సాహిత్య, భాషా ప్రాధాన్యంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మహాసభల ప్రధాన వేదికైన ఎల్‌బీ స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులూ సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15–19 మధ్య ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభల ఏర్పాట్లను సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ‘‘ప్రపంచ తెలుగు మహా సభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించి వారికి చక్కని సౌకర్యాలు కల్పించాలి. భారతీయ భాషల్లో జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన కవులు, రచయితలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరిద్దాం. పలు భాషలకు చెందిన మహానుభావులను సన్మానించిన కీర్తి తెలుగు మహాసభలకు దక్కాలి. పెద్ద ఎత్తున బాణసంచా వెలుగులతో అట్టహాసంగా మహాసభలు ప్రారంభమవాలి. కీలకమైన ప్రారంభ, ముగింపు సమావేశాల నిర్వహణ పక్కాగా, పకడ్బందీగా ఉండేలా చూడండి. సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటేలా ఉండాలి. ఐదు రోజుల్లో ఒక రోజు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలి’’అని ఆదేశించారు.