సుదీర్ఘ పోరాటాలతో, అవిరళ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసు కున్న తెలంగాణ ప్రజానీకం ఇవాళ్టితో మొదలుపెట్టి అయిదురోజులపాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలతో పులకించనుంది. ఈ గడ్డ వేల సంవత్సరాలుగా సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. కళల మాగాణంగా ఇది కాంతులీనుతోంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, మొఘల్ చక్రవర్తులు, కుతబ్‌షాహీలు, అసఫ్‌జా హీలు... ఇలా ఎన్నో రాజవంశాల పాలనకు ఈ గడ్డ సాక్షీభూతంగా నిలిచింది. ఇది భిన్న జాతి, మత, భాషా సంప్రదాయాల కూడలి. ఇక్కడే ఎందరెందరో తేజో మూర్తులు, మహనీయులు ప్రభవించి జాతిని, సంస్కృతిని, భాషను సుసంపన్నం చేశారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ ధ్రువతారలుగా నిలిచి వెలుగుతున్నారు. కొందరు పాలకులు ఉన్మాద మూకలను ఉసిగొల్పినా, విభజించి పాలించాలని చూసినా, నిరంకుశత్వాన్ని ప్రతిష్టించాలనుకున్నా ఇక్కడి ప్రజ బెదరలేదు. ‘నీకు గోరి గడతం కొడుకో... నైజాము సర్కరోడా’ అంటూ వారు సాగించిన సాయుధ పోరాటంలో బతుకు గోస మాత్రమే కాదు... భాషనూ, పలుకుబడినీ, సంస్కృతినీ ప్రాణప్రదంగా కాపాడుకోవాలన్న తపన కూడా ఉంది.ఈ గడ్డ ఎన్నెన్నో కళా రూపాలకూ, ప్రక్రియలకూ పుట్టినిల్లు. చిందు బాగోతం, ఒగ్గు కథ, జాంబ పురాణ ప్రదర్శన, మడేలు పురాణం, బైండ్ల కథ, కడ్డీ తంత్రీ వాద్య కథలు, కిన్నెర వాద్య కథల వంటి అసంఖ్యాక జానపద ప్రక్రియలను ఇక్కడి జనపదాలు తమ గుండెల్లో పొదువుకున్నాయి. తరం నుంచి తరానికి భద్రంగా అందించాయి. పేరిణి, థింసా, థూలా ఆట, చుట్టకాము నృత్యం, బతుకమ్మ లాంటి కళా రూపాల్లో ఇక్కడి ప్రజ ఆశ, శ్వాస నిండుగా ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు, పోతన, గోన బుద్ధారెడ్డి, బద్దెన, జయపసేనాని, మడికి సింగన వంటి ఎందరెందరో కవులు, రచయితలు తెలుగు భాషనూ, సంస్కృతిని సుసంపన్నం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దాశరథి సోదరులు, సినారె, గద్దర్ వంటివారు సాహితీ, సాంస్కృతిక రంగాల్లో కొనసాగించిన కృషి అసామాన్యమైనది.
చారిత్రక విభాతసంధ్యల్లో తెలంగాణ వికాసాన్ని, ఇక్కడి కమనీయ స్మృతు లను నెమరువేసుకునే ఈ విశిష్ట సందర్భం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధాసక్తులు పెట్టారు. మహాసభల కోసం జరిగే సమావేశాల్లో ఒకటికి రెండుసార్లు పాలుపంచుకుని దిశా నిర్దేశం చేశారు. పన్నెండో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా బోధించాలని... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులో రాసితీరాలని మూడు నెలలక్రితమే ఆయన ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీయే పాఠ్య ప్రణా ళికలు రచించేలా, వాటిని మాత్రమే అన్ని విద్యాసంస్థలూ అనుసరించేలా నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ మహాసభల కోసం నిర్వాహకులు చేసిన కృషి కొనియా డదగినది. అనేకమంది మహనీయులనూ, వారి విశిష్టతనూ గుర్తుకుతెస్తూ హైదరా బాద్ ప్రధాన పురవీధుల్లో, కూడళ్లలో కట్టిన తోరణాలు, భారీ ఫలకాలు (హోర్డిం గ్‌లు) భాషాభిమానులను అలరిస్తున్నాయి. వాటిపై వేర్వేరు కవులు, రచయితల ఛాయాచిత్రాలతోపాటు, వారి సారస్వత కృషిని రేఖామాత్రంగా వెల్లడించే కవితా త్మక వాక్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి అంతిమంగా వారి రచనలపై నలుగురి దృష్టీ పడేలా చేస్తాయని ఆశించాలి.
భాష ప్రవహించే నదిలాంటిది. ఒకచోట సన్నగా, వేరొకచోట వెడల్పుగా, ఇంకొకచోట లోతుగా ప్రవహించే నదిలాగే భాష కూడా బహురూపాలు పోతుంది. స్థానికతను సంతరించుకుంటుంది. దాని శక్తి అసామాన్యం. ఒక జాతి కట్టుబాటును మతం కన్నా భాషే ఎక్కువ శాసిస్తుందని, ప్రజానీకం అందులోనే తన ఉనికిని వెదుక్కుంటుందని తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించినప్పుడే రుజు వైంది. అందుకే యునెస్కో బంగ్లా విముక్తి దినాన్ని మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. వైభవోజ్వల గతాన్ని గుర్తు చేసుకోనప్పుడు, అలసత్వాన్ని ప్రద ర్శించినప్పుడు, అలక్ష్యాన్ని చూపినప్పుడు భాషలు ప్రమాదంలో పడతాయి. పాళీ, ప్రాకృత భాషలు అలాగే అంతరించాయి. సంస్కృతం ఇప్పటికైతే మన కళ్ల ముందున్నా అది మనుగడ కోసం పెనుగులాడుతోంది. ఈ స్థితి ఏ భాషకూ రావ ద్దనుకుంటే ప్రజానీకంలో భాషపైనా, సంస్కృతిపైనా ఆసక్తి రేకెత్తించాలి. అమ్మ భాష నేర్వనివారు అన్య భాషల్లోనూ అంతంతమాత్రంగా ఉంటారన్న జార్జి బెర్నార్డ్ షా వంటి ఉద్దండుల హెచ్చరికలను గుర్తు చేయాలి. ఇలాంటి పండుగలు ఆ పని చేస్తాయి. అయితే ఇంతమాత్రమే సరిపోదు. ఈ మహాసభల్లో వ్యక్తమయ్యే అభి ప్రాయాలనూ, సూచనలనూ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. భిన్న జానపద కళారూపాల ప్రదర్శన అందరికీ పరిచయం మాత్రమే ఏర్పరుస్తుంది. ఆయా కళారూపాలను బతికించుకోవాలంటే వాటిపై ప్రత్యేక అధ్యయనం, పరిశోధన కొనసాగాలి. ఆ కళారూపాల లోతుల్లోకి వెళ్తే మరు గున పడిన ఎన్నో అంశాలు వెలుగుచూస్తాయి. అటు బోధననూ, ఇటు పరిశోధ ననూ జీవితపర్యంతం కొనసాగించి తెలుగు, సంస్కృతాల్లో అసంఖ్యాకమైన అము ద్రిత గ్రంథాలను సేకరించి, పరిష్కరించిన బిరుదరాజు రామరాజు వంటివారి కృషి ఆదర్శం కావాలి. దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భ వించినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ ప్రతి రాష్ట్రానికీ అక్కడి భాషే అధికార భాష కావాలని పిలుపునిచ్చారు. పరిపాలనంతా ఆ భాషలోనే సాగాలని వాంఛించారు. దురదృష్టవశాత్తూ ఈనాటికీ అది అరకొరగానే ఉంది. న్యాయస్థానాల్లో అయితే ఇంగ్లిష్ తప్ప మరేదీ కనబడదు. వినబడదు. ఇక ఉన్నత విద్యలో శాస్త్ర గ్రంథాల లభ్యత గురించి మాట్లాడుకోనవసరమే లేదు. ఇప్పుడు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు బహువిధ కార్యాచరణకు రూపకల్పన చేసి ఈ లోటుపాట్లన్నిటినీ సరి చేయాలి. అన్నిచోట్లా అమ్మ భాషకు పట్టం కట్టాలి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి.
ఈ సంబరాలు స్ఫూర్తినీయాలి
Published Fri, Dec 15 2017 1:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment