
కామారెడ్డి అర్బన్: పాలకులకు మూడేళ్లుగా పట్టని తెలుగు భాష ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు ప్రశ్నించారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహిస్తూ రూ.50 కోట్లు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కామా రెడ్డిలో నిర్వహించిన ‘ఈ వేళ ఎందుకీ మహాసభలు’కరపత్ర ఆవిష్కరణ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయలేని ప్రభుత్వం.. రూ. 50 కోట్ల వ్యయంతో మహాసభల జాతర నిర్వహిస్తోందని, ఇది ప్రభుత్వ ప్రచారంగానే ఉందన్నారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. భాష పేరిట పెద్ద పెద్ద కటౌట్‌లు కట్టి ప్రచారం నిర్వహించుకోవడం విచారకరమన్నారు.
వేల మందిని పిలిచే బదులు తెలుగుపై పరిశోధనలు చేసిన వారు, సాహితీ వేత్తలు, కవులు, రచయితలను పిలిచి తెలుగు భాష అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భాష, యాస, సంస్కృతి, జానపద కళలను కలకాలం నిలపడానికి ప్రయత్నాలు జరగడానికి పరిశోధనలను ప్రోత్సహించాలని, భాష ప్రాధికార మండలిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment