సందర్భం
నేటి నుండి 19వ తేదీ వరకు తెలుగు పండుగ జరుగుతుంది. ఈ వేడుక కోసం ప్రపంచం నలుమూలల నుండి తెలంగాణ బిడ్డలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భాషాప్రియులు పెద్ద ఎత్తున హైదరాబాదు తోవ పట్టారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులందరినీ స్మరించుకోవడం, వర్తమానంలో మన భాష స్థితిని విశ్లేషించుకోవడం, భవిష్యత్తులో తెలుగు భాషాభివృద్ధికి మార్గాన్ని నిర్దేశించుకోవడం అన్నవి ప్రధాన అంశాలుగాముందుకు సాగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
మాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ. అందుకే ‘తెలుగు’ అనే పదాన్ని తొలిసారి వాడిన వారైనా, గొప్ప కావ్యాలను అచ్చ తెలుగులో సృజన చేసిన వారిలో, ప్రజల భాషలో, జాను తెలుగులో రచనలు చేసిన వారిలో, వివిధ సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. సమైక్య రాష్ట్రంలో పరాయిపాలనలో మన వైభవాన్ని చాటుకునే వేదికలు మనకు దక్కలేదు. ఈ సందర్భంలో పెద్దలు చెప్పినట్టుగా ‘వినయానికి విరుద్ధమైనా’ కొన్ని సందర్భాలలో ఘనమైన మన గతాన్ని మనమే చెప్పుకోవాలి.
- పాల్కురికి సోమన –తొలి తెలుగు స్వతంత్ర రచన బసవ పురాణం– పాల్కురికి సోమన
- తొలి తెలుగు శతకం –వృషాధిప శతకం
- తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం– పండితారాధ్య చరిత్ర
- తొలి ఉదాహరణ కావ్యం – బసవోదాహరణం
- తెలుగు పదం వాడిన మొదటి కవి–పాల్కురికి సోమన
- గోన బుద్దారెడ్డి – రంగనాథ రామాయణం, తొలి తెలుగు రామాయణం–ద్విపద రామాయణం
- కుప్పాంబిక– తొలి తెలుగు కవయిత్రి– గోన బుద్దారెడ్డి బిడ్డ– బూదపూర్ శాసనం మహబూబ్‌నగర్ జిల్లా
- తొలి తెలుగు జంట కవులు– కాచ భూపతి, విఠలనాథుడు(గోన బుద్దారెడ్డి కుమారులు)
- తెలుగులో తొలి పురాణం– జినేంద్ర పురాణం, పంపకవి రాశాడు.
- జిన వల్లభుడు– పంపకవి తమ్ముడు. 3 తెలుగు కంద పద్యాలు రచించి, కురిక్యాల దగ్గర శాసనం వేయించాడు. (పై రెండూ తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఆధారాలుగా ఉపయోగపడ్డాయి)
- తొలి తెలుగు లక్షణ గ్రంథం– కవి జనాశ్రయం– మల్లియ రేచన రాశాడు.
- తెలుగులో తొలి చంపు రామాయణం– భాస్కర రామాయణం.
- తొలి నాట్యశాస్త్ర గ్రంథం– జయప సేనాని రాసిన నృత్య రత్నాకరం.
- తెలుగులో వచ్చిన తొలి పురాణం– మార్కండేయ పురాణం. మారన కవి తెలుగులోకి అనువదించాడు
- తొలి తెలుగు వచన కవి, తెలుగులో భజన సాంప్రదాయానికి ఆద్యుడు– కృష్ణమాచార్యుడు (మహబూబ్‌నగర్)
- తెలుగులో తొలి భాగవతం– పోతన భాగవతం
- తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకం –భోగినీ దండకం
- తొలి అచ్చ తెలుగు కావ్యం– యయాతి చరిత్రం– పొన్నగంటి తెలగన రాశాడు.(పటాన్‌చెరువు)
- తెలుగులో తొలి సంకలనం–– మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతం.
- తొలి కథా సంకలన కావ్యం– సింహాసన ద్వాత్రింశిక – కొఱవి గోపరాజు. (నిజామాబాద్, భీమ్‌గల్)
- తొలి నీతి శతకం– బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి (సుమతి శతకం)
- తొలి తెలుగు యక్షగానం–– 1వ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్ర.
- సంస్కృత కావ్యం రచించిన తొలి తెలుగు మహిళ– గొంగాదేవి కాకతీయుల ఆడపడుచు.
- తొలి కల్పిత ప్రబంధం ––నూతన కవి సూరన రాసిన ధనాభిరామం.
- తెలుగులో తొలి చారిత్రక వచన గ్రంథం–ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర.
- భైరవ కవి– బంధ కవిత్వానికి ఆద్యుడు.
- ప్రతాపరెడ్డి సురవరం –ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
- తొలి నిరోష్ట్య కావ్యం, నిరోష్ట్య రామాయణం– మిరింగంటి సింగరాచార్యులు దశరథ రాజ నందన చరిత్ర
- తొలి తెలుగు నవల – కంబుకంధిర చరిత్ర, తడకయల్ల కృష్ణారావు
- తొలి తెలుగు కథా రచయిత్రి– బండారు అచ్చమాంబ– ధనత్రయోదశి అనే కథ –‘హిందూ సుందరి’ పత్రికలో వెలువడింది.
- తెలుగులో తొలి దళిత కవి– చింతపల్లి దున్న ఇద్దాసు
ఈ విధంగా ఎన్నో సాహితీ ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది. తెలుగు సారస్వత చరిత్రలో తెలంగాణ నుండి అనేక మంది కవులు, రచయితలు తమదైన ముద్రలు వేశారు. ఇప్పటివరకు పైన ఉదహరించినవి అందులో కొన్ని మాత్రమే.
ఆ గత వైభవాన్ని కొనసాగించి, ఘనమైన తెలంగాణ వారసత్వాన్ని నిలబెట్టే నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తెలుగును పరిరక్షించేందుకు, ఒక విస్తృత జీవభాషగా భవిష్యత్తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1 నుండి 12వ తరగతివరకు తెలుగు భాషను తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామ ఫలకాలను తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంది. తెలంగాణలో సాహిత్య సేవకై తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి ఐదుకోట్ల రూపాయలు కేటాయించింది. అకాడమీ పుస్తకాల్లో తెలంగాణ యాస/మాండలికం సగౌరవంగా స్థానం పొందింది. అంతేకాక ప్రభుత్వ పాలనా వ్యవహారాలను తెలుగులో కొనసాగించేందుకు నడుం బిగించింది. భాషాప్రియులైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగుకు మహర్దశ సాధించేందుకు అవసరమైన విధానాలను అమలు చేస్తుంది. తెలంగాణలో దశదిశలా తెలుగు వెలుగులు విరజిమ్మడానికి, తెలంగాణ ఖ్యాతి ఎల్లెడలా ప్రవహించడానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భం నాంది అవుతుంది. జై తెలంగాణ.
వ్యాసకర్త నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత
Comments
Please login to add a commentAdd a comment