Poets and writers
-
TANA: ‘వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి’
అట్లాంటా, జార్జియా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించిన ప్రఖ్యాత సాహితీవేత్తలతో ప్రత్యక్ష పరిచయాలు ప్రత్యేక అనుభవాలు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా సాగింది. సాహిత్య ప్రపంచంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య ఆత్రేయ, శ్రీ శ్రీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిలు సృష్టించిన సాహిత్యం కాకుండా వారి జీవితాలలోని అనేక మలుపులు, స్ఫూర్తిదాయకమైన అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు స్వాగాతోపన్యాసంలో విశిష్ట అతిధులందరినీ ఆహ్వానించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిగురుమళ్ళ శ్రీనివాస్‌లను ఆయను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వారు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ వారి జీవితాలలో ఎదురైన అవరోధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వారి కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయన్నారు. వాటన్నింటీ ఎంతో నిబద్ధతతో తట్టుకుని, సాహిత్య లోకంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వారు ఎలా సాధించారనేది ఎప్పటికీ ఆసక్తిదాయకమే అన్నారు. ఇలాంటి అంశాలు ఈ తరానికి తెలియడం ఎంతో అవసరం అన్నారు. -
సిద్దిపేట కవులకు పుట్టినిల్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట కవులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పీఏస్‌డబ్ల్యూఏ భవనంలో ప్రముఖ కవి కోణం పర్శరాములు రచించిన నీలీమేఘాలు బాలగేయ సంపుటి పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. మొదటగా జిల్లాలోని ప్రముఖ కవులు, రచయితల ఆధ్వర్యంలో నీలీమేఘాలు పుస్తకాన్ని అవిష్కరించారు. అనంతరం సంపుర్ణేష్‌బాబు మాట్లాడుతూ... చిన్నతనం నుంచే బాలలు కవితాలు, కథలు చదవాలని అన్నారు. వారు భవిష్యత్‌లో నీతి సంస్కారములు గడించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు మట్టపల్లి రంగారావు, ఐతా చంద్రయ్య, ఉండ్రాల రాజేశం, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, పర్శరాములు, శ్రీనివాస్, సుధాకర్, ఉస్మాన్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
ఒద్దిరాజు సోదరులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సీతారామచంద్రారావు, ఒద్దిరాజు రాఘవరావులు ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ, పారశీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. ‘విజ్ఞాన ప్రచారిణి’ పేరుతో గ్రంధమాలను నిర్వహించారు. ఎంతో ధైర్యసాహసాలతో 1922 ఆగస్టులో ‘తెనుగు’ అనే వారపత్రికను స్థాపించారు. వారే çస్వయంగా సైకిల్‌పై తిరుగుతూ పత్రికను విక్రయించేవారు. 1000 ప్రతులను ముద్రించేవారు. ఆరేళ్ల పాటు ఈ పత్రిక నడిచింది. ఒద్దిరాజు సోదరులు కొన్ని సాంప్రదాయ రచనలు చేశారు. ప్రబంధ పద్యాలు రాశారు. చారిత్రక నవలలతో దేశభక్తిని, త్యాగనిరతిని ప్రబోధించారు. సాంఘిక నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘నౌకాభంగం’ నవలను తెనిగించారు. షడ్రుచుల ‘పద్యా’న్నం! లింగ నిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూ లింగని సంగతాళి లవలింగని కర్దమ దూషితం మృణా లింగని కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృ నా లింగని రామలింగ కవిలింగని కీర్తి హసించు వేడుకన్ పద్యాల్లో కొన్నిటికి అర్థం వల్ల మరికొన్నింటికి శబ్దవైచిత్రి వల్ల పేరొస్తుంది. ఈ చాటు పద్యం రెండో కోవకు చెందుతుంది. తెనాలి రామలింగడికి ధిషణాహంకారం ఎక్కువ. పద్యంలో లింగ శబ్దం ప్రతిసారి మరోపదంతో కలిసి చూసి అనే అర్థంలోనే తళుక్కు మంటుంటుంది. చంద్రునికి మచ్చ ఉంది, శివుని కంఠం నలుపు, తెల్లని లవలీ తీగ మీద నల్లని తుమ్మెదలు. తామరతూటికేమో బురద. నల్లని వస్త్రంలో తెల్లని బలరాముడు. ధవళం ధగధగలాడే సరస్వతి జట్టు నల్లన. చూశారా...ఎంత తెల్లగా ఉన్నా... వారికి ఏదో నలుపు అంటక తప్పలేదు. రామలింగని కీర్తిమాత్రం తెల్లగా నవ్వుతోంది! ..: రామదుర్గం -
భాషా రక్షణకు బాహుబలులు
తెలంగాణలో ఎందరో సంస్థానాధీశులు తమ పరిపాలనలో సాహిత్యకారులకు ధనధాన్య వజ్రవైఢూర్యాల్ని బహుమతులుగా ఇవ్వడమే కాకుండా ఏకంగా అగ్రహారాల్నే రాసిచ్చారు. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి కానీ సంస్థానాలు అసఫ్‌జాహీ వంశం రాక పూర్వం ముందు నుంచి ఉన్నాయి. వీటిలో ఒక్క ‘గురుగుంట’ (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. వీటిల్లో సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్థానాలు కొన్ని.. అలంపుర సంస్థానం ఈ సంస్థానంలో ఉన్న కవుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రిక సంపాదకుడే కాక హిందువుల పండుగలు, సంఘోద్ధరణము,ఉచ్చల విషాద నాటకము, కర్నూలు రాజులు వంశావళి. గ్రంథాలయములు, మద్యపానము(3 పుస్తకాలు) గోలకొండ కవుల సంచిక వంటి అనేక గ్రంథములను రచించి నిజాం నిరంకుశత్వమును విమర్శించిన మేరునగధీరుడు. ఇదే సంస్థానంలో తిమ్మభూపాలుడు, మంథానభైరవుడు (భైరవ తంత్రము రచయిత), దుంపల రామిరెడ్డి , కూడవల్లి శ్రీనివాసరావు, మణిశేషకవి, ఆకుమళ్ళ మల్లికార్జున శర్మ అనే బాలకవి, కేశవ పంతులు నరసింహశాస్త్రి , గడియారం రామకృష్ణ శర్మ, ములికిరెడ్డి అల్పూరు రెడ్డి చెన్నారెడ్డి తదితరులు ఎన్నో విశేషమైన రచనలు చేశారు. గద్వాల సంస్థానం ఇప్పటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఈ సంస్థానం అతి ప్రాచీనమైంది. గద్వాల సంస్థాన స్థాపకుడైన పెద సోమభూపాలుడు (క్రీ.శ. 1663–1712) కార్తీక, మాఘ మహాసభలను ప్రారంభించాడు. కార్తీక మాసమున వేదశాస్త్ర పండిత సభల్ని, మాఘ మాసంలో సంగీత సాహిత్య సభలు జరుపుతుండేవారు. ఈ సంస్థానంలో ఉండే అయితారు కందాళయార్యుడు అనే కవి అలంకార శిరోభూషణమనే సాహిత్యశాస్త్ర గ్రంథము రచించాడు. పెద్దన సోమయాజీ అనే కవి భోజ మహాకవి రచించిన రామాయణ చంపూ ప్రబంధమునకు తెలుగు వచనం వెలువరించారు. పురాణము దీక్షాచార్యులు అనే కవి యణచార్యులు అనే పండితుడు ప్రతాపరుద్రీయ సారం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. బైరంపల్లి తిరుమల రాయ కవి అనే కవి గద్వాల సంస్థానానికి ఆస్థాన కవి. ఇతనికి ఆశుకవితా చక్రవర్తి అనే బిరుదు ఉండేది. పురాణము నరసింహాచార్యులు అనే కవి ఈ సంస్థానం లోని వాడే. ఇతడికి తిరుపతి వేంకట కవులకు హోరాహోరీగా శాస్త్ర వాదములు జరిగేవి అంటారు. జానకీ పరిణయం, శ్రీరామ భూప ^è రిత్రము అనేవి ఇతడి ముఖ్య రచనలు. చెట్లూరి Ôó చార్యులు అనే మరో కవి చోర సంవాదం, పుణ య కలహోత్సవం రాశాడు. పుణయ కలహోత్సవం అనేది ఒక నాటకం. చెన్న కేశవస్వామి జాతరకు విచ్చేసిన ప్రజలు చూసి ఆనందపడుటకు రచించిన నాటకం. ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన గుండేరావు హార్కారే ఆంగ్ల రచయిత గోల్డ్ స్మిత్ రాసిన ‘ట్రావెలర్’కి సాంస్కృతిక పద్యాలను వాదంకు అప్పటి మైసూర్ ప్రభుత్వం గోల్డ్ మెడల్ బహూకరించింది. ఇతడే థామస్ గ్రే రాసిన ‘ఎలిజీ’, గోల్డ్‌స్మిత్ రాసిన ‘డెజెర్టెడ్ విలేజ్’, వర్డ్స్ వర్త్ రాసిన ‘ఇంటిమేషన్ టూ ఇమ్మోరాలిటీ’, షేక్స్ పియర్ నాటకం ‘హేమ్లెట్’కి సంస్కృత పద్యానువాదం చేశారు. ఈ సంస్థానంలో కొత్తపల్లి రామాచార్యులు, ధర్మవరం రామ కవి ప్రగడ రాజు గుండన్నలాంటి కవులుండేవారు. దొంతి సంస్థానం ఈ సంస్థానాలను పాలించిన వెంకట గోపాల్‌రెడ్డి తెలుగు భాషాభిమాని. 1948 లో జరిగిన పోలీసు చర్యకు,స్నేహితులకు, బంధువులకు దొంతికోటలో ఆశ్రయమిచ్చిన మానవతావాది. ఇప్పటి సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి నివాసి అయిన సంగీత ,సాహిత్య జ్యోతి శాస్త్రముల్లో నిష్ణాతుడైన వెంకట పుండరీక మాజుల వారిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆగ్రహారాన్నిచ్చి సత్కరించాడు. దోమకొండ సంస్థానం ఈ సంస్థానానికి చెందిన సోమేశ్వరుని పుత్రుడు రెండవ ఉమాపతి సాహిత్య ప్రియుడు. ఆయన కాలంలో తెలుగు కవులెందరో అనేక కావ్యాలు రచించి భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇదే వంశానికి చెందిన మల్లారెడ్డి, ‘శివధర్మోత్తర ఖండాన్ని’ రచించారు. ఇతని సోదరుడు కామిరెడ్డి, మల్లారెడ్డి తన గ్రంథాన్ని కామిరెడ్డికి అంకితమిచ్చాడు. కామిరెడ్డి తర్వాత పాలనకు వచ్చిన ఎల్లారెడ్డి ‘వాసిష్టము’ ‘లింగపురో యశు గ్రంథములను’ రచించాడు. ఇతడు సంస్థానాధీశుడైన తర్వాత అనేక మంది పండితులను, కవులను ఆదరించారు. నారాయణపుర సంస్థానం నల్లగొండ జిల్లాల్లోని నారాయణపుర సంస్థానంలో అనంతశాస్త్రి అనే సుస్థాన కవి భానుమతి పరిణయం, శాకుంతలం, హరిప్రియ అనే నాటకాల్ని రచించాడు. ఈయనే నారాయణపురం చరిత్రను రాశానంటారు. వనపర్తి సంస్థానం వనపర్తి పాలకులు 1870 ప్రాంతంలో నెలకొల్పిన ‘బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాల’ తెలంగాణలోనే ప్రాచీన ముద్రణాలయం మానవల్లి రామకృష్ణ కవి ‘విస్మృత కవులు’ పేరుతో అనేక అముద్రిత గ్రంథాలు వెలుగులోని తెచ్చారు. కుమార సంభవం, క్రీడాభీరామం, ప్రబంధమణిభూషణం, నితి శాస్త్ర ముక్తావళీ, అనర్గరాగవం, పరతత్వ రసాయనం, త్రిపురాంత కొదాహరణం మొదలైనవి ఉన్నాయి. వనపర్తి సంస్థానంలోనే గోపాలరాయులు అనే కవి ‘రామచంద్రోదయం’ అనే శ్లేష కావ్యాన్ని ‘శృంగార మంజరీ బాణం’ అనే గ్రంథాన్ని రచించాడు. చెన్న కృష్ణ కవి ‘యాదవ భారతీయం’ అనే ప్రబంధాన్ని రచించి సంస్థానాధీశుడైన జనంపల్లి వల్లభరాయుడికి అంకిత చేసినట్లు తెలుస్తుంది. శ్రీఅయ్యమాచార్యులు వారు ‘రామేశ్వర విజయం’ అనే గ్రంథం రాయగా, హోసదుర్గం కృష్ణమాచార్యులు, శ్రీనివాస రాఘవాచార్యులు నంబాకం రాఘవాచార్యులు, విక్రాల వెంకటాచార్యులు, కడుకంట్ల పారుశాస్త్రి, గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ, మాదిరాజు విశ్వనాథరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఎందరో సంస్కృత కవి, పండితులు వనపర్తి సంస్థానాశ్రయం పొంది అనేక గ్రంథాలు వెలువరించారు. గోపాలపేట సంస్థానం వనపర్తి సంస్థానం నుంచి ఏర్పడిన సంస్థానం గోపాలపేట. ఈ సంస్థానంలో ఏదుట్ల శేషాచలం అనే కవి జగన్నాటకం, బారగడుపుల న రసింహశతకం అనే కృతులు రచించాడు. మరోకవి బుక్కపట్నం రామచంద్రాచార్యులు బభ్రువాహన–పింగళ అనే నాటకాలు, సైంధవ పరాభవం , చికాధక్కీయం అనే యక్షగానాలు సురుచి ,యోగానంద చరిత్రం, ఆనంద రామాయణం అనే కావ్యాలు రాసారు. చెన్న కృష్ణమరాజు అనే వ్యక్తి ఋతుధ్వజ నాటకం, హనుమద్విజయం, యయాతి చరిత్ర, సానందోపాఖ్యానం, మృగావతి అనే యక్షగానాలు ఇతని రచనలు. ఆత్మకూర్ సంస్థానం ఈ సంస్థానంలో ఏడాదికోసారీ ఫాల్గుణ శుక్లపక్షమి సాహిత్య సభలు ,శాస్త్రగోష్ఠులు, కవిగాయక సమ్మేళనం , నృత్యనాటక ప్రదర్శనములు జరిపి కవిపండితులకు సన్మానాలు చేసేవారు. సురపురం కేశవయ్య ఆత్మకూరు సంస్థానంలో ముఖ్యుడు. శ్రీనివాసాచార్యులు అనే కవి జాంబవతీ పరిణయం, రాజశేఖర చరితం రాశాడు. మునగాల సంస్థానం, పాపన్న పేట సంస్థానం, పాల్వంచ సంస్థానం, జటప్రోలు సంస్థానానికి చెందిన అనేక మంది సంస్ధానాధీశులు సాహిత్యాన్ని కవుల్ని, పండితుల్ని ఎంతగానో ప్రేమించారు, ఆదరించారు. రకరకాల బిరుదులతో పెంచిపోషించారు. నాటి సభలపై శ్రీశ్రీ, విశ్వనాథ ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో నేనూ శ్రీశ్రీ ఏకాభిప్రాయం ప్రకటిస్తున్నాం. నేను అయిన విశ్వనాథ సత్యనారాయణను ఇది వ్రాస్తున్నాను. ఈ సభలు నిష్ప్రయోజనములు. సాహిత్యానికి దోహదములు కావు. సాహిత్య యథార్థవేత్తలు జరుపుట లేదని నా అభిప్రాయం. ప్రపంచంలోని అందరు తెలుగువాళ్లని సమావేశపరచుట ప్రయోజనమున్నచో ప్రతినిధుల సమావేశము కాని నిజముకాదు. ఇదియొక ప్రచారము. ఇందులో నిస్వార్థముగా పనిచేయు వారున్నారా? ఉన్నచో చేయవచ్చును. ఆత్మ ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకోగలిగినవారు నిశ్చయము చేసికోవలయును. ఇది కప్పల తక్కెడ కారాదు. – తెలుగు మహాసభలపై విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ (3–3–1975) ..: కె.వి.నరేందర్ -
ఉద్యమాలను నడిపించేది కవులే
నిజామాబాద్ కల్చరల్,న్యూస్‌లైన్: ప్రతి ఉద్యమం, విప్లవం వెనుక కవులు, రచయితలు వెన్నుదన్నుగా నిలిచారని.. ఉద్యమాలు, ప్రజా చైతన్యంలో కవులపాత్ర ఎనలేనిదని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ కోకిల ధూంధాం’ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలలో భావజాల వ్యాప్తిని నింపింది కవులు, కళాకారులేనన్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి బాటలు వేసే రచనల ద్వారా కవులు, రచయితలు ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కవులు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దాశరథి స్ఫూర్తి తరగని నిధి.. సభను నిర్వహించిన ప్రముఖ కవి ఘనపు రం దేవేందర్ మాట్లాడుతూ... తెలంగాణ క వులకు దాశరథి స్ఫూర్తి తరగని నిధి అన్నా రు. ధిక్కారస్వరం కవిసహజలక్షణమన్నారు. ఉత్తమ సాహిత్యానికి చిరునామా తెలంగాణ.. గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు జమాల్పూర్ గ ణేశ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉత్తమస్థాయి సాహిత్యానికి చిరునామా అన్నారు. నాచనసోముడు, పోతనల రచనలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. ప్రజల భాషను కవిత్వంగా మార్చాలని, సమాజంలో ప్రయోగిస్తున్న నిరర్ధక పదాలను కవులు వాడరాదని ఆయన కోరారు.కవులు, కళాకారులు, ఉద్యమాలకు తెలంగాణ పుట్టినిల్లు అన్నారు. ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం... కవి సమ్మేళనం ఉర్రూతలూగించింది. డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య వ్యాఖాతలుగా కొనసాగిన కవి సమ్మేళనంలో.. మెంగవరం రాజేంద్రప్రసాద్ ‘దాశరథి’ పద్యాల ధారతో అదరహా అనిపించారు. దాశరథి ప్రయోగించిన ‘బొగ్గుముక్క’పై ప్రముఖ కవి కందాళై రాఘవాచార్య అల్లిన కవిత్వం అందరిని ఆకట్టుకుంది. తెలంగాఱ ఉద్యమసరళిపై ప్రముఖ కవి వీపీ చందన్రావు అందించిన కవిత్వం మైమరిపించింది. గంధం విజయలక్ష్మీ తెలంగాణ కథ, వెంకన్నగారి జ్యోతి పద్యాలు, గంట్యాల ప్రసాద్ అమరవీరు కవిత ఆహుతుల నుంచి జేజేలు అందుకున్నాయి. పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ నోటి నుంచి జాలువారిన నేను తెలంగాణ తల్లి కవిత శ్రోతలను కట్టిపడేసింది. నరాల సుధాకర్ భవిష్యత్ తెలంగాణ, గంగాప్రసాద్ మిమిక్రీ, దశరథ్ కోత్మీర్కార్, పురం శంకర్ల మినీ కవితలు ఆలోచనాత్మకంగా సాగాయి. మాధవీలత, పడాల రామారావు, గుత్పప్రసాద్, శారదాలక్ష్మణ్, శారద, రాజేశ్వర్ గంగాధర్ తమ కవితలలో తెలంగాణ వీరుల శౌర్యాన్ని వ్యక్తం చేశారు. ఎస్.సత్యనారాయణ, మల్లవరపు చిన్నయ్య, మల్లవరపు విజయ, మేక సుధాకర్, అయ్యవార్ల మురళి, పబ్బ మురళి, డాక్టర్ మల్లేశ్, పద్మనాభశాస్త్రి్త్ర, శ్రీదేవి, గిరిజా గాయత్రిల కవితాగానం ఆకట్టుకుంది. ప్రేరణి, ప్రణతి ఆలపించిన భక్తిగీతాలు, సిర్పలింగం, సాయిలవోల, రఘుల స్వీయ గేయాలు, సతీశ్, డప్పు రాజుల హాస్య విన్యాసాలు రక్తికట్టించాయి. కవి సమ్మేళనంలో జిల్లావ్యాప్తంగా అరవై మంది కవులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు చెన్న రవీందర్, సేనాపతి నరసింహమూర్తి, పోశెట్టి, సాహితీప్రియులు పాల్గొన్నారు.