
మానవ పరిణామ క్రమంలో భాష పాత్ర అసాధారణం. బుద్ధిజీవులైన మనుషుల పరస్పర భావ మార్పిడి ప్రక్రియలో ప్రత్యామ్నాయం లేని ఉత్కృష్ట సాధనమిది. మానవ సమూహాల, జాతుల వికాసంతో నేరుగా ముడివడిన భాషలు కూడా క్రమ వికాసం పొందుతూ వచ్చాయి, పొందుతున్నాయి, పొందాలి. భాష మనుగడకు వాడుకే జీవగర్ర. అన్ని భాషల్లాగే తెలుగుకూ వివిధ స్థాయి ప్రయోజనాలున్నాయి. భావ వినిమయానికే కాక సంస్కృతి పరిరక్షణలో, వారసత్వ సంపదల్ని కాపాడ్డంలో, కళలను పరిపుష్టపరచడంలో... ఇలా భాష ఉపయోగాలెన్నెన్నో! మనిషి జీవన ప్రస్థానంలో అత్యున్నత ఆశయమైన ఆనందమయ జీవితాన్ని సాకారం చేసుకోవడంలో భాష పోషించే పాత్ర అనితరసాధ్యమైంది. అంతటి కీలకమైన భాషను కాపాడవలసిన బాధ్యత మనందరిదీ. నిర్లక్ష్యం చేసిన ఎన్నో జాతుల మాతృభాషలు కాలగర్భంలో కలిసి, మృతభాషలయ్యాయి. అనునయం పొసగని అన్య భాషలతో తంటాలు పడుతున్న పలు మానవ సమాజాల వికాసం కుంటి నడకే! వారి సృజన గుడ్డి దీపపు మసక కాంతిలో మగ్గుతోంది.
నవతరం బడి పిల్లలు, ఉత్సాహం ఉప్పొంగే యువతరం, భావి తరాల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు, భాష పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు, దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు... భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యూహ–నిర్మాణాత్మక చర్యల ద్వారా భాషలను మననిచ్చే, కాపాడే, వృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి.
గొప్ప సదాశయంతో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇలాంటి విషయాలను ఈ వారం పాటు ఇక్కడ ముచ్చటించుకుందాం.
- దిలీప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment