15వ తేదీ నుంచి 19 వరకు ప్రపంచ మహాసభలు: సీఎం కేసీఆర్
- ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం
- ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు
- దేశ, విదేశాల్లోని తెలుగు పండితులు, కవులకు ఆహ్వానం
- స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు పోటీలు
- హైదరాబాద్‌లో సినారె స్మారక మందిరం
- ప్రారంభ, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి
- మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అందుకు సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్వహణ ఖర్చుల కింద సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. అక్టోబర్‌లోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కానీ అక్టోబర్ 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్‌లోనే జరగనుంది.
నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రెండు కార్యక్రమాలు అత్యంత కీలకమైనవి కావటంతో అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. అందుకే డిసెంబర్‌కు వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మహాసభల ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఇందులో పాల్గొన్నారు.
మహాసభలపై నిర్ణయాలివీ..
► ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తారు. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగళి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి
► ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చాగోష్టులు నిర్వహించాలి.
► ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పాటలు, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపు పాట, నాటు పాట, వినోద ప్రక్రియలు, తానీషా–రామదాసు, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహిస్తారు.
► వివిధ రకాల నాటక ప్రక్రియలు.. ఆదివాసీ, గిరిజన, శాస్త్రీయ, జానపద నృత్యాలు, మహిళలు పాడే పాటలు కళ్లకు కట్టేలా ప్రదర్శనలుండాలి
► దేశ, విదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను మహాసభలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలి
► దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం చాటి చెప్పే సమావేశాలు నిర్వహించాలి. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో పాటు మారిషస్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. దేశ నలుమూలల్లో తెలుగువారు నివసించే ముఖ్యమైన పట్టణాలన్నింటా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి
► కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలి
► తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానించాలి
► అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. తెలంగాణ దర్శిని పేరుతో డాక్యుమెంటరీ తయారు చేయాలి
► నగరంలో సి.నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలి. రెండు మూడ్రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి
► పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి.
► ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ను అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొనాలి. ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలి.
అన్ని స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో తొలిసారిగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యాసంస్థలను కోరారు. తెలుగును సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో తెలుగు మహాసభలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలన్నారు. సాహిత్య అకాడమీ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
బోర్డులన్నీ తెలుగులోనే..: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై బోర్డులను కచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలుగులో తప్పకుండా బోర్డులు ఉండాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని అన్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాల పట్ల ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హర్షం వ్యక్తంచేశారు.