతోనే నువ్వు ఉండాలని.. నేనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలని... ప్రపంచాన్ని శాసించే నువ్వే డబ్బువై, డాలర్వై నాతోనే ఉండాలి నాదో తీరని కోరిక... .. డబ్బుపై మనిషికున్న అంతులేని ఆశ.. డాలర్ కోసం జనం వెంపర్లాడుతున్న తీరుకు అక్షర రూపం ఇస్తూ సంతోష్‌రెడ్డి అనే యువ కవి రాసిన ఈ కవిత సభికులను ఆకర్షించింది. నాలుగు రోజుల తెలుగు భాష పండుగలో వచన కవులు జనం ఇష్టాలను, కష్టాలను, కన్నీళ్లను, అమ్మ భాషలోని మాధుర్యాన్ని కవితలుగా మలిచి వినిపించారు. మంగళవారం ఐదోరోజు ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళన సమావేశాలు ముగిశాయి. ఐదు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో 31 సదస్సులు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 700 మంది వచన కవితా పండితులు తమ రచనలు వినిపించారు. వానమామలై వేదికపై పప్పుల రాజిరెడ్డి అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సాయంత్రం బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన చివరి సమావేశంతో ముగిసింది. ‘హృదయంతో చూడగలిన రాజు తప్పిపోయిన సూర్యున్ని నట్ట నడివాకిట్లో నిలబెట్టిండు... గంగానదిలో ప్రవహిస్తున్న ఆర్వత్వాన్ని హిందూ నదిలోకి మలిపిండు... పాత పునాదులపై కొత్త దేశాన్ని నిర్మించిండు.. ఒక్క సూర్యున్ని అడ్డగిస్తే వేల సూర్యుళ్లు పుడతారని నిరూపించిండు’ అంటూ అశోక చక్రవర్తి గొప్పతనాన్ని వివరించారో కవి. ‘తరతరాల సిరితత్వ వేద వేదిది నా తెలుగు భాష... స్వరంబు సురిచిరంబును సుందరబింబంబిది నా తెలుగు భాష... గడియార గమనాల గమకంమిది కనమిది కందాల అందాల సంపదల... సదస్సులకు ఉషస్సిది నా తెలుగు భాష’ అంటూ అమ్మభాషలోని పద విన్యాస మాధుర్య రుచిని సభికులకు చూపించాడు మరో కవి! ‘అమ్మ భాష కమ్మనైన భాష .. తెలుగు భాషను బతికిద్దాం’ అని వానమామలై వేదిక సాక్షిగా వందలాది మంది కవులు ప్రతినపూనారు. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు నక్షత్రాల్లో ఒదిగిన విందు భోజనం ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధాన కార్యక్రమంలో చివరిరోజున అవధాని ముందుగా దత్తపదులను ధారణ చేశారు. పెరుంబుదూరు శ్రీరంగాచార్యులు సంధానకర్తగానూ, కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షులుగానూ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరయ్యారు. సరస్వతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. దత్తపదులలో అధిక భాగం తెలుగు వైభవాన్ని కీర్తించేవి ఉన్నాయి. షడ్రసోపేతమైన విందు భోజనాన్ని హస్త చిత్త స్వాతి మూల పదాలు ఒదిగిపోయేలా అందంగా పూరించారిలా. సుమధుర హస్త భోజనము సూరి వరేణ్యుల పద్యమట్లుగన్/ సురసుమ చిత్తవంతులకు శుభ్ర రుచులు పచరించుచుండగా/ అమరిన స్వాతి ముత్యమనునట్టి మన్సున నిచ్చు విందులే/ అమృతము కన్న మిన్న యగునాత్మకు మూలకారణ శక్తికిన్. అన్నము పప్పు కూర చారు పదాలను ఉపయోగించి రామాయణం వివరించమని అడిగినప్పుడు– అన్న ముందర నేనెంత చిన్నవాడ/ పప్పురుద్దగా రాముడు వలపునడిగె/ చుప్పనాతిని నిను చూసి ఒప్పుకోడ/ చారు రూపంబు నీదయ్యె సరసుడెవడే అంటూ అన్నము అనే పదాన్ని విడదీసి అన్న ముందర అని చెప్పడంతో ప్రేక్షకుల చప్పట్లతో సభ మార్మోగింది. మరో పృచ్ఛకుడు జింక లంక ఢంక బింక పదాలతో భారతార్థం వచ్చేలా పూరించమన్నారు. అందుకు అవధాని, రామాయణంలోని ‘లంకను, జింకను’ భారతంలోకి తీసుకురావాలి అని చమత్కరించి, సుయోధనుడి గురించి వివరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీ శంకర్ నలుపు తెలుపు మలుపు గెలుపు పదాలు ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని భారత కథతో అనుసంధానించమని అడిగారు. నలుపు మనసుల కౌరవుల్ బలము గలిగి/ యుద్ధ వీరత తెలుపుట యోగ్యమగునె/ తెలుపు మనసుల పాండవుల్ ధీరులైరి/ గెలుపు ధర్మనికయ్యె ఓ మలుపు తిరిగె అని ఆఖరి దత్తపదిని పూరించారు అవధాని. ఇక్కడ గెలుపు ధర్మనికయ్యె అనే మాట దత్తపదులు విజయవంతంగా పూరించిన అవధానికి కూడా వర్తిస్తుందని కసిరెడ్డి వెంకటరెడ్డి హాస్యపు జల్లులు కురిపించారు. – డా. వైజయంతి గెలుపు ధర్మానికై... మలుపు తిరిగె! ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం, మరిగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై నిరాçఘాటంగా సాగిన శతావధానం మంగళవారం ముగిసింది. వందమంది పృచ్ఛకులు అడిగిన దత్తపది, సమస్య, వర్ణం, ఆశువులకు సరైన రీతిలో శతావధాని డాక్టర్ జీఎం రామశర్మ సమాధానం ఇచ్చి అందర్నీ పులకింపజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని భారతంలోని యుద్ధపర్వంగా పొలుస్తూ ... నలుపు, తెలుపు, గెలుపు, మలుపు పదాలతో వర్ణించమని సభలో పాల్గొన్న బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కోరారు. దత్తపది శైలిలో శతావధానికి డాక్టర్ జీఎం రామశర్మ స్పందిస్తూ.. ‘నలుపు మనసుల కౌరవుల్ బలము కల్గి ‘‘ యుద్ధ వీరట తెలుపునట యోగ్యమగునే, తెలుపు మనస్సుల పాండవుల్ ధీరులైరి ‘‘ గెలుపు ధర్మానికై ఓ మలుపు తిరిగె’’. అంటూ పద్యం చెప్పి సభలో నవ్వులు పూయించారు. కౌరవులు అజ్ఞానంతో వ్యవహరించారని రామశర్మ అన్నారు. అక్కడ గెలుపు ధర్మానికై ములుపు తిరిగినట్లుగా .. ఇక్కడ కేసీఆర్ సారథ్యంలో సకలజనులతో గెలుపు ధర్మం వైపు మలుపు తిరిగిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పృచ్ఛకులు డాక్టర్ కె.బాలస్వామి తెలంగాణ సాహిత్య వైభవం వర్ణించమని రామశర్మని కోరారు. ‘‘ పద్యముల్ గేయములున్ ‘‘ సద్యోవచనైక గేయ సాహిత్యంబున్,విద్యాగంథమ యంబై ‘‘ విద్యా నైవేద్యమయ్యె విస్ఫూర్తియయెన్’’అని కందపద్యం రూపంలో రామశర్మ సమాధానం చెప్పారు. అనంతరం శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మను పృచ్ఛకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందినీ సిధారెడ్డి, డాక్టర్ పెరుంబుదూరు శ్రీరంగాచార్య, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు. – కోన సుధాకర్ రెడ్డి తెలంగాణ పదపదాన పదనిసలు తెలంగాణ పదపదాన పదనిసలు దాగి ఉన్నాయని, శ్రామిక గేయాల్లో భాషా సౌందర్యం ఒదిగిపోయిందని వక్తలు కొనియాడారు. బతుకమ్మ, పల్లెపదం, సంస్కృతి అద్భుతమన్నారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం బిరుదరాజు రామరాజు ప్రాంగణంలో ఆచార్య లక్ష్మణ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య ఆర్.వి.ఎస్.సుందరం, ప్రముఖ పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పాల్గొన్నారు. ఐదు రోజులపాటు కావ్య, కథా, నవలా, కవితా లోకాలను తరచిచూసిన సామలసదాశివ వేదిక తెలుగు భాషపై విçస్తృతంగా చర్చించింది. ఈ సభలు తెలంగాణకు నూతనోత్తేజాన్ని ఇచ్చాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ తెలుగు భాషా వైశిష్ట్యంపై డాక్టర్.కె.ముత్యం మాట్లాడుతూ.. పల్లె ప్రజలు ఉపయోగించే వ్యావహారిక భాషలో అంతులేని సంగీత సౌందర్యం ఉందన్నారు. లయబద్ధమైన తెలంగాణ పదాలు అర్థవంతంగా ముగుస్తాయనీ, ఆత్మీయ సంబంధాల గుండెతడిని వ్యక్తీకరిస్తాయని తెలిపారు. సామల రమేశ్ బాబు భాష–వర్తమాన స్థితిపై మాట్లాడుతూ.. తెలుగు అభివృద్ధికి చంద్రబాబు దోహదపడతారన్న నమ్మకం పోయిందనీ, కేసీఆర్‌పైనే విశ్వాసం ఉంచామని అన్నారు. ఇంటర్ వరకు తెలుగుని తప్పనిసరి భాషగా బోధించే నిర్ణయాన్ని కొనసాగిస్తూనే, మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండేలా చూడాలని సూచించారు. తెలుగుకు ప్రామాణిక గ్రంథం, భాషాభివృద్ధికి కొత్త నిఘంటువులు తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శ్రామిక గేయాలు మొదలు విప్లవ, జానపద గేయాలన్నింటా శ్రామికజన ఘోష ఉందని మాష్టార్జీ చెప్పారు. ‘నేనేమి సేతు, నా సేనెట్ల గాతు’, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగరన్న, నేను గంజిలో మెతుకెరుగ రన్న’, ‘పాలబుగ్గలా జీతగాడా’ వంటి పాటలన్నీ అలాంటి కోవలోనివేనన్నారు. జానపద సాహిత్యాన్ని పరిపూర్ణం చేసింది పాటేనని బండారు సుజాత శేఖర్ చెప్పారు. – అత్తలూరి అరుణ చరిత్రను కొత్తగా రాసుకుందాం! ‘ఒక సమాజం అర్థం కావాలంటే అక్కడి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సాహిత్యం జన జీవితం నుంచి వచ్చి ఉండాలి. అలాకాకుండా రజాకార్ల ఉద్యమం, సాయుధ పోరాటం ఆధారంగా మాత్రమే చరిత్రను అల్లుకుంటే కచ్చితమైన స్వరూపం రాదు. తెలంగాణలో చరిత్రను తిరిగి రాసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆయన అధ్యక్షతన ‘తెలంగాణ చరిత్ర’ సదస్సు మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, గౌరవ అతిథిగా పురాతత్వ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నాణేల గురించి డాక్టర్ రాజారెడ్డి, అసఫ్‌జాహీల కాలంలో తెలుగు భాష మీద అడపా సత్యనారాయణ, తెలంగాణలో బౌద్ధం అంశాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ సంస్థానాల చరిత్రను ద్యావనపల్లి సత్యనారాయణ, ఆధునిక చరిత్ర గురించి కుర్రా జితేంద్రబాబు ప్రసంగించారు. వాటి సారాంశం క్లుప్తంగా... కాస్మోపాలిటన్ సంస్కృతి: తెలంగాణ మూలాలెక్కడ? అని శోధిస్తే ఇక్కడి తెలుగువారిని నైజాం ఆంధ్రులు అని వ్యవహరించిన ఆధారాలు కనిపిస్తాయి. షోడశమహాజనపథాలలో అస్మైక జనపథం మనదే. కోసల నుంచి అస్మైక జనపథానికి జరిగిన రాకపోకల వివరాలున్నాయి. ఉర్దూ అధికార భాష అయినా...: అసఫ్‌జాహీల కాలంలో అధికార భాష ఉర్దూ. అయినప్పటికీ భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత ఉద్యమ పితామహుడు స్థాపించి ఆర్థిక సమస్యలతో కొనసాగించలేకపోయిన దాదాపు నలభై పాఠశాలలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. ఐదవ శతాబ్దంలోనే!: ఐదవ శతాబ్ది నాటికే తెలంగాణలో మాత్రాచంధస్సుతో గ్రంథాలున్నాయి. సింధునాగరికతలో బయటపడిన పశుపతి శివుడి రూపమే రాచకొండ పెయింటింగ్స్‌లో కనిపిస్తుంది. – వాకా మంజులారెడ్డి -
తెలుగు పండుగ ముగిసింది.. బాధ్యత మొదలైంది : గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్నవారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతిఒక్కరం చేయి చేయి కలపాలి’’ అని పిలుపునిచ్చారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఉభయ సభల అధ్యక్షులు, పలువురు కీలక నేతలు, భాషాభిమానులు వేడుకలో పాలుపంచుకున్నారు. మన బాధ్యత ఇప్పుడే మొదలైంది : ‘‘ఐదురోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అమ్మభాషకు తెలంగాణ ప్రణమిల్లింది. 15 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి విచ్చేసిన భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. అవధానాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, గోష్టులు, ఇతర సాహిత్య రూపాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఇంత గొప్ప పండుగలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. మహాసభలు ముగిశాయి. కానీ మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. మాతృభాష రక్షణ, వికాసాం కుటుంబం నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లితండ్రి, గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలప్పుడు ఒక తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నాను. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు, భాగస్వాములైన అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా నాకొక పద్యం గుర్తుకొస్తోంది.. ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్నవారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతిఒక్కరం చేయి చేయి కలపాలి’’ అని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. -
రాష్ట్రపతి నోట హైదరాబాద్ బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ‘సోదరసోదరిమణులారా నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స’ అని రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం ప్రారంభంలో కొంత తెలుగులో మాట్లాడారు. ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాలు మంగళవారం ఎల్బీస్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆంగ్లంలో ప్రసంగిస్తూ.. తెలుగుభాష ఔనత్యాన్ని, తెలుగు సాహిత్య తేజోమూర్తులను, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాల ఉన్నతి ప్రస్తావించారు. పలువురు తెలుగు కవులను, వారి సేవలను గుర్తుచేశారు. ఆయన ఏమన్నారంటే.. తెలుగుభాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. తెలుగు సాహిత్యవ్యాప్తి శ్రీకృష్ణదేవరాయులు ఎంతో కృషి చేశారు దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు మాజీ రాష్ట్రపతులు ఎస్ రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరావు తెలుగు తెలిసినవారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు దేశవిదేశాల్లో తెలుగువారు ఎంతో ఖ్యాతి గడించారు హైదరాబాద్ అనేక సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది హైదరాబాద్ బిర్యానీకి, బ్యాడ్మింటన్, బాహుబలికి ప్రసిద్ధి రాష్ట్రపతిగా తెలంగాణలో ఇదే మొదటి పర్యటన 18 రాష్ట్రాల్లో, 42 దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగువారే కావడం ఆనందదాయకం 2008లో తెలుగుభాషకు చారిత్రక భాష గుర్తింపు నన్నయ్య, తిక్కన మొదలగు కవులు భారతాన్ని తెలుగులోకి అనువదించారు గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి వంటి కవులు తెలుగుభాషను సుసంపన్నం చేశారు గిరజన హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీమ్ వంటి వీరులు కన్న భూమి ఇది తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలు ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అనే గేయాన్ని ఉటంకించి రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు -
ఈ గడ్డమీద చదవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించిన సమయలో చాలా బెరుకుగా ఉన్నాను.. కానీ ఈ మహాసభలు విజయవంతం కావడంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఓనాడు 1974లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ మహాసభలకు వచ్చాను. నేడు ముఖ్యమంత్రి హోదాలో తెలుగు కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సభలు నిర్వహించాం. తెలుగు భాషా ఖ్యాతిని చాటి చెప్పింది మన తెలంగాణ. ఈ మహాసభలు విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే వేదికగా తెలుగు భాషను కాపాడుకోవాలని, తెలుగును మృత భాష అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనడం నిజంగా చాలా బాధాకరం. వెంకయ్యనాయుడు చెప్పినట్లుగా మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే సభలు పూర్తయ్యాక కూడా ప్రతిఏడాది డిసెంబర్ నెలలో తెలుగు సదస్సు నిర్వహిస్తాం. ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష చదవడాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఈ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే. తెలుగు భాషను రక్షించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందో ఈ ప్రపంచానికి తెలిసింది. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ ఈఎస్ఎల్ నరనింహన్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 40 దేశాల ప్రతినిధులు, దేశంలోని 17 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చిన అందరికీ వందనం.. అభినందనం. తెలుగు మహాసభలను విజయవంతం అయ్యేందుకు నందిని సిదారెడ్డి, ఎస్పీ సింగ్, సాంస్కృతిక శాక కార్యదర్శి వెంకటేశం, ఇతర ప్రభుత్వ అధికారులకు ఎంతో శ్రమించారని’ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఈసారి పద్యంతో ముగించిన సీఎం కేసీఆర్ మొన్న తాను చదివిన పద్యం విని ఎంతోమంది అభినందించారని, అదే విధంగా నేడు మరో పద్యం చదివి వినిపిస్తానంటూ ఆహుతులలో ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్. ‘నవ్వవు జంతువులు.. నరుడు నవ్వును....... నవ్వులు పువ్వులవోలే’ అని పద్యం చదివి నమస్కారం ఇక సెలవు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ కొన్ని తీర్మానాలు చేశారు. సీఎం కేసీఆర్ చేసిన తీర్మానాలివీ.. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష కచ్చితంగా చదివేలా అమలు చేస్తాం. ఈ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామని మరోసారి మనవి చేస్తున్నాను. అనతికాలంలోనే పరిష్కారం చూపిస్తాం. భాషా పండితులకు పెన్షన్‌లో కోత విధిస్తున్నారని విన్నాం. అలాంటివి జరగకుండా చూస్తాం. భాషా పండితులతో సమావేశమై ప్రతి ఏడాది తెలుగు సభలను నిర్వహించడంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం. తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం -
రాష్ట్రపతి నోట హైదరాబాద్ బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి..!
-
'ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి'
-
' ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలి'
-
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
మాతృభాష తల్లిపాలవంటిది: బాలయ్య
-
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నగరానికి చేరుకున్నారు. కన్నలు పండుగగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోవింద్ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. బేగంపేట చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అక్కడ నుంచి ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువురితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
'మహాసభల్లో ఉద్యమకారులకు అవమానం'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల్లో ఉద్యమ కారులను అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఉద్యమ కారులైన గద్దర్, విమలక్క లాంటి వారిని మహాసభల్లో పక్కకు పెట్టారన్నారు. అదే విధంగా రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించకుండా కించపరిచారని ఆరోపించారు. ప్రపంచ మహా సభలు.. టీఆర్ఎస్ పార్టీ మహా సభలుగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిపాలన అంతా తెలుగులోనే జరగాలన్నారు. ఆదివాసీ, లంబాడీల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. గోండు, లంబాడీ సభలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరయ్యారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఓ ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతిచెందినా.. ఇప్పటి వరకు అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మరో వైపు సోమవారం అరెస్టు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను వెంటనే విడుదల చేసి, వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని చాడ డిమాండ్ చేశారు. -
'ప్రపంచ తెలుగు మహాసభ'లో బాలయ్య సవాల్
సాక్షి, హైదరాబాద్ : ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలంతా స్నేహ భావాన్ని వీడలేదని, ఇది ఎప్పటికీ అలాగే కొనసాగాలని ప్రముఖ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీర తెలంగాణ పుత్రులకు, విప్లవ తెలంగాణ ఆడబిడ్డలకు తన కళాభివందనాలు అని చెప్పారు. ఈ సభల్లో పాలుపంచుకోవడం తన పూర్వజన్మసుకృతం అని చెప్పారు. తెలంగాణలో పుట్టిన వారికి అభిమానించడం తెలుసని, ఎదురించడం తెలుసని అన్నారు. తెలంగాణ సాయుధపోరాటంతో తమ సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ గడ్డదని కొనియాడారు. ఇక తెలుగు భాష గురించి మాట్లాడుతూ పలువురు తెలుగు ప్రముఖులను గుర్తు చేశారు. తెలుగు పదం వింటే తన తనువు పులకిస్తుందన్న ఆయన ఐదువేల ఏళ్ల కిందట నుంచి తెలుగు జాతి ప్రారంభమైందని అన్నారు. ఒక మహనీయుడు చెప్పినట్లు మాతృభాష తల్లిపాలవంటిదని, పరాయి భాష డబ్బా పాలవంటిదని గుర్తు చేశారు. డబ్బా పాలపై మోజుతో అమ్మను అమ్మా అని పిలవలేకపోతున్నారని, తల్లులు కూడా అమ్మ అనిపించుకోవడం కంటే మమ్మీ అని, నాన్న డాడీ అని పిలిపించుకుంటున్నారని, ఇలా ఇరవై ఏళ్లు పోతే ఇవే తెలుగు పదాలేమో అనే నమ్మే దౌర్భాగ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ సవాల్ విసిరారు. మూడు నిమిషాలు ఒక్క పరాయి పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని సవాల్ విసిరారు. కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులున్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉందంటూ కవితాత్మకంగా వర్ణించారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలుగు.. సినీవెలుగు
-
పరిమళించిన సాహితీ సుగంధం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహా సభల నాలుగో రోజున సాహితీ సుగంధాలు పరిమళించాయి. అన్ని వేదికలు భాషాభిమా నులతో కళకళలాడాయి. పలు వేదికల వద్ద పిల్లలు, పెద్దలు కుటుంబాలతో సహా సభలకు తరలిరావడం కనిపించింది. ఎల్బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’పై సదస్సు నిర్వ హించారు. ప్రముఖ కవి, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ దీనికి అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజా జీవితంతో ముడిపడిన పాటపై ఈ కార్యక్రమంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యమాల్లో, ప్రజల దైనందిన జీవితంలో పాట పెనవేసుకున్న తీరును వక్తలు వివరించారు. శ్రమకు పాటకు ఉన్న సంబంధం, సమాజ పరిణామ క్రమంలో పరవళ్లు తొక్కిన పాటపైన అశోక్ తేజ మాట్లాడారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రసమయి బాల కిషన్, జయరాజ్, దేశపతి శ్రీనివాస్ తదితరు లు పాటకు, తెలంగాణ సంస్కృతి సాంప్రదా యాలకు, సాహిత్యానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మలేసియా తెలుగువారి సాంస్కృతిక కదంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ కళాకారులు, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’ ప్రేక్షకులను అలరించింది. విమర్శ–పరిశోధనపై సదస్సు తెలుగు వర్సిటీలో ‘తెలంగాణ విమర్శ– పరిశోధన’ అన్న అంశంపై జరిగిన సదస్సులో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా.. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో 200 ఏళ్ల క్రితమే తెలుగు సాహిత్యంలో విమర్శ వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య, సురవరం ప్రతాపరెడ్డి, సి.నారాయణ రెడ్డి, పింగళి వంటి ఎంతోమంది కవులు విమర్శ, పరిశోధనలను సాహిత్య ప్రక్రియ లుగా అభివృద్ధి చేశారని వివరించారు. తాను త్వరలో కాకతీయుల చరిత్రపై గ్రంథం రాయనున్నట్లు మధుసూదనాచారి చెప్పారు. లక్ష్మణ చక్రవర్తి, బాలశ్రీనివాసమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు తెలుగు వర్సిటీలోనే.. శతక, సంకీర్తనా, గేయ సాహిత్యంపై సదస్సు జరిగింది. ఇందులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ఆశావాది ప్రకాశ్‌రావు, జె.బాపురెడ్డి, వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. దేవరాజు మహారాజు, పాపినేని శివశంకర్, తిరుమ ల శ్రీనివాసాచార్యతోపాటు పలువురు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సారస్వత పరిషత్తులో శతా వధానం ఆసక్తికరంగా సాగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిం చిన బృహత్ కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేశారు. నేడు ముగింపు.. హాజరుకానున్న రాష్ట్రపతి కన్నుల పండుగగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం ఐదు గంటల సమ యంలో ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువు రితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. వాడుక భాషను ప్రామాణికం చేయాలి రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై సదస్సు జరిగింది. ఇందులో ఎంపీ కేశవరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల వాడుక భాషను ప్రామాణికం చేసేందుకు పత్రికలు, ప్రెస్ అకాడమీ కృషి చేయాల్సి ఉందని వక్తలు సూచించారు. - అనంతరం న్యాయం, పరిపాలన రంగాల్లో తెలుగు అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విశ్రాంత న్యాయమూర్తులు చంద్రయ్య, మంగారి రాజేందర్, సీనియర్ అధికారులు పార్థసారథి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానాలు, పరిపాలన, శాసన రంగాల్లో తెలుగు భాషను వినియోగించాల్సి ఉందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. - రవీంద్ర భారతి ప్రధాన హాల్లో ‘తెలంగాణ మహిళా సాహిత్యం’పై సదస్సు జరిగింది. ఆచార్య సూర్య ధనుంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిగంటి సుజాతారెడ్డి, కొండపల్లి నిహారిక, జూపాక సుభద్ర తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా కవయిత్రుల సమ్మేళనం జరిగింది. నేటి తీర్మానాలివీ.. - ఒకటి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు. - ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం. - అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా లు, సంస్థల్లో నేమ్ బోర్డులు (నామ ఫలకాలు) తెలుగులో రాయాలనే నిబంధన - వీటితో పాటు మరికొన్ని అంశాలపైన తీర్మానాలు చేయనున్నారు. -
తారలు దిగివచ్చిన వేళ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు 40 మందికిపైగా ఒకే వేదికపైకి చేరి అలరించారు. సోమవారం రాత్రి లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’లో సినీ ప్రముఖులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్, రాజమౌళి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, ఆర్.నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. సినీ దిగ్గజాలతోపాటు గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌లు హాజరయ్యారు. తొలుత వేదికపై పలువురు గాయనీగాయకులు ఆ పాత మధురపు పాటలతో ప్రేక్షకులను అలరించారు. సినీ ప్రముఖులకు సన్మానం వేదికపై కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, జమున, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రాఘవేంద్ర రావు, బి.నర్సింగ్‌రావు, రాజమౌళి, జయసుధ, ఎన్.శంకర్లను గవర్నర్, మంత్రులు సన్మానించారు. తెలుగే మాట్లాడుతా..: చిరంజీవి సీఎం కేసీఆర్ తెలుగు భాషను రక్షించేందుకు ఓ బాధ్యతగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని చిరంజీవి పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషే కారణమని చెప్పారు. తెలుగును సంరక్షిస్తూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ఆలోచనలు ఏ భాష ద్వారా వస్తాయో.. అదే మన మాతృభాష అని పేర్కొన్నారు. ‘‘ఈ మహాసభలకు మంత్రి కేటీఆర్ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. అప్పుడు నేను కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను ఇంగ్లిష్‌లో చెబుతూ అభినందిస్తున్నాను. వెంటనే కేటీఆర్ స్పందించి.. ‘‘అన్నా.. నేను తెలుగు సభల కోసం మిమ్మల్ని పిలవడానికి వస్తే.. మీరేంటి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారనడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. నిజమే నేను ఆ క్షణంలో సత్యాన్ని గ్రహించాను. ఇకపై అన్ని సందర్భాల్లో తెలుగే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను..’’ అని చిరంజీవి వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్‌లను సత్కరించాలి... ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్ ఈ సభలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. ఇంగ్లిష్ నేర్పించాలని ఒత్తిడి వస్తున్న రోజుల్లో ఈ సభలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన తమను పిలిచి సత్కరించడం నిజంగా అభినందనీయమన్నారు. కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకుగాను ఆయనను సత్కరించేందుకు సొంతంగా శాలువా తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన శాలువా కప్పి కేటీఆర్‌ను సత్కరించారు. అలరించిన సినీ సంగీత విభావరి - కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ‘బతుకమ్మ’ పాటను ఈ సభల్లో చూపారు. ప్రముఖ యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ, సుమలు ప్రధాన భూమిక పోషించిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. - ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ‘హోలీ’ పాటను కూడా చూపారు. అందులో యువ నటుడు విజయ్ దేవరకొండ, మెర్లీన్ చోప్రాలు ప్రేక్షకులను అలరించారు. - దర్శకుడు హరీశ్‌శంకర్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ చరిత్ర’ పాట వీక్షకుల్ని కట్టిపడేసింది. ఈ పాటను తెలంగాణ చరిత్రకు సంబంధించిన చరిత్రకారుల్ని, తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ప్రదేశాలను గుర్తు చేస్తూ తీశారు. ఇందులో నటులు మెర్లీన్ చోప్రా, లావణ్య త్రిపాఠి, వరుణ్‌తేజ్, రాజ్‌తరుణ్, సింగర్ రేవంత్, సాయిధరమ్‌తేజ్, హెబ్బా పటేల్, షాలినీ పాండే, సునీత, సునీల్, చంద్రబోస్‌లు మెరిశారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. - కార్యక్రమంలో నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీహరి కుటుంబాలను సత్కరించారు. -
అవి విస్మృత వెలుగులేనా!
రెండో మాట ఇలాంటి దురవగాహన వల్లనే, రాజకీయ లబ్ధి కోసమే ‘ఆంధ్ర’ శబ్దం పట్ల కొందరు ఏవగింపు ప్రకటించారు. అలా తెలంగాణ ఆంధ్రోద్యమంతో పాటు, ఆంధ్ర మహాసభల ప్రారంభకులూ, చరిత్రకారులూ, తెలంగాణ వైతాళికులూ సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఒద్దిరాజు సోదరులు వంటివారు ప్రవేశపెట్టిన చారిత్రక సంప్రదాయాన్నీ, విజ్ఞతనూ పెడచెవిని పెట్టడానికి సాహసించారు. ‘జాతిరీత్యా, భాష రీత్యా మనం ఆంధ్రుల’మని స్పష్టం చేస్తూ సురవరం అనేక దశాబ్దాల క్రితం హెచ్చరించాల్సి వచ్చింది. ‘... నీ ప్రాకట పూర్వభాగ్య పరిపాటి తలంచినన్/ ఆంధ్ర రాజ్యలక్ష్మీ కఠినాత్మకుండైన చింతిలి/ నీరయి పోకయుండునే?’ అనీ, ‘ఆంధ్ర శిల్ప ప్రౌఢి ఆంధ్ర విక్రమరేఖ జాలుగా పారిన శాద్వలంబు’నీ కాకతీయ రాజ్య ఉత్థానపతన దశలను తలచుకుంటూ తెలంగాణ చరిత్రను, శాసనసంపదను తవ్వి తలకెత్తి చూపినవారు ఆంధ్రకవులు– శేషాద్రి–రమణకవులు. కాగా ప్రాచ్య దేశాం ధ్రకు ‘శ్రీమహాభారతం’ భవ్య తెలంగాణకు ‘శ్రీమహాభాగవతం’, మహిత రాయలసీమకు ‘రామాయణం’– వెరసి యావదాంధ్ర త్రివేణీ సంగమంగా రూపొందినదని చాటినవారు పక్కా తెలంగాణమూర్తి వానమామలై వరదాచార్యులు. ఈ ఆంధ్ర స్ఫూర్తి, ఈ తెలుగు స్ఫూర్తి అంతటితో ఆగలేదు. ఎవరు రుద్రమ? ఎవరు రాయలు? ఎవడు సింగన? అని ప్రశ్నించుకుని ‘వెలుగూ నేనే, తెలుగూ నేనే’ అని చాటి తనకు కావలసిన సమాధానం ఒకేఒకటన్నాడు మహాకవి దాశరథి. ఏమిటది? ‘నాకు కావలె! నాకు కావలె! మనిషి మనిషి మనసుదారుల/ రాగబంధము, రాగబంధము నాకు కావలె!’ అని బలంగా చాటాడు. అంతటితో కథ ఆగలేదు. ‘నీటి గుణమో, గాలి గుణమో/ అన్నపూర్ణ నామాంకిత ఆంధ్రావని సౌభాగ్యమో! పుడమి దున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు’ అన్నాడు ప్రజాకవి కాళోజీ. అయినప్పుడు, ‘మేము ఆంధ్రులం కాము, మాది తెలుగు కాదు, మా తెలుగు వేరు’ అని తెలుగుదేశంలో పుట్టిన వాడెవడైనా అంటాడా? ఎవరెన్ని మార్చినా వెళ్లవలసిన దారి, చేరుకోవలసిన గమ్యమూ మాత్రం ఒకటే– అది తెలుగు దారే. వెలుగు దారీ అదేను! మనసులను తేజోవంతం చేసుకోవాలి అన్ని ప్రాంతాలకు చెందిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నడవడిక వేరుగా ఉందంటే కొందరు బాధపడనక్కరలేదు. ఎందుకంటే ఈ సభలలో పాల్గొం టున్న ఒక ప్రముఖ నిర్వాహకుడు, సాహితీవేత్త, వరంగల్ ఎన్నడూ ఆంధ్ర రాజధాని కాదు; కృష్ణదేవరాయలకూ, తెలంగాణ ప్రాంతానికీ ఎలాంటి సంబంధం లేదు; అది కల్పితగాథ అని ప్రకటించాడు. ఈ సమయంలోనే కొన్ని అంశాలను జ్ఞప్తికి తెచ్చుకుని, మనస్సులని తేజోవంతం చేసుకోవాలి. మన స్వార్థ చింతన కొద్దీ మన పూర్వీకులకు వారికి లేని సాహితీ పాండిత్య దురభిమానాలను అంటగట్టే ప్రయత్నానికి దిగకూడదు. చారిత్రక వారసత్వాన్ని భావి తరాలకు సక్రమంగా అందించాలి. తెలంగాణ చరిత్రకు ఆధారాలనదగిన పలు శాసనాధారాలను వెలికితీసిన ఉద్దండపిండాలు శేషాద్రిరమణ కవులు. ఆంధ్రకవులైన వీరు ‘నిజాము రాష్ట్రము– వాజ్ఞయ చరిత్రము’ అన్న విశేష రచనలో నిజాం రాష్ట్రములో ఏవి ఆంధ్ర ప్రాంతాలో ఖాయపరుస్తూ, ‘ఆంధ్ర దేశ విస్తృతి, అచటి సారస్వత రంగస్థలాలు, చారిత్రక ప్రదేశాల’ గురించి చెప్పారు, ‘నిజాం రాష్ట్రంలోని తెలుగుదేశం నిర్జీవ స్థలం కాదు. ఆంధ్ర కవిరాజుల రసవత్కవితామృతంచే పునీత పుణ్యభూమి; ఆంధ్రవీరుల పరాక్రమ రక్తధారలచే పవిత్రమైన స్మరణ చిహ్నం. ఆంధ్రశిల్పుల హస్త విన్యాసంచే సజీవమైన చరిత్రకు రంగస్థలం.’ ఈ చారిత్రక చిహ్నాలు అప్పటి నుంచి ఆంధ్ర పరిశోధకుల దృష్టిని ఆకర్షించక పోవడాన్ని గ్రహించిన ఆ పండితులు గుంటూరు జిల్లావాసులు. ఉద్యోగ రీత్యా వచ్చి నిజాం రాష్ట్రంలోని ఆంధ్రభాగంలో స్థిరపడినవారు ఆ శేషాద్రిరమణ కవులు. నిజాం రాష్ట్రంలో ఏవి ఆంధ్ర భాగాలో వారు ఇలా వివరిం చారు, ‘వరంగల్లు, కరీమునగరము, ఆదిలాబాదు, అత్రాపుబల్దా, మెదకు, నిజామాబాదు, మహబూబునగరము, నల్లగొండ మండలములు పూర్తిగా ఆంధ్రమండలములు’. కాగా ఇవిగాక రాయచూరు మండలంలోని కొన్ని తాలూకాలు, ఇందూరు మండలంలోని కొన్ని తాలూకాలు ఆంధ్రదేశానికి సంబంధించినవి. తక్కిన మండలములలో కూడా ఆంధ్రులు నివాసముండే గ్రామాలు ఉన్నవి. అంతేగాక, కృష్ణదేవరాయల శాసనం నేలకొండపల్లిలో ఉంది. సమన్వయించి చూస్తే ‘నిజాం రాష్ట్రంలోని తెలుగు దేశమంతా రాయలు పాలించాడని ఈ ప్రాంతాన్ని తెలగాణ్యమని రాయలు ప్రయోగించడం చేత అది తెలంగానా యను నామమును, మొగలాయి పాలకులు పెట్టకముందే నిజాము రాష్ట్రమందలి ఆంధ్రదేశము తెలగాణ్యమనే వ్యవహారంతో ఉంది’ అని శేషాద్రిరమణ కవులు నిర్ధారించారు. కనుకనే నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) శాసనం వల్లనే రాయలకు నిజాం నిజాం రాష్ట్రానికి గల సంబంధం తెలియబట్టే ‘రజతోత్సవం’ జరపవలసిన అవసరం ఉందని ఆ జంటకవులు పేర్కొన్నారు. బహమనీలను, గజపతులను వరంగల్ పరిసరాలలో ఎదుర్కొని వరంగల్‌ను రక్షించింది కృష్ణదేవరాయలని చరిత్రకారుల భావన. అంతేగాదు, విదేశీ వర్తక వ్యాపారాలకు సహితం యావదాంధ్ర భూభాగంలో అంతర్భాగమైన కోస్తాతీరం కీలకమని గ్రహించిన తొలి పాలకులు కూడా శాతవాహనులు, మొగలులేనని ఆ కారణంగానే ఉభయ పక్షాలు కోస్తా వైపే రాజ్యవిస్తరణ సాగించాయని మరవరాదు. ఆంధ్రభాషంటే తెలుగుభాషే! అయితే, ఒక దురవగాహన వల్లనే, రాజకీయ లబ్ధి కోసమే ‘ఆంధ్ర’ శబ్దం పట్ల కొందరు ఏవగింపు ప్రకటించారు. అలా తెలంగాణ ఆంధ్రోద్యమంతో పాటు, ఆంధ్ర మహాసభల ప్రారంభకులూ, చరిత్రకారులూ, తెలంగాణ వైతాళికులూ సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఒద్దిరాజు సోదరులు వంటివారు ప్రవేశపెట్టిన చారిత్రక సంప్రదాయాన్నీ, విజ్ఞతనూ పెడచెవిన పెట్టడానికి సాహసించారు. ‘జాతిరీత్యా, భాష రీత్యా మనం ఆంధ్రుల’మని స్పష్టం చేస్తూ సురవరం అనేక దశాబ్దాల క్రితం ఇలా హెచ్చరించాల్సి వచ్చింది: ‘‘ఆంధ్ర అను పదము కులమును తెలుపదు, వర్ణము (కులము)నకు వర్తించదు, మతమునకు సంబంధించదు. ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడేవారు. అట్టి ఆంధ్ర పదమునకు మనము కొత్త అర్థము నిచ్చుటకు ఏమాత్రమును మనకు అధికారము లేదు. ‘ఆంధ్ర’ భాష అంటే తెలుగు భాషే’’! ఇప్పటికి కూడా ‘ఆంధ్ర’శబ్దం అంటే ఒంటినిండా ‘దద్దుర్లు’(ఎలర్జీ) పెంచుకునే కొందరు ఉన్నారు. తెలుగు భాషకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి రాకుండా అడ్డుకోజూసిన తమిళుడొకరితో ఒక తెలంగాణ సోదరుడు చేతులు కలిపాడు. ఆ సమయంలో సకల ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు లిపి, భాష, సాంస్కృతిక, చారిత్రక శాసనాధారాలతో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తరఫున (2006లో) బృహత్ సమాచారాన్ని సమర్పించడం జరిగింది. కరీంనగర్‌లోని జినవల్లభుని (క్రీస్తు శకం 946) కుర్క్యాల శాసనం సహా ఆ సాక్ష్యాధారాలలో ఉన్నాయి. కానీ విచి త్రమేమంటే, ఆ శాసనాన్ని తామే అందజేసినట్టు, దాని ఆధారంగానే కేంద్రం తెలుగుకు శిష్ట భాషా ప్రతిపత్తిని ఇచ్చినట్టు (10.12.17) నమ్మించడానికి కొందరు ప్రయత్నించడం హుందాతనానికి దూరం కావడమే. ‘ఆంధ్రులు చేతులెత్తేస్తే ఆధారాలిచ్చి ఆదుకున్న తెలంగాణా’ అని ఒక స్థానిక దినపత్రిక (17.07.16) పచ్చి అబద్ధం రాసింది. ఇది ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపోహలు రేపే మరొక విషయానికి తెరలేపుతూ, తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన ఒక అధికారి ఒక ‘నోట్’ను పంపారు. అందులో ఆయన ‘తెలుగు మహాభారతం’లో 70 శాతానికి పైగా పదాలు సంస్కృత పదాలే కాబట్టి ఆ తెలుగు అరువు తెచ్చుకున్నదేనని, తెలుగు సాహిత్య చరిత్రకు 900 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉంది గనుక, ప్రాచీన భాష హోదాకు తగదని అందులో పేర్కొన్నారు. నిజానికి నన్నెచోడుని కాలం కూడా బరాబరిగా జినవల్లభుడి కుర్క్యాల శాసన కాలం దగ్గరదగ్గరే. నన్నయ తాను ఆదికవినని ప్రకటించుకోలేదు. కుర్క్యాల శాసనాన్ని, దాని ఆధారాలను బహుశా మొదటిసారి వెలుగులోకి తెచ్చినదీ, నన్నయకన్నా సుమారు నూరు సంవత్సరాల ముందు (సుమారు క్రీ.శ. 945) జినవల్లభుడని ‘చెప్పవచ్చుననీ’, తెలుగులోని తొలి మూడు కంద పద్యాలు ఇతని రచనేనని చెప్పినవాడు నేలటూరి వెంకటరమణయ్యే (నెల్లూరు జిల్లా)నని మరచిపోరాదు. అనేక నిర్బంధాలమధ్య, భాషా వైరుధ్యాల మధ్య శతాబ్దాల పాటు నలిగిపోయిన చారిత్రక ప్రదేశాలలో ఒకటి తెలంగాణం. కనుకనే, తెలంగాణ భూగర్భంలో దాగి, వెలుగులోకి రాని పురావస్తు సంపదకు విముక్తి కల్పించిన సంగంభట్ల నరహరి, బీఎన్ శాస్త్రి, డి. సూర్యకుమార్‌లను తెలంగాణ తొలి చారిత్రక త్రయంగా పేర్కొనాలి. తెలంగాణ మాగాణంలో దాగిన చారిత్రక సంపదను కోకొల్లలుగా వెలికితీయడంలో పురాతత్వ పరిశోధకులుగా, చరిత్రకారులుగా, శాసనభాషా వివేచకులుగా చేదోడువాదోడైన పలువురు తీరాం ధ్రులైన తెలుగువారే! వారు: మల్లంపల్లి సోమశేఖరశర్మ, వి.వి. కృష్ణశాస్త్రి, పరబ్రహ్మ శాస్త్రి, ఎన్.ఎస్. రామచంద్రమూర్తి, శేషాద్రి రమణకవులు, ప్రొఫెసర్ శివనాగిరెడ్డి, దేమె రాజారెడ్డి వంటివారు తెలుగు జాతి వెలుగులే. నిండుగ వెలుగుజాతి కాగా, కీ.శ. 1వ శతాబ్ది నాటికి తెలంగాణ కేంద్రంగా శాతవాహన రాజ్యం కోస్తాంధ్రకు విస్తరించి, అమరావతిని రాజధానిగా చేసుకుంది. ఈ పెనుమార్పుకు బలమైన కారణం– రోమ్ వర్తక వాణిజ్య కేంద్రంగా ఆంధ్ర కోస్తా వర్ధిల్లడమే. ఈ కాలంలో అమరావతి (ధాన్యకటకం) విజయపురికి తోడు ఇతర ప్రసిద్ధ కేంద్రాలుగా గుంటుపల్లి, ఘంటసాల, శంకరంతో పాటు తెలంగాణ ప్రాంతమందలి నేలకొండపల్లి, చైతన్యపురి (హైదరాబాద్) ప్రసిద్ధ వర్తక కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఇలా యావదాంధ్రలో (తెలంగాణ సహా)నూ బౌద్ధ, జైన చైత్యాలు, విహారాలతోపాటు సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి వీలుగా మౌర్య చక్రవర్తి అశోకుడి కాలంలో (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీ లిపి ప్రామాణీకరణ సాంస్కృతిక విప్లవంగా ప్రారంభమై ప్రాకృత–పాళీ భాషలు దేశవ్యాప్తంగానే రెక్కలు విప్పుకున్నాయి. బహుశా అందుకనే అప్పకవి ‘ప్రాచీన భారతంబు ప్రాకృతంబు’ అని దిలాసాగా ప్రకటించి ఉంటాడు. ఆ ప్రాకృతం, పాళీ భాషలు తెలుగుతో చెలిమి చేశాయి. కనుకనే ‘సినారె’ ‘‘తెలుగుజాతి మనది/ నిండుగ వెలుగు జాతి మనది/.... అన్నీ కలసిన తెలుగునాడు మనదే, మనదే మనదేరా’’! అన్నారు. ఆ ‘మనదన్న’మాట నిలిచిపోవాలి, ‘మన–పర’ అన్నమాటే వినిపించరాదు. అలా వినిపించినన్నాళ్లు మనం తెలుగు వాళ్లం కాదు. మనది ఆంధ్రజాతి కాదు– నేటితో ముగియబోతున్న యావన్మంది తెలుగువారికీ ప్రాతినిధ్యం కాని ‘ప్రపంచ తెలుగు మహాసభల’ సాక్షిగా... ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
ఊరిస్తూ... పూరిస్తూ...
మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధానం మూడో రోజు సమస్యా పూరణం పూర్తయింది. పృచ్ఛకులు అడిగిన 25 సమస్యలను అవధాని సునాయాసంగా పూరించారు. మద్దూరి రామ్మూర్తి ఇచ్చిన సమస్యను– పద్యము శారదా హృదయ పద్మము భావ రసైక సద్మమున్ పద్యములన్ భళా యతులు ప్రాసల సత్కవచాల తోడ నైవేద్యముగాగ భారతికి వేద్యము చేయగనొప్పు తప్పుగా పద్యము వ్రాయనివాడు చెడి పాతకమందడు సత్కవీశ్వరా అని పూరించారు. పులికొండ సుబ్బాచారి ఇచ్చిన సమస్యను– పావన భావనా సుమతి భవ్యుడు కౌశికుడండనుండగా జీవనరేఖ భాగ్యముల సిద్ధులు ముద్దుగ గల్గ ఆ మహాదేవుని విల్లు ద్రుంచిన సుధీరుని రాముని భీకర ద్విశత్ రావణు పెండ్లియాడినది రాజిత సీత సకామౖయె భళా! అని పూరించి, అందులో ఉపయోగించిన పదాన్ని వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల శత్రురావణః (శత్రువులను ఏడిపించేవాడు) అని వస్తుంది. ఆ అర్థం వచ్చేలా ద్విశత్ రావణు అని సమస్యను పూరించానని వివరించారు. కౌండిన్య తిలక్ ఇచ్చిన సమస్యకు తంపు సీరియళ్ల తంపులు కొంపలన్ కంపలట్లు తగిలె కెంపులూడె కోపతాములకు గురిచేయు సీరియల్స్ కన్న వారె కన్న ఖలులు గలరేఅంటూ సీరియల్స్ చూసే వారిని మించిన ఖలులు ఉన్నారా అని పూరించి శ్రోతలను అలరించారు. లింగవరం పవన్ కుమార్ ఇచ్చిన సమస్యను– శుచిలేనట్టి పదార్థముల్ తినగ వచ్చున్ వ్యాధులెన్నేనియున్ రచితానేక సుశాకపాకములు రారాజిల్లెనీ నేల ప్రచురంబై ప్రచలింపన్మది జంతుహింసలౌరా భావ్యంబహో కాదుపో రుచిమంతమ్మగు కోడి మాంసమది యారోగ్యమ్ము సన్యాసికిన్ అని పూరించడంతో సభంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. చివరగా సుశర్మ ఇచ్చిన సమస్యను... ధరలేడీ మన ముఖ్యమంత్రి సరళిన్ దమ్మున్న ధీనేత పరమంబౌæవరముల్ ప్రసాదముగ పంపన్ ధీరుడౌ శ్రీ పరంపరలూరంగ వెలుంగిలిచ్చునతడే ప్రాజ్ఞుండునా చంద్ర శేఖర మార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీ తెలంగాణకున్అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్తుతించి మంగళాశాసనం పలికారు. అలరించిన అప్రస్తుత ప్రసంగం అప్రస్తుత ప్రసంగీకునిగా వ్యవహరించిన పున్నమరాజు అవధానిని ఇబ్బందిపెడుతూ చక్కగా ప్రశ్నించారు. ‘‘మీ మెడలో పూలహారాన్ని మైకుకి ఎందుకు వేశారు?’’ అని ప్రశ్నించిన పున్నమరాజును ‘‘మీ మెడలో వేద్దామనుకున్నాను. కాని మైక్‌కి వేశాను’’ అన్నారు. ‘‘మీరు మైకు ద్వారా మీ కవితా పరిమళాన్ని మాకు అందిస్తున్నారు’’ అని పున్నమరాజు చమత్కరించారు. ‘‘తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అప్రస్తుత ప్రసంగికుడు ముదిరితే ఏమవుతుంది’’అని చమత్కారంగా అడిగిన ప్రశ్నకు, ‘‘పిచ్చివాడు అవుతాడు. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగీకులు మరింత హైపిచ్‌లో అడుగుతారు కదా. అందువల్ల వారు హైపిచ్చివాళ్లు’’ అని చమత్కరించారు అవధాని. ‘‘సునామీ స్త్రీలింగమా, పుంలింగమా’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘మీరు సునామీలా ఉన్నారు. సు నామి అంటే మంచి పేరుగల వారు. మీపేరు పున్నమరాజు. మంచి పేరు’’ అన్నారు అవధాని. ‘‘ధార, ధారణ సముపార్జన కోసం రాత్రి పూట రసం పుచ్చుకుంటారా’’ అని అడిగితే, ‘‘శారదాదేవి పాద రసం సేవిస్తాను’’ అని సభ్యులను నవ్వులలో ముంచెత్తారు రామశర్మ. సభ్యులకు ఆనందం పంచే అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్నలు బాగానే ఉన్నాయి కాని, సమాధానాలు మాత్రం ఆశించినంత స్థాయిలో రాలేదని పలువురు పండితులు భావించారు. – డా. వైజయంతి -
పద్యం నేర్చుకుంటే మీరూ కేసీఆర్ కావొచ్చు!
నాటి మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాల.. ఓ శనివారం.. ముందు పెట్టుకున్న నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి ఏదో అంశంపై మాట్లాడటమో, కవిత చెప్పటమో చేయాలి.. ఇంతలో బక్క పలచని ఎనిమిదో తరగతి విద్యార్థి లేచి నాటి సామాజిక పరిస్థితిని ఓ పద్యం, కొన్ని మాటల్లో చకచకా వివరించాడు. ఉపాధ్యాయులు చూస్తూ ఉండిపోయారు. ఈ పద్యాలు, ఆ మాటలుæ నీకెక్కడివిరా అనేసరికి.. ‘పద్యమంటే నాకు ఇష్టం, నా మాటలను పద్యంగా చెప్పటం ఇంకా ఇష్టం’ అన్నాడు! 40 ఏళ్లు గడిచాయి... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. లక్షల సంఖ్యలో జనం ఒకచోటకు చేరారు. భారీ బహిరంగ సభలో ఓ బక్క పలచని వ్యక్తి వేదిక మీదకు వచ్చి పిడికిలి బిగించి చూపేసరికి జనంలో హోరు మొదలైంది. ఆ తర్వాత మాటలు.. వాటిని మించిన పద్యాలు.. ఆ తర్వాత పిట్ట కథలు.. తూటాల్లా పేలేసరికి ఆ ప్రాంగణం చప్పట్లు, ఈలల హోరుతో మార్మోగిపోయింది. ఆ బక్క పలచని వ్యక్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఆయన వాగ్ధాటిలో అడుగడుగునా వినిపించే విరుపులు, పిట్ట కథలు, సూటిగా తాకే తూటాల్లాంటి మాటలు.. ఆ వాగ్ధాటి కొద్దిమందికే సాధ్యం. స్వతహాగా మంచి మాటకారి అయినప్పటికీ, ఆ మాటకు కొత్త పల్లవినిచ్చింది మాత్రం పద్యమే. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, శతకాలు ఓ మంత్ర దండంగా పనిచేసి ఆయన మాటకు వెలుగునిచ్చాయి. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు.. కేసీఆర్‌కు చిన్నప్పుడు తెలుగు సాహిత్యాన్ని బోధించిన గురువు వేలేటి మృత్యుంజయ శర్మ!ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం రోజున సభ మొదలుపెట్టేముందు వేదికపై ఈ గురువుకు ముఖ్యమంత్రి గురువందనం నిర్వహించారు. చిన్నప్పుడు తనకు పద్యాలు నేర్పింది ఈ గురువే అంటూ పాదాభివందనం చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే క్రమంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న తపన రావటానికి నాడు కేసీఆర్ తెలుగు సాహిత్యం చదవటమే కారణమంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మంచి మాట అవసరం. ఆ మాట మధురంగా ఉండాలి, అవసరమైతే కఠినంగా వినిపించాలి. కానీ ఎదుటివాడిని ఆకట్టుకునేలా ఉండాలి. గాలివాటం మాట ప్రభావాన్ని చూపదు. ఆ మాటకు ఏదో ఓ మాయ ఉండాలి. అది చేరాలంటే మన నోట సాహిత్యం పలకాలి. సాహిత్యమంటే అర్థం కాని గ్రాంథికమే కావాల్సిన అవసరం లేదు. జనం నోట కమ్మగా వినిపించే పద్యం చాలు. అలాంటి పద్యాలు రావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. ఇదంతా ఓ కృషి. అది ఆసక్తి ఉంటేనే సాధ్యం. కేసీఆర్‌కు అదే బలం..: తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై అలవోకగా కేసీఆర్ నోట వచ్చిన పద్యాలు ఆయన ఇప్పుడు నేర్చుకున్నవి కాదు. చిన్నప్పుడు భాష వెంటపడి ఔపోసన పట్టినవే. అప్పుడు నేర్చిన పద్యాలు ఆయన్ను మాటల మాంత్రికుడిని చేశాయి. అది భాష గొప్పదనం. సాహిత్యం చదివిన వాడు తన మాటతో ప్రపంచాన్నే జయించగలడు. అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చి చూపిన కేసీఆర్‌కు ఆ భాషే బలం. సభ తొలిరోజు ఆయన పద్యాలు చదివిన తీరు లక్షల మందిలో కొత్త ఆలోచనను రేకెత్తించి ఉంటాయి. వారూ పద్యాలు నేర్చుకోవాలనే తపన తెచ్చుకుని ఉంటారు. మన అమ్మ భాషలోని కమ్మదనాన్ని ఆస్వాదించిన నాడు, అందులో కొంతలో కొంత వంటపట్టించుకున్న నాడు మనను గుర్తించే సమాజం ఆవిష్కృతమవుతుంది. ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం... ఏదైనా కావచ్చు మనకు కలిసి వస్తుంది. ఎనిమిదో తరగతితో మొదలు..: నేను దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వెళ్లినప్పుడు కేసీఆర్ ఎనిమిదో తరగతిలో ఉన్నాడు. ఓ రోజు ఉత్తర గోగ్రహణంలోని ‘భీష్మద్రోణ కృపాదిధన్వినికరాభీలంబు...’ పద్యం చెప్పా. దాన్ని మరుసటి రోజు పుస్తకం చూడకుండా అప్పగించిన వారికి నోటు పుస్తకం బహుమతిగా ఇస్తానన్నా. కానీ ఓ ఐదు సార్లు దాన్ని చదివి అప్పటికప్పుడు కే సీఆర్ అప్పగించటంతో ప్రధానోపాధ్యాయుడి చేతిమీదుగా ఆయనకు పుస్తకం బహుమతిగా ఇచ్చా. ఆ రోజే భాషపట్ల ఆ విద్యార్థికి ఉన్న అనురక్తి గుర్తించా. మా ఇంటికి పాలు తెస్తూ..: ఆయన అప్పట్లో రాఘవరెడ్డి అనే మరో ఉపాధ్యాయుడి వద్ద ఉండి చదివేవాడు. ఆయన ఉన్న ఇంటికి సమీపంలోని ఇంటివారు మాకు పాలుపోసేవారు. ఓసారి కేసీఆర్ ఆ పాలు తీసుకుని మా ఇంటికి ఉదయం ఐదున్నరకు వచ్చాడు. వచ్చేసరికి నేను గ్రంథపఠనంలో ఉన్నాను. కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా విన్నాడు. అలా రోజూ రావటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొత్త విషయాలు, కొత్త పద్యాలు నేర్చుకునేవాడు. అలా రెండేళ్లు మా సాంగత్యం కొనసాగింది. తర్వాత నేను బదిలీపై మరో గ్రామానికి వెళ్లిపోయా. కానీ కేసీఆర్ మాత్రం తెలుగు భాషపై పట్టు పెంచుకుంటూ పోయాడు. సాయంత్రం వేళ చింతమడక గ్రామానికి చేరువలో ఉండే రామసంద్రం ఊరు చెరువు గట్టుపైకి వెళ్లి సొంతంగా పద్యరచన చేసేవాడు. ప్రతి ఒక్కరికి ఉపయోగం: తెలుగులో మాట్లాడ్డమే మర్చిపోతున్న నేటి తరం భాష ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారైనా సరే, తెలుగు సాహిత్యంపై కొంత మక్కువ పెంచుకోవాలి. అది తదుపరి రోజుల్లో వారి మాట శుద్ధికి ఉపయోగపడుతుంది. అది వేరే భాషలు నేర్చుకోవటంలోనూ ఉపకరిస్తుంది. పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, పలుకుబడులు, జాతీయాలు, మన సాహితీ చరిత్రలను నేర్చుకుంటే మాటతో ముందడుగు వేస్తారు. వారి చుట్టూ జనం చేసి, వారి సాంగత్యం కోసం పరితపించే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు భాషకు ఉన్న శక్తి అలాంటిది. దానికి కేసీఆరే నిదర్శనం. – గౌరీభట్ల నరసింహమూర్తి -
అమ్మ పదమే జనపథం
తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో... ‘ఇన్నాళ్లుగా త్యాగాల గూర్చి విన్నా! చూడలేదు సర్వస్వం త్యజిస్తున్నారంటే విన్నా! చూడలేదు అన్నా! ఎండీ గోపాలపురం వెళ్లాక త్యాగమంటేమిటో తెల్సిందన్నా అన్నా అనే పదానికి అర్థం నువ్వు త్యాగానికి పర్యాయ పదం నువ్వు నీ అమరత్వం ప్రజల వారసత్వం నీ అమరత్వం విప్లవ వారసత్వం నీ త్యాగానికి సప్త సముద్రాలు నీ ఊళ్లో తాళ్ల వాగై పారుతుంటే ఆ త్యాగం నన్ను స్పందింపజేసింది...’ అంటూ మావోయిస్టు ఓరుగంటి సుదర్శన్ అమరత్వాన్ని యాది చేసుకున్నారు. ‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో/ తడిగొంతులారిపోయో తుమ్మెదాలో/ రాక రాక నల్లల్లొస్తే ఒక్క బిందే నిండదాయో/ కుండలెనుకా కుండలాయో కోసు పొడుగు లైనులాయే’ అంటూ బెల్లి లలితను గుర్తు చేశారు. ఈ అమరులను స్మరించింది సామాన్య కవైతే విశేషం లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నోటి నుంచి ఆ పలుకులు రావడంతో సభికులు చప్పట్లతో మద్దతు పలికారు. మొదటిది తాను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో రాసింది కాగా, రెండోది బెల్లి లలిత హత్యకు ముందు దుబ్బాకలో ఆమె వినిపించిన చివరి గానం అని చెప్పడంతో సభికులు నిలబడి అభినందించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోని బృహత్ కవి సమ్మేళనంలోని 8వ సమావేశంలో రామలింగారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఎగసాయం ఎక్కిరించినా ఫలసాయం గేలిచేసినా/ సేద్యాన్ని భుజానికి మూటగట్టుకొని మనిషి మనిషికి పంచుకుంటూ పోతాడో రైతు’ అంటూ సాగిన కవితతో ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం మొదలైంది. ‘మండే ఎండలు కొరికే చలి తడిపే వాన అతనికెప్పుడూ వచ్చిపోయే చుట్టాలే. వెలిగే మెరుపు జడిసే ఉరుము జోరు పిడుగు అతినిపై ప్రకృతి చేసే దండయాత్రలే’ అంటూ రైతన్న గురించి కవులు చెప్పిన కవిత్వాలకు ఆడిటోరియం దద్దరిల్లింది. ‘ద్రవిడ భాష నుంచి ద్రవింపబడి/ శాతవాహనుల కాలంలో శోధింపబడి/ పదకొండవ శతాబ్దంలో సాహిత్య శిఖరాలు అధిరోహించిన ఉద్ధండ భాష/ ఆదికవి నుండి సినారె వరకు సాహితీ సౌరభాలు వెదజల్లుతున్న విశిష్ట వైభవ భాష మన తెలుగు భాష’ అంటూ షేక్ నశీమా బేగం తెలుగు పుట్టుకను వినిపించారు. ‘మోచేతి నీళ్ళు తాగి మొక్క మొలవదు/ ఆధిపత్యం క్రింద అక్షరం మెరవదు/ ఒత్తిడి చేస్తే పక్షి ఎగరదు నదీ పారదు/’ అంటూ సమయం ఆసన్నమైనప్పుడు నిగ్గు తేల్చే వాడే కవి అని తేల్చిన చంద్రశేఖర్ కవిత్వం సభికులను ఆకట్టుకుంది. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు శతావధానం... జనసంద్రం..! ప్రపంచ తెలుగు మహాసభలల్లో భాగంగా నిర్వహిస్తున్న శతావధానం కార్యక్రమం జనసంద్రమైంది. నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం, మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికకు జనం క్యూ కట్టారు. సోమవారం సమస్యా పురాణంపై సాగిన ఈ అవధానానికి అపూర్వ స్పందన కనిపించింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా, డాక్టర్ పెరుంబుదూరు శ్రీరంగాచార్య అధ్యక్షత వహించారు. శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మ శతావధానం నిర్వహించారు. అప్రస్తు ప్రసంగంలో కూర్చున్నవారు అద్భుతమైన ప్రశ్నలు అడిగి రంజింపజేశారు. ‘రామాయణం రంకు .. భారతం బొంకు’ అంటారు.. మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని ఓ పృచ్ఛకుడు ప్రశ్నించారు. దీనికి అవధాని రామశర్మ సమా«ధానమిస్తూ.. రామాయణంలో రంకువు ప్రధానం అని, జీవితంలో తప్పని పరిస్థితిల్లో బొంకాల్సిందేనని తెలిపారు. కానీ జీవితంలో అబద్ధాలు ఆడకూడదన్నారు. పలువురు శక్తి కోసం రాత్రుళ్లు ఏవేవో పుచ్చుకొంటారు... మీరు ధారణ, ధారా కోసం రాత్రుళ్లు ఏమి పుచ్చుకుంటారని శతావధానిని మరో çపృచ్ఛకుడు ప్రశ్నించటంతో సభికులందరూ ఘోల్లున నవ్వారు. దీనికి శతావధాని రామశర్మ మాట్లాడుతూ.. తాను రాత్రుళ్లు ధారణ, ధారా కోసం శారదా పాదరసం పుచ్చుకొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పృచ్ఛకులుగా గంటి క్రిష్ణమూర్తి, దుద్దిళ్ల ఆంజనేయులు, పైడి హరినాథరావు, గుండు మధుసూదన్, ఎం.పవన్‌కుమార్, సామ లక్ష్మారెడ్డి, కంది శంకరయ్య, వడ్లూరి ఆంజనేయరాజు పాల్గొన్నారు. – కోన సుధాకర్ రెడ్డి అంతఃపురం గోడల నుంచి... ఆత్మాభిమానం గోడల వరకు కథలు చెప్పడంలో ఆద్యులు ఆడవాళ్లే. బిడ్డకు మాటలు నేర్పుతూ లోకాన్ని తెలియచేసేది తల్లే. అందుకే ప్రతి తల్లీ ఒక రచయిత్రి. తన పిల్లలతోనే సరిపుచ్చుకోకుండా సమాజానికి మంచిచెడుల విచక్షణను నేర్పించే ప్రయత్నం చేసి తన భావాలను అక్షరబద్ధం చేసిన తల్లులు మరెందరో. ప్రాచీన కవిత్వంలో మహిళలు, వచన సాహిత్యంలో మహిళలు, వచన కవిత్వంలో మహిళలు, స్త్రీల కథాసాహిత్యం అంశాలుగా తెలుగు నేలన వికసించిన కవయిత్రులను రవీంద్ర భారతి వేదికగా స్మరించుకోవడం జరిగింది. కథాఝరులు!: మొల్ల వ్యక్తీకరించిన లలితమైన భావాలలో గుహుని సన్నివేశాన్ని ముదిగంటి సుజాతారెడ్డి వర్ణించారు. ‘శ్రీరాముడు పడవలో అడుగుపెట్టబోతున్నప్పుడు గుహుడు రాముడిని ఆపి, నీ పాదం సోకితే రాతి నాతి అవుతుందట, పాదం మోపితే నా పడవ ఏమవుతుందో రామయతండ్రీ’ అంటూ రాముడి పాదాలను కడుగుతాడు. మహిళలు అలవోకగా రాయగలరు అని నిరూపించిన కవయిత్రి మొల్ల అని సుజాతారెడ్డి అన్నారు. తాళ్లపాక తిమ్మక్క, కుప్పాంబిక, కాకతీయుల కాలంలో గంగాదేవి ప్రముఖ కవయిత్రులు. గంగాదేవి కంపరాయలును పెళ్లాడి విజయనగర సామ్రాజ్యంలో స్థిరపడింది. తర్వాతి కాలంలో చెప్పుకోవాల్సిన రచయిత్రి భండారు అచ్చమాంబ. ‘ధన త్రయోదశి’తో మొదలు పెట్టి పదికి పైగా కథలను రాసింది. తొలితరం పాదముద్రలు!: రచయిత్రులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని మొదట గోల్కొండ పత్రిక చేసింది. గోల్కొండ కవుల సంచికలో పదిమంది కవయిత్రులు సాహిత్యలోకానికి పరిచయమయ్యారు. జ్ఞాన మాంబ, లక్ష్మీ నరసమ్మ, లక్ష్మీబాయి, రత్నమ్మ, ఇందుమతీబాయి, ఆండాళ్లమ్మ, లక్ష్మీదేవమ్మ వాళ్లలో కొందరు. ఒకరు అంతఃపురం గోడల మాటున దాగిన కన్నీళ్లను బయటకు తెచ్చారు. తండ్రిపోయిన దుఃఖంలో ఆ ఆవేదనను స్మృతిపద్యాల రూపంలో వెలిబుచ్చిన వారొకరు. దేశభక్తి రచనలు, స్త్రీవిద్య ఆవశ్యకతను తెలియచేసే కథలు రాసిన వారొకరు. ఇలా సమాజంలో మహిళకు ఎదురయ్యే ప్రతి కోణాన్నీ తమ రచనలలో స్పృశించారు నాటి కథయి త్రులు. కథారచయిత్రి అనే పదాన్ని మరింతగా సరళీకరించి ‘కథయిత్రి’ అనే ప్రయోగం చేసిన సినారెను గుర్తు చేసుకుంటూ అదే పదాన్ని కొనసాగిద్దామని గుర్తు చేశారు కొండపల్లి నీహారిణి. మహిళలం మహిళలం... మనం రాణిరుద్రమ వారసులం అంటూ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో సభల్లో పాల్గొన్న కథయిత్రులు తమకు బాటలు వేసిన మాదిరెడ్డి సులోచన, బొమ్ము హేమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, వీణారెడ్డి, సుందరీబాయి, సుమిత్రాబా యిలను గుర్తు చేసుకున్నారు. మహిళలు కార్టూన్లు వేయగలరని నిరూపించిన తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవిని ప్రత్యేకంగా అభినందించారు. ఆధునిక సాహిత్యంలో సొన్నాయిల కృష్ణవేణి ఆత్మాభిమానాన్ని కానుకిస్తావా అంటూ ఇంట్లో టాయిలెట్ కట్టమని కోరడం, అయ్యయ్యో దమ్మక్క అంటూ జూపాక సుభద్ర మహిళల స్థితిగతులను కళ్లకు కట్టడం వంటివన్నీ వక్తలు ప్రస్తావించారు. – వాకా మంజులారెడ్డి పత్రికలూ పూనుకోవాలి ప్రజలు తమ దైనందిన జీవితంలో వినియోగించే వాడుకభాషలోని పదజాలంతో ఓ ప్రామాణికమైన పదకోశం రూపొందించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సమర్థ్ధవంతమైన వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్ర భారతిలోని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ ప్రాంగణం, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై ‘పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో తెలుగు’ అంశంపై సదస్సు జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాస్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు సుమనస్పతి, ఉడయవర్లు, వనం జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కేశవరావు మాట్లాడుతూ.. తెలుగు దినపత్రికల్లో భిన్న రకాలుగా తెలుగు కనిపిస్తోందన్నారు. ప్రతి 70 కిలోమీటర్లకు భాష, యాసల్లో తేడాలుంటాయని, వీటిని పత్రికల్లో రాయడం సాధ్యం కాదన్నారు. పత్రికలన్నీ ఓ ప్రామాణికమైన పదకోశాన్ని అనుసరించడం మంచిదని పేర్కొన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికీ కోస్తాంధ్ర జిల్లాల తెలుగే పత్రికల్లో కనిపిస్తోందని, దాని నుంచి బయటికి రావలసిన అవసరముందని అన్నారు. పత్రికలకు అనువైన పదకోశాన్ని ప్రెస్ అకాడమీ రూపొందిస్తుందని చెప్పారు. వాడుక భాష వినియోగానికి ఒక వ్యవస్థ అవసరమని వరదాచారి చెప్పారు. అన్ని దినపత్రికలు గ్రామీణ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలను సేకరించి పదకోశాలను రూపొందించుకోవాలని పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. గ్రామీణ విలేకరులు స్థానిక భాషల్లోనే రాసేవిధంగా ప్రోత్సహించాలని చెప్పారు. 12వ తరగతి వరకు తెలుగును అమలు చేసినంత మాత్రాన భాష అభివృద్ధి చెందబోదని, శాస్త్ర విజ్ఞాన అంశాల్లోనూ తెలుగు అమలు కావాలని కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. పత్రికల వల్లే తెలుగు బతికి బట్టకడుతోందన్నారు. తెలుగు సమర్థంగా అమలు చేసేందుకు ఒక వ్యవస్థ అవసరమని చెప్పారు. భాషకు హద్దులు ఉండకూడదని, అందరికీ అర్థ్ధమవుతుందా? లేదా? అనేదే ప్రామాణికమని వనం జ్వాలా నరసింహారావు అన్నారు. సమావేశంలో పలువురు సీనియర్ పాత్రికేలు, తెలుగు భాషాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. – ఆంజనేయులు మన సాహితీ పూదోట సుద్దాల అశోక్‌తేజ పదకవితా ఝరిలో శతక, సంకీర్తనా, గేయ సాహిత్య సభ తడిసి మురిసింది. సినారె, దాశరథి మొదలు శ్రీశ్రీ, గద్దర్, గోరటి, గూడ అంజయ్య సినీగీత ప్రవాహంలో సాహితీ అభిమానులు ఓలలాడారు. సోమవారం సారస్వత పరిషత్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల మాట్లాడుతూ.. తేటతెలుగు మకరందానికి పూచిన సినీ సాహిత్యాన్ని ఉత్తమ సాహిత్యం కాదన్న భావం సరికాదన్నారు. సినీగేయాల్ని కావ్యస్థాయిలో నిలిపిన కవితలెన్నో తెలుగు వారి హృదయాన్ని తట్టిలేపేయన్నారు. కోటిరతనాల వీణ నా తెలంగాణ అన్న దాశరథి సినీ గీతాల్లో మీటిన వీణలెన్నో పట్టి చూపారు. సహజంగా 16 వాక్యాలను మించకుండా ఉండాల్సిన సినిమా పాట నియమాన్ని అనుసరించి పాటను మధ్యలోనే తుంచినా అర్థం చెడని నేర్పు మన దాశరథిదన్నారు. అందుకే ‘‘గోదారీ గట్టుందీ.. గట్టుమీనా చెట్టుంది.. వెన్నెల వుందీ–ఎండ వుందీ.. ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది వుంది’’ అంటూ వదిలేసారట. సినారె వెనుక నా పేరుండాలన్న చిరకాల కోరిక ‘ఒసే రాములమ్మ’తో తీరిందన్నారు. దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టాలన్న ఎన్టీఆర్‌తో ‘చిత్రంగా ఉంటుంది’ అని సమాధానమిచ్చిన సినారే అదే పదంతో ప్రారంభించి ‘చిత్రం...భళారే విచిత్రం...’ అంటూ డ్యూయెట్ రాసేసారని సుద్దాల గుర్తుచేశారు. చంద్రబోస్ ‘నేనున్నాననీ’, ‘చీకటితో వెలుగే చెప్పెను’ లాంటి పదప్రయోగాలు సినీగేయాల స్థానాన్ని ఉన్నతికి చేర్చాయన్నారు. గద్దర్ ‘మసక చీకటి వెన్నెలవోలె’ పాటలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ వ్యక్తీకరణ మానవ సంబంధాల్లోని ప్రతికోణాన్నీ పట్టిచూపిందన్నారు. గూడ అంజయ్య ‘భద్రం కొడుకో’ పాటలో ‘రిక్షా ఎక్కే కాడ, దిగేకాడ’ పాట బడుగు జీవితాల బతుకువెతల్ని ప్రతిబింబించిందన్నారు. గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట రాబోయే పాతికేళ్లలో కూడా గొప్ప పాటగా నిలిచిపోతుందని చెప్పారు. అందెశ్రీ రాసిన ‘కొయ్య చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా..’ పాట అజరామరమైనదన్నారు. గేయ రచయితలను పేర్కొంటూ తెలంగాణ గడ్డ ఘనతని పాటలు పాడి వినిపించడంతో సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. – అత్తలూరి అరుణ తీర్పులు తెలుగులో రావాలి సమాజంలో ప్రతి మనిషి మనుగడతో ముడిపడిన ఉన్న న్యాయస్థానాలు, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో తెలుగును సమర్థంగా అమలు చేయాలని, అప్పుడే ప్రజలకు న్యాయం దక్కుతుందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతిలోని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై నిర్వహించిన ‘న్యాయ, పరిపాలన రంగాల్లో తెలుగు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కింది కోర్టుల్లో మాతృభాషల్లోనే తీర్పులు వెలువడుతున్నాయి. ఉత్తరాదిలోని హిందీ వినియోగంలో ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంగ్లిష్‌లో తీర్పులు ఇస్తున్నారు’’ అని అన్నారు. బాధితుల సమస్యలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసే క్రమంలో దొర్లే తప్పుల వల్ల దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1930ల్లోనే సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాస¿¶ ల్లో ప్రజల వాడుక భాష అమలు కోసం తీర్మానం చేశారని గుర్తుచేశారు. న్యాయార్థి ఏ భాషకు చెందిన వాడైతే ఆ భాషలో తీర్పు రావడం సమంజసమన్నారు. పాలనా వ్యవస్థలోనూ జీవోలు, ఉత్తర్వులు సైతం తెలుగులో వెలువడేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో తెలుగు అమలు కోసం నిఘంటువులు, న్యాయమూర్తులకు అవగాహన కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రష్యా, జపాన్, ఫ్రెంచ్, జర్మనీ వంటి దేశాల్లో మాతృభాషలోనే అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయని, అదే తరహాలో మన వ్యవస్థలు కూడా తెలుగులో పని చేసినప్పుడే పేదవాళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రయ్య మాట్లాడుతూ.. తెలుగులో న్యాయగ్రంథాల ముద్రణ అవసరమన్నారు. తెలుగు న్యాయ పదకోశాలను రూపొందించాలని కోరారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. స్థానిక, మండల స్థాయిలో తెలుగు బాగానే అమలవుతోందని, కలెక్టరేట్, సచివాలయం స్థాయిలోనే అమలుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తులు మంగారి రాజేందర్, పీఎస్ నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. – పగిడిపాల ఆంజనేయులు మన విమర్శకు 200 ఏళ్లు పాశ్చాత్య దేశాలతో సమంగా, అదే స్థాయిలో ఉన్న విమర్శకులకు తెలుగులో కొదువలేదని తెలంగాణ విమర్శ–పరిశోధన సదస్సు ఎలుగెత్తి చాటింది. 200 సంవత్సరాల క్రితమే తెలుగు సాహిత్య విమర్శలో తెలంగాణ తనదైన స్థానాన్ని నిలుపుకుందని స్పష్టంచేసింది. మన సాహితీ విమర్శ ప్రాచీనమైనదనడానికి 1829లో కావలి రామస్వామి, వెంకటస్వామి సోదరులు తెలుగు కవులపై రాసిన తొలి పుస్తకాన్ని ఆధారంగా చూపారు. సోమవారం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అథిగా హాజరయ్యారు. 1899లో తెన్నేటి రామచందర్‌రావు మనుచరిత్ర–వసు చరిత్రలపై తులనాత్మక గ్రంథం రాశారంటూ రాచపాలం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెన్నేటి గ్రంథంలో ‘లోకములో కావి విమర్శనము బహునిష్టుర పని’ అన్న వాక్యం ఆనాటి నుంచే విమర్శ ఉనికిని చాటుతోందన్నారు. డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ప్రాచీన సాహితీ విమర్శలో ‘భక్తిరసం’ ప్రస్తావన తెచ్చింది పాల్కురికి. మధురభక్తి అనేది శైవంలో లేదనీ, వైష్ణవంలో ఉందనీ ఆ గ్రంథం చెబుతోంది. 1950–60 ల తర్వాత తెలుగు సాహిత్యాన్ని మొత్తం విమర్శకులే నడిపించారు’ అని అన్నారు. తెలంగాణలో విమర్శ–పరిశోధన రెండు జమిలీగా నడిచాయన్నారు. తెలుగులో కావ్యాల విమర్శ వెలువడుతున్న కాలంలోనే 1940 కన్నా ముందే సంస్కృతం, ఉర్దూ, తెలుగు మూడు భాషలకు సంబంధించిన విమర్శ తెలంగాణలో ఉదయించిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు ఖండవల్లి లక్ష్మీరంగరంజనం పునాదులు వేశారని బాలశ్రీనివాస్ అన్నారు. అనుభూతి ప్రధానమైన వ్యాసాన్ని సృజన అనీ, ఆలోచన ప్రధానమైన దాన్ని విమర్శనాత్మకమనీ, రెండూ ఉండేదే ఉత్తమమైన వ్యాసమనీ ఆచార్య తంగెడ కిషన్‌రావు అన్నారు. – అత్తలూరి అరుణ ఇలా చేద్దాం...! సాహిత్యం భాషలో ఓ భాగమే తప్ప సర్వస్వం కాదు. కానీ, భాష ఉద్దేశించిన లక్ష్యాల సాధనలో, భాష మలుబడిలో, మనుగడలో సాహిత్యానిదే కీలకపాత్ర. వేర్వేరు కాలాల ప్రజాజీవితాన్ని చరిత్రగా పలు రూపాల్లో నిక్షిప్తం చేస్తుంది. భాష ఉన్నతిని తూకం వేసేటప్పుడు అందులోని సాహిత్యం స్థాయిని పరిశీలిస్తారు. సమాజంలో సాహిత్యం చేరిన స్థితి, లభించే ఆదరణ, నిర్వహించే పాత్రను బట్టి ఆ భాష విజయాల్ని లెక్కగడతారు. ఆ సాహిత్య ప్రక్రియలెన్నెన్నో! తెలుగు సమృద్ధ సాహితీ సంపద కలిగిన భాషగా ఇదివరకెన్నోమార్లు ధ్రువపడింది. అది ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ రుజువవుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు వేడుకలు జరుగుతున్న ఆరు వేదికల వద్ద జనం కిటకిటలాడటమే ఆదరణకు నిదర్శనం! మరి తెలుగు భాషకు పట్టిన నేటి దుర్గతికి కారణం ఏంటి?.. పరిపాలన, న్యాయపాలనలో తెలుగు లేకపోవడం, నిర్బంధ బోధనాభాష చేయకపోవడం, ఇంగ్లిషుతో పోల్చి తెలుగును చిన్నచూపు చూడటం... ఇటువంటివే కారణాలు. పెట్టుబడుల విషయంలో చైనా ‘నమూనా’ స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం.. తల్లిభాషాభిమానం విషయంలోనూ చైనానే ప్రస్తావించి ఉంటే బాగుండేది! భాష విషయంలో చైనా విజయాలు అలా ఉన్నాయి. విశ్వాన్ని తొంగి చూడ్డానికి ఇంగ్లి్లషు కిటికీ లాంటిదంటారు. చైనాలో అత్యధికులకు ఇంగ్లిషే రాదు. కానీ, వచ్చిన కొంత మంది అత్యంత నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త పదాలు, ఆవిష్కరణలు, జీవనశైలి, సూత్రీకరణలు, సర్వస్వాన్ని వ్యవధి లేకుండా చైనా భాషలోకి మార్చేస్తారు. అట్టడుగు స్థాయి వరకు ఆ విషయాలు చైనా భాషలోనే వెళతాయి. అందుకే ఇంగ్లిషు వాసన లేకుండానే ప్రతి విషయంలోనూ మరే ఇతర అభివృద్ధి చెందిన దేశాలకి తీసిపోకుండా చైనా ప్రగతిపథంలో సాగుతోంది. మనం అందుకు పూర్తి భిన్నం. తెలుగువారిలో ఎక్కువ మందికి తెలుగు వచ్చు. కానీ, రాదు! చదువుకున్న చాలా మందికి ఇంగ్లి్లషు వచ్చు, కానీ రాదు! ఎందులోనూ సంపూర్ణత్వం, సమగ్రత లేదు. మహాసభల ముగింపు రోజైన మంగళవారం భాష విషయంలో కీలకమైన విధాన నిర్ణయాలుం టాయని ముఖ్యమంత్రే ప్రకటించారు. ఆ నిర్ణయాల్ని బట్టి ప్రభుత్వం, విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, సాహితీ సంఘాలు, పౌరసమాజం ఎవరి స్థాయిలో వారు ఏకకాలంలో జరిపే ఉమ్మడి కృషిపైనే తెలుగు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. – దిలీప్‌రెడ్డి ఏ దేశమేగినా.. తెలుగు లెస్స! ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న గురజాడ అప్పారావు పంచిన భాషాభిమానం వారి నరనరాన జీర్ణించుకుపోయింది. తల్లి పంచే ప్రేమాప్యాయతలను అమ్మ భాషలో చవిచూస్తూ తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. పరభాష మోజులో కనుమరుగైపోతున్న అమ్మ భాషలోని కమ్మదనాన్ని పరాయి దేశంలోనూ ఆస్వాదిస్తున్నారు. తెలుగును విశ్వవిఖ్యాతం చేసేందుకు కంకణబద్ధులయ్యారు. తల్లిభాషపై పెనవేసుకున్న ప్రేమానుబంధం ప్రపంచ తెలుగు మహాసభలవైపు నడిపించింది. ఇప్పటివరకు సాంçస్కృతిక కార్యక్రమాలకే పరిమితమైన ఆయా దేశాల్లోని తెలుగు సంఘాలు... ఇక మీదట తెలుగు పరిరక్షణకు బాస చేశాయి. పుట్టిన బిడ్డ నుంచి భవిష్యత్తు తరాలకు తేనెలొలికే తెలుగు సెలయేటి ప్రవాహంలా సాగిపోయేలా నిర్ణయాలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావడం గర్వంగా ఉందంటున్న ఆ ఎన్నారైలు.. ఈ సభల ద్వారా ఎందరో సాహితీవేత్తలు, కవులు, అష్టావధానుల మేధస్సును వీక్షించి తరించారు. మహాసభలు పంచిన అనుభూతులను ఆయా దేశాలకు మోసుకెళ్లి తోటి తెలుగు వారితో పంచుకోనున్నామని స్పష్టం చేశారు. 42 దేశాల నుంచి 450 మంది తెలుగు ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. నెల రోజులుగా ఆయా దేశాల ప్రతినిధులను కలసి ప్రపంచ మహాసభలకు ఆహ్వానించేందుకు 13 సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం ఇచ్చిన విందులో హాజరైన ఎన్నారైలు రవీంద్రభారతిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. 20న గజ్వేల్‌లోని వాటర్‌గ్రిడ్, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అందించిన మరపురాని జ్ఞాపకాలను వారు ‘సాక్షి’తో పంచుకున్నారు. అ..ఆ..ఇ..ఈ ∙అమ్మభాషకు పట్టం.. నాలుగో రోజూ అదే ఉత్సాహం ∙ఆకట్టుకున్న ‘తెలంగాణ పాట జీవితం’ ఏడెనిమిది దశాబ్దాల క్రితం.. తెలుగులో మాట్లాడ్డం ఓ పెద్ద నేరం. చదువుకుందామంటే తెలుగు బడులు లేవు. ఉర్దూలో చదివితేనే చదివినట్టు. ప్రపంచానికి అద్భుత సాహితీ ప్రక్రియలను అందించిన విశ్వ భాషల్లో ఎన్నదగిన తెలుగు భాషపై నిజాం ప్రభుత్వ నిరంకుశత్వం రాజ్యమేలింది. ఎక్కడ అణచివేతకు గురైందో ఇప్పుడు అదే నేలపై ఆ భాష రొమ్ము విరుచుకుని తన విశ్వరూపాన్ని చూపుతోంది. పూర్వ వైభవం సంతరించుకుని మరింత విలసిల్లేందుకు బాటలు పరుచుకుంటోంది. దీనికి శ్రీకారం చుడుతూ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో అ..ఆ... ఇ...ఈ..లు మార్మోగుతున్నాయి. అమ్మ భాషకు పట్టం కట్టేందుకు ప్రపంచం నలుచెరుగుల నుంచి వచ్చిన భాషాభిమానుల కవాతుతో సభల నాలుగోరోజు ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక పాల్కురికి సోమన ప్రాంగణం ప్రతిధ్వనించింది. సోమవారం జరిగిన సాహిత్య సభలో ‘తెలంగాణ పాట జీవితం’ ఆకట్టుకుంది. ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ అధ్యక్షత జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్, గౌరవ అతిథిగా విఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, వక్తలుగా తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి బాలకిషన్, కవి జయరాజు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. చలనచిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక పూర్తిగా నిండిపోయింది. గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని, సినీ నటులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ, దర్శకులు రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, సుమన్, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, శివాజీ రాజా, రాజేంద్రప్రసాద్, అలనాటి నటి జమున, విజయనిర్మల, జయసుధ.. ఇలా పెద్ద సంఖ్యలో నటులు దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సినారె గీతాలతోపాటు ఇతర పాటలతో సినీ సంగీత విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో ఎవరేమన్నారంటే.. పాట.. తెలంగాణ బతుకు: తెలంగాణ నేలపై అద్భుతంగా విలసిల్లిన తెలుగు సాహితీ వైభవంలో పాట ఓ భాగమైంది. తెలంగాణ బతుకు పాటతో ముడిపyì ఉంది. మన జీవనసారం ఆ పాటనే. – సుద్దాల అశోక్‌తేజ ఈ నేల తల్లి భాషను కాపాడుకుంది: తెలుగు మాట్లాడ్డమే తప్పు అన్నంత అణచివేతను ఎదుర్కొన్న తెలంగాణ నేల అమ్మ భాషను కాపాడుకుంది. ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నం చేసేలా ఈ మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాటతో నా ప్రయాణం మొదలుపెట్టాను. నేను పాటగాన్ని, తెలంగాణ వాడిని – సిరివెన్నెల సీతారామశాస్త్రి మన తెలంగాణము తెలుగు మాగాణము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషమూ.. తెలుగు సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియలు పురుడుపోసుకున్నది ఈ అద్భుత నేలపైనే. ఇందులో పాటకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. – దేశపతి శ్రీనివాస్ అమ్మభాష మాధుర్యాన్ని మరిచిపోలేం.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అమ్మభాష మాధుర్యాన్ని మరిచిపోలేం. ఏ దేశంలో ఉన్నా అందరినీ ఏకం చేసేది సంస్కృతీ సంప్రదాయాలే. వాటికి మూలం భాష. భాషను కాపాడుకోవడం అంటే తల్లిని కాపాడుకున్నట్లే. విదేశాల్లో పుట్టి పెరుగుతున్న తెలంగాణ భావిపౌరులకు తెలుగులోని కమ్మదనాన్ని అందించేందుకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ తరఫున ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన చేస్తాం. – కల్యాణ్, అధ్యక్షుడు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్. తెలుగు ఔన్నత్యాన్ని చాటుతాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా నిర్వహించిన తెలుగు మహాసభలకు హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడికి వచ్చాక తెలుగు గొప్పతనం మరింత స్ఫురణకు వచ్చింది. మేం నివసిస్తున్న దేశాల్లో తెలుగు భాషపై సదస్సులు కొనసాగించి అమ్మ భాషను బతికించు కుంటాం. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించే పుస్తకాలను ఆయా దేశాల్లోని తెలుగువారికి పంపిణీ అయ్యేలా చేస్తాం. కాలిఫోర్నియాలో చాలా పాఠశాలల్లో తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ విధానం అన్నిచోట్ల వచ్చేలా చూస్తాం. తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటుతాం. – మహేశ్ బిగాల, ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కో–ఆర్డినేటర్ అమ్మని విస్మరించడమే.. 16 ఏళ్ల నుంచి బెహ్రాన్‌లో ఉంటున్నా. అక్కడ 40,000 మంది తెలుగు వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వారంతా తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకుసాగుతున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళిలను జరుపుకో వడంతో పాటు తెలుగు భాషాభిమానాన్ని చాటుతున్నారు. బెహ్రాన్లోని ఇండియన్ స్కూల్లో తెలుగును కూడా చేర్చారు. దీని ద్వారా నేటితరం పిల్లలకు తెలుగును నేర్పిస్తున్నాం. పరాయి దేశం వెళ్లిపోయాం కదా... అమ్మభాషను మరవడమంటే తల్లిని విస్మరించడమే అవుతుంది. తెలుగు మహాసభల స్ఫూర్తిగా తెలుగు గొప్పతనాన్ని చాటేలా కార్యక్రమాలు చేపడతాం. – రాధారపు సతీశ్‌కుమార్, ఎన్నారై టీఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు, బెహ్రాన్ పండుగలా ఉంది.. తెలుగు మహాసభలను చూస్తుంటే ఒక పండుగలా ఉంది. తెలుగు కుటుంబంలో ఒక్కడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. అమెరికాలోని హోస్టన్‌లో 2016లో ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించాం. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మహాసభలకు హాజరుకావడం మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను అమెరికాలో అమలు చేస్తాం. వచ్చే జూన్ 29 నుంచి మే 1 వరకు ద్వితీయ ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వíß స్తున్నాం. అన్ని దేశాల తెలుగు ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. పుట్టిన గడ్డ రుణం కొంతైనా తీర్చుకునేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. – వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఓవర్సీస్ కన్వీనర్ నిర్వహణ అద్భుతం.. తెలుగు మహాసభల నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నారైలకు అందించిన ఆతిథ్యం మరువలేనిది. పుట్టిన బిడ్డకు కూడా తెలుగు భాష కమ్మదనాన్ని రుచి చూపించాలి. అది ఇక్కడైనా, విదేశాల్లోనైనా. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ఇంగ్లి్లష్ మీడియం స్కూల్లో కాకుండా తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. థాయ్‌లాండ్‌లో దాదాపు 500 మంది తెలుగు వారు ఉంటారు. మేమంతా పండుగ సమయాల్లో కలుసుకుని తెలుగు çపండుగలను జరుపుకుంటాం. వాటికి మూలమైన అమ్మ భాష పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తాం. – రమేశ్ మావిళ్ల, కల్చరల్ సెక్రటరీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ తెలుగును అందలమెక్కిస్తాయి.. తెలుగు మహాసభలను ఇప్పటి వరకు చూడలేదు. అష్టావధానం, కవి సమ్మేళనం, సాహితీవేత్తల మేధస్సును చూస్తుంటే తెలుగు గొప్పతనం తెలిసింది. కాళోజీ, దాశరథి వంటి గొప్ప కవుల గురించి విన్నాం. వారే కాకుండా 400 మంది కవుల సాహిత్యం ఈ వేదిక ద్వారా బయటకు రావడం ఎంతో స్ఫూర్తిదాయ కం. ఇలాంటి మహా సభలు తెలుగును అందలమెక్కిస్తాయి. యూరోప్ దేశాల్లోని తెలుగు వారిని కలసి తెలుగు వెలుగులను చాటే కార్యక్రమాలు చేపడతాం. ఆయా దేశాల్లోని వర్సిటీల్లో తెలుగు సబ్జెక్టుకు అవ కాశం కల్పించేలా కృషి చేస్తాం. – సంపత్, అధ్యక్షుడు, తెలంగాణ జాగృతి యూరోప్ -
రేపు నగరానికి రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 19న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాజభవన్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 20 వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి నివాళులర్పించి ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 35 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు, హోం గార్డులు, ఆరు ప్లాటూన్ల సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటారు. -
మా గొంతు ఇక్కడా వినరా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన కవయిత్రుల ఆవేదన ఇది. కవి సమ్మేళనం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అని నిర్వహకులు చెప్పారు. అక్కడికి వెళ్తే ‘ఇది మగవాళ్లకు మాత్రమే’నన్నారు అక్కడివారు. ‘మరి మాకు వేదిక ఎక్కడ’ అంటే రవీంద్రభారతికి వెళ్లమన్నారు. అక్కడ ‘బాల కవి సమ్మేళనం జరుగుతోంది, మరొక వేదిక మీద అష్టావధానం, మా ఏర్పాట్లలో మీకు వేదిక లేదు’ అన్నారు. ఇది తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం నాటి పరిస్థితి. మహబూబ్‌నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పలత, తెలుగు ఉపాధ్యాయిని జీవనజ్యోతి, అంబుజ, మరో ముగ్గురు రచయిత్రులకు ఎదురైన చేదు అనుభవం ఇది. ‘ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి రవీంద్రభారతికి వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకే అవకాశమన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే నిన్నటితోనే ముగిసిందంటున్నారు. ఇక్కడ పడిగాపులు కాస్తూ నిర్వహకులను అడగ్గా అడగ్గా ‘రేపు రెండు గంటల సమయమిస్తాం, ఆ టైమ్‌లోనే ఎంతమంది రచయిత్రులు ఉంటే అందరూ మీ పద్యాలను చదువుకోవచ్చు’ అంటున్నారు. రెండు వందల మంది రచయిత్రులం ఉన్నాం. రెండు గంటల టైమంటే ఒక్కొక్కరికి ఒక్క నిమిషం కూడా ఇవ్వరా? మేము అర నిమిషంలో ముగించాలా? మగవాళ్లకైతే ఏకంగా నాలుగు రోజులు.. రోజుకు ఏడు గంటలా..! మహిళలమని ఇంత వివక్షా! అయినా పద్యానికి, పద్యం రాసిన వాళ్లను కూడా మగ, ఆడ అని వర్గీకరిస్తారా? ప్రపంచ తెలుగు మహాసభలు మగవాళ్లకేనా?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు జీవనజ్యోతి. ఆమె మాటల్లో ఆవేశం వెనుక ఉన్న ఆవేదనలో అర్థముంది. ఆమెది ఆగ్రహం ధర్మాగ్రహమే. సభల నిర్వాహకులూ మీరేమంటారు..! -
ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానిం చలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు. -
అభివృద్ధి రాయబారులు కండి!
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని తెలంగాణ ఎన్నారైలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీఎం ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో విందు ఇచ్చారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని వారికి వివరించారు. ‘‘చైనాలో సంస్కరణలు మొదలయ్యాక.. వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట తమ స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.. దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారు. తెలంగాణ ఎన్నారైలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి...’’అని కేసీఆర్ కోరారు. పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ అస్తిత్వాన్నే ఎవరూ గుర్తించలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సమైక్య రాష్ట్రానికి 70 శాతం ఆదాయం తెలంగాణ నుంచే వచ్చేది. కానీ 10–15 శాతం కూడా ఈ ప్రాంతం కోసం ఖర్చు చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్థికవేత్త హనుమంతరావు వంటివారు 1956 నుంచి లెక్కలు తీసి దీనిని నిరూపించారు. నీటి వాటాలో, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది. భాష, సంస్కృతిపై దాడి జరిగింది. సినిమాల్లో తెలంగాణ వారిని జోకర్లుగా చూపెట్టేవారు. అలాంటి స్థితి నుంచి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం..’’అని వివరించారు. చిమ్మ చీకట్లు అలుముకున్న స్థితి నుంచి కోతల్లేని 24 గంటల విద్యుత్ అందించే స్థాయికి వచ్చామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయాలన్నీ ప్రపంచానికి చెప్పి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఎన్నారైలను కోరారు. సమావేశంలో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎన్నారైల కో–ఆర్డినేటర్ మహేశ్ బిగాల తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో దూసుకు పోతున్నాం.. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో.. ఇప్పుడు అదే విధంగా దూసుకుపోతోందని, 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ చెప్పారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు. భారీగా ప్రాజెక్టులు చేపట్టామని, రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎన్నారైలకు వివరించారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ చాలా బాగుందని, మంచి వాతావరణం ఉందని చెప్పారు. అవినీతికి ఆస్కారమివ్వని, 15 రోజుల్లోనే అనుమతులిచ్చే పారిశ్రామిక విధానం అమలవుతోందని తెలిపారు. ఈ విషయాలను ప్రపంచవ్యాప్తంగా వివరించి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కృషి చేయాలని.. తెలంగాణ బిడ్డలుగా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరారు. -
తెలుగు పరిమళాల గుబాళింపు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడో రోజు ఆదివారం భాషాభిమానులు పోటెత్తారు. కార్యక్రమాలు జరుగుతున్న అన్ని వేదికల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, అభిమానులు పాలుపంచుకున్నారు. సారస్వత పరిషత్తులో జరిగిన అవధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భాషాభిమానుల్లో ఉత్సాహం నింపారు. తెలుగు విశ్వవిద్యాలయంలో కవితా సదస్సు, నవలా సాహిత్య సదస్సు, కథా సదస్సు, తెలంగాణ నవలా సాహిత్యం, ఎల్బీ స్టేడియంలో సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవిసమ్మేళనం, రవీంద్ర భారతిలో బాలకవి సమ్మేళనం, అష్టావధానం, గణితావధానం, నేత్రావధానం, ప్రతాపరుద్రుని విజయం నృత్యరూపక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా అక్షరగణితావధానం అక్షర గణితావధాని పుల్లూరు ప్రభాకర్ ఏ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. వాక్యంలో ఎన్ని అక్షరాలున్నాయి. తెలుగులో అయితే ఎన్ని.. హిందీ, ఇంగ్లిష్‌లో అయితే ఎన్ని అక్షరాల్లో ఉంటాయనేది ఇట్టే చెప్పేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న కథలు తెలుగు విశ్వవిద్యాలయంలోని సామల సదాశివ వేదికమీద వక్తల ఉపన్యాసాల్లో ‘కథలల్లిన కథకుల కథలు’తెలుగు భాషాభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి, అధ్యక్షత వహించిన బీఎస్ రాములు తెలంగాణ కథల నేప«థ్యానికున్న వైవిధ్యాన్ని, వాటితో ఇక్కడి ప్రజలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక్క నిమిషం కవితలు.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో కవులు ఒక నిమిషం నిడివి కవితలతో సభికులను మెప్పించారు. సమావేశంలో 25 మంది చొప్పు న కవులకు అవకాశం కల్పించారు. మంత్రి పోచారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఔరా అనిపించిన నేత్రావధానం ప్రేక్షకుల్లోని కొంతమంది ఏదైనా రాసి ఇస్తే.. ఒక అవధాని దానిని కేవలం కంటి రెప్పల కదలిక ద్వారా చూపగా, మరో అవ ధాని అర్థం చేసుకుని తిరిగి రాసి చూపించి న నేత్రావధానం విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు రాసి ఇచ్చిన కాగితాలను గురు వు, సమన్వయకర్త ఆదినారాయణ తీసుకుని.. ఒక అవధాని కె.శిరీషకు అందజేశారు. ఆమె ఆ కాగితంలోని అక్షరాలను తన కనురెప్పల కదలికలతో.. ఎదురుగా ఉన్న రెండో అవధాని ఎస్వీ శిరీషకు చూపా రు. రెండో అవధాని ఆ కనురెప్పల కదలికలను బట్టి.. అక్షరాలను కాగితంపై రాసి, వినిపించారు. తెలుగు పదాలే కాకుం డా, ఇంగ్లిష్, హిందీ పదాలనూ నేత్రావధానం ద్వారా గుర్తించడం సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక బొటనవేలితో చేసే ‘అంగుష్టావధానం’ ప్రక్రియలో భాగంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అనే పదానికి అక్షరరూపం ఇచ్చారు. అలరించిన బాలకవి సమ్మేళనం డాక్టర్ సునీతా రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది. ఎనభై మందికిపైగా బాల కవులు ఇందులో పాల్గొన్నారు. చక్కటి తెలుగులో గేయాలను ఆలపించారు. సమ్మక్క సారక్క, రామప్ప గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక అంశాలను పాటలతో కళ్లకు కట్టారు. శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం నవాబులు, వేమన, పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డిల నుంచి ఆధునిక కవి వరేణ్యులు జయశంకర్ వరకు తెలుగు సాహిత్యకారులను తలుచుకున్నారు. -
అట జని కాంచె భూమిసురుడు..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాషపై, సాహిత్యంపై ఎంతో మక్కువ ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలతో అలరించారు. తాను 40 ఏళ్ల కింద చదువుకున్న సాహిత్యం ఇప్పటికీ గుర్తు ఉందని చెబుతూ.. రెండు పద్యాలను శ్రావ్యంగా ఆలపించి ఆకట్టుకున్నారు. అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రములోని పద్యం... ‘అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత జాలము శీతశైలమున్’ నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణంలోని పద్యం... నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుగిన్క బూనీ దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా! .. కేసీఆర్ ఈ రెండు పద్యాలను ఆలపించడంతో సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధాని గౌరీభట్ల మెట్టు రామశర్మ ఆధ్వర్యంలో జరిగిన శతావధానం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో వర్ణించారు. తర్వాత కేసీఆర్ రామశర్మను శాలువాతో సత్కరించి.. ప్రసంగించారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచి పోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నా యని, ఈ సభలతో సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. సాహిత్య సమావేశా లకు అద్భుత స్పందన వస్తుంటే గుండెల నిండా సంతోషంగా ఉందన్నారు. రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సారస్వత పరి షత్తు వేదికల వద్ద చోటు సరిపోనంతగా సాహితీప్రియులు హాజరుకావడం సంతోషం గా ఉందని చెప్పారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించే లా తీర్మానాలు ప్రకటిస్తామని చెప్పారు. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యా నికి పూర్వ వైభవం వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కవి సమ్మేళనాలు, చర్చలు ఆసక్తి కరంగా సాగుతున్నాయని.. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం వంటివి బాగున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్య కాలం లో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని చెప్పారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని.. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని తెలిపారు. తెలంగాణలో రస స్ఫూర్తికి కొదవ లేదని వ్యాఖ్యానించారు. అందరికీ తెలుగు నేర్పండి.. తెలుగువారందరికీ తెలుగు నేర్పాలని కేసీఆర్ ఉపాధ్యాయులకు విన్నవించారు. మహాసభల నిర్వహణ కోసం జరిపిన చర్చల్లో.. ‘మమ్మీ.. డాడీ అనే రోజుల్లో పద్యాలు, కవిత్వాలు వింటారా..’ అంటూ తనకు, నందిని సిధారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని వేదికలు కిటకిటలాడు తున్నాయని.. ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తిగా విజయవంతమైనట్లుగా అనిపిస్తోంద ని కేసీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. గురువులే దారి చూపారు.. తాను డాక్టర్‌గానీ, ఇంజనీర్గానీ కావాలని తన తండ్రి కోరుకునే వారని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ దారి మళ్లిన తనను గురువుగారు తిరిగి దారికి మళ్లించారని.. సాహితీ కవాటాలు తెరిచి సాహిత్యం వైపు తీసుకెళ్లారని తెలిపారు. ఒకప్పుడు తనకు మూడు వేల తెలుగు పద్యాలు కంఠస్థం వచ్చేవని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే రోజుల్లో గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని.. ప్రిన్సిపాల్ ఏది కోరితే అది ఇచ్చేవారని చెప్పారు. ‘‘1974లో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభలకు అధ్యాపకులతో కలసి వచ్చాం. నాతో అప్పుడు మిత్రుడు ఓంకార్, ప్రిన్సిపాల్ గంగారెడ్డి ఉన్నారు. రాత్రి బ్యాగులు పట్టుకుని నగరంలో విడిది వద్దకు వెళ్తుండగా 60 మంది పోలీసులు మమ్మల్ని ఆపి పుస్తకాల పెట్టెలు చెక్‌చేశారు. చాలా భయపడ్డాం. పెట్టెలు తెరిచి చూసిన పోలీసులు.. ‘పెట్టెల్లో అన్నీ పుస్తకాలే.. ఏమీ లేవు సార్.. పాగల్ హై(పిచ్చోళ్లు)’ అని తమ పైఅధికారికి చెప్పి మమ్మల్ని వదిలేశారు. అయినా మహాసభల్లో జరిగిన పోటీలలో తృతీయ బహుమతి గెలుచుకొన్నాం. మేమంతా తిరిగి వెళ్లాక ప్రిన్సిపాల్.. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. భయపెట్టారు. లేకుంటే మొదటి స్థానమే వచ్చి ఉండేదన్నారు..’’ అని కేసీఆర్ వెల్లడించారు. -
బ్రెయిలీలో భగవద్గీత
తెలుగుపై అభిమానం ఉన్న వారందరినీ మహాసభలు హైదరాబాద్‌కి నడిపిస్తున్నాయి. ముఖ్యంగా పండితులు, రచయితలు తాము రాసిన పద్యాలు, కవితలు, పుస్తకాల గురించి వినిపించాలని తాపత్రయపడుతున్నారు. అలా కర్నూలు నుంచి తాను రాసిన బ్రెయిలీ భగవత్గీత తీసుకొని వచ్చారు బూర్ల తిక్క లక్ష్మన్న. మహాసభల్లో పాల్గొనాలనే ఆసక్తి ముందు ఆయన అంధత్వం అడ్డంకి కాలేదు. తోడుగా మనువడిని తీసుకుని వచ్చిన ఆయన అవకాశమిస్తే స్టేజ్ మీద నాలుగు శ్లోకాలు చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన్ను పలకరించినప్పుడు చెప్పిన విశేషాలు... కర్నూలు జిల్లా ఉరుకుండ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే భగవంతుని ప్రేరణతో భగవద్గీత రాయాలని, గుడి నిర్మించాలని సంకల్పించుకున్నాను. సంస్కృత పండితులు, మా గురువు వరప్రసాద్ ఆశీస్సులు, సహకారంతో ఐదేళ్లలో ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను. పద్యాలూ, వాటి అర్థాలనూ బ్రెయిలీలో రాశాను. తేజోమయనంద చిన్మయ మిషన్ 2001 డిసెంబర్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. వికలాంగులకు ప్రాధాన్యమిచ్చే గ్రంథం వికలాంగులు ఎవరైనా వారి వైకల్యం పట్ల బాధతో ఉంటుంటారు. భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి ప్రార్థన శ్లోకంలోనే కృష్ణ భగవానుడు వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చాడు. మూకం కరోతి వాచాలం... అంటే.. కాళ్లు లేనివాడు కొండలెక్కుట, మూగవాడు సత్గ్రంథ పఠనం చెయ్యుట పరంధాముని కృపాయోగంతో జరుగుతాయని అర్థం. అర్జున విషాదం భగవద్గీత ప్రథమ అధ్యాయం, అందులో అంధుడైన ధృతరాష్ట్రుడు యుద్ధంలో ఏం జరుగుతుందని సంజయుడిని అడుగుతాడు. ఆ విధంగా ఈ గ్రంథంలో దివ్యాంగునికి ప్రథమంగా చోటు కల్పించినట్లయింది. జీవన దిక్సూచి ఈ గ్రంథం పిల్లల మనసు పలక లాంటిది. ఏం రాస్తే అదే ముద్రించుకుపోతుంది. చిన్నప్పుడే ఈ గ్రంథాన్ని పఠించేలా చేస్తే జీవితంలో మరింత అభివృద్ధి పొందుతారు. గీతా సారం శాంతికి మార్గం. ప్రయత్న లోపం ఉండరాదు, ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు, కాలం విలువైనది, రేపటికి రూపులేదు. మంచి పని వాయిదా వెయ్యకు లాంటి జీవిత సూక్తులను చెప్పి మన జీవితానికి దిక్సూచిలా నిలుస్తుంది భగవద్గీత. జీవిత లక్ష్యం నాలాంటి అంధులకు గీతా సారాన్ని అందించేందుకు నా జీవితం అంకితం. భగవద్గీత పద్యాలను వీలైనన్ని ఎక్కువ చోట్ల గానం చేస్తూ ఎక్కువ మందికి ఈ గ్రంథ సారాన్ని తెలియజేయలన్నదే నా జీవిత లక్ష్యం. ఒక అవకాశం.. ఫలాపేక్ష లేకుండా తెలుగు మహాసభల్లో భగవద్గీత గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని వచ్చాను. ఇంత దూరం వచ్చిన నేను... వచ్చే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ పుస్తకంలోని కొన్ని శ్లోకాలను వేదికపై చదవాలని ఉంది. అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నాను. - ఓ మధు -
ఆటై పాటై
మూడోరోజూ మురిసింది ♦ భాష, సాహిత్యాభిమానులతో పాల్కురికి ప్రాంగణం కిటకిట ♦ భాషా పరిరక్షణకు అంతా ఏకం కావాలన్న వక్తలు తెలుగు మహాసభల్లో మూడోరోజు ఆదివారం ప్రధాన వేదిక పాల్కురికి సోమన ప్రాంగణం సాహిత్య, భాషాభిమానులతో కిటకిటలాడింది. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులు మంత్రముగ్ధులై రెండు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. ‘మౌఖిక వాజ్మయం భాష’ పేరుతో సాహిత్య సభ అనంతరం సాంస్కృతిక సమావేశం నిర్వహించారు. తొలి సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండో సదస్సుకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీటిల్లో పాల్గొన్న సాహితీవేత్తలు భాషకు పట్టం కట్టేందుకు తమ వంతు సూచనలు చేశారు. ఎవరేమన్నారో వారి మాటల్లోనే.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చేయలేం తెలుగు భాష, సాహిత్యంపై అవగాహన, ప్రేమ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మన భాష వికసించాలి. లేకుంటే ఎప్పటికీ ఈ ప్రయత్నం విజయవంతం కాదేమో. జన సామాన్యంలో నానిన తెలుగు పలుకుబడులు, సామెతలు, జాతీయాలు కూడా మన పాఠ్యాంశాల్లోకి చేరాలి. పరీక్షాంశాలుగా కూడా వాటిని గుర్తించాలి. అప్పుడే తెలుగు తప్పనిసరి నిర్ణయానికి ఫలితముంటుంది. – వెలిచాల కొండలరావు జానపద సాహిత్యం కూరాడు కుండలాంటిది.. జానపద సాహిత్యం కూరాడు కుండలాంటిది. దాన్ని మైలపడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అన్న మాటలను మనం నిజం చేయాలి. తెలుగు, తెలంగాణ నుడికారాన్ని పునరుద్ధరించాలి. జనం నోళ్లలో నానిన వాటిని నేటి తరానికి అందించాలి. మొగులు మెత్తవడ్డది వానొస్తదేమో, నాభికాడ సల్లగుంటే నవాబ్‌తో సవాల్ చేయొచ్చు, కడుపు నిండా మాట్లాడుతున్నడు, లోతులు గుంజడం వాడికి అలవాటు... ఇలాంటి ప్రయోగాలు మాటలకే కాదు నిగూఢార్థానికి నిదర్శనం. – నలిమెల భాస్కర్ సామెతలను ఈ తరానికి అందించాలి సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఒకటే.. ఒక్క మాట ఎంత గొప్ప అర్థాన్ని తెలుపుతుంది. మన భాషా వికాసానికి దోహదం చేసినవి ఇలాంటి సామెతలు, జాతీయాలే. 24 వేల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని కట్టె కొట్టె తెచ్చె అన్న మూడు పొడి వాక్యాల్లో చెప్పాం కదా. తెలుగు భాషలో 1.25 లక్షల సామెతలున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఏనుగంత తండ్రి లేకున్నా ఏకుల బుట్ట అంత తల్లి ఉంటే చాలు అన్న గొప్ప సామాజిక అంశాలను ప్రతిబింబించే సామెతలు మన భాష ఔన్నత్యాన్ని ఆకాశమంత ఎత్తుకు చేర్చాయి. అందుకే వాటి విలువను గుర్తించాలి. ఈ తరానికి అందించాలి. – కసిరెడ్డి వెంకటరెడ్డి అంతా ఏకంగా కావలి తెలంగాణ, కోనసీమ, రాయలసీమ యాసలు వేరైనా మన భాష ఒక్కటే. దీన్ని గుర్తించి రెండు ప్రాంతాల్లో తెలుగు సుసంపన్నం అయ్యేలా అంతా పాటుపడాలి. భాషలో జానపద పాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దాన్ని గుర్తించాలి. – గోరటి వెంకన్న మనకు ఏ పాటలు కావాలి..? రెయిన్ రెయిన్ గో అవే... మనకెంతో అవసరమైన వానను వద్దనుకునే విదేశీ సంస్కృతి కనిపించే ఆంగ్ల పద్యాలా... వానల్లు కురవాలి వానదేవుడా.. వరిచేలు పండాలి వానదేవుడా అన్న మన పాటలు అవసరమా అన్నది మనం తేల్చుకోవాలి. – ద్వా.నా.శాస్త్రి అబ్బురం.. అక్షర గణితావధానం ♦ పదాలు, వాక్యాలు చెప్పగానే అందులోని అంకెల సంఖ్య చెప్పే ప్రతిభ ♦ విభిన్న ప్రక్రియతో ఆకట్టుకున్న పుల్లూరు ప్రభాకర్ సాహిత్య అవధానంలో ఇదో సరికొత్త ప్రక్రియ. పదాలు, వాక్యాలను చెప్పగానే వెంటనే అందులోని అక్షరాలను అంకెల్లో చెప్పగలిగే అక్షర గణితావధానం! ఏ పదంలో ఎన్ని అంకెలు.. ఏ వాక్యంలో ఎన్ని.. తెలుగులో ఎన్ని.. హిందీ, ఆంగ్లంలో ఎన్ని.. ఇలా చెప్పగానే అందులోని అంకెలు చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు అక్షర గణితావధాని పుల్లూరు ప్రభాకర్. ఆదివారం రవీంద్రభారతి ఇందుకు వేదికైంది. ‘వెయ్యిలో ఎన్ని సున్నాలుంటాయి’ అంటే ఎవరైనా ‘మూడు’ అని సమాధానం చెబుతారు. కానీ ప్రభాకర్ ఠక్కున 10 అని చెప్పారు. ‘వెయ్యిలో ఎన్ని సున్నాలుంటాయి’ అనే వాక్యంలో మొత్తం 10 అక్షరాలు అంటూ తనదైన శైలిలో చెప్పారు. అనేక మంది ప్రాచీన, ఆధునిక కవుల పేర్లను ప్రస్తావించగానే.. వివిధ భాషల్లో వారి పేర్లలో ఎన్ని అంకెలొస్తాయో చెప్పేశారు. ఉదాహరణకు ‘పాములపర్తి వెంకటన రసింహారావు’ తెలుగు, హిందీలో అయితే 14 అక్షరాలు, ఇంగ్లిష్‌లో అయితే 31 అక్షరాలు అని చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. పదాలు, పేర్లు, వాక్యాలే కాదు.. పాటలను సైతం అంకెల్లో చెప్పి మెప్పించారు. చుట్టూ కూర్చున్న పృశ్చకులు అడిగిన వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలిస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ‘ఆ ^è ల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమెంతో ’ అని ఓ పృశ్చకుడు పాడగానే.. వెంటనే 20 అంటూ అక్షరాల సంఖ్య చెప్పేశారు. ఇక శనివారం నిర్వహించిన వివిధ అవధాన ప్రక్రియలను ఆలకించేందుకు వచ్చిన ఆహూతులతో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. మినీ ఆడిటోరియం బాగా ఇరుకైపోవడంతో అవధాన కార్యక్రమాన్ని ప్రధాన ఆడిటోరియంలోకి మార్చారు. విభిన్నంగా ఉండేందుకే.. మెదక్ జిల్లా బెజ్జంకికి చెందిన ప్రభాకర్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు. అందరికంటే విభిన్నంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ సరికొత్త అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత 12 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చారు. ‘‘టీవీలో వచ్చిన ఓ కార్యక్రమం తనను ఈ ప్రక్రియకు ప్రేరేపించింది. సాధారణ మాటలను తిరిగేసి చెప్పే ఆ టీవీ షోను స్ఫూర్తిగా తీసుకొని అంకెల్లో అష్టావధానం ప్రారంభించాను. ఇందుకోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అందరిలోకి నేను ప్రత్యేకంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ సాధన చేశాను. తెలుగు రాష్ట్రాల్లో అక్షర గణితావధానిగా ఉన్నది బహుశా నేనొక్కడినే’’ అని సంతోషం వ్యక్తం చేశారు. – పగిడిపాల ఆంజనేయులు బాల కవులు.. భళా! ♦ కవి సమ్మేళనంలో ఉట్టిపడిన తెలుగుదనం ♦ పాటలు, పద్యాలతో అలరించిన చిన్నారులు రంగురంగుల పట్టు పావడా, పూలపూల రవికె, నడుముకు వడ్డాణం, జడకు కుచ్చులు, చెంపకు సరాలు, తలలో చేమంతులు, మెడలో ముత్యాల హారం.. పూబంతిలా కదులుతుంటే కాళ్ల మంజీరాల గలగలలు.. నడిచొచ్చే తెలుగుదన మంటే ఇదేనంటూ ఆ అమ్మాయిలు వేదికకు అందం తెచ్చారు! జరీ అంచు తెల్ల పంచె, పొడవు చేతుల లాల్చీ, భుజం మీద ఉత్తరీయం.. మా తెల్లదనంలోనూ తెలుగుదనాన్ని చూడండి అన్నట్లు జారిపోతున్న ఉత్తరీయాలను సర్దుకున్నారు అబ్బాయిలు!! ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలోని డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికగా సాగిన బాలకవి సమ్మేళనంలో దృశ్యాలివీ. డాక్టర్ సునీతా రామ్మోహన్‌రెడ్డి నిర్వహణలో సాగిన బాల కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది. 80 మందికి పైగా బాలకవులు పాల్గొన్నారు. చక్కటి తెలుగు ఆహార్యంతో చిక్కటి తెలుగు పదాలతో గేయాలను ఆలపించారు. సమ్మక్క సారక్క వంటి సంస్కృతిని, రామప్ప గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక నిర్మాణాలను తమ పాటలతో కళ్లకు కట్టారు. శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం నవాబులు, వేమన, పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డి నుంచి జయశంకర్ వరకు, తెలుగు సాహిత్యకారులను పోషించిన రాజులను తలుచుకుంటూ గేయాలు ఆలపించారు. క్రీస్తుçపూర్వం ఐదో శతాబ్దం నుంచి ఉన్న తెలుగు భాష ప్రస్తావనను గుర్తు చేశారు. అశోకుడి కాలాన్ని, మార్కండేయ పురాణాల్లో తెలుగు మాటకు ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నింటినీ పాటల్లో వినిపించారు. ‘చక్కెర కలిపిన పెరుగు తెలుగు, నింగికెగిసింది తెలుగు మకుటం’ అంటూ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. నాకు తెలుగంటే ఇష్టం! రెండో తరగతి చదువుతున్న శ్రేష్ఠ.. ‘నాకు తెలుగంటే ఇష్టం, అందుకే వేమన పద్యాలు నేర్చుకున్నా’ అని మొదలు పెట్టి నాలుగు పద్యాలను ఆలపించింది. అఖిల అనే మరో అమ్మాయి ‘ఆడపిల్ల కష్టాలు, బాల్యం, శ్రమ’ను స్వీయగేయంలో వినిపించింది. భాస్కర్ అనే కుర్రాడు కంచుకంఠంతో గేయాన్నాలపించి ఆహూతులందరినీ లేచి నిలబడాల్సిందిగా ఆదేశాన్ని తలపించే వినతితో అందరితో తెలుగు భాషకు, తెలుగు మహా సభలకు వందనం చేయించాడు. అరవై ఏళ్లు నిండిన ముల్లంగి లలితాకళ ‘నాది రెండో బాల్యం’ అంటూ వేదిక మీదకొచ్చారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘తెలంగాణ వైతాళికులు’ రూపకం, అర్జున్, జయతీర్థ, రిషిత, హిమశ్రీల ఏకపాత్రాభినయాలు అలరించాయి. – వాకా మంజులారెడ్డి గరీబోళ్ల కష్టాలకు కవితాంజలి ‘ఎన్కటి ఎవ్వారం గాదని నేనెమన్న కొత్త పోకటపొయినాన్ నయిన గంజిల ఈగోలే ఇదే బతుకు బతకబడితిమి.. గానుగెద్దోల గట్లనే ఉండబడితిమి... ఇష్టమున్నా లేకున్నా గదే బొంతళ్ల బొర్లబడితిమి .. గంట్లేమంటే కులం హక్కుబాతండ్రి... మేం నోరు తెరిచి అడిగెతందుకు మాకు నోళ్లున్నాయ్ బాంఛన్.. మా కష్టాలకు కాళ్లూన్నాయ్ కాల్మోక్తా... ఈడొచ్చీరాకముందే కొత్తబుట్టింద్దాన్ని ఊరి మీదికిడవాలే.. అది ఏడేడు పట్టాల్దూకి ఆడ నేర్వాలే... ఇష్టమొచ్చినోళ్లు ఇష్టమొచ్చినట్టు యాడికి రమ్మంటే గాడికొచ్చి ఏం జేసినా సావక బతుకుతున్నం నయిన..’ కొలుపులోళ్ల శరీర దోపిడీని, గరీబోళ్ల శ్రమ దోపిడీని, దళితుల ఊరవతలి బతుకులను ప్రపంచ తెలుగు మహాసభల వచన కవితా సదస్సు తడిమి చూసింది! వచన కవులు కొందరు రాజ్యపాలనను వేనోళ్ల పొగిడితే.. ఇంకొందరు రాజ్యహింసపై కన్నెర్ర జేశారు. ఆదివారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోని అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంలో డాక్టర్ ఎస్ రఘు అధ్యక్షతన బృహత్ కవి సమ్మేళనం తొలి సమావేశం మొదలైంది. నిమిషం నిడివి కవితలో కవులు సభికులను మెప్పించారు. ఒక్కో సమావేశంలో 25 మంది కవులకు చొప్పున అవకాశం కల్పించారు. తొలి సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివరి సమావేశం కందూరి శ్రీరాములు అధ్యక్షతన ముగిసింది. వానమామలై వరదాచార్యుల వేదికపై వక్తల ఉపన్యాసాలు, కవులు తెలంగాణ మాగాణ చరిత్ర మూలాలను కళ్లకు కట్టారు. ‘ఇక్కడ పాలపుంతల్ని మించిన జానపద కళలున్నాయి.. ఎవరెస్టు శిఖరాన్ని తాగే యక్షగాన ఒగ్గు కథలున్నాయి’ ఇక్కడ ఎరకల గద్దెలు, బీరప్ప పటాలు బాలసంతుల వలపోతలు, అస్రిత వాయిద్యాల మెరుపులు నాగమ్మ ముగ్గులు బైండ్ల కథలున్నాయి’ అని పాలమూరు కవి వనపట్ల కవిత వినిపించారు. ‘పాలపిట్ట పొట్టనింపుకోవడానికి పొలానికి పోతే పంట పొలాలు బీడులై ఉన్నాయి..అన్నా..రైతన్న నీకు ఉచిత కరెంటు కల్పిస్తున్న కేసీఆర్ ఆశయాలను వమ్ము చేయవద్దు’ ‘పట్టణాలపై మోజుతో పల్లెను పొలాన్ని వీడవద్దు’ అంటూ ఓ కవి రైతన్నను తిరిగి పల్లెకు ఆహ్వానించారు. ‘అమ్మ భాషరా ఇది.. కమ్మనైన పెన్నిధి. జోలపాడే, ఊయలూపే లాలి తెలుగురా మనది. తేనె కంటే తీయనైన తెలుగు భాష రా ఇది’ అంటూ మరో కవి తెలుగు మాధుర్య రుచిని చూపారు. ‘అడివి బిడ్డలం మేం ఆదివాసీలం– మానవాళికి మూలవాసులం... శబరి తల్లి వారసులం భద్రాద్రి రామయ్య సేవకులం– భక్త రామదాసు సహాయకులం... గోల్కొండ తానీషాకు వ్యతిరేకులం–కొమురం భీం వారసులం’ అంటూ రాంబాబు అనే కవి పేర్కొన్నారు. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు వెలుగుతున్న.. తెలుగు మహాసభలు ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరమంతా ఆనందోత్సాహాలతో నర్తిస్తున్న తరుణంలో, ఈ ఆనందహేలలో ఒక గేయం అంటూ శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మ చక్కటి గేయాన్ని ఆలపించారు. ఆదివారం నగరంలోని బొగ్గులకుంట తెలంగాణ సారస్వత్ పరిషత్‌లోని శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపైన జరిగిన శతావధానంలో ఈ సన్ని వేశం చోటు చేసుకొంది. గేయం: తెలంగాణా నేల వెలుగు తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు బాసరపురి బాసతల్లి భాసురముగ దీవింపగ కీసరగిరి రామలింగస్వామి కరుణ కురిపించగ యాదశైల నృసింహుడు లాదమునే పంచుచుండ ఆలంపూర జోగులాంబ అలంకారమై నిలువగా తెలంగాణా నేల వెలుగు తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు నగరం నందనవనమై నవనవమై నర్తింపగ పలుకుబడుల సొమ్ముతో ప్రకృతి మాత పులకించగా మన సంస్కృతీ సౌరభాలు మహినంత వ్యాపించగా తెలంగాణా నేల వెలుగు తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు మారన మల్లియరేచన మల్లినాద ధర్మన్నలు పోతన తెలుగన్న భళీ పాలకురికి సోమన్నయూ కాళోజీ సినారేలు కరములెత్తి దీవింపగా తెలంగాణా నేల వెలుగు తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల మేటి కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై జయశంకర శ్రీకరాత్మ జయమంత్రము నందింపగ తెలంగాణా నేల వెలుగు తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు పద్యం: షీటీమ్స్ కల్పించి కేటుగాళ్లకు దుమ్ము దులిపించి వనితకు దతిని పెంచి సన్నబియ్యంతో అన్నదానం చేసి ఆహార భద్రతను ఆదరించి ఆసరా పథకాన ఆశద్యుతులనించి కళ్యాణలక్ష్మితో కాంతి పెంచి మిషన్ భగీరథన్ మేలెంచి పాలించి కాకతీయ మిషన్ కళలనించి హరితహారంబుతో నేలనలర చేసి ప్రీతికోతలు లేని కరెంట్ నిచ్చి జనము నీరాజనము పలక ఘనకతిమెయి మనతెలంగాణ ప్రభుతయే మాన్యచరిత. రఘురామ శర్మ అనే పృచ్ఛకుడు సీఎం కేసీఆర్ తన పాలన తీసుకవచ్చిన పథకాలపైన ముఖ్యంగా స్త్రీల రక్షణ, మిషన్ భగీరథపైన వచన గేయం చెప్పాలని కోరటంతో శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మ ఒక్క క్షణం కూడా తడుముకో కుండా పద్యం చెప్పి సభికులందరినీ ఆశ్చర్యపరిచారు. సభికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరిచి తమ ఆనందం వ్యక్తం చేశారు. జీవితమే నవలకు ముడిసరుకు – కొలకలూరి ఇనాక్ తెలుగు మహాసభలపై మీ స్పందన? తెలుగు అంతరిస్తోందని చింతిస్తోన్న రోజుల్లో తెలుగు గౌరవాన్ని చాటేందుకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ప్రపంచ లె లుగు మహాసభలు తెలుగు అభివృద్ధికి ఏ మేరకు ఉపకరిస్తాయి? ఇవి తెలుగు సాహిత్యానికీ, ప్రాచుర్యానికీ తప్పనిసరిగా దోహదపడతాయి. ఈ పండుగ కేవలం సంబురంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సందేశాన్నివ్వాలి. తెలుగులో అద్భుతంగా రాస్తోన్న కవులు, రచయితలను పాఠకులు ఆదరించాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. తెలుగు వృద్ధికదే తోడ్పడుతుంది. ఈతరం రచయితలకు మీరేం చెప్తారు? భాషాసాహిత్యం ఎరుకను సామాన్యులకు సైతం అనుభవమయ్యేలా ఈ సభలు చేశాయి. ఈ తరం కవులు, రచయితలు ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథలు, నవలలు రాయాలి. అభూత కల్పనలు, ఊహాజనిత ఘటనలూ కొన్ని చోట్ల కనిపించొచ్చుగాక, నవల ముడిసరుకు మాత్రం జీవితమే. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేవే రాయాలి. రష్యా అనంతర విప్లవోద్యమ సాహిత్య నేపథ్యం మనదే కథా సదస్సులో వెల్లివిరిసిన తెలంగాణ కథాకాంతులు తెలంగాణ గడ్డమీద నుంచి ముంబాయి మొదలు దుబాయి, బొగ్గుబాయిల గుండా నడిచివెళ్ళిన వలస బతుకుల చెమట చుక్కల చేతిరాతల ప్రతులెన్నో బయటపడిన వైనాన్నీ, గరీబోళ్ళ వెట్టినీ, మాలమాదిగల వెలినీ ప్రశ్నించే, తిరస్కరించే, తిరగబడే అస్తిత్వోద్యమ, విప్లవోద్యమ కథలు కదం తొక్కిన పుటలెన్నింటినో తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కథా సదస్సు తడమింది. ముఖ్య అతిథిగా మంత్రి లక్షా్మరెడ్డి హాజరయ్యారు. బి.ఎస్.రాములు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కథల నేప«థ్యాన్ని నెమరువేసుకున్నారు. ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ రజాకార్ల పదఘట్టనలో నలిగిపోయిన తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతికథా బరువుబతుకుల వ్యథలను ఎత్తిచూపిందేనని అన్నారు. రష్యా అనంతర విప్లవోద్యమ సాహిత్య నేపథ్యం తెలంగాణదేననీ, అయితే ఇల్లిందిల సరస్వతీదేవి రాసిన ‘నీ బాంచన్ కాల్మొక్త’ లాంటి కథలను తెలంగాణేతర సమాజం అర్థం చేసుకోకపోవడానికి ఇక్కడి బానిసత్వపు జాడలు తెలియకపోవడమే కారణమన్నారు. శ్రీనివాసులు రాసిన ‘అల్లనేరేడు పళ్ళు’ తొలి దళిత కథ అంటూ తెలంగాణ కథ – సామాజికతల మూలాలను వెతికి ఇచ్చారు సంగిశెట్టి శ్రీనివాస్. భాగ్యరెడ్డి వర్మ, ఆవుల పిచ్చయ్య, వట్టికోట ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల రామారావు, గూడూరి సీతారాం, జాతశ్రీ లాంటి కథారచయితల సృజనను సదస్సు గుర్తుచేసుకుంది. తెలంగాణ గ్రామీణ జీవితంలేని కథేలేదన్న పెద్దింటి అశోక్‌కుమార్ కథాసాహిత్యంతో ముడివడివున్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని విప్పి చెప్పారు. మార్పులనీ, సంస్కరణలనీ, విప్లవాగ్నులనూ తనలో ఇముడ్చుకున్న తెలంగాణకథ ప్రపంచ ప్రభావంతో వచ్చిన రాజకీయ చైతన్యాన్ని కథల్లో హృద్యంగా మలిచిన తీరును వక్తలు ప్రస్తావించారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని గుర్తుచేసే కథలను వెల్దండి శ్రీధర్ గుర్తుచేశారు. డంకెల్ ప్రతిపాదనలపై వచ్చిన కథలతో పాటు యాంత్రీకరణ, పారిశ్రామీకరణ, పట్టణీకరణ ప్రభావాలను కథలు పట్టిస్తున్న వైనాన్ని సదస్సు చర్చించింది. – అత్తలూరి అరుణ హాస్యభరితం.. శతావధానం చప్పట్లతో మార్మోగిన కృష్ణమాచార్య వేదిక ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం, మరిగంటి సింగరాచార్యుల ప్రాంగణం శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య ఆధ్వర్యంలో జరిగిన శతావధానం హాస్యభరితంగా సాగింది. ఆదివారం మూడోరోజు వర్ణణ అంశంపై కార్యక్రమం నడిచింది. 25 మంది çపృచ్ఛకులు 25 రకాల ప్రశ్నలు అడిగి శ్రోతలను ఆనంద పరిచారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగికుడు శంకర నారాయణ అడిగిన ప్రశ్నలకు నవ్వులు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయ శర్మ హాజరయ్యారు. çపద్య కవితా గానంతో పృచ్ఛకులు పవన్‌కుమార్, ఓం ప్రకాశ్ అలరింపజేశారు. డాక్టర్ పెరుంబుదూరు శ్రీరంగాచార్య మాట్లాడుతూ.. తెలుగు సభలను నిర్వహిస్తూ తెలుగును వెలుగులోకి తీసుకువస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యఅతిథి వేలేటి మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ.. 1 నుంచి 12 తరగతుల వరకు నిర్బంధ విద్య అమలు చేస్తూ తెలుగును తప్పకుండా మాట్లాడే విధంగా చేయాలని భావించిన సీఎంకి అభినందనలు తెలియజేశారు. అవధానం అంటే ఆనందం, హేళ, ఆట అని పేర్కొన్నారు. శతావధాని డాక్టర్ గౌరీభట్ల రామశర్మ మాట్లాడుతూ తెలుగును వైభవంగా లోకానికి చాటి చెప్పాలని, మన సంస్కృతి వైభవాన్ని దశదిశలా చాటాలని పద్య, గద్య, ఉపన్యాస, కవి సమ్మేళన కార్యక్రమాలు, కళాకారుల వైభవ దీప్తిని వ్యాపింపజేయడానికి ప్రభుత్వ పాలకులు కంకణబద్ధు్దలై ఉన్నారని కీర్తించారు. గురుకుల విద్యావ్యవస్థపై పృచ్ఛకులు సంతోష్ సంధించిన ప్రశ్నకు శతావధాని రామశర్మ ‘గురుకులమ్ములు కల్పతరువులవును..’ అంటూ పద్యం ప్రారంభించారు. ఉపాధ్యాయులపై ఐటీ అధికారుల దాడులపై పద్యం చెప్పాలని కోరగా అందుకు శతావధాని ‘నా సరస్వతీపై లక్ష్మీ యీసుపడెనో’ అంటూ పద్యం మొదలుపెట్టారు. అప్రస్తుత ప్రసంగీకుడు శంకర నారాయణ ప్రతి సందర్భంలో అడ్డుగలుగుతూ శతావధాని జీఎం రామశర్మనుద్దేశించి వేసిన ప్రశ్నలు.. మీరు లింగ నిర్ధారణ బాగా చేస్తారట కదా ప్రశ్నించగా సభలో నవ్వులు వెల్లి విరిశాయి. వాల్మీకి తొలుత బందిపోటుగా ఉండి తర్వాత మహనీయుడుగానూ, కాళిదాసు మూర్ఖుడుగా ఉండి అనంతరం మహనీయుడుగా అయ్యారని.. మరి శతావధానిగా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన మీరు గతంలో ఎలా ఉండేవారని సంధించిన ప్రశ్నకు శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మ స్పందిస్తూ.. ప్రతి కవి చోరుడేనని చమత్కరించారు. ఏ కవీ సొంతంగా పదాలను సృష్టించలేరన్నారు. పాత కవులు వాడిన పదాలే అటూ ఇటూ వాడుతూ పద్యాలు çసృష్టిస్తారన్నారు. ‘ప్యాకింగ్ కొత్తది... మాల్ పాతది’ అని సమాధానం చెప్పగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 50 çపృచ్ఛకులు 50 రకాలుగా ప్రశ్నలతో శతావధానం రసవత్తరంగా సాగేలా చేశారు. – కోన సుధాకర్‌రెడ్డి నయనానందకరంగా నేత్రావధానం అబ్బురపరిచిన ‘శిరీష’ ద్వయం రాజుల కాలంలో ప్రత్యేక గూఢచార వ్యవస్థ ఉండేది. సమాచార మార్పిడికి లేఖలు, రాయబారులుండేవారు. అంతేకాదు ఆ కాలంలో కళ్లు కూడా మాట్లాడేవి. రహస్య సమాచార మార్పిడిలో ఇది కీలక పాత్ర పోషించేది. కాగితాల పై రాసిన రాతలకు కన్నులతో భాష్యం చెప్పగలిగే అద్భుత కళే నేత్రావధానం! దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే పరిచయమున్న ఈ కళను ఖమ్మం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఎస్వీ శిరీష, కె.శిరీషలు ఆదివారం రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించారు. గురువు కె.ఆదినారాయణ సమన్వయకర్తగా వ్యవహరించారు. చూపులే అక్షరాస్త్రాలైన వేళ.. ఇద్దరు అమ్మాయిలు వేదికపై ఎదురెదురుగా కూర్చోని ఈ కళను ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి ఒకరు తెల్లకాగితంపై ఒక పద్యమో లేక వాక్యమో 20 నుంచి 25 అక్షరాలకు మించకుండా రాసి వేదికపై ఆసీనులైన వారిలో ఒకరికి అందజేస్తారు. ఇద్దరు అమ్మాయిల మధ్య కనీసం ఏడెనిమిది అడుగుల దూరం ఉంటుంది. ప్రేక్షకుల్లోని కొంతమంది రాసి ఇచ్చిన కాగితాన్ని సమన్వయకర్త ఆదినారాయణ తీసుకుని ఇద్దరిలో ఒక అవధానికి అందజేయగా.. ఆమె ఆ కాగితంలోని విషయాన్ని తన కనుసైగలతో ఎదురుగా ఉన్న అమ్మాయికి చేరవేసింది. తర్వాత ఆమె ఆ కాగితంపై ఉన్న విషయాన్ని యథాతథంగా మరో కాగితంపై రాసి ప్రేక్షకులకు వినిపించింది. ఇలా కేవలం తెలుగు పదాలే కాకుండా, ఇంగ్లి్లషు, హిందీ పదాలు రాసిచ్చిన చెప్పేసింది. ‘జయ లలిత, ప్రపంచ మహాసభలు జయప్రదం, చిన్నారులకు అభినందనలు’ వంటి పదాలను అవలీలగా చెప్పి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. అంతేకాదు బొటనవేలి కదలికలతో చేసే ‘అంగుష్టావధానం’ ప్రక్రియలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే పదానికి అక్షరరూపం ఇచ్చారు. రసరమ్యంగా అష్టావధానం అంతకుముందు ఇదే వేదికపై కొనసాగిన అష్టకాల నరసింహరామశర్మ అష్టావధానం భాషాపండితులను విశేషంగా ఆకట్టుకుంది. వైద్య శ్రీనివాస శర్మ అనుసంధాన కర్తగా వ్యవహరించగా, ఆచార్య వేణు సమావేశకర్తగా వ్యవహరించారు. కడిమెళ్ల వరప్రసాద్(అప్రస్తుత ప్రసంగీకుడు), జగన్నాధ శాస్త్రి (పృచ్ఛకుడు), సంధ్య(దత్తపతి), జయంతిశర్మ (వర్ణణాంశం), విజయలక్ష్మి(సమస్య), వెంకటేశం (అశువు)లు పాల్గొన్నారు. ఇలా చేద్దాం...! ప్రపంచవ్యాప్తంగా ఏ భాషాభివృద్ధి్ధకైనా అక్కడి ప్రసార మాధ్యమాలు చేసే కృషి అపారమైంది.. అనితర సాధ్యమైంది. తెలుగు నేల అందుకు భిన్నమేమీ కాదు. మీడియాలో భాçష ఒక్కరి చేతుల్లో సాగేది కాదు. కారణం ఏమైతేనేం ఇటీవలికాలంలో తెలుగు భాష ప్రసార మాధ్యమాల వల్లే ఎక్కువగా సంకరమైపోతోంది. సహజత్వం దెబ్బతిని కృత్రిమత్వం పెరుగుతోంది. ఒకవైపు పత్రికలు, రేడియో, టీవీ తదితర ఎలక్ట్రానిక్ మాధ్యమాల విస్తృతి, మరోవైపు అధ్యయన, బోధన భాషగా తెలుగుకు తగ్గుతున్న ఆదరణ.. వెరసి తెలుగుకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. ఈ సంధి కాలంలో వస్తున్న కొత్తతరం జర్నలిస్టుల్లో కూడా భాషపై పట్టు, లోతైన అవగాహన ఉండటం లేదు. చక్కని తెలుగు భాషలో రాయడానికి, అలవోకగా మాట్లాడటానికి నిజానికి పాండిత్యం అవసరం లేదు. జర్నలిస్టులకు నేర్చుకోవాలన్న తపన, తప్పు రాయకూడదన్న కనీస శ్రద్ధ ఉంటే చాలు. తెలుగునాట 80 దశకం చివర్లో దాదాపు అన్ని పత్రికలు ఒక్కపెట్టున జిల్లా అనుబంధ సంచికలను విడిగా తీసుకువచ్చాయి. మండల స్థాయి విలేకరుల వ్యవస్థ ఏర్పడింది. పత్రికలకు వార్తలు రాసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారి వేర్వేరు స్థాయి భాషా నైపుణ్యాల వల్ల ప్రమాణాలు పడిపోయాయి. పత్రికా కార్యాలయాల్లో తప్పుల్ని పరిష్కరించి, భాషను సంస్కరించే వ్యవస్థలు కాలక్రమంలో బలహీనపడ్డాయి. రేడియో, టీవీల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఎఫ్ఎమ్ రేడియోల్లో జాకీల జమిలి భాష, తెలుగు–ఆంగ్లం కలగలిపే తీరు పరాకాష్ట. ఇది ఒక పార్శ్వమే! కేరళ సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో ‘మలయాళ మనోరమ’ కృషి అపారం. అలాంటి కృషి తెలుగులోనూ జరగాలి. ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగింది. ఇది అదునుగా అక్కడ తెలుగు వినియోగ క్రమాన్ని మరింత సరళతరం చేయాలి. పత్రికలు, రేడియో, టీవీ, వెబ్సైట్లల్లో తప్పుల్లేని తెలుగు వచ్చేలా మాధ్యమాలు మరింత శ్రద్ధ పెంచాలి. వాడుక భాషను ఎక్కువ వాడాలి. అక్షరాస్యత, భాషాభివృద్ధి కోసం నిర్దిష్టంగా కొంత సమయం, స్థలం వెచ్చించాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం కలసి ప్రతిగ్రామంలోనూ పౌరగ్రంథాలయాలు పనిచేసేలా చూడాలి. దినపత్రికలు అందుబాటులో ఉంచాలి. – దిలీప్‌రెడ్డి -
కథల పాతరను తిరగదోడుదాం
పిల్లలకు పాలమీగడలు ఎంతిష్టమో పాటల తోరణాలూ అంతే ఇష్టం అంటారు బాలకథా రచయిత్రి డి.సుజాతాదేవి. పిల్లలకు తేనెల తేటల మాటలతో పాటు పాత కథలనూ అలవాటు చేస్తే అవి వారి సంస్కారానికి తోడ్పడుతాయంటారు. ఎంత తవ్వినా తరగని సంపద అని మన ప్రాచీన సాహిత్యాన్ని గుర్తుచేస్తారు. బాలల కోసం ప్రత్యేకమైన సాహిత్యం అవసరమా? తప్పకుండా ఉండి తీరాలి. పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని వారి కోసం ఎలా ప్రత్యేకంగా శ్రద్ధగా తయారు చేస్తామో సాహిత్యమూ అంతే. పిల్లల వయసుకూ, అవగాహనకూ అనువైన సాహిత్య సృష్టి జరగాలి. పౌరాణిక ఇతిహాసాల కాలం నాటి సాహిత్యంలో బాలల కోసం ఏమైనా ఉన్నాయా? రామాయణ, భారతాల్లో నీతి కథలు అనేకం ఉన్నాయి. బాలకాండలో రామలక్ష్మణుల మైత్రి, గురుభక్తి ప్రస్ఫుటమవుతాయి. మహాభారతంలో కురుపాండవుల మధ్య మంచిచెడుల వ్యత్యాసం బాలలకూ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, ఆటల్లోనే దుష్టసంహార ఘట్టాలు వినడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. పట్టుదల గలిగిన కార్యసాధకుడు ధృవుడు, ధర్మాన్ని అనుసరించడానికి తండ్రినే ఎదిరించిన ప్రహ్లాదుడు, భక్తితో మృత్యుంజయుడైన మార్కండేయుడు, కడ వరకు తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించిన శ్రవణ కుమారుడు, తండ్రికి బ్రహ్మోపదేశం చేసిన కుమారస్వామి, ధర్మం కోసం తండ్రితో యుద్ధం చేసిన కుశలవులు... ఇవన్నీ మన ప్రాచీన సాహిత్య సౌగంధికాలు. బాల సాహిత్యం పట్ల పిల్లల ఎక్కువ ఆసక్తి యాభై ఏళ్ల క్రితం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? యాభై ఏళ్ల కిందట కథాగేయాలు బాగా ప్రచారంలో ఉండేవి. మధ్యాహ్నం వేళల్లో నలుగురు ఆడవాళ్లు ఒక చోట కూర్చుంటే ఊర్మిళాదేవి నిద్ర, సీతా స్వయంవరం వంటి కథల్లో ఏదో ఒక ఘట్టం వారి నాలుకల మీద నాట్యం చేసేది. పిల్లలకు నేర్పించడం కోసం తల్లులు కంఠతా పట్టేవారు. వేంకట పార్వతీశ కవులు, తిరుమల రామచంద్ర, గిడుగు సీతాపతి, గురజాడ, వావిలికొలను సుబ్బారావు, వీరేశలింగం, చింతా దీక్షితుల రచనలను పాటల రూపంలో పాడుకునేవారు. పిల్లల కోసం ఎన్నెన్ని కథలనీ... భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, శతక పద్యాలు! అవి అమ్మభాష మీద అలవోకగా పట్టుని తెప్పించేవి. మన దగ్గర పిల్లల సినిమాలు తక్కువే. ఇందుకు కారణం బాల సాహిత్యం పరిపుష్టం కాకపోవడమే అనుకోవచ్చా? అది నిజం కాకపోవచ్చు. తెలుగులో పాత రచనల పాతర తీస్తే ఎన్నో కథలుంటాయి. ఇప్పటికంటే గతంలోనే తెలుగులో బాల సాహిత్యం ఎక్కువగా వచ్చింది. పిల్లల సినిమాలు తీయాలంటే అవి కొన్ని దశాబ్దాలకు సరిపోతాయి. బాలసాహిత్యం మాతృభాషలోనే ఉంటే మంచిదా? ఇంగ్లిష్ చిల్డ్రన్ లిటరేచర్ మ్యాగజైన్స్‌ని చదివించడాన్ని ప్రోత్సహించవచ్చా? బాల సాహిత్యాన్ని మాతృభాషలో చదవడమే బాగుంటుంది. భాష నుడికారాలు పట్టుబడతాయి. పిల్లలకు ఆసక్తి ఉంటే ఇతర భాషలలోని బాల సాహిత్యాన్ని కూడా చక్కగా ఆస్వాదించవచ్చు. మాతృభాష మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికే తప్ప భాష పట్ల పరిధులు విధించుకుంటూ మనకు మనమే గొప్ప అనే అహంకారాన్ని ఒంటపట్టించుకోవడానికి కాకూడదు. - వాకా మంజులా రెడ్డి -
'జంట' నోరెంట పద్యాల జేగంట
రెండు ఎప్పుడూ నిండే. అలాంటిది జంట అష్టావధానమంటే పండుగ భోజనమే. రెండు స్వరాలు ఒకే భావ భాస్వరం. ఒకే పద్యం... చెరో పాదం. అనుకుంటేనే ఇంత ఇంపు. కనులారా చూస్తే సొంపు. ఈ ఇంపుసొంపుల జంటావధానం ఆదివారం రవీంద్ర భారతి వేదికపై రసరంజకంగా సాగింది. ముదిగొండ అమరనాథశర్మ, ముత్యంపేట గౌరీశంకర శర్మ ఈ అవధానాన్ని అహ్లాదంగా నిర్వహించారు. జంటకవులు అనగానే మనకు వెంటనే స్ఫురించేది తిరుపతి వేంకట కవులు. వారి స్ఫూర్తితోనే అష్టావధానం చేస్తున్నట్టు వీరు వేదికపై ప్రకటించుకున్నారు. సందడి సందడిగా సాగిన ఈ అవధానంలో కవులు మనసులో ఒకింత ప్రశాంతతను నిల్పుకుని, ధారణకు దారి ఇచ్చుకుని పద్యాలు చెప్పడం ప్రేక్షకుల్ని మెప్పించింది. నిషిద్ధాక్షరిగా మెతుకుసీమ మెదక్ వాసిగా పేరుగాంచిన కవి, లాక్షణికుడు మల్లినాథసూరిపై పద్యం అడుగగా ‘ధీమాత్ర విధాత శాస్త్ర ధీరాగ్రణ్యున్..’ అంటూ కవులు ప్రస్తుతించారు. ‘తెలుగు సభలోన కవులకు తెలుగు రాదు’ అని సమస్యనిస్తే... ‘తెలుగు సభలోన కవులకు... తెలుగురాదు దేశభాషలు రానట్టి వైదేశీలకు’ అంటూ మరోపాదం చేర్చి కవులకు కాదు సభలకు వచ్చిన విదేశీయులకు అని అర్థం వచ్చేలా పూరించారు. దత్తపదిగా అమెరిక, జపాన్, దుబాయి, హలెండ్ ఈ పదాలతో తెలుగుసభలను వర్ణించండి అని కోరారు. కాంతిరేఖలమరికల్యాణ, ఊహలెండిపోవ, భాషజపానువ్రతాన, మాదుబాయని చమత్కారంగా పదాలను వేరే పదాలతో కూర్చి తమ నేర్పు ప్రకటించారు. తెలంగాణ ఆత్మ బతుకమ్మ పండగను వర్ణనాంశంగా పద్యం చెప్పమని పృచ్ఛకుడు అడిగిన వెనువెంటనే సీస పద్యంలో చెరో పాదాన్ని చకచకా నడిపించారు. గునుగుపువ్వు, మందారం, తంగేడు, బంతిపూల ప్రసక్తి తీసుకురావడంతో పద్యం బతుకమ్మగా మెరిసింది. మెట్రో రైలుపై ఆశువుగా ‘ఉరుకులతో పరుగులతో... ధరలో విద్యుచ్ఛకటమా... మెరుగుల మురిపించినావు మెట్రో జయహో’ అంటూ ప్రేక్షకుల చప్పట్ల మధ్య పూరించారు. ధరలో అంటే అధిక ధరలో అని అవధానులు చమత్కరించగా పక్కనున్న వారు అంత ఎక్కువ కాదులే అనగానే ధర‘లో’ అనడంతో నవ్వులు పూశాయి. అప్రస్తుత ప్రసంగంలో పృచ్ఛకుడు గ్రంథసాంగులా మీరు అన్నప్పుడు అవధానులు ఉద్గ్రంథసాంగులం, గ్రంథాన్ని సాంగులా పాడగలం అంటూ చెణుకులు విసిరారు. అవధానులు వర్ణన చెబుతున్నప్పుడు మీరు కందం నుంచి సీసాల దాకా ఎదిగారే అనగానే పద్యసీసం మాది మరో సీసం మీది అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి తను పాతికేళ్లు విదేశాల్లో ఉన్నా మూడ్రోజులుగా నడుస్తున్న సభల స్ఫూర్తితో కవిత్వం రాయాలన్న ఆసక్తి కలుగుతోందని చమత్కరించారు. మొదట సభ శనివారం లాగానే ఇరివెంటి కృష్ణమూర్తి వేదికలో ప్రారంభమైనా... నిన్నటి జనాదరణ దృష్ట్యా ప్రధాన వేదిక యశోదారెడ్డి వేదికకు మార్చినా ఆ హాలు నిండి ద్వారాల వద్ద జనాలు గుంపులుగా నిలుచుని వినడం కొసమెరుపు. - రామదుర్గం -
తెలంగాణలో తొలితెలుగు పత్రిక
మహబూబ్ నగర్ నుంచి 1913లో వెలువడిన ‘హితబోధిని’ తొలి తెలంగాణ పత్రికగా చాలాకాలం వరకూ ప్రచారంలో ఉండేది. అయితే అంతకు మూడు దశాబ్దాల కిందటే ఉర్దూ మాతృకకు అనువాదంగా వెలువడిన ‘శేద్య చంద్రిక’ గురించి చాలాకాలం వరకూ చరిత్రకు అందలేదు. మద్రాసు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ (ప్రాచ్యలిఖిత గ్రం«థాలయం)లో దీని ప్రతి దొరికింది. ప్రసిద్ధ పరిశోధకుడు స్వర్గీయ బంగోరె (బండి గోపాలరెడ్డి), ఆయన సన్నిహితుడైన డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ (ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేసి హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగ విరమణ చేశారు) ఒక సందర్భంలో మరేదో పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళ కంటబడింది. చాలా ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, వాళ్ళ దృష్టి వేరే విషయం మీద నిమగ్నమై ఉండటం వలన దాన్ని పక్కనబెట్టారు. ఈ విషయాన్ని గోపాలకృష్ణ గారు నాతో పంచుకోవటంతో ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి వెళ్ళి వెతకటం మొదలు పెట్టా. అప్పట్లో పుస్తకాలుగాని, లిఖిత ప్రతులుగాని, తాళపత్రాలు గాని ఏవీ ఒక క్రమ పద్ధతిలో లేవక్కడ. బీరువాలు నింపేసి ఉన్నాయి. దీంతో రోజూ ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఆరు వరకూ వరుసగా అన్ని బీరువాలు వెతుకుతూ వస్తే మూడో రోజు ఇది కంటబడింది. లైబ్రరీ రికార్డుల ప్రకారం చూస్తే 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రదర్శనలో శేద్య చంద్రికను కూడా ప్రదర్శించారు. బహుశా ఎవరి దృష్టిలోనూ పడి ఉండకపోవచ్చు. శేద్య చంద్రిక మొత్తం 40 పేజీలుంది. చెక్కమీద చెక్కి ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నారని ముద్రణాసాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధించిన వారు ఆ తరువాత తేల్చారు. ఉర్దూ్దలో వెలువరించిన ఫునూన్ అనే పత్రికకు ఇది అనువాదమని పత్రిక సంపాదకీయాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అప్పట్లో జనం భాషలో ఉర్దూ పదాలు దొర్లేవనటానికి నిదర్శనంగా తెలుగు అనువాదంలోనూ అనేక ఉర్దూ పదాలు కనిపిస్తాయి. ముఖపత్రం గమనిస్తే నిజాం ఆదేశాలకు అనుగుణంగా రైతుల క్షేమం కోసం ప్రచురించినట్టు చెప్పుకోవటం కనిపిస్తుంది. పబ్లిషర్ గా మున్షీ మహమ్మద్ ముష్తాక్ అహ్మద్ పేరు చెబుతూ ఫునూన్ పేరు ప్రస్తావించారు. హైదరాబాద్ పత్తర్ ఘట్టి లోని ప్రింటింగ్ ప్రెస్ (చాప్ ఖానా)లో ముద్రణ జరిగినట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రచురించిన పత్రిక ఇది. 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలి పాలనలో 1875–1910 మధ్య కాలంలో వెలువడిన అనేక ఉర్దూ పత్రికలలో ఫునూన్ ఒకటి. తెలుగు ప్రజల కోసం.... ముఖ్యంగా రైతుల కోసం తెలుగు అనువాద పత్రికను అందిస్తున్నట్టు శేద్యచంద్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు. ‘‘ ... ఈ విషయంలో ఆత్మ సంతోషకరమైన అభిప్రాయంను తెల్యిజేసి ఉండిరి కదా– రిసాలా పూనూను తరజుమా దేశ భాలో ఛాపాయించవలెను – ఆ రీతి చేశినట్టయితే రచయితలకు చాల ఫాయిదా కాగలదు. కాబట్టి మేము మొదలు ప్రస్తుతం తెన్గు భాషలో రిసాలా చేసి వున్నాము రయిత్లు యింద్లు గవురవం చేశినట్లయితే హాకంలు యిందుపైన మతవఝా అయినట్టయితె తిర్గి మాహారాష్ట్రం భాషలో కూడా ఛపాయించుటం కాగలదు.’’ శేద్య చంద్రికకు లభించే ఆదరణను బట్టి నిజాం ఏలుబడిలో ఉన్నప్రాంతీయ భాషల్లో కూడా ప్రచురించాలనే ఆలోచనతో ఉన్నట్టు పేర్కొనటం గమనార్హం. బహుశా ఆ తరువాత కాలంలో మరాఠీ, కన్నడ భాషల్లో కూడా ప్రచురించాలనుకొని ఉండవచ్చు. పాలకులు ఆశించిన విధంగా శేద్య చంద్రికకు ఆదరణ లభించిందా, ఇతర భాషలకూ విస్తరించారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. రైతులకు తెలియాల్సిన మెలకువల గురించి, ఆధునిక పోకడల గురించి, ఇతర దేశాల నుంచి అందుతున్న సమాచారం గురించి చెప్పటానికి ఇందులో ప్రాధాన్య మిచ్చారు. అదే సమయంలో వైద్య చిట్కాల వంటివి కూడా పత్రికలో చేర్చారు. రెవెన్యూ వసూళ్ళ వివరాలు, బకాయిల వివరాలు పేర్కొనటంతోబాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరెవరు ఎక్కడికి బదలీ అయ్యారో ఆ సమాచారం కూడా శేద్య చంద్రికలో పొందుపరచారు. వ్యవసాయం లాభదాయకంగా సాగటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే పేరుకు తగినట్టుగా ఇది పూర్తిగా రైతుల పత్రిక. తెలుగు మాత్రమే తెలిసిన రైతుల కోసం చేసిన ప్రయత్నమే ఇది. అయితే, శేద్య చంద్రిక వెలుగు చూసిన తరువాత కేవలం అందులోని విషయాలనే ప్రస్తావిస్తూ, అప్పటికే తెలిసిన పత్రికల చరిత్రను జోడించిన పరిశోధకులు అంతకుమించి శోధించలేదు. శేద్య చంద్రిక ఆ తరువాత ఎన్ని సంపుటాలు ప్రచురితమైందని గాని, ఇతర భాషల్లో కూడా ప్రచురితమైందా, లేదా అనే విషయం గాని తేల్చలేదు. ఆ మాటకొస్తే, శేద్య చంద్రికను పరిశీలించిన ఆరుద్ర, తిరుమల రామచంద్ర ఇది 1883 నాటిదని లెక్కగట్టగా మరికొందరు దీన్ని 1886 నాటిదని అంటున్నారు. ఇది కూడా నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తేలాల్సిన విషయమే. -తోట భావనారాయణ -
టప్పాబహీ సత్తార్ మియా
ఒకసారి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు హైదరాబాదు వచ్చారు. ప్రజల్లో ఆయన విప్లవం యెక్కడ తెస్తారో అని జడిసి ఆయన్ని గిరఫ్తార్(అరెస్టు) చేయవలసిందిగా వారెంటు జారీచేశారు. అది ఉర్దూలో వుంది. ఉర్దూకు ఫారసీ లిపిని ఉపయోగిస్తారు. ఉర్దూ భాషకు స్వంతలిపి అంటూ లేదు. ఫారసీ లిపిలో భారతీయ శబ్దాలు వ్రాయడం కష్టం. ‘‘పట్టాభి సీతారామయ్య’’ అని రాయాలంటే ‘‘టప్పాబహీ సత్తార్ మియా’’లా వుంటుంది. డాక్టర్ పట్టాభిగారు బసచేసిన చోటికి పోలీసువారు వారంటు పట్టుకు వచ్చారు. ‘‘టప్పాబహీ సత్తార్ మియా హై క్యా’’ అని అడిగారు. అది పసిగట్టిన యన్.కె.రావుగారు ‘‘యహా సత్తార్ మియా కోయీ నహీ. ఇన్కానాంతో సీతారామయ్యా హై’’ (ఇక్కడ సత్తార్ మియా యెవరూ లేరు. వీరి పేరు సీతారామయ్య) అన్నారు. పొరపాటు చేశామనుకుని పోలీసువారు వెళ్ళిపోయారు. వెంటనే సీతారామయ్య గారిని సురక్షిత ప్రదేశానికి పంపించివేశారు రావుగారు. లిపిమార్పు వల్ల పేరు మారింది. (దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ లోంచి...) -
కావ్యం మీద తిరుగుబాటు నవల
సాహిత్య సభలకు ప్రజలు రారనే అపప్రదని ఈ ప్రపంచ తెలుగు మహాసభలు పటాపంచలు చేశాయని రచయిత అంపశయ్య నవీన్ వ్యాఖ్యానించారు. ఆయన అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో నవలా సాహిత్యంపై విస్తృతంగా చర్చ జరిగింది. కవిత్వం మీద చేసిన తిరుగుబాటు నవల అనీ, అంతకుముందున్న ప్రబంధాలూ, కావ్యాలూ కొన్ని వర్గాలకే సొంతం అయినా నవల అందరికీ సాహిత్యాన్ని చేరువ చేసిందని సదస్సు అభిప్రాయపడింది. యశోదారెడ్డి నవలల్లో తెలంగాణ గ్రామీణ భాష, యాస, శ్వాసలుగా నిలిచాయని వక్తలు ప్రశంసించారు. కాసుల ప్రతాపరెడ్డి నవలా సాహిత్యం– తొలిదశను వివరిస్తూ కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ తొలి నవల అన్నారు కానీ అది ఓ ఇంగ్లీషు నవలకి అనుసరణ మాత్రమేననీ, ఒద్దిరాజు∙సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి తొలి నవల అనీ అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణమూర్తి, అటవీశాఖా మంత్రి జోగు రామన్న, వి.శంకర్, త్రివేణి హాజరైన ఈ నవలా సాహిత్య సదస్సు మంచి నవలల ఆవశ్యకతను చాటిచెప్పింది. -
తంగేడు పూవైతది!
‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ ప్రపంచంలోనే ఏకైక సామూహిక పూలపండగకు తెలంగాణ వేదిక. పూలంటే గులాబీలు, తామరలు కాదు, గునుగు, గడ్డి పూలు, తంగేడు.. ఆ బతుకమ్మకు సింగారం, మహా అలంకారం, పవిత్ర ఆకారం. ఇక్కడ మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా.. ‘గడ్డిపోచ’ చులకనకు భాషారూపం. పూలను పూజించే ఈ అద్భుత అనాది ప్రక్రియ ఆ అనామక పూలకు పవిత్ర స్థానమిచ్చింది. లేకుంటే ఆ గడ్డిపూలను కానేదెవరు, ఈపాటికి అంతరించేల చేసినా అడిగే నాథుడెవడు? అనామక పూలనే అంతగొప్పగా కాపాడుకుంటున్న మనం.. విశ్వ భాషల్లో మేటిగా నిలిచే మన అమ్మ భాషను ఎంత పదిలంగా చూసుకోవాలి. అందుకే నేను చెప్పేదేందంటే గొప్పదైన మన మూల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటేనే భాష ఉంటది. భాష–మనదైన సంస్కృతిలో భాగం. దానిపై నేటి తరంలో మక్కువ కల్పించాలి. అప్పుడు తంగేడు పూలంతా గొప్పగా తెలుగు వర్ధిల్లుతుంది’’ పూసిన పున్నమి వెన్నల మేన తెలంగాణ వీణ.. వాసిగ చరిత వెలుగొందిన గత వైభవాల కోన... అంటూ తెలంగాణ ఉనికిని కళ్లముందుంచిన ప్రజాకవి గోరటి వెంకన్న మాట ఇది! శ్రమజీవుల చెమట నుంచి పుట్టి.. పండితుల చేతుల్లో వన్నెలద్దుకున్న ఈ ప్రాచీన భాషా వైభవం ఇకముందు కూడా వెలుగొందాలంటే దాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసి, తెలుగు మూల సంప్రదాయాలపై నేటి తరంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. జనం పాటకు ప్రాణం పోస్తున్న ఆయన ఆ పాటకు ప్రాణమిచ్చిన భాషకు ఎలా పట్టం కట్టాలో తనదైనశైలిలో చెబుతున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కాటమరాజు కథలో ఆవులేమైనవో ఎవరికైనా ఎరుకనా... కాటమరాజు కథ చదవండి, అందులో ఆవుల వర్ణన వింటే రోమాలు నిక్కపొడుచుకుంటై. దాదాపు ఐదొందల రకాల పేర్లను చెప్తరు. వాటిని మేపేందుకు అవసరమైన గడ్డి గురించి చెప్పే క్రమంలో దాదాపు 200 రకాల గడ్డి జాతుల పేర్లు వినిపిస్తయి. మరి ఇప్పుడు అన్ని రకాల ఆవులు, గడ్డి జాతులేమైనయి. ఎవరైనా ఆలోచించిన్రా, మనదైన మేలురకం ఆవులు పోయి జెర్సీ ఆవులేడికెళ్లి వచ్చినై? విదేశీ గడ్డి వంగడాలెందుకు దూసుకొచ్చినై? ఈస్టిండియా కంపెనీ కథ వింటే ఇది ఉట్టిగనే అర్థమైతది. తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మన మీద దాడి చేసి మన సంపద, సంప్రదాయాలను నాశనం చేసిన తీరే దీనికి నిదర్శనం. మన భాషను నాశనం చేస్తే మనం వారికి గులాములైతమన్న కుట్ర అమలైంది. ఇది మన భావితరానికి తెలవాల్సి ఉంది. ఇంగ్లిష్‌కు గ్లామర్ వద్దు.. ఇంగ్లిష్‌లో చదివితెనే మంచి ఉద్యోగమొస్తదని, దాన్ని నేరిస్తేనే నాగరికులనే గ్లామర్ విపరీతంగా వచ్చింది. అది ఓ భాష మాత్రమే. చైనా విద్యార్థులు మాతృభాషలో చదివి ప్రపంచ అంగట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతలేరా, వియత్నాం వాసులు వారి భాషలో చదివి వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తలేరా, జపనీయులు సొంత భాషలో చదివి అమెరికాను మించి ఎదుగతలేరా? మనమెందుకు మన భాష ఒదిలి ఆంగ్లం వెంట ఉరకాలె? ఈ మాటలు పిల్లల మెదడులోకి ఎక్కాలె. భాషలెన్నైనా నేర్వచ్చు. కానీ మన తెలుగు భాషను మరవొద్దు. ఇవాంకా వస్తే గంత మురిపమెందుకు? ఇటీవల అమెరికా అధ్యక్షుడి బిడ్డ ఇవాంకా మన పట్నానికి వచ్చింది. ఆమెను గౌరవించటం, మంచి ఆతిథ్యమియ్యటం మన బాధ్యత. ఇందులో ప్రభుత్వానికి ప్రత్యేక బాధ్యత ఉంటది. మంచి చెడ్డలు ప్రభుత్వం చూసుకుంటది. కానీ వ్యాపారాల్లో మునిగితేలే ఇవాంకా వస్తే మనజనం ఎందుకు అంత మురిసి పోయిన్రు. గంత హడావుడి ఎందుకు పడ్డరు. ఈ విదేశీ వ్యామోహమే మన భాషను కూలుస్తోంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం మన సంప్రదా యాలను నిర్లక్ష్యం చేస్తే భాషను పక్కనపెట్టినట్టే. చెంచులు వేల రకాల మూలికలను సేకరిస్తరు, వాటి పేర్లను నోటికి యాదికించు కుంటరు. ఆ మూలికల్లో భయంకర జబ్బులను నయం చేసే గుణమూ ఉంటది. మరి ఆ మూలికలే మూలంగా విదేశీ కంపెనీలు మందులు తయారు చేసి మనకే అమ్మవట్టిరి. ఇంకేముంది మూలికల చెంచులు జాడే లేకుండా పోబట్టే. ఇది మూలికలకే కాదు.. మూలమైన మన భాషకూ పట్టుకుంది. ఇదంతా నేటి తరం గమనించాలె. అందుకే మన చరిత్ర చెప్పాలె.. భాషను బతికించాలంటే.. తెలుగులో చదివినోళ్లకు ఉద్యోగాలిస్తమన్న తాయిలాలు కాదు.. ఆ భాష ప్రాధాన్యం వారికి తెలియచెప్పాలె. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికాకంటే ఐదు వేలకుపైబడ్డ చరిత్ర ఉన్న మన ముచ్చట్లు చెప్పాలె. ఆ చరిత్రకున్న గొప్పతనం విప్పిజెప్పాలె. ఆ గొప్పదనం ప్రపంచానికి ఏమిచ్చిందో వివరించాలె. అప్పుడు ఆమెరికా, ఆంగ్లం గొప్పయి కాదన్న సంగతి వారికి తెల్సి వాటెనక ఉరుకుడు ఆపుతరు. ఇక్కడ మన సంస్కృతీ సంప్రదాయాలంటే మూఢత్వానికి దూరంగా ఉన్న అసలు సంప్రదాయమన్నది నా ఉద్దేశం భాష పరిరరక్షణకు ఉద్యమం రావాలె గ్రంథాలయోద్యమం తరహాలో మన భాష పరిరక్షణ ఉద్యమం రావాలె. మిల్లెట్స్ పేరుతో జొన్నలు తెచ్చుకుని తినేటోళ్లు మన భాష పదం జొన్నలను గుర్తువట్టరు. ఖరీదైన వంటకంగా పులస చేప రుచిని చూస్తరు దాని తెలుగుపేరు తెల్వదు. ఈ తీరు మారాలె. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో తొలుత చైతన్యం రావాలె. మూకుమ్మడిగా కదిలితే ఆ ఉద్యమం మంచి ఫలితమిస్తది. అవగాహనతో భాషను బతికించుకుంటం. ఈ కోవలో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు మంచి మేలే చేస్తయనిపిస్తుంది. మన భాషను రక్షించుకునే ఆలోచన రగిలిస్తది. ఇలాంటి సభలు మరిన్ని జరగాలె. ఊళ్లలో కూడా కొనసాగాలె. విదేశీ అనుకరణ ప్రమాదమనే సంకేతం పోవాలె. కేసీఆర్‌కు రుణపడి ఉంటా ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం వేళ తన ప్రసంగ సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాపాట ‘గల్లీ సిన్నది... గరీబోళ్ల కథ పెద్దది’ అనంగనె లక్షల చప్పట్లు మోగె. గది సంప్రదాయ పాటకున్న శక్తి. పెద్దపెద్ద సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగుల ముంగట నేను పాటపాడితే వాళ్లు లేసి గంతులేసిన్రు. మన పాట, మన మాట, మన భాష మజా తెలిస్తే ఇట్లనే ఉంటది. ఆ ప్రయత్నం చేస్తె మంచిది. కేసీఆర్ లాంటి వాళ్లు మన పాటలు, పద్యాలు పాడితే సాధారణ ప్రజలెందుకు మొదలుపెట్టరు. అందుకే కేసీఆర్‌కు రుణపడి ఉంటా.. ఆయన ఆలపించిన పద్యాలు కొన్ని లక్షల మందిలో ఇప్పటికే ఆలోచన రేకెత్తి ఉంటాయి. రేపట్నుంచి పద్యాలకు ఆదరణ కచ్చితంగా పెరుగుతుంది. – గౌరీభట్ల నరసింహమూర్తి -
అన్ని భాషలకూ ఒకే లిపి
అంతర్జాతీయ ధ్వని విధేయ లిపి కాకపోయినా, ఆ పద్ధతిలో సవరింపబడిన రోమను లిపి భవిష్యత్తులో ప్రపంచ భాషలన్నిటికి సర్వవిధాల తగినదై సర్వోత్తమమూ, అభ్యుదయకరమూ అయిన లిపి కాగలదు. టైపుమిషను, లైనోటైపు మొదలైన వాటికి ఒకే విధమైన ముద్రాఫలకాలు(Key boards) మనకు లభిస్తాయి. ప్రపంచ మంతటా ఒకే విధమైన ముద్రణ వ్యవస్థ ఏర్పడుతుంది. (రోమన్ లిపి అంటే ఇప్పుడు ఆంగ్ల అక్షరాలు రాస్తున్న పద్ధతిలో రాసే విధానం) - కస్తూరి విశ్వనాథం (1989 నవంబర్ తెలుగు వైజ్ఞానిక మాసపత్రికలోని ‘భారతీయ భాషలకు ఏకలిపి అవసరమా? అయితే ఏది?’ వ్యాసం నుంచి) -
ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇంటి మహాసభలుగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికి, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవమివ్వని కేసీఆర్ వైఖరి సరికాదన్నారు. అదే పక్కరాష్ట్ర సీఎం పిలిస్తే అమరావతి శంకుస్థాపనకు, మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. అందరూ ఆహ్వానితులే అనడం సరికాదని, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక ఆహ్వానం పంపడం సమంజసం అని పేర్కొన్నారు. -
తెలుగు మహాసభల్లో కార్టూన్ల ప్రదర్శన
-
తెలుగు మహాసభల్లో వెల్లివిరిసిన సాహిత్యోత్సాహం
-
‘తెలుగు’ విందు.. భలే పసందు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన భోజన ఏర్పాట్లు అతిథులను, ఆహ్వానితులను విశే షంగా ఆకట్టుకున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ భోజన ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఏ ఇబ్బంది లేకుండా సమ యానికి భోజనాలను ఏర్పాటు చేసింది. శనివారం మహా సభలు జరిగిన ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలితా కళాతోరణంలో భోజన ఏర్పా ట్లను మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులతో కలసి భోజనం చేశారు. వేదికలో ‘ఈరోజు భోజనం’ అంటూ పెద్ద అక్షరాలతో డిస్ప్లే బోర్డుపై ప్రత్యేకంగా ప్రదర్శించడంతో చాలామంది అతిథులు ఆ బోర్డు పక్కన సెల్ఫీలు దిగడం కనిపించింది. వంటకాలు ఇవీ.. వెజ్ బిర్యానీ, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ, పండుమిర్చి చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమాటా రసం, చింతపండు పులిహోర, గాజర్ కా హల్వా, డ్రైఫ్రూట్ సలాడ్, పిండి వంటలు, స్పెషల్ పనీర్ బటర్ మసాలా శనివారం వడ్డించారు. -
పులులు, పిల్లులపాటి చేయదా నా అమ్మ భాష
‘పులులు అంతరిస్తున్నాయని గణనలు చేసి, వాటి పరరిక్షణ చర్యలు చేపట్టడం చూశాం. మరి ప్రపంచంలోనే గొప్ప సాహితీ ప్రక్రియలు తనలో ఇముడ్చుకున్న మన తెలుగు భాష ఆ పులులు, పిల్లుల పాటి చేయదా? పిల్లాడు సిగరెట్ తాగుతానంటే ‘వద్దు నాన్నా అనారోగ్యం, పాలు తాగు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది’ అని అమ్మ అంటుంది కదా, అలాగే ఈ భాష పరిరక్షణలో ప్రభుత్వం ఆ అమ్మ పాత్ర పోషించాలి. ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎక్కడ లాలించాలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పుడు భాష ఎందుకు వికసించదో, విలసిల్లదో చూద్దాం’. తెలుగు చలనచిత్ర రంగంలో భాషాప్రావీణ్యం అద్భుతంగా ఉన్నవారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో 2012లో తిరుపతిలో జరిగిన సభల్లో లీనమైన ఆయన ఇప్పుడు భాగ్యనగరం వేదికగా అత్యద్భుతంగా జరుగుతున్న సభల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే... మాతృస్తన్యం కాదని డబ్బాపాలు తాగితే... ‘‘మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఎన్ని భాషలు నేర్చినా, అమ్మభాషలో ఆయన ప్రావీణ్యం తగ్గించుకోలేదు. మనకు ఆసక్తి ఉండాలే కాని ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, నేర్పు చూపొచ్చు. కానీ అమ్మ ఒడి నేర్పిన భాషకు ఎప్పుడూ అగ్రతాంబూలమే దక్కాలి. అమ్మ స్తన్యం కాదని డబ్బాపాలు తాగితే ఆరోగ్యమొస్తుందా... ప్రతి ఇంట తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ఆ మాటకు నేను విరుద్ధం... పదిపదిహేనేళ్లుగా భాషపై వినిపిస్తున్న భయమొక్కటే, ఇది అంతరించే జాబితాలో ఉందని. కానీ మీరు గమనించండి.. గత రెండు దశాబ్దాల్లో తెలుగు నేలపై ఎన్నో అవధానాలు జరిగాయి, గతంలో లేని కొత్త రికార్డులు సృష్టించాయి. జనం విరగబడి ఆస్వాదించారు. భాష అంతరిస్తుంటే ఈ పరిస్థితి ఉండదు. భాష, అందులోని సాహితీప్రక్రియలపై మక్కువ ఉంది. నేటి తరానికి దాని మజా తెలియాలి. అది తెలిస్తే వారూ అక్కున చేర్చుకుంటారు. అందుకే... భాషకు ప్రమాదమనే భయానికి నేరు విరుద్ధం. బడుల నుంచి మొదలు కావాలి... ఈ మహాసభలు బాహుబలి లాంటివే... తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు నామమాత్రమే. అందుకే మన సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు ఉండవు. కానీ బాహుబలి విడుదలై ప్రపంచవ్యాప్తంగా తెరపై మాయ చేయటంతో విదేశీయులూ సమ్మోహనంలో మునిగిపోయారు. ఇప్పుడు భారతీయ సినిమా అంటే ముందుగా తెలుగు సినిమాను పేర్కొంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు కూడా భవిష్యత్తులో తెలుగు భాషకు అలాంటి ప్రాభవమే తెస్తాయని ఆశిస్తున్నా. తెలుగులో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వండి... తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 1 నుంచి 12 తరగతుల వరకు తెలుగును తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం 20 ఏళ్ల క్రితం తీసుకుని ఉంటే ఇప్పుడు భాషపై భయం, ఆందోళన ఉండేవి కాదు. కనీసం ఇప్పటికైనా గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు. ఇదే కోవలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలి. జపనీయులు మాతృభాషలో చదివి ప్రపంచాన్ని ఏలటం లేదా? కాబట్టి తల్లిదండ్రులే తొలుత అమ్మభాషపై చిన్నచూపును దూరం చేసుకోవాలి. వారు పిల్లలకు నూరిపోస్తే వారు అలాగే తయారవుతారు. చప్పట్లకు రెండు చేతులుండాలి, ప్రభుత్వం–తల్లిదండ్రులు ఆ పాత్ర పోషించాలి. ఆసక్తి రగిలించాలి...: ఆమధ్య నేను ఓ గ్రంథాలయానికి వెళ్లి ముఖ్యమైన పాత తెలుగు పుస్తకం తీస్తే వాటి మధ్య పాము గుడ్లు కనిపించాయి. లైబ్రరీలు ఈ దుస్థితిలో ఉంటే పుస్తకంపై ఆసక్తి ఎలా ఉంటుంది? ప్రత్యేక సందర్భాలప్పుడు పుష్పగుచ్ఛాల బదులు మంచి పుస్తకాలివ్వండి. 20 ఏళ్లుగా నేను దాన్ని ఆచరిస్తున్నా. నాకు అదే స్ఫూర్తి... తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణలతో మా పూర్వీకులకు బంధుత్వం ఉంది. మా నాన్న కూడా సాహిత్యాభిమానే. అలా నాకు సాహిత్యంపై అనురక్తి చిన్నప్పటి నుంచే ఉన్నా, ఓ సంఘటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఓసారి మిత్రులతో కలిసి సినిమా చూసి వస్తూ మార్గమధ్యంలో ఉన్న కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయానికి వెళ్లాను. అక్కడ ఓ పదిమంది డబ్బాలో ప్రముఖుల పేరు రాసిన చిట్టీలు వేసి అది వచ్చినవారు ఆ ప్రముఖుడి గురించి రెండు నిమిషాలు మాట్లాడాలనే పోటీ పెట్టారు. నాకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు రావటంతో ఆయన గురించి మాట్లాడి తొలి బహుమతిగా మాస్తి వేంకటేశ అయ్యంగార్ రాసిన ‘వాయులీనం’ పుస్తకం అందుకున్నా. ఓరోజు ఆ పుస్తకం పోయింది. ఎక్కడ వెదికినా మరోటి దొరకలేదు. తర్వాత కాకినాడలో ఓ చోట పుస్తకం చూసి వెల రూ.2 ఉన్న ఆ పుస్తకానికి రూ.100 ఇచ్చి కొన్నా. ఇంటర్లో ఉండగా గణతంత్ర దినోత్సవం రోజున తొలిసారి కవిసమ్మేళనంలో పాల్గొన్నా. కవికి ఉన్న గౌరవం గురించి ‘కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, హలం తప్ప అంగుళమైనా పొలం లేనివాడు, గుడ్డలు మాసిన, గడ్డం మాసిన, తలమాసినవాడంటూ సమాజం వెలివేసిన వాడే కవి’ అని చెప్పా. దీనికి ప్రముఖ కవి ఉత్పల సత్యనారాయణాచార్య తనకు కప్పిన శాలువాను తీసి నాకు కప్పారు. అప్పటి నుంచి కవిత్వం మీద మనసుపెట్టా. పుస్తకం లేకున్నా వద్దు దిగులు.. ఆన్లైన్ ఉన్నా చాలు... పిల్లలు పుస్తకాలు చదవటం లేదని చాలామంది గగ్గోలు పెడతారు. కానీ ఆ ఆందోళన వద్దు. పలక పోయిందని బాధపడుతూ కూర్చుంటామా, తోలుబొమ్మలాటలు లేవని నిట్టూరుస్తామా... ఆధునికతను అందిపుచ్చుకుంటూనే భాషను బ్రహ్మాండంగా కాపాడుకోవచ్చు. ఆన్లైన్లో బోలెడన్ని గ్రంథాలున్నాయి. వాటిని చదివినా చాలు.. ఫలితాల్లో తేడాలేమీ ఉండవు. అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని దశాబ్దాల తర్వాత కూడా తెలుగు వైభవాన్ని అద్భుతంగా స్మరించుకుంటా. భాషతో ఉంటూనే భేష్ అనిపించుకుంటా. పైన చెప్పిన సూచనలు పాటిస్తే చాలన్నది నా మాట. – గౌరీభట్ల నరసింహమూర్తి తెలుగు అందమైన భాష ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ 30 ఏళ్లుగా తెలుగుతో అనుబంధం ‘‘ప్రపంచ తెలుగు మహాసభలు బాగా జరుగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గొప్పగా మాట్లాడారు. తన గురువుగారి గురించి చెప్పుకున్నారు. గురువు ద్వారా భాష విస్తారంగా అవగాహనకు వస్తుంది...’’ – ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ అచ్చ తెలుగులో పలికిన మాటలివీ! తెలుగు అందమైన భాష అని, కొత్తవారికి పదాలు పలకడం కష్టమేనని, అందుకే తాను మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడినట్లుగా ఉంటుందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. 30 ఏళ్ల తెలుగు ప్రస్థానం.. డేనియల్ తెలుగు ప్రస్థానం మొదలై 30 ఏళ్లయింది. 1986లో ఇండో– ఫ్రెంచ్ స్టూడెంట్స్ ఎక్సె్చంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘సామాజిక– సాంస్కృతిక శాస్త్రం’పై పీహెచ్డీ చేశారు. బుర్రకథ, తోలుబొమ్మలాట, హరికథలు, కంజెరి కథ, నాటకాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించి తెలుగు నేర్చుకున్నారు. దక్షిణ భారతదేశమంతా పర్యటించి నాట్యశాస్త్రరీతులు, యక్షగానాలు, శాసనాలు, కళాచరిత్రలపై పరిశోధన గ్రంథాలు రాశారు. ఆరుగురు స్కాలర్స్‌ను కూడా గైడ్ చేశారు. వారిలో కొందరు పరిశోధన కోసం సంస్కృతం, తమిళం, తెలుగు భాషలు నేర్చుకున్నట్లు చెప్పారాయన. శెయర్జో జాకోవీ అనే విద్యార్థి నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ పాటలపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. ఆ పరిశోధన గ్రంథానికి తానే గైడ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు.. దూకుతున్న అలుగు కవిత్వంలో పద్యం, వచనం రెండు ప్రధాన అలంకారాలు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ ప్రభుత్వం ఓ పద్యం, ఓ వచనాన్ని అధికారికంగా సమర్పించింది. ఇందులో ప్రముఖ కవి డాక్టర్ ఎన్.గోపి ప్రభుత్వ పక్షాన సమర్పించిన వచన కవిత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మీ కోసం... అమ్మా! తెలంగాణ తల్లీ పాదాభివందనం నీకు. మాకు తెలుగు నేర్పించిన మట్టి సరస్వతివి నువ్వు. మా పొలాల్లోని కూలి జనుల పాటల్లోని నుడికారానివి నువ్వు. వారి గుండెల్లోని మమకారానివి నువ్వు. నీ మధురమైన యాస మా జీవితాల్లోని ఉచ్ఛ్వాస నిశ్వాస. తంగేడు పూలను ముద్దకొప్పులో ముడిచి బంగారాన్ని వెక్కిరించావు నువ్వు. బతుకమ్మలను పేర్చి అన్ని రకాల పుష్పాలకు కలిసి బ్రతకటం నేర్పించావు నువ్వు. ఇవాళ తెలుగు తెలంగాణ చెరువుల్లోంచి దూకుతున్న అలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా వాకిళ్లలో ఎండబెట్టిన అస్తిత్వాల ఒరుగు. ఇవాళ తెలుగు తెలంగాణా సంస్కృతిని తవ్విపోసే పారా పలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా బిడ్డలకు కల్పించే బ్రతుకు దెరువు. అన్యభాషల జడివానలో తెలుగే కదా మన గొడుగు. తల్లిభాష ఒక దారం అన్ని భాషలకు అది ఆధారం. చనుబాలలోంచి వచ్చిందే వ్యాకరణం అన్నింటినీ ఇముడ్చుకోవటమే దాని మూలగుణం. కన్నీటికీ భాషవుంది దాని పేరు తెలుగు. కాలికి దెబ్బతగిల్తే పసివాడు ‘అమ్మా’ అని అరుస్తాడు అది అచ్చమైన తెలుగు. అన్నం పెట్టండి తెలుగు భాషకు అది పరబ్రహ్మంలా వెలుగుతుంది అఖండదీపంలా కాపాడుతుంది. ఇవాళ తెలుగు పల్లెలన్నీ భాగ్యనగరిలో కుప్పపడ్డాయి. ఇది సకలజనుల కళారాధన సబ్బండ వర్ణాల సంవేదన. రండి! తెలుగును ఉజ్వలంగా వెలిగిద్దాం. ఇదొక విరాట్ వివేచన ఇది తెలుగు వెలుగుల తెలంగాణ అవును! ఇది తెలుగు వెలుగుల తెలంగాణ.. -
అద్వితీయం...
భాగ్యనగరం రెండోరోజూ తెలుగు వెలుగులతో జిగేల్మంది. సాహితీ సౌరభాలతో గుబాళించింది. కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల హోరులో తడిసి ముద్దయింది. నగరంలో ఏర్పాటు చేసిన ఆరు ప్రాంగణాలు భాషా, సాహిత్య అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అమ్మ భాషను అందలం ఎక్కిస్తూ అంగరంగవైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఎల్బీ స్టేడియంలో ‘సాహిత్య సభ.. తెలంగాణలో తెలుగు భాషా వికాసం’, తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం, తెలుగు వర్సిటీ ప్రాంగణంలో పద్య కవితా సౌరభం, రవీంద్రభారతిలో అష్టావధానం, బాలసాహిత్యం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళనాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల విశేషాలివీ.. అమ్మ భాషకు అభయం తెలుగు కనుమరుగవుతుందా? యునెస్కో హెచ్చరిక త్వరలోనే నిజమవుతుందా? దీనిపై భాషాభిమానుల్లో కలవరమెంతో. ప్రపంచంలో అద్భుత సాహితీ ప్రక్రియలున్న గొప్ప భాషల్లో ఒకటిగా వెలుగొంది ఇక చరిత్రపుటలకు పరిమితమవబోతోందన్న మాటలు పెద్ద భయాన్నే రేకెత్తించాయి. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీదుగా వెలువడుతున్న మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. భయం వద్దు.. కాస్త మనసు పెడితే భాష మళ్లీ శాఖోపశాఖలుగా వికసిస్తుంది, మనకే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియలు విలసిల్లుతాయి, విరాజిల్లుతాయంటూ కొత్త అభయాన్ని ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ‘శతదా, సహస్రదా.. అమ్మ భాషను రక్షించుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంద’ని బమ్మెర పోతన వేదిక సాక్షిగా గట్టిగా చెప్పారు. ఇప్పుడు సాహితీ ప్రముఖులు ఇదే మాటను పునరుద్ఘాటిస్తున్నారు. మన భాషకు వచ్చిన భయమేమీ లేదని, అది అద్భుతంగా వికసించి తీరుతుందంటున్నారు. సభల రెండో రోజైన శనివారం లాల్‌బహదూర్ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై సాయం వేళ నిర్వహించిన సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశంలో వక్తలు తెలుగు భాష విషయంలో భయం వద్దంటూ తేల్చి చెప్పారు. అంతా కలిస్తే అమ్మ భాష మనతో శాశ్వతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ముదిగొండ సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ ప్రసంగించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా ప్రసంగించారు. పంజాబీ రచయిత్రి డాక్టర్ వనిత, తమిళ రచయిత్రి సల్మాలను ఘనంగా సత్కరించారు. ఇందులో ఎవరెవరు ఏమన్నారంటే.. తెలంగాణ గొప్ప సాహిత్యానికి పుట్టినిళ్లు. తెలుగు భాషలో ఎన్నో ప్రయోగాలు ఈ నేల మీదుగానే శ్రీకారం చుట్టుకున్నాయి. మనుచరిత్ర కంటే ముందే తెలంగాణ నేలపై ప్రబంధ కావ్యాలొచ్చాయి. – ప్రముఖ సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం శ్రామికుల చెమట చుక్కల్లోంచి మన భాష వికసించింది. దాన్ని పండితులు తీర్చి దిద్దారు. ఆ అద్భుత భాషలో సాహిత్యం పుట్టింది తెలంగాణలో. నవాబులు అణచివేత చర్యలనూ ఎదుర్కొని నిలబడ్డ ఈ భాషకు ప్రమాదం లేదు. యునెస్కో తాత దిగొచ్చి చెప్పినా మన భాషకు వచ్చే నష్టం లేదు. – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ 935 ఏళ్ల క్రితమే ముదిగొండ చాళుక్యుల శాసనం, గూడూరు శాసనం, జినవల్లభుడు తయారు చేయించిన కురిక్యాల శాసనాలు తెలంగాణలోనే తొలి తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నాయి. – డాక్టర్ సుజాతారెడ్డి శాతవాహనులు నాటిన తెలంగాణ మొక్క ఊడల్లేచి పెరిగింది మర్రిచెట్టు లెక్క. – నటుడు తనికెళ్ల భరణి జ్ఞాపకాల దొంతరలో దొరికిన బాల్యం ‘వీరగంధము తెచ్చినాము– వీరుడెవ్వడో తెల్పుడి... అమ్మా అమ్మా చెప్పమ్మా ఆకాశం అంత ఎత్తున ఎందుకుంది... చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి...’ అంటూ వేదిక మీదున్న కథాకారులు తన్మయత్వంతో ఉచ్చరిస్తుంటే... ఎవరు మాత్రం బాల్యంలోకి పరుగులు తీయకుండా ఉండగలరు? రవీంద్రభారతిలోని డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలోని బండారు అచ్చమాంబ వేదిక మీద సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలసాహిత్య సదస్సు హాలు నిండిపోయింది. ఆహూతులంతా ట్రంకు పెట్టెలో దుస్తుల అడుగున జ్ఞాపకాల దొంతరలలో దాచుకున్న బాల్యాన్ని వెతుక్కోవడానికి వచ్చినట్లే ఉన్నారు. తమ బాల్యాన్ని దాటి సమాజంలో జీవితాన్ని ఈది అలసిపోయిన కథాపిపాసులకు ఈ సదస్సు ఓ బంగారు అవకాశమైంది. పిల్లలమర్రి రాములు అధ్యక్షతన జరిగినఈ సదస్సులో చొక్కాపు వెంకటరమణ, పత్తిపాక మోహన్, ఐతా చంద్రయ్య, దాసరి వెంకటరమణ, వేదకుమార్, దేవేంద్ర, గిరిజారాణి, రంగయ్య పాల్గొన్నారు. ‘‘జానీ జానీ, ఎస్ పపా, ఈటింగ్ షుగర్, నో పపా గేయంలో... చక్కెర తినడం లేదని చెప్పిన పిల్లాడు నోరు తెరిస్తే నోటి నుంచి చక్కెర జారిపడుతుంది. ఈ గేయంలో పిల్లలకు ఏ సంస్కారాన్ని నేర్పుతున్నాం?’’ అని ఆవేదన చెందారు కథకుడు ఐతా చంద్రయ్య. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి అంటూ సాగే మన గేయాలలో పిల్లలకు సమాజాన్ని పరిచయం చేస్తాయన్నారు. మన స్థానిక సాహిత్యమైనా, తెలుగులోకి అనువదించుకున్న సింద్బాద్ సాహస యాత్ర వంటి పొరుగు సాహిత్యమైనా సరే అందులో పిల్లలకు సంస్కారాన్ని, మంచిని నేర్పే ఇతివృత్తం ఉండాలన్నారు. తెనాలి రామకృష్ణుని కథలలోని హాస్యాన్ని, మర్యాద రామన్న కథల ద్వారా యుక్తిని పిల్లలు ఆస్వాదిస్తారన్నారు. పిల్లల భాష తియ్యగా ఉండాలి! పిల్లలు పాలమీగడను ఇష్టపడినట్లే కథలనూ ఇష్టపడతారు. వాళ్లకు చెప్పే కథలు కూడా తేలిక పదాలతో మీగడ తరకల్లా ఉండాలి. పిల్లల కథల్లో ప్రకృతిలోని ప్రతి వస్తువూ మాట్లాడుతుంది. అదే పిల్లల కథకు అందం. పిల్లలకు ఆనందం. వీరమాత కథలు చెప్పాలి, దేశభక్తుల కథలు వినిపించాలన్నారు వక్తలు. ప్రతి స్కూల్లోనూ లైబ్రరీ పీరియడ్ ఒక గంట తప్పని సరిగా ఉండాలని వాసా నర్సయ్య తన సందేశంలో తెలియచేశారు. తమకు పాఠశాలలో ఒక తరగతి సాహిత్య పఠనానికి ఉండేదని, దానిని పునరుద్ధరించాలని కోరారు బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య. ప్రపంచం బతకాలంటే బాల సాహిత్యం బతకాలని ముక్తాయించారు. – వాకా మంజులారెడ్డి సోమనాథుడి నుంచి సురవరం వరకు వెల్లివిరిసిన పద్యకవితా సౌరభం తెలంగాణ పద్యకవితా సౌరభానికి తెలుగు విశ్వవిద్యాలయంలోని బిరుదురాజు రామరాజు ప్రాంగణం వేదికయ్యింది. పోతన లాంటి కవులపై సోమనాథుడి కవితా నిర్మాణం, శైలి ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ సోమనాథుడు కందం రాసినా, సీసం రాసినా రసాత్మకత ఉట్టిపడేదనీ, సంస్కృతం కాదు తెలుగుకి ప్రాధాన్యతనివ్వాలంటూ ఆయన రాసిన ‘తెలుగు మాటలనంగ వలదు’ పద్యాన్ని సభాధ్యక్షుడు అనుమాండ్ల భూమయ్య చదువుతూంటే పద్యరసాన్ని ఆస్వాదించారు భాషాప్రేమికులు. అప్పడాల్లాంటి కాగితాల్లో... అప్పడాల్లాంటి కాగితాల్లో ముట్టుకుంటే రాలిపోయే శిథిలప్రాయంలోని పద్యకావ్యాలను దాచుకుని చదువుతున్నామంటూ ఎంతో విలువైన ప్రాచీన పద్యకావ్యాల పునర్ముద్రణకు పూనుకోవాలని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. పద్యకావ్యంలో ఒదిగిన కొత్తపదాలను తడిమి చూసిన ఈ వేదిక మీద తూర్పు మల్లారెడ్డి కౌస్తుభం అనే ఎత్తుగడతో ప్రారంభించి, ‘వాస్తుభం’ పద ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ... దాని అర్థం స్తుభం అంటే పొగడదగినదనీ, ఉర్దూలోని వాహ్ని తీసుకుని వాతో కలిపి వాస్తుభం అయ్యిందనీ, రెండు భాషల కలయికతో కొత్తపద సృష్టి తెలంగాణ ఘనత అనీ వివరించారు. పద్యాన్ని మందారంగా చేసి మకరందాన్ని కురిపించిన పోతన మరెవ్వరూ రాయనంత అందమైన పద్యాలను రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సంగనభట్ల నర్సయ్య– ఎన్ని నోముల ఫలము ఇంతపొద్దు ఒక వార్త వింటిని మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తునమ్మ సుధము... అని పాడి శ్రోతలను మైమరపించారు. పుట్టినప్పటి నుండి వెట్టిచాకిరి చేసి... కులకాంత రోజంత కూలిచేసినగాని బుక్కెడన్నం దక్కదాయె అంటూ తెలంగాణ పద్యకవిత్వంలోని ఆధునికతను గండ్ర లక్ష్మణరావు ప్రస్తావించారు. ఛందస్సును ఛేదించిన సురవరం అనంతరం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ వచన కవితా వికాసం సదస్సు అనేక దశల్లో కవితాప్రవాహ వేగాన్ని లోతుగా చర్చించింది. వ్యాకరణం, ఛందస్సును ఛేదించుకుని ... అన్న శ్రీశ్రీ, పట్టాభి కంటే ముందే భావ – పద్యకవిత్వాలను నెగేట్ చే సి 1935లోనే సురవరం ప్రతాపరెడ్డి వచన కవిత్వాన్ని తెచ్చారని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మాత్ర ఛందస్సు, గేయ ఛందస్సు, ఆ తరువాత వచన కవిత్వం తెలంగాణలో ఆవిష్కృతం అయిన క్రమాన్ని వివరించారు. సురవరం అనంతరం వావి నారాయణ మూర్తి, కవిరాయమూర్తి వచన కవిత్వం కొనసాగించిన విధానాన్ని ఈ సదస్సు గుర్తు చేసుకుంది. దిగంబర కవిత్వం కొనసాగింపుగా వచ్చిన విప్లవ కవిత్వం, అస్తిత్వ కవిత్వం, ఉద్యమ కవిత్వ ప్రవాహాన్ని భాషాభిమానులు తమ జ్ఞాపకాల్లో పొదివిపట్టుకున్నారు. గత 40–50 ఏళ్ళలో వచన కవిత్వంలో వచ్చిన మార్పు మరిదేనిలోనూ రాకపోవడం సామాజిక మార్పు ప్రభావాన్ని ప్రకటిస్తోందన్నారు గౌరవ అతిథి కె.శివారెడ్డి. ఇంకా జూలూరి గౌరీశంకర్, నారదాసు లక్ష్మణరావు, పెన్నా శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – అత్తలూరి అరుణ కమనీయం.. కవి సమ్మేళనం ఒకే వేదికపై 500 మందికిపైగా కవులు ‘అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల.. ఆల్లు.. ఈల్లు.. అస్తుండ్లు.. పోతండ్లు..’ ఒకటేమిటి ‘అ’నుంచి ‘ఱ’ వరకు సమస్త పదాలతో వచన కవుల ఆత్మనే కవితా çపంక్తులుగా మలిచి విసిరారు. కమ్మని గడ్డ పెరుగులాంటి కవితలతో అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం తన్మయం చెందింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వచన కవితా పండితులు తమ కవితలతో పదాల్లో నవరసాలను పండించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం జరిగిన బృహత్ కవి సమ్మేళనం ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. వానమామలై వేదికపై ప్రముఖ కవి దిలావర్ అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సీహెచ్ మధు అధ్యక్షతన జరిగిన తొమ్మిదో సమావేశంతో ముగిసింది. ప్రతి సమావేశానికి ఒక్కో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై 500 మందికిపైగా కవులు తమ కవితలను వినిపించారు. ‘మట్టి పొరల్లోనే మండిపడే బడబాగ్ని.. మధనపడే తిరుగుబాటు, తిరగబడే తీవ్రవాద మొలకలై.. మొక్కలు మారితే విప్లవం వటవృక్షాలుగా మారక ఏమవుతుంది? తుపాకులు ఎగురుతూ.. తూటాల చప్పుళ్లు వినిపిస్తుంటే మర ఫిరంగుల్లా మారక మరేం చేస్తాయి?’ అంటూ అన్వేషి అనే కవి రాజ్యహింసను సూటిగా ప్రశ్నించారు. ‘ఆ రాళ్లు పులకిస్తాయి.. పువ్వులై వికసిస్తాయి.. సౌందర్య సౌరభాలను గుబాళిస్తాయి.. ఆ రాళ్లు నాట్యాలై నర్తిస్తాయి.. శృంగార సోయగాలను వినిపిస్తాయి.. మనసును మత్తెక్కిస్తాయి.. అదే ఉలి సంతకం నేడు తెలుగుగా మహాసభలకు శోభాలంకృతమై తెలుగు వెలుగుల కీర్తికిరీటాలైతాయి..’ అంటూ మరో కవి తన కవిత వినిపించారు. ‘అ’మ్మ మన తోటలో ‘ఆ’వుదూడ నిల్చుంది. ‘ఇ’ంతలో తోటమాలి ‘ఈ’ ప్రాంతం వచ్చినాడు.‘ఉ’రికి ఆవు దూడను చూసి ‘ఊ’రుకోలేక ..‘రు’మాలునుజుట్టి ‘రూ’లుగర్రలను బట్టి ‘లు’ంబినీ వనంను.. ఇలా తెలుగు అక్షరమాల అ నుంచి ఱ వరకు గండి వెంకటేశ్వర్లు చదివిన కవిత సభికులను మంత్రముగ్ధులను చేసింది. ‘విరిసే నవచేతనం ఇది మాగాణం... ఇది మా..గానం. ఇక ఎండదు ఏ వృక్షం.. పండును ప్రతి ఫలపుష్పం. ఈ దారుల నదీనదం ఉరకలెత్తి ఉప్పొంగును. ఇది మాగాణం.. ఇది మా తెలంగాణం’ అంటూ కవి నర్సింహారెడ్డి భవిష్యత్ తెలంగాణను వివరించారు. ‘కంచు కంఠాలతో కండలు తెంచే బఠానీలాంటి తెలంగాణ హఠానీలను కూడా మిఠాయిలా మింగి వేసే తహతహ మాత్రం మెండుగా ఉంది. కానీ కమ్మని కంఠం నాకు లేదు’ అంటూ షేక్ నబీరసూల్ రాసిన కవిత ఆçహూతులను ఆకట్టుకుంది. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు సురవర కల్పవృక్షమై... సురవరం, సింగిరెడ్డి, దాశరథి, మాడపాటి పదాలతో కేసీఆర్ ప్రభుత్వ పాలనను వర్ణించాలని కోరగానే, ‘సురవర కల్పవృక్షమై శుభ్రకళా సుకలాప రూపమై’ అన్న తొలిపంక్తిని ఆశువుగా పూరించారు శతావధాని డాక్టర్ జి.ఎం.రామశర్మ. తెలంగాణ సారస్వత పరిషత్‌లో రామశర్మ శతావధానం భాషా చమత్కారాల మధ్య శనివారం ప్రారంభమైంది. ‘ఇంగ్లిషు చదువులు తెలుగు రాతను మార్చాయి. అమ్మ భాషకు కొత్త సొగసులు అద్దేందుకు భాషా పండితులే కాదు, ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. అందుకు ఈ మహాసభలకు హాజరైన వారే సాక్షిభూతులు’ అన్నారు రామశర్మ. సభకు అధ్యక్షత వహించిన అయాచితం నటేశ్వర శర్మ మాట్లాడుతూ... ఒక జాతి చరిత్ర, సంస్కృతి, కళ, సాహిత్యం... అన్నీ భాషపైనే ఆధారపడి ఉంటాయన్నారు. తెలుగు భాష అజంతం, తెలుగు మాట అనంతం అన్నారు అనుసంధానకర్త పెరుంబుదూరు శ్రీరంగాచార్య. ‘తెలుగు భాషకు మాత్రమే ఉన్న ప్రత్యేకత అవధానం. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు విడిపోలేదు, నన్నయ విడిపోలేదు, పోతన విడిపోలేదు. సారస్వతం విడిపోలేదు. వాక్యం రసాత్మకం కావ్యమ్, విశ్వః శ్రేయమ్ కావ్యమ్... అది పరమ సత్యం చేసిన ప్రక్రియ అవధానం. తెలంగాణలోని అవధానులూ అదే నిరూపిస్తున్నారు. పృచ్ఛకుల విషయంలో ప్రాంతీయ భావం లేకపోవడం సంతోషంగా ఉంది. శివకేశవులకు భేదం లేనట్లే ఆంధ్ర, తెలంగాణలకు భేదం లేదు’ అని గౌరవ అతిథి మేడసాని మోహన్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించట్లేదు. ‘సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, అన్ని విభాగాలలో ఇంగ్లిషు చలామణీ అయ్యేలా కొంతమంది మేధావులు ప్రచారం చేస్తున్నారు. ఇలాగైతే దేశం బానిసత్వంలోకి వెళ్లిపోతుంది. ఆ ప్రమాదం నుంచి త్వరగా బయటపడాలి’ అని కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘పృచ్ఛకులు, అవధాని సమష్టిగా చేసే కృషి భాషోన్నతికి ఉపయోగపడుతుంది. వారి వారి పాండిత్యాలు ప్రదర్శించడమే కాకుండా, శ్రోతలను విజ్ఞానవంతులను చేయాలి’ అని అభిలషించారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్. ‘1975లో మొదటి ప్రపంచ మహాసభలలో నేను కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడు ఒక కవిగా పాల్గొంటున్నాను’ అని సంబరపడ్డారు పృచ్ఛకుల్లో ఒకరైన వి.వి.సత్యప్రసాద్. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కావూరి పాపయ్య శాస్త్రి, దత్తాత్రేయశర్మ, మాడుగుల నాగఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. – డాక్టర్ వైజయంతి సకల జనుల ఇష్టావధానం! రసరంజకంగా మలుగ అంజయ్య అవధానం తెలుగు గొప్పదనం పద్యమైతే.. ఆ పద్యాన్ని శ్వాసించి, గానించి, కీర్తించి ప్రజల నాలుకలకు వారి గుండెలకు చేరువ చేసిన ఖ్యాతి అవధానులది! తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ వన్నె తరగని ఆకర్షక శక్తి, వశీకరణ యుక్తి అవధానానికి ఉందని నిరూపించింది శనివారం రవీంద్రభారతిలోగుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో జరిగిన అష్టావధాన కార్యక్రమం. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య డాక్టర్ మలుగ అంజయ్య అవధానం రెండు గంటలపాటు రసరంజకంగా సాగింది. పృచ్ఛకులు (ప్రశ్నించేవారు) అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాసాల జోలికి పోకుండా అలతి అలతి పదాల తెలుగు పదాల్లో బదులిచ్చారు. వడిచర్ల సత్యం దత్తపదిగా సెల్‌ఫోన్, షేరిట్, వైఫై, మెయిల్ పదాలిచ్చి రాముడి పంచన చేరిన తమ్ముడు విభీషణుడిని రావణాసురుడు దూషిస్తున్న ఘట్టాన్ని వర్ణించమని కోరారు. ‘అరివైపైనుండగా... నీకే సెల్లుపోనుండకు, రాముని కోరి భజింపుము సేరియిట్టులే, దశకంఠుడు చెండెను మేలు మేలనన్..’ వంటి పద విరుపులతో మెరుపులు పుట్టించారు. పల్లాలి కొండయ్య ఇచ్చిన ‘దారపు మాలలేసుకుని దంపతులయ్యిరి ప్రేమ మీరగన్’ సమస్యకు మం...దారపు మాలలు వేసుకుని అంటూ చమత్కారంగా పూరించారు. ఈ పద్యంలో తారలు నేల వ్రాలినను తప్పను ధర్మము...అన్న పాదానికి సినీనటుడు తనికెళ్ల భరణి సినీతారలు వ్రాలినా అని చమత్కరిస్తే... ఏ తారలైనా అంటూ అవధాని బదులిచ్చారు. చిక్కా రామదాసు అశేష జనవాహినితో నిండిన సభను వర్ణించాల్సిందిగా కోరారు. అవధాని.. ‘మంజుల సాహితీ మల్లికల్ పుష్పించె, ఆమని రుతువయ్యె హైద్రబాదు..’ అంటూ చక్కని సీసపద్యాన్నెత్తుకోవడంతో సభ్యులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. పద్యంలో ఒకచోట ‘కవితా జాగృతమయ్యి కళలు పంచె’ అనీ...‘మాన్య చంద్రశేఖరరావు మనసు నిండె’ అంటూ కేసీఆర్, కవితల పేర్లు సమయోచితంగా ప్రస్తావించారు. ఛందోభాషణ, ఆశువు, నిషిద్ధాక్షరి నిర్వహించిన పృచ్ఛకులు అవధాని అంజయ్య పటిమను ప్రశంసించారు. ఈ అవధానంలో వారగణనం ప్రత్యేకంగా నిలిచింది. సంవత్సరం, నెల, తేదీ చెప్పగానే అది ఏ వారమో చెప్పి అవధాని అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. సభ ప్రారంభంలో ప్రఖ్యాత అవధాని మాడుగుల నాగఫణిశర్మ అరగంటపాటు ప్రేక్షకుల్ని పద్యాలతో మైమరపించారు. ప్రపంచ మహాసభల పేరిట కేసీఆర్ భాషకు బ్రహ్మోత్సవం జరపడం తెలుగు వారి సుకృతమని ప్రశంసించారు. పాల్కురికి సోమన, పోతన, నన్నయలాంటి పూర్వకవులను స్మరించుకోవడం మహదానందమన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి ఇది సాహితీ పునరుజ్జీవానికి నాందీవాచకమని, అందుకు ఇక్కడ కిక్కిరిసి నిలుచున్న తెలుగు వాళ్లే సాక్ష్యం అని ఉద్వేగంగా పలికారు. అవధానం పద్యంలో నాల్గు పాదాలను నాల్గు ఆవృత్తాల్లో ముగిస్తూ, మధ్యలో సాహితీ సరసోక్తులు విసురుతూ రసరంజకంగా సాగాలి. అయితే సమయాభావం వల్ల గంటలో వేగావధనంగా ముగిసింది. సభలో యువతరానికి చెందిన కొందరు పద్యాలను చక్కగా రాసుకోవడం విశేషం. హాస్యావధానంలో శంకర నారాయణ సంధించిన చమక్కులు ఆహూతులను అలరించాయి. – రామదుర్గం ప్రతిరోజూ హరికథ సాధన తొమ్మిదో తరగతి చిన్నారి లోహిత బాలసాహిత్య సభకు వచ్చిన వారిని కట్టి పడేసిన కార్యక్రమం చలసాని లోహిత చెప్పిన పార్వతీ కల్యాణం హరికథ. కూకట్‌పల్లికి చెందిన ఈ చిన్నారి తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆసక్తిగా హరికథ చెప్పిన లోహితను పలకరించినప్పుడు... హరికథతో పరిచయం: అమ్మ వాళ్లది తెనాలి దగ్గర వేమూరు. అక్కడ వరికూటి జయమ్మ లాంటి భాగవతార్లు ఎంతో మంది ఉన్నారు. నాకు మూడేళ్లు ఉన్నప్పుడు అమ్మ వారి హరికథలకు తీసుకెళ్లింది. కొచ్చెల రామకృష్ణ గారి దగ్గర కొంత కాలం శిష్యరికం చేశాను. ఇప్పుడు ఉమామహేశ్వర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంస్కృతంలో కుమార సంభవం, తెలుగులో పార్వతీకల్యాణం, సీతా కల్యాణం నేర్చుకున్నాను. కథలే కాదు...: డీఏవీ పబ్లిక్ స్కూల్లో 9 వతరగతి చదువుతున్నాను. వారంలో మూడు సార్లు హరికథ తరగతులుంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటాను. అమ్మ దగ్గరుండి అన్నీ చూసుకోవటం వల్ల ఏ ఒత్తిడీ లేకుండా నేర్చుకోగలుగుతున్నాను. శోభానాయుడు, కేబి సత్యనారాయణ దగ్గర నృత్యం, నాగరాజ్ ప్రసాద్, శ్రీమన్నారాయణ వద్ద సంగీతం నేర్చుకున్నాను. భవిష్యత్తులో...: ఇటీవలే 108 మంది హరికథ భాగవతుల సత్కార కార్యక్రమం ధర్మపురిలో జరిగింది. అక్కడ సచ్చిదానంద శాస్త్రి హరికథ చెప్పారు. ఆయన చెప్పిన తీరు నన్నెంతో ఉత్సాహపరిచింది. కచ్చితంగా హరికథ భాగవతారిణిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నాకు హరికథ నేర్పించాలని మా తల్లిదండ్రులకు ఆలోచన కలిగినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలుగు వందల ప్రదర్శనలు: ఇప్పటి వరకు నృత్య, సంగీత, హరికథ ప్రదర్శనలు నాలుగు వందల వరకు ఇచ్చాను. పిల్లలకు, నా వయసు వారికి హరికథల గురించి తెలియదు. పేరెంట్స్ అలవాటు చేస్తే వాళ్లు చూస్తారు. తెలుసుకుంటారు. నృత్యం, సంగీతం కలిపి హరికథ చెప్పటం జరుగుతుంది. చాలా తృప్తి, సంతోషం కలుగుతాయి. – ఓ.మధు ఇలా చేద్దాం...! ‘వివేకవర్ధని’ మాసపత్రికను వెలువరిస్తూ 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు గారొక గొప్ప సంకల్పం చెప్పారు. ‘ఈ పత్రికా ప్రకటనము నందు నా యుద్దేశములు భాషాభివృద్ధియు, దేశాభివృద్ధియు ముఖ్యముగా రెండు. నేనేర్పరచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుగు భాషలో మృదువైన, సులభమైన, సులక్షణమైన వచన రచన చేయుట. దేశాభివృద్ధి మార్గము జనులలో గల దురాచార దుర్వర్తనముల బాపియు....’’ ఎంత గొప్ప మాట! వేమన, అన్నమయ్య, వీరేశలింగం పంతులు, గురజాడ, గిడుగు, సురవరం ప్రతాపరెడ్డి, ఆళ్వార్‌స్వామి, సినారె... ఇటువంటి మహనీయులు ఒక రకంగా భాషా పరిశోధకులే! వ్యక్తులుగా, వారికి తెలియకుండానే భాషపై లోతైన పరిశోధనలు జరిపి సాహిత్య రూపంలో నూతన ఆవిష్కరణలు చేశారు. వారందరి కృషి వల్లే తెలుగు భాష స్వరూప స్వభావాలు మార్చుకుని ప్రజలకు మరింత ఉపయోగ సాధనమైంది. జనసామాన్యం వాడుకలో భాష చెందుతున్న మార్పులకు అనుగుణంగా ఎందరెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తద్వారా భాషాభివృద్ధికెంతో మేలు జరిగింది. ఇదొక స్రవంతిలా సాగాలి. భాషను దీర్ఘకాలం సజీవంగా ఉంచేందుకు అన్ని స్థాయిల్లో పరిశోధనలు, ప్రయోగాలు, పరిరక్షణ చర్యలుండాలి. మాయబజార్ సినిమాలో ఘటోత్కచుడిగా ఎస్వీరంగారావు, ‘ఎవరో పుట్టించకుండా మాటలెలా పుడుతాయ్...వెయ్ వీరతాడు’ అన్న స్ఫూర్తితోనే ఎక్కడైనా భాష సుసంపన్నమౌతుంది. ‘యూఎన్’ ని నార్లవెంకటేశ్వరరావు ‘ఐక్యరాజ్యసమితి’ అనడమైనా, ‘డ్రెడ్జింగ్ షిప్’ను మరెవరో తెలుగులో ‘తవ్వోడ’ అనడమైనా భాషాపరంగా ఓ ముందడుగు. ఆ క్రమంలోనే స్ప్రింక్లర్ ఇరిగేషన్‌ను ‘తుంపర సేద్యం’అని, గ్లోబల్ వార్మింగ్‌ను ‘భూతాపం’ అనడం వంటి పద సృష్టి భాషా ప్రగతి. ఇలా భాషాభివృద్ధికి 5 ప్రాతిపదికలున్నాయి. 1. అకాడమీలు, విశ్వవిద్యాలయాల్లో పీఠాలు, సాహితీసంస్థల్లో పరిశోధనలు జరగాలి. 2. వినియోగంపై జనమాధ్యమాల్లో ప్రయోగాలు సాగాలి. 3. సాహితీరంగంలో నిత్యసృజన జరగాలి. 4. నిఘంటువులు, ప్రమాణ గ్రంథాలు, పారిభాషిక పదకోశాలు, పాఠ్యపుస్తకాల్లో ఈ నూతన ఆవిష్కరణల్ని ఉపయోగించాలి. 5. ఫలితంగా సమగ్ర భావ మార్పిడి, అభివ్యక్తితో తెలుగుజాతి గరిష్టంగా లబ్దిపొందాలి. – దిలీప్‌రెడ్డి -
వెల్లివిరిసిన సాహితీ సౌరభం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్యోత్సాహం వెల్లివిరిసింది. భాషా సాంస్కృతిక వైభవం కనువిందు చేసింది. వేలాది మంది భాషా, సాహితీ ప్రియులు తెలుగు తల్లి ఒడిలో సేదతీరారు. అమ్మ భాషతో మమేకమై తన్మయులయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజు శనివారం హైదరాబాద్‌లోని సభా వేదికలన్నీ ప్రభం‘జనాలై’ భాసిల్లాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతోపాటు తెలంగాణ సారస్వత పరిషత్తు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి వరకు వేలాది మంది వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాహిత్య సభ లాల్ బహదూర్ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో బమ్మెర పోతన వేదికపై ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’పై సాహిత్య సభ జరిగింది. వేల ఏళ్లుగా తెలుగు భాష పరిణామం చెందిన తీరుపై భాషా నిపుణులు మాట్లాడారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, రవ్వా శ్రీహరి, ముదిగంటి సుజాతారెడ్డి, ఎస్వీ సత్యనారాయణలు తెలంగాణలో తెలుగు భాషా వికాసాన్ని వివరించారు. అనంతరం జరిగిన హైదరాబాద్ సోదరుల ‘శతగళ సంకీర్తన’ సాంస్కృతిక కార్యక్రమం సభికులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. భక్త రామదాసు కీర్తనల ఆలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్పీకర్ మధుసూదనాచారి, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, సినీనటుడు తనికెళ్ల భరణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక అలేఖ్య బృందం నృత్య ప్రదర్శన, వింజమూరి రాగసుధ నృత్యం, షిర్నికాంత్ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఎల్బీ స్టేడియంలో సాంస్కృతికోత్సాహం వెల్లువెత్తింది. వెల్లువై జాలువారిన అవధానం.. తెలంగాణ సారస్వత పరిషత్తులోని మరిగంటి సింగనాచార్యుల ప్రాంగణంలో శతావ«ధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై ‘శతావధానం’ సాహిత్య వెల్లువై జాలువా రింది. గౌరీభట్ల మెట్టురామశర్మ శతావధా నం అందరినీ ఆకట్టుకుంది. మరే భాషలో నూ లేని ఈ అద్భుత సాహిత్య ప్రక్రియకు ఆయన పట్టం కట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఒక డాక్యుమెంటరీగా రూ పొందించనున్నట్లు ఆయన ఈ సంద ర్భంగా వెల్లడించారు. ఇక రవీంద్రభారతి లోని పైడి జయరాజ్ థియేటర్లో యువ జనోత్సవాలు ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా పలు చిత్రాలను ప్రదర్శించారు. వికసించిన సాహితీ సౌరభాలు తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై పద్యకవితా సౌరభాలు వెల్లివిరిశాయి. ‘తెలంగాణ పద్య కవితా సౌరభం’పై ఆచార్య అనుమాండ్ల భూమయ్య అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగనభట్ల నర్సయ్య, తూర్పు మల్లారెడ్డి, గురిజాల రామశేషయ్య తదితరులు పద్య కవితా వైభవంపై ప్రసంగించారు. మధ్యాహ్నం ‘తెలంగాణ వచన కవితా వికాసం’పై నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిరాజు రంగారావు, కూరెళ్ల విఠలాచార్య, జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచన కవిత్వంపై సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పెన్నా శివరామకృష్ణ మాట్లాడారు. హాస్యావధానం ఆనందభరితం.. రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలోని గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై నిర్వహించిన హాస్యావధానం నవ్వులు పూయించింది. ఆబాల గోపాలం ఆనంద పరవ శులయ్యారు. అష్టావధానంలో డాక్టర్ మలుగ అంజయ్య తన సాహిత్య సాధికారతను సమున్నతంగా ఆవిష్కరించారు. హాస్యావధానంలో శంకర నారాయణ ఆహూతులను కడుపుబ్బా నవ్వించారు. మంత్రి లక్ష్మారెడ్డి, రాపాక ఏకాంబరాచారి, తనికెళ్ల భరణి తదితరులు ఈ అవధానంలో పాల్గొన్నారు. అనంతరం పద్య కవి సమ్మేళనం జరిగింది. ఆకట్టుకున్న కవి సమ్మేళనం.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం బృహత్ కవి సమ్మేళనంలో ఎందరో భాషా పండితులు, యువ కవులు, కవయిత్రులు తమ సృజనా త్మకతను ఆవిష్కరించారు. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్ర మానికి దామెర రాములు అధ్యక్షత వహిం చారు. ఇక రవీంద్రభారతిలోని డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలో బండారు అచ్చమాంబ వేదిక ‘బాలసాహిత్యం’తో కొలువుదీరింది. రచయితలు పత్తిపాక మోహన్, చొక్కాపు వెంకటరమణ, వాసాల నరసయ్య, ఐతా చంద్రయ్య తదితరులు బాలసాహిత్యం గురించి ప్రసంగించారు. వెల్లివిరిసిన సాహితీ సౌరభం -
సభలు సరే, సందేశం ఏమిటి?
త్రికాలమ్ ప్రభుత్వం సంకల్పిస్తే అసాధ్యం ఏముంటుంది? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అభీష్టం మేరకు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. అద్భుతమైన ప్రసంగాలతో, ఆకట్టుకునే లేజర్‌షోతో వీనుల విందుగా, కన్నుల పండువగా శుక్రవారం సాయంత్రం తెలుగు భాషాభిమానులు మురిసిపోయారు. హైదరాబాద్ నగరంలో తెలుగు జయకేతనం ఎగురవేశారు. తెలుగు భాష స్వతంత్ర భారత స్వరూప స్వభావాలను నిర్దేశించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలుగువారికి సొంత రాష్ట్రం లేదు. మద్రాసు రాష్ట్రం లోనే తమిళులూ, కన్నడిగులూ, మలయాళీలతో సహజీవనం చేసేవారు. మరి కొందరు నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో కన్నడిగులూ, మరాఠీలూ, తమిళులతో, ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వివిధ భాషలవారితో కలసి నివసించేవారు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు తమిళుల ఆధిపత్యాన్ని ధిక్కరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశారు. భాషే ఈ ఉద్యమంలో ఆయుధం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం తర్వాత మద్రాసు లేని తెలుగు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సారథ్యం వహించింది ఆంధ్రమహాసభ. ఈ పోరాటంలో సైతం భాషే ఆయుధం. ఉర్దూ ఆధిక్యాన్ని ధిక్కరించి ఉద్యమించిన తెలుగువారు నిజాం పాలన నుంచి విమోచన సాధించారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలు 1956లో ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడానికి బలమైన కారణం భాషే. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. అటు తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తదితరాలు ఆ ప్రాతిపదికన ఏర్పడినాయి. 58 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. హైదరాబాద్ సహజంగానే తెలంగాణకు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానాం శాలు నిధులూ, నియామకాలూ, నీళ్ళూ అయినప్పటికీ భాష, సాంస్కృతిక చైతన్యం పాత్ర కూడా అంతే ప్రధానమైనది. అంటే తెలుగువారి రాజకీయంలో భాష అంతర్భాగం. భాషలో రాజకీయం అనివార్యం. 1975లో జలగం వెంగళరావు తొలి ప్రపంచ మహాసభలు నిర్వహించడం వెనుక రాజకీయ లక్ష్యం ఉంది. 1969–70, 1971–72లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల ఫలితంగా వందలమంది బలి కావడం, ఇద్దరు ముఖ్యమంత్రులు పదవీచ్యుతులు కావడంతో పాటు అనైక్యత ప్రబలి తెలుగు ప్రజల హృదయాలు అశాంతితో రగిలాయి. ఆ దశలో ఇరు ప్రాంతాల మధ్య ఐక్యత సాధించేందుకు భాషను సాధనంగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అంజయ్య హయాంలో ప్రవాసాంధ్రుల ప్రోత్సాహంతో 1981లో మలేసియాలో జరిగిన సభలకూ, 1990లో ఫిలిప్పీన్స్ సభలకూ రాజకీయ ప్రాముఖ్యం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన మహాసభల లక్ష్యం తెలుగువారి సమైక్య సాధనే. అవి కూడా నిష్ఫలమైనాయి. తెలుగు భాషపై కేసీఆర్ అధికారం తెలుగు ముఖ్యమంత్రులలో తెలుగుభాషపైన అధికారం, మమకారం కలిగినవారి జాబితాలో దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కేసీఆర్ పేర్లు ముందుంటాయి. ఈ సభల వెనుక సైతం రాజకీయం ఉంది. కదన కుతూహలం, కవన కుతూహలం దండిగా కలిగిన ముఖ్యమంత్రి ఉద్యమ సేనానిగా పరాక్రమించి ప్రత్యేక రాష్ట్ర సారథిగా పరిశ్రమిస్తున్న నేపథ్యంలో అచ్చ తెలుగు భాషకు మూలాలు తెలంగాణంలోనే ఉన్నాయని నిరూపించవలసిన చారిత్రక అవసరం ఉన్నదని భావించి ఉంటారు. రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే భాషనే ప్రామాణికం చేసి ఇతర ప్రాంతాలవారి మాండలికాలనూ, యాసలనూ ఎద్దేవా చేసిన ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే మాట నిజం. ఉద్యమ సమయంలో సీమాంధ్ర రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఘాటు విమర్శలతో తూర్పారబట్టిన కేసీఆర్ రాష్ట్ర విభజన జరిగి తాను అధికారంలో కుదురుకున్న అనంతరం సీమాంధ్ర ప్రజల హృదయాలలో విభజన చేసిన గాయం మాన్పడానికి లేపనం అద్దడానికి ప్రయత్నిస్తున్నట్టే తెలుగు మహాసభలను సైతం యావన్మంది తెలుగు ప్రజల సంఘీభావ సాధన కోసం ఉద్దేశించారా? కేవలం హైదరాబాద్‌లో, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్ల కోసమే కేసీఆర్ రూ. 50 కోట్లకు పైగా ఖర్చుతో ఇంత హంగామా చేశారా? విడిపోయినా కలసి ఉందాం అనే సద్భావనను ప్రోత్సహించాలనుకుంటే సీమాంధ్ర తెలుగు వెలుగుల ప్రస్తావన విధిగా ఉండేది. పాల్కురికి సోమనాథుడూ, పోతనతో పాటు కవిత్రయం, శ్రీనాథుడు వెంకయ్యనాయుడి లిఖిత ప్రసంగంలోనైనా ఉండవలసింది. గిడుగు, గురజాడల జాడ లేదు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ పేరు విస్మరించారు. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన మెదిలిన తర్వాత నాలుగు మాసాలలో ఇంతటి బృహత్కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టం. వ్యవధి చాలక కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అదే కారణమైతే రాద్ధాంతం చేయనక్కరలేదు. అట్లా కాకుండా, బుద్ధిపూర్వకంగా తెలంగాణ వేడుకగానే నిర్వహించి ఉంటే భాషను తాజాగా రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకున్నట్టు భావిం చాలి. గత పాలకులు చేసిన తప్పిదాన్నే కేసీఆర్ సైతం చేశారని చరిత్రలో నమోదు అవుతుంది. ఐదు రోజుల కార్యక్రమాలకీ నిర్దిష్టమైన చర్చనీయాంశాలు సూచిం చారా లేక ఎవరి పాట వారు పాడుకొని వెళ్ళిపోవడమేనా? కార్యక్రమాల జాబితా చూసినప్పుడు పూసలలో దారం లాగా అంతస్సూత్రం ఏదీ కనిపించదు. ఈ సమావేశాల కొనసాగింపు ఏమిటనే స్పష్టత లేదు. దేశ, విదేశాల నుంచి వచ్చిన హేమాహేమీలు ఒక చోట చేరి చర్చించుకున్న తర్వాత తెలుగు భాషాసాహిత్య వికాసానికి భవిష్యత్ చిత్రపటం రూపకల్పన జరగాలి. సాహిత్య అధ్యయనాన్ని ప్రోత్సహిం చేందుకూ, భాషాజ్ఞానం పెంపొందించేందుకూ, భాష వాడుకను విస్తరించేందుకూ ఎటువంటి వ్యవస్థలు, ఎటువంటి కార్యక్రమాలు అవసరమో నిర్ణయించాలి. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మహాసభలు ఇవి. ప్రణాళికాబద్ధంగా చర్చలూ, సమాలోచనలూ జరిగితే తెలుగు జాతికి ప్రయోజనం ఉంటుంది. అధికార భాషగా తెలుగును ప్రకటించిన తర్వాత ఏమి జరిగిందో లేదా ఏమేమి జరగలేదో, బోధనాభాషగా తెలుగు ఉండాలంటూ భాషాభిమానులు చేస్తున్న వాదనకు సమాధానం ఏమి చెప్పాలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఈ సభలు సార్థకం అవుతాయి. లేకపోతే తానా, ఆటా, నాటా సభలలాగే ఇవి కూడా తెలంగాణ తెలుగు సంబురాలుగానే మిగిలిపోతాయి. బోధనాభాషగా సాధ్యమా? తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా నిర్బంధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందించాలి. భాషకు సంబంధించి లోగడ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. తాజా ఉత్తర్వులను నిష్కర్షగా అమలు చేస్తే ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయాలని నిర్ణయించారంటే తెలుగును బోధనా భాషగా చేయడం సాధ్యం కాదని భావించి ఉంటారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ ఆదాయవర్గాల వారు సైతం సర్వస్వం ఒడ్డి తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యాసంస్థలలో చేర్చుతున్నారు. ఉద్యోగావకాశాలు వినియోగించుకోవాలంటే ఇంగ్లీషు ప్రావీణ్యం తప్పనిసరి. ఈ క్షేత్ర వాస్తవికతని గర్తించాలి. అయితే మాతృభాషకీ, ఆంగ్లానికీ మధ్య వైరుధ్యం లేదు. ఎనిమిదో తరగతి వరకూ బోధన మాతృభాషలో ఉంటే పిల్లలకు చదువు బాగా ఒంటపడుతుందనీ, ఆ సమయంలో మెదడు పెరుగుతుంది కనుక ఒకటి కంటే ఎక్కువ భాషలను బాలలు సులభంగా నేర్చుకోగలుగుతారనీ పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం ప్రాథమిక పాఠశాల స్థాయి వరకైనా బోధన మాతృభాషలో చేసి, ఇంగ్లీషును ఒక భాషగా తప్పనిసరి చేయగలిగితే విద్యార్థులకు రెండు భాషలలోనూ గట్టి పునాది పడుతుంది. ఆరో తరగతి నుంచి ఇంగ్లీషును బోధనాభాషగా చేసి తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయడం వల్ల ఉద్యోగార్హత ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పై చదువులు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు. మాతృభాష బాగా వచ్చినవారికి మరో భాష నేర్చుకోవడం సులువు. పునరుక్తి భయం ఉన్నప్పటికీ ఒక్క అనుభవం మనవి చేస్తాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చదువుతున్న రోజుల్లో (1972–73) ‘దక్కన్ క్రానికల్’ న్యూస్ ఎడిటర్ మూర్తి పాఠాలు చెప్పేవారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు నన్ను విజయవాడ వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూ చేసి రమ్మనమని పురమాయించారు. సత్యనారాయణ తెలుగులో మహాకవి. నేను ఇంగ్లీషులో ఇంటర్వ్యూ రాయాలి. ‘మాస్టారూ, నేను తెలుగులో ప్రశ్నలు అడుగుతాను. మీరు తెలుగులోనే సమాధానాలు చెప్పండి పర్వాలేదు. నేను తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుంటాను’ అని వినయం ఉట్టిపడుతుండగా అన్నాను. ‘అంత శ్రమ ఎందుకు. ఇంగ్లీషులోనే అడగవోయ్’ అన్నారు చిర్నవ్వుతో. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా టకటకా జవాబులు చెప్పాడు మహానుభావుడు. చెప్పింది చెప్పినట్టు పొల్లుపోకుండా రాసి మూర్తిగారికి సమర్పించాను. ఆయన అక్షరం మార్చకుండా ఎడిట్ పేజీలో పై నుంచి కింది దాకా ఆ వ్యాసం ప్రచురిం చారు. ఎంతో మంది మెచ్చుకున్నారు. ఒక భాషలో పట్టు ఉన్నవారికి మరో భాష నేర్చుకోవడం సులువని చెప్పడానికి ఇది నిదర్శనం. భాష సంపద్వంతం కావాలంటే... తెలుగులో మహా నిఘంటువు లేకపోవడం పెద్ద లోపమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏ భాష అయినా సంపద్వంతం కావాలంటే మడికట్టుకొని కూర్చోకూడదు. తన అస్తిత్వానికి ముప్పు లేకుండా అన్య భాషాపదాలను స్వీకరించాలి. అన్ని భాషల నుంచీ పదాలు సొంతం చేసుకుంటుంది కనుకనే ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా అనునిత్యం ఎదుగుతూ ఎదురు లేని ప్రస్థానం సాగి స్తోంది. ప్రామాణిక భాష మాండలికాలపైన ఆధిక్యం చెలాయించకూడదు. వాటిని తనలో కలుపుకోవాలి. కొత్త కొత్త పరికరాలూ, ఆవిష్కరణలూ శాస్త్రసాంకేతిక రంగాలలో కొత్త పదజాలాన్ని తీసుకొస్తుంటాయి. ఆ సమాచారం సర్వసాధారణంగా ఇంగ్లీషులో పీటీఐ లేదా యూఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ద్వారా వస్తుంది. దానిని తెలుగులో తర్జుమా చేసే బాధ్యత పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న ఉప సంపాదకులపైన పడుతుంది. ఎవరికి తోచినట్టు వారు తర్జుమా చేస్తారు. అన్నిటినీ పరిశీలించి ఒక్క మాటను ఖరారు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఒక వ్యవస్థను నెలకొల్పాలి. పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటువంటి ప్రయత్నం చేశారు కానీ అది కొనసాగలేదు. ఒకసారి పబ్లిక్ గార్డెన్‌లోని జూబిలీ హాలులో పత్రికాభాషపైన జరిగిన సభలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పాల్గొన్నారు. ‘టెలివిజన్‌కు తెలుగులో ఏమి రాయాలో మనకు తెలియదు. ఒక పని చేయండి. ఒక పల్లెటూరులో అందరూ గుమిగూడే చోట టీవీ పెట్టండి. దాన్ని ప్రజలు ఏ పేరు పెట్టి పిలుస్తారో దాన్ని ఖాయం చేయండి. వారు బొమ్మలపెట్టె అంటే అదే రాయండి’ అని సలహా చెప్పారు. ప్రజల దగ్గరికి భాషను తీసుకొని వెళ్ళడం అంటే అదే. ఈ పని ఎంత ఎక్కువగా జరిగితే భాష అంత సజీవంగా ఉంటుంది. దేశంలో హిందీ తర్వాత తెలుగే ఎక్కువ మంది మాట్లాడే భాష. ప్రాచీన భాష హోదా వచ్చి ఏళ్ళు గడిచిపోతున్నా దానికి ఒక భవనం ఏర్పాటు చేసి భాష, సాహిత్యం అధ్యయనానికీ, పరిశోధనకూ అవసరమైన హంగులు ఏర్పాటు చేయలేదు. సాంకేతిక పరిభాషగా తెలుగు ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. గూగుల్ సాఫ్ట్వేర్ లైబ్రరీలో తెలుగు వాటా పెంచుకోవాలి. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటకలను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. అక్కడ ప్రభుత్వ ఉత్తర్వులూ, దిగువ కోర్టులలో తీర్పులూ మాతృభాషలోనే వెలువడుతున్నాయి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది తెలుగుభాషకు కొత్త వెలుగూ, కొత్త చూపూ, కొత్త ఊపూ తేగలిగితే కేసీఆర్ జన్మ చరితార్థం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
తెలుగు భాషకు ప్రాచీన హోదా ఎలా వచ్చింది ?
-
తెలుగు మహాసభలు ఆరంభ వేడుకలు
-
అమ్మ భాష బాగు కోసం..
-
రాజకీయ కోణంలోనే తెలుగు సభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను భాషాభివృద్ధికోసం కాకుండా రాజకీయకోణంలో నిర్వహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జీవన్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టుల విధానమే తన విధానమన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఒరిగేదేం లేదు..ప్రపంచ తెలుగు మహాసభలపై డీకే అరుణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురించి గొప్పలు చెప్పించుకోవడానికే రూ. కోట్ల నిధులు వెచ్చించి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో 4 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడే తెలంగాణ ఇచ్చారు సోనియా పార్టీ ఖ్యాతిని నిలబెట్టారు: సీఎల్పీనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల హృదయ ఘోషను అర్థం చేసుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన ఉద్యమానికి భయపడి, విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, గుండెకోతను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని జానారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాలపాటు సేవలందించిన సోనియా, పార్టీ ఖ్యాతిని నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నందున తాను ప్రపంచ తెలుగు సభలకు హాజరుకాలేక పోతున్నానని చెప్పారు. వ్యక్తిగత రాగద్వేషాలను, మనస్పర్థలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు మహాసభలకు అందరు కవులు, కళాకారులను ఆహ్వానించాలని జానారెడ్డి సూచించారు. అందెశ్రీ వంటివారిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్, అందెశ్రీలాంటి వారందరినీ ఆహ్వానించి తెలుగు మహాసభలు నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, మహాసభల్లో ఇష్టమైన వారికే సీఎం కేసీఆర్ స్థానం కల్పించారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన కవులు, రచయితలకు ఈ మహాసభల్లో స్థానం కల్పించకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించడమేమిటన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించినా తెలంగాణ చరిత్ర వారిని గుర్తుపెట్టుకుంటుందన్నారు. -
అద్భుతం.. అమ్మ భాష ఉత్సవం
తెలుగు భాషా సౌరభం గుబాళించింది.. అమ్మ భాష గొప్పదనం కళ్ల ముందు కదలాడింది.. తేనెలూరే తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సంబురం మొదలైంది. అలనాటి సాహితీ దిగ్గజాలు స్వర్గం నుంచి చూస్తే.. ఈ నేలపై వాలి మరోసారి తమదైన శైలిలో సాహితీ సేద్యాన్ని జరిపించాలని ఆశపడేవారేమో.. అన్నట్లుగా సాగింది. నింగిని తాకిన తెలుగుభాష గొప్పదనాన్ని చాటిన ఈ ఉత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావులు విశిష్ట అతిథులుగా పాల్గొనగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. అంగరంగ వైభవంగా.. సరిగ్గా 6.06 నిమిషాలకు సీఎం కేసీఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూర్ణకుంభ స్వాగతంతో ప్రాంగణంలోకి తోడ్కొని వచ్చారు. అనంతరం నృత్య కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యహేళతో సభలు సంప్రదాయ, సాహితీ సుగంధాన్ని అద్దుకున్నాయి. 6.25కు వేద మంత్రాల మధ్య ముఖ్య అతిథులు వేదికను అలంకరించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలనం చేసి మహాసభలను ప్రారంభించారు. నిత్య సంతోషిణి, లావణ్యలు ఆలపించిన ‘యా కుందేందు..’ప్రార్థనతో సభ మొదలైంది. సభల సైడ్‌లైట్స్.. - తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇవే. 1975లో తొలి సభలు నిర్వహించిన లాల్‌బహదూర్ క్రీడా మైదానమే ఈ సభలకూ వేదిౖకైంది. - మైదానానికి పాల్కురికి సోమన ప్రాంగణంగా పేరు పెట్టగా.. వేదికకు బమ్మెర పోతన వేదికగా నామకరణం చేశారు. - వేదిక వద్ద ఎత్తయిన కాకతీయ తోరణం ప్రతిరూపం, దానిపై వాలిన రాష్ట్రపక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక... ఓవైపు పూల పండగ బతుకమ్మ నిలువెత్తు రూపం.. మరోవైపు బతుకమ్మను ధరించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకున్నాయి. - ప్రత్యేక వేదికలపై 8 వేల మంది ఆసీనులుకాగా.. మరో 30 వేల మంది ప్రాంగణంలో చుట్టూ ఆసీనులయ్యారు. - తెలుగు మహాసభలపై అయాచిత నటేశ్వరశర్మ పద్య కవిత్వాన్ని, ఆచార్య ఎన్ గోపి మహాసంకల్పం పేరుతో వచన కవిత్వాన్ని వినిపించారు. - దాదాపు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ సంస్థ విజ్‌క్రాఫ్ట్ ఆధ్వర్యంలో సాగిన బాణసంచా వెలుగు జిలుగులు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. - విదేశాల నుంచి వచ్చిన కొందరు తెలుగువారు పంచెకట్టులో ఆకట్టుకున్నారు. -
తెలుగు అమలు ఏది?
యూరోపియన్ దేశాల్లో వారి తల్లిభాషలే తప్ప ఆంగ్లం వినిపించదు, కనిపించదు. ఇంటా బయటా సకల వ్యవహారాలు వారి భాషలోనే ఉంటాయి. పదిహేను కోట్ల మంది మాట్లాడే తెలుగువారికి మాత్రం తెలుగు చదివితే ఉపాధి దొరికే పరిస్థితి లేకపోవడం ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం? తెలంగాణలో తెలుగు భాషపై నిజాంపాలన కాలంలో అప్రకటిత నిషేధం కొనసాగింది. తెలుగు మృతభాషగా మారే ప్రమాదం వాటిల్లింది. తెలుగు మాతృభాషగా గల కులీన కుటుంబాలు ఉర్దూలోనే మాట్లాడుకునేవారు. ఉర్దూ, ఆంగ్లభాషల వ్యామోహంలో పడ్డ మహనీయులు తెలుగుభాషను ఈసడించారు. తెలుగు భాష బోధన నిలయాలు తెలంగాణలో ఆంధ్ర జనసంఘం (1921), ఆంధ్ర మహాసభ (1931)ల నిర్మాణానికి కావల్సిన పూర్వరంగాన్ని, ప్రజాచైతన్యాన్ని సిద్ధం చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అశ్రద్ధకు గురైంది. కళలు, సంస్కృతి, సాహిత్యం వెనుకబడ్డాయి. ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ భాషకు చాలా పెద్ద పీట వేస్తారని ప్రజలు ఆశించారు. తెలుగు నేలమీద ప్రపంచ మూడవ తెలుగు మహాసభలు డిసెంబర్ 15 నుంచి అట్టహాసంగా హైదరాబాద్‌లో మొదలైనాయి. మొదటిసారి 1975 మార్చిలో హైదరాబాద్‌లో జరిగాయి. రెండవసారి 2012 డిసెం బర్లో తిరుపతిలో జరిగాయి. తెలుగు భాషను ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు అమలు చేస్తామని, తెలుగుభాష, సంస్కృతి, చారిత్రక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ విస్మరణకు గురైన తెలంగాణ ప్రముఖులను వెలుగులోకి తెస్తామనే నినాదంతో ఈ సభలు జరుగుతున్నాయి. కానీ ఇదొక సాకు మాత్రమే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా అమలు చేసి ఉండేది. ఇప్పటికీ విద్యాబోధనలో ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వమే ప్రాధాన్యత ఇస్తోంది. తెలుగును చులకనగా చూస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కనీసం ఖాళీగా ఉన్న తెలుగు, చరిత్ర బోధకుల పోస్టులను కూడా భర్తీ చేయలేదు. తెలంగాణలో ఇప్పటి దాక పాలకులు మాతృభాషను ప్రజల నుండి బలవంతంగా దూరం చేయాలని ప్రయత్నిస్తే, నేడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల ప్రభావంతో తెలుగు సమాజం తన మాతృభాషను దూరం చేసుకోవడం, ఆంగ్ల భాష పట్ల వ్యామోహం పెంచుకోవడం, దానికోసం కొందరు పనిగట్టుకొని ప్రచారం చేయడం ఒక పెద్ద విషాదం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చూస్తుంటే భాష అభివృద్ధికన్నా దాని పేరిట జరిగే సంబరాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తోంది. భాష ఔన్నత్యాన్ని చాటడంకన్నా ముస్తాబులు, షోకులే ఎక్కువగా కనబడుతున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికీ సరైన భాషా విధానాన్ని రూపొందించుకోలేదు. తెలంగాణ యాస, భాషను పరిరక్షించుకోవాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ సందర్భంలోనైనా విద్యాబోధనా విధానంలోని మౌలిక, కీలక మాధ్యమం అంశాన్ని చర్చించాల్సి ఉంది. మాతృ భాష ద్వారానే ప్రకృతి, సమాజాల గురించిన మౌలిక భావనలనూ, పరాయి భాషలనూ సులువుగా, బాగా నేర్చుకోగలుగుతామని ప్రపంచ దేశాల అనుభవాలు, భాషాశాస్త్రజ్ఞుల నిర్ధారణలూ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు తెలుపుతున్నాయనే అంశాన్ని పాలకులు గమనంలో పెట్టుకోవాలి. కానీ ఆంగ్ల మాధ్యమం చదువులే మంచివన్న భ్రమలు తల్లిదండ్రులను పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలకు ఇదే ఆలోచనే ఉన్నట్లుంది. గత 30 ఏళ్ళుగా ఆంగ్ల మాధ్యమం ద్వారా సాగుతున్న చదువుల నాణ్యతను మదింపు చేయించాలి. ఆంగ్లభాష ద్వారా కాకుండా తమ తమ జాతీయ భాషల విద్యా మాధ్యమం ద్వారా ఉన్నతవిద్యనూ, పరిశోధనలనూ సాగించే దేశాల అనుభవాలను స్వీకరించాలి. దీనర్థం మనకు ఆంగ్లభాష వద్దని కాదు. ఆంగ్లాన్ని బాగా, సులువుగా నేర్చుకోవటం కూడా మాతృభాష ద్వారానే సాధ్యపడుతుందనే శాస్త్రీయాంశాన్ని గమనంలో పెట్టుకుని విద్యాబోధనా విధానాన్ని నిర్ణయించుకోవాలి. మాతృభాష ద్వారా ఎంత ఎక్కువ పరిజ్ఞానాన్ని పొందితే అంత బాగా ఆంగ్లభాషలో పట్టు సాధించటం సాధ్యపడుతుంది. యూరోపియన్ దేశాల్లో వారి తల్లిభాషలే తప్ప ఆంగ్లం వినిపిం చదు, కనిపించదు. సకల వ్యవహారాలు వారి భాషలోనే ఉంటాయి. 15 కోట్ల మంది మాట్లాడే తెలుగువారికి మాత్రం తెలుగు చదివితే ఉపాధి దొరికే పరిస్థితి లేకపోవడం ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం? వలస మనస్తత్వంతో వ్యవహరిస్తూ తెలుగు భాషను మృతప్రాయంగా చేసే కౌటిల్యానికి ఒడిగట్టిన ప్రభుత్వ వ్యవహర్తలకు ఇది సిగ్గనిపించదు. అలాంటి వారికి తెలుగు నేల మీద ఇంటా బయటా తెలుగు వేయి రేకులుగా విరబూయాలనే మాట వింతగా తోస్తుంది. ఎందుకంటే తెలుగులో మాట్లాడటమే నామోషీగా భావించే స్థితికి తెలుగువారిని దిగజార్చిన దుష్పలితమిది. నిజంగా మన పాలకులు తెలుగును ప్రేమిస్తే సకల జీవనరంగాల్లో తెలుగును పరివ్యాప్తం చేసే విధానాల్ని రూపొం దించాలి. తెలుగులో చదువుకున్నా బతుక్కి ఢోకా లేదన్న భరోసానిచ్చే కార్యాచరణకు సంకల్పించాలి. బోధనలో, పాలనలో అన్ని స్థాయిల్లో తెలుగును ప్రవేశపెడితే అవకాశాలు వాటంతటవే వస్తాయి. 1966 తెలుగు అధికార భాషా చట్టంలో ‘‘అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలు, లేఖలు తెలుగులోనే ఇవ్వాలి. హాజరుపట్టీలు తెలుగులోనే రాయాలి. సంతకాలు, సెలవుచీటీలూ మాతృభాషలో ఉండాలి. ప్రభుత్వ పథకాలకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నామఫలకాలు విధిగా తెలుగులోనే ఉండాలి’’ అని ప్రభుత్వానికి చేసిన నిర్దేశమిదీ. 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటే అమ్మభాషపై మన పాలకులకు, అధికార యంత్రాంగానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రతిరోజు 200 నుంచి 250 ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఇందులో ఒక్కటీ తెలుగులో ఉండటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగులో వచ్చిన ఉత్తర్వుల సంఖ్య 500 దాటలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో తెలుగులో వచ్చిన ఉత్తర్వులు కేవలం 20. పాలనాభాషగా తెలుగు అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. తెలుగులో కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతను నిర్లక్ష్యం చేసేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంలోనైనా తెలంగాణ ప్రభుత్వం తెలుగును బోధనా, పాలనా భాషగా ఆచరణీయం చేసే కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి. మాతృభాషలో బోధన జరగాలని విద్యాపరిరక్షణ కమిటీ గత నాలుగు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నది. ఈ మహాసభలు పాలనను, బోధనను తెలుగులో జరిగేలా ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలిగితే ఈ సభలకు ఏమైనా అర్థం ఉంటుంది. ఆ దిశగా విధాన నిర్ణయం ఉండేలా ప్రజలు పాలకుల మీద ఒత్తిడి తేవాలి. (డిసెంబర్ 15–19 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొ‘‘ కె. చంద్రశేఖర్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ‘‘ కె. లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొ‘‘ జి. హరగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ ముఖ్యాంశాలు) -
విరసం నేత వరవరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపునిచ్చి నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన విప్లవ రచయితల సంఘం(విరసం), తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) నేతలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో విరసం నేత వరవరరావు, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, హిమా యత్ నగర్లో ‘వీక్షణం’ఎడిటర్ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో విప్లవ రచయితలు పాణి, గీతాంజలి, రాంకి, కాశిం, కూర్మనాథ్, ‘మా భూమి’సంధ్య, సాగర్, అరవింద్ తదితరుల్ని అరెస్టులు చేశారు. దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని నార్త్‌జోన్‌లోని వివిధ ఠాణాలకు తరలించారు. తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలు ముగిసిన అనంతరం సొంత పూచీకత్తుపై వీరిని విడిచిపెట్టారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తోందని ఆరోపిస్తూ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం వద్ద విరసం, టీపీఎఫ్ నిరసన తలపెట్టడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అక్కడికి వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేశారు. తెలుగు భాషను ధ్వంసం చేసేవాళ్లే సంబరాలు జరుపుతారా.. అని వరవరరావు విమర్శించారు. -
తల్లి భాషకు జై
సాక్షి, హైదారాబాద్ : తెలుగు భాషా సౌరభం గుబాళించింది.. అమ్మ భాష గొప్పదనం కళ్ల ముందు కదలాడింది.. తేనెలూరే తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అలనాటి సాహితీ దిగ్గజాలు స్వర్గం నుంచి చూస్తే.. ఈ నేలపై వాలి మరోసారి తమదైన శైలిలో సాహితీ సేద్యాన్ని జరిపించాలని ఆశపడేవారేమో.. అన్నట్లుగా సాగింది. నృత్య కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యహేళతో సభలు సంప్రదాయ, సాహితీ సుగంధాన్ని అద్దుకున్నాయి. నిత్య సంతోషిణి, లావణ్య ఆలపించిన ‘యా కుందేందు..’ ప్రార్థనతో సభ మొదలైంది. ప్రపంచ తెలుగు మహాసభలు- ప్రత్యేక కథనాలు అమ్మ భాష బాగు కోసం.. సర్వశక్తులు ఒడ్డుతాం సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మన భాషకు పట్టం సాక్షి, హైదరాబాద్ : జీవన గమనానికి మాతృభాషే ఆయువుపట్టు. మాతృభూమిని, మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు. -
మన భాషకు పట్టం
సాక్షి, హైదరాబాద్ : ‘‘జీవన గమనానికి మాతృభాషే ఆయువుపట్టు. మాతృభూమిని, మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు. తెలంగాణ, రాయలసీమ నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర దాకా విన్పించే విభిన్న యాసలన్నీ భాషామతల్లి కంఠంలో మణిహారాలే’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ఆరంభ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 42 ఏళ్ల క్రితం 1975లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం జలగం వెంగళరావు ఆధ్వర్యంలో తెలంగాణలో, అంజయ్య హయాంలో మలేసియాలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇవాళ తెలంగాణ గడ్డపై మరోసారి ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ ఆధ్వర్యంలో అంతకన్నా పెద్ద స్థాయిలో జరుగుతుండటం తెలుగు వారందరినీ ఎంతగానో ఆనందింపజేస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘నా తల్లి నా చిన్నప్పుడే మరణించింది. తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలే నాకు తల్లి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మన పద్యం, గద్యం ఒకప్పుడు జగద్విదితం. వాటిని మళ్లీ దశదిశలా వ్యాపింపజేయాలి. భిన్న భాషల హారమైన భారత్‌లో తెలుగు ప్రత్యేకతను నిలబెట్టుకుందాం’’ అంటూ పిలుపునిచ్చారు. ‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో పని చేయడానికి వచ్చే ఏ అధికారైనా తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి’’ అని సూచించారు. చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలన్నారు. ఆ దిశగా కేసీఆర్, చంద్రబాబు మరింత చొరవ తీసుకుంటారని ఆశాభావం వెలిబుచ్చారు. హాలుడు మొదలు సినారె దాకా... తెలుగు భాష చరిత్ర ఎంతో ప్రాచీనమని వెంకయ్య గుర్తు చేశారు. ‘‘క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నాటి హాలుడి గాథాసప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథల్లోనూ తెలుగు పదాలున్నాయి. ఆంధ్రుల ప్రస్తావన భారతంలోనూ, బౌద్ధుల కాలంలోనూ ఉంది’’ అన్నారు. కవిత్రయం మొదలుకుని సినారె దాకా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన కవులు, సాహితీకారులకు నివాళులర్పించారు. ‘‘బడిపలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలన్న కాళోజీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తా. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు అత్యంత నిరాదరణకు గురైంది. అమ్మభాష కోసం తెలంగాణలో నాటి తరం భారీ ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ తెలుగును తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు’’ అంటూ ప్రస్తుతించారు. సాహితీ సేద్యంలో మేటి తెలంగాణ... తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి దూస్తుందన్న దాశరథి మాటలు అక్షరసత్యమని వెంకయ్య అన్నారు. ‘‘ప్రశ్నించే, ప్రతిఘటించే సాహిత్యం ఇక్కడ ప్రాణం పోసుకుంది. సాహితీ, పత్రికా రంగాల్లో తెలంగాణ తేజాల సేవలు నిరుపమానం. స్త్రీ విద్య గురించి 1914లోనే తెలంగాణలో స్త్రీలు తామే స్వయంగా రాసి ప్రచురించుకునేవారని తెలిసి ఒళ్లు పులకరించింది. వీధి భాగవతం, చిందు భాగవతం, గంగిరెద్దులాట, ఒగ్గు కథ, పిచ్చుకుంట్ల, కోలాటాలు, బుడగ జంగాలు, శారద కాండ్రు, బహురూపులవారు, పిట్టల దొర, బుర్రకథ వంటి తెలంగాణ కళలు వాటికవే సాటి. ఇక్కడి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారమ్మ జాతర, పీర్ల పండగ ప్రాంతీయ విశిష్టతను చాటిచెబు తాయి’’ అంటూ ప్రస్తుతించారు. జ్ఞానపీఠ గ్రహీత దివంగత సి.నారాయణరెడ్డి తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ఇంటర్నెట్లోనూ విరివిగా తెలుగును వాడాలన్నారు. భాష, యాస పదాలతో సమగ్ర నిఘంటువులను రూపందించుకోవాలన్నారు. తెలుగు మహాసభలను అపూర్వంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ తదితరులకు అభినందనలు తెలిపారు. -
అమ్మ భాష బాగు కోసం.. సర్వశక్తులు ఒడ్డుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భాష ఔన్నత్యాన్ని పెంచేందుకు, మరింత పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లాల్‌బహదూర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై విశిష్ట అతిథులు, భాషాభిమానుల సమక్షంలో వేడుకలు మొదలయ్యాయి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాష ఔన్నత్యం, భాషా వికాసానికి జరిగిన కృషి, ప్రస్తుతం కవులు చేస్తున్న ప్రయత్నం, ప్రజా సంకల్పం తదితర అంశాలను ప్రస్తావించారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన దాశరథి, కాళోజీల పేరిట పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని.. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఇటీవలే ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ప్రస్తుతం భాషా పండితులు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని.. వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వేమన, సుమతీ శతకాలు, పద్యాలు, సిద్దిపేటలో అవధానుల వైభవం, అజంత భాషగా తెలుగు ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించారు. తెలుగు భాషా పాండిత్యాన్ని, అమ్మ భాషపై మక్కువను, విద్యార్థి దశలోని మధురానుభూతులను వేదికపై పంచుకున్నారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. గురువుల చేతిలో దేశ భవిష్యత్తు ‘‘గురువులంటే చిన్నచూపు చూసేవారు. గతంలో బతకలేక బడిపంతులు అనేవారు. కానీ అది చాలా తప్పు. దేశం, సమాజ భవిష్యత్తును కాపాడే మార్గం చెప్పే వారే గురువులు. దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తి వారికి ఉంది. భావిపౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కంకణం కట్టుకోవాలి. రాయిలాగా ఉన్న నన్ను అశేష జనం ముందు నిలబడి నాలుగు తెలుగు మాటలు మాట్లాడే స్థాయికి తెచ్చింది గురువులే. నాకు అబ్బిన భాష వారి చలవే. చిన్నప్పుడు నాకు తెలుగు బోధించిన మృత్యుంజయశర్మ గారిని మరువలేను. ఉత్తర గోగ్రహణం పాఠం చెప్పి వ్యాకరణ దోషం లేకుండా మరుసటి రోజు అప్పగిస్తే నోట్ పుస్తకం బహుమతిగా ఇస్తానన్నారు. నేను ఇప్పుడే అప్పగిస్తానంటే చెప్పు చూద్దామని పరీక్షించారు. అమ్మవారిని తలుచుకుని ఓ ఐదు సార్లు చదివి వెంటనే అప్పగించా. నాకు బహుమతిగా పుస్తకం తెప్పించి ఇచ్చారు. అప్పట్లో నేను రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడి ఇంట్లో ఉండి చదువుకునే వాడిని. నా ప్రజ్ఞ గమనించి తన వద్దకు పంపాల్సిందిగా గురువుగారు ఆయనకు సూచించారు. ఉదయం ఐదున్నరకు మృత్యుంజయశర్మగారి ఇంటికి వెళ్లేవాడిని.. చదువులో, సాహిత్యంలో రాయిగా ఉన్న నన్ను సానబెట్టి మార్చారు. నేను రత్నంగా మారానో, లేదోగానీ ఈరోజు ఈ మహా వేదిక వద్ద మీ ముందు నిలబడి నాలుగు మాటలు మాట్లాడేస్థాయికి రాగలిగాను. దుబ్బాక చెరువు గట్టుపై తిరుగుతూ తొమ్మిదో తరగతిలోనే పద్యాలు రాసిన. ఇలాంటి గురువులుంటే భాషకు వైభవం వస్తది. గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ లాంటి గురువులు నాకు ఎంతో ఉపయోగపడ్డారు. గుమ్మ పద్యం చెప్తే గుమ్మపాలు తాగినట్టుండేది. సిద్దిపేటలో వికసించిన సాహితీ కుసుమాలకు కొదవనేలేదు. పూత రేకంటే ఏమిటి..? 1972లో ఓసారి శోభన్‌బాబు సినిమా చూసిన.. అందులో హీరోయిన్ను వర్ణిస్తూ పూతరేకులాంటి లేత సొగసు అని పద ప్రయోగం ఉంది. పూతరేకంటే అర్థంగాక గురువును అడిగిన. అది పూలరేకు అయి ఉంటుందన్నరు. సినిమాహాలు ముందు పాటల పుస్తకం కొని చూస్తే అందులో కూడా పూతరేకనే ఉంది. గురువుగారు మరోసారి అడిగి ఆ పదం రాసుకుని విజయవాడలో తెలిసిన కవిని అడిగి పూతరేకంటే ఓ మిఠాయి పేరని తెలుసుకుని.. నాకు చెప్పిండ్రు. తనకు తెలియని విషయం నావల్ల తెలిసిందంటూ నన్ను కౌగిలించుకున్నారు. భాష, సాహిత్యం, సందేహం అడిగితే నివృత్తి చేయాలన్న తపన అప్పటి గురువుల్లో అలా ఉండేది. భాషను మరింత పరిపుష్టం చేయాలన్న తపన ఉండేది. అది ఇప్పుడు కావాలె. తేట తెలుగు పదాలు అవి.. పోతన అద్భుతంగా భాగవతాన్ని మన ముం దుంచిండు. తేటతెలుగు పదాలు జాలువారినట్టుండే పద్యాలు ఉట్టిగనే అర్ధమైతయి. ‘నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు...’ఈ పద్యాల్లో కఠిన పదాలుండవు, సమాసాలుండవు. అర్థమ య్యే సాహిత్యం మాత్రమే ఉంటది. ‘ఇందుగలడందులేడని సందేహమ్ము వలదు..’పద్యంలో అందు ఇందు ఎందెందు. ఉట్టిగనే అర్ధమైతది. ‘మందార మకరందం..’కూడా అంతే కదా.. ‘బాలరసాలసాల నవపల్లవ..’అంటూ సాగిపోతుంది. ‘పాలసంద్రంలో పవళించేవాడు పరుల ఇండ్ల పాలుకోరనేల..’అంటూ అవసరమైతే దేవుడినే ధిక్కరించే ఆగ్రహం కవుల సొంతం. తెలంగాణలోనూ ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిన కవులు ఎందరో ఉన్నారు. అప్పట్లో జీవిత సారాన్ని వివరించే సాహిత్యం విరివిగా అందుబాటులో ఉండేది..’’ తెలంగాణ కవులకు కితాబు ఆనాడు అద్భుత సాహిత్యాన్ని పండించిన కవుల తరహాలోనే ఇప్పుడు తెలంగాణలోనూ కవులు భాషకు వన్నె తెస్తున్నారని కేసీఆర్ అభినందించారు. గోరటి వెంకన్న రాసిన పాటలు వింటే అందులో వర్ణన మన కళ్లముందే ఉన్నట్టు అనిపిస్తుందని, కొన్ని కన్నీళ్లు తెస్తాయని చెప్పారు. ‘గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది..’, ‘సంత మా ఊరి సంతా..’లాంటి పాటలను ఉదహరించారు. గోరటి అద్భుత వాగ్గేయకారుడని ప్రశంసించారు. జయజయహే తెలంగాణ గీతం రాసిన అందెశ్రీ, వానమ్మా వానమ్మా అంటూ గీతం రాసి ఆలపించిన జయరాజ్ తదితరులను ఉదహరించారు. అవధాని నాగఫణిశర్మ పద్యాలు ఆలపించి ఆకట్టుకుంటారని, తాను చిన్నప్పుడు పెరిగిన దుబ్బాక వెంకటరావుపేటలో కవులు ఎన్నో కావ్యాలు రాశారని చెప్పారు. తెలంగాణలో కవులు చాలామంది ఉన్నారని, సమయాభావం వల్ల పేర్లు చెప్పలేకపోయినందుకు క్షమించాలని కోరారు. సాహిత్యం సంస్కారాన్ని ఇస్తుంది ‘‘అమ్మ ఒడే తొలి బడి, అక్కడి నుంచే మన జీవిత ఒరవడి, మన నడవడి మొదలవుతుంది. అమ్మ ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామగోవిందా...’అని పాడుతూ తన పిల్లలు రాముడు, గోవిందుడిలా ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రపంచానికి తన బిడ్డను, తన బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇందులో పద్యాలు, సాహిత్యానిదే ప్రధాన భూమిక. మా నాన్న చక్కటి గమనాన్ని సూచించారు. ‘శ్రీరాముని దయచేతను..’పద్యంలో ఇదే విషయం దాగి ఉంది. సాధారణంగా సరస్వతీ దేవి గుడిలో.. లేకుంటే ఏదో ఓ మందిరంలో అక్షరాభ్యాసం చేసి బడిలో వేస్తారు. ఊళ్లో బడి లేకుంటే అయ్యవారి బడికి పంపుతారు. నేను అలా అయ్యవారి బడికే వెళ్లా. అక్కడే మంచి నడవడిక అలవడింది. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్’పద్యంలో చెప్పినట్టు.. జీవితంలో ముఖ్యమైన అండదండలు అవసరం. ఆ పద్యం చదివాక నాకో సందేహమొచ్చింది. ‘మన ఊళ్లో నిరంతరం పారే యేరు లేదుకదా..’అని మా గురువును అడిగితే... నిత్యం జలసిరి ఉండే చెరువులున్నా చాలని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు మంచి సంస్కారం, అవగాహనను మన సాహిత్యం అందిస్తుంది..’’ దృఢ సంకల్పం అవసరం.. తెలంగాణ గడ్డపై అద్భుతంగా వికసించి, విలసిల్లిన తెలుగు భాషా సాహిత్యం మరింత పరిపుష్టం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలుగు భాషను రక్షించుకోవాలనే దృఢ సంకల్పం అవసరమని ఉద్ఘాటించారు. ‘‘ఈ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఒక్కటే విన్నపం. భాషకు ఎల్లలు లేనందున ఈ మాట చెప్తున్నా.. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఒక కవి మరో కవిని తయారు చేయాలి. ఈ భాషా వికాస యజ్ఞానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలి..’’ అని సీఎం పిలుపునిచ్చారు. కోటి గొంతుల వీణలు: గవర్నర్ ప్రపంచ తెలుగు మహాసభలు కోటి గొంతుల వీణలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మహా సభల ప్రారంభోత్సవంలో అభివర్ణించారు. భాష, బతుకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, తెలుగు మహాసభలు భువన విజయంలా సాగుతున్నాయన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు. తెలుగు భాష కమ్మదనాన్ని భావితరాలకు మహాసభలు పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న తొలి తెలుగు మహాసభల్లో పాల్గొనడం మధురానుభూతి అని, ఎందరో మహానుభావులు తెలుగు భాషను సుసంపన్నం చేశారని కొనియాడారు. అవధానం తెలుగు వారికే సొంతం కావడం గర్వకారణమన్నారు. తెలుగు భాష అత్యంత పురాతనమైనదని, అజరామరమైనదని తెలిపారు. ఆంగ్ల మోజు తగ్గించుకుంటేనే.. అన్య భాషలపై ఆసక్తితో అమ్మ భాషను విస్మరించటం సమంజసం కాదని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లినా మనం ఆంగ్లాన్ని వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష పరిరక్షణకు కమిటీ వేయాలని, ఇందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. మాతృభాషలోనే విద్యా బోధన అవసరమని యునెస్కో పేర్కొన్న విషయాన్ని అంతా గుర్తించాలని పేర్కొన్నారు. ఇంట్లో తెలుగు మాట్లాడి బడిలో ఆంగ్లం చదివితే విద్యార్థుల మేధస్సు పరిణతి చెందదన్నారు. ఏడాదిలో 365 రోజులు ఉంటాయన్న విషయాన్ని భాస్కరాచార్యులు వెయ్యేళ్ల క్రితమే చెప్పారని, ఆర్యభట్టు ప్రపంచానికి శూన్యం (సున్న) విలువ తెలియజెప్పిన తీరును ప్రపంచమంతా శ్లాఘిస్తుంటే.. మనం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తెలుగు బడుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణవాదిని: అసదుద్దీన్ ‘నేను ఢిల్లీలో ఉన్నçప్పుడు దక్షిణ భారతీయుణ్ని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని’అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన తెలుగు ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ–ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని, పాలు–నీళ్లలా కలిసిపోయారని ఆయన అన్నారు. పాతబస్తీకి చెందిన హమీదుల్లా షరీఫ్.. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారని, గఫూర్ తెలుగులో ఎన్నో సాహితీ ప్రక్రియలు రాశారని గుర్తు చేశారు. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు. -
భాషకు బ్రహ్మోత్సవం
ఆరంభం అదరహో.. మతాబులు.. బాణ సంచా వెలుగులు జిలుగులు.. ఆకాశంలో సప్తవర్ణ కాంతులు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సంబురం మిన్నంటింది! శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తున్నట్లు రాత్రి 8.30 గంటలకు అధికారికంగా ప్రకటించిన వెంటనే.. ఆకాశంలో కాంతులు విరజిమ్మాయి. ఎల్ఈడీ.. లేజర్ లైట్ల వెలుతురుతో ఆకాశంలో సప్తవర్ణాలు ఆవిçష్కృతమయ్యాయి. సుమారు పది నిమిషాల పాటు ఈ వెలుగులు.. ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. బాణసంచా వెలుగులను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు వీక్షకులు ఆసక్తి చూపారు. ఆకాశంలోని అద్భుత దృశ్యాలను స్టేడియం నలుమూలలా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల్లో చూసి ఆనందించారు. ఈ మ్యూజికల్ ఫైర్వర్క్స్ను ప్రముఖ కార్పొరేట్ సంస్థ విచ్‌క్రాఫ్ట్ నిర్వహించింది. వీటికి సుమారు కోటి రూపాయల దాకా వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహాసభల ముగింపు రోజైన ఈ నెల 19న కూడా లేజర్‌షోతోపాటు బాణసంచా కాంతులతో మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నారు. మొత్తంగా వీటన్నింటికిగానూ రూ.2.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక సౌరభం.. ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ చరిత్రను, కళలను, వైభవాన్ని ఆవిష్కరించిన రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి బృందం ప్రదర్శించిన ‘మన తెలంగాణ మాణిక్యవీణ’ సంగీత నృత్య రూపకం అలరించింది. అద్భుతమైన నృత్యం, అందుకు తగిన అభినయంతో అరంగంటకు పైగా సాగిన ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ తన్మయత్వం పొందారు. ప్రధాన వేడుకల ప్రారంభోత్సవం అనంతరం మిరుమిట్లు గొలిపే బాణ సంచా వెలుగు జిలుగులు ఒకవైపు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు మరోవైపు మహాసభలను కన్నులపండువ చేశాయి. ప్రారంభోత్సవ వేడుకలకు ముందు మయూరి ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన పేరిణీ లాస్యం శతాబ్దాల నాటి కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టింది. శ్రీనిధి, వందేమాతరం శ్రీనివాస్ గీతాలాపన మరో ఆకర్షణ. ఆద్యంతం తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లిటిల్ మ్యుజీషియ¯Œ ్స అకాడమీ రామాచారి బృందం పాడిన పాటలు, దేశపతిశ్రీనివాస్ సారథ్యంలో, రాధాకృష్ణన్ సంగీతం కూర్చిన ‘జయజయోస్తు తెలంగాణ’ నృత్య రూపకం మరో అద్భుతమైన ప్రదర్శనగా ఆకట్టుకుంది. ఆహా ఏమి రుచి... ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ రుచులు అదుర్స్ అనిపించాయి. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేష¯Œ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తెలంగాణ వంటకాలను తెలుగు భాషాభిమానులు ఆరగించి తృప్తిపడ్డారు. హైదరాబాదీ బిర్యానీ, బడేమియా కబాబ్, బొక్కల పులుసు, తెలంగాణ మిర్చి బజ్జీ, బ్రెడ్ ఆమ్లెట్, మలాయి కుల్ఫీ, తెలంగాణ చాయ్, వేడి వేడి గుడాలు వారేవా అనిపించాయి. హైదరాబాద్‌కు వస్తే హైదరాబాదీ బిర్యాని రుచి చూడాల్సిందే. పేరుతోనే ఆకలి పెంచే హైదరాబాదీ బిర్యానీ రుచులు మహాసభల్లోనూ అదిరిపోతున్నాయి. మటన్, చికె¯Œ తో చేసిన కబాబ్స్ నా¯Œ వెజ్ ప్రియుల నోరూరించాయి. వేడి వేడి శనగ, పెసర, బబ్బెర గుడాలు గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు.. గిన్నెలోవి మొత్తం కడుపులో పడే వరకు చెయ్యీ నోరూ ఆగవు. వేడి వేడి చర్చల్లో వీటి రుచి రెట్టింపు అని గ్రహించారేమో, వాటికీ ఒక స్టాల్ పెట్టేశారు. సీజ¯Œ తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పానీయం తేనీరే. దీంతో సభ ప్రాంగణంలోనికి వెళ్లే ముందు చాయ్ కోసం పోటీ పడ్డారు. ముందే చలికాలం కావడంతో మరింత మక్కువ కనిపించింది. తెలుగు భాష తియ్యనిదే అయినా కారం అంటే మమకారం వదలరు. అందుకేనేమో మహాసభల్లో మిర్చిబజ్జీలకు మహా గిరాకీ పలికింది! తొలి తొవ్వ మనదే ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి: దేశపతిమాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. ఎన్నో ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది అని ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంగీత నృత్యరూపకం గురించి ఆయన స్పందన. పాట.. ఎన్నో మహోద్యమాలను నడిపింది. దానికి అనుసంధానంగా నృత్యరూపకాలు. ఎన్నో సందర్భాల్లో ఇవి రుజువయ్యాయి. తెలంగాణ గడ్డపైన తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులు అనేక మంది ఉన్నారు. వారి కష్టం వృథా పోకూడదు. వారి వీరోచిత చరిత్ర ప్రజలకు తెలియాలి. నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కవిగా నాపై ఉందని భావించా. పాటతో నృత్యరూపకం అయితే బాగుంటుందని భావించా. దీన్నుంచి పురుడుపోసుకున్నదే ‘జయ జయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యరూపకం. వాళ్లు జీవితాన్నే పాడుతారు ∙జ్ఞానపీపురస్కార గ్రహీత సీతాకాంత్ మహాపాత్రద్విభాషాకోవిదులు, జ్ఞానపీ అవార్డు గ్రహీత, ఒరియా నుంచి 12 భారతీయ భాషలూ, 13 భారతీయేతర భాషల్లోకీ అనువదించిన అనేక పరిశోధనాత్మక గ్రంథాలను రాసిన, ఐదు దశాబ్దాలపాటు తన సాహిత్యంతో ఒడిశా ప్రజల, ప్రధానంగా ఆదివాసీల మన్ననలనందుకున్న గొప్ప రచయిత సీతాకాంత్ మహాపాత్ర పుస్తకం పేరు ‘దే సింగ్ లైఫ్’. మన దేశ చరిత్రలో మౌఖిక సాహిత్య ప్రాధాన్యతను గురించి చెప్పమని ‘సాక్షి’ అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు’. ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారాన్ని స్వీకరించడానికి హైదరాబాద్ వచ్చిన సీతాకాంత్ పంచుకున్న అంతరంగం... ‘‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు. మొదట వాళ్ల తల్లులు, ఆ తరువాత వాళ్ల పిల్లలు, మనవలు, మునిమనవరాళ్లు. కానీ వాళ్ల సజీవ సాహితీ ప్రక్రియ అయిన మౌఖిక సాహిత్యం మరణించదు. నిరంతరం, తరం తరం ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇక్కడైనా, ఎక్కడైనా మౌఖిక సాహిత్యానికున్న ప్రత్యేకత అది. వాళ్లు నిరక్షరాస్యులు. అయితేనేం ఎంతో పాండిత్యాన్ని చదివినవారు కూడా వాళ్ల ప్రతిభ ముందు దిగదుడుపే. తూర్పు భారతంలో నేను ఎక్కువగా పనిచేశాను. ఒడిశా, బిహార్, బెంగాల్, జార్ఖండుల్లో విస్తృతంగా ఆదివాసీల జీవితాలను చదవడం కోసమే తిరిగాను. ఆదివాసులకు ఆస్తుల్లేవు. ఆధిపత్యాల్లేవు. అవకాశాలూ లేవు. ‘దే డోంట్ హావ్ పొసిషన్ ఆల్సో’. వాళ్లకి తెలిసిందొక్కటే... జీవితాన్ని అనుభవించడం. వాళ్లది సామూహిక జీవితం. సమైక్య జీవనం. ఆధునిక సమాజంలో ఉన్నట్టు ఒక్కరు పాడితే వెయ్యిమంది వినడం కాదు. వారంతా కలిసి పాడతారు. ఆడతారు. అందరికోసం అందరూ అనేది వారిదైన వారి సంస్కృతి. ఈ రెండు సమూహాలకీ మధ్య ఒక బలమైన గీత ఉంది. అదే కమర్షియలైజేషన్. వ్యాపారీకరణ. ఒక్కరు పాడటం డబ్బు కోసం. కానీ అందరూ కలసి పాడటం ఆనందం కోసం. కళని కొనుక్కోవడం బ్రిటిష్ వారి నుంచే వచ్చింది. కానీ ఆదివాసీలనెవరూ కొనలేరు(నెక్లెస్ రోడ్లో ఆకాశం గుండా ఎగురుతోన్న పక్షుల్ని చూపిస్తూ). ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛా జీవులు. వాళ్లకి తమవాళ్లెవరో, పరాయివాళ్లెవరో స్పష్టంగా తెలుసు. బయటి వాళ్లని వాళ్లు ‘దిక్కు’ అని పిలుస్తారు. చేయాల్సింది వాళ్లని మనలో కలుపుకోవడం కాదు. వాళ్ల సంస్కృతినీ, వారి జీవితాలనూ, వారి సాహిత్యాన్నీ కాపాడాలి. అలా అని వారు ఎదుగూబొదుగూ లేకుండా నిరక్షరాస్యులుగా ఉండాలని కాదు. వారి భవిష్యత్ తరాలను అక్షరాస్యులుగా మార్చి వారి కళలను కాపాడాలి. వారి హస్తకళలు ఇప్పుడు ఆధునిక ప్రపంచం గోడలకు వాల్‌హ్యాంగింగ్స్‌గా వేలాడుతున్నాయి. అలాగే ఆధునిక ప్రపంచం వారి చేతితో గీసిన బొమ్మలు వేసిన బట్టలను విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది. అలా వారి మనుగడను కొనసాగనివ్వాలి. 200 ఏళ్ల క్రితం తెలుగు ఎలా వుందో, ఇప్పుడలా లేదు. మౌఖిక సంప్రదాయాల్లో కొనసాగింపు అధికం. అనేక తరాలు వాటిని అందిపుచ్చుకుని కొనసాగిస్తాయి. వాటిని అలా బతకనిస్తే చాలు’’ దేశ రాజధానిలోనూ జరగాలి! తెలుగు సంస్కృతి ప్రపంచంలో నలుదిశలా విస్తరించింది. సంస్కృతి పరిపూర్ణమయ్యేది భాషతోనే. అలా తెలుగు భాష విస్తరించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. మేము మా కళ ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించినప్పుడు అక్కడ తెలుగు మహిమ గురించి మాట్లాడే అవకాశాలెన్నో వచ్చాయి. ఉద్యోగాల కారణంగా ఖండాంతరాలలో స్థిరపడిన వాళ్లు ఒక ఇరవై ఏళ్ల నుంచి తెలుగు భాష, సంస్కృతి మీద మమకారం పెంచుకుంటున్నారు. అమెరికాలో తెలుగు వారి సాంస్కృతిక సభలకు వెళ్లినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వారాంతంలో పిల్లలను కల్చరల్ క్లాస్‌లకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్, స్టాక్‌హోమ్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు 90 ఏళ్ల మహిళ ఈ పద విన్యాసం, అంగ విన్యాసం, భావ వ్యక్తీకరణ ఏకకాలంలో ఇంత అద్భుతంగా చేయడం భారతీయులకే సాధ్యం అని మురిసిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చినప్పుడు అనేక మంది ఉత్తరాది కవులు తెలుగు భాషలో, తెలుగు గ్రంథాలలో భావ వ్యక్తీకరణ రమణీయంగా ఉంటుందని ప్రశంసించేవారు. చరిత్రలో కూడా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించిన రాజు తెలుగేతరుడే. కృష్ణదేవరాయలు తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడవడంతోపాటు తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి తెలుగు సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లాడు. నేటికీ మనం తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకోవడానికి కృష్ణదేవరాయలు చెప్పిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే జాతీయాన్నే చెప్పుకుంటున్నాం. తెలుగు భాష మహోన్నతంగా విరాజిల్లాలంటే ఇలాంటి సభలు ఇంకా జరగాలి. దేశ రాజధాని నగరంలో కూడా నిర్వహించాలి. – రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు, ప్రముఖ నాట్యకారులు ఇలా చేద్దాం...! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిటా పాఠశాల విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. మరీ ముఖ్యంగా విద్యాబోధన తల్లి భాషలోనే జరుగుతోంది. మన దగ్గర ఇది పూర్తి విరుద్ధం. పాఠశాల విద్యను దాదాపు ప్రైవేటు పరం చేశారు. ప్రభుత్వ నియంత్రణే లేని ప్రైవేటు రంగంలో ఆంగ్లమాధ్యమ పాఠశాలలే అత్యధికం. అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోపాటు ఐరోపాకు చెందిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి ఏ దేశం తీసుకున్నా అక్కడి విద్యా బోధన ప్రధానంగా తల్లిభాషలోనే! వలస విముక్త దేశాల్లో ఆంగ్ల దుష్ప్రభావం వల్ల ఎన్ని స్థానిక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయో ‘యునెస్కో’వద్ద లెక్కుంది. పలు ప్రపంచ అధ్యయనాల సారం ఏమంటే.. ‘పరభాషల కన్నా తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో మేధోవికాసం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అలా చేస్తూనే ఒకటి, లేదా రెండు పరభాషల్ని నేర్పించినా 13–14 ఏళ్ల వరకు పిల్లలు అత్యంత తేలిగ్గా వాటిని నేర్చుకోగల్గుతారు. అలాంటి వారే ఎన్నెన్నో పరిశోధనలు జరిపి, కొత్త విషయాలు కనుగొని, వినూత్న ఆవిష్కరణలు చేసిన దాఖలాలున్నాయి. ఇది శాస్త్రీయంగా ధృవపడిన అంశం. చైనాలో అత్యధికులకు బొత్తిగా ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు ఎరిగిన వారూ అదనపు భాషగా నేర్చుకున్నదే! కానీ, విశ్వవ్యాప్తంగా వారు విస్తరించడానికీ, ఇటీవల సాధిస్తున్న ఆధిపత్యానికీ అదేం అవరోధం కాలేదు. పాఠశాల విద్య తల్లిభాష తెలుగులోనే ఉండాలి. ఐదారు తరగతుల నుంచి ఇంగ్లీషును అదనపు భాషగా నేర్పాలి. 12వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరి అంశం కావాలి. ఆ పైన కూడా యువతలో ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రాచీన, ఆధునిక తెలుగుసాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, చౌకగా అందుబాటులోకి తేవాలి. శాస్త్ర–సాంకేతిక, విశ్వస్థాయిలో వచ్చే నూతన పదజాలానికి, భావజాలానికి తెలుగులో మంచి అనువాదం, అనుసృజన జరిపించాలి. ఇందుకోసం అకాడమీలు, భాషా పరిశోధనాలయాలు, విశ్వవిద్యాలయాల్లో భాషాపీఠాలకు తగు నిధులిచ్చి నిరంతరం క్రియాశీలంగా కృషి జరిపేట్టు చూడాలి. – దిలీప్‌రెడ్డి తమిళనాట తెలుగు శోకం తమిళనాడులో తెలుగు ‘బతికి బట్ట కట్టడం కష్టమే’నంటున్నారు మాడభూషి సంపత్‌కుమార్. అక్కడ మద్రాస్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తెలుగువాళ్లు తమిళులుగా మారుతున్నారు..తెలుగు మహాసభల ఏర్పాట్లు బాగున్నాయి. తెలుగు నేల మీద అడుగు పెట్టడమే ఒక పులకింత అయితే ఆత్మీయ స్వాగతం మరింత ఆనందపరిచింది. తమిళనాడులో మన తెలుగు పరిస్థితి ‘బతికి బట్ట కట్టడం కష్టమే’ అన్నట్లుంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళనాడులో తెలుగు వాళ్ల సంఖ్య 40 శాతం. ఇప్పుడు రెండు శాతానికి మించి లేదు. ఉన్న తెలుగు జనం మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. పిల్లవాడిని పాఠశాలలో చేర్చేటప్పుడు కృష్ణ అనే పేరు ఉంటే కృష్ణన్ అని రాసేస్తారు. అలా తెలుగు వాళ్లు తమిళులుగా మారిపోతున్నారు.తెలుగు టీచర్ రిటైర్ అయితే అంతే..తమిళనాడులో ఒకప్పుడు తెలుగు పాఠశాలలు ఉండేవి. కానీ ఆ స్కూళ్లలో తెలుగు టీచర్ రిటైర్ అయితే ఇక ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. దాంతో పిల్లలు అందులో చేరరు. ‘విద్యార్థులు చేరడం లేదు కాబట్టి ఆ పోస్టును రద్దు చేస్తున్నాం’ అని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలుగు భాషను అణచివేస్తోంది. 2006లో నిర్బంధ తమిళ విద్య చట్టాన్ని తెచ్చింది. ఇతర భాషలను చదవడానికి ఇప్పుడసలే వీల్లేదు. అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి తమిళులకు వాళ్ల మాతృభాష మీద ప్రేమ చాలా ఎక్కువ. ఈ క్రమంలో వారి తీరుతో తెలుగు భాష, తెలుగు వాళ్లు వివక్షకు గురవుతున్నారని అనిపించేది. అందుకే తెలుగు వాళ్లను ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నంలోనే భాగంగానే తెలుగు భాçషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలో తమిళ ప్రొఫెసర్లు పైకి ఏమీ అనరు. కానీ తమిళనాడులో ఉన్నప్పుడు తమిళులుగానే జీవించవచ్చు కదా, తెలుగు భాష అంటూ ఇవన్నీ ఎందుకు... అని తమలో తాము చర్చించుకుంటారు! తెలుగు మాట్లాడేవారు 16 కోట్లుతెలుగు మాట్లాడేవాళ్లు 16 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇందులో సగం మంది తెలుగేతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్యను ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పుకోవు. ప్రభుత్వాలు తమిళనాడుతో మాట్లాడాలి..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడే.. భాష పరిరక్షణకు మాలాంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలకు ఊతం వస్తుంది. కన్నడిగులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫొటోలను ఇళ్లలో పెట్టుకుంటారు. తెలుగులో ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వస్తే... ఆ సంగతి సాహిత్యకారులకు తప్ప సామాన్యులకు తెలీదు. – వాకా మంజులారెడ్డి తెలుగును కాదని పరభాషని ప్రేమించకూడదుచరిత్రకారులు కొందరు జరిగిన దాన్ని రాస్తారు. కానీ జరుగుతున్న ప్రజల చరిత్రను, వారి అనుభవాలను రాయడమే నేడు అవసరం అంటారు కారా మాష్టారుగా తెలుగు ప్రజలకు పరిచయమైన కాళీపట్నం రామారావు. 93 ఏళ్ల వయోవృద్ధులు కారా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. నేటి తరానికి కావాల్సిన కథలెలా ఉండాలి? సంస్కృతం చదివిన వారికి కూడా కావ్యాలు చదివే శక్తిలేదిప్పుడు. కూటి కోసం, కూలి కోసం వలసెళుతున్న ఎందరో పేదలు నిలువనీడలేక, బ్రిడ్జిల కింద కూడా తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తుల జీవితాల్ని ఆవిష్కరించే రచనలు, ఆ అభిప్రాయాలను వ్యక్తీకరించే పాత్రలు రచనల్లో కనపడాలి. తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? ప్రగతిశీల భావాలు కలిగిన వారే ఆ పని చేయగలరని ఆశ. తెలుగు వారిపై ఆంగ్ల భాషా ప్రభావాన్ని ఎలా చూడాలి? భాషల్లో ఎక్కువ తక్కువలుండవు. తమిళం మాట్లాడేవారికి అదే గొప్ప. తెలుగు మాట్లాడతాం కనుక మనకిది గొప్ప. కానీ తెలుగువాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేసి ఆంగ్లంలో మాట్లాడటం సరికాదు. అభిప్రాయాల కారణంగా పొరపాట్లు జరుగుతాయి. విజ్ఞానంతో విమర్శనాత్మకంగా మన జీవితాల్ని తరచి చూసుకోవాలి. అది అందరికీ అర్థం అయ్యేట్లు చేయాలి. మంచి ఆలోచన, మంచి పద్ధతి ఎవరినుంచి గ్రహించినా అది కలకాలం ఉంటుంది. కానీ మన భాషని నిర్లక్ష్యం చేసి, పరభాషని ప్రేమించడం కాదు. స్త్రీల సమస్యల్నెలా చూడాలి? స్త్రీల జీవితాలను గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఉద్యమకారులు, ఓల్గా లాంటి వారు ఒకప్పుడు తమ రచనల్లోనూ, నిజజీవితంలోనూ పురుష ద్వేషాన్ని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు వారిలో మార్పొచ్చింది. పురుషుల్ని కాకుండా సామాజిక పరిస్థితుల్ని ద్వేషిస్తున్నారు. ఇది మంచిదే. ఎంతో మంది వారి అభిప్రాయాలను అంగీకరించడానికి కూడా అదే కారణం. ఆగితే స్త్రీల చరిత్రే లేదు జ్ఞానపీపురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌కి విచ్చేసిన ప్రతిభారాయ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తన రచన ‘ఉల్లఘ్న’కు 1985లో ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఆమె రాసిన ‘యజ్ఞసేని’కి సరళ అవార్డు, అమృతకీర్తి పురస్కార్‌లాంటి ఎన్నో ఆమె ఖాతాలో చేరాయి. ఏడు పదుల వయసు దాటిన ప్రతిభారాయ్ ఇప్పటికీ ఉత్సాహంగా రాస్తున్నారు. ‘నాకీ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?’ అంటూ ఆమే ప్రశ్నించి, తన చుట్టూ ఉన్న జనఘోషే తన రచనాశక్తికి కారణమంటూ ‘సాక్షి’తో ముచ్చటించారు. ∙మీ రచనకు ప్రేరణ ఏమిటి? అమ్మ. ప్రకృతి. ఇవి రెండూ నాలోని రచనాశక్తికి ప్రాణం పోశాయి. తొమ్మిదేళ్ళకే రాయడం మొదలుపెట్టాను. కానీ అవి అందమైన ఇంద్రధనుస్సులో, అమ్మ మీదో, ప్రకృతిని గురించో. అయితే స్త్రీలకు ఇల్లు, భర్త, పిల్లలే పరామవధి. ఇప్పటికీ. రాత వాళ్ళ ప్రాధాన్యత కాకుండా చేశారు. మీ రచనలన్నింటికీ నేపథ్యం అసమానతలే. ఆ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి? నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన విషయం మత వివక్ష. మేం నివసించే పరిసరాల్లో మా యింటి చుట్టూ ఉన్న ముస్లింల జీవితాలను నిత్యం వెంటాడే అభద్రతాభావం నా రచనలకు స్ఫూర్తి. ఎక్కడో ఏదో విస్ఫోటనం జరిగితే అక్కడ హిందూ, ముస్లింలిరువురూ ఉంటే కేవలం ముస్లిం యువకుడొక్కడే ఎందుకు జైలుకెళ్ళాల్సి వస్తోంది అన్నది నా ప్రశ్న. దానిపైనే ‘పవిత్ర రాత్రి’ రాశాను. టెర్రరిస్టులనే ముద్రకాదు, సమస్యకు పరిష్కారాలు కావాలి. ఆశించినంతగా స్త్రీల రచనలు రాకపోవడానికి కారణం? ఒకప్పుడు ప్రాచీన స్త్రీల రచనలన్నీ వారి జీవితం ముగిసిన తరువాత ఏ తలదిండుకిందనో, బీరువాలోని చీరల మడతల్లోనో, ఏ వంటింటి మరుగుల్లోనో రాతప్రతులుగా దొరికేవి. జీవితంలో తమకోసం ఒక్క క్షణాన్నీ వెచ్చించలేని పరిస్థితి స్త్రీకి కల్పించారు. అయినా వారి అభిప్రాయాల్ని ఎక్కడోచోట భద్రపరిచారు రహస్యంగా. స్త్రీలు రాయడమే నేరమనే భావనలోంచి ‘వు డేర్ టు రైట్’ అనేదాకా వచ్చాం. మేం రాసే సాహసం చేశాం. ఆనాడు రాసే ఆడవాళ్లని చెడ్డవాళ్లని ముద్రవేసారు. ఇప్పుడు ఇంకేదో ముద్ర వేస్తున్నారు. అయినా మనం ఆగకూడదు. ఆగితే స్త్రీల చరిత్రే లేదు. భాష, లేదా సాహిత్యం ఎలా కాపాడుకోగలం? చదువొక్కటే ఈ రెంటినీ బతికించలేవు. జనజీవితాలే సాహిత్యంగా రావాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టూ వున్న సమాజం మన పిల్లల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపే అంశాలు. వారే సమాజాన్ని ప్రభావితం చేయగలరు. మార్పుకి నాంది పలకగలరు. తెలుగు మహాసభలపై మీ స్పందన? మాలాంటి ఇతర భాషీయులను కూడా పిలిచారు కాబట్టి, ఇవి తెలుగు సభల్లా కాదు ప్రపంచ భాషా సభల్లా అనిపిస్తున్నాయి. ఇది హర్షించాల్సిన విషయం. మాలాంటి ఎందరినో ఈ సభలకు ఆహ్వానించి సన్మానించడం సంతోషం. ‘‘నేను వర్గరహిత, కులరహిత, వర్ణవివక్షలేని సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాను. అవే రాశాను. అదే ఆచరించాను కూడా. లింగ వివక్ష మీద రాసినందుకు ఫెమినిస్ట్నన్న ముద్రవేశారు. కుల, వర్గ వివక్షపైన రాస్తున్నానని నన్ను కమ్యూనిస్టునన్నారు. కానీ నేను హ్యూమనిస్టుని. అసమానతలు లేకుండా, వివక్షకి బలికాకుండా సమానంగా జీవించే సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం’’ అంటున్నారు ఒడిశా రచయిత్రి, జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్. సంభాషణ: అత్తలూరి అరుణ -
నాకు ఆహ్వానం లేకపోయినా ఏం పర్వాలేదు : చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆహ్వానం ఇవ్వకపోయినా తనకు ఏం పర్వాలేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ టీడీపీ నేతల శిక్షణా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను అందరూ గౌరవించాలలని, తెలుగు ప్రపంచ మహాసభలకు టీడీపీ సంఘీభావం తెలియచేస్తుందన్నారు. తెలుగు భాష కోసం ఎటువంటి కార్యక్రమాలు జరిగినా టీడీపీ మద్దతిస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం ముందడుగు లాంటి ప్రత్యే కార్యక్రమాలు చేపతున్నామన్నారు. దళితుల్లోని అన్ని వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై తెలుగుదేశం నేతలు లోలోన ఒకింత అసహనానికి గురౌతున్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌ను ఆహ్వానించిన కేసీఆర్, చంద్రబాబును కావాలనే ఆహ్వానించలేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్లు సమాచారం. -
తెలుగువారికే ఈ ఆంగ్ల జబ్బు : వెంకయ్య
-
తెలుగువారికే ఈ జబ్బు : వెంకయ్య
సాక్షి, హైదరాబాద్ : 'తెలుగువారంతా ఒకటేనని నేను నమ్ముతాను. ఢిల్లీలో ఎవరైనా తెలుగు మాటలు మాట్లాడటం నేను వింటే వెంటనే వెనుదిరిగి మాట్లాడేవాడిని. తెలుగు వారిని మా ఇంటికి పిలిపించుకుంటాను. తెలుగు సమ్మేళనాలకు వెళతాను. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం చాలా ఆనందంగా ఉంది' ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడారు. తెలుగు ప్రాంతంలోని కవులందరిని ఆయన స్మరించుకున్నారు. తెలుగు భాషలోని గొప్పగొప్ప మాటలను, పద్యాలను, వచనాలను ఆయన గుర్తు చేశారు. ఇంకా తెలుగు అంటే తనకు ఎంత ఇష్టమో వివరించారు. 'నేను పెరిగిన తెలంగాణలో నేను పుట్టిన ఏపీలో అడుగు పెట్టకుంటే నాకు ఎంతో వెళితిగా ఉంటుంది. 40 ఏళ్లు ఇక్కడే (హైదరాబాద్)లో పెరిగాను.. ఏపీలో పుట్టి 25 ఏళ్లు అక్కడే చదివాను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. అందుకే తెలుగును తెలుగు నేలను తల్లిగా భావిస్తాను. తెలుగులో తెలివి తేటలు చూపించే వారంటే నాకు చాలా ఇష్టం. మీరంతా భోజనం ఆలస్యం అయిందని బాధపడొద్దు.. కేసీఆర్ గారు చక్కటి విషయాలతో మంచి విందు పెట్టారు(వేదికపై అందరి నవ్వులు). గురువుకు సన్మానం చేసిన కేసీఆర్‌ను నేను అభినందిస్తున్నాను. ఈ ఒరవడిని ప్రతి ఒక్కరు కొనసాగించాలి. తరగతి గది గొప్ప తరగని నిధి.. మన గురువును మరువొద్దు. ఎంతటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా తెలుగు మరువొద్దు. గూగుల్ కూడా గురువుకు ప్రత్యామ్నాయం కాదు. దానికి కూడా గురువు కావాలి. హైదరాబాద్‌లో జలగం వెంగళరావు ఆధ్వర్యంలో 1975లో తెలుగు మహాసభలు జరిగాయి. నేడు మళ్లీ హైదరాబాద్‌లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌కు కూడా నాకంటే ఎక్కువ తెలుగంటే మక్కువ. నగరమంతటా కవుల పేరిట స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. క్రీశ2వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యం లభిస్తోంది. భాష సమాజాన్ని సృష్టిస్తుంది. భాష కీలకమైన ఇరుసు. సహజ ప్రవాహం, మానవ సంబంధాలను అభివృద్ధి పరుస్తుంది. మనిషి నుంచి ప్రాణం తీయడం ఎలా కష్టమో సమాజం నుంచి భాష తీయడం అంతే కష్టంగా ఉంటుంది. సమాజం ఎంత ఆధునికమైనా, ఎంత ఎత్తుకు ఎదిగినా భాష మర్చిపోతే కష్టం. తెలుగు నేలపై అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా.. అంటూ కాళోజీ నారాయణ రావుగారు చాలా గొప్పగా చెప్పారు. భాషను విడవొద్దు అలాగే యాసను కూడా మరువ కూడదు. భాష ఉనికిని, యాస ప్రాణాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఎందరో కవులు ఉన్నారు. నాడు తెలంగాణలో ఉర్దూ రాజ్యమేలింది. తెలుగువారు 50శాతంపైనే ఉన్నా తెలుగును అణగదొక్కారు. కాలక్రమంలో తెలుగు ఉర్దూ కలిసి అద్భుత సాహిత్యంతో విరాజిల్లుతూ వస్తోంది. అప్పట్లో తెలుగు తీవ్ర నిరాధారణకు గురైందనేది వాస్తవం. పీవీ నరసింహరావు గొప్ప భాషా కోవిధుడు. రచనలు చేశారు. తెలుగు సాహిత్యానికి నిజమైన రారాజు సినారె. ఆయనతో సాన్నిహిత్యం చాలా అద్భుతం. వేళ్లకు చెదలు పడితే మహావృక్షం పడిపోతుంది. అలాగే తెలుగు కూడా. అందుకే తెలుగును కాపాడుకోవాలి. మనసులో ఉన్న మాట చెబుతున్నాను. మన తర్వాత తెలుగు ఉంటుందా అని బాధపడుతున్నాను. ఇంగ్లీషు వాళ్లు మాతృభాషను మృతభాషగా మార్చొద్దు. మాతృభాషలో బోధన జరిగితే మాతృభాషలో పాలన జరిగితేనే సంస్కృతి బతుకుతుంది. ఒక జాతి ఉనికికి భాష ప్రధానం. అమ్మ భాషలో మాట్లాడితే అమ్మ దగ్గరకు వెళుతున్నట్లుంది. పరిపాలన పరంగా తెలుగు భాషలోనే చేయాలి. గవర్నర్‌గా ఉండి కూడా ఆయన తెలుగులో మాట్లాడారు. తెలుగు నేర్చుకోండి అని చెప్పాలి. ఉద్యోగులకు నేర్పించాలి. ప్రభుత్వం ఈ చర్యను తీసుకోకపోతే తెలుగును రక్షించే ప్రయత్నం విఫలం అవుతోంది. పల్లెటూరులో పుట్టాను, వీధి బడులకు పోయాను. నేలపై రాశాను. మూడు కిలో మీటర్లు నడిచాను. పై నున్న రెండు పదవులు తప్ప అన్ని పదవులు నాకు దక్కాయి. ఆంగ్లంలో చదివితేనే నాకు ఇవన్నీ వచ్చాయా? ఇంట్లో వీధి బడిలో గుడిలో ఎక్కడ వీలైతే అక్కడ తెలుగు మాట్లాడండి. ఢిల్లీకి ఎన్నో దేశాల నుంచి అధ్యక్షులు వచ్చేవారు. వారంతా వారి భాషలోనే మాట్లాడుతున్నారు. వారికి ఒక దుబాసి ఉంటారు. వారికి కూడా మాతృభాషపై మమకారం ఉంటే ఒక్క తెలుగు వారికి మాత్రమే ఈ జబ్బు వచ్చింది. సరిగా వచ్చి రాని ఆంగ్లంలో మాట్లాడే జబ్బును ఆంగ్లేయులు అంటించి వెళ్లారు. అది గుర్తించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలి. తెలుగు భాషలో కార్యక్రమాలు జరిగితే అస్తిత్వం బతుకుతుంది. బావ మరదలు అంటేనే సంతోషం. అంతేగానీ బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా అంటే ఏం బావుంటుంది. అమ్మ భాష కళ్లలాంటివి.. పరాయి భాష కళ్లద్దాల్లాంటివి.. అమ్మభాషలేకుంటే కళ్లద్దాలు కూడా పనికి రావు. తన భాష తనకు తెలుసు ప్రజల భాష తెలుసు కాబట్టే కేసీఆర్ పరిపాలకుడయ్యారు. ఆంగ్లం చదివితేనే పై స్థాయికి వెళతారనుకోవడం తప్పు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారికి తెలుగు స్కూళ్లు పెట్టించే ప్రయత్నం చేయిస్తున్నాం. మాతృభాషను మర్చిపోతే అస్తిత్వానికి ప్రమాదం.. ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేయాలి. ఆంగ్లం వారు అంటించిన అంటు వ్యాధిని ఇంటి దాక రానివ్వకండి. తెలుగులో మహా నిఘంటువు రావాలి' అంటూ ఆయన పలు సూచనలు చేశారు. -
మధురానుభూతికి లోనవుతున్నా
-
వారెవా! తెలుగులో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగం విన్నారా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దక్షిణ భారతీయుణ్ని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని..’’ అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు ఏనాడూ లేని విధంగా తెలుగులో మాట్లాడిన ఓవైసీ.. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని గుర్తుచేశారు. అసద్ ప్రసంగం ఇలా సాగింది.. ‘‘గౌరవ సభా పెద్దలు, సోదరసోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరుగుతుండటం సంతోషకరమైన విషయం. తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషిచేస్తున్నారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యమత్యంగా ఉన్నారు.. పాలు-నీళ్లలా కలిసిపోయారు. తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.పాతబస్తీకి చెందిన హమీదుల్లా షరీఫ్.. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. గఫూర్ గారు తెలుగులో ఎన్నో సాహితీప్రక్రియలు రాశారు. నేను ఢిల్లీలో దక్షిణ భారతీయుడిని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని. సమస్త ప్రపంచంలో మనది ఒక దేశం. వేలకొద్దీ భాషలు, సంస్కృతులు ఉన్నాయి. మనందరం ఇక్కడికి వచ్చి.. ఇదీ మన సంస్కృతి అని ప్రపంచానికి చాటి చెబుతున్నాం’’ అని తెలుగులో పేర్కొన్నారు. తప్పులుంటే మన్నించండి : తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్ ఓవైసీ.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు. తెలుగులో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం వీడియో -
మధురానుభూతికి లోనవుతున్నా: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: భాష, బతుకు మధ్య అవినావభావ సంబంధం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... తెలుగు మహాసభలు భువనవిజయంలా సాగుతున్నాయని అన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు. తెలుగు భాష కమ్మదనాన్ని భావితరాలకు తెలుగు మహాసభలు పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి తెలుగు మహాసభల్లో పాల్గొనడం మధురానుభూతి అని వ్యాఖ్యానించారు. ఎందరో మహానుభావులు తెలుగు భాషను సుపన్నం చేశారని కొనియాడారు. అవధానం తెలుగువారికే సొంతం కావడం గర్వకారణమన్నారు. తెలుగు భాష అత్యంత పురాతమైనది, అజరామరమైనదని తెలిపారు. కాలాగుణంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భాష మారాల్సిన అవసరం ఉందని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. తెలుగు మహాసభలను కోటి గొంతుల వీణగా ఆయన వర్ణించారు. -
వారెవా! తెలుగులో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగం విన్నారా?
-
రాయిలాంటి నన్ను సానబెట్టారు
-
రాయిలాంటి నన్ను సానబెట్టారు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అద్భుత సాహిత్యం పండించిన మాగాణి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా ఆయన అధ్యక్ష స్థానంలో మాట్లాడుతూ పదో శతాబ్దంలోనే తొలిసారి జినవల్లబుడి శాసనంలో తెలుగు కందపద్యం ఉందన్నారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ, సినారె, సుద్దాల హనుమంతు, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజువంటి ఎంతో మంది సాహిత్య కారులను అందించి మాగాణి తెలంగాణ అని చెప్పారు. ఎన్నో పద్యాలు పాడి అలరించారు. 'ఎంత గొప్పవారైనా అమ్మ ఒడే తొలిబడి.. చనుబాలు తాగించే తల్లి జో అచ్చుతానంద జోజోముకుందా అంటూ ఓ బిడ్డను ఆదర్శ బిడ్డగా తీర్చిదిద్దుతుంది. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం కాకుండా ప్రపంచాన్ని కూడా బిడ్డకు పరిచయం చేస్తుంది. బంధువర్గాన్ని తెలిపే తొలి గురువు తల్లి. మా అమ్మగారు నేను చిన్నతనంలో ఉండగా నాకు చక్కటి పద్యాలు చెప్పారు. మేం చదివే రోజుల్లో అయ్యవారి బడే ఉండేది. అక్కడ నుంచే గురువుల విద్య ప్రారంభం అయ్యేది. అందులో నీతి ఎక్కువ ఉండేది. మా స్వగ్రామానికి చెందిన దుబ్బాక గ్రామంలో మృత్యుంజయ శర్మ ఒక పద్యం చెబితే ఐదుసార్లు చదివి అప్పగించాను. రాయి లాంటి నన్ను మా గురువుగారు సాన బెట్టారు. వారి పుణ్యమా అని తొమ్మిదో తరగతిలోనే చెరువుగట్టుపై వృత్తపద్యాలు రాసిన. బమ్మెర పోతన అద్భుత భాగవతం అందించారు. ఎంతోమంది కవులు గొప్పగొప్ప సాహిత్యం అందించారు. నేటి కవుల్లో గోరటి వెంకన్న పాట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. చక్కటి పదాలతో కష్టమైన విషయాలు కూడా అలవోకగా ఆయన చెప్పగలరు. అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్లుంటుంది. మమ్మీ అంటే పెదవుల నుంచి వచ్చినట్లుంటుందని మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ఎన్నో సభల్లో చెప్పారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నారు. ఇప్పుడు దేశాన్ని బతికించేవారు బడి పంతులు. సమాజం భవిష్యత్తు పంతుల్ల చేతుల్లోనే ఉంది. తెలుగు భాష బతకాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాష పండితులు నడుంకట్టాలి. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఓ కవి మరో కవిని తయారు చేయాలి. తెలుగు భాషను బతికించుకోవడం కోసం ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయం చేస్తుంది' అని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
అట్టహాసంగా తెలుగు మహాసభలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర విద్యాసాగర్ రావుతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, తెలుగు సాహితీ వేత్తలు, పరిశోధకులు విద్యార్థులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. కాకతీయ తోరణంతో రంగురంగుల విద్యుద్దీపాలతో వేదిక మొత్తం కళకళలాడుతోంది. పేరడీ నృత్యంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైభవాన్ని చాటేలా ఉత్సవాలు జరగనున్నాయి. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. స్డేడియం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్‌కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి ఛాపెల్ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ మీదుగా మళ్లించనున్నారు. కాగా, ప్రపంచ తెలుగు మహా సభలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యే తెలుగు మహా సభలు ఈ నెల19 వరకు జరుగనున్నాయి. మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి 30 వేలమంది అతిథులు హాజరుకానున్నారు. సభలకు వచ్చే వారి కోసం 32 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నట్టు తెలిపారు. -
తెలుగు సౌరభం
-
నేటి నుంచే ప్రపంచ తెలుగు మహాసభలు..
-
ఆమె.. కవనం జ్వలనం
..: సంగిశెట్టి శ్రీనివాస్ దేశ స్వాతంత్య్రానికి ముందే స్వతంత్రంగా ఆలోచించి కవిత్వం చెప్పిన కవయిత్రులు మనకున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా ఆ స్ఫూర్తిదాతలను తలచుకుందాం. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ మొదలు నేటి వరకూ తెలంగాణలో స్త్రీల శౌర్యము ఎంతగానో ఉంది. ఘనమైన పాత్ర పోషించి చరిత్రకెక్కిన మహిళల గురించి ఇవ్వాళ చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు చర్యలుగా మారాయి. ఆ చర్యలు పరిశోధనగా మారి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వెలుగులోకి వచ్చింది. ఆమె రాసిన పద్యాల్లో ఇప్పుడైతే ఒకటే అందుబాటులో ఉంది. దాని ఆధారంగా ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నేను నిర్ధారించడం జరిగింది. ఈమె రంగనాథ రామాయణము గ్రంథకర్త గోన బుద్ధారెడ్డి కూతురు. తొలి ఉర్దూ కవయిత్రి మహలఖాబాయి చాందా తెలంగాణలో తమ కళల ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వారిలో తారామతి, ప్రేమావతి ఉన్నారు. వీళ్లు ప్రేమను కేంద్రంగా చేసుకొని రాశారు. హైదరాబాద్ నగరమే ప్రేమ పునాది మీద ఏర్పడింది. చంచల్‌గూడాలో ఉండే భాగమతిని ప్రేమించిన యువరాజు ఆమె కోసం మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్న కాలంలో తన గుర్రంపై సవారి అయి వచ్చేవాడు. యువరాజు సాహసం చూసి చలించిన రాజు ‘పురానా ఫూల్’ని కట్టించాడు. నిజాం రాజవంశానికి చెందిన హయత్ బ„Š బేగమ్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్ పాట్రిక్‌ని ప్రేమించి 1800 ప్రాంతంలో వివాహమాడింది. హైదరాబాద్ ప్రేమతత్వానికి ఇట్లాంటి అనేక నిదర్శనాలున్నాయి. సాహిత్యంలో కూడా వీటి ప్రతిఫలనాలున్నాయి. వాటిలో ఉర్దూలో మహలఖాబాయి చాందా ప్రముఖురాలు. ఉర్దూలోమొదటిసారిగా కవిత్వం రాసిన మహిళ మహలఖాబాయి. ఈమెకు నిజాం ఖాందా తో ‘ప్రేమ’ పూరిత సంబంధాలున్నాయి. తొలి తెలంగాణ ఆధునిక కవయిత్రి రత్నమాంబ తెలంగాణకు తొలి ఆధునిక కవయిత్రి పెనుగోళ్ళ రత్నమాంబ దేశాయి. 1847లో పరిగి తాలూకా ఇప్పటూరులో జన్మించిన ఈమె వేంకటరమణ శతకము, శ్రీనివాస శతకము, బాలబోధ, శివరొరువంజి (యక్షగానం), దశావతార వర్ణన మొదలైన రచనలు వెలువరించారు. దశావతార వర్ణనను తన 72వ యేట రచించారు. ఈమె రచనలు హితబోధిని, నీలగిరి, తెనుగు పత్రికల్లో చోటుచేసుకున్నాయి. 1929లో మరణించిన ఈమె రచనలు ఇప్పుడు ఒకటి అరా తప్ప అందుబాటులో లేవు. 1934లో వెలువడ్డ గోలకొండ కవుల సంచికలో అత్రాఫ్ బల్దా జిల్లాకు చెందిన మొత్తం 33 మంది కవుల రచనలు చోటుచేసుకోగా అందులో ఈమె రచనలు కూడా ఉన్నాయి. ‘సంసార తరణము’ శీర్షికన ఆమె రాసిన మూడు కంద పద్యాలు ఈ సంచికలో ఉన్నాయి. గాంధీని అవతార పురు షునిగా ఆమె రాసిన కవిత్వం 1924లో అచ్చయ్యింది. 1913 డిసెంబర్ హితబోధిని సంచికలో ఆమె రాసిన పద్యాలతో ఆమెను తొలి తెలంగాణ కవయిత్రిగా చెప్పొచ్చు. అంతకు ముందే ఆమె రచనా వ్యాసంగం చేపట్టినప్పటికీ అవి అందు బాటులో లేకపోవడంతో 1913ని ప్రామాణికంగా తీసుకోవ డమైంది. ఈమెను తెలంగాణ కవితారంభానికి మాతృ మూర్తిగా ప్రతిష్టించి గౌరవించాల్సిన అవసరముంది. కందం, శార్దూలం, సీసం, తేటగీతి, ఆటవెలదుల్లో ఆమె పద్యాల్ని రాసింది. తరుణీకృత పాండిత్యము స్థిరమా యీమాట లంచు ఛేదింపకుడీ హరియాజ్ఞగాక నాకీ కరణి యుపన్యాసమొసగు జ్ఞానము గలదే అచల మత ప్రచారకర్త జాలమాంబ ఆధునిక మహిళల విషయానికి వస్తే దళితోద్యమ నేత భాగ్యరెడ్డి వర్మ మేనత్త రంగమ్మ 1880ల నాటికే క్రైస్తవ మతం పుచ్చుకుంది. భాగ్యరెడ్డి వర్మను చదువుకునేలా ప్రోత్సహించింది. దాదాపు ఇదే సమయంలో హైదరాబాద్‌లో అచల మతాన్ని ప్రచారం చేసిన తల్లావఝుల జాలమాంబ అనేక కీర్తనలు రాసింది. కొన్ని సీస పద్యాలు రాసింది. వాటిలో మచ్చుకు ఒక్కటి. కవిత్వంలో తప్పులుంటే ఎత్తి చూపాలని కోరింది. సీ. గురుపుత్రులార మద్గురుమూర్తి స్తోత్రంబు రచియింప బూను నా వచనములను వినలేడ్కగలిగిన వినరయ్య వినిపింతు తప్పులుండిన వాటి దాచబోక దిద్దవలసినది మీ దేశికేంద్రుని మీద మీకు భక్త్యున్నట్టె నాకు గలదు గాని మీవలె నేను కవిత జేయగజాల చాలనంచని విడజాలతోచి నట్లు జేయుదు మీ రందరభయమిడిన ననుచు విజ్ఞాపన మొనర్చి యాజ్ఞగొంటి భాగవత వంశ భవకృష్ణ యోగి రాజ ధీ విశారద మాకదేశి కేంద్ర నేటి స్త్రీవాదికి తీసిపోని సుందరాబాయి 1900లకు ముందే వరంగల్‌లో స్త్రీల సమాజాలు ఏర్పాటయ్యాయి. ఈ పరంపరను హైదరాబాద్‌లో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ కొనసాగించింది. తన ఇంట్లోనే విద్యావసతులు ఏర్పాటు చేయడమే గాకుండా గ్రంథాలయోద్యమానికి కూడా అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, ఆర్థికంగానూ తోడ్పడింది. గ్రంథాలయోద్యమ ప్రభావంతో చాలా మంది పాఠకులుగా మారారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఈ పాఠకులు తర్వాతి కాలంలో రచయిత్రులుగా మారినారు. వారిలో 1913లో ‘హితబోధిని’ పత్రికలో స్త్రీ విద్యావశ్యకత గురించి ఎస్.సుందరాబాయి వ్యాసాలు రాసింది. కవిత్వం కూడా అల్లింది. నిజా నికి ఈ పద్యం నేటి స్త్రీవాద రచనల కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. వెలుగులోకి రాని కవయిత్రులు 1928 నాటికే ఒక పద్మశాలి మహిళ ‘స్త్రీల విద్యావశ్యకత’ గురించి వ్యాసాలు రాసి ప్రజాచైతన్యానికి పాదులు వేసింది. ఆమె సికింద్రాబాద్‌కు చెందిన గిడుతూరి రామానుజమ్మ. 1934లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో ఒక డజన్ కు మించి కవయిత్రులు రికార్డు కాలేదు. అయితే ఆధునిక కాలంలో తెలంగాణ సోయితో జరిగిన పరిశోధనల్లో జాలమాంబ, సుందరీబాయి వెలుగులోకి వచ్చారు. వీరితో పాటుగా 1935లో గోలకొండ పత్రికలో మాడపాటి హనుమంతరావు పాఠశాల విద్యార్థినులు ఎ.లక్ష్మీదేవి, పి.సావిత్రి, కోమలవల్లి, కె.లక్ష్మీబాయమ్మ, వై.కౌసల్యాదేవి, వై.అమృతమ్మ, నేమాని భారతీ రత్నాకరాంబ, వై.కౌసల్యాదేవి, కె.నీరజాక్షి తదితరుల కవిత్వం చోటు చేసుకుంది. ఇందులో ఎక్కువ మేరకు శ్రీకృష్ణునిపైనే ఉన్నాయి. మాతృభారతి పత్రికలో కేవలం కృష్ణుడిపైనే గాదు ఏసుక్రీస్తుపైనా 1935లోనే కవిత్వాన్ని రాశారు. ఈ గీతాల్ని రాసింది కె.ఫ్లా్లరె¯Œ ్స. బహుశా ఈమె తొలి తెలంగాణ దళిత కవయిత్రి అయివుండే అవకాశమున్నది. దళిత కాకున్నా తొలి క్రైస్తవ స్త్రీగా చెప్పవచ్చు. ఈమె రాసిన రెండు పద్యాల్లో ఒకటి. గీ. మా కొఱకు గాను నీ పుత్రు మమతజేసి పంపితివి, కాని, యాయన, బాధలు వడె దల్లి మరియమ్మ యెంతగా దల్లడిలెనొ చిన్ని కొమరుడేసు క్రీస్తు సిలువ మోయ 1933 నాటికే తెలంగాణ నుంచి ఒక స్త్రీ ప్రణయ కవిత్వం రాయడం విశేషం. ఈ కావ్యం ‘కావ్యావళి’. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతీదేవి రాశారు. ఈ కవితా సంపుటి 1936లో విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం ముందుమాటల్తో వెలువడింది. ఈ పద్యాల్లో ఒక వైపు భర్తను, మరోవైపు దేవుడిని ఇద్దరినీ కొలుస్తూ ‘శ్లేష’ వచ్చే విధంగా కవిత్వమల్లింది. పావనంబగు మీమూర్తి వదల కెపుడు చిత్తసింహాసనము నధిష్టింపజేసి ప్రణయసామ్రాజ్యపట్టభాస్వన్మహోత్స వము గావించెదను ప్రమోద మ్మెలర్ప వీళ్ళే గాకుండా తత్వాలు చెప్పిన మనుసాని వెంకట లక్ష్మమ్మ, చిగుళ్ళపల్లి సీతమ్మ, మక్థల్ సుశీలమ్మ ఇట్లా ఎందరో ఉన్నారు. 1857–1956 మధ్య శతాబ్ది కాలంలో తెలంగాణలోని స్త్రీలు రాసిన లేదా చెప్పిన కవిత్వం రికార్డయినట్లయితే ఆనాటి మహిళా ప్రతిభ, సాహిత్యం, విరహం, మోహం, సరసం, ఆధునికత, అక్షర జ్ఞానం, ఎఱుక ఎలా ఉండేదో అర్థమయితది. చిన్న వాక్యాలు రాయడమే మంచిది మాట్లాడేభాషలో ఎప్పు డూ పెద్ద పెద్ద వాక్యాలు వుండవు. ఎవరైనా మాట్లాడుతూ వున్నప్పుడు చూడండి. మామూలుగా మాట్లాడేటప్పు డైనా, కోపంగా మాట్లాడేటప్పుడైనా, ఆ మాటలన్నీ చిన్న చిన్న వాక్యాలుగానే వుంటాయి. భాష ఎప్పుడూ చిన్న చిన్న వాక్యాలుగా వుండడమే మాట్లాడే భాషలో వుండే సూత్రం. ఈ సూత్రాన్నే రాసే భాషలో కూడా పాటించాలంటే, రాసే భాష కూడా చిన్న చిన్న వాక్యాలతోనే వుండాలి. అలావుంటే అది, మాట్లాడే భాషలాగా తేలిగ్గా అర్థమవుతూ వుంటుంది. ..: రంగనాయకమ్మ ఎవరి ప్రత్యేకత వారిది కవిత్వంలో రసోన్ముఖంగా సాగే అంశాలు ముఖ్యంగా నాలుగు. అవి– అలంకారాలు, గుణాలు, రీతులు, వృత్తులు. ప్రసిద్ధ కవులు తమ కవితా శైలులలో ఈ నాలుగింటిలో ఏదో ఒక దానికి ప్రాముఖ్యాన్ని కల్పించి తమ ప్రత్యేకతలను నిలుపుకొంటూ ఉంటారు. ఈ దృష్టితో సమీక్షిస్తే కవిత్రయం వారిది గుణప్రధానశైలి. శ్రీనాథునిది రీతి ప్రధాన శైలి. ప్రబంధ కవులది అలంకార ప్రధాన శైలి. నాటకీయతను పోషించిన తిక్కనాదులలో వృత్తులకు ప్రాముఖ్యం కనపడుతుంది. ..: జి.వి.సుబ్రహ్మణ్యం అస్పృశ్యులకూ, స్త్రీలకూ అల్లంత దూరంలో ఉన్న అక్షరాన్ని అడ్డంకులను దాటుకుని, అక్షరాలను గుండెలకు అదుముకుని, హృదయాలతో హత్తుకుని సాహిత్యానికి సంపూర్ణత్వాన్ని అద్దిన స్త్రీలెం దరో తెలుగు వెలుగుని దశదిశలా ప్రసరించారు. అక్షరాన్ని కమ్మేసిన పురు షాధిపత్యపు పొరలను చీల్చుకుని తమకు తాముగా ప్రకాశించేందుకు ఎన్నో సాహసాలూ, మరెన్నో త్యాగాలనూ మూటగట్టుకున్న తెలుగు సాహితీ ప్రపంచం మొన్నటి మొల్ల నుంచి, నిన్నటి రంగనాయకమ్మ, ఓల్గా, విమల, నేటి సుభద్ర, వినోదిని లాంటి స్త్రీవాద, దళిత రచయిత్రుల వరకు పరుచుకున్న అనుభవం ఘనమైనది. మొల్ల...: తన కావ్యం అర్థంకాని భాషలో మూగ, చెవిటి ముచ్చట కాకూడదని సులభమైన జానుతెలుగు రామాయణాన్ని రచించిన మొల్ల మన తెలుగు మల్లె. లాలిత్యానికీ, సుకుమారానికీ ప్రతీకైన సిరిమల్లెకాదీమె రాయల రాజులకు తన కావ్యాన్ని అంకితమిచ్చేందుకు తిరస్కరించి, తనకి ఇష్టుడైన రాముడికే తన రామాయణాన్ని అంకితమిచ్చిన నాటి స్త్రీల ఆత్మగౌరవ ప్రతీక. ముద్దుపళని: ఇరవయ్యవ శతాబ్దారంభంలో చర్చనీ యాంశమైన ‘రాధికా స్వాం తనం’ను ఆత్మకథగా రాసిన ముద్దుపళని తంజావూరు నాయక రాజులైన ప్రతాప సింహుడి వద్ద(1739–63) రాజనర్తకి. స్వేచ్ఛా వ్యక్తిత్వానికీ, స్వతంత్ర నిర్ణయాలకూ ప్రతీక. రంగనాయకమ్మ: పెట్టుబడిదారీ విధానపు శ్రమదోపిడీ గుట్టుని రట్టుచేసిన కారల్ మార్క్స్‘పెట్టుబడి’ని అత్యంత సులువుగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో తెలుగు ప్రజలకు పరిచయం చేసిన మహా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన తీరు అసాధారణమైనది. వర్గదృక్పథాన్ని అందించిన రంగనాయకమ్మ స్ఫూర్తి ప్రతి తెలుగు గుండెలోనూ ప్రతిధ్వనిస్తుంది. ‘జానకివిముక్తి’ చలం తర్వాత స్త్రీలోకాన్ని చైతన్యపరిచిన తొలిపుస్తకం. ‘రామాయణ విషవృక్షం’, మూఢనమ్మకాలపై ఆమె రాసిన విమర్శనాత్మక పుస్తకం ‘తులసీదళం కాదది గంజాయి దమ్ము, స్త్రీ, రచయిత్రి, ‘ఇదే నా న్యాయం’, ఎన్నో నవలలూ, విమర్శనాత్మక వ్యాసాలూ తెలుగు సమాజానికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించాయి. ఓల్గా: ఆధునిక స్త్రీల అస్తిత్వ ఉద్యమానికి ఓల్గా రచనలే పునాది. ఓల్గా రచనల్లో తొలి ముద్రితం 1969 పైగంబర కవిత్వం. స్త్రీలను అమితంగా ప్రభావితం చేసిన నవలల్లో ‘స్వేచ్ఛ’,‘రాజకీయ కథలు’, ‘నేనూ – సావిత్రీబాయిని’, ‘యుద్ధమూ –శాంతి’, ‘లక్ష్మణరేఖ’, వసంతకన్నాభిరాన్, కల్పనకన్నాభిరాన్, ఓల్గా కలిసి రాసిన ‘మహిళావరణం’ తెలుగు సాహితీరంగాన్ని గొప్ప మలుపుతిప్పాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన స్త్రీవాద రచనలన్నీ అగ్రవర్ణ స్త్రీలు రాసినవనీ, సతి, వితంతువివాహం దళిత స్త్రీల జీవితాల్లో లేవనీ, అగ్రవర్ణ స్త్రీల సమస్యలపై రాసింది దళిత స్త్రీల సాహిత్యం కాదని, జూపాక సుభద్ర, గోగు శ్యామల, వినోదిని వంటివారు జోగినీ వ్యవస్థ, అస్పృశ్యత, సామాజిక హింస, పాకీపని, లాంటి వెలివేతల వెతలను ప్రశ్నిస్తున్నారు. జూపాక సు¿¶ ద్ర రాసిన ‘అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం, నల్లరేగడి సాల్లు, కైతునకల దండెం ఆ కోవలోనివే. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో రాసిన డాక్టర్ విజయభారతిగారి కృషినీ మరువలేం. రేవతీదేవి, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, కె.గీత, మహెజాబీన్, శిలాలోలిత, మందరపు హైమావతి, పసుపులేటి గీత, షాజహానా కవిత్వం, కుప్పిలిపద్మ రచనలు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఇటు వర్గదృక్పథం, అటు స్త్రీవాదాన్ని అంతే బలంగా వినిపించారు విమల మోర్తల. విమల రాసిన ‘వంటగది’ కవిత, ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ స్ఫూర్తినినింపాయి. తెలంగాణ బిడ్డ, మహిళోద్యమ ఆవిర్భావకురాలు డాక్టర్.కె.లలిత, ప్రొఫెసర్ సుజీతారూ కృషిని తెలుగు ప్రజలు దారులేసిన అక్షరాల్లో వెతుక్కోవచ్చు. కె.లలిత రాసిన ‘సవాలక్ష సందేహాలు’ గతంలో ఎవ్వరూ తడమని ఎంతో విలువైన గ్రంధం, కె.లలిత, వసంతాకన్నాభిరాన్, సుశీతారూ బృందం అందించిన గొప్ప పరిశోధనాత్మక గ్రంధం ‘మనకు తెలియని మన చరిత్ర’ భారతీయ సమాజంలో ఎనలేని కృషి చేసీ, మరుగునపడిన బెంగళూరు నాగరత్నమ్మ లాంటి ఎందరో స్త్రీల చరిత్రలను వెలికితీసిందిది. స్త్రీవాద చరిత్రకారిణిగా బండారు అచ్చమాంబను తెలుగు సమాజం గుర్తుచేసుకుంటుంది. బహుభాషా కోవిదురాలైన అచ్చమాంబ రాసిన ‘అబల సచ్చరిత్ర రత్నమాల’ (1901) స్త్రీల చరిత్రలను వెలికితీసింది. తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకునే కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. నాలుగున్నర దశాబ్దాల క్రితమే రుతుక్రమాన్ని సైతం అస్పృశ్యంగా మార్చిన వైనంపై తన ‘మూన్నాళ్ళ ముచ్చట’లో రాయడం గొప్పసంగతి. చిన్న కునుకు కోసం స్త్రీ జీవితాంతం పడే తపనని ‘సుఖాంతం’ కథ ఆవిష్కరిస్తుంది. ..: అత్తలూరి అరుణ -
అందెశ్రీ, గద్దర్ లేకుండా సభలా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం తెలంగాణ వైపు చూడాలనే ఆకాం క్షతో ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సాహిత్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. అందెశ్రీ, జూకంటి జగ న్నాథం, గద్దర్, ఏపూరి సోమన్న, విమలక్క, ఎక్కా యాదగిరిరావు వంటి కవుల్ని పిలవ కుండా ప్రపంచ తెలుగు మహాసభలను ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రోరైల్ ప్రారంభ సమయంలో దాంతో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఏ సంబంధం లేదని.. శంకుస్థాపన జరిగాక మెట్రోను అడ్డుకోవాలని బహిరంగ సభల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ మెట్రో డెవలప్మెంట్ను చూసి ఇదంతా తామే చేశామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. మూసీ ఈస్ట్–వెస్ట్ కారిడార్ ఏది? కేసీఆర్ 12 జంక్షన్లతో 41 కి.మీ. పొడవున ఆరు లైన్లతో మూసీ నది వెంబడి ఈస్ట్ –వెస్ట్ కారిడార్‌ను నిర్మిస్తామన్నారని, ఆ కారిడార్ ఏమైందని ప్రశ్నించారు. రూ. 5,916 కోట్లతో స్కైవేలు నిర్మిస్తామన్న కేసీ ఆర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొత్తగూడెం జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జరిగిందన్నారు. ఈ నెల 18న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు తెలంగాణ లేబర్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ముత్యాల శ్రీరాములు తెలంగాణ ఇంటి పార్టీ లో చేరారు. -
ఐదు రోజుల తెలుగు సంబురం
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుకుందాం’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియానికి పాల్కురికి సోమనాథ ప్రాంగణంగా.. ప్రధాన వేదికకు బమ్మెర పోతన వేదికగా నామకరణం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహాసభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే మహాసభల ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరవుతారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మహాసభల ప్రధాన వేదికతో పాటుగా ఉప వేదికల్లో సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఐదు రోజుల పాటు జరగనున్న మహాసభల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల వివరాలివీ.. 15శుక్రవారం సాహిత్య సమావేశం: సాయంత్రం 6 గంటలకు అధ్యక్షత :డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు, తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యఅతిథి : హరీశ్‌రావు, భారీనీటిపారుదల మంత్రి గౌరవ అతిథి : ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్, చెన్నై సత్కారం : సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్లకు (ఒడిశా జ్ఞానపీఠ పురస్కార స్వీకర్తలు) సాయంత్రం 6.30–7–00: ‘మన తెలంగాణ’ సంగీత నృత్యరూపకం. డాక్టర్ రాజారెడ్డి–రాధారెడ్డి, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన. రాత్రి 7.00–7:30: పాటకచేరీ(శ్రీరామాచారి బృందం, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ) రాత్రి 7:30–9:00: జయ జయోస్తు తెలంగాణ(సంగీత నృత్య రూపకం) రచన: దేశిపతి శ్రీనివాస్, సంగీతం: ఎం.రాధాకృష్ణన్, నృత్య దర్శకత్వం: కళాకృష్ణ 16శనివారం ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’సాహిత్య సభ అధ్యక్షత: డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ముఖ్యఅతిథి: కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి గౌరవ అతిథి: ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వక్తలుడాక్టర్ రవ్వా శ్రీహరి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ సాయంత్రం 6:30 : సాంస్కృతిక సమావేశం అధ్యక్షుడు: డాక్టర్ అయాచితం శ్రీధర్, అధ్యక్షుడు, గ్రంథాలయ పరిషత్ ముఖ్యఅతిథి: సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి గౌరవ అతిథి: తనికెళ్ల భరణి రాత్రి 7:00–7:30: హైదరాబాద్ సోదరుల ‘శతగళ సంకీర్తన’(రామదాసు సంకీర్తనల ఆలాపన) రాత్రి 7:30–7:45: మైమ్ కళాకారుడు మధు మూకాభినయ ప్రదర్శన రాత్రి 7:45–8:00: వింజమూరి రాగసుధ నృత్య ప్రదర్శన రాత్రి 8:00–8:15: షిర్నికాంత్ బృంద కూచిపూడి నృత్యం రాత్రి 8:15–9:00: డాక్టర్ అలేఖ్య ‘రాణి రుద్రమదేవి నృత్యరూపకం’ 17ఆదివారం సాయంత్రం 5 గంటలకు: ‘మౌఖిక వాఙ్మయం భాష’సాహిత్య సభ అధ్యక్షత : డాక్టర్ వెలిచాల కొండలరావు ముఖ్యఅతిథి : తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర మంత్రి గౌరవ అతిథి: ఆచార్య కొలకలూరి ఇనాక్ సత్కారం: సత్యవ్రత శాస్త్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఢిల్లీ భాష–నుడికారం: డాక్టర్ నలిమెల భాస్కర్, సామెతలు జాతీయాలు: కసిరెడ్డి వెంకట్‌రెడ్డి పద, గేయ కవిత్వం: గోరటి వెంకన్న, సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం అధ్యక్షుడు: దేవులపల్లి ప్రభాకర్‌రావు ముఖ్యఅతిథి: స్వామిగౌడ్, మండలి అధ్యక్షుడు గౌరవ అతిథి: డాక్టర్ ద్వానాశాస్త్రి రాత్రి 7.00–8.00: రసమయి బాలకిషన్ సారథ్యంలో కళా ప్రదర్శన 8–00–8.15: జానపద గేయాలు–కళా మీనాక్షి 8.15–8.30: జానపదం–నృత్య కళాంజలి 8.30–8.50: జానపద నృత్యం–మంగళ, రాఘవరాజ్ భట్ 8.50–9.30: జానపద జాతర 18సోమవారం సాయంత్రం 5 గంటలకు: ‘తెలంగాణ పాటజీవితం’ సాహిత్య సభ అధ్యక్షత : డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ముఖ్యఅతిథి : ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి గౌరవ అతిథి : సిరివెన్నెల సీతారామశాస్త్రి వక్తలు: రసమయి బాలకిషన్, జయరాజు, దేశిపతి శ్రీనివాస్ సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం, అధ్యక్షత: దిల్‌రాజు ముఖ్యఅతిథి: కేటీఆర్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి, గౌరవ అతిథి: అక్కినేని నాగార్జున సాయంత్రం 6.30–7.00: మలేసియా తెలుగు వారి సాంస్కృతిక కదంబ కార్యక్రమం రాత్రి 7.00: సినీసంగీత విభావరి, సినీ మ్యూజీషియన్స్ యూనియన్ 19మంగళవారం సాయంత్రం 5 గంటలకు: ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం ముఖ్యఅతిథి రాష్ట్రపతి : రామ్‌నాథ్ కోవింద్ విశిష్ట అతిథిగవర్నర్ : ఈఎస్ఎల్ నరసింహన్ సభాధ్యక్షత : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇతర వేదికలు - కార్యక్రమాలు అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం(ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్), వానమామలై వేదిక 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బృహత్ కవి సమ్మేళనం(ఏడు వందల మంది కవులతో కవి సమ్మేళనం) మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం),శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక 16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శతావధానం పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి) 16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యువ చిత్రోత్సవం ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ(రవీంద్రభారతి) 16వ తేదీ నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన రవీంద్రభారతి ప్రాంగణం 16వ తేదీ నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన ఛాయాచిత్ర ప్రదర్శన: చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ బిరుదురాజు రామరాజు ప్రాంగణం(తెలుగు వర్సిటీ ఆడిటోరియం), సామల సదాశివ వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు) మ.3 గం: తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు) 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: కథా సదస్సు మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ నవలా సాహిత్యం సాయంత్రం 6 గంటలు: కథా, నవలా, రచయితల గోష్ఠి 18వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణ విమర్శ–పరిశోధన మధ్యాహ్నం 3 గంటలు: శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం సాయంత్రం 6 గంటలు: కవి సమ్మేళనం 19వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణలో తెలుగు భాషా సదస్సు గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం (రవీంద్రభారతి సమావేశ మందిరం), ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: అష్టావధానం మధ్యాహ్నం 12:30: హాస్యావధానం మధ్యాహ్నం 3 గంటలు: పద్యకవి సమ్మేళనం 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: జంట కవుల అష్టావధానం మధ్యాహ్నం 12:30: అక్షర గణితావధానం మధ్యాహ్నం 3 గంటలు: అష్టావధానం సాయంత్రం 5:30: నేత్రావధానం సాయంత్రం 6 గంటలు: శ్రీప్రతాపరుద్ర విజయం(రూపకం) 18వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గంటలు: పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు మ.3 గం: న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనలో తెలుగు 19వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: తెలంగాణ చరిత్ర(సదస్సు) డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం(రవీంద్రభారతి), బండారు అచ్చమాంబ వేదిక 16వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: బాల సాహిత్యం(సదస్సు) మధ్యాహ్నం 4 గంటలు: హరికథ(లోహిత) మ.4:30: నృత్యం(వైష్ణవి) మ.4:45: సంగీతం(రమాశర్వాణి) 17వ తేదీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలు: బాలకవి సమ్మేళనం మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ వైతాళికులు(రూపకం) 18వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు) మధ్యాహ్నం 3 గంటలు: కవయిత్రుల సమ్మేళనం 19వ తేదీ కార్యక్రమాలు ఉ.10 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి) మ.2 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు(రాష్ట్రేతర తెలుగువారితో గోష్ఠి) -
మహాసభలకు పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఎల్బీ స్టేడియం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నామని వివరించారు. వీరికి అదనంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కమాండో టీమ్స్, షీ–టీమ్స్, క్రైమ్ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్‌తో పాటు సాయుధ బలాలు విధుల్లో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యఅతిథులు నివసించే ప్రాంతాల్లో, వారు ప్రయాణించే ప్రదేశాల్లో నిఘాను ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రధాన వేదికతో పాటు ఇతర వేదికల సమీపంలో ఉన్న నిజాం కళాశాల, పబ్లిక్‌గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం తదితర చోట్ల పార్కింగ్ ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. సభా ప్రాంగణంలో డీసీపీ నేతృత్వంలో భద్రతా ఏర్పాటు చేస్తున్నామని, కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సీసీ కెమెరాల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపులు నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు... తెలుగు మహాసభల నేపథ్యంలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్‌కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి ఛాపెల్ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ మీదుగా మళ్లించనున్నారు. -
తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి జరిగిన కృషిని ప్రపంచ తెలుగు మహాసభల్లో చాటిచెబుతాం. రేపటినాడు తెలంగాణలో తెలుగు ఎలా వెలగాలి అన్న దిశలో తెలుగు మహాసభలు తోవ చూపుతాయి. 25, 30 ప్రక్రియల్లో మొట్టమొదట రాసింది తెలంగాణ కవులే. ఈ మహాసభలు తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ప్రదర్శించే వేదిక అవుతాయి..’అని తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భాషాభిమాని అయినందునే ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహాసభల గురించి, తెలుగు భాషా, సంస్కృతి, చరిత్రల పరిరక్షణకు జాగృతి చేసిన కృషి గురించి ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ తల్లి–తెలుగు తల్లి వివాదం ఉద్యమ సందర్భంలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు. ప్రాంతాలకు తల్లి ఉంటది. భరతమాత ఉంటది. తెలంగాణ తల్లి ఉంటది. ఆంధ్రా మాత ఉంటది. ఎప్పుడైతే తెలంగాణను ఆంధ్రాలో కలుపుకోవాలని కుట్ర జరిగిందో.. ఆనాడు ఇద్దరికీ కామన్‌గా ఏముందో అని వెతుక్కుని తెలుగు ఉంది కాబట్టి తెలుగు తల్లిని పుట్టించారు. తెలంగాణ పదం పుట్టినప్పుటి నుంచి తెలంగాణ తల్లి ఉంది. మన భూమిని, ప్రాంతాన్ని తల్లిలా పూజిస్తాం. తెలుగుతల్లి మాకేం పెట్టలేదు. అన్యాయం చేసింది. కాబట్టి మేం తెలుగు తల్లిని గుర్తించం. తెలంగాణ తల్లిని గుర్తిస్తం. ఆంధ్రా మాతను ఆదరిస్తం. కాబట్టి తెలుగు తల్లిని ముందు పెట్టి తెలంగాణను విమర్శించడాన్ని సహించం. ఉద్యమ సమయంలో మా నేత కేసీఆర్ చెప్పిండు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు మా వైఖరిలో మార్పు లేదు. ఈ మహాసభల్లో తెలంగాణ తల్లికే దండ వేస్తం. జాతీయ గీతం ఆలపించుకుంటం. మహాసభల ముఖ్య ఉద్దేశం.. మన వాళ్లను ప్రపంచం ముందు కీర్తించుకోవాలి. పాల్కుర్కి సోమన్న ఉన్నడు. అసలు తెలుగు అన్న పదాన్ని మొట్టమొదట వాడిందే ఆయన. అంతకు ముందువారు తెనుగు అనేవారు. సోమన్న పామర భాషనే వాడతానని ఘంటాపథంగా చెప్పారు. ఇలాంటి వారికి సమైక్య పాలనలో గుర్తింపు లభించలేదు. ఇవాళ పాల్కుర్కి సోమన్నను పీఠం ఎక్కిస్తం. పోతనకు పీఠం వేస్తం. మహాసభల నిర్వహణపై వివాదాలు మనదీ అనుకుంటే అన్నీ మనవిలాగే ఉంటాయి. మనవి కావు అనుకుంటే అన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రజల కార్యక్రమం. తెలుగు భాషకు సంబంధించి భాష పేరుతోనే అణగదొక్కబడ్డామని ఉద్యమం చేశాం. భాషకు మన బిడ్డలు చేసిన గొప్పతనాన్ని చెబుతామంటే విభేదాలు ఎందుకు. విరసం.. కొంచెం కాంక్రీట్‌గా, వారం రోజుల ముందు ఏం చర్చించాలి.. ఏం చేయాలన్నది చెబితే వారి గౌరవం పెరిగేది. విరసం నుంచి వచ్చిన వర్క్‌ను ఆదరిస్తాం. కానీ, వాళ్లు ఎస్కేప్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు. మహాసభలను ఎందుకు బహిష్కరించాలి. పరిపాలనా వ్యవహారాల్లో తెలుగు.. ఆదర్శం చెప్పడానికి బావుంటది. కానీ బ్యాక్ గ్రౌండ్లో జరగాల్సిన వర్క్ జరగలేదు. తమిళనాడులో వారి భాష అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేసింది. మనం జీవోలు తెలుగులో తెస్తే సమాంతర పదాలు ఎక్కడ ఉన్నాయి. ఎవరికి అర్థం అవుతాయి. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి, తెలుగులో ఇంకా పదాలు కనిపెట్టడానికి నాటి ప్రభుత్వాలు ఎందుకు పనిచేయలేదు. మూడేళ్లలో ఇవన్నీ ఎక్కడ చేస్తాం. అకాడమీలను మూలన పడేశారు. ఇపుడు పునరుద్ధరించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి.. సీఎం కేసీఆర్ స్వయంగా భాషాభిమాని కావడం అదృష్టం. కాబట్టే ఈ సభల్లో సాహిత్యంపైనే చర్చ జరగాలని కోరారు. బాల సాహిత్యం, స్త్రీ సాహిత్యం మీద అన్నింటి మీదా చర్చలు జరగాలనే ఏడు వేదికలు సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వద్దన్నారు. ఎంత మందికి వీలైతే అన్ని చర్చలు జరగాలి. కాన్సెప్ట్ సాహిత్యం, సంస్కృతికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు 15న కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అన్నింటినీ కలపడం లేదు. సాహిత్యానికి, చర్చకు పెద్దపీట వేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. -
అందరూ ఆహ్వానితులే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు తదితర వేదికలు తెలుగు వెలుగులతో జిగేల్ మంటున్నాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో తళుకులీనుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి తెలిపారు. గురువారం వారు ‘తెలంగాణ సాహిత్య వైభవం’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు రోజుల తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం అవుతాయన్నారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంను తెలుగుదనం ఉట్టిపడేలా కళాత్మకంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలంకరించినట్లు చెప్పారు. ప్రాంగణానికి నలువైపులా ఎనిమిది ద్వారాల్లో ప్రముఖులకు, ప్రతినిధులకు, సాధారణ ప్రజలకు విడివిడిగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. రవీంద్రభారతిలో కిట్ల పంపిణీ.. హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులకు గురువారం మహాసభల కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ప్రతినిధులకు హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు నేతృత్వంలోని ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్లను అందజేస్తారు. ఇందుకోసం అన్ని చోట్లా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారని, వారందరినీ ఆహ్వాన కమిటీ సాదరంగా ఆహ్వానించి వారి బస కేంద్రాలకు తోడ్కొని వెళుతోందని చెప్పారు. సుమారు 6,000 మంది ప్రతినిధులకు వివిధ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. మహాసభలకు వెళ్లేందుకు, తిరిగి వారిని హోటళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా శాఖ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 150 బస్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే ఎల్బీ స్టేడియం వద్ద 60 ఆహార విక్రయ శాలలు, 25 పుస్తక ప్రదర్శన శాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్, జనగామ తదితర సమీప జిల్లాలకు చెందిన ప్రతినిధులు కిట్ల కోసం రవీంద్రభారతికి రావలసిన అవసరం లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. వారికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. -
అమ్మ భాషకు పట్టం
♦ స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సరం.. దక్షిణాయనం.. హేమంత రుతువు.. మార్గశిర మాసం.. కృష్ణపక్షం.. త్రయోదశి.. సాయంత్రం 6 గంటలు.. స్థలం భాగ్యనగరం.. వేదిక లాల్‌బహదూర్ మైదానం.. పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక ♦ తేనెలూరే తియ్యటి తెలుగు భాషకు సమున్నతంగా పట్టంకట్టే మహా వేడుక.. ♦ మరే భాషలో లేని అత్యున్నత సాహితీ ప్రక్రియలను తనలో ఇముడ్చుకుని ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’.. అంటూ ప్రపంచవ్యాప్తంగా జయజయధ్వానాలు అందుకునేలా, మహోజ్వలంగా వెలుగొందేలా మనమంతా కలసి చేసుకునే దివ్యమైన ఉత్సవం.. ప్రపంచ తెలుగు మహాసభలు నేడే మొదలు. సాక్షి, హైదరాబాద్ : తెలుగు వర్ణమాలలో అక్షరాలెన్ని..? తెలుగు భాష ఔన్నత్యానికి ఒక్క నిదర్శనం..? తేనెలూరే ఈ భాషలో ఉత్కృష్ట సాహిత్య ప్రక్రియ అవధానం అంటే ఏంటి..? ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై పేర్కొంటున్న సాహితీ దిగ్గజాల్లో ఒకరి గురించైనా తెలుసా..? నేటి తెలుగు తరానికి ఈ ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికైనా సమాధానం రావడం కష్టమే. వెయ్యేళ్ల తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దీనితో తెలిసిపోతుంది. తప్పులు లేకుండా, పరభాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడడం, ఒక్క వాక్యమైనా రాయడం ఎంత మందికి సాధ్యం. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తిస్తున్నా.. ప్రపంచంలోని సుమధుర భాషల్లో తెలుగు ముందు వరసలో ఉన్నా.. మరే భాషలోనూ లేని సాహితీ ప్రక్రియలు తెలుగు సొంతమైనా సరే... కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషల్లో తెలుగూ చేరబోతోందన్న మాట ఆందోళన కలిగిస్తోంది. కోటి ఆశలతో.. కోటి ఆశలు మోసుకొస్తూ కొత్త ఆలోచనలతో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత తొలిసారిగా జరుగుతుండ టంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలి తెలుగు మహాసభలుగానే పరిగణిస్తోంది. తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని స్వాగతించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్లు నరసింహన్, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షుడిగా వేడుకలు మొదలుకాబోతున్నాయి. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం కళ్లకు కట్టనుంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్య జాడ్యం నీడలో.. మన పొరుగునే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన కన్నడ, తమిళ రాష్ట్రాలు.. తమ భాషకు ఘనంగా పట్టం కట్టాయి. తమ భాషను బతికించుకోవడమే కాదు, అద్భుతంగా వికసింపచేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీ విశ్వవి ద్యాలయాల్లోనూ వాటికి ప్రత్యేక విభాగాలు తెచ్చుకునే రీతిలో, ప్రాచీన హోదా పొంది భాష బాగు కోసం వందల కోట్లు సాధించు కునే స్థాయిలో కృషి చేశాయి. కానీ అమృత ప్రాయమైన తెలుగు భాషకు ‘గుర్తిం పు’పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడి పోయింది. ‘ఇప్పటికైనా తెలుగు వంతు వచ్చింది..’అన్న ఆశతో తెలుగు ప్రజలు సంతోషిస్తున్నారు. అసలు 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల ప్రభావం భాషపై కొంత కనిపించినా.. తర్వాత ఈ సభలు హడావుడికే పరిమితమయ్యాయి. ఆ బాధ ముల్లులా పొడుస్తున్నా.. ఇప్పటి మహాసభలను మాత్రం భాషాభిమానులు కొత్త కోణంలో చూస్తున్నారు. తెలుగు భాష, పద్యం, సాహిత్యంపై తనకున్న అభిమా నాన్ని వీలున్నప్పుడల్లా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తాజా మహాసభల రథసారథి కావడమే దీనికి కార ణం. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయటంతో ఆయనపై ఆశాభావం నెలకొంది. మంచిరోజులు వచ్చేనా? 2012 తెలుగు మహాసభల సందర్భంగా.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది మాటలకే పరిమితమైంది. ఆర్భాటానికి పరిమితమయ్యే అలాంటి హామీలు భాషను కాపాడలేవనే సంగతి అందరికీ బోధపడింది. అందుకే తెలుగు భాషను కాపాడేందుకు నిర్బంధ చర్యలు, భాషను సుసంపన్నం చేసుకునేలా ప్రజల్లో ఆసక్తి, చైతన్యం పెంపొందించే చర్యలు అవసరమన్న భాషావేత్తల సూచనలు అమలు కావాల్సి ఉంది. ‘తెలుగు వెలుగులు ప్రపంచా నికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’అంటూ ఈ మహాసభలకు ప్రభుత్వం ఖరారు చేసిన నినాదం నలుదిశలా మారుమోగాల్సి ఉంది. మన భాష మరిన్ని తరాలు మహోజ్వలంగా వెలుగొందేందుకు ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి. అలాగైతేనే మహాసభల సాక్షిగా చేసే తీర్మానాలు నీటిమీద రాతలు కాకుండా ఉంటాయి. ఈ దిశగా ప్రభుత్వంపై ఎంత బాధ్యత ఉందో, తెలుగు ప్రజలందరిపైనా అంతే బాధ్యత ఉంది. తెలుగులో పలకరించుకుందాం.. తెలుగులో రాద్దాం.. అమ్మ భాషను ఆదరిద్దాం.. మన భాషను కాపాడుకుందాం.. అందుకే ఇది మన పండుగ.. ఇంటింటి వేడుక. లోటుపాట్లు ఉండొద్దు: కడియం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో కలసి మహాసభల ఏర్పాట్లపై సమీక్షించారు. వేదిక, ఇతర పనులను పరిశీలించారు జిల్లాల నుంచి 30 వేల మందికిపైగా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని.. దేశవిదేశాల నుంచి భాషావేత్తలు, సాహితీ ప్రియులు, విశిష్ట అతిథులు, భాషాభిమానులు మహాసభల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా ప్రధాన వేదిక సిద్ధం కావాలని, అధికారులు సమన్వయంతో బాధ్యతలు పంచుకుని సభలను విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ఇలా.. ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల ప్రధాన అతిథి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకుంటారు. అదే సమయానికి సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుంటారు. వారంతా తేనీటి విందు స్వీకరించి.. ఎల్బీ స్టేడియంలో మహాసభల ప్రాంగణానికి వెళతారు. అతిథులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతారు. వీఐపీలంతా వేదికపైకి చేరుకుని.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశాక మహాసభలు ప్రారంభమవుతాయి. స్టేడియంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. -
తెలుగుకు తొలి వందనం
సందర్భం నేటి నుండి 19వ తేదీ వరకు తెలుగు పండుగ జరుగుతుంది. ఈ వేడుక కోసం ప్రపంచం నలుమూలల నుండి తెలంగాణ బిడ్డలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భాషాప్రియులు పెద్ద ఎత్తున హైదరాబాదు తోవ పట్టారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులందరినీ స్మరించుకోవడం, వర్తమానంలో మన భాష స్థితిని విశ్లేషించుకోవడం, భవిష్యత్తులో తెలుగు భాషాభివృద్ధికి మార్గాన్ని నిర్దేశించుకోవడం అన్నవి ప్రధాన అంశాలుగాముందుకు సాగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ. అందుకే ‘తెలుగు’ అనే పదాన్ని తొలిసారి వాడిన వారైనా, గొప్ప కావ్యాలను అచ్చ తెలుగులో సృజన చేసిన వారిలో, ప్రజల భాషలో, జాను తెలుగులో రచనలు చేసిన వారిలో, వివిధ సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. సమైక్య రాష్ట్రంలో పరాయిపాలనలో మన వైభవాన్ని చాటుకునే వేదికలు మనకు దక్కలేదు. ఈ సందర్భంలో పెద్దలు చెప్పినట్టుగా ‘వినయానికి విరుద్ధమైనా’ కొన్ని సందర్భాలలో ఘనమైన మన గతాన్ని మనమే చెప్పుకోవాలి. పాల్కురికి సోమన –తొలి తెలుగు స్వతంత్ర రచన బసవ పురాణం– పాల్కురికి సోమన తొలి తెలుగు శతకం –వృషాధిప శతకం తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం– పండితారాధ్య చరిత్ర తొలి ఉదాహరణ కావ్యం – బసవోదాహరణం తెలుగు పదం వాడిన మొదటి కవి–పాల్కురికి సోమన గోన బుద్దారెడ్డి – రంగనాథ రామాయణం, తొలి తెలుగు రామాయణం–ద్విపద రామాయణం కుప్పాంబిక– తొలి తెలుగు కవయిత్రి– గోన బుద్దారెడ్డి బిడ్డ– బూదపూర్ శాసనం మహబూబ్‌నగర్ జిల్లా తొలి తెలుగు జంట కవులు– కాచ భూపతి, విఠలనాథుడు(గోన బుద్దారెడ్డి కుమారులు) తెలుగులో తొలి పురాణం– జినేంద్ర పురాణం, పంపకవి రాశాడు. జిన వల్లభుడు– పంపకవి తమ్ముడు. 3 తెలుగు కంద పద్యాలు రచించి, కురిక్యాల దగ్గర శాసనం వేయించాడు. (పై రెండూ తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఆధారాలుగా ఉపయోగపడ్డాయి) తొలి తెలుగు లక్షణ గ్రంథం– కవి జనాశ్రయం– మల్లియ రేచన రాశాడు. తెలుగులో తొలి చంపు రామాయణం– భాస్కర రామాయణం. తొలి నాట్యశాస్త్ర గ్రంథం– జయప సేనాని రాసిన నృత్య రత్నాకరం. తెలుగులో వచ్చిన తొలి పురాణం– మార్కండేయ పురాణం. మారన కవి తెలుగులోకి అనువదించాడు తొలి తెలుగు వచన కవి, తెలుగులో భజన సాంప్రదాయానికి ఆద్యుడు– కృష్ణమాచార్యుడు (మహబూబ్‌నగర్) తెలుగులో తొలి భాగవతం– పోతన భాగవతం తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకం –భోగినీ దండకం తొలి అచ్చ తెలుగు కావ్యం– యయాతి చరిత్రం– పొన్నగంటి తెలగన రాశాడు.(పటాన్చెరువు) తెలుగులో తొలి సంకలనం–– మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతం. తొలి కథా సంకలన కావ్యం– సింహాసన ద్వాత్రింశిక – కొఱవి గోపరాజు. (నిజామాబాద్, భీమ్‌గల్) తొలి నీతి శతకం– బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి (సుమతి శతకం) తొలి తెలుగు యక్షగానం–– 1వ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్ర. సంస్కృత కావ్యం రచించిన తొలి తెలుగు మహిళ– గొంగాదేవి కాకతీయుల ఆడపడుచు. తొలి కల్పిత ప్రబంధం ––నూతన కవి సూరన రాసిన ధనాభిరామం. తెలుగులో తొలి చారిత్రక వచన గ్రంథం–ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర. భైరవ కవి– బంధ కవిత్వానికి ఆద్యుడు. ప్రతాపరెడ్డి సురవరం –ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. తొలి నిరోష్ట్య కావ్యం, నిరోష్ట్య రామాయణం– మిరింగంటి సింగరాచార్యులు దశరథ రాజ నందన చరిత్ర తొలి తెలుగు నవల – కంబుకంధిర చరిత్ర, తడకయల్ల కృష్ణారావు తొలి తెలుగు కథా రచయిత్రి– బండారు అచ్చమాంబ– ధనత్రయోదశి అనే కథ –‘హిందూ సుందరి’ పత్రికలో వెలువడింది. తెలుగులో తొలి దళిత కవి– చింతపల్లి దున్న ఇద్దాసు ఈ విధంగా ఎన్నో సాహితీ ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది. తెలుగు సారస్వత చరిత్రలో తెలంగాణ నుండి అనేక మంది కవులు, రచయితలు తమదైన ముద్రలు వేశారు. ఇప్పటివరకు పైన ఉదహరించినవి అందులో కొన్ని మాత్రమే. ఆ గత వైభవాన్ని కొనసాగించి, ఘనమైన తెలంగాణ వారసత్వాన్ని నిలబెట్టే నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తెలుగును పరిరక్షించేందుకు, ఒక విస్తృత జీవభాషగా భవిష్యత్తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1 నుండి 12వ తరగతివరకు తెలుగు భాషను తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామ ఫలకాలను తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంది. తెలంగాణలో సాహిత్య సేవకై తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి ఐదుకోట్ల రూపాయలు కేటాయించింది. అకాడమీ పుస్తకాల్లో తెలంగాణ యాస/మాండలికం సగౌరవంగా స్థానం పొందింది. అంతేకాక ప్రభుత్వ పాలనా వ్యవహారాలను తెలుగులో కొనసాగించేందుకు నడుం బిగించింది. భాషాప్రియులైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగుకు మహర్దశ సాధించేందుకు అవసరమైన విధానాలను అమలు చేస్తుంది. తెలంగాణలో దశదిశలా తెలుగు వెలుగులు విరజిమ్మడానికి, తెలంగాణ ఖ్యాతి ఎల్లెడలా ప్రవహించడానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భం నాంది అవుతుంది. జై తెలంగాణ. వ్యాసకర్త నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత -
భాషాభివృద్ధికి బాట వేయాలి!
సమకాలీనం తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు రావటం లేదు. అందువల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ‘‘ఒక మాటకు ఒక అర్థం. అదీ న్యాయం. కాని, ఈ ప్రపంచంలో చూడండి! ఒక మాటకు పది అర్థాలు. ఒక అక్షరానికి లక్ష అర్థాలు. శ్రీ అనే అక్షరం, లేదా మాట, చూడండి–ఎన్ని అర్థాలో! ఇక రెండో కొసను: ఒక అర్థానికే కోటి పదాలు, ఉదాహరణ, స్త్రీ, స్త్రీ వాచకానికి పర్యాయపదాలు ఇంతవరకు సంపుటీకరించిన శాస్త్రి గారెవరూ నాకు కనబడలేదు. ఈ పదార్థాల నిరంకుశత్వాన్ని భరించలేడు నవకవి! ఒక పదం అనేక అర్థాలను అంతఃపురంలో దాచుకునే వివాహం, ఒక అర్థం అనేక పదాలతో విచ్చలవిడిగా విహరించే వ్యభిచారం......’’ –శ్రీశ్రీ తెలుగు భాషను సుసంపన్నం చేసిన ‘నానార్థాలు’, ‘పర్యాయపదాల’ను ఇంత బాగా విశ్లేషించిన వారు లేరేమో! 1939 లో ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు ఈ వ్యాఖ్య చేశారు. ఏడున్నర దశాబ్దాల కింద నవకవిలోనే భాషపై అంతటి భిన్నాభిప్రాయం ఉంటే, ఇప్పటి నవతరం ఎలా చూస్తారు? ఎలా చూస్తున్నారు? భాష చలనశీలత కలిగినది. ఎన్నో మార్పులకు గురవుతూ వస్తున్న మన తెలుగుదీ సుదీర్ఘ చరిత్ర, వైభవం. వెయ్యేళ్ల సాంద్ర రచనా సంపత్తి, రెండు వేల ఏండ్ల లిఖిత భాషా ప్రాచీనత, అంతకు పైబడిన ఉనికి మన సొంతం. ఇందులో ఉత్థానపతనాలున్నాయి. ఆయా కాలాల్లో... తెలుగు పరిమళభరితమై విరాజిల్లిన, కల్మషాలను కలగలుపుకొని సాగిన వైవిధ్య గతముంది. కానీ, మునుపెన్నడు లేని తీవ్ర సంక్షుభిత స్థితిని ఇప్పుడు తెలుగు భాష ఎదుర్కొంటోంది. తెలుగు చదవటం, రాయడం పట్ల కొత్తతరం కనీస ఆసక్తిని కూడా కనబరచడం లేది ప్పుడు. కొన్నాళ్లు పోతే తెలుగును కోరేవారే ఉండరేమో! వలసపాలన అవశేషాల్లో ఒకటైన ఆంగ్లంపై భ్రమ, విశ్వమంతటినీ విపణివీధిగా మార్చిన ప్రపంచీకరణ, తల్లి భాష తెలుగుపట్ల గౌరవభావమేలేని నవతరం, వరుస ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి భాషను ప్రమాదపు అంచుకు నెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేదికనుంచయినా ఓ గొప్ప సంకల్పం భాషోద్ధరణకు దారులు పరవాలి. ఇప్పటికిప్పుడు మాట్లాడుకోవడాలకేం ఇబ్బంది ఉండదేమో కాని, మున్ముందు గడ్డుకాలమే! రాను రాను తెలుగు రాయడం–చదవడం కనుమరుగయ్యే ప్రమాదాన్ని తప్పించాలి. మన దేశంలో అక్షరాస్యతే అంతంత! 40 శాతానికి మించిన అక్షరాస్య జనాభా తల్లిభాషకు దూరమైతే, సదరు భాష స్వల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందనేది ఐక్యరాజ్యసమితి హెచ్చరిక. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే అది తెలుగుకు పతనశాసనమౌతుందని ‘యునెస్కో’ పరిశోధనా ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. తల్లిభాషలోనే ప్రాథమిక స్థాయి విద్యాబోధన నిర్బంధం చేయడంతో సహా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో భాషను బతకనివ్వాలి. అంతర్జాతీయ అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఎంత ముఖ్యమైనా, పిల్లల్లో సహజ సృజన–పరిశోధనాతత్వం వృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి తల్లిభాషలో విద్యాభ్యాసం ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలి. పోటీ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా, పిల్లలు సహజ మేధో వికాసంతో నిలదొక్కుకునేలా విద్యాసంస్థలు పూనిక వహించాలి. అన్యభాషాలంకార పుష్పాలెన్నున్నా, పూలదండలో దారం లాగా తల్లిభాష వారిలో ఇంకేలా చేయాలి. ప్రసారమాధ్యమాలు, ప్రభుత్వాలు, వాటి ఉపాంగాలయిన వివిధ అకాడమీలు భాషపై నిరంతర పరిశోధనల్ని కొనసాగించాలి. కొత్త తరంలో తెలుగుపై ఆసక్తిని, వినియోగంపై అనురక్తిని పెంపొందించే చర్యలుండాలి. సాధనం వారికే, బాధ్యత వారిదే! భాషా వికాసంలో ప్రసారమాధ్యమాల, ముఖ్యంగా జనమాధ్యమాల పాత్ర అపారం. జన సమూహాల మధ్య, ప్రజలు–పాలకులకు మధ్య, పరస్పర ప్రయోజనాలున్న పలు పక్షాల నడుమ జన మాధ్యమాలు సంధానకర్తలు. ఈ క్రమంలో భాషే వాటి భావవ్యాప్తికి ఉపకరణం! ఎప్పటికప్పుడు భావ ప్రసరణ నైపుణ్యాల్ని వృద్ధి చేసుకుంటూ భాగస్వాములకు గరిష్ట ప్రయోజనాలు కలిగించే క్రమంలో భాషను ఆ«ధునీకరించడం, అభివృద్ధి చేయడం తమ కర్తవ్యంగానే కాక ఒక అవసరంగా కూడ లోగడ పరిగణించేవారు. అందుకే మొదట్నుంచీ ఈ మాధ్యమంలో క్రియాశీల పాత్ర నెరిపే వారందరికీ భాషకు సంబంధించి బలమైన పునాదులుండేవి. సంపాదకులకు, మీడియాలో వివిధ స్థాయి నిర్వహకులకు సాహిత్యంతో సాంగత్యం ఆ రోజుల్లో సహజం. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాతి తొలి దశాబ్దాల్లో కూడా అటు సాహితీ శ్రేష్ఠుల్లో పాత్రికేయ అనుభవజ్ఞులు, ఇటు జర్నలిస్టుల్లో సాహితీ మూలాలున్న వారు ఎక్కువగా కనిపించేవారు. కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, బండి గోపాలరెడ్డి (బంగోరె), సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, అడవి బాపిరాజు, నండూరి రామ్మోహనరావు తదితరులతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు–ముళ్లపూడి వెంకటరమణ, గజ్జెల మల్లారెడ్డి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ.... తదితరులు రెండు పాత్రల్ని సమర్థంగా నిర్వహించిన వారే! సాహిత్యం–పాత్రికేయం, రెండు రంగాల్లో ప్రావీణ్యమున్న అటువంటి ముఖ్యుల నేతృత్వంలో దినపత్రికల నుంచి వార, మాస, త్రైమాసిక, వార్షిక ఇలా రకరకాల పత్రికలు, టీవీ తదితర మాధ్యమాలు వేర్వేరు రూపాల్లో భాషాభివృద్ధి జరిపేవి. ఇటీవలి పరిణామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భాషకు సంబంధించిన పూర్ణ అవగాహన లేకున్నా, లోతుపాతులు తెలియకున్నా... ఇతరేతర అర్హతలతో మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నేతృత్వం వహిస్తున్నారు, ప్రధాన జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారు. భాషా వికాసం సంగతలా ఉంచి, భాషపైన శ్రద్ధ కూడా తగ్గింది. తప్పొప్పుల్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు పట్ల కనీస గౌరవం, మర్యాద లేని వారు కీలక స్థానాలు అలంకరిస్తున్నారు. భాషాభివృద్ధికి దోహదపడాల్సిన పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్సైట్లు అపప్రయోగాలతో భాషను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు పెరిగాయి. మీడియా అలక్ష్యం, లెక్కలేనితనం వల్లే భాష సంకరమైపోతోందనేది ఆరోపణ. ఇంగ్లిష్ శరవేగంగా తెలుగు సమాజపు దైనందిన భాషా వాడకంలోకి, సంభాషణల్లోకి చొచ్చుకు వచ్చేసింది. ఈ పరిణామం తెలుగు అస్తిత్వానికే ప్రమాదకారిగా మారిందనే భావన బలపడుతోంది. దీన్ని పరిహరించాల్సిన మాధ్యమాలు, భాషా సంకరానికి తామే కారణమౌతున్నాయని, ముఖ్యంగా టీవీపైన ఈ విషయంలో ఘాటైన విమర్శ ఉంది. ఇదంతా దాదాపు రెండు దశాబ్దాల పరి ణామం. చేతన, స్పృహతో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానైనా ఈ దిశలో అడుగులు పడతాయేమోనన్నది ఒక ఆశ! ఈ పండుగైనా శ్రీకారం చుట్టాలి... తెలుగు ప్రపంచ పండుగకు ఇల్లలికారు. ఈ రోజునుంచే పండుగ మొదలు. ప్రతి పండుగా ఇంటిల్లిపాదికీ ఉల్లాసం కలిగించేదే! నిరంతర కాలప్రవాహంలో అప్పుడప్పుడు పండుగలతో సంబురాలు చేసుకోవడం మన సంస్కృతిలో భాగం! ఈ అయిదొద్దుల పండుగకు ఎన్నెన్నో వేదికలు, మరెన్నో వేడుకలు. ఒక జాతిని సమైక్యపరుస్తున్న తెలుగు భాషా వైభవాన్ని తలచుకోవడం, ఉన్నతిని చాటుకోవడం, తాజా స్థితిని సమీక్షించుకోవడం, వీలయినంత బాగుచేసుకోవడం, కనుమరుగు ప్రమాదమున్న చోట కాపాడుకోవడం.... ఇలా అనేక లక్ష్యాలతో పండుగ నిర్వాహకులు పలు కార్యక్రమాలు రూపొం దించారు. ఏకకాలంలో వివిధ వేదికల నుంచి ఈ వేడుకలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచీ కవులు, రచయితలు, భాషావేత్తలు, పరిశోధకులు, వ్యవహారకర్తలు, భాషాభిమానులు ఇతర ఔత్సాహకులు హైదరాబాద్‌కు దారికట్టారు. తెలుగు భాషను ప్రేమించేవారికిది సంతోషం. ఈ చర్యల పట్ల విశ్వాసం లేని వారూ ఉన్నారు. ఈ సభలను తాము బహిష్కరిస్తున్నట్టు విప్లవకవి వరవరరావు తదితరులు బహిరంగ ప్రకటన చేశారు. 47 ఏళ్ల కిందటి ఒక కరపత్రాన్ని కొందరు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ‘....కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?’ అని గొప్ప కథారచయిత కొడవటిగంటి కుటుంబరావు పేరిట, అప్పట్లో (1970) వ్యాప్తిలోకి వచ్చిన కరపత్రమది. విశాఖ–హైదరాబాద్‌ల నడుమ, మహాకవి శ్రీశ్రీ కేంద్ర బిందువుగా ఈ పరిణామాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగాయి. భిన్న వాదనలతో సాహితీవేత్తల సమూహం నిలువునా చీలిపోయింది. తనను సత్కరించేందుకు తలపెట్టిన సదస్సుకు, ముందే ప్రకటించి శ్రీశ్రీ గైర్హాజరయ్యారు. భాషాభివృద్దికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు మద్దతెంత లభిస్తుందో, కొన్నిసార్లు వ్యతిరేకతా అంతే ఉంటుంది. అందుకు, వేర్వేరు కారణాలుండవచ్చు. కానీ, భాషను కచ్చితంగా అమలుపరచే విషయమై ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కొరవడ్డ సందర్భాలు కోకొల్లలు. తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు తయారవటం లేదు. ఇవేవీ లేకపోవటం వల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ఇవన్నీ జరిగేలా ఈ పండుగ నుంచి ఒక కార్యాచరణ పుట్టాలి. దాని అమలుకు ప్రభుత్వం కట్టుబడాలి. ఇంగ్లిష్ ప్రభావం నుంచి బయటపడాలి తెలుగు భాషను ఆధునీకరించుకోవాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. మాండలికాలు ప్రామాణిక జాబితాలో చేరి విరివిగా వాడకంలోకి రావాలి. జనం పలుకుబడిలో నలిగిన అన్య భాషాపదాల ఆదానప్రదానాలు జరిగి స్థిరీకరణ పొందాలి. పదసంపద పెరిగి, తల్లిభాషలో తెలుగువారి అభివ్యక్తి రాటుతేలాలి. జనసామాన్యం తిరగాడే చోట నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలనే ఒక నిర్బంధాన్నీ అమలు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల పేర్లను తెలిపే ఫలకాలూ ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగు మాటే ఉండదు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, విభిన్న స్థాయిల్లోని కోర్టు ఉత్తర్వులు.... ఇలా అన్నీ అన్యభాషలోనే! పాక్షిక న్యాయ విభాగాల్లోనూ అంతే! తెలుగులో ఫిర్యాదు, తెలుగులో విచారణ, తెలుగులో సాక్షి వాంగ్మూలం నమోదు, తెలుగులో వాద–ప్రతివాదనలు.... కానీ, తీర్పులు ఇంగ్లిష్‌లో! ఇంకెప్పటికి పరి స్థితి మారుతుంది? దీన్నుంచి మనం బయటపడాలి. 52 ఏళ్లకింద డాక్టర్ రామ్మనోహర్ లోహియా చెప్పిన ఒక మాటతో ముగిస్తాను. దేశంలో తలెత్తిన భాషాపరమైన అల్లర్లపై 1965, ఫిబ్రవరి 23న కేంద్రం తలపెట్టిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని, 19న మన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ప్రతిపాదన వెల్లడించారు. అందులో 6వ అంశం ఇలా ఉంది. ‘‘తమ ప్రాంతాల నుంచి ఇంగ్లిష్ భాషను తొలగించుకున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కూడా ఇంగ్లిష్‌ను తొలగించుకోవాలి. కేవలం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లిష్‌ను తొలగించినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా, ఈ భ్రమోత్పాదక స్థితివల్ల నష్టం కూడా సంభవించవచ్చు.’’ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఈ సంబరాలు స్ఫూర్తినీయాలి
సుదీర్ఘ పోరాటాలతో, అవిరళ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసు కున్న తెలంగాణ ప్రజానీకం ఇవాళ్టితో మొదలుపెట్టి అయిదురోజులపాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలతో పులకించనుంది. ఈ గడ్డ వేల సంవత్సరాలుగా సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. కళల మాగాణంగా ఇది కాంతులీనుతోంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, మొఘల్ చక్రవర్తులు, కుతబ్‌షాహీలు, అసఫ్‌జా హీలు... ఇలా ఎన్నో రాజవంశాల పాలనకు ఈ గడ్డ సాక్షీభూతంగా నిలిచింది. ఇది భిన్న జాతి, మత, భాషా సంప్రదాయాల కూడలి. ఇక్కడే ఎందరెందరో తేజో మూర్తులు, మహనీయులు ప్రభవించి జాతిని, సంస్కృతిని, భాషను సుసంపన్నం చేశారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ ధ్రువతారలుగా నిలిచి వెలుగుతున్నారు. కొందరు పాలకులు ఉన్మాద మూకలను ఉసిగొల్పినా, విభజించి పాలించాలని చూసినా, నిరంకుశత్వాన్ని ప్రతిష్టించాలనుకున్నా ఇక్కడి ప్రజ బెదరలేదు. ‘నీకు గోరి గడతం కొడుకో... నైజాము సర్కరోడా’ అంటూ వారు సాగించిన సాయుధ పోరాటంలో బతుకు గోస మాత్రమే కాదు... భాషనూ, పలుకుబడినీ, సంస్కృతినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాలన్న తపన కూడా ఉంది.ఈ గడ్డ ఎన్నెన్నో కళా రూపాలకూ, ప్రక్రియలకూ పుట్టినిల్లు. చిందు బాగోతం, ఒగ్గు కథ, జాంబ పురాణ ప్రదర్శన, మడేలు పురాణం, బైండ్ల కథ, కడ్డీ తంత్రీ వాద్య కథలు, కిన్నెర వాద్య కథల వంటి అసంఖ్యాక జానపద ప్రక్రియలను ఇక్కడి జనపదాలు తమ గుండెల్లో పొదువుకున్నాయి. తరం నుంచి తరానికి భద్రంగా అందించాయి. పేరిణి, థింసా, థూలా ఆట, చుట్టకాము నృత్యం, బతుకమ్మ లాంటి కళా రూపాల్లో ఇక్కడి ప్రజ ఆశ, శ్వాస నిండుగా ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు, పోతన, గోన బుద్ధారెడ్డి, బద్దెన, జయపసేనాని, మడికి సింగన వంటి ఎందరెందరో కవులు, రచయితలు తెలుగు భాషనూ, సంస్కృతిని సుసంపన్నం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దాశరథి సోదరులు, సినారె, గద్దర్ వంటివారు సాహితీ, సాంస్కృతిక రంగాల్లో కొనసాగించిన కృషి అసామాన్యమైనది. చారిత్రక విభాతసంధ్యల్లో తెలంగాణ వికాసాన్ని, ఇక్కడి కమనీయ స్మృతు లను నెమరువేసుకునే ఈ విశిష్ట సందర్భం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధాసక్తులు పెట్టారు. మహాసభల కోసం జరిగే సమావేశాల్లో ఒకటికి రెండుసార్లు పాలుపంచుకుని దిశా నిర్దేశం చేశారు. పన్నెండో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా బోధించాలని... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులో రాసితీరాలని మూడు నెలలక్రితమే ఆయన ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీయే పాఠ్య ప్రణా ళికలు రచించేలా, వాటిని మాత్రమే అన్ని విద్యాసంస్థలూ అనుసరించేలా నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ మహాసభల కోసం నిర్వాహకులు చేసిన కృషి కొనియా డదగినది. అనేకమంది మహనీయులనూ, వారి విశిష్టతనూ గుర్తుకుతెస్తూ హైదరా బాద్ ప్రధాన పురవీధుల్లో, కూడళ్లలో కట్టిన తోరణాలు, భారీ ఫలకాలు (హోర్డిం గ్లు) భాషాభిమానులను అలరిస్తున్నాయి. వాటిపై వేర్వేరు కవులు, రచయితల ఛాయాచిత్రాలతోపాటు, వారి సారస్వత కృషిని రేఖామాత్రంగా వెల్లడించే కవితా త్మక వాక్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి అంతిమంగా వారి రచనలపై నలుగురి దృష్టీ పడేలా చేస్తాయని ఆశించాలి. భాష ప్రవహించే నదిలాంటిది. ఒకచోట సన్నగా, వేరొకచోట వెడల్పుగా, ఇంకొకచోట లోతుగా ప్రవహించే నదిలాగే భాష కూడా బహురూపాలు పోతుంది. స్థానికతను సంతరించుకుంటుంది. దాని శక్తి అసామాన్యం. ఒక జాతి కట్టుబాటును మతం కన్నా భాషే ఎక్కువ శాసిస్తుందని, ప్రజానీకం అందులోనే తన ఉనికిని వెదుక్కుంటుందని తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించినప్పుడే రుజు వైంది. అందుకే యునెస్కో బంగ్లా విముక్తి దినాన్ని మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. వైభవోజ్వల గతాన్ని గుర్తు చేసుకోనప్పుడు, అలసత్వాన్ని ప్రద ర్శించినప్పుడు, అలక్ష్యాన్ని చూపినప్పుడు భాషలు ప్రమాదంలో పడతాయి. పాళీ, ప్రాకృత భాషలు అలాగే అంతరించాయి. సంస్కృతం ఇప్పటికైతే మన కళ్ల ముందున్నా అది మనుగడ కోసం పెనుగులాడుతోంది. ఈ స్థితి ఏ భాషకూ రావ ద్దనుకుంటే ప్రజానీకంలో భాషపైనా, సంస్కృతిపైనా ఆసక్తి రేకెత్తించాలి. అమ్మ భాష నేర్వనివారు అన్య భాషల్లోనూ అంతంతమాత్రంగా ఉంటారన్న జార్జి బెర్నార్డ్ షా వంటి ఉద్దండుల హెచ్చరికలను గుర్తు చేయాలి. ఇలాంటి పండుగలు ఆ పని చేస్తాయి. అయితే ఇంతమాత్రమే సరిపోదు. ఈ మహాసభల్లో వ్యక్తమయ్యే అభి ప్రాయాలనూ, సూచనలనూ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. భిన్న జానపద కళారూపాల ప్రదర్శన అందరికీ పరిచయం మాత్రమే ఏర్పరుస్తుంది. ఆయా కళారూపాలను బతికించుకోవాలంటే వాటిపై ప్రత్యేక అధ్యయనం, పరిశోధన కొనసాగాలి. ఆ కళారూపాల లోతుల్లోకి వెళ్తే మరు గున పడిన ఎన్నో అంశాలు వెలుగుచూస్తాయి. అటు బోధననూ, ఇటు పరిశోధ ననూ జీవితపర్యంతం కొనసాగించి తెలుగు, సంస్కృతాల్లో అసంఖ్యాకమైన అము ద్రిత గ్రంథాలను సేకరించి, పరిష్కరించిన బిరుదరాజు రామరాజు వంటివారి కృషి ఆదర్శం కావాలి. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భ వించినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ప్రతి రాష్ట్రానికీ అక్కడి భాషే అధికార భాష కావాలని పిలుపునిచ్చారు. పరిపాలనంతా ఆ భాషలోనే సాగాలని వాంఛించారు. దురదృష్టవశాత్తూ ఈనాటికీ అది అరకొరగానే ఉంది. న్యాయస్థానాల్లో అయితే ఇంగ్లిష్ తప్ప మరేదీ కనబడదు. వినబడదు. ఇక ఉన్నత విద్యలో శాస్త్ర గ్రంథాల లభ్యత గురించి మాట్లాడుకోనవసరమే లేదు. ఇప్పుడు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు బహువిధ కార్యాచరణకు రూపకల్పన చేసి ఈ లోటుపాట్లన్నిటినీ సరి చేయాలి. అన్నిచోట్లా అమ్మ భాషకు పట్టం కట్టాలి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. -
తెలుగు మహాసభలకు వేదికే ప్రత్యేక ఆకర్షణ
-
అర చేతి తెరలోకి తెలుగొస్తుందా?
కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం అన్నది పాతమాట. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అసలు తెలుగులోనే కంప్యూటర్లు ఎందుకు ఉండకూడదూ అని ఆలోచిద్దాం.కంప్యూటర్లు వాడుకలోనికి రావడం మొదలైననాటి నుండి వాటిలో (ఆంగ్లేతర) మానవ భాషల వినియోగానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత, ఇప్పటికైనా మామూలు తెలుగువాడు కంప్యూటర్ని తెలుగులోనే వాడుకోగలడా!? అయితే, ఎంతవరకూ వాడుకోగలడు? దీన్ని నాలుగు స్థాయుల్లో చూద్దాం. కంప్యూటర్ అంటే స్మార్టు ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు కూడా. ఒకటో స్థాయి: తెలుగు చూడటం, టైపు చెయ్యడం ఈ స్థాయిలో కంప్యూటర్లు తెలుగులో సమాచారాన్ని తెరపై చూపించగలగాలి. మనకి టైపు చేసే వీలు కల్పించాలి. నేడు మనం ఈ స్థాయిని చాలావరకు చేరాం అని చెప్పవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలోనూ (విండోస్, గ్నూ/లినక్స్, మ్యాకింటోష్), కొత్త స్మార్టు ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్) ఇప్పుడు మనం తెలుగు సమాచారాన్ని చూడవచ్చు, వీటిలో టైపు చెయ్యవచ్చు కూడా. ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు కనీసం ఒక తెలుగు ఫాంటుతో వస్తున్నాయి. ఇక టైపు చెయ్యడానికి మనం కీబోర్డు సెట్టింగులలో తెలుగు భాషను ఎంచుకుంటే చాలు. చాలా వరకూ తెలుగు ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేయవుట్లు ఉంటుంది. మనకి ఇప్పటికే ఆపిల్, మాడ్యులర్ వంటి లేయవుట్లు తెలిసివుంటే, వాటితోనూ టైపు చేసుకోడానికి అప్లికేషన్లూ దొరుకుతున్నాయి. అంతర్జాలంలో మనకు అన్ని అవసరాలకు ఉపయోగపడే తెలుగు సమాచారం అందుబాటులో లేదు. తెలుగు వార్తా పత్రికల సైట్లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపీడియా, మరి కొన్ని గాసిప్ సైట్లూ తప్ప అంతర్జాలంలో తెలుగు పెద్దగా లేదన్నది ఒక వాదన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వెబ్ సైట్లూ అరకొరగానే తెలుగులో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాసేవారు బాగా పెరిగారు. రెండో స్థాయి: తెరపై మొత్తం తెలుగు కనబడటం ఈ స్థాయిలో కంప్యూటరు గానీ, ఫోను గానీ మామూలు అవసరాలకు వాడుకోడానికి ఆంగ్లం అవసరం ఉండకూడదు. తెలుగుకి సంబంధించినంత వరకూ మనం ఈ స్థాయిలో మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. విండోస్, గ్నూ/లినక్స్ నిర్వాహక వ్యవస్థలను తెలుగు భాషలో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొరకు తెలుగు భాషా ప్యాక్‌లు మైక్రోసాఫ్ట్ వారి సైటు నుండి దింపుకోవచ్చు. మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఏవో కొన్ని అప్లికేషన్లు మాత్రమే తెలుగులో లభిస్తున్నాయి. ఇక అంతర్జాలం విషయానికి వచ్చేసరికి, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సైట్లూ, ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లిబ్ర ఆఫీస్ లోనూ కొంత వరకూ తెలుగు స్పెల్ చెకింగ్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు వ్యాకరణాన్ని సరిచూసే వెసులుబాటు మాత్రం లేదు. మన దేశ కంపెనీలు పేటీఎమ్, 1ఎమ్జీ వంటి ఆప్స్ తెలుగులో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో వాడుకోడానికి, ఆయా ఆప్స్ సెట్టింగులలో మన భాషని తెలుగుగా ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఊర్లు, వీధుల పేర్లు ఈ మధ్య తెలుగులో కనిపిస్తున్నాయి. ఇదో శుభపరిణామం. ఇన్ని ప్రోగ్రాములూ ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నా వీటిలోని అనువాదాలు అందరికీ అర్థమయ్యే విధంగా లేవనీ అనువాదాలలో నిలకడ, నాణ్యత లోపించాయనీ కూడా ఫిర్యాదులున్నాయి. మనం వాడి చూసి, తప్పులనూ దోషాలనూ ఆయా కంపెనీలకు నివేదించాలి. తెలుగు బాగా తెలిసిన వారినీ, అనువాదాలపై పట్టున్న వారినీ ఈ స్థానికీకరణ ప్రక్రియలో భాగస్వాములను చెయ్యాలి. ఇంత చెప్పుకున్నా, రోజువారీ అవసరాలను పూర్తిగా తెలుగులోనే జరుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. ఈ దిశగా మనం ప్రభుత్వాలనూ, వ్యాపార సంస్థలనూ అడగాలి. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే, వస్తూత్పత్తులూ, సేవలూ, వాటి సంబంధిత సమాచారమూ తెలుగులో కూడా ఉండేవిధంగా మన ప్రభుత్వాలు విధానపరంగా చర్యలు చేపట్టాలి. ఇంగ్లీషు లేకుండా కంప్యూటర్లు వాడుకోడానికి, కీబోర్డులు తెలుగులో కూడా ఉండాలి. గతంలో టీవీఎస్ కీబోర్డులు తెలుగు మీటలతో ఉండేవి. ఈ మధ్య సురవర వారు తెలుగు కీబోర్డులు అమ్మారు. అలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. భారతదేశంలో విక్రయించే స్మార్టు ఫోన్లలో తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. కానీ కంప్యూటర్లకూ, వెబ్ సైట్లకూ ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఉన్నట్టు లేవు. మూడో స్థాయి: కంప్యూటర్లు మన మాటల్ని అర్థం చేసుకొని తెలుగులోనే బదులివ్వగలగడం ఐఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కోర్టానా, అమెజాన్ అలెక్సా వంటి ఉత్పత్తులు/సేవలు మన మాటల్ని ఇంగ్లీషు (ఇంకొన్ని భాషల్లో) అర్థం చేసుకుని బదులివ్వగలుగుతున్నాయి. కానీ, ఇవి తెలుగులో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. తెరపై తెలుగు పాఠ్యాన్ని చదవగలిగే ఉపకరణాలు ఉన్నా, అవి చదివింది వింటే తెలుగు విన్నట్టు ఉండదు. తెలుగు తీయదనాన్ని అవి నేర్చుకోలేదు. అది నేర్పవలసింది తెలుగువారం మనమే కదా. ఇక తెలుగులో ఉన్న రకరకాల మాండలీకాల్నీ యాసల్నీ, మనందరం మాట్లాడే పద్ధతులనీ అర్థం చేసుకుని అదే రీతిలో బదులివ్వాలంటే, చాలా పరిశోధన జరగాలి. ఈ దిశగా, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలూ చెయ్యాలి. నాలుగో స్థాయి: తెలుగులోనే కంప్యూటరు ప్రోగ్రామింగ్ తెలుగులో కంపైలరు తయారుచేయడానికి, తెలుగులో ప్రాగ్రామింగు రాయడానికి ఔత్సాహికుల చిన్ని చిన్ని ప్రయత్నాలు జరిగినా, ఒక స్థాయి చేరుకోడానికి ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలు సముద్రంలో నీటు బొట్టు కాదు కదా పరమాణువంత లెక్క. ఈ నాలుగో స్థాయిని ప్రస్తుతానికి చేరుకోలేనిదిగా వదిలేయవచ్చు. కానీ, మనం కంప్యూటర్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోడానికి, పైపై ఆటోమేషన్‌లకు తేలిగ్గా వాడుకోగలిగేలా తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటే బాగుంటుంది. మూడో స్థాయి వరకూ మనం ఎదగడానికి, తెలుగు భాషకి ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులంటూ ఏమీ లేవు; కేవలం మన భాషంటే తేలికభావం, నిర్లక్ష్యం, ఉదాసీనత తప్ప! ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నైనా మనందరం మన అమ్మ భాషకి పునరంకితమై ఈ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి తెలుగు సామెతల సంకలనం 1868లో వెలువడిన ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’. సంకలన కర్త ఎం.డబ్ల్యూ. కార్. ఇందులో 2,200 సామెతలున్నాయి. పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన తాళం కప్పలేని ఇనప్పెట్టె. – సూర్యప్రకాశ్ నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. కాని ఆ సంస్కారం కంటికి కనబడదు. చూసి విలువ కట్టలేము. – చలం -
చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు: పల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లికి దండ వేసి గౌరవించాకే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ సభలు జరుగుతాయని, సభలకు 8 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సభల్లో పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు ప్రక్రియలపై చర్చలుంటాయన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించవని, పిలిచినా కూడా వారు రారనే ఉద్దేశంతోనే పిలవలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అన్నీ ఢిల్లీ నుంచే వస్తాయి కాబట్టి తెలంగాణ తెలుగు రుచించట్లేదని ఎద్దేవా చేశారు. -
ప్రపంచ తెలుగు మహాసభల జ్యోతియాత్ర
పాలకుర్తి/పాలకుర్తి టౌన్: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలోని పోతన సమాధి వద్ద నుంచి బుధవారం జ్యోతియాత్ర ప్రారంభమైంది. ముందుగా ఇక్కడ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేనతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర ప్రముఖులు జ్యోతిని వెలిగించి యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతియాత్ర బమ్మెర నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం చేరుతుందని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం, తెలంగాణ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించిన జ్యోతియాత్ర కార్యక్రమంలో ఇంకా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అధ్యక్షురాలు రాపోలు శోభరాణి పాల్గొన్నారు. -
మహాసభలపైనా విమర్శలేనా?: కర్నె
సాక్షి, హైదరాబాద్: మన యాస, భాషకు చక్కటి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేర్వేరన్న సంగతిని గుర్తించలేని వారే ఇలా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ యాసతో మాట్లాడనివ్వని పరిస్థితుల్లో భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని భరతమాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రమాత ఉండేదని, కుట్రతో తెలుగుతల్లిగా మార్చారని అన్నారు. ఉద్యమసమయంలో తాము తెలుగుతల్లినే తప్ప ఆంధ్రమాతను విమర్శించలేదని గుర్తుచేశారు. ఇంటి పండుగ వంటి ప్రపంచ తెలుగు మహాసభలను శపిస్తూ మాట్లాడటాన్ని ప్రజలు సహించరని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలకు కమీషన్లే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. -
నేటి నుంచి మహాసభల కిట్ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను న భూతో న భవిష్యత్ అన్నట్టుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదిక నిర్మాణం, ఎనిమిది స్వాగత ద్వారాల ఏర్పాటు, ప్రత్యేక అలంకరణ, మహనీయుల హోర్డింగ్‌లు తదితర ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. మరోవైపు గురువారం నుంచే ప్రతినిధులకు మహాసభల కిట్లు, పాస్‌లను అందజేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రవీంద్రభారతిలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చేవారు నగరానికి చేరుకుని ఉంటే.. వాళ్లు కూడా రవీంద్రభారతిలో కిట్లను పొందవచ్చని, శుక్రవారం మధ్యాహ్నం వరకు రవీంద్రభారతిలో కిట్లను అందజేస్తారని చెప్పారు. ప్రతినిధులు తమ వద్ద ఉన్న స్లిప్పు, వరుస సంఖ్య చెబితే చాలు.. కిట్ అందజేస్తారన్నారు. విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ కిట్ల పంపిణీని పర్యవేక్షిస్తారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు.. వాళ్లు బస చేసే హోటళ్లలోనే కిట్లను అందజేస్తారు. సుమారు 8 వేల మంది ప్రతినిధులు, మరో 1,500 మంది అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు మహాసభల్లో పాల్గోనున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే 6,000 మంది ప్రతినిధులకు నగరంలోని పలు హోటళ్లలో బస కల్పించారు. వారికి అక్కడే భోజనం, వసతి ఉంటాయి. అక్కడి నుంచి వేదికలకు వెళ్లేందుకు అకాడమీయే రవాణా సదుపాయాన్ని కల్పించనుంది. వెయ్యి మంది వలంటీర్లు.. మహాసభల సందర్భంగా ప్రతినిధులకు, అతిథులకు కావలసిన సదుపాయాలను అందజేసేందుకు సాహిత్య అకాడమీ వెయ్యి మంది పరిశోధక విద్యార్థులను వలంటీర్లుగా నియమించింది. వీరు మహాసభల టీషర్టులు, టోపీలు ధరించి ప్రతినిధులకు, అతిథులకు అందుబాటులో ఉంటారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం, ప్రముఖులకు తగిన సేవలు అందజేసేందుకు టూరిజండెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 700 మందిని వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న జిల్లాలకు 20 నుంచి 30 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. తెలుగు అధ్యాపకులు, భాషా పండితులు, ప్రతినిధులు, రచయితలు, కవులు వీటిలో ఉచితంగా హైదరాబాద్ చేరుకునే సదుపాయం కల్పిస్తారు. ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు.. ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూర్ణకుంభం, మంగళవాద్యాలతో వేదిక వద్దకు సాదరంగా తోడ్కొని వస్తారు. రాష్ట్ర గవర్నర్ సరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. 10 వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకు ఏర్పాటు చేయనున్నారు. మరో 20 వేల మంది సాధారణ ప్రజల కోసం గ్యాలరీలో సీట్లు ఏర్పాటు చేయనున్నారు. తీర్మానాలు ఇవీ.. ♦ మహాసభల సందర్భంగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు బోధించాలనే తీర్మానం ఉంటుంది. ♦ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులోనే ఏర్పాటు చేయాలి. ♦ అధికార భాషా సంఘాన్ని బలోపేతం చేయాలి. ♦ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలి. ♦ వీటితో పాటు మరికొన్ని తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. -
సాహితీ చరిత్రను ప్రపంచానికి చాటాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాష, సంస్కృతి, సాహితీ చరిత్రను ప్రపంచానికి చాటేలా తెలుగు మహాసభల ఏర్పాట్లు ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను మంత్రి కడియం బుధవారం సమీక్షించారు. ఎల్బీ స్టేడియంలో మహాసభల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, స్వాగత ద్వారాలు, స్టాల్స్ ఏర్పాటు చేసే కేంద్రాలు తదితర పనులను పర్యవేక్షించారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న లేజర్‌షో, బాణసంచా విశేషాలను గురించి నిర్వాహకులతో చర్చించారు. సమావేశంలో సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ, ఆయాచితం శ్రీధర్, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు ఉద్యోగులు కృషి చేయాలని టీఎన్జీవో కోరింది. ఈ సభల ద్వారా తెలంగాణ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. రేపటి నుంచి 19 వరకు జరగనున్న ఈ మహా సభల పోస్టర్‌ను టీఎన్జీవో భవన్లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
‘మహా’సభలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ప్రధాన కారణమైన తొలి తెలుగు శాసనం వెలుగు చూసిందిక్కడ. మరే భాషకూ లేని అవధానం వంటి ఉత్కృష్ట సాహితీ ప్రక్రియ పురుడు పోసుకుందీ ఇక్కడే. ఒక్కటేమిటి... తేనలూరే తెలుగుకు అత్యంత గొప్పగా పట్టం కట్టింది తెలంగాణ గడ్డ. ప్రత్యేక రాష్ట్ర హోదాలో మధుర తెలుగుకు మహాభిషేకం చేయబోతోంది తెలంగాణ. సంప్రదాయానికి పట్టం కడుతూ, అదే సమయంలో ఆధునికతను కూడా మేళవిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను న భూతో అన్న రీతిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ ఐదు రోజుల ‘తెలుగు’ పండుగను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియమే ఈసారీ మహాసభల ప్రధాన వేదికకు ప్రాంగణమవుతోంది. ఇక్కడ భారీ కాకతీయ తోరణ ఆకృతి ప్రధానాకర్షణగా వేదిక రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం కార్మికులు మూడు రోజులుగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే వేదిక తదితర ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా ఎల్బీ స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించారు. గురువారం మధ్యాహ్నానికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక తదితరాలన్నీ సిద్ధమవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, తెలుగు భాషకు సేవ చేసిన సాహితీ దిగ్గజాల పేరుతో నగరవ్యాప్తంగా 100 స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 85 వరకు బుధవారానికే సిద్ధమయ్యాయి. ప్రధాన చారిత్రక భవనాలు, శాసనసభ, సచివాలయం, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను విద్యుద్దీపాల వెలుగులతో సుందరంగా ముస్తాబు చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో తెలుగు మహాసభల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో తెలుగు సంప్రదాయాన్ని కళ్లముందు నిలిపే వీనులవిందైన సన్నటి సంగీతం. మరోవైపు మిరుమిట్లు గొలిపే వేలాది వెలుగురేఖలు. వాటిని చీల్చుకుంటూ, బసవపురాణం రచిస్తూ పాల్కురికి సోమనాథుడు కళ్లెదుట కన్పిస్తాడు. ఆయన అంతర్థానమవుతూనే, భాగవతాన్ని తేనెలూరే తెలుగులో అందించిన బమ్మెర పోతన. ఆ వెంటనే కాకతీయ సామ్రాజ్య వైభవం. ఆ తర్వాత ఎందరెందరో తెలుగు సాహితీ దిగ్గజాలు... ఇలాంటి పలు విశేషాలతో లేజర్ షో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 20 నిమిషాల పాటు ఆహూతులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. గతంలో హైదరాబాద్‌లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో బాణసంచా, లేజర్ షోలతో ఆకట్టుకున్న ప్రఖ్యాత విజ్‌క్రాఫ్ట్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మహాసభల్లో పలు దేశాల నుంచి 410 మందితెలుగు భాషాభిమానులు, దేశవ్యాప్తంగా 1,000 మంది ఆహ్వానితులు, 7,000 మంది ఔత్సాహికులు... మొత్తమ్మీద 50 వేల మంది దాకా తొలి రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆహ్వానితులకు, పేర్లు నమోదు చేసుకున్న వారికి భోజనం, రవాణా, బస తదితరాలు ఉచితంగా కల్పిస్తున్నారు. నేరుగా వచ్చే వారికి చవక ధరకే భోజనం అందించేందుకు ఎల్బీ స్టేడియంలో 60 భోజన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు ఇలా.. ♦ తొలి రోజు శుక్రవారం ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో పాల్కురికి సోమనాథుని ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక వద్ద సాయంత్రం ఐదింటికి మహాసభలకు శ్రీకారం జరుగుతుంది ♦ ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథులుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొంటారు ♦ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షత వహిస్తారు ♦ కార్యక్రమాలు ప్రారంభమైనట్టు ప్రకటించగానే 15 నిమిషాల పాటు వీనులవిందైన సంగీతం, భారీ బాణసంచా తదితరాలు అలరిస్తాయి. అనంతరం సాంస్కృతిక సమావేశం ఉంటుంది ♦ ఒడిశాకు చెందిన జ్ఞానపీఠ గ్రహీతలు సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్లను సన్మానిస్తారు. దీనికి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గౌరవ అతిథిగా, మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు ♦ సాయంత్రం 6.30 నుంచి 7 వరకు డాక్టర్ రాజారెడ్డి–రాధారెడ్డి ఆధ్వర్యంలో ‘మన తెలంగాణ’ సంగీత నృత్య రూపకం ఉంటుంది ♦ రాత్రి 7 నుంచి 7.30 వరకు రామాచారి బృందం లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పాట కచేరీ ♦ 7.30 నుంచి రాత్రి 9 వరకు ‘జయజయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యం -
తెలుగు పాట
-
తెలుగు ఉత్సవాలా? తెలంగాణ ఉత్సవాలా?
సాక్షి, హైదరాబాద్: తెలుగుతల్లి, తెలంగాణ తల్లి వేర్వేరు అని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సభలు తెలంగాణ సభలా, తెలుగు సభలా అనేది చెప్పాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుతల్లి లేదని, తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే తెలుగుతల్లి ఏం చేసిందని ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పుంటికూర–గోంగూర, ఆనపకాయ–సొరకాయ వేర్వేరు అని, తెలుగుతల్లి, తెలంగాణ తల్లి కూడా వేర్వేరు అంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలుగు మహాసభలను బహిష్కరించాలని అప్పుడు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు నిర్వహిస్తున్నందుకు ముందుగా తెలంగాణ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరూరా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏం చేద్దామో చెప్పాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’గీతం ఉంటుందా అని ప్రశ్నించారు. గద్దర్, అందెశ్రీ, విమలక్క, గోరటి వెంకన్న పాటలు ఉంటాయా అని ప్రశ్నించారు. వీళ్లంతా గజ్జెలుకట్టి ఆడిపాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. -
తెలుగు మహాసభలకు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఈనెల 19న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ రానున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రపతి పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. రాష్ట్రపతి ఈ నెల 19న బేగంపేట విమానాశ్రయంకు మధ్యాహ్నం 2.55 కు చేరుకుంటారన్నారు. ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు , ట్రాఫిక్, బందోబస్తు, స్వాగత తోరణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధ్యం, పరేడ్, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. 20న ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధుని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారని అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారన్నారు. ఈ నెల 23 నుండి శీతాకాల విడిదికి రాష్ట్రపతి విచ్చేయుచున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా సీఎస్ అధికారులను ఆదేశించారు. -
కన్నుల పండువగా ‘సాంస్కృతికోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘సాంస్కృతికోత్సవాల’కు పెద్దపీట వేశారు. ప్రతినిధులు, ఆహూతులందరూ ఒకేచోట కూర్చొని మహాసభలను వీక్షించేందుకు అనువుగా అన్ని కార్యక్రమాలను ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం వద్దకు మార్చారు. దీంతో రవీంద్రభారతిలో ప్రతి రోజు నిర్వహించ తలపెట్టిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదిం చిన వివిధ జిల్లాలకు చెందిన జానపద కళారూపాల ప్రదర్శనలు రద్దయ్యాయి. తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర ప్రధాన అంశాలుగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలను పరిమితం చేసి ఎల్బీ స్టేడియంకు మార్చినట్లు మహాసభలను పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. మూడు చోట్ల నిర్వహించడం వల్ల ఎక్కువ మంది వేడుకల్లో పాల్గొనే అవకాశంఉండదనే ఉద్దేశంతో కూడా మార్పు అనివార్యమైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న మహాసభల ఆరంభం నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికపైనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సాహిత్య సదస్సు ఉంటుంది. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు. వందేమాతరం శ్రీనివాస్ గీతంతో.. మహాసభలు ప్రారంభం రోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వందేమాతరం శ్రీనివాస్ గీతంతో ఆరంభమవుతాయి. మహాసభల ప్రాశస్త్యంపై ఈ గీతాన్ని రూపొందించారు. ఆ తర్వాత రాధారెడ్డి, రాజారెడ్డి ‘మన తెలంగాణ’ నృత్య రూపక ప్రదర్శన ఉంటుంది. అనంతరం ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో రామాచారి బృందం తెలుగు పద్యాలు, గీతాల ఆలాపన, దేశిపతి శ్రీనివాస్ రూపొందించిన నృత్యరూపకం ‘జయ జయస్తు తెలంగాణ’ తదితర కార్యక్రమాలు ఉంటాయి. ♦ 16వ తేదీ రెండో రోజు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, శేషాచారి శత గళాసంకీర్తన, రామదాసు కీర్తనలు, అంతర్జాతీయ మూకాభినయ కళాకారుడు మైమ్ మధు ప్రదర్శన ఉంటాయి. వింజమూరి రాగసుధ కూచిపూడి నృత్య ప్రదర్శన, కాలిఫోర్నియాలో ఉంటున్న కళాకారిణి షిర్నికాంత్ ప్రదర్శన, డాక్టర్ అలేఖ్య పుంజాల ‘రాణీరుద్రమ దేవి’నృత్య రూప ప్రదర్శన ఉంటాయి. ♦ 17వ తేదీ మూడో రోజు రసమయి బాలకిషన్ సారథ్యంలో జానపద విభావరి ఉంటుంది. లక్నోలో ఉంటున్న కళా మీనాక్షి, ముంబైకి చెందిన నృత్య కళాంజలి జానపద ప్రదర్శనలు ఉంటాయి. మంగళ, రాఘవరాజు భట్ల జానపద నృత్య ప్రదర్శన ఉంటుంది. ♦ 18వ తేదీ నాలుగో రోజు కార్యక్రమాల్లో మలేషియా తెలుగువారి కదంబ కార్యక్రమం, ప్రముఖ నటీనటులు, సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాల్గొనే సినీ సంగీత విభావరి ఉంటుంది. ప్రతి రోజు కార్యక్రమాల ఆరంభానికి ముందు అరగంట పాటు ‘తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం’పై సినిమా ప్రదర్శన ఉంటుంది. వేదికల మార్పు.. ♦ రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్ర మాలు రద్దయిన దృష్ట్యా ప్రధాన ఆడిటోరియంలో బాలలు, మహిళల సాహిత్యం, ప్రవాస తెలుగువారి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలో అష్టావధానం ఉంటుంది. ♦ పబ్లిక్‌గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ♦ తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో శతావధానం ఉంటుంది. -
తెలంగాణ సాధించుకున్నది భాషతోనే..
వరంగల్ రూరల్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే భాషతో అని ప్రజాకవి, ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా యంత్రాం గం సోమవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముక్య అతిథిగా హాజరైన గోరేటి వెంకన్న మాట్లాడుతూ ప్రకృతి నేర్పిన పాఠాలే శాశ్వతమని, ఆధునిక పేరుతో జరుగుతున్న కాలుష్యం భావిజీవితానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పక్షి లక్షణాలు, దాని జీవనంపై తనదైన శైలిలో పాటతో ఉర్రూతలూగించాడు. సీఎం కేసీఆర్‌కు భాషపై ఉన్న అభిరుచే ఈ కార్యక్రమాల నిర్వహణకు కారణమని అన్నారు. సామాజిక ఉత్పత్తిని కాదని మార్కెట్ కల్చర్ ఆధిపత్యం చెలాయించడం వల్లే వృత్తులు ధ్వంసమయ్యాయన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ భాషపై ప్రేమను పెంచుకోవాలని, ప్రపంచంలో చైనా, జపాన్ దేశాలు ఎంతో ముందు ఉన్నప్పటికీ ఆ దేశాల అధ్యక్షులు మాతృభాషలోనే మాట్లాడతారని గుర్తు చేశారు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుందని, కాలానికి అనుగుణంగా సాహిత్యం రావాలని ఆకాంక్షిచారు. ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మన తెలుగు అజంతా భాష అని, ఎంతో అందంగా ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు మాట్లాడుతూ మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలు సులువుగా వస్తాయని చెప్పారు. కవి పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన తెలుగు మహాసభలకు, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహాసభలకు ఎంతో తేడా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ దయాకర్, జేసీ ముండ్రాతి హరిత, డీఆర్ఓ హరిసింగ్, డీపీఆర్ఓ కిరణ్మయి, డీఎఫ్ఓ పురుషోత్తం, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, డీఈఓ నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, ముడుంబై వరదాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు కాళోజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. -
ప్రపంచ తెలుగు మహాసభలపై కేసీఆర్ సమీక్ష
-
భాషా రక్షణకు బాహుబలులు
తెలంగాణలో ఎందరో సంస్థానాధీశులు తమ పరిపాలనలో సాహిత్యకారులకు ధనధాన్య వజ్రవైఢూర్యాల్ని బహుమతులుగా ఇవ్వడమే కాకుండా ఏకంగా అగ్రహారాల్నే రాసిచ్చారు. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి కానీ సంస్థానాలు అసఫ్‌జాహీ వంశం రాక పూర్వం ముందు నుంచి ఉన్నాయి. వీటిలో ఒక్క ‘గురుగుంట’ (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. వీటిల్లో సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్థానాలు కొన్ని.. అలంపుర సంస్థానం ఈ సంస్థానంలో ఉన్న కవుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రిక సంపాదకుడే కాక హిందువుల పండుగలు, సంఘోద్ధరణము,ఉచ్చల విషాద నాటకము, కర్నూలు రాజులు వంశావళి. గ్రంథాలయములు, మద్యపానము(3 పుస్తకాలు) గోలకొండ కవుల సంచిక వంటి అనేక గ్రంథములను రచించి నిజాం నిరంకుశత్వమును విమర్శించిన మేరునగధీరుడు. ఇదే సంస్థానంలో తిమ్మభూపాలుడు, మంథానభైరవుడు (భైరవ తంత్రము రచయిత), దుంపల రామిరెడ్డి , కూడవల్లి శ్రీనివాసరావు, మణిశేషకవి, ఆకుమళ్ళ మల్లికార్జున శర్మ అనే బాలకవి, కేశవ పంతులు నరసింహశాస్త్రి , గడియారం రామకృష్ణ శర్మ, ములికిరెడ్డి అల్పూరు రెడ్డి చెన్నారెడ్డి తదితరులు ఎన్నో విశేషమైన రచనలు చేశారు. గద్వాల సంస్థానం ఇప్పటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఈ సంస్థానం అతి ప్రాచీనమైంది. గద్వాల సంస్థాన స్థాపకుడైన పెద సోమభూపాలుడు (క్రీ.శ. 1663–1712) కార్తీక, మాఘ మహాసభలను ప్రారంభించాడు. కార్తీక మాసమున వేదశాస్త్ర పండిత సభల్ని, మాఘ మాసంలో సంగీత సాహిత్య సభలు జరుపుతుండేవారు. ఈ సంస్థానంలో ఉండే అయితారు కందాళయార్యుడు అనే కవి అలంకార శిరోభూషణమనే సాహిత్యశాస్త్ర గ్రంథము రచించాడు. పెద్దన సోమయాజీ అనే కవి భోజ మహాకవి రచించిన రామాయణ చంపూ ప్రబంధమునకు తెలుగు వచనం వెలువరించారు. పురాణము దీక్షాచార్యులు అనే కవి యణచార్యులు అనే పండితుడు ప్రతాపరుద్రీయ సారం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. బైరంపల్లి తిరుమల రాయ కవి అనే కవి గద్వాల సంస్థానానికి ఆస్థాన కవి. ఇతనికి ఆశుకవితా చక్రవర్తి అనే బిరుదు ఉండేది. పురాణము నరసింహాచార్యులు అనే కవి ఈ సంస్థానం లోని వాడే. ఇతడికి తిరుపతి వేంకట కవులకు హోరాహోరీగా శాస్త్ర వాదములు జరిగేవి అంటారు. జానకీ పరిణయం, శ్రీరామ భూప ^è రిత్రము అనేవి ఇతడి ముఖ్య రచనలు. చెట్లూరి Ôó చార్యులు అనే మరో కవి చోర సంవాదం, పుణ య కలహోత్సవం రాశాడు. పుణయ కలహోత్సవం అనేది ఒక నాటకం. చెన్న కేశవస్వామి జాతరకు విచ్చేసిన ప్రజలు చూసి ఆనందపడుటకు రచించిన నాటకం. ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన గుండేరావు హార్కారే ఆంగ్ల రచయిత గోల్డ్ స్మిత్ రాసిన ‘ట్రావెలర్’కి సాంస్కృతిక పద్యాలను వాదంకు అప్పటి మైసూర్ ప్రభుత్వం గోల్డ్ మెడల్ బహూకరించింది. ఇతడే థామస్ గ్రే రాసిన ‘ఎలిజీ’, గోల్డ్‌స్మిత్ రాసిన ‘డెజెర్టెడ్ విలేజ్’, వర్డ్స్ వర్త్ రాసిన ‘ఇంటిమేషన్ టూ ఇమ్మోరాలిటీ’, షేక్స్ పియర్ నాటకం ‘హేమ్లెట్’కి సంస్కృత పద్యానువాదం చేశారు. ఈ సంస్థానంలో కొత్తపల్లి రామాచార్యులు, ధర్మవరం రామ కవి ప్రగడ రాజు గుండన్నలాంటి కవులుండేవారు. దొంతి సంస్థానం ఈ సంస్థానాలను పాలించిన వెంకట గోపాల్‌రెడ్డి తెలుగు భాషాభిమాని. 1948 లో జరిగిన పోలీసు చర్యకు,స్నేహితులకు, బంధువులకు దొంతికోటలో ఆశ్రయమిచ్చిన మానవతావాది. ఇప్పటి సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి నివాసి అయిన సంగీత ,సాహిత్య జ్యోతి శాస్త్రముల్లో నిష్ణాతుడైన వెంకట పుండరీక మాజుల వారిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆగ్రహారాన్నిచ్చి సత్కరించాడు. దోమకొండ సంస్థానం ఈ సంస్థానానికి చెందిన సోమేశ్వరుని పుత్రుడు రెండవ ఉమాపతి సాహిత్య ప్రియుడు. ఆయన కాలంలో తెలుగు కవులెందరో అనేక కావ్యాలు రచించి భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇదే వంశానికి చెందిన మల్లారెడ్డి, ‘శివధర్మోత్తర ఖండాన్ని’ రచించారు. ఇతని సోదరుడు కామిరెడ్డి, మల్లారెడ్డి తన గ్రంథాన్ని కామిరెడ్డికి అంకితమిచ్చాడు. కామిరెడ్డి తర్వాత పాలనకు వచ్చిన ఎల్లారెడ్డి ‘వాసిష్టము’ ‘లింగపురో యశు గ్రంథములను’ రచించాడు. ఇతడు సంస్థానాధీశుడైన తర్వాత అనేక మంది పండితులను, కవులను ఆదరించారు. నారాయణపుర సంస్థానం నల్లగొండ జిల్లాల్లోని నారాయణపుర సంస్థానంలో అనంతశాస్త్రి అనే సుస్థాన కవి భానుమతి పరిణయం, శాకుంతలం, హరిప్రియ అనే నాటకాల్ని రచించాడు. ఈయనే నారాయణపురం చరిత్రను రాశానంటారు. వనపర్తి సంస్థానం వనపర్తి పాలకులు 1870 ప్రాంతంలో నెలకొల్పిన ‘బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాల’ తెలంగాణలోనే ప్రాచీన ముద్రణాలయం మానవల్లి రామకృష్ణ కవి ‘విస్మృత కవులు’ పేరుతో అనేక అముద్రిత గ్రంథాలు వెలుగులోని తెచ్చారు. కుమార సంభవం, క్రీడాభీరామం, ప్రబంధమణిభూషణం, నితి శాస్త్ర ముక్తావళీ, అనర్గరాగవం, పరతత్వ రసాయనం, త్రిపురాంత కొదాహరణం మొదలైనవి ఉన్నాయి. వనపర్తి సంస్థానంలోనే గోపాలరాయులు అనే కవి ‘రామచంద్రోదయం’ అనే శ్లేష కావ్యాన్ని ‘శృంగార మంజరీ బాణం’ అనే గ్రంథాన్ని రచించాడు. చెన్న కృష్ణ కవి ‘యాదవ భారతీయం’ అనే ప్రబంధాన్ని రచించి సంస్థానాధీశుడైన జనంపల్లి వల్లభరాయుడికి అంకిత చేసినట్లు తెలుస్తుంది. శ్రీఅయ్యమాచార్యులు వారు ‘రామేశ్వర విజయం’ అనే గ్రంథం రాయగా, హోసదుర్గం కృష్ణమాచార్యులు, శ్రీనివాస రాఘవాచార్యులు నంబాకం రాఘవాచార్యులు, విక్రాల వెంకటాచార్యులు, కడుకంట్ల పారుశాస్త్రి, గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ, మాదిరాజు విశ్వనాథరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఎందరో సంస్కృత కవి, పండితులు వనపర్తి సంస్థానాశ్రయం పొంది అనేక గ్రంథాలు వెలువరించారు. గోపాలపేట సంస్థానం వనపర్తి సంస్థానం నుంచి ఏర్పడిన సంస్థానం గోపాలపేట. ఈ సంస్థానంలో ఏదుట్ల శేషాచలం అనే కవి జగన్నాటకం, బారగడుపుల న రసింహశతకం అనే కృతులు రచించాడు. మరోకవి బుక్కపట్నం రామచంద్రాచార్యులు బభ్రువాహన–పింగళ అనే నాటకాలు, సైంధవ పరాభవం , చికాధక్కీయం అనే యక్షగానాలు సురుచి ,యోగానంద చరిత్రం, ఆనంద రామాయణం అనే కావ్యాలు రాసారు. చెన్న కృష్ణమరాజు అనే వ్యక్తి ఋతుధ్వజ నాటకం, హనుమద్విజయం, యయాతి చరిత్ర, సానందోపాఖ్యానం, మృగావతి అనే యక్షగానాలు ఇతని రచనలు. ఆత్మకూర్ సంస్థానం ఈ సంస్థానంలో ఏడాదికోసారీ ఫాల్గుణ శుక్లపక్షమి సాహిత్య సభలు ,శాస్త్రగోష్ఠులు, కవిగాయక సమ్మేళనం , నృత్యనాటక ప్రదర్శనములు జరిపి కవిపండితులకు సన్మానాలు చేసేవారు. సురపురం కేశవయ్య ఆత్మకూరు సంస్థానంలో ముఖ్యుడు. శ్రీనివాసాచార్యులు అనే కవి జాంబవతీ పరిణయం, రాజశేఖర చరితం రాశాడు. మునగాల సంస్థానం, పాపన్న పేట సంస్థానం, పాల్వంచ సంస్థానం, జటప్రోలు సంస్థానానికి చెందిన అనేక మంది సంస్ధానాధీశులు సాహిత్యాన్ని కవుల్ని, పండితుల్ని ఎంతగానో ప్రేమించారు, ఆదరించారు. రకరకాల బిరుదులతో పెంచిపోషించారు. నాటి సభలపై శ్రీశ్రీ, విశ్వనాథ ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో నేనూ శ్రీశ్రీ ఏకాభిప్రాయం ప్రకటిస్తున్నాం. నేను అయిన విశ్వనాథ సత్యనారాయణను ఇది వ్రాస్తున్నాను. ఈ సభలు నిష్ప్రయోజనములు. సాహిత్యానికి దోహదములు కావు. సాహిత్య యథార్థవేత్తలు జరుపుట లేదని నా అభిప్రాయం. ప్రపంచంలోని అందరు తెలుగువాళ్లని సమావేశపరచుట ప్రయోజనమున్నచో ప్రతినిధుల సమావేశము కాని నిజముకాదు. ఇదియొక ప్రచారము. ఇందులో నిస్వార్థముగా పనిచేయు వారున్నారా? ఉన్నచో చేయవచ్చును. ఆత్మ ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకోగలిగినవారు నిశ్చయము చేసికోవలయును. ఇది కప్పల తక్కెడ కారాదు. – తెలుగు మహాసభలపై విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ (3–3–1975) ..: కె.వి.నరేందర్ -
ఘనంగా తెలం‘గానం’
సాక్షి, హైదరాబాద్: మన ఓరుగల్లు కొన్ని వందల ఏళ్ల క్రితం, అంటే మహ్మద్ బీన్ తుగ్లక్ హయాంలో కొంతకాలం పాటు సుల్తానాబాద్‌గా పేరు మార్చుకుంది! అంతేనా... ముల్క్–ఎ–తెలంగాణ పేరిట ఓ నాణేన్నీ విడుదల చేశాడు తుగ్లక్!! దక్షిణాదిలో లభించిన తుగ్లక్ నాణెం ఇదొక్కటే!!! ఈ నాణెం డిసెంబర్ 15 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో ఆహూతులకు కనువిందు చేయనుంది. ఇలాంటి మరెన్నో విశేషాలతో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా విభవాన్నే గాక తెలంగాణ ఘన చరిత్రనూ ప్రపంచానికి చాటనున్నాయి. అరుదైన, పురాతన నాణేలు, శాసనాలు, కాలగర్భంలో కలిసిపోయిన ప్రాచీన ఆలయాల నమూనాలు, చరిత్రను తెలియజెప్పే పుస్తకాలు తదితరాలు మహాసభల వేదికపై కొలువుదీరనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో అదృశ్యమైన ఆలయాలు చూస్తారా... శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఎన్నో అద్భుత, చారిత్రక దేవాలయాలు నీట మునిగి కనుమరుగయ్యాయి. వాటి నమూనాలను పురావస్తు శాఖ అప్పట్లోనే రూపొందించింది. కృష్ణా, తుంగభద్ర నదీ తీరాల్లోని అలంపూర్, ప్రాగటూరు, జట్‌ప్రోలు తదితర ప్రాంతాల్లో నిర్మితమైన ఈ ఆలయాల నమూనాలను పురావస్తు శాఖ ఆధీనంలోని హెరిటేజ్ సెంటినరీ (శ్రీశైలం పెవిలియన్) మ్యూజియంలో ఉంచారు. వాటిలోంచి ముఖ్యమైన పది నమూనాలను తెలుగు మహాసభల వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇవేగాక మన చరిత్ర ఘనతను తెలియజెప్పే 100 వరకు పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని కొనుక్కోవచ్చు కూడా! శిల్పాల ప్రదర్శనకు వెనకడుగు! ఇటీవల ముంబై ఛత్రపతి శివాజీ ప్రదర్శనాలయంలో బ్రిటిష్ మ్యూజియంతో కలసి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విదేశీయులను సైతం బాగా ఆకట్టుకుంటున్న శిల్పం తెలంగాణదే. బుద్ధుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను మూడు భాగాలుగా చిత్రించిన ఆ నాలుగున్నర అడుగుల శిల్పం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించింది. ఇలాంటి మరెన్నో అద్భుత పురాతన శిల్పాలు మన మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇవి కనువిందు చేస్తే సందర్భోచితంగా ఉండేదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి మహాసభల వేదిక వద్ద పురావస్తు విశేసాలను ప్రదర్శనకు ఉంచాలన్న ఆలోచనే అధికారుల్లో తొలుత లేదు! ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం పురమాయించడంతో పురావస్తు శాఖ హడావుడిగా రంగంలోకి దిగింది. తక్కువ సమయంలోఅరుదైన ఆ విగ్రహాలను వేదికకు తరలించడం తదిరాలు కుదరకపోవచ్చనే అను మానంతో ఇలా నాణేలు, శాసన నకళ్లు, పుస్తకాలతో అధికారులు సరిపెడుతున్నారు. - తెలంగాణ ఘన చరిత్రకు సజీవ జ్ఞాపకంగా మిగిలిన దాదాపు 140 అరుదైన నాణేలను ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక వద్ద వీక్షకుల కోసం ప్రదర్శనకు ఉంచుతున్నారు. ప్రాచీన కాలంనాటి ముద్రల నాణేలు (పంచ్ మార్క్డ్) మొదలుకుని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్షాహీల్టు, విజయనగర రాజులు, నిజాంల దాకా తెలంగాణలో చలామణీ అయిన పలు నాణేలు కొలువుదీరనున్నాయి. - వెయ్యేళ్ల తెలుగుగా మన భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ఆధారభూతమైన కుడిత్యాల శాసనం చూడాలనుకుంటే తెలుగు మహాసభలకు రావాల్సిందే. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో తవ్వకాల్లో వెలుగు చూసిన ఈ శాసనంపై తెలుగు లిపి కనిపించింది. ఇది క్రీ.శ. 945 నాటి శాసనమని నిరూపితమైంది. సంస్కృతం, కన్నడంతోపాటు తెలుగులో కందపద్యం రాసి ఉన్న ఈ శాసనం కూడా మహాసభల్లో కొలువుదీరనుంది. దీనితోపాటు మరో నాలుగైదు పురాతన శాసనాల నకళ్లను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. -
తెలంగాణ గౌరవ ప్రతీక
సాక్షి, హైదరాబాద్: సాహిత్య, భాషా ప్రాధాన్యంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మహాసభల ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులూ సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15–19 మధ్య ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభల ఏర్పాట్లను సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ‘‘ప్రపంచ తెలుగు మహా సభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించి వారికి చక్కని సౌకర్యాలు కల్పించాలి. భారతీయ భాషల్లో జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన కవులు, రచయితలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరిద్దాం. పలు భాషలకు చెందిన మహానుభావులను సన్మానించిన కీర్తి తెలుగు మహాసభలకు దక్కాలి. పెద్ద ఎత్తున బాణసంచా వెలుగులతో అట్టహాసంగా మహాసభలు ప్రారంభమవాలి. కీలకమైన ప్రారంభ, ముగింపు సమావేశాల నిర్వహణ పక్కాగా, పకడ్బందీగా ఉండేలా చూడండి. సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటేలా ఉండాలి. ఐదు రోజుల్లో ఒక రోజు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలి’’అని ఆదేశించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరవుతున్నారని, ముగింపు కార్యక్రమంలో స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటున్నారని సీఎం గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సభల సన్నాహకాలపై సాహిత్య అకాడమీ చైర్మన్ తదితరులను పలు విషయాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, చందూలాల్, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. సీఎం చేసిన సూచనలు - 8,000 వేల మందికి పైగా సభలకు హాజరవుతున్నందున ఎల్బీ స్టేడియం సహా ఒక్కో వేదిక పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పగించాలి. భోజనాలు, వసతి తదితర సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి - ప్రతినిధులు ఇతర వేదికలకు, సాయంత్రం ప్రధాన వేదికకు చేరేందుకు రవాణా సదుపాయం కల్పించాలి - ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల ప్రారంభానికి గంట ముందే ఇతర వేదికల్లో కార్యక్రమాలను ముగించాలి - తెలంగాణపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రధాన వేదిక వద్ద ప్రదర్శించాలి. సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలి - విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. ప్రారంభ, ముగింపు సమావేశాల్లో వారు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. - ఎల్బీ స్టేడియం వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి - తొలిరోజు నుంచే ఫుడ్ కోర్టులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి - జిల్లాల నుంచి తెలుగు ఉపాధ్యా యులు, లెక్చరర్లు, ఆచార్యులు, పలు రచయితల సంఘాల సభ్యులు, తెలుగులో పాండిత్యమున్న వారు, సాహిత్యాభిలాషులు మహాసభలకు వచ్చేందుకు రవాణా, భోజన సదుపాయాలను జిల్లా కలెక్టర్లు కల్పించాలి - హైదరాబాద్ పరిసరాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న సాహిత్యాభిలాషులు సభలకు హాజరయేలా చూడాలి - ‘ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే’ అన్న సందే శాన్ని అందరికీ చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలి - నమోదు చేసుకున్న ప్రతినిధులకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలుండాలి - పలు సాహిత్య వేదికల్లో పాల్గొనే వారికి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియాకు వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేయాలి -
రాష్ట్రపతి పర్యటన ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 19న రాష్ట్రానికి రానున్నారు. షెడ్యూలు ప్రకారం 19న (మంగళవారం) మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు హైదరాబాద్‌లోనే బస చేయనున్న ఆయన మరుసటి రోజు ఉదయం 10.30కు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి పూలమాల అలంకరిస్తారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదికి రాష్ట్రపతి మళ్లీ ఈ నెల 23న హైదరాబాద్‌కు వస్తారు. 27 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ వ్యవధిలో ఇక్కడి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిలయానికి కొండముచ్చుల కాపలా రాష్ట్రపతి నిలయంలో కోతులను అదుపుచేసేందుకు కొండముచ్చులొచ్చాయి.. మరోవైపు జూపార్కు నుంచి ప్రత్యేక సిబ్బంది వచ్చి పాముల వేట మొదలుపెట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 23 నుంచి శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులుకూడా పెద్దసంఖ్యలో వస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యుత్, మంచినీళ్లు, పారిశుధ్యం లాంటి సమస్యలు లేకుండా చూడటంతోపాటు కోతులు, పాముల బెడదపై కూడా దృష్టిసారించారు. ఆ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి. రాష్ట్రపతి విడిది చేసిన సమయంలో గతంలో కొన్ని కోతులు భవనంలోకి రావటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కోతులు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా చర్యలు ప్రారంభించారు. కోతులు ఉన్న ప్రాంతంలోనే వాటికి ఆహారం, నీళ్లు అందిస్తారు. భవనంవైపు రాకుండా కొన్ని కొండముచ్చులను కాపలాగా ఉంచుతారు. గతంలో పాములు వచ్చిన దాఖలాలున్నాయి. ఆ సమస్య పునరావృతం కాకుండా వాటిని పట్టుకునేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్రపతి ఉదయం, సాయంత్రం వాహ్యాళికి వెళ్లే సమయం, ఆయన, కుటుంబ సభ్యులు తోటలో విహరించే సమయంలో వారివెంట ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉంటారు. -
యాస భాషల అలయ్ బలయ్
పొద్దు పొద్దున్నే ముద్దబంతుల్లా ఆయన అక్షరాలను పూయిస్తున్నారు. ఆ చేతిలోని కలం చకచకా సాగుతోంది. ప్రపంచ తెలుగు మహాసభల కోసం నాలుగు పేజీల కవితను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అది పూర్తి కాగానే నేరుగా విషయానికి వచ్చేశారు. ‘తెలుగు స్థితిగతులెలా ఉన్నాయి?’ అని అడగ్గానే ‘భాష భేషుగ్గా ఉంది’ అంటూ ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు తెలుగు సినీ పాటల రేడు సుద్దాల అశోక్‌తేజ. తెలంగాణ వాడు బువ్వదినే ఏళయితే ఎవ్వరొచ్చినా సరే.. ‘తిందాం రా’ అనేటోడే తెలంగాణవాడు తురక, తెలుగు అనే అరమరిక లేక తన పిల్లలను ‘బేటా’ అని పిలిచేటోడు తెలంగాణ వాడు జమ్మి చేతులుంటే చాలు జన్మ శత్రువెదురొచ్చినా ‘అలయ్ బలయ్’ ఇచ్చేటోడు తెలంగాణ వాడు కొవ్వెక్కిన మదం కాదు పువ్వొసంటి మనసుతోని ‘నువ్వు’ అని పిలిచేటోడు తెలంగాణ వాడు కారణాలేవైనా.. మన భాష, సంస్కృతులు మరుగునపడిపోయాయి. లేదా చీకట్లోకి నెట్టివేయబడ్డాయి. ఆ చీకటి పొరలను, దుమ్మూధూళిని తొలగించి.. వెలుగులోకి తెచ్చే సందర్భమే ఈ మహాసభలు. నేటితరానికి మన సంస్కృతీ సంప్రదాయాలను, మన భాషా సౌందర్యాన్ని తెలపడానికి ఇదే అదను. మహానుభావులకు దక్కుతున్న గౌరవం హాలుడు, పోతన, పాల్కురికి సోమనాథుడు, పంప మహాకవి, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, రుద్రమదేవి, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వానికి, సంఘ సంస్కరణలకు, సాహిత్యానికి, పోరాటానికి పెట్టింది పేరైన వీరందరి పేరిట నగరం అంతటా స్వాగత తోరణాలు వెలియడం అద్భుతం. ఇది ఎనలేని సారస్వత సంపదను వారసత్వంగా అందించిన మహానుభావులకు దక్కుతున్న గౌరవం. వీరంతా ఎవరనే ఆలోచన నేటితరానికి కలిగితే చాలు. ఇలా చేస్తే తెలుగే వెలుగు భాష తెలుగుకు పూర్వవైభవం కలిగించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తొలిమెట్టే ఈ మహాసభలు. ఇప్పటికే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం నుంచి కృషి జరుగుతోంది. ఇంకా, న్యాయస్థానాల్లో తెలుగులోనే వాద ప్రతివాదనలు జరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలుగులోనే వ్యవహారాలు సాగాలి. తెలుగు వస్తేనే ఉద్యోగావకాశాలనే నిబంధన పెట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం తరపున జరిగితే తెలుగు అధికారికంగా వ్యవహారికంలోకి వచ్చినట్టే. తెలుగు భాష ముప్పు వాకిట లేదు. భాష ఖూనీ అయిపోవడం లేదు. పరభాష, యాసల వల్ల తెలుగు పలుచనైపోవడం లేదు. తనలో పరభాషా పదాలను కలుపుకొని ఇంకా సుసంపన్నమవుతోంది. విశ్వమానవులం కావద్దా? కొన్ని పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఆంగ్లం నేర్చుకోక తప్పని పరిస్థితి. మన పిల్లలు ‘విశ్వ మానవులు’గా ఎదగాలంటే దాన్ని నేర్వాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటే.. నిమ్న వర్గాల పిల్లల పురోగతిని అణచిపెట్టడమే. స్థానిక భాష, రాజభాష, ప్రపంచ భాష... ఈ మూడింటిలో నైపుణ్యం సాధిస్తేనే సంఘ వికాసం. - సీహెచ్‌ఎమ్ నాయుడు -
ఇలా చేద్దాం..!
మానవ పరిణామ క్రమంలో భాష పాత్ర అసాధారణం. బుద్ధిజీవులైన మనుషుల పరస్పర భావ మార్పిడి ప్రక్రియలో ప్రత్యామ్నాయం లేని ఉత్కృష్ట సాధనమిది. మానవ సమూహాల, జాతుల వికాసంతో నేరుగా ముడివడిన భాషలు కూడా క్రమ వికాసం పొందుతూ వచ్చాయి, పొందుతున్నాయి, పొందాలి. భాష మనుగడకు వాడుకే జీవగర్ర. అన్ని భాషల్లాగే తెలుగుకూ వివిధ స్థాయి ప్రయోజనాలున్నాయి. భావ వినిమయానికే కాక సంస్కృతి పరిరక్షణలో, వారసత్వ సంపదల్ని కాపాడ్డంలో, కళలను పరిపుష్టపరచడంలో... ఇలా భాష ఉపయోగాలెన్నెన్నో! మనిషి జీవన ప్రస్థానంలో అత్యున్నత ఆశయమైన ఆనందమయ జీవితాన్ని సాకారం చేసుకోవడంలో భాష పోషించే పాత్ర అనితరసాధ్యమైంది. అంతటి కీలకమైన భాషను కాపాడవలసిన బాధ్యత మనందరిదీ. నిర్లక్ష్యం చేసిన ఎన్నో జాతుల మాతృభాషలు కాలగర్భంలో కలిసి, మృతభాషలయ్యాయి. అనునయం పొసగని అన్య భాషలతో తంటాలు పడుతున్న పలు మానవ సమాజాల వికాసం కుంటి నడకే! వారి సృజన గుడ్డి దీపపు మసక కాంతిలో మగ్గుతోంది. నవతరం బడి పిల్లలు, ఉత్సాహం ఉప్పొంగే యువతరం, భావి తరాల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు, భాష పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు, దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు... భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యూహ–నిర్మాణాత్మక చర్యల ద్వారా భాషలను మననిచ్చే, కాపాడే, వృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. గొప్ప సదాశయంతో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇలాంటి విషయాలను ఈ వారం పాటు ఇక్కడ ముచ్చటించుకుందాం. - దిలీప్‌రెడ్డి -
అమ్మ భాషను ఆశీర్వదిద్దాం
ఒక భాష ఏ అవసరాలు తీర్చాలి? పాలక భాషలో అన్నీ ఉన్నాయి, అవి నేర్చుకుంటే చాలు అనే అభిప్రాయం అశాస్త్రీయం. ఆ ఆలోచన అపరిపక్వతకు నిదర్శనం. భాష ప్రధానంగా ఈ క్రింది అవసరాలను తీర్చాలి: 1. ఉపాధి, ఉద్యోగ అవసరాలు 2. విద్యాబోధనా మాధ్యమం 3. పాలనా మాధ్యమం 4. పత్రికలూ, రేడియోలూ, టీవీలూ, సెల్లులూ, అంతర్జాలమూ 5. వినోదం, సినిమా, నృత్యం, నాటకాలు 6. ప్రజల దైనందిన వాడకంలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ⇒పరభాష మాతృభాషా స్థానాన్ని ఆక్రమిస్తోంది. ⇒తల్లిదండ్రులు ఇంట్లో ఇంగ్లి్లషు మాట్లాడుతూ బడి భాషా ఇంగ్లి్లషు అయినప్పుడు జరిగేది ఇదే. ప్రస్తుతం ఇది తక్కువ శాతంగా ఉన్నా రానురాను పెరిగి మన మాతృభాషలు పూర్తిగా మృతభాషలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ సంధికాలంలో సమాజం సంక్షోభంలో కూరుకుపోతుంది. ⇒మార్కెట్లు పూర్తిగా ఇంగ్లిషువాళ్ల పరమైపోతాయి. మనది అంటూ సొంతది ఏమీ మిగలదు. మనం దేన్నీ శాసించే స్థాయిలో ఉండం. ఇంగ్లిషే నిర్ణయాత్మకం అవుతుంది. ⇒అందరికీ ఇంగ్లిషు రావడానికి 60 నుంచి 100 ఏళ్లు పడుతుంది. ఈ లోగా ఇంగ్లిషు వచ్చినవాళ్లూ రానివాళ్లూ అంటూ దేశం రెండుగా చీలిపోతుంది. ⇒మన దేశం మళ్లీ ఇంగ్లిషు వలస దేశంగా మారుతుంది. ⇒పిల్లలు బడికి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లినట్లుగా ఉంటుంది. వాళ్లు వాళ్ల తల్లిదండ్రులను, వాళ్ల తోటలను, వాళ్ల రోజువారి జీవన విధానాన్ని వదిలి వెళ్తారు. తరగతి గదిలో కూర్చుని వాళ్ల రోజువారీ జీవనానికి సంబంధంలేని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విషయాలను మాత్రమే నేర్చుకున్నందువల్ల పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. వాళ్లు సొంత విషయాలను తిరస్కరిస్తారు. ఏం జరగాలి? ⇒తెలుగు మాధ్యమానికి ప్రోత్సాహం తప్పనిసరి. ⇒తెలుగు మాధ్యమంలో చదివిన వారికి కొంత శాతం ఉద్యోగాలు కేటాయించాలి. ⇒రాష్ట్రంలో ఉద్యోగం కావాలనుకునే వారందరూ తప్పక తెలుగు నేర్చుకోవాలి. ⇒రాష్ట్రంలో, దేశంలో అన్ని పరీక్షల్లో తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. ⇒తెలుగు వాళ్లకు సంబంధించిన సకల వ్యవహారాలు తెలుగులోనే సాగాలి. ⇒అన్ని విశ్వవిద్యాలయాలలో వ్యవహారాలు తెలుగులోనే జరగాలి. తెలుగు తెలియని వారితో మాత్రమే ఆంగ్లంలో వ్యవహరించాలి. ⇒అందుకు తగిన పుస్తకాలు, శిక్షణ, కంప్యూటర్ అవగాహన కలిగించటం ప్రభుత్వ బాధ్యత. ⇒ప్రపంచంలో ఎవరైనా తెలుగు నేర్చుకోవటానికి ఆన్లైన్ శిక్షణను ప్రారంభించాలి. ⇒ప్రపంచ భాషగా గౌరవప్రదమైన స్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎలా జరగాలి? ⇒తెలుగు భాషాపరిరక్షణ 2019 ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కావాలంటే అందుకు మనం చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలి అనే విషయాలపై సరైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ఉద్యమ నినాదాలతో మాత్రమే ఇది ముందుకు వెళ్లదు. 2019 ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగు భాషాపరిరక్షణ పొందుపరిచేలా చూడాలి. ⇒ముందుగా అసలు తెలుగు భాషాపరిరక్షణ అంటే మన ఉద్దేశమేంటో తెలియజెయ్యాలి. తెలుగు భాష ఏ స్థాయి వరకు మాధ్యమ భాషగా ఉండాలనుకుంటున్నాం? పరిపాలనా భాషగా ఏఏ రంగాల్లో అమలు పరచాలనుకుంటున్నాం వంటి విషయాలపై ముందు మనం ఒక అవగాహనకు రావాలి. ⇒ఉన్నత చదువులు చదువుకొని పట్టణాల్లో నివసిస్తున్న వారికే మాతృభాష మాధ్యమంపై సరైన అవగాహన లేదు. ఎంత చెప్పినా వీళ్లు అంత త్వరగా మారకపోవచ్చు. వీళ్ల శాతం కూడా తక్కువ. అందువల్ల ముందుగా గ్రామీణ ప్రజలకు మాతృభాషా మాధ్యమం వల్ల లాభాలను తెలియజెయ్యాలి. ⇒మాతృభాషా మాధ్యమం వల్ల, పరిపాలన భాషగా అమలు పరచడం వల్ల ఒనగూరే లాభాల గురించి ఒక నమూనా పత్రాన్ని రూపొందించాలి. నమూనా పత్రంలో ఏముండాలి? ⇒తల్లిదండ్రులకూ పిల్లలకూ ఇంగ్లిష్ భాషపై ఉన్న కృత్రిమ గౌరవాన్ని, వ్యామోహాన్ని తొలగించి, మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించే అంశం. ⇒మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలకూ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చు అన్న విషయం. ⇒మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ భాషలను కూడా దశలవారీగా నేర్పడం జరుగుతుందన్న విషయం. ⇒ఇంగ్లిష్ మాధ్యమం వల్ల పిల్లల్లో ఏ భాషా సరిగ్గా ఎదగదు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం. ⇒మాతృభాషల్లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్న వారి దృష్టాంతాలను చూపించడం. ⇒పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై, ముఖ్యంగా రమీరె, థామస్ అండ్ కాలియర్, జార్జి మాసన్ విశ్వవిద్యాలయం, మాలిలో చేసిన అధ్యయనాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు చేసిన అధ్యయనాన్ని అర్థమయ్యేలా వివరించడం. ⇒భాషాధ్యయనంలోని ముఖ్యమైన, ఏక మూలాధార ప్రావీణ్యం, ఐస్‌బర్గ్, థ్రెషోల్డ్స్, బిక్స్, కాల్ప్ వంటి సిద్ధాంతాల సారాంశాన్ని అర్థమయ్యేలా వివరించడం. ⇒పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలు చదువులో బాగా రాణిస్తున్నారని, మాతృభాషలో నైపుణ్యం ఉన్నప్పుడే రెండో భాష త్వరగా నేర్చుకోగలుగుతున్నారని తెలియజేస్తున్న విషయాన్ని సోదాహరణంగా అర్థమయ్యేలా వివరించడం. - సురేశ్ కొలిచాల (భాషా పరిశోధకుడు) -
ఎందుకీ మహాసభలు?
కామారెడ్డి అర్బన్: పాలకులకు మూడేళ్లుగా పట్టని తెలుగు భాష ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు ప్రశ్నించారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహిస్తూ రూ.50 కోట్లు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కామా రెడ్డిలో నిర్వహించిన ‘ఈ వేళ ఎందుకీ మహాసభలు’కరపత్ర ఆవిష్కరణ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయలేని ప్రభుత్వం.. రూ. 50 కోట్ల వ్యయంతో మహాసభల జాతర నిర్వహిస్తోందని, ఇది ప్రభుత్వ ప్రచారంగానే ఉందన్నారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. భాష పేరిట పెద్ద పెద్ద కటౌట్లు కట్టి ప్రచారం నిర్వహించుకోవడం విచారకరమన్నారు. వేల మందిని పిలిచే బదులు తెలుగుపై పరిశోధనలు చేసిన వారు, సాహితీ వేత్తలు, కవులు, రచయితలను పిలిచి తెలుగు భాష అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భాష, యాస, సంస్కృతి, జానపద కళలను కలకాలం నిలపడానికి ప్రయత్నాలు జరగడానికి పరిశోధనలను ప్రోత్సహించాలని, భాష ప్రాధికార మండలిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
తెలుగుదనం ఉట్టిపడేలా..
ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సభలును విజయవంతం చేయటం కోసం తెలుగు దర్శకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని సమాచారం. తెలుగుదనం ఉట్టిపడేలా సభలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను షూట్ చేసే పనిలో దర్శకులు వంశీ పైడిపల్లి , హరీష్ శంకర్, నందిని రెడ్డి బిజీగా ఉన్నారట. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటపై హోలీ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించారట.మరోవైపు సాయి ధరమ్‌తేజ్, తెలుగు అమ్మాయి ఇషాలపై మరో సాంగ్‌ను రెడీ చేస్తున్నారట హారీష్ శంకర్. ఇంతకు ముందు హరీష్ దర్శకత్వంలో తేజ్ హీరోగా వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో తెలుగు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ పాట ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషనల్ సాంగ్స్‌ను చంద్రబోస్ రచించారని సమాచారం. -
ఇంటింటికీ ప్రపంచ తెలుగు మహాసభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సమాచారం ఇంటింటికీ చేరేలా తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ప్రచారం చేపట్టింది. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిం చగా తాజాగా తెలంగాణలోని 31 జిల్లాల్లో ప్రాచీన, ఆధునిక కవులు, రచయితలు, సాహితీవేత్తల ఫొటోలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనుంది. మహాసభలు జరగనున్న హైదరాబాద్‌లో ఇప్పటికే 100 హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. నగరానికి వచ్చే అన్ని మార్గాల్లో ప్రముఖుల పేరుతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాకు చెందిన కవుల హోర్డింగ్‌లు, తోరణాలను మూడేసి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశాన్ని ప్రజలంతా అర్థంచేసుకునేలా ఈ నెల 13 వరకు అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు, అతిథులకు రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలోనే మహాసభల సమాచారం తెలిసేవిధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సరస్వతీ ప్రార్థనతో ప్రారంభం మహాసభలు సరస్వతీ ప్రార్థనాగీతం తో ప్రారంభమవుతాయి. ఆ తరు వాత బమ్మెర పోతనామాత్యుడి విరచిత మహాభాగవతంలోంచి ఒక పద్యాన్ని రాగయుక్తంగా ఆలపిస్తారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆచార్య ఎన్ గోపి వచన కవిత్వంపై మాట్లాడతారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక ఇతివృత్తంతో డాక్టర్ రాధారెడ్డి రాజారెడ్డి రూపొందించిన కూచిపూడి నృత్యరూపకం, తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను సమున్నతంగా ఆవిష్కరించే దేశిపతి శ్రీనివాస్ రూపొందించిన నృత్యరూపక ప్రదర్శనలతో మొదటి రోజు వేడుకలు ముగుస్తాయి. తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు నేటి తరానికి తెలిసేలా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. వేదిక బయటవైపు 50 తెలంగాణ రుచుల స్టాళ్లు, మరో 20 పుస్తక ప్రదర్శన స్టాళ్లు, 20 హస్తకళల స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ బిర్యానీతోపాటు, అన్ని రకాల తెలంగాణ పిండివంటలు తెలంగాణ రుచులను స్టాళ్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయిస్తారు. వైభవంగా వేడుకలు.... ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్లో సుమారు 50 వేల మంది పాల్గొంటారని అంచనా. రాష్ట్రం నలుమూలలతోపాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలిరానున్న సుమారు 8 వేల మంది ప్రతినిధులు, అతిథులు, తెలుగు భాష, సాహిత్యాభిమానులు వేడుకల్లో పాల్గొనేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు హాజరవుతారు. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగు భాషకు పట్టం కట్టిన ‘కురిక్యాల’శాసనం .................... జిన భవనము లెత్తించుట జిన పూజల్సేయుచున్కి జినమునులకున త్తిన అన్నదానం బీవుట జిన వల్లభుబోలగలరె జిన ధర్మపరుల్ .............................. దినకరు సరివెల్గుదుమని జినవల్లభునొట్ట నెత్తు జితన వినచున్ మనుజుల్గలరే ధాత్రిన్ వినుతిచ్చుడు ననియవృత్త విబుధ కవీన్ద్రుల్ .............................................. ఒక్కొక్క గుణంబు కల్గుదు రొక్కణ్ణి గాకొక్క లెక్కలేదెవ్వరికిన్ లెక్కింప నొక్కలక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమణ గుణముల్ తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చిపెట్టిన కందపద్యాలివి. ఏ భాషకైనా ప్రాచీన హోదా రావాలంటే కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉండాలి. కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్ట సమీపంలోని కురిక్యాల వద్ద లభించిన కురిక్యాల రాతి శాసనం ఆ ఆధారాన్ని అందించింది. క్రీస్తు శకం 946లోనే జినవల్లభుడు తెలుగులో రాసిన కందపద్యాలు వెయ్యేళ్లకుపైగా తెలుగు వాడుకలో ఉందని నిరూపించాయి. కురిక్యాల శాసనంపై సంస్కృతం, కన్నడం, తెలుగు మూడు భాషలలో ఈ పద్యాలు ఉన్నట్లు శాసనాల అధ్యయనంలో వెల్లడైంది. 2వ హరికేసరి కాలానికి చెందిన ఈ శాసనంలో జైనమత ప్రసిద్ధి, దేవాలయాలు, పూజావిధానాలు, తదితర అంశాలపై జినవల్లభుడు పద్యాలు రాసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల్లో ఉచితంగా ‘వాగ్భూషణం..భూషణం’ కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం10 వేల కాపీలు ముద్రణ సభలు, సదస్సుల్లో అందరూ మెచ్చేవిధంగా ప్రసంగించాలంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రసంగంతో సభికులను ఆకట్టుకోగలం? నాయకులుగా రాణించాలనుకునే వారి ప్రసంగాలు ఎలా ఉండాలి? ఇలాంటి వివరాలతో అప్పట్లో ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణం..భూషణం’పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభల్లో విశేషంగా ప్రాచుర్యంలోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో నచ్చిన ఈ పుస్తకాన్ని మహాసభలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం 10 వేల కాపీలను ముద్రిస్తున్నారు. కేసీఆర్‌ను జనరంజకమైన నేతగా తీర్చిదిద్దడంలో ఈ చిన్న పుస్తకం ‘వాగ్భూషణం..భూషణం’ఎంతో దోహదం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. ఎస్ఈఆర్టీ రూపొందించిన ‘తెలంగాణ సాంస్కృతిక వైభవం’అనే మరో పుస్తకాన్ని కూడా అందజేయనున్నారు. ప్రతినిధులకు ఇచ్చే కిట్‌లో మహాసభల వివరాలతో కూడిన బ్రోచర్, తెలంగాణ సాంస్కృతిక వైభవం, తదితరాలు ఉంటాయి. బ్రోచర్లో 5 రోజుల కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తున్నారు. మహాసభలపై డాక్యుమెంటరీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. దీనిని ‘తెలంగాణ వైభవం’పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించి భద్రపరుస్తారు. ఐదు వేదికల్లో, ఐదు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలను మినిట్ టు మినిట్ చిత్రీకరిస్తారు. -
తెలుగు మహాసభలను అడ్డుకుంటాం
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకుంటామని విరసం నేత వరవరరావు అన్నారు. కవులు, కళాకారులు, మేధావులు ఈ మహాసభలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ మహాసభలను వ్యతిరేకిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వరవరరావు మాట్లాడుతూ పాలకులను వ్యతిరేకించడం అనేది కవులకుండే లక్షణం అని, అందుకే ఈ మహాసభలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 1975లో జలగం వెంగళరావు హయాంలో జరిగిన తెలుగు మహాసభలను కూడా వ్యతిరేకించడం జరిగిందన్నారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిర్వహించిన తెలుగు మహాసభలనూ వ్యతిరేకించామని.. కేసీఆర్‌తో పాటు నందిని సిధారెడ్డి కూడా ఈ సభలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పుడు ఈ మహాసభలను వ్యతిరేకించిన వారి గొంతులు ఇప్పుడు మెత్తబడ్డాయని అన్నారు. సంస్కృతి దోపిడీకే.. దేశంలో ఉన్న సంపదను దోచుకోవడానికే మొన్న పారిశ్రామికవేత్తల సమావేశాన్ని నిర్వహించారని, మన సంస్కృతిని దోచుకోవడానికే ఇప్పుడు మహాసభలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. 1997లో తెలంగాణ లొల్లి అనే సీడీని రూపొందించారని, అందులో సిధారెడ్డి రాసిన ‘నాగేటి చాలల్లో నా తెలంగాణ’అనే పాట కూడా ఉందన్నారు. దాన్ని రూపొందించిన ప్రజాకళామండలి నాయకుడు ప్రభాకర్‌ను ఎన్కౌంటర్ చేశారంటూ.. ఇది చాలదా ఈ మహాసభలను వ్యతిరేకించడానికి అని ప్రశ్నించారు. గీతాంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, భూపతి వెంకటేశ్వర్లు, సరోజిని బండ, రత్నమాల, సినీ నటుడు కాకర్ల తదితరులు పాల్గొన్నారు. -
అందరూ ఆహ్వానితులే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విదేశాలకు చెందిన 37 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 56 మందిని మహాసభలకు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. వీరి రవాణా ఖర్చులతోపాటు భోజన వసతి సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. గురువారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు కోసం ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం తొలిసారిగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం కడియం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, చందూలాల్‌తోపాటు మహాసభల నిర్వహణ కమిటీతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతినిధుల నమోదు చేపట్టామని.. మొత్తం 7,900 మందికిపైగా ప్రతినిధులు తెలుగు మహాసభలకు పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. 40 దేశాల నుంచి 160 మంది, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 1,167 మంది, తెలంగాణ నుంచి 6 వేల మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. పుస్తక ప్రదర్శన, ఫుడ్ స్టాళ్లు.. ప్రతినిధులుగా నమోదు చేసుకోని వారు కూడా మహాసభలకు హాజరుకావచ్చని కడియం తెలిపారు. తెలంగాణ భాషను, యాసను, జీవన విధానాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజువారీగా కార్యక్రమాల షెడ్యూలు, నిర్ణీత వేళలు అందరికీ ముందుగానే తెలిసేందుకు ప్రచారం చేస్తామని అన్నారు. తెలంగాణ రచనలను, పుస్తకాలను పరిచయం చేసేందుకు వీలుగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఆహారపు అలవాట్లను తెలియజేసేందుకు ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా పేరు తెచ్చిన హస్త కళలు, చేనేత చీరల స్టాళ్లు ఉంటాయన్నారు. ఏపీకి చెందిన తెలుగు భాషా పండితులు, సాహిత్యాభిమానులను మహాసభలకు ఆహ్వానించామని, ప్రత్యేకంగా కొందరికి సన్మానం చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు కడియం తెలిపారు. మహాసభల్లో భాగంగా ఈనెల 18న సినీ సంగీత విభావరిని నిర్వహించడంతోపాటు సినీ ప్రముఖులకు సన్మానం చేస్తామన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పేరు నమోదు చేసుకోలేదా..?
సాక్షి, హైదరాబాద్: తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకోలేదా..? నో ప్రాబ్లమ్.. రిజిస్ట్రేషన్‌తో ప్రమేయం లేకుండా సభా ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని కార్యక్రమాలు వీక్షించొచ్చు. ఈ మేరకు నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. అయితే.. ప్రాంగణంలోని వారికి ఉచిత భోజనం మాత్రం అందుబాటులో ఉండదు. సబ్సిడీ ధరలపై విక్రయించే భోజన పదార్థాలు కొనుక్కోవాలి. బస కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నందున వీలైనంత ఎక్కువమంది హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లతో ప్రమేయం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలో నిర్వహించిన సభల్లో భోజనానికి ప్రజలు ఇబ్బంది పడిన నేపథ్యంలో.. ఈసారి ఆ పరిస్థితి రాకుండా భోజన ఏర్పాట్లపై దృష్టి సారించింది. భోజనం, వసతి విషయమై గందరగోళం లేకుండా రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది. పేర్లు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా భోజనం, వసతి కల్పించనుంది. వీక్షకుల గ్యాలరీలో.. రిజిస్ట్రేషన్ గడువు పూర్తవడంతో మహాసభల నిర్వహక కమిటీ తాజాగా స్పష్టతనిచ్చింది. పేర్లు నమోదు చేసుకోని వారు కూడా నేరుగా సభా వేదిక వద్దకు వచ్చి గ్యాలరీలో కూర్చుని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 2,611 మంది.. నేరుగా 4,293 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆహ్వానాల రూపంలో మరో 1,000 మంది కలిపి మొత్తంగా 8,000 మందికి ఉచితంగా భోజనం, రవాణా, వసతి కల్పిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఎంత మంది వచ్చినా ఎల్బీస్టేడియంలో మైదానం చుట్టూ ఉండే వీక్షకుల గ్యాలరీ (మెట్ల రూపంలో ఉండే ప్రాంతం)లో కూర్చునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు మైదానం మధ్యలో ప్రధాన సభా ప్రాంగణంలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ బారికేడింగ్ ఉంటుంది. వాటి వెలుపల రిజిస్ట్రేషన్ చేసుకోనివారిని అనుమతిస్తారు. కార్టూన్లకు ఆహ్వానం తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం పలుకుతున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగలు, సామెతల ఆధారంగా గీసే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు శంకర్, మృత్యుంజయ్, నర్సిం వ్యవహరిస్తారు. కార్టూన్లను ఏ–3 సైజులోనే వేయాలి. డిసెంబర్ 10 లోపు wtmscartoon@ gmail.comకు ఈ–మెయిల్ చేయాలి. వ్యాఖ్య తెలుగులోనే ఉండాలి. కార్టూన్‌తో పాటు కార్టూనిస్ట్ ఊరు, జిల్లా పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో హామీ పత్రం జతచేసి పంపాలి. ఇప్పటికే ఈ ప్రదర్శన నిమిత్తం కార్టూన్లు పంపిన వారు మళ్లీ పంపాల్సిన అవసరం లేదు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతి అందజేస్తారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించే కార్టూన్లను పుస్తక రూపంలో అచ్చువేయనున్నారు. -
5 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 2000 మందికిపైగా ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 1,473 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతినిధుల నమోదుకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. సుమారు 6 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు అకాడమీ అంచనా వేస్తోంది. ఇందుకు తగిన విధంగానే భోజనం, రవాణా, వసతి, తదితర సదుపాయాలపైన అధికారయంత్రాంగం దృష్టి సారించింది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగులలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలలో మహాసభలు జరుగనున్న సంగతి తెలిసిందే. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఆదివాసీ, గిరిజన, జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ప్రతినిధులు తమకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి 19 వరకు 5 రోజులపాటు జరుగనున్న ఈ మహాసభల్లో లోపాలకు తావు లేకుండా సాంస్కృతిక, పర్యాటక, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఆర్అండ్బీ, తదితర విభాగాల మధ్య పని విభజన చేశారు. మహాసభల సందర్భంగా 100 పుస్తకాలను ఆవిష్కరించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. 10 దేశాలు, 52 మంది ప్రతినిధులు... ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 10 దేశాల నుంచి 52 మంది అతిథులను ఆహ్వానించగా ఇప్పటి వరకు 34 మంది తమ ఆమోదాన్ని తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ స్ట్రేలియా, మలేసియా, మారిషస్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయిల్, కువైట్ దేశాల నుంచి అతిథులు తరలిరానున్నారు. వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సభలకు రానున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 152 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 557 మంది ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. -
అందరి సమక్షంలో అద్భుతంగా..
సాక్షి, హైదరాబాద్ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్ల వంటి ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మారిషస్ ఉపాధ్యక్షుడు పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని.. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 15 నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందన సాహితీవేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి, సన్మానించాలని సూచించారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి తెలుగు మహాసభల ప్రారంభంతో పాటు ముగింపు వేడుకలను కూడా ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ‘‘ఎల్బీ స్టేడియం కాకుండా మిగతా వేదికల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలి. అక్కడ సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ వంటకాలతో ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయాలి. వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు కూడా నిర్వహించాలి. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించేలా లేజర్ షో నిర్వహించాలి. చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాలి. నగరమంతా అందమైన అలంకరణలుండాలి. పండుగ శోభను సంతరించుకోవాలి..’’అని కేసీఆర్ సూచించారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని, తెలుగు సాహితీమూర్తుల పేర్లతో తోరణాలుండాలని చెప్పారు. నగరమంతా బెలూన్లు ఎగురవేయాలని, తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూలో కవి సమ్మేళనం, ఖవ్వాలీ కూడా నిర్వహించాలని సూచించారు. వేదిక, తోరణాల డిజైన్లకు ఓకే తెలుగు మహాసభల ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే వేదిక డిజైన్‌ను, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పా టు చేసే తోరణాల డిజైన్లను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని.. నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలని అధికారులకు సూచించారు. అందరినీ ఆహ్వానించండి.. ప్రతి కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి, ప్రభుత్వం తరఫున సాహితీవేత్తలకు సన్మానం చేయించాలని... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి వసతి, భోజనం, రవాణా ఏర్పాటు చేయాలని... పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలని సూచించారు. విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, మహాసభలకు హాజరయ్యే వారికి సహాయపడాలన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్. చిత్రంలో హరీశ్ రావు, ఈటల, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ఇతర ఉన్నతాధికారులు -
ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం, ఇప్పటి తరాన్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడమనే రెండు ప్రధాన లక్ష్యాలు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా నెరవేరగలవని మహాసభల కోర్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఉత్సవం నేపథ్యంలో సిధారెడ్డితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఇప్పటికిప్పుడు మీ మనసుకు ఎలావుంది? కొంత ఇబ్బందిగానేవుంది. చేయబోయే పనిలో సాహిత్య ప్రధానమైనదానికంటే నిర్వహణ ప్రధానమైనది ఎక్కువ. ఇలాంటిది నాకు కొత్త. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన అనుభవం లేదు. అందుకే నా కవిహృదయానికి కొంచెం ఇబ్బందిగానేవుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టి, సభలు నిర్వహించడం నాకు మరీ దూరమైన పనేమీ కాదు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. కోర్ కమిటీలోని దేశపతి (శ్రీనివాస్)గానీ, రమణాచారిగానీ, మిగతా సభ్యులుగానీ అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మహాసభలను విజయవంతం చేయగలమనే నమ్మకం ఉంది. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వీటిని వాటికి కొనసాగింపుగా చూడాలా? వాటికి కొనసాగింపు అనవలసిన అవసరం లేదు. ఇవి తెలంగాణలో జరుగుతున్న తొలి మహాసభలుగానే చూడాలి. ఎందుకంటే ఆ మహాసభలను జరపడంలో అంతర్లీనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం అనే ప్రత్యేకమైన మోటిఫ్ ఉంది. 1969, 70ల నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972,73 నాటి జై ఆంధ్ర ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు ప్రాంతీయ భేదాలు సమసిపోవాలనే ఉద్దేశంతో వాటి నిర్వహణ జరిగింది. అది తప్పా ఒప్పా అన్న చర్చలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ లాంటి సినిమా పాటలు కూడా దాన్ని ప్రతిబింబిస్తూనే వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే పాట రాసిన సినారెను ‘ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా మారిందా సార్?’ అని నేను అడిగాను: ‘తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది’ అన్నారు. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలంగాణ వైపు నుంచి కూడా గణించదగిన కృషి జరిగింది; తెలుగుకు తొలి ప్రాతిపదిక, భూమిక తెలంగాణ నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో నమోదు చేయడమనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మహాసభలివి. ప్రాతిపదిక, భూమిక గురించి మరింత చెప్పండి... కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లాలో నారన, గోపన అనే గోపరాజుల నాణేలు దొరికాయి. వీళ్లు క్రీ.పూ.600–400 కాలానికి చెందినవారని నాణేల పరిశోధకుడు ఠాకూర్ రాజారామ్‌సింగ్ నిర్ధారించారు. నారన, గోపనల్లోని అన అన్నది తెలుగు అన్నే. ఇప్పటికీ చూడండి– తిక్కన, పోతన, వేమన పేర్లు మనకున్నాయి. దీనివల్ల మన తెలుగు ఉనికి సుమారు 2,500 ఏళ్ల ముందుకు పోయింది. అలాగే శాతవాహనులు క్రీ.పూ.200– క్రీ.శ.200 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇందులో హాలుడు క్రీ.శ.2వ శతాబ్దం వాడు. ఆయన ప్రాకృతంలో సంకలనం చేసిన గాథాసప్తశతిలో అత్త లాంటి తెలుగు మాటలున్నాయని తిరుమల రామచంద్ర నిరూపించారు. అగ్గి అనే తెలుగు మాటకు దీర్ఘమిచ్చి అగ్గీ అంటే అది ప్రాకృతం అయినట్టుగా కూడా మనకు ఆధారాలున్నాయి. ఒకవేళ భాష అంతా సాహిత్యం కాదు అనుకున్నా కూడా, క్రీ.శ.947 నాటి జినవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో పంపన రాసిన మూడు తెలుగు కందపద్యాలు దొరికాయి. పంపన తెలుగులో జినేంద్ర పురాణం రాశాడు. కన్నడంలో విక్రమార్జున విజయం రాశాడు. దాన్నే పంపభారతం అనీ అంటారు. ఇది 11వ శతాబ్దానికి చెందిన నన్నయ కంటే 150–200 ఏళ్ల ముందు సంగతి! వీటిన్నింటివల్ల కూడా తెలంగాణలో తెలుగు ఉనికి బలంగా ఉన్నదని నిరూపితమవుతోంది. అంతెందుకు, తెలుంగు గణం తెలుంగణం అయ్యి, తెలంగాణం అయ్యిందని ఒక అభిప్రాయం. తెలుంగు ఆణెము(ప్రాంతం) తెలంగాణ అని మరో అభిప్రాయం. మహాసభల్లో ఎంతమంది పాల్గొంటారని అంచనా? సుమారు 30 దేశాల నుంచి 500 మంది విదేశీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు సాహిత్యాభిమానులు, తెలంగాణ తో కలుపుకొని మొత్తంగా 6000–8000 మంది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ సాహిత్యవేత్తలతో ఎలా వ్యవహరిస్తున్నారు? వాళ్ల స్పందన? వాళ్లు కూడా పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ శషభిషలు లేకుండా భాషాసాహిత్య ప్రేమికులందరూ పాల్గొనబోతున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయితలందరూ పాల్గొనేలా చూస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది తెలంగాణ వాళ్ల నుంచే ‘వాళ్లను పిలుసుడు ఏంది’ అన్న వ్యతిరేకత వస్తోంది. కానీ అక్కడి ప్రముఖులందరినీ పాల్గొనేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ప్రతినిధులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్లు దిగగానే ఒక కిట్ ఇస్తాం. అందులో వాళ్ల పాస్, ప్రోగ్రామ్ షెడ్యూల్, ఫుడ్ కూపన్స్ ఉంటాయి. వచ్చినవారందరికీ భోజనం ఏర్పాటు వేదిక దగ్గరే ఉంటుంది. వాళ్లు రావడానికి, బసకు వెళ్లడానికీ రవాణా సౌకర్యం ఉంటుంది. మొబైల్ టాయ్లెట్లు కూడా ఉంటాయి. ఇందులో మూడు రకాలవాళ్లున్నారు: ఇన్వైటెడ్ గెస్ట్స్. వీళ్లు రచయితలు, కళాకారులు. ఇన్వైటెడ్ డెలిగేట్స్. వీళ్లు సంఘాల ప్రతినిధులు. రిజిస్టర్డ్ డెలిగేట్స్. వీళ్లు స్వచ్ఛందంగా పాల్గొనేవాళ్లు. వారి వారి స్థాయిని బట్టి, కోరుకున్నదాన్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి. సామాన్యులు ఎంతమేరకు పాల్గొనవచ్చు? అసలు పాల్గొనవచ్చా? నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. భోజనానికిగానీ సౌకర్యానికిగానీ బాగుంటుంది. లేకపోయినా గ్యాలెరీల్లో ఉండి వారు అన్ని చర్చలనూ వినొచ్చు, అన్ని ప్రదర్శనలనూ చూడొచ్చు. భోజనం కూడా వేదిక బయట సబ్సిడీకి అందించేలా వ్యాపారస్థులను ఒప్పిస్తున్నాం. సభల సందర్భంగా జరుగుతున్న ప్రచురణలు? మరుగునపడిన తెలంగాణ వైతాళికుల మీద తెలుగు అకాడమీ 70 మోనోగ్రాఫ్‌లు ప్రచురిస్తోంది. భాష, సాహిత్యాలకు సంబంధించి సాహిత్య అకాడమీ 10 పుస్తకాలు వెలువరిస్తోంది. సాంస్కృతిక శాఖ 8 పుస్తకాలు తెస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తోంది. తెలంగాణ, పాలపిట్టలు కూడా ప్రత్యేక సంచికలకు సిద్ధమవుతున్నాయి. హెల్ప్‌లైన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఈ సాహిత్య అకాడెమీ నంబర్లను సందేహాలున్నవారు సంప్రదించవచ్చు. 040–29703142/52. దానికంటే ముఖ్యంగా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో కియోస్క్ మిషన్లు ఉంటాయి. ప్రధాన కూడళ్లలో డిజిటల్ డిస్ప్లేలు ఉంటాయి. వాటిల్లో జరగబోయే కార్యక్రమాల సమాచారం వస్తుంది. దానికి అనుగుణంగా పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మహాసభల ఎనిమిది ఆశయాల్లో ఒకటి: ‘ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి’. ఒకవైపు ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా ఈ సమస్యను ఎట్లా చూడాలి? ప్రభుత్వం ప్రజానుకూలమైన పాలన చేయాలి. సాధారణ ప్రజానీకం, శ్రామిక వర్గ సంతానం కూడా ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం బడుల్లో చదివిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని కాపాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందరూ ఇంగ్లిష్ మీడియం వైపు ఎందుకు మళ్లుతున్నారు? ఇంగ్లిష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని బలంగా ముద్రపడింది. ఎవరికీ ప్రత్యేకంగా భాష మీద ప్రేమ వుండదు. జీవితం మీద ప్రేమ వుంటుంది. ఆ జీవితాన్ని నిలుపుకోవాలంటే ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ఇంగ్లిష్. వాళ్లకు ఇంగ్లిష్ మీద ప్రేమ లేదు, తెలుగు మీద ప్రేమ లేదు. ఐఐటీ పెద్ద చదువు, ఎంఏ తెలుగు పనికిరానిదైంది. ఐఐటీలో పెద్ద శాలరీ వస్తుంది. శాలరీ ఎక్కువున్నవాళ్లు ఎక్కువ గౌరవం పొందుతారు. ఇదంతా కూడా ఉద్యోగ కల్పన మీద ఆధారపడిన అంశం. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజానీకంతో వ్యవహరించే ఉద్యోగులందరికీ తెలుగు రావాలనే నిబంధన పెడుతోంది. అప్పుడే కదా వాళ్ల సమస్యలు బాగా అర్థం చేసుకో గలుగుతారు. రెండోది: తెలుగు పండిత్‌ల కోసం పదివేలకు పైగా ఉద్యోగాల కల్పన చేయబోతోంది. అలాగే, భాష అనేది ఉద్యోగానికి సంబంధించినదే కాదు. భాషతో వ్యక్తిత్వ నిర్మాణం జరగుతుంది. కాబట్టి, తెలుగును రక్షించాలంటే భాషకు సంబంధించిన చైతన్యం కూడా ప్రచారం కావాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తెలుగు వేరే, మిగతా తెలుగు వేరే అన్న వాదనలు, చర్చలు జరిగాయి. ఒకవిధంగా తెలంగాణ తెలుగు వేరే అనే నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అవమానం నుంచి, తృణీకరణలోంచి, మీది తెలుగు కాదు అన్న విపరీతవాదనలోంచి ఉప్పొంగినది తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరిదాకా వెళ్లి మా భాష వేరే అని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన. ఇప్పడు తెలంగాణ ఏర్పడ్డాక ఎవరూ భాషమీద ఆధిపత్యం చేయడానికి కుదరదు. ఆ ఉద్వేగ దశను దాటిపోయినం కాబట్టి, తెలంగాణలో తెలుగు ముద్రను బలంగా వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే. తమిళనాడు, మహారాష్ట్ర, కోస్తా, రాయలసీమ అంతటావున్నది తెలుగే. ఇవన్నీ సమన్వయం జరిగితేనే అసలు తెలుగు బయటికి వస్తుంది. ఊదు గాలది పేరు లెవ్వది అని ఒక సామెత. పనిగాదు, అని అర్థం. దీన్ని వ్యాప్తిలోకి తీసుకుపోతే అందరూ వాడుకోగలుగుతారు కదా! తెలంగాణ పదాలు, నుడికారాలు, జాతీయాలు, సామెతలను సముచిత స్థానంలో నిలబెడితే తెలుగు భాష మరింత వికసిస్తుంది. నలభై ఏళ్ల తర్వాత.. 2500 ఏళ్ల ‘తెలుగు వెన్నెల సోన మన తెలంగాణ’ అంటూ హైదరాబాద్ వేదికగా 2017 ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15–19 వరకు జరగనున్నాయి. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. తర్వాత 1981లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోనూ, 1990లో మారిషస్‌లోనూ జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో తిరుపతిలో జరిగిన తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ప్రస్తుత మహాసభలు ప్రకటించుకున్న ఎనిమిది ఆశయాలు: ⇒ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది. ⇒తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి. ⇒తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది. ⇒వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి. ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యాయానికి తెరతీస్తాయి. ⇒సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి. ⇒ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి. ⇒కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి. ⇒తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరుస్తుంది. ఎల్బీ ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం తెలుగు మహాసభల ప్రధాన వేదిక. ఇన్డోర్, ఔట్‌డోర్ స్టేడియాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. రవీంద్రభారతిలో మూడు వేదికలు. ఇంకా తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంటాయి. అదనంగా లలితకళా తోరణమా? పీపుల్స్ ప్లాజా? అన్నది ఇంకా నిర్ణయం జరగాల్సివుంది. లైవ్ ప్రదర్శనలకు పీపుల్స్ ప్లాజా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు మహా సభల సన్నాహక సదస్సు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు. మురళి ధర్మపురి, ప్రవీణ్ పిన్నమ సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల కో ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్.వీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 'తెలంగాణలో ప్రకాశించిన తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రముఖ కవి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలుగు మహాసభల కోసం సిడ్నీ నగరంలో బెల్ హెవన్స్ హోటల్ లో జరిగిన సన్నాహక సమావేశానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణలో సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు నుడికారం ఎంతో అందంగా కవితాత్మకంగా ఉంటుందని దేశపతి శ్రీనివాస్ సోదాహరణంగా వివరించారు. పాల్కురికి సోమనాథుడు, పోతన, దాశరథి, సినారెల గురించి పాటలు పడుతూ దేశపతి శ్రీనివాస్ చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా నుండి వచ్చే అతిథులందరికి తెలంగాణ గౌరవ మర్యాదలు ఉట్టిపడే విధంగా ఆతిథ్యం ఇస్తామని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వీ సత్యనారాయణ ప్రకటించారు. తెలంగాణ సాహిత్య చరిత్రలో నిర్మాణంలో ఉన్న ఖాళీలను పూరించడం, విస్మరణకు గురైన అంశాలను వెలుగులోకి తేవడం కోసమే తెలుగు మహాసభలు అని పేర్కొన్నారు. సభలో రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా అందరు పాల్గొనడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషా ప్రియులు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన ఈ తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం తెలుగు వారంతా స్వాగతించాల్సిన విషయం అని, ఇందుకు యావత్ తెలుగు జాతి మిమ్మల్ని అభినందిస్తున్నదని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కాసర్ల పేర్కొన్నారు. అంతే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాలకు అందించేందుకు, బాషా ఔన్నత్వం మరింతగా కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఎన్నారైలు గా మేము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియాలోని ప్రవాస సంఘాల మరియు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. -
5 రోజులు.. వేదికలు..
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలుగు భాష ఆవిర్భావ వికాసాలకు ప్రధాన భూమిక తెలంగాణ. ఇక్కడి నుంచే తెలుగు విస్తరించింది. ఇందుకు అనేక శాసనాలు, నాణేలు, చరిత్ర ఆధారంగా ఉన్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఈ ఘన చరిత్రను చాటి చెబుతాం. ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను తట్టుకుని నిలిచి గెలిచిన రెండువేల ఏళ్ల నాటి గొప్ప భాష తెలుగు. ఈ భాష, సంస్కృతులను సుస్థిరం చేసేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తాం’’అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష ఔన్నత్యాన్ని, విశిష్టతను విశదీకరించేందుకు, తెలంగాణలో తెలుగు భాష ఆవిర్భవించి వికసించిన తీరుతెన్నులను ప్రపంచానికి సమున్నతంగా చాటిచెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను ఐదు రోజుల పాటు, ఐదు వేదికలపై నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై బుధవారం ఆయన తెలుగు భాషా పండితులకు దిశానిర్దేశం చేశారు. రవీంద్ర భారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన తెలుగు భాషా పండితులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరయ్యారు. అద్వితీయంగా సభల నిర్వహణ.. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, తెలుగు వర్సిటీ, పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలితకళాతోరణం, ఇందిరా ప్రియ దర్శిని ఆడిటోరియంలో సదస్సులు, చర్చాగోష్టులు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. శాస్త్రీయ కళలపై రవీంద్రభారతిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలుగు వర్సిటీలో ఐదు రోజుల పాటు నిరంతర కవి సమ్మేళనాలు ఉంటాయి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఐదు వేదికల నిర్వహణ బాధ్యతలను భాషా పండితులే పర్యవేక్షిస్తారు. సాహిత్యం, కళలు, భాషపై అభిరుచి, ఆసక్తి ఉన్నవారికే నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఏ వేదికపై, ఏ సమయంలో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించేది వాళ్లే నిర్ణయిస్తారని నందిని సిధారెడ్డి తెలిపారు. 30 దేశాల నుంచి సుమారు 500 మంది విదేశీ ప్రతినిధులు, 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు భాష, సాహిత్యాభిమానులు సభల్లో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి సుమారు 6,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న ప్రారంభ, 19న ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఆహ్వానించనున్న ట్లు సిధారెడ్డి తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మారిషస్ ఉపాధ్యక్షుడు కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు. ఆత్మీయంగా ఆతిథ్యం.. సభలకు హాజరయ్యే అతిథులకు, ప్రతినిధులకు ఈ వేడుకలు ఒక మధురస్మృతిగా నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించేందుకు సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. తెలుగు సంస్కృతి, తెలంగాణ విశిష్టత ఉట్టిపడేలా రకరకాల వంటకాలను ఈ వేడుకల సందర్భంగా వడ్డించనున్నారు. ప్రతినిధులకు వసతి, భోజనం, రవాణా తదితర ఏర్పాట్లలో లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు మహాసభలపై అన్ని జిల్లాల్లో విస్తృతంగా సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ అంశాల్లో పిల్లలకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు మహాసభల వేదికలపై అవార్డులను అందజేస్తారు. ప్రతి రోజు స్కూళ్లలో ప్రార్థన సమయంలో తెలుగు భాష విశిష్టత గురించి, ప్రపంచ తెలుగు మహా సభల గురించి పిల్లలకు వివరించేలా చర్యలు చేపట్టారు. -
తెలుగు సభలకు విదేశీ కళ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన తెలుగు మహాసభల్లో స్థానిక, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు వారే పాల్గొనేవారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న సభలు కావడంతో ఈ సారి ప్రత్యేకత ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రవాస తెలంగాణ వారు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే ఈ సభలకు ప్రత్యేక గుర్తింపొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో కూడా సభల సన్నాహక సమావేశాలు మొదలుపెట్టి అక్కడి తెలుగు, ముఖ్యంగా తెలంగాణ ప్రాతినిథ్యమున్న సంఘాలతో ప్రచారం జరిపిస్తున్నారు. ప్రవాస తెలంగాణ వారే కాకుండా విదేశీయులను కూడా రప్పిస్తే తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే మారిషస్ దేశ ఉపాధ్యక్షుడు ఈ సభలకు హాజరుకానున్నట్లు తెలిపినట్లు సభల కోర్‌కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. తెలుగుపై మక్కువ ఉన్న విదేశీ ప్రతినిధులను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. వివిధ అధ్యయనాల కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న వారిని గుర్తించి, వారికి ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా వేదిక.. ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు నమూనాలు సిద్ధం చేసిన కోర్‌కమిటీ సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపారు. బతుకమ్మ, పాలపిట్ట, జమ్మిచెట్టు, కాకతీయ తోరణం, గోల్కొండ, తెలంగాణ వైతాళికుల రూపాలతో నమూనాలు రూపొందించారు. వేదిక స్థలం.. ప్రవేశ ద్వారాలు.. ప్రముఖుల స్థానాలు.. భోజనశాల.. ప్రాంగణం వంటివి ఉండాల్సిన స్థలాలను గుర్తించేందుకు మహా సభల కోర్‌కమిటీ సభ్యులు, అధికారులు ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించారు. తక్కువ ధరకే స్టార్ హోటల్ వసతి.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత రవాణ, భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. కోరిన వారికి తక్కువ ధరకే స్టార్‌హోటల్ బస కల్పించనున్నట్లు చెప్పారు. సాహిత్య అంశాలతో పాటు తెలుగు శాసనాలు, నాణేల ప్రదర్శన ఉంటుందని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి చేయాల్సిన కృషి, నేటి అవసరాలకు తగ్గట్లు భాషను మలుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ దినకర్‌బాబు, సాహిత్య అకాడమీ కార్యదర్శి నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. -
అమెరికాలో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సదస్సు
హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుండి 19 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి సన్నాహక సదస్సులను వివిద దేశాల్లొ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సన్నాహక సదస్సును అట్లాంటాలో జరిపారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణా సాహిత్య అకాడమి పక్షాన.. ప్రపంచ తెలుగు మహా సభల ప్రవాస భారతీయ శాఖల సమన్వయకర్త మహెష్ బిగాల ముఖ్య అతిథిగా అట్లాంటాకి వచ్చి ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానం పలికారు. దీప ప్రజ్వలన అనంతరం చదువులతల్లి సరస్వతి అమ్మవారిపై మీనక్షి రామడ్గు పాడిన పాటతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ముఖ్య అతిథి మహెష్ బిగాల మాట్లాదుతూ, కేసీఆర్‌కి తెలుగు బాష పై ఉన్న మమకారం, సాహిత్యం మీదున్న ఆసక్తి గురించి వివరించారు. తెలుగు బాషను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి చెప్పారు. తెలుగు బాష అందరిదని, భాషా పండితులు ఎక్కడివారైనా గౌరవించాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నదని అన్నారు. అమెరికా, వివిద దేశాల నుండి వచ్చే వారికి ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలను వివరించారు. తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రపంచ తెలుగు మహా సభల ఉద్దేశాన్ని వివరించారు. ఈ సదస్సుకు అట్లాంటా నగరం, చుట్టు పక్కల ప్రాంతాలనుండి తెలుగు భాషా పండితులు, సాహితీ వేత్తలు, భాషా ప్రేమికులు, అన్ని తెలుగు సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ప్రముఖ సంస్కృతాంధ్రపండితులు బాబు దేవీదాస్ శర్మ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యం ఎంతో ప్రాఛీనమైనదని కొండాపూరు నందు లభ్యమైన శాసనాలను ఉటంకిస్తూ చెప్పారు. అలాగే తెలంగాణాలోని ఎన్నో సంస్థానాలు కవిపండితులను పోషించాయని అందులో గద్వాల సంస్థానం చాలా ప్రముఖమైనది చెబుతూ, గద్వాల సంస్థానములో జరిగిన శతావధానములోని పద్యాలను ఉదహరించారు. అనంతరం ప్రముఖ సాహితీ పరిశోధకుడు, రచయిత సురేష్ కొలిచాల మాట్లాడుతూ, తెలుగుభాష నేడు ఎంతోమంది మాట్లాడుతున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో మన భాషకు ఇంకా సముచితమైన స్థానం దక్కలేదని, భాషను పరిరక్షించుకునే దిశగా మనమంతా అడుగులు వేయాలని, లేకపోతే మన భాష అనేక ఇతర దేశాలలోని భాషలాగే అంతరించే ప్రమాదం ఉందన్నారు. భాషా పరిరక్షణ , వ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. తరువాత కవి, రచయిత ఫణి డొక్కా మాట్లాడుతూ తాను సాహితీ కర్షకుడనని చెబుతూ, తాను రాసిన కొన్ని చక్కని వృత్తపద్యాలను వినిపించారు. ఇంటర్మీడియెట్ వరకు తెలుగు బోధించాలి అని తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగు భాషను కాపాడుకోవడంలో కేసీఆర్ చూపుతున్న చిత్తశుద్దిని కొనియాడారు. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి మాట్లాడుతూ, ఇది చాలా మంచి కార్యక్రమం అని, తనతోపాటు దాదాపు 30 మంది సంఘ సభ్యులు హాజరవుతారని తెలిపారు. తానా కార్యదర్శి అంజయ్య చౌదరి మాట్లాడుతూ భాష విషయంలో సహాయ సహకారాలందించడం కొరకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. తానా పక్షాన 20 మంది వరకు హాజరవుతారని తెలిపారు. టాటా పక్షాన భరత్ మాదాడి మాట్లాడుతూ.. సంఘం నాయకులందరూ కార్యక్రమనికి హాజరవుతారని తెలిపారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా చైర్మన్, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి, నాటా పక్షాన కిరణ్ కందుల, గేట్స్ పక్షాన నందా చాట్లా, తామా పక్షాన వెంకట్ మీసాల, గాటా పక్షాన గురు, ఎన్నారై విఏ పక్షాన రాము, గణెష్ కాసం, సింగర్ శ్రీనివాస్ దుర్గం, ఆటా సాంస్కృతిక శాఖ నుండి ఉదయ ఏటూరు, జానపద గాయకుడు జనార్థన్ పన్నెల, విటి సేవ పక్షాన సంధ్య యెల్లాప్రగడతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో రామడ్గు శివకుమార్, నిరంజన్ పొద్దుటూరిలు తమవంతు కృషి చేశారు. తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో భారీ స్పందన తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. తెలుగు మహాసభల సన్నాహక సదస్సును కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సన్నాహక సదస్సు కు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులకు ఆహ్వానిస్తున్నట్టు అయన చెప్పారు. తెలుగు జాతి సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీసీఏ టీఆర్ఎస్ యూఎస్ఏ, సిలికాన్ ఆంధ్ర, బాటా, వీటీఏ ,టీడీఎప్, టాటా, సాన్ రామన్ ఫ్రెండ్స్, ఎస్టీఏ, తెలంగాణ జాగృతి హెచ్ఎస్ఎస్ సంఘాల ప్రతినిధులు, తెలుగు రచయతలు, కళాకారులు పాల్గొన్నారు. -
తెలంగాణ సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యేలా.. తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా.. తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపేలా.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యం ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా కలసి ఎలా పనిచేశారో, అంతే పట్టుదలతో, సమన్వయంతో తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగింది. తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారు. ప్రతిభా పాటవాలకు కొదవలేదు. కానీ తెలంగాణ వారి ప్రతిభ రావాల్సినంతగా వెలుగులోకి రాలేదు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలి. అన్ని భాషా ప్రక్రియలపై ప్రత్యేక కార్యక్రమాలుండాలి. చిత్ర లేఖనం తో పాటు ఇతర కళలకు ప్రాధాన్యం ఉండాలి. అముద్రిత గ్రంథాలను ముద్రించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలని, తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లుండాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలి. హైదరాబాద్‌లో వివిధ వేదికలు ఏర్పాటు చేసి, ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలి’అని సీఎం చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టును ఖచ్చితంగా బోధించాలనే నిబంధన పెట్టింది. ఉర్దూ మీడియం స్కూళ్లలో కూడా ఈ విధానం అమలు చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. ఇది మంచి పరిణామం. తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరికే విధానం అమలు చేస్తాం. అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి’అని సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ కవిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. మరో రెండు కమిటీల ఏర్పాటు.. తెలుగు మహాసభలను పురస్కరించుకుని ప్రభుత్వం మరో రెండు నిర్వాహక క మిటీలను ప్రకటించింది. వేదిక, మీడియా కు సంబంధించి అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వేదిక కమిటీలో రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ, హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్, సాహిత్య అకాడమీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ చైర్మన్‌గా మీడియా కమిటీలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సీఎం చేసిన మరికొన్ని సూచనలు.. ఇక నుంచి ఏటా ఒక రోజు తెలంగాణ తెలుగు సభ నిర్వహిస్తాం. సభల నిర్వహణకు సాహితీవేత్తలతో ఉప సంఘాలు వేయాలి. మహాసభల వేదికపై కచ్చితంగా మహిళా సాహితీవేత్తల ప్రాతినిధ్యం ఉండాలి. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభ, ముగింపు సమావేశాలు నిర్వహించాలి. అక్కడే తెలుగు శాసనాలను ప్రదర్శనకు పెట్టాలి. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్య కూడళ్లకు తెలంగాణలోని తెలుగు భాషా ప్రముఖుల పేర్లు పెట్టాలి. మహాసభల సందర్భంగా ఇతర భాషల్లోని ప్రముఖులను గుర్తించి, సన్మానించాలి. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రముఖుల జీవిత గాథలతో పుస్తకాలు ముద్రించాలి. -
'ప్రపంచ తెలుగు మహా సభల' సన్నాహక సదస్సు
లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి19 వరకు నిర్వహించబోతున్న ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు. పవిత్ర రెడ్డి కంది సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ సదస్సుకి ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రపంచమంతా గుర్తించే విధంగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా, తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటేలా సభలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ మహాసభలకు వివిధ ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు బాషా అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల్లో భాగంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రక్రియలపై సభలు నిర్వహిస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమానికి దేశ విదేశాలలోని తెలుగు బాషా ప్రియులకు ఆహ్వానాలు పంపామని తెలిపారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషా ప్రియులు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన ఈ తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం తెలుగు వారంతా స్వాగతించాల్సిన విషయం అన్నారు. అంతే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాలకు అందించేందుకు, బాషా ఔన్నత్వం మరింతగా కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఎన్నారైలు గా తాము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అనంతరం జరిగిన చర్చా గోష్ఠిలో మహాసభలకు సంబంధించి తమ సలహాలను, సూచనలను తెలపడంతో పాటు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరగా ఎన్నారై లను మహా సభలల్లో భాగస్వాములను చెయ్యాలని లండన్ వచ్చి ఆహ్వానించిన మహేష్‌ని ప్రవాస సంఘాల ప్రతినిధులంతా కలిసి శాలువా తో సత్కరించారు. ఈ సదస్సుకు యూకేలో వున్న ప్రవాస సంఘాల (టాక్, జాగృతి యుకె - యూరోప్, టి.డి.ఎఫ్ యుకె, టి.ఎన్.ఎఫ్, తాల్, యుక్తా, జేటీఆర్డీసీ, ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే, ఇతర సంఘాలు) ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు మేధావులు పాల్గొన్న వారిలో వున్నారు. -
తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాషా వైదుష్యాన్ని, విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తామని.. తెలంగాణ సంస్కృతి కళావైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభల అంశంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠమిదీ.. సాహిత్య వారసత్వానికి ప్రతీకలెందరో.. తేట తెనుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద కావ్యం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వాసి అయిన పొన్నగంటి తెలగన రచించిన యయాతి చరిత్రం తొలి అచ్చతెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతి గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథా సంకలన కావ్యం సింహాసన ద్వాత్రింశికను రచించిన కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీంగల్ నివాసి. చాటుపద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. ‘వాణి నా రాణి’అని ప్రకటించిన ‘జైమినీ భారత’కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండను ఏలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించిన బమ్మెర పోతన రచించిన ‘శ్రీమద్భాగవతం’మధురభక్తికి, మంజుల పద విన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమై అజరామర కీర్తిని పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్య్రర్థి, చతుర్థి కావ్యాలు చిత్రబంధ అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. జానపద జీవధారలకు పుట్టినిల్లు.. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటినుంచి ఆశువుగా వెలువడి అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. నాటు పాటలు, రాటు పాటలు, మోట పాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయ్ దూలా అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘ జీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒకతరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గుకథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటల ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.. కొత్త తరానికి ప్రేరణగా.. ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలుచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. సభల్లో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్యరస హృదయులందరూ ఒకే చోట చేరడంతో.. వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు నూతనోత్తేజాన్ని, ప్రేరణను కలుగజేస్తాయి. సభల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది. సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు రూ. 5 లక్షలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాస రచన, వక్తృత్వం, పద్య పఠనం, కవితా రచన తదితర అంశాల్లో పోటీల నిర్వహణ ప్రారంభమైంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలు జరిగాయి. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు వారు నివాసముంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నాం. మీ ప్రాంత సాహిత్యాన్ని వెలుగులోకి తెండి గౌరవ శాసన సభ్యులకు నేను ప్రత్యేకంగా ఒక విషయం మనవి చేయదల్చుకున్నాను. మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద దృష్టి సారించండి. మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను, అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకురావాలి. ఆయన ఆ సాహిత్య విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. శాసనసభ్యులతో పాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నా.. సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండెల నిండా జరుపుకొనే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొనాలి. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి..’’ రాష్ట్ర ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు.. తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు జాతీయ ప్రముఖులు విచ్చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే వారికి నివాసం, భోజనం, స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకత చాటే విధంగా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం. సభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రంలో మసకబారిన తెలంగాణ ప్రశస్తి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒక దశలో తెలంగాణలో కవులే లేరన్న స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలూ చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో శ్రమకోర్చి... తెలంగాణ నలుచెరగులా తిరిగి 354 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచికను వెలువరించారు. అది మన తెలంగాణ స్వాభిమాన ప్రతీక, సాహిత్య జయపతాక. జలపాత సదృశమైన ధారతో అద్భుతమైన ప్రౌఢిమతో అగ్నిధార, రుద్రవీణ వంటి పద్యకావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. ‘భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానమ్మురా’అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు. ప్రజాకవి కాళోజీ తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పదనాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి దీటైన సమాధానమిచ్చారు. తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ.. ‘‘తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు కీర్తి పొందింది. నికోలస్ కాంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’గా కొనియాడారు. తమిళ జాతీయకవి సుబ్రమణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపద వెలుగొందిన సాహితీ సుక్షేత్రం. తెలంగాణలో రెండు వేల ఏళ్లకు పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందిన హాలుని గాథాశప్తశతిలో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల దగ్గర బొమ్మలగుట్టపై ఉన్న జినవల్లభుడి శాసనం కంద పద్యాలతో ఉండటం విశేషం. దాన్నిబట్టి క్రీస్తుశకం 947 సంవత్సరం నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటిచెప్తోంది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ‘ఉరుతర గద్యపద్యోక్తుల కన్న సరసమై పరగిన జానుతెనుగులో కావ్య సృష్టి చేస్తా’నని ప్రతిజ్ఞ చేసి అచ్చ తెలుగు పలుకుబడికి పట్టంకట్టిన పాల్కూరికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసే. తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తొలి శతకం వృషాధిప శతకం, తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన కావ్య రత్నాలు. సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీన్ని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షులుగా ప్రసిద్ధ తెలంగాణ కవి నందిని సిధారెడ్డిని నియమించి సారథ్య బాధ్యతలు వారికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతీ విద్యార్థిం ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం. లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన వేదికగా.. రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, పలు ఇతర వేదికలుగా మహాసభలు వైభవంగా జరుగబోతున్నాయి. తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగులను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాసభల్లో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. -
డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ
-
ప్రపంచ తెలుగు మహాసభలపై కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. భాషా ప్రేమికులందరినీ మహాసభలకు ఆహ్వానిస్తామని కేసీఆర్ వెల్లడించారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ నిధులపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ సంక్షేమంపై సవివరంగా చర్చిద్దామని, అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయాలని అన్నారు. సభలో చర్చిస్తేనే ఎస్సీల సంక్షేమానికి ఎవరేం చేశారో తెలుస్తుందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సంక్షేమమే తమ థ్యేయమని కేసీఆర్ తెలిపారు. అలాగే ఎస్సీ నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే.. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టాయని ఆయన విమర్శించారు. -
తెలుగు మహాసభలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహాసభల నిర్వహణపై సీఎస్ సమీక్ష సమావే శం నిర్వహించారు. వివిధ అంశాలకు సంబంధించి సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వారికి తగు బాధ్యతలు, నిధులు అప్పగించి నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. వేదికల వద్ద ఏర్పాట్లు, భోజన వసతి, అలంకరణ అంశాలపై సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల నుంచి పాల్గొనే అధ్యాపకులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరారు. పాఠశాల, కళాశాల, వర్సిటీ విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సాహిత్యానికి సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నట్లు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎ.శ్రీధర్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డి.ప్రభాకర్‌రావు, వివిధ శాఖల ఉన్నాతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ముంబై వర్సిటీలో తెలుగు శాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తొలిసారి కానప్పటికీ.. తెలంగాణ వచ్చాక మొదటిసారి జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ ప్రత్యేకతను నిరంతరం గుర్తు చేసేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ప్రవాస తెలుగువారుండే ప్రాంతాల్లో గుర్తుండిపోయే పనులు చేపట్టాలని సభ నిర్వాహ కమిటీ నిర్ణయించింది. దాదాపు 10 లక్షలకుపైగా తెలుగువారుండే మహారాష్ట్రలో.. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో తెలుగు బోధన, ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముంబై–తెలుగు వర్సిటీలు ఒప్పందం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రించి మహారాష్ట్రలోని తెలుగు బోధించే పాఠశాలలకు పంపడం, అక్కడ తెలుగు ఉపాధ్యాయుల నియామకం సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం ప్రారంభించింది. స్థానికుల ఆకాంక్షతో.. మహాసభలను విజయవంతం చేసే క్రమంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్వాహక కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. ఆయా నగరాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముంబైలో పర్యటించారు. విద్యా బోధన తెలుగులో లేక.. పిల్లల్లో భాషాభిమానం పెంపొందించేందుకు తెలుగు బోధన అవసరమని రమణాచారి, సిధారెడ్డికి అక్కడి స్థానిక తెలుగు కవులు సంగనేని రవీందర్, అమ్మన్న జనార్దన్, సుదర్శన్ వివరించారు. తెలుగు పుస్తకాల పంపిణీ, తెలుగు ఉపాధ్యాయుల నియామకం, ముంబై వర్సిటీలో తెలుగు శాఖ ఏర్పాటు విషయమై చర్చించారు. ఈ విషయాలను వారు మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు వివరించగా సానుకూలంగా స్పందించిన గవర్నర్.. అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ముంబై నుంచి వెయ్యి మంది ‘మహాసభల కోసం మహారాష్ట్రలోని తెలుగువారు ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి 1,000 మంది వరకు అక్కడి నుంచి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాసభల సమయంలో ప్రత్యేక రైలు నడపాలని గట్టిగా కోరారు’ – రమణాచారి ప్రత్యేకంగా ఓ పూట చర్చ ‘ఇతర నగరాల్లోని తెలుగువారు భాషా విషయమై ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించేందుకు తెలుగు మహా సభల్లో ప్రత్యేకంగా ఓ పూట కేటాయించాలని అనుకుంటున్నాం. ఆయా ప్రాంతాల ప్రముఖులు వెలుబుచ్చే అంశాల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా చర్చ ఉంటుందని ఆశిస్తున్నాం’ – నందిని సిధారెడ్డి -
మెట్రో నగరాల తెలుగు ప్రముఖులనూ ఆహ్వానిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పెద్ద నగరాల్లో ఉన్న తెలుగువారిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు ఈనెల 4, 5 తేదీల్లో కోర్‌కమిటీ సభ్యులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. అక్కడి తెలుగు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందించి ఆన్లైన్లో వారుపేర్లు నమోదు చేసుకునేలా చూస్తారని వెల్లడించారు. బుధవారం ఆయన రాష్ట్ర అధి కార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంక టేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణతో కలసి సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సాహితీ సంస్థలు, సాహితీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సహకారా న్ని కోరామన్నారు. రవీంద్రభారతి ప్రాంగణం లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. -
డిసెంబర్లో తెలుగు సంరంభం
15వ తేదీ నుంచి 19 వరకు ప్రపంచ మహాసభలు: సీఎం కేసీఆర్ - ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం - ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు - దేశ, విదేశాల్లోని తెలుగు పండితులు, కవులకు ఆహ్వానం - స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు పోటీలు - హైదరాబాద్‌లో సినారె స్మారక మందిరం - ప్రారంభ, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి - మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అందుకు సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్వహణ ఖర్చుల కింద సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. అక్టోబర్‌లోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కానీ అక్టోబర్ 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్‌లోనే జరగనుంది. నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రెండు కార్యక్రమాలు అత్యంత కీలకమైనవి కావటంతో అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. అందుకే డిసెంబర్‌కు వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మహాసభల ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఇందులో పాల్గొన్నారు. మహాసభలపై నిర్ణయాలివీ.. ► ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తారు. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగళి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి ► ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చాగోష్టులు నిర్వహించాలి. ► ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పాటలు, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపు పాట, నాటు పాట, వినోద ప్రక్రియలు, తానీషా–రామదాసు, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహిస్తారు. ► వివిధ రకాల నాటక ప్రక్రియలు.. ఆదివాసీ, గిరిజన, శాస్త్రీయ, జానపద నృత్యాలు, మహిళలు పాడే పాటలు కళ్లకు కట్టేలా ప్రదర్శనలుండాలి ► దేశ, విదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను మహాసభలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలి ► దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం చాటి చెప్పే సమావేశాలు నిర్వహించాలి. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో పాటు మారిషస్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. దేశ నలుమూలల్లో తెలుగువారు నివసించే ముఖ్యమైన పట్టణాలన్నింటా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి ► కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలి ► తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానించాలి ► అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. తెలంగాణ దర్శిని పేరుతో డాక్యుమెంటరీ తయారు చేయాలి ► నగరంలో సి.నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలి. రెండు మూడ్రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి ► పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి. ► ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ను అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొనాలి. ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అన్ని స్కూళ్లలో తెలుగు తప్పనిసరి ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణలో తొలిసారిగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యాసంస్థలను కోరారు. తెలుగును సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో తెలుగు మహాసభలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలన్నారు. సాహిత్య అకాడమీ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. బోర్డులన్నీ తెలుగులోనే..: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై బోర్డులను కచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలుగులో తప్పకుండా బోర్డులు ఉండాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని అన్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాల పట్ల ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హర్షం వ్యక్తంచేశారు. -
25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ నెల 25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనుంది. కాగా ప్రతి నెలా 1న ఉద్యోగులకు నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. లాగే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించాలని ఆదేశించారు. దీంతో అయిదు రోజుల ముందుగానే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకోనున్నారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల బోర్డులు ఇకపై తెలుగులోనే రాయాలని ఆదేశాలు జారీ చేశారు.