Prapancha Telangana Mahasabhalu
-
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు
ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా డిసెంబర్ 29న జరిగిన - 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) ఘనంగా జరిగింది. విశిష్టఅతిథులుగా – అభ్యుదయ సాహిత్యం: డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి- సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అధ్యక్షులు: అరసం, వేల్పుల నారాయణ - ప్రముఖ రచయిత, అధ్యక్షులు: తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి: అఖిలభారత అరసం; దిగంబర సాహిత్యం: (దిగంబర కవులు) నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి) – దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకులు; నగ్నముని (మానేపల్లి హృషీ కేశవరావు) – దిగంబర కవి, ప్రముఖ కవి, నాటకరచయిత, నాస్తికులు; పైగంబర సాహిత్యం: (పైగంబర కవులు) కిరణ్ బాబు (రావినూతల సుబ్బారావు) - పైగంబర కవి, రచయిత, సంపాదకులు; వోల్గా (డా. పోపూరి లలితకుమారి) – పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; రజాహుస్సేన్ - కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు; విప్లవ సాహిత్యం: (విప్లవ రచయితల సంఘం - విరసం): అరసవిల్లి కృష్ణ, విప్లవ కవి. అధ్యక్షులు: విరసం. సాహిత్యం కాలంతో పాటు ప్రవహించే ఓ వాహిక.. కాలగతిలో సామాజిక పరిణామాలకు అనుగుణంగా సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. వాటి ప్రభావం సామాజిక మార్పులకు దోహదపడుతుందని వక్తలు ఉద్ఘాటించారు. ’తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన అంతర్జాల సాహిత్య చర్చాకార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక చైతన్యావసరాన్ని వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడంవల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని చెప్పారు. జనాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వోద్యమాలపై కూలంకష చర్చజరిగింది. అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి డా. రాచపాళెం ప్రసంగించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని ఆన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికోసం అరసం ఆవిర్భవించిందన్నారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ అరసం ఆవశ్యకతను, ఆచరణను వివరించారు. దిగంబరకవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్, నగ్నముని ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని ఆయన తిప్పి కొట్టారు. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం ట్రీట్మెంట్ తప్పలేదన్నారు. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి..లేపకు.. పీక నులిమి గోతిలోకి లాగుతాడు.. ప్రభందాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు.. కుచములు ఎవరూ ఎక్కని పర్వతాగ్రములు తలను ఢీకొని బద్దలు కొట్టు. భావకవుల నపుంసక హావభావాలకు సవాలు; అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్”!! అంటూ తన స్వీయ కవిత చదివి వినిపించారు. నిఖిలేశ్వర్.. ఇందులో శృంగార మేంలేదని, నిద్రపోతున్న యువతను తట్టిలేపడానికి ఈ మోతాదులో వ్రాయాల్సి వచ్చిందన్నారు. నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేం కాదని నగ్నముని అన్నారు. దిగంబరకవిగా అరెస్ట్ అయి ప్రభుత్వోద్యోగాన్ని కూడా కోల్పాయనన్నారు. సిద్ధాంత ప్రాతిపదికనే జనచైతన్యం కోసం దిగంబరకవులు. కవిత్వం రాశారన్నారు. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా…దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందన్నారు. పైగంబర కవి ఓల్గా మాట్లాడుతూ.. నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులకు మేల్కొల్పుగా పైగంబర కవిత్వం ఆవిర్భవించిందన్నారు. పైగంబర కవులు మానవతకు పెద్దపీటవేశారని చెప్పారు. మరో పైగంబరకవి కిరణ్ బాబు..పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను వివరంగా తెలియజేశారు. “మేము పైగంబరులం మాది ఒక తపస్సు మా కవితా దీపికలు విడదీస్తవి గాఢ తమస్సు ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి ఎటుపోయేందుకు దారి చూపదు”.. 1970 నాటి సామాజిక పరిస్థితుల్ని చూసి, తట్టుకోలేక అయిదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలంపట్టామని చెప్పారు. విరసం తరపున అరసవిల్లికృష్ణ మాట్లాడారు. విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవెల్లి వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, చివరకు రాయకుండానే దూరమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ శుభాకాంక్షలందజేశారు. అమెరికామ్రేడ్స్ గా పిలువబడే లెనిన్ వేముల, కిరణ్మయి గుంట (వేముల) అనంత్ మల్లవరపు బృందం సందర్భోచితం గా పాటలు గానం చేసి, కవితా పఠనం చేశారు. కార్యక్రమం ఆసక్తికరంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, వికాసం, వాటి ఆనుపానులగురించి చక్కటి చర్చ జరిగింది. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె లో వీక్షించవచ్చును.https://www.youtube.com/live/j00sevVGbzE?si=gXSmem5xRkW3EJuX -
తెలుగుకు తొలి వందనం
సందర్భం నేటి నుండి 19వ తేదీ వరకు తెలుగు పండుగ జరుగుతుంది. ఈ వేడుక కోసం ప్రపంచం నలుమూలల నుండి తెలంగాణ బిడ్డలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి భాషాప్రియులు పెద్ద ఎత్తున హైదరాబాదు తోవ పట్టారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులందరినీ స్మరించుకోవడం, వర్తమానంలో మన భాష స్థితిని విశ్లేషించుకోవడం, భవిష్యత్తులో తెలుగు భాషాభివృద్ధికి మార్గాన్ని నిర్దేశించుకోవడం అన్నవి ప్రధాన అంశాలుగాముందుకు సాగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ. అందుకే ‘తెలుగు’ అనే పదాన్ని తొలిసారి వాడిన వారైనా, గొప్ప కావ్యాలను అచ్చ తెలుగులో సృజన చేసిన వారిలో, ప్రజల భాషలో, జాను తెలుగులో రచనలు చేసిన వారిలో, వివిధ సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. సమైక్య రాష్ట్రంలో పరాయిపాలనలో మన వైభవాన్ని చాటుకునే వేదికలు మనకు దక్కలేదు. ఈ సందర్భంలో పెద్దలు చెప్పినట్టుగా ‘వినయానికి విరుద్ధమైనా’ కొన్ని సందర్భాలలో ఘనమైన మన గతాన్ని మనమే చెప్పుకోవాలి. పాల్కురికి సోమన –తొలి తెలుగు స్వతంత్ర రచన బసవ పురాణం– పాల్కురికి సోమన తొలి తెలుగు శతకం –వృషాధిప శతకం తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం– పండితారాధ్య చరిత్ర తొలి ఉదాహరణ కావ్యం – బసవోదాహరణం తెలుగు పదం వాడిన మొదటి కవి–పాల్కురికి సోమన గోన బుద్దారెడ్డి – రంగనాథ రామాయణం, తొలి తెలుగు రామాయణం–ద్విపద రామాయణం కుప్పాంబిక– తొలి తెలుగు కవయిత్రి– గోన బుద్దారెడ్డి బిడ్డ– బూదపూర్ శాసనం మహబూబ్‌నగర్ జిల్లా తొలి తెలుగు జంట కవులు– కాచ భూపతి, విఠలనాథుడు(గోన బుద్దారెడ్డి కుమారులు) తెలుగులో తొలి పురాణం– జినేంద్ర పురాణం, పంపకవి రాశాడు. జిన వల్లభుడు– పంపకవి తమ్ముడు. 3 తెలుగు కంద పద్యాలు రచించి, కురిక్యాల దగ్గర శాసనం వేయించాడు. (పై రెండూ తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఆధారాలుగా ఉపయోగపడ్డాయి) తొలి తెలుగు లక్షణ గ్రంథం– కవి జనాశ్రయం– మల్లియ రేచన రాశాడు. తెలుగులో తొలి చంపు రామాయణం– భాస్కర రామాయణం. తొలి నాట్యశాస్త్ర గ్రంథం– జయప సేనాని రాసిన నృత్య రత్నాకరం. తెలుగులో వచ్చిన తొలి పురాణం– మార్కండేయ పురాణం. మారన కవి తెలుగులోకి అనువదించాడు తొలి తెలుగు వచన కవి, తెలుగులో భజన సాంప్రదాయానికి ఆద్యుడు– కృష్ణమాచార్యుడు (మహబూబ్‌నగర్) తెలుగులో తొలి భాగవతం– పోతన భాగవతం తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకం –భోగినీ దండకం తొలి అచ్చ తెలుగు కావ్యం– యయాతి చరిత్రం– పొన్నగంటి తెలగన రాశాడు.(పటాన్చెరువు) తెలుగులో తొలి సంకలనం–– మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతం. తొలి కథా సంకలన కావ్యం– సింహాసన ద్వాత్రింశిక – కొఱవి గోపరాజు. (నిజామాబాద్, భీమ్‌గల్) తొలి నీతి శతకం– బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి (సుమతి శతకం) తొలి తెలుగు యక్షగానం–– 1వ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రచించిన సారంగధర చరిత్ర. సంస్కృత కావ్యం రచించిన తొలి తెలుగు మహిళ– గొంగాదేవి కాకతీయుల ఆడపడుచు. తొలి కల్పిత ప్రబంధం ––నూతన కవి సూరన రాసిన ధనాభిరామం. తెలుగులో తొలి చారిత్రక వచన గ్రంథం–ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర. భైరవ కవి– బంధ కవిత్వానికి ఆద్యుడు. ప్రతాపరెడ్డి సురవరం –ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. తొలి నిరోష్ట్య కావ్యం, నిరోష్ట్య రామాయణం– మిరింగంటి సింగరాచార్యులు దశరథ రాజ నందన చరిత్ర తొలి తెలుగు నవల – కంబుకంధిర చరిత్ర, తడకయల్ల కృష్ణారావు తొలి తెలుగు కథా రచయిత్రి– బండారు అచ్చమాంబ– ధనత్రయోదశి అనే కథ –‘హిందూ సుందరి’ పత్రికలో వెలువడింది. తెలుగులో తొలి దళిత కవి– చింతపల్లి దున్న ఇద్దాసు ఈ విధంగా ఎన్నో సాహితీ ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది. తెలుగు సారస్వత చరిత్రలో తెలంగాణ నుండి అనేక మంది కవులు, రచయితలు తమదైన ముద్రలు వేశారు. ఇప్పటివరకు పైన ఉదహరించినవి అందులో కొన్ని మాత్రమే. ఆ గత వైభవాన్ని కొనసాగించి, ఘనమైన తెలంగాణ వారసత్వాన్ని నిలబెట్టే నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తెలుగును పరిరక్షించేందుకు, ఒక విస్తృత జీవభాషగా భవిష్యత్తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1 నుండి 12వ తరగతివరకు తెలుగు భాషను తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామ ఫలకాలను తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంది. తెలంగాణలో సాహిత్య సేవకై తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి ఐదుకోట్ల రూపాయలు కేటాయించింది. అకాడమీ పుస్తకాల్లో తెలంగాణ యాస/మాండలికం సగౌరవంగా స్థానం పొందింది. అంతేకాక ప్రభుత్వ పాలనా వ్యవహారాలను తెలుగులో కొనసాగించేందుకు నడుం బిగించింది. భాషాప్రియులైన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగుకు మహర్దశ సాధించేందుకు అవసరమైన విధానాలను అమలు చేస్తుంది. తెలంగాణలో దశదిశలా తెలుగు వెలుగులు విరజిమ్మడానికి, తెలంగాణ ఖ్యాతి ఎల్లెడలా ప్రవహించడానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భం నాంది అవుతుంది. జై తెలంగాణ. వ్యాసకర్త నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత -
భాషాభివృద్ధికి బాట వేయాలి!
సమకాలీనం తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు రావటం లేదు. అందువల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ‘‘ఒక మాటకు ఒక అర్థం. అదీ న్యాయం. కాని, ఈ ప్రపంచంలో చూడండి! ఒక మాటకు పది అర్థాలు. ఒక అక్షరానికి లక్ష అర్థాలు. శ్రీ అనే అక్షరం, లేదా మాట, చూడండి–ఎన్ని అర్థాలో! ఇక రెండో కొసను: ఒక అర్థానికే కోటి పదాలు, ఉదాహరణ, స్త్రీ, స్త్రీ వాచకానికి పర్యాయపదాలు ఇంతవరకు సంపుటీకరించిన శాస్త్రి గారెవరూ నాకు కనబడలేదు. ఈ పదార్థాల నిరంకుశత్వాన్ని భరించలేడు నవకవి! ఒక పదం అనేక అర్థాలను అంతఃపురంలో దాచుకునే వివాహం, ఒక అర్థం అనేక పదాలతో విచ్చలవిడిగా విహరించే వ్యభిచారం......’’ –శ్రీశ్రీ తెలుగు భాషను సుసంపన్నం చేసిన ‘నానార్థాలు’, ‘పర్యాయపదాల’ను ఇంత బాగా విశ్లేషించిన వారు లేరేమో! 1939 లో ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు ఈ వ్యాఖ్య చేశారు. ఏడున్నర దశాబ్దాల కింద నవకవిలోనే భాషపై అంతటి భిన్నాభిప్రాయం ఉంటే, ఇప్పటి నవతరం ఎలా చూస్తారు? ఎలా చూస్తున్నారు? భాష చలనశీలత కలిగినది. ఎన్నో మార్పులకు గురవుతూ వస్తున్న మన తెలుగుదీ సుదీర్ఘ చరిత్ర, వైభవం. వెయ్యేళ్ల సాంద్ర రచనా సంపత్తి, రెండు వేల ఏండ్ల లిఖిత భాషా ప్రాచీనత, అంతకు పైబడిన ఉనికి మన సొంతం. ఇందులో ఉత్థానపతనాలున్నాయి. ఆయా కాలాల్లో... తెలుగు పరిమళభరితమై విరాజిల్లిన, కల్మషాలను కలగలుపుకొని సాగిన వైవిధ్య గతముంది. కానీ, మునుపెన్నడు లేని తీవ్ర సంక్షుభిత స్థితిని ఇప్పుడు తెలుగు భాష ఎదుర్కొంటోంది. తెలుగు చదవటం, రాయడం పట్ల కొత్తతరం కనీస ఆసక్తిని కూడా కనబరచడం లేది ప్పుడు. కొన్నాళ్లు పోతే తెలుగును కోరేవారే ఉండరేమో! వలసపాలన అవశేషాల్లో ఒకటైన ఆంగ్లంపై భ్రమ, విశ్వమంతటినీ విపణివీధిగా మార్చిన ప్రపంచీకరణ, తల్లి భాష తెలుగుపట్ల గౌరవభావమేలేని నవతరం, వరుస ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి భాషను ప్రమాదపు అంచుకు నెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేదికనుంచయినా ఓ గొప్ప సంకల్పం భాషోద్ధరణకు దారులు పరవాలి. ఇప్పటికిప్పుడు మాట్లాడుకోవడాలకేం ఇబ్బంది ఉండదేమో కాని, మున్ముందు గడ్డుకాలమే! రాను రాను తెలుగు రాయడం–చదవడం కనుమరుగయ్యే ప్రమాదాన్ని తప్పించాలి. మన దేశంలో అక్షరాస్యతే అంతంత! 40 శాతానికి మించిన అక్షరాస్య జనాభా తల్లిభాషకు దూరమైతే, సదరు భాష స్వల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందనేది ఐక్యరాజ్యసమితి హెచ్చరిక. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే అది తెలుగుకు పతనశాసనమౌతుందని ‘యునెస్కో’ పరిశోధనా ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. తల్లిభాషలోనే ప్రాథమిక స్థాయి విద్యాబోధన నిర్బంధం చేయడంతో సహా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో భాషను బతకనివ్వాలి. అంతర్జాతీయ అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఎంత ముఖ్యమైనా, పిల్లల్లో సహజ సృజన–పరిశోధనాతత్వం వృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి తల్లిభాషలో విద్యాభ్యాసం ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలి. పోటీ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా, పిల్లలు సహజ మేధో వికాసంతో నిలదొక్కుకునేలా విద్యాసంస్థలు పూనిక వహించాలి. అన్యభాషాలంకార పుష్పాలెన్నున్నా, పూలదండలో దారం లాగా తల్లిభాష వారిలో ఇంకేలా చేయాలి. ప్రసారమాధ్యమాలు, ప్రభుత్వాలు, వాటి ఉపాంగాలయిన వివిధ అకాడమీలు భాషపై నిరంతర పరిశోధనల్ని కొనసాగించాలి. కొత్త తరంలో తెలుగుపై ఆసక్తిని, వినియోగంపై అనురక్తిని పెంపొందించే చర్యలుండాలి. సాధనం వారికే, బాధ్యత వారిదే! భాషా వికాసంలో ప్రసారమాధ్యమాల, ముఖ్యంగా జనమాధ్యమాల పాత్ర అపారం. జన సమూహాల మధ్య, ప్రజలు–పాలకులకు మధ్య, పరస్పర ప్రయోజనాలున్న పలు పక్షాల నడుమ జన మాధ్యమాలు సంధానకర్తలు. ఈ క్రమంలో భాషే వాటి భావవ్యాప్తికి ఉపకరణం! ఎప్పటికప్పుడు భావ ప్రసరణ నైపుణ్యాల్ని వృద్ధి చేసుకుంటూ భాగస్వాములకు గరిష్ట ప్రయోజనాలు కలిగించే క్రమంలో భాషను ఆ«ధునీకరించడం, అభివృద్ధి చేయడం తమ కర్తవ్యంగానే కాక ఒక అవసరంగా కూడ లోగడ పరిగణించేవారు. అందుకే మొదట్నుంచీ ఈ మాధ్యమంలో క్రియాశీల పాత్ర నెరిపే వారందరికీ భాషకు సంబంధించి బలమైన పునాదులుండేవి. సంపాదకులకు, మీడియాలో వివిధ స్థాయి నిర్వహకులకు సాహిత్యంతో సాంగత్యం ఆ రోజుల్లో సహజం. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాతి తొలి దశాబ్దాల్లో కూడా అటు సాహితీ శ్రేష్ఠుల్లో పాత్రికేయ అనుభవజ్ఞులు, ఇటు జర్నలిస్టుల్లో సాహితీ మూలాలున్న వారు ఎక్కువగా కనిపించేవారు. కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, బండి గోపాలరెడ్డి (బంగోరె), సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, అడవి బాపిరాజు, నండూరి రామ్మోహనరావు తదితరులతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు–ముళ్లపూడి వెంకటరమణ, గజ్జెల మల్లారెడ్డి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ.... తదితరులు రెండు పాత్రల్ని సమర్థంగా నిర్వహించిన వారే! సాహిత్యం–పాత్రికేయం, రెండు రంగాల్లో ప్రావీణ్యమున్న అటువంటి ముఖ్యుల నేతృత్వంలో దినపత్రికల నుంచి వార, మాస, త్రైమాసిక, వార్షిక ఇలా రకరకాల పత్రికలు, టీవీ తదితర మాధ్యమాలు వేర్వేరు రూపాల్లో భాషాభివృద్ధి జరిపేవి. ఇటీవలి పరిణామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భాషకు సంబంధించిన పూర్ణ అవగాహన లేకున్నా, లోతుపాతులు తెలియకున్నా... ఇతరేతర అర్హతలతో మీడియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నేతృత్వం వహిస్తున్నారు, ప్రధాన జర్నలిస్టులుగా చలామణి అయిపోతున్నారు. భాషా వికాసం సంగతలా ఉంచి, భాషపైన శ్రద్ధ కూడా తగ్గింది. తప్పొప్పుల్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు పట్ల కనీస గౌరవం, మర్యాద లేని వారు కీలక స్థానాలు అలంకరిస్తున్నారు. భాషాభివృద్ధికి దోహదపడాల్సిన పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్సైట్లు అపప్రయోగాలతో భాషను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు పెరిగాయి. మీడియా అలక్ష్యం, లెక్కలేనితనం వల్లే భాష సంకరమైపోతోందనేది ఆరోపణ. ఇంగ్లిష్ శరవేగంగా తెలుగు సమాజపు దైనందిన భాషా వాడకంలోకి, సంభాషణల్లోకి చొచ్చుకు వచ్చేసింది. ఈ పరిణామం తెలుగు అస్తిత్వానికే ప్రమాదకారిగా మారిందనే భావన బలపడుతోంది. దీన్ని పరిహరించాల్సిన మాధ్యమాలు, భాషా సంకరానికి తామే కారణమౌతున్నాయని, ముఖ్యంగా టీవీపైన ఈ విషయంలో ఘాటైన విమర్శ ఉంది. ఇదంతా దాదాపు రెండు దశాబ్దాల పరి ణామం. చేతన, స్పృహతో ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానైనా ఈ దిశలో అడుగులు పడతాయేమోనన్నది ఒక ఆశ! ఈ పండుగైనా శ్రీకారం చుట్టాలి... తెలుగు ప్రపంచ పండుగకు ఇల్లలికారు. ఈ రోజునుంచే పండుగ మొదలు. ప్రతి పండుగా ఇంటిల్లిపాదికీ ఉల్లాసం కలిగించేదే! నిరంతర కాలప్రవాహంలో అప్పుడప్పుడు పండుగలతో సంబురాలు చేసుకోవడం మన సంస్కృతిలో భాగం! ఈ అయిదొద్దుల పండుగకు ఎన్నెన్నో వేదికలు, మరెన్నో వేడుకలు. ఒక జాతిని సమైక్యపరుస్తున్న తెలుగు భాషా వైభవాన్ని తలచుకోవడం, ఉన్నతిని చాటుకోవడం, తాజా స్థితిని సమీక్షించుకోవడం, వీలయినంత బాగుచేసుకోవడం, కనుమరుగు ప్రమాదమున్న చోట కాపాడుకోవడం.... ఇలా అనేక లక్ష్యాలతో పండుగ నిర్వాహకులు పలు కార్యక్రమాలు రూపొం దించారు. ఏకకాలంలో వివిధ వేదికల నుంచి ఈ వేడుకలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచీ కవులు, రచయితలు, భాషావేత్తలు, పరిశోధకులు, వ్యవహారకర్తలు, భాషాభిమానులు ఇతర ఔత్సాహకులు హైదరాబాద్‌కు దారికట్టారు. తెలుగు భాషను ప్రేమించేవారికిది సంతోషం. ఈ చర్యల పట్ల విశ్వాసం లేని వారూ ఉన్నారు. ఈ సభలను తాము బహిష్కరిస్తున్నట్టు విప్లవకవి వరవరరావు తదితరులు బహిరంగ ప్రకటన చేశారు. 47 ఏళ్ల కిందటి ఒక కరపత్రాన్ని కొందరు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ‘....కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?’ అని గొప్ప కథారచయిత కొడవటిగంటి కుటుంబరావు పేరిట, అప్పట్లో (1970) వ్యాప్తిలోకి వచ్చిన కరపత్రమది. విశాఖ–హైదరాబాద్‌ల నడుమ, మహాకవి శ్రీశ్రీ కేంద్ర బిందువుగా ఈ పరిణామాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగాయి. భిన్న వాదనలతో సాహితీవేత్తల సమూహం నిలువునా చీలిపోయింది. తనను సత్కరించేందుకు తలపెట్టిన సదస్సుకు, ముందే ప్రకటించి శ్రీశ్రీ గైర్హాజరయ్యారు. భాషాభివృద్దికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు మద్దతెంత లభిస్తుందో, కొన్నిసార్లు వ్యతిరేకతా అంతే ఉంటుంది. అందుకు, వేర్వేరు కారణాలుండవచ్చు. కానీ, భాషను కచ్చితంగా అమలుపరచే విషయమై ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కొరవడ్డ సందర్భాలు కోకొల్లలు. తల్లిభాషలో విద్యాబోధనను నిర్బంధం చేసైనా విద్యావిధానంలో పెనుమార్పులు తేవాలన్న భాషా పరిశోధకులు, సంస్కర్తలు, మేధావివర్గం ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం అంతంతే! రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల తీర్పుల్ని కూడా అమలుపరచడం లేదు. పరిశోధనలు జరగటం లేదు. సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్త పదాలకు తెలుగులో సమానార్థకాలు రావడం లేదు. ఒక ప్రామాణిక నిఘంటువైనా నిర్మాణానికి నోచుకోలే! పారిభాషిక పదకోశాలు తయారవటం లేదు. ఇవేవీ లేకపోవటం వల్ల కొత్త తరానికి భాష పట్ల ఆసక్తి కలగటం లేదు. ఇవన్నీ జరిగేలా ఈ పండుగ నుంచి ఒక కార్యాచరణ పుట్టాలి. దాని అమలుకు ప్రభుత్వం కట్టుబడాలి. ఇంగ్లిష్ ప్రభావం నుంచి బయటపడాలి తెలుగు భాషను ఆధునీకరించుకోవాలి. కొత్త పదాల సృష్టి జరగాలి. మాండలికాలు ప్రామాణిక జాబితాలో చేరి విరివిగా వాడకంలోకి రావాలి. జనం పలుకుబడిలో నలిగిన అన్య భాషాపదాల ఆదానప్రదానాలు జరిగి స్థిరీకరణ పొందాలి. పదసంపద పెరిగి, తల్లిభాషలో తెలుగువారి అభివ్యక్తి రాటుతేలాలి. జనసామాన్యం తిరగాడే చోట నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలనే ఒక నిర్బంధాన్నీ అమలు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల పేర్లను తెలిపే ఫలకాలూ ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగు మాటే ఉండదు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, విభిన్న స్థాయిల్లోని కోర్టు ఉత్తర్వులు.... ఇలా అన్నీ అన్యభాషలోనే! పాక్షిక న్యాయ విభాగాల్లోనూ అంతే! తెలుగులో ఫిర్యాదు, తెలుగులో విచారణ, తెలుగులో సాక్షి వాంగ్మూలం నమోదు, తెలుగులో వాద–ప్రతివాదనలు.... కానీ, తీర్పులు ఇంగ్లిష్‌లో! ఇంకెప్పటికి పరి స్థితి మారుతుంది? దీన్నుంచి మనం బయటపడాలి. 52 ఏళ్లకింద డాక్టర్ రామ్మనోహర్ లోహియా చెప్పిన ఒక మాటతో ముగిస్తాను. దేశంలో తలెత్తిన భాషాపరమైన అల్లర్లపై 1965, ఫిబ్రవరి 23న కేంద్రం తలపెట్టిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని, 19న మన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ప్రతిపాదన వెల్లడించారు. అందులో 6వ అంశం ఇలా ఉంది. ‘‘తమ ప్రాంతాల నుంచి ఇంగ్లిష్ భాషను తొలగించుకున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కూడా ఇంగ్లిష్‌ను తొలగించుకోవాలి. కేవలం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లిష్‌ను తొలగించినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా, ఈ భ్రమోత్పాదక స్థితివల్ల నష్టం కూడా సంభవించవచ్చు.’’ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఈ సంబరాలు స్ఫూర్తినీయాలి
సుదీర్ఘ పోరాటాలతో, అవిరళ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసు కున్న తెలంగాణ ప్రజానీకం ఇవాళ్టితో మొదలుపెట్టి అయిదురోజులపాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలతో పులకించనుంది. ఈ గడ్డ వేల సంవత్సరాలుగా సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. కళల మాగాణంగా ఇది కాంతులీనుతోంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, మొఘల్ చక్రవర్తులు, కుతబ్‌షాహీలు, అసఫ్‌జా హీలు... ఇలా ఎన్నో రాజవంశాల పాలనకు ఈ గడ్డ సాక్షీభూతంగా నిలిచింది. ఇది భిన్న జాతి, మత, భాషా సంప్రదాయాల కూడలి. ఇక్కడే ఎందరెందరో తేజో మూర్తులు, మహనీయులు ప్రభవించి జాతిని, సంస్కృతిని, భాషను సుసంపన్నం చేశారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ ధ్రువతారలుగా నిలిచి వెలుగుతున్నారు. కొందరు పాలకులు ఉన్మాద మూకలను ఉసిగొల్పినా, విభజించి పాలించాలని చూసినా, నిరంకుశత్వాన్ని ప్రతిష్టించాలనుకున్నా ఇక్కడి ప్రజ బెదరలేదు. ‘నీకు గోరి గడతం కొడుకో... నైజాము సర్కరోడా’ అంటూ వారు సాగించిన సాయుధ పోరాటంలో బతుకు గోస మాత్రమే కాదు... భాషనూ, పలుకుబడినీ, సంస్కృతినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాలన్న తపన కూడా ఉంది.ఈ గడ్డ ఎన్నెన్నో కళా రూపాలకూ, ప్రక్రియలకూ పుట్టినిల్లు. చిందు బాగోతం, ఒగ్గు కథ, జాంబ పురాణ ప్రదర్శన, మడేలు పురాణం, బైండ్ల కథ, కడ్డీ తంత్రీ వాద్య కథలు, కిన్నెర వాద్య కథల వంటి అసంఖ్యాక జానపద ప్రక్రియలను ఇక్కడి జనపదాలు తమ గుండెల్లో పొదువుకున్నాయి. తరం నుంచి తరానికి భద్రంగా అందించాయి. పేరిణి, థింసా, థూలా ఆట, చుట్టకాము నృత్యం, బతుకమ్మ లాంటి కళా రూపాల్లో ఇక్కడి ప్రజ ఆశ, శ్వాస నిండుగా ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు, పోతన, గోన బుద్ధారెడ్డి, బద్దెన, జయపసేనాని, మడికి సింగన వంటి ఎందరెందరో కవులు, రచయితలు తెలుగు భాషనూ, సంస్కృతిని సుసంపన్నం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దాశరథి సోదరులు, సినారె, గద్దర్ వంటివారు సాహితీ, సాంస్కృతిక రంగాల్లో కొనసాగించిన కృషి అసామాన్యమైనది. చారిత్రక విభాతసంధ్యల్లో తెలంగాణ వికాసాన్ని, ఇక్కడి కమనీయ స్మృతు లను నెమరువేసుకునే ఈ విశిష్ట సందర్భం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధాసక్తులు పెట్టారు. మహాసభల కోసం జరిగే సమావేశాల్లో ఒకటికి రెండుసార్లు పాలుపంచుకుని దిశా నిర్దేశం చేశారు. పన్నెండో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా బోధించాలని... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులో రాసితీరాలని మూడు నెలలక్రితమే ఆయన ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీయే పాఠ్య ప్రణా ళికలు రచించేలా, వాటిని మాత్రమే అన్ని విద్యాసంస్థలూ అనుసరించేలా నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ మహాసభల కోసం నిర్వాహకులు చేసిన కృషి కొనియా డదగినది. అనేకమంది మహనీయులనూ, వారి విశిష్టతనూ గుర్తుకుతెస్తూ హైదరా బాద్ ప్రధాన పురవీధుల్లో, కూడళ్లలో కట్టిన తోరణాలు, భారీ ఫలకాలు (హోర్డిం గ్లు) భాషాభిమానులను అలరిస్తున్నాయి. వాటిపై వేర్వేరు కవులు, రచయితల ఛాయాచిత్రాలతోపాటు, వారి సారస్వత కృషిని రేఖామాత్రంగా వెల్లడించే కవితా త్మక వాక్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి అంతిమంగా వారి రచనలపై నలుగురి దృష్టీ పడేలా చేస్తాయని ఆశించాలి. భాష ప్రవహించే నదిలాంటిది. ఒకచోట సన్నగా, వేరొకచోట వెడల్పుగా, ఇంకొకచోట లోతుగా ప్రవహించే నదిలాగే భాష కూడా బహురూపాలు పోతుంది. స్థానికతను సంతరించుకుంటుంది. దాని శక్తి అసామాన్యం. ఒక జాతి కట్టుబాటును మతం కన్నా భాషే ఎక్కువ శాసిస్తుందని, ప్రజానీకం అందులోనే తన ఉనికిని వెదుక్కుంటుందని తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించినప్పుడే రుజు వైంది. అందుకే యునెస్కో బంగ్లా విముక్తి దినాన్ని మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. వైభవోజ్వల గతాన్ని గుర్తు చేసుకోనప్పుడు, అలసత్వాన్ని ప్రద ర్శించినప్పుడు, అలక్ష్యాన్ని చూపినప్పుడు భాషలు ప్రమాదంలో పడతాయి. పాళీ, ప్రాకృత భాషలు అలాగే అంతరించాయి. సంస్కృతం ఇప్పటికైతే మన కళ్ల ముందున్నా అది మనుగడ కోసం పెనుగులాడుతోంది. ఈ స్థితి ఏ భాషకూ రావ ద్దనుకుంటే ప్రజానీకంలో భాషపైనా, సంస్కృతిపైనా ఆసక్తి రేకెత్తించాలి. అమ్మ భాష నేర్వనివారు అన్య భాషల్లోనూ అంతంతమాత్రంగా ఉంటారన్న జార్జి బెర్నార్డ్ షా వంటి ఉద్దండుల హెచ్చరికలను గుర్తు చేయాలి. ఇలాంటి పండుగలు ఆ పని చేస్తాయి. అయితే ఇంతమాత్రమే సరిపోదు. ఈ మహాసభల్లో వ్యక్తమయ్యే అభి ప్రాయాలనూ, సూచనలనూ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. భిన్న జానపద కళారూపాల ప్రదర్శన అందరికీ పరిచయం మాత్రమే ఏర్పరుస్తుంది. ఆయా కళారూపాలను బతికించుకోవాలంటే వాటిపై ప్రత్యేక అధ్యయనం, పరిశోధన కొనసాగాలి. ఆ కళారూపాల లోతుల్లోకి వెళ్తే మరు గున పడిన ఎన్నో అంశాలు వెలుగుచూస్తాయి. అటు బోధననూ, ఇటు పరిశోధ ననూ జీవితపర్యంతం కొనసాగించి తెలుగు, సంస్కృతాల్లో అసంఖ్యాకమైన అము ద్రిత గ్రంథాలను సేకరించి, పరిష్కరించిన బిరుదరాజు రామరాజు వంటివారి కృషి ఆదర్శం కావాలి. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భ వించినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ప్రతి రాష్ట్రానికీ అక్కడి భాషే అధికార భాష కావాలని పిలుపునిచ్చారు. పరిపాలనంతా ఆ భాషలోనే సాగాలని వాంఛించారు. దురదృష్టవశాత్తూ ఈనాటికీ అది అరకొరగానే ఉంది. న్యాయస్థానాల్లో అయితే ఇంగ్లిష్ తప్ప మరేదీ కనబడదు. వినబడదు. ఇక ఉన్నత విద్యలో శాస్త్ర గ్రంథాల లభ్యత గురించి మాట్లాడుకోనవసరమే లేదు. ఇప్పుడు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు బహువిధ కార్యాచరణకు రూపకల్పన చేసి ఈ లోటుపాట్లన్నిటినీ సరి చేయాలి. అన్నిచోట్లా అమ్మ భాషకు పట్టం కట్టాలి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. -
మట్టి పరిమళం సుద్దాల..
ఎంగిలివారంగ పాటతోనే ఆ ఇంట పొద్దుపొడుపు. ఇంట్లో పని చేసుకుంటూ అమ్మ పాడేది.. తన పనులు చేసుకుంటూ నాన్న పాడేవారు.. పిల్లలు శ్రుతులు, రాగాలయ్యేది. వచ్చేటోళ్లు పాటలై వొస్తరో.. పాటల కోసమే వస్తరో కానీ.. చేతులతోని దరువేసే వాళ్లు, బుర్రలు వాయించేవాళ్లు.. తాళం కొట్టేవాళ్లు.. దీనికి నాన్న చేతిలోని హార్మోనియం తోడై రాగమందుకుంటే.. ఆ ఇల్లు పాటకు పుట్టినిల్లయ్యేది. అదే సుద్దాలలోని సుద్దాల హనుమంతు ఇల్లు. కదిలించే గీతాలు..భావాలు అశోక్‌తేజ రాసిన ‘ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం’ గొప్ప అనుకూల ఆలోచన కలిగించే పాట. ఎందరికో ధ్యేయాన్ని అందించిన పాట. ఆయన స్త్రీకి ఇచ్చిన గౌరవమే పనిపాటలకిచ్చి పాటలు కట్టిండు. పనినొక సంస్కృతి జేసిన ఘనత కష్టజీవిది. ‘టప, టప, టప, టప, టప, టప చెమటబొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే’ అనే పాట పనితో పాటే పుట్టింది. పని–పాటతో జతకట్టింది అనే పాట ఇటీవల అశోక్‌తేజ రాసిన శ్రమకావ్యానికి మూలభూతాలు, టపటపటప, పరికరాలు పుట్టించిన పాటలు ఎందరినోళ్లల్ల పండిన పాటలు. అశోక్‌తేజ ‘శ్రమకావ్యా’న్ని రచించిన తీరు కొత్తది. ఈ కావ్యంలో శ్రమీ, శ్రములు (శ్రమ యొక్క స్త్రీ, పురుష కాల్పనిక పాత్రలు) పాత్రధారులు. ఈ రచనను ‘శ్రమహాకావ్యం’ అని, కవిని ‘శ్రమహాకవి’ అని అన్నారు దీనికి ముందు మాట రాసిన రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి. ఆ ఇంట పాటతోనే పొద్దుపొడుపు పాటతోటి ఉద్యమానికి బాటకట్టిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. పాటంటే ఆయన గుండెలోంచి ఉబికి వచ్చే సెల. తాను పుట్టిన పాలడుగులో హరికథకుడు, ఆధ్యాత్మిక గురువు అంజయ్య శిష్యరికంలో ఆయన కళాకారుడిగా ఎదిగాడు. మంచి గొంతు.. ధ్వన్యనుకరణలో దిట్ట. అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ తను పాడుతుంటే.. విన్నవాళ్లదే భాగ్యం. సొంతగా పాట కట్టేవాడు. నటన, వాద్య, గానాలబ్బిన ఆయన తొలిసారి తన ఊళ్లో కంటబడ్డ వెట్టి పాపయ్య దుఃఖాన్ని మనసు మీదికి తీసుకుని– ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న.. ఎంత చెప్పినా తీరదో కూలన్న..’ అనే పాటకట్టిండు. నైజాం పాలన అంతమైనాక సుద్దాలకు చేరుకున్న హనుమంతు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టాడు. దాంతోపాటే సాంస్కృతిక సేనానిగా కొనసాగాడు. తనతో తన భార్య జానకమ్మ సమవుజ్జీనే. పిల్లలు పిల్లపాటలు. భారతి గొంతెత్తి పాట పాడుతుంటే హనుమంతు భావుకత్వంతో తన్మయుడయ్యే వారు. ఆ నోట జనం పాట.. సుద్దాల అశోక్ తేజ.. హనుమంతు పెద్దకొడుకు. మరో ఇద్దరు కొడుకులు ప్రభాకర్, సుధాకర్. బిడ్డ భారతి. పిల్లలకు ఇంట్లో విన్న పాటలన్నీ కంఠో‘పాట’మే. సుద్దాల హనుమంతు.. ‘పల్లెటూరి పిల్లగాడ..’ పాటతో ప్రసిద్ధుడు. పసులుకాసే పిల్ల గాని ఆర్తిని, బాధను పాటగా కట్టిన వాగ్గేయకారుడాయన. తండ్రికి తగ్గట్టే అశోక్‌తేజ– ‘కన్నతల్లీ మమ్ముల కన్నప్పటి నుంచీ కడుపునిండా తినలేదు మెతుకు.. కింటినిండ కనలేదు కునుకు..’ అంటూ బతుకుపాట కట్టాడు. ఇందులోనే– ‘యజమాని ముప్పయి పసులమందను నేను అజుమాయించకపోతి ఆరేండ్లపోరణ్ణి.. ఒక పెయ్య దప్పించుకుపొయ్యి ఆముదపుచేండ్ల ఆకులు రెండూ మేసి నామొచ్చిపడిపోతే, ఇనుపచువ్వలు కాల్చి నా ఈపూల గుంజీరి’ అనడం ద్వారా తండ్రి పాటకు కొడుకు కొనసాగింపనిపిస్తుంది. ఇది పాట వారసత్వం. అశోక్‌తేజ చదువుల కోసం హైదరాబాద్ చేరి.. అక్కడి జీవితానుభవాలను పాటలుగా కట్టి పాడాడు. ఆయన పాటల్లో ఎన్నదగినది.. ‘రాయి, సలాక, ఇసుక, ఇటుక, తాపీ, తట్ట గోడ మీద గోడ, మేడ మీద మేడ, కట్టిపోరా కూలోడా’. ఈ పాటలో ఇండ్లు కట్టే కూలోల్ల బతుకుబొమ్మను సజీవంగా చిత్రించారు. జనగీతాలు.. తండ్రివేసిన పాటల బాటలో తన పాటల బండిని తోలుకుంటూ వచ్చిండు అశోక్‌తేజ. ఆయన పాటల్లో కవిత్వముంటది. కానీ తన సినీగేయాల్లో కొన్నింటిలోనే కవిత్వముంటుంది. చిత్రమేమిటంటే అశోకన్న తనుగా రాసుకున్న పాటల్లో చాలామట్టుకు సినిమాల్లో వచ్చుడు విశేషం. ‘నీకు మచ్చాలేడా లేసేలువలే లేవులే’’ ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో!. ఇందులో రైతును చందమామతో పోల్చి చెప్పే అలంకారీయత ఉంది. తన పాటల్లో రూపకాలను ఎక్కువగా వాడతారు అశోక్‌తేజ. తను రాసిన పాట ‘అడివమ్మ మాయమ్మ అతిపేదదీరా, ఆ యమ్మకున్నది ఒక్కటే చీరా, ఆ చీర రంగేమొ ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమొ రామసక్కనిదీ ఆకలైతె చెట్టు అమ్మయితది.. ఆయుధాలడిగితే జమ్మిచెట్టయితది..’ అసాధారణ భావాల గీతమిది. ‘ఆమె’కు పాటతో పట్టాభిషేకం.. అశోక్‌తేజ ‘ఆడదాన్నిరో నేను ఆడదాన్నిరో నేను ఈడ ఎవనికి కానిదాన్ని ఏడిదాన్నిరా’ అనే పాట రాసిండు. ఆయన గురించి పాపినేని శివశంకర్ ‘స్త్రీ హృదయమున్న పురుషకవి’ అన్నారు. హనుమంతు కొంతవరకు రాసి వదిలివెళ్లిన వీర తెలంగాణ యక్షగానాన్ని పూరించారు అశోక్‌తేజ. దాని కోసం ఎంతో సాధన చేశారు. ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులిపిల్లాలమై వచ్చితిమి గనరా’, ‘ఇంతీ ఏ యింటిదానివే’ అనే పాటలు ఆ వరుసలోనివే. ‘ఆలి నీకు దండమే. అర్ధాంగి దండమే. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం..’ ఈ పాటలొక్కొక్కటే స్త్రీ హృదయాన్ని గౌరవించే ఆణిముత్యాలైన కవితా గీతాలు. పాటమ్మా.. నీకు వందనాలమ్మా.. ‘నేలమ్మ.. నీకు వేనవేల వందనాలమ్మా’.. ఈ నేలను ఇంత గొప్పపాటగా ఎవరు మలచగలిగారు? భూమిని తల్లిగా భావించి కీర్తించిన కవులెందరున్నా.. ఇట్ల నేలను వర్ణించిన కవి కానరాడు మనకు. ‘సాలేటి వానకే తుళ్లింత ఇంక సాలు, సాలుకు నువ్వు బాలింత.. ఇంత వానకే పులకరించిపోయిన భూమి, విత్తులు చల్లిన సాలు, సాలుకు బా లింత అవుతుంది. నేలమ్మవుతుంది..’ ఇదీ అశోక్ తేజ నేలమ్మను దర్శించిన వెలువరించిన తత్వం. తన ఒంటిమీద బిడ్డల చితులు కాల్చుకున్న తల్లెవరన్న వుంటరా? నేలమ్మను కవి ఊహ చేయడంలో ఒక ప్రత్యేక కవిత్వ శిల్పముంది. -
జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు
పంజగుట్ట (హైదరాబాద్) : తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు. ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.