తెలుగు అమలు ఏది? | Where is Telugu language imlementation ? | Sakshi
Sakshi News home page

తెలుగు అమలు ఏది?

Published Sat, Dec 16 2017 3:16 AM | Last Updated on Sat, Dec 16 2017 3:16 AM

Where is Telugu language imlementation ? - Sakshi

యూరోపియన్‌ దేశాల్లో వారి తల్లిభాషలే తప్ప ఆంగ్లం వినిపించదు, కనిపించదు. ఇంటా బయటా సకల వ్యవహారాలు వారి భాషలోనే ఉంటాయి. పదిహేను కోట్ల మంది మాట్లాడే తెలుగువారికి మాత్రం తెలుగు చదివితే ఉపాధి దొరికే పరిస్థితి లేకపోవడం ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం?

తెలంగాణలో తెలుగు భాషపై నిజాంపాలన కాలంలో అప్రకటిత నిషేధం కొనసాగింది. తెలుగు మృతభాషగా మారే ప్రమాదం వాటిల్లింది. తెలుగు మాతృభాషగా గల కులీన కుటుంబాలు ఉర్దూలోనే మాట్లాడుకునేవారు. ఉర్దూ, ఆంగ్లభాషల వ్యామోహంలో పడ్డ మహనీయులు తెలుగుభాషను ఈసడించారు. తెలుగు భాష బోధన నిలయాలు తెలంగాణలో ఆంధ్ర జనసంఘం (1921), ఆంధ్ర మహాసభ (1931)ల నిర్మాణానికి కావల్సిన పూర్వరంగాన్ని, ప్రజాచైతన్యాన్ని సిద్ధం చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అశ్రద్ధకు గురైంది. కళలు, సంస్కృతి, సాహిత్యం వెనుకబడ్డాయి. ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ భాషకు చాలా పెద్ద పీట వేస్తారని ప్రజలు ఆశించారు.

తెలుగు నేలమీద ప్రపంచ మూడవ తెలుగు మహాసభలు డిసెంబర్‌ 15 నుంచి అట్టహాసంగా హైదరాబాద్‌లో మొదలైనాయి. మొదటిసారి 1975 మార్చిలో హైదరాబాద్‌లో జరిగాయి. రెండవసారి 2012 డిసెం బర్‌లో తిరుపతిలో జరిగాయి. తెలుగు భాషను ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు అమలు చేస్తామని, తెలుగుభాష, సంస్కృతి, చారిత్రక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ విస్మరణకు గురైన తెలంగాణ ప్రముఖులను వెలుగులోకి తెస్తామనే నినాదంతో ఈ సభలు జరుగుతున్నాయి. కానీ ఇదొక సాకు మాత్రమే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా అమలు చేసి ఉండేది. ఇప్పటికీ విద్యాబోధనలో ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వమే ప్రాధాన్యత ఇస్తోంది. తెలుగును చులకనగా చూస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కనీసం ఖాళీగా ఉన్న తెలుగు, చరిత్ర బోధకుల పోస్టులను కూడా భర్తీ చేయలేదు.

తెలంగాణలో ఇప్పటి దాక పాలకులు మాతృభాషను ప్రజల నుండి బలవంతంగా దూరం చేయాలని ప్రయత్నిస్తే, నేడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల ప్రభావంతో తెలుగు సమాజం తన మాతృభాషను దూరం చేసుకోవడం, ఆంగ్ల భాష పట్ల వ్యామోహం పెంచుకోవడం, దానికోసం కొందరు పనిగట్టుకొని ప్రచారం చేయడం ఒక పెద్ద విషాదం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చూస్తుంటే భాష అభివృద్ధికన్నా దాని పేరిట జరిగే సంబరాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తోంది. భాష ఔన్నత్యాన్ని చాటడంకన్నా ముస్తాబులు, షోకులే ఎక్కువగా కనబడుతున్నాయి.

మన రాష్ట్రంలో ఇప్పటికీ సరైన భాషా విధానాన్ని రూపొందించుకోలేదు. తెలంగాణ యాస, భాషను పరిరక్షించుకోవాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ సందర్భంలోనైనా విద్యాబోధనా విధానంలోని మౌలిక, కీలక మాధ్యమం అంశాన్ని చర్చించాల్సి ఉంది. మాతృ భాష ద్వారానే ప్రకృతి, సమాజాల గురించిన మౌలిక భావనలనూ, పరాయి భాషలనూ సులువుగా, బాగా నేర్చుకోగలుగుతామని ప్రపంచ దేశాల అనుభవాలు, భాషాశాస్త్రజ్ఞుల నిర్ధారణలూ, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు తెలుపుతున్నాయనే అంశాన్ని పాలకులు గమనంలో పెట్టుకోవాలి. కానీ ఆంగ్ల మాధ్యమం చదువులే మంచివన్న భ్రమలు తల్లిదండ్రులను పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలకు ఇదే ఆలోచనే ఉన్నట్లుంది.

గత 30 ఏళ్ళుగా ఆంగ్ల మాధ్యమం ద్వారా సాగుతున్న చదువుల నాణ్యతను మదింపు చేయించాలి. ఆంగ్లభాష ద్వారా కాకుండా తమ తమ జాతీయ భాషల విద్యా మాధ్యమం ద్వారా ఉన్నతవిద్యనూ, పరిశోధనలనూ సాగించే దేశాల అనుభవాలను స్వీకరించాలి. దీనర్థం మనకు ఆంగ్లభాష వద్దని కాదు. ఆంగ్లాన్ని బాగా, సులువుగా నేర్చుకోవటం కూడా మాతృభాష ద్వారానే సాధ్యపడుతుందనే శాస్త్రీయాంశాన్ని గమనంలో పెట్టుకుని విద్యాబోధనా విధానాన్ని నిర్ణయించుకోవాలి. మాతృభాష ద్వారా ఎంత ఎక్కువ పరిజ్ఞానాన్ని పొందితే అంత బాగా ఆంగ్లభాషలో పట్టు సాధించటం సాధ్యపడుతుంది.

యూరోపియన్‌ దేశాల్లో వారి తల్లిభాషలే తప్ప ఆంగ్లం వినిపిం చదు, కనిపించదు. సకల వ్యవహారాలు వారి భాషలోనే ఉంటాయి. 15 కోట్ల మంది మాట్లాడే తెలుగువారికి మాత్రం తెలుగు చదివితే ఉపాధి దొరికే పరిస్థితి లేకపోవడం ఎంత ఘోరం, ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం? వలస మనస్తత్వంతో వ్యవహరిస్తూ తెలుగు భాషను మృతప్రాయంగా చేసే కౌటిల్యానికి ఒడిగట్టిన ప్రభుత్వ వ్యవహర్తలకు ఇది సిగ్గనిపించదు. అలాంటి వారికి తెలుగు నేల మీద ఇంటా బయటా తెలుగు వేయి రేకులుగా విరబూయాలనే మాట వింతగా తోస్తుంది. ఎందుకంటే తెలుగులో మాట్లాడటమే నామోషీగా భావించే స్థితికి తెలుగువారిని దిగజార్చిన దుష్పలితమిది. నిజంగా మన పాలకులు తెలుగును ప్రేమిస్తే సకల జీవనరంగాల్లో తెలుగును పరివ్యాప్తం చేసే విధానాల్ని రూపొం దించాలి. తెలుగులో చదువుకున్నా బతుక్కి ఢోకా లేదన్న భరోసానిచ్చే కార్యాచరణకు సంకల్పించాలి. బోధనలో, పాలనలో అన్ని స్థాయిల్లో తెలుగును ప్రవేశపెడితే అవకాశాలు వాటంతటవే వస్తాయి.

1966 తెలుగు అధికార భాషా చట్టంలో ‘‘అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలు, లేఖలు తెలుగులోనే ఇవ్వాలి. హాజరుపట్టీలు తెలుగులోనే రాయాలి. సంతకాలు, సెలవుచీటీలూ మాతృభాషలో ఉండాలి. ప్రభుత్వ పథకాలకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నామఫలకాలు విధిగా తెలుగులోనే ఉండాలి’’ అని ప్రభుత్వానికి చేసిన నిర్దేశమిదీ. 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటే అమ్మభాషపై మన పాలకులకు, అధికార యంత్రాంగానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రతిరోజు 200 నుంచి 250 ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఇందులో ఒక్కటీ తెలుగులో ఉండటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగులో వచ్చిన ఉత్తర్వుల సంఖ్య 500 దాటలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో తెలుగులో వచ్చిన ఉత్తర్వులు కేవలం 20.  
పాలనాభాషగా తెలుగు అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. తెలుగులో కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతను నిర్లక్ష్యం చేసేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంలోనైనా తెలంగాణ ప్రభుత్వం తెలుగును బోధనా, పాలనా భాషగా ఆచరణీయం చేసే కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి. మాతృభాషలో బోధన జరగాలని విద్యాపరిరక్షణ కమిటీ గత నాలుగు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నది. ఈ మహాసభలు పాలనను, బోధనను తెలుగులో జరిగేలా ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలిగితే ఈ సభలకు ఏమైనా అర్థం ఉంటుంది. ఆ దిశగా విధాన నిర్ణయం ఉండేలా ప్రజలు పాలకుల మీద ఒత్తిడి తేవాలి.

(డిసెంబర్‌ 15–19 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొ‘‘ కె. చంద్రశేఖర్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ‘‘ కె. లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొ‘‘ జి. హరగోపాల్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ ముఖ్యాంశాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement