తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భాష ఔన్నత్యాన్ని పెంచేందుకు, మరింత పరిపుష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లాల్‌బహదూర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై విశిష్ట అతిథులు, భాషాభిమానుల సమక్షంలో వేడుకలు మొదలయ్యాయి.