సమకాలీనం
తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు రావటం లేదు. అందువల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు.
‘‘ఒక మాటకు ఒక అర్థం. అదీ న్యాయం. కాని, ఈ ప్రపంచంలో చూడండి! ఒక మాటకు పది అర్థాలు. ఒక అక్షరానికి లక్ష అర్థాలు. శ్రీ అనే అక్షరం, లేదా మాట, చూడండి–ఎన్ని అర్థాలో!
ఇక రెండో కొసను: ఒక అర్థానికే కోటి పదాలు, ఉదాహరణ, స్త్రీ, స్త్రీ వాచకానికి పర్యాయపదాలు ఇంతవరకు సంపుటీకరించిన శాస్త్రి గారెవరూ నాకు కనబడలేదు. ఈ పదార్థాల నిరంకుశత్వాన్ని భరించలేడు నవకవి! ఒక పదం అనేక అర్థాలను అంతఃపురంలో దాచుకునే వివాహం, ఒక అర్థం అనేక పదాలతో విచ్చలవిడిగా విహరించే వ్యభిచారం......’’ –శ్రీశ్రీ
తెలుగు భాషను సుసంపన్నం చేసిన ‘నానార్థాలు’, ‘పర్యాయపదాల’ను ఇంత బాగా విశ్లేషించిన వారు లేరేమో! 1939 లో ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు ఈ వ్యాఖ్య చేశారు. ఏడున్నర దశాబ్దాల కింద నవకవిలోనే భాషపై అంతటి భిన్నాభిప్రాయం ఉంటే, ఇప్పటి నవతరం ఎలా చూస్తారు? ఎలా చూస్తున్నారు? భాష చలనశీలత కలిగినది. ఎన్నో మార్పులకు గురవుతూ వస్తున్న మన తెలుగుదీ సుదీర్ఘ చరిత్ర, వైభవం. వెయ్యేళ్ల సాంద్ర రచనా సంపత్తి, రెండు వేల ఏండ్ల లిఖిత భాషా ప్రాచీనత, అంతకు పైబడిన ఉనికి మన సొంతం. ఇందులో ఉత్థానపతనాలున్నాయి. ఆయా కాలాల్లో... తెలుగు పరిమళభరితమై విరాజిల్లిన, కల్మషాలను కలగలుపుకొని సాగిన వైవిధ్య గతముంది. కానీ, మునుపెన్నడు లేని తీవ్ర సంక్షుభిత స్థితిని ఇప్పుడు తెలుగు భాష ఎదుర్కొంటోంది. తెలుగు చదవటం, రాయడం పట్ల కొత్తతరం కనీస ఆసక్తిని కూడా కనబరచడం లేది ప్పుడు. కొన్నాళ్లు పోతే తెలుగును కోరేవారే ఉండరేమో! వలసపాలన అవశేషాల్లో ఒకటైన ఆంగ్లంపై భ్రమ, విశ్వమంతటినీ విపణివీధిగా మార్చిన ప్రపంచీకరణ, తల్లి భాష తెలుగుపట్ల గౌరవభావమేలేని నవతరం, వరుస ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి భాషను ప్రమాదపు అంచుకు నెడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేదికనుంచయినా ఓ గొప్ప సంకల్పం భాషోద్ధరణకు దారులు పరవాలి. ఇప్పటికిప్పుడు మాట్లాడుకోవడాలకేం ఇబ్బంది ఉండదేమో కాని, మున్ముందు గడ్డుకాలమే! రాను రాను తెలుగు రాయడం–చదవడం కనుమరుగయ్యే ప్రమాదాన్ని తప్పించాలి. మన దేశంలో అక్షరాస్యతే అంతంత! 40 శాతానికి మించిన అక్షరాస్య జనాభా తల్లిభాషకు దూరమైతే, సదరు భాష స్వల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందనేది ఐక్యరాజ్యసమితి హెచ్చరిక. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే అది తెలుగుకు పతనశాసనమౌతుందని ‘యునెస్కో’ పరిశోధనా ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. తల్లిభాషలోనే ప్రాథమిక స్థాయి విద్యాబోధన నిర్బంధం చేయడంతో సహా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో భాషను బతకనివ్వాలి. అంతర్జాతీయ అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఎంత ముఖ్యమైనా, పిల్లల్లో సహజ సృజన–పరిశోధనాతత్వం వృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి తల్లిభాషలో విద్యాభ్యాసం ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలి. పోటీ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా, పిల్లలు సహజ మేధో వికాసంతో నిలదొక్కుకునేలా విద్యాసంస్థలు పూనిక వహించాలి. అన్యభాషాలంకార పుష్పాలెన్నున్నా, పూలదండలో దారం లాగా తల్లిభాష వారిలో ఇంకేలా చేయాలి. ప్రసారమాధ్యమాలు, ప్రభుత్వాలు, వాటి ఉపాంగాలయిన వివిధ అకాడమీలు భాషపై నిరంతర పరిశోధనల్ని కొనసాగించాలి. కొత్త తరంలో తెలుగుపై ఆసక్తిని, వినియోగంపై అనురక్తిని పెంపొందించే చర్యలుండాలి.
సాధనం వారికే, బాధ్యత వారిదే!
భాషా వికాసంలో ప్రసారమాధ్యమాల, ముఖ్యంగా జనమాధ్యమాల పాత్ర అపారం. జన సమూహాల మధ్య, ప్రజలు–పాలకులకు మధ్య, పరస్పర ప్రయోజనాలున్న పలు పక్షాల నడుమ జన మాధ్యమాలు సంధానకర్తలు. ఈ క్రమంలో భాషే వాటి భావవ్యాప్తికి ఉపకరణం! ఎప్పటికప్పుడు భావ ప్రసరణ నైపుణ్యాల్ని వృద్ధి చేసుకుంటూ భాగస్వాములకు గరిష్ట ప్రయోజనాలు కలిగించే క్రమంలో భాషను ఆ«ధునీకరించడం, అభివృద్ధి చేయడం తమ కర్తవ్యంగానే కాక ఒక అవసరంగా కూడ లోగడ పరిగణించేవారు. అందుకే మొదట్నుంచీ ఈ మాధ్యమంలో క్రియాశీల పాత్ర నెరిపే వారందరికీ భాషకు సంబంధించి బలమైన పునాదులుండేవి. సంపాదకులకు, మీడియాలో వివిధ స్థాయి నిర్వహకులకు సాహిత్యంతో సాంగత్యం ఆ రోజుల్లో సహజం. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాతి తొలి దశాబ్దాల్లో కూడా అటు సాహితీ శ్రేష్ఠుల్లో పాత్రికేయ అనుభవజ్ఞులు, ఇటు జర్నలిస్టుల్లో సాహితీ మూలాలున్న వారు ఎక్కువగా కనిపించేవారు. కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, బండి గోపాలరెడ్డి (బంగోరె), సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, అడవి బాపిరాజు, నండూరి రామ్మోహనరావు తదితరులతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు–ముళ్లపూడి వెంకటరమణ, గజ్జెల మల్లారెడ్డి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ.... తదితరులు రెండు పాత్రల్ని సమర్థంగా నిర్వహించిన వారే! సాహిత్యం–పాత్రికేయం, రెండు రంగాల్లో ప్రావీణ్యమున్న అటువంటి ముఖ్యుల నేతృత్వంలో దినపత్రికల నుంచి వార, మాస, త్రైమాసిక, వార్షిక ఇలా రకరకాల పత్రికలు, టీవీ తదితర మాధ్యమాలు వేర్వేరు రూపాల్లో భాషాభివృద్ధి జరిపేవి. ఇటీవలి పరిణామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భాషకు సంబంధించిన పూర్ణ అవగాహన లేకున్నా, లోతుపాతులు తెలియకున్నా... ఇతరేతర అర్హతలతో మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నేతృత్వం వహిస్తున్నారు, ప్రధాన జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారు. భాషా వికాసం సంగతలా ఉంచి, భాషపైన శ్రద్ధ కూడా తగ్గింది. తప్పొప్పుల్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు పట్ల కనీస గౌరవం, మర్యాద లేని వారు కీలక స్థానాలు అలంకరిస్తున్నారు. భాషాభివృద్ధికి దోహదపడాల్సిన పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు అపప్రయోగాలతో భాషను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు పెరిగాయి. మీడియా అలక్ష్యం, లెక్కలేనితనం వల్లే భాష సంకరమైపోతోందనేది ఆరోపణ. ఇంగ్లిష్ శరవేగంగా తెలుగు సమాజపు దైనందిన భాషా వాడకంలోకి, సంభాషణల్లోకి చొచ్చుకు వచ్చేసింది. ఈ పరిణామం తెలుగు అస్తిత్వానికే ప్రమాదకారిగా మారిందనే భావన బలపడుతోంది. దీన్ని పరిహరించాల్సిన మాధ్యమాలు, భాషా సంకరానికి తామే కారణమౌతున్నాయని, ముఖ్యంగా టీవీపైన ఈ విషయంలో ఘాటైన విమర్శ ఉంది. ఇదంతా దాదాపు రెండు దశాబ్దాల పరి ణామం. చేతన, స్పృహతో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానైనా ఈ దిశలో అడుగులు పడతాయేమోనన్నది ఒక ఆశ!
ఈ పండుగైనా శ్రీకారం చుట్టాలి...
తెలుగు ప్రపంచ పండుగకు ఇల్లలికారు. ఈ రోజునుంచే పండుగ మొదలు. ప్రతి పండుగా ఇంటిల్లిపాదికీ ఉల్లాసం కలిగించేదే! నిరంతర కాలప్రవాహంలో అప్పుడప్పుడు పండుగలతో సంబురాలు చేసుకోవడం మన సంస్కృతిలో భాగం! ఈ అయిదొద్దుల పండుగకు ఎన్నెన్నో వేదికలు, మరెన్నో వేడుకలు. ఒక జాతిని సమైక్యపరుస్తున్న తెలుగు భాషా వైభవాన్ని తలచుకోవడం, ఉన్నతిని చాటుకోవడం, తాజా స్థితిని సమీక్షించుకోవడం, వీలయినంత బాగుచేసుకోవడం, కనుమరుగు ప్రమాదమున్న చోట కాపాడుకోవడం.... ఇలా అనేక లక్ష్యాలతో పండుగ నిర్వాహకులు పలు కార్యక్రమాలు రూపొం దించారు. ఏకకాలంలో వివిధ వేదికల నుంచి ఈ వేడుకలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచీ కవులు, రచయితలు, భాషావేత్తలు, పరిశోధకులు, వ్యవహారకర్తలు, భాషాభిమానులు ఇతర ఔత్సాహకులు హైదరాబాద్‌కు దారికట్టారు. తెలుగు భాషను ప్రేమించేవారికిది సంతోషం. ఈ చర్యల పట్ల విశ్వాసం లేని వారూ ఉన్నారు. ఈ సభలను తాము బహిష్కరిస్తున్నట్టు విప్లవకవి వరవరరావు తదితరులు బహిరంగ ప్రకటన చేశారు. 47 ఏళ్ల కిందటి ఒక కరపత్రాన్ని కొందరు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ‘....కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?’ అని గొప్ప కథారచయిత కొడవటిగంటి కుటుంబరావు పేరిట, అప్పట్లో (1970) వ్యాప్తిలోకి వచ్చిన కరపత్రమది. విశాఖ–హైదరాబాద్‌ల నడుమ, మహాకవి శ్రీశ్రీ కేంద్ర బిందువుగా ఈ పరిణామాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగాయి. భిన్న వాదనలతో సాహితీవేత్తల సమూహం నిలువునా చీలిపోయింది. తనను సత్కరించేందుకు తలపెట్టిన సదస్సుకు, ముందే ప్రకటించి శ్రీశ్రీ గైర్హాజరయ్యారు. భాషాభివృద్దికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు మద్దతెంత లభిస్తుందో, కొన్నిసార్లు వ్యతిరేకతా అంతే ఉంటుంది. అందుకు, వేర్వేరు కారణాలుండవచ్చు. కానీ, భాషను కచ్చితంగా అమలుపరచే విషయమై ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కొరవడ్డ సందర్భాలు కోకొల్లలు. తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు తయారవటం లేదు. ఇవేవీ లేకపోవటం వల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ఇవన్నీ జరిగేలా ఈ పండుగ నుంచి ఒక కార్యాచరణ పుట్టాలి. దాని అమలుకు ప్రభుత్వం కట్టుబడాలి.
ఇంగ్లిష్ ప్రభావం నుంచి బయటపడాలి
తెలుగు భాషను ఆధునీకరించుకోవాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. మాండలికాలు ప్రామాణిక జాబితాలో చేరి విరివిగా వాడకంలోకి రావాలి. జనం పలుకుబడిలో నలిగిన అన్య భాషాపదాల ఆదానప్రదానాలు జరిగి స్థిరీకరణ పొందాలి. పదసంపద పెరిగి, తల్లిభాషలో తెలుగువారి అభివ్యక్తి రాటుతేలాలి. జనసామాన్యం తిరగాడే చోట నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలనే ఒక నిర్బంధాన్నీ అమలు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల పేర్లను తెలిపే ఫలకాలూ ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగు మాటే ఉండదు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, విభిన్న స్థాయిల్లోని కోర్టు ఉత్తర్వులు.... ఇలా అన్నీ అన్యభాషలోనే! పాక్షిక న్యాయ విభాగాల్లోనూ అంతే! తెలుగులో ఫిర్యాదు, తెలుగులో విచారణ, తెలుగులో సాక్షి వాంగ్మూలం నమోదు, తెలుగులో వాద–ప్రతివాదనలు.... కానీ, తీర్పులు ఇంగ్లిష్‌లో! ఇంకెప్పటికి పరి స్థితి మారుతుంది? దీన్నుంచి మనం బయటపడాలి. 52 ఏళ్లకింద డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా చెప్పిన ఒక మాటతో ముగిస్తాను. దేశంలో తలెత్తిన భాషాపరమైన అల్లర్లపై 1965, ఫిబ్రవరి 23న కేంద్రం తలపెట్టిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని, 19న మన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ప్రతిపాదన వెల్లడించారు. అందులో 6వ అంశం ఇలా ఉంది. ‘‘తమ ప్రాంతాల నుంచి ఇంగ్లిష్ భాషను తొలగించుకున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కూడా ఇంగ్లిష్‌ను తొలగించుకోవాలి. కేవలం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లిష్‌ను తొలగించినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా, ఈ భ్రమోత్పాదక స్థితివల్ల నష్టం కూడా సంభవించవచ్చు.’’
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
దిలీప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment