భాషా రక్షణకు బాహుబలులు | special stoty telugu mahasabalu | Sakshi
Sakshi News home page

భాషా రక్షణకు బాహుబలులు

Published Tue, Dec 12 2017 2:19 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

special stoty telugu mahasabalu - Sakshi

తెలంగాణలో ఎందరో సంస్థానాధీశులు తమ పరిపాలనలో సాహిత్యకారులకు ధనధాన్య వజ్రవైఢూర్యాల్ని బహుమతులుగా ఇవ్వడమే కాకుండా ఏకంగా అగ్రహారాల్నే రాసిచ్చారు. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి కానీ సంస్థానాలు అసఫ్‌జాహీ వంశం రాక పూర్వం ముందు నుంచి ఉన్నాయి. వీటిలో ఒక్క ‘గురుగుంట’ (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. వీటిల్లో సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్థానాలు కొన్ని..

అలంపుర సంస్థానం
ఈ సంస్థానంలో ఉన్న కవుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రిక సంపాదకుడే కాక హిందువుల పండుగలు, సంఘోద్ధరణము,ఉచ్చల విషాద నాటకము, కర్నూలు రాజులు వంశావళి. గ్రంథాలయములు, మద్యపానము(3 పుస్తకాలు) గోలకొండ  కవుల సంచిక  వంటి అనేక గ్రంథములను రచించి నిజాం నిరంకుశత్వమును విమర్శించిన మేరునగధీరుడు.

 ఇదే సంస్థానంలో తిమ్మభూపాలుడు, మంథానభైరవుడు (భైరవ తంత్రము రచయిత), దుంపల రామిరెడ్డి , కూడవల్లి  శ్రీనివాసరావు, మణిశేషకవి,  ఆకుమళ్ళ మల్లికార్జున శర్మ అనే బాలకవి, కేశవ పంతులు  నరసింహశాస్త్రి , గడియారం రామకృష్ణ శర్మ, ములికిరెడ్డి అల్పూరు రెడ్డి చెన్నారెడ్డి తదితరులు ఎన్నో విశేషమైన రచనలు చేశారు.

గద్వాల సంస్థానం
ఇప్పటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఈ సంస్థానం అతి ప్రాచీనమైంది. గద్వాల సంస్థాన స్థాపకుడైన పెద సోమభూపాలుడు (క్రీ.శ. 1663–1712) కార్తీక, మాఘ మహాసభలను ప్రారంభించాడు. కార్తీక మాసమున వేదశాస్త్ర పండిత సభల్ని, మాఘ మాసంలో సంగీత సాహిత్య సభలు జరుపుతుండేవారు. ఈ సంస్థానంలో ఉండే అయితారు కందాళయార్యుడు అనే కవి అలంకార శిరోభూషణమనే సాహిత్యశాస్త్ర గ్రంథము రచించాడు. పెద్దన సోమయాజీ అనే కవి భోజ మహాకవి రచించిన రామాయణ చంపూ ప్రబంధమునకు తెలుగు వచనం వెలువరించారు.

పురాణము దీక్షాచార్యులు అనే కవి యణచార్యులు అనే పండితుడు ప్రతాపరుద్రీయ సారం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. బైరంపల్లి తిరుమల రాయ కవి అనే కవి గద్వాల సంస్థానానికి ఆస్థాన కవి. ఇతనికి ఆశుకవితా చక్రవర్తి అనే బిరుదు ఉండేది. పురాణము నరసింహాచార్యులు అనే కవి ఈ సంస్థానం లోని వాడే. ఇతడికి తిరుపతి వేంకట కవులకు హోరాహోరీగా శాస్త్ర వాదములు జరిగేవి అంటారు. జానకీ పరిణయం, శ్రీరామ భూప ^è రిత్రము అనేవి ఇతడి ముఖ్య రచనలు. చెట్లూరి Ôó చార్యులు అనే మరో కవి చోర సంవాదం, పుణ య కలహోత్సవం రాశాడు.

పుణయ కలహోత్సవం అనేది ఒక నాటకం. చెన్న కేశవస్వామి జాతరకు విచ్చేసిన ప్రజలు చూసి ఆనందపడుటకు రచించిన నాటకం. ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన  గుండేరావు హార్కారే ఆంగ్ల రచయిత గోల్డ్‌ స్మిత్‌ రాసిన ‘ట్రావెలర్‌’కి సాంస్కృతిక పద్యాలను వాదంకు అప్పటి మైసూర్‌ ప్రభుత్వం గోల్డ్‌ మెడల్‌ బహూకరించింది. ఇతడే థామస్‌ గ్రే రాసిన ‘ఎలిజీ’, గోల్డ్‌స్మిత్‌ రాసిన ‘డెజెర్టెడ్‌ విలేజ్‌’, వర్డ్స్‌ వర్త్‌ రాసిన ‘ఇంటిమేషన్‌ టూ ఇమ్మోరాలిటీ’, షేక్స్‌ పియర్‌ నాటకం ‘హేమ్లెట్‌’కి సంస్కృత పద్యానువాదం చేశారు. ఈ సంస్థానంలో కొత్తపల్లి రామాచార్యులు, ధర్మవరం రామ కవి ప్రగడ రాజు గుండన్నలాంటి కవులుండేవారు.

దొంతి సంస్థానం
ఈ సంస్థానాలను పాలించిన వెంకట గోపాల్‌రెడ్డి తెలుగు భాషాభిమాని. 1948 లో జరిగిన పోలీసు చర్యకు,స్నేహితులకు, బంధువులకు దొంతికోటలో ఆశ్రయమిచ్చిన మానవతావాది. ఇప్పటి సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి నివాసి అయిన సంగీత ,సాహిత్య  జ్యోతి శాస్త్రముల్లో నిష్ణాతుడైన వెంకట పుండరీక మాజుల వారిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆగ్రహారాన్నిచ్చి సత్కరించాడు.

దోమకొండ సంస్థానం
ఈ సంస్థానానికి చెందిన సోమేశ్వరుని పుత్రుడు రెండవ ఉమాపతి సాహిత్య ప్రియుడు. ఆయన కాలంలో తెలుగు కవులెందరో అనేక కావ్యాలు రచించి భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇదే వంశానికి చెందిన మల్లారెడ్డి, ‘శివధర్మోత్తర ఖండాన్ని’ రచించారు. ఇతని సోదరుడు కామిరెడ్డి, మల్లారెడ్డి తన గ్రంథాన్ని కామిరెడ్డికి అంకితమిచ్చాడు. కామిరెడ్డి తర్వాత పాలనకు వచ్చిన ఎల్లారెడ్డి ‘వాసిష్టము’ ‘లింగపురో యశు గ్రంథములను’ రచించాడు. ఇతడు సంస్థానాధీశుడైన తర్వాత అనేక మంది పండితులను, కవులను ఆదరించారు.

నారాయణపుర సంస్థానం
నల్లగొండ జిల్లాల్లోని  నారాయణపుర సంస్థానంలో అనంతశాస్త్రి అనే సుస్థాన కవి భానుమతి  పరిణయం, శాకుంతలం, హరిప్రియ అనే నాటకాల్ని  రచించాడు. ఈయనే  నారాయణపురం చరిత్రను రాశానంటారు.

వనపర్తి సంస్థానం
వనపర్తి పాలకులు 1870 ప్రాంతంలో నెలకొల్పిన ‘బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాల’ తెలంగాణలోనే ప్రాచీన ముద్రణాలయం మానవల్లి రామకృష్ణ కవి ‘విస్మృత కవులు’ పేరుతో అనేక అముద్రిత గ్రంథాలు వెలుగులోని తెచ్చారు. కుమార సంభవం, క్రీడాభీరామం, ప్రబంధమణిభూషణం, నితి శాస్త్ర ముక్తావళీ, అనర్గరాగవం, పరతత్వ రసాయనం, త్రిపురాంత కొదాహరణం మొదలైనవి ఉన్నాయి. వనపర్తి సంస్థానంలోనే గోపాలరాయులు అనే కవి ‘రామచంద్రోదయం’ అనే శ్లేష కావ్యాన్ని ‘శృంగార మంజరీ బాణం’ అనే గ్రంథాన్ని రచించాడు.

చెన్న కృష్ణ కవి ‘యాదవ భారతీయం’ అనే ప్రబంధాన్ని రచించి సంస్థానాధీశుడైన జనంపల్లి వల్లభరాయుడికి అంకిత చేసినట్లు తెలుస్తుంది. శ్రీఅయ్యమాచార్యులు వారు ‘రామేశ్వర విజయం’ అనే గ్రంథం రాయగా, హోసదుర్గం కృష్ణమాచార్యులు, శ్రీనివాస రాఘవాచార్యులు నంబాకం రాఘవాచార్యులు, విక్రాల వెంకటాచార్యులు, కడుకంట్ల పారుశాస్త్రి, గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ, మాదిరాజు విశ్వనాథరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఎందరో సంస్కృత కవి, పండితులు వనపర్తి సంస్థానాశ్రయం పొంది అనేక గ్రంథాలు వెలువరించారు.

గోపాలపేట సంస్థానం
వనపర్తి  సంస్థానం నుంచి ఏర్పడిన సంస్థానం గోపాలపేట. ఈ సంస్థానంలో ఏదుట్ల శేషాచలం  అనే కవి జగన్నాటకం, బారగడుపుల న రసింహశతకం అనే కృతులు రచించాడు. మరోకవి  బుక్కపట్నం రామచంద్రాచార్యులు బభ్రువాహన–పింగళ అనే నాటకాలు, సైంధవ పరాభవం , చికాధక్కీయం అనే యక్షగానాలు సురుచి ,యోగానంద చరిత్రం, ఆనంద రామాయణం అనే కావ్యాలు రాసారు. చెన్న కృష్ణమరాజు అనే వ్యక్తి ఋతుధ్వజ నాటకం, హనుమద్విజయం, యయాతి చరిత్ర, సానందోపాఖ్యానం, మృగావతి అనే యక్షగానాలు ఇతని రచనలు.

ఆత్మకూర్‌ సంస్థానం
ఈ సంస్థానంలో ఏడాదికోసారీ ఫాల్గుణ శుక్లపక్షమి సాహిత్య సభలు ,శాస్త్రగోష్ఠులు, కవిగాయక సమ్మేళనం , నృత్యనాటక ప్రదర్శనములు జరిపి కవిపండితులకు సన్మానాలు చేసేవారు. సురపురం కేశవయ్య ఆత్మకూరు సంస్థానంలో ముఖ్యుడు. శ్రీనివాసాచార్యులు అనే కవి  జాంబవతీ పరిణయం, రాజశేఖర చరితం రాశాడు. మునగాల సంస్థానం, పాపన్న పేట సంస్థానం, పాల్వంచ సంస్థానం, జటప్రోలు సంస్థానానికి చెందిన అనేక మంది సంస్ధానాధీశులు  సాహిత్యాన్ని కవుల్ని, పండితుల్ని ఎంతగానో ప్రేమించారు, ఆదరించారు. రకరకాల బిరుదులతో పెంచిపోషించారు.

నాటి సభలపై శ్రీశ్రీ, విశ్వనాథ
ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో నేనూ శ్రీశ్రీ ఏకాభిప్రాయం ప్రకటిస్తున్నాం. నేను అయిన విశ్వనాథ సత్యనారాయణను ఇది వ్రాస్తున్నాను. ఈ సభలు నిష్ప్రయోజనములు. సాహిత్యానికి దోహదములు కావు. సాహిత్య యథార్థవేత్తలు జరుపుట లేదని నా అభిప్రాయం. ప్రపంచంలోని అందరు తెలుగువాళ్లని సమావేశపరచుట ప్రయోజనమున్నచో ప్రతినిధుల సమావేశము కాని నిజముకాదు. ఇదియొక ప్రచారము. ఇందులో నిస్వార్థముగా పనిచేయు వారున్నారా? ఉన్నచో చేయవచ్చును. ఆత్మ ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకోగలిగినవారు నిశ్చయము చేసికోవలయును. ఇది కప్పల తక్కెడ కారాదు.
– తెలుగు మహాసభలపై విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ (3–3–1975)
..: కె.వి.నరేందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement