తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్.
సాక్షి, హైదరాబాద్
తెలుగు భాషాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్ల వంటి ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మారిషస్ ఉపాధ్యక్షుడు పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని.. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 15 నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందన సాహితీవేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి, సన్మానించాలని సూచించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి
తెలుగు మహాసభల ప్రారంభంతో పాటు ముగింపు వేడుకలను కూడా ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ‘‘ఎల్బీ స్టేడియం కాకుండా మిగతా వేదికల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలి. అక్కడ సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ వంటకాలతో ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయాలి. వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు కూడా నిర్వహించాలి. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించేలా లేజర్ షో నిర్వహించాలి. చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాలి. నగరమంతా అందమైన అలంకరణలుండాలి. పండుగ శోభను సంతరించుకోవాలి..’’అని కేసీఆర్ సూచించారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని, తెలుగు సాహితీమూర్తుల పేర్లతో తోరణాలుండాలని చెప్పారు. నగరమంతా బెలూన్లు ఎగురవేయాలని, తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూలో కవి సమ్మేళనం, ఖవ్వాలీ కూడా నిర్వహించాలని సూచించారు.
వేదిక, తోరణాల డిజైన్లకు ఓకే
తెలుగు మహాసభల ప్రధాన వేదిక అయిన ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసే వేదిక డిజైన్‌ను, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పా టు చేసే తోరణాల డిజైన్లను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని.. నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలని అధికారులకు సూచించారు.
అందరినీ ఆహ్వానించండి..
ప్రతి కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి, ప్రభుత్వం తరఫున సాహితీవేత్తలకు సన్మానం చేయించాలని... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి వసతి, భోజనం, రవాణా ఏర్పాటు చేయాలని... పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలని సూచించారు. విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, మహాసభలకు హాజరయ్యే వారికి సహాయపడాలన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్. చిత్రంలో హరీశ్ రావు, ఈటల, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ఇతర ఉన్నతాధికారులు
Comments
Please login to add a commentAdd a comment