
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్, అందెశ్రీలాంటి వారందరినీ ఆహ్వానించి తెలుగు మహాసభలు నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, మహాసభల్లో ఇష్టమైన వారికే సీఎం కేసీఆర్ స్థానం కల్పించారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన కవులు, రచయితలకు ఈ మహాసభల్లో స్థానం కల్పించకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించడమేమిటన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించినా తెలంగాణ చరిత్ర వారిని గుర్తుపెట్టుకుంటుందన్నారు.