ఉద్యమాలను నడిపించేది కవులే
నిజామాబాద్ కల్చరల్,న్యూస్‌లైన్: ప్రతి ఉద్యమం, విప్లవం వెనుక కవులు, రచయితలు వెన్నుదన్నుగా నిలిచారని.. ఉద్యమాలు, ప్రజా చైతన్యంలో కవులపాత్ర ఎనలేనిదని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ కోకిల ధూంధాం’ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలలో భావజాల వ్యాప్తిని నింపింది కవులు, కళాకారులేనన్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి బాటలు వేసే రచనల ద్వారా కవులు, రచయితలు ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కవులు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
దాశరథి స్ఫూర్తి తరగని నిధి..
సభను నిర్వహించిన ప్రముఖ కవి ఘనపు రం దేవేందర్ మాట్లాడుతూ... తెలంగాణ క వులకు దాశరథి స్ఫూర్తి తరగని నిధి అన్నా రు. ధిక్కారస్వరం కవిసహజలక్షణమన్నారు.
ఉత్తమ సాహిత్యానికి చిరునామా తెలంగాణ..
గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు జమాల్‌పూర్ గ ణేశ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉత్తమస్థాయి సాహిత్యానికి చిరునామా అన్నారు. నాచనసోముడు, పోతనల రచనలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. ప్రజల భాషను కవిత్వంగా మార్చాలని, సమాజంలో ప్రయోగిస్తున్న నిరర్ధక పదాలను కవులు వాడరాదని ఆయన కోరారు.కవులు, కళాకారులు, ఉద్యమాలకు తెలంగాణ పుట్టినిల్లు అన్నారు.
ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం...
కవి సమ్మేళనం ఉర్రూతలూగించింది. డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య వ్యాఖాతలుగా కొనసాగిన కవి సమ్మేళనంలో.. మెంగవరం రాజేంద్రప్రసాద్ ‘దాశరథి’ పద్యాల ధారతో అదరహా అనిపించారు. దాశరథి ప్రయోగించిన ‘బొగ్గుముక్క’పై ప్రముఖ కవి కందాళై రాఘవాచార్య అల్లిన కవిత్వం అందరిని ఆకట్టుకుంది. తెలంగాఱ ఉద్యమసరళిపై ప్రముఖ కవి వీపీ చందన్‌రావు అందించిన కవిత్వం మైమరిపించింది. గంధం విజయలక్ష్మీ తెలంగాణ కథ, వెంకన్నగారి జ్యోతి పద్యాలు, గంట్యాల ప్రసాద్ అమరవీరు కవిత ఆహుతుల నుంచి జేజేలు అందుకున్నాయి. పటాన్‌చెరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ నోటి నుంచి జాలువారిన నేను తెలంగాణ తల్లి కవిత శ్రోతలను కట్టిపడేసింది.
నరాల సుధాకర్ భవిష్యత్ తెలంగాణ, గంగాప్రసాద్ మిమిక్రీ, దశరథ్ కోత్మీర్‌కార్, పురం శంకర్‌ల మినీ కవితలు ఆలోచనాత్మకంగా సాగాయి. మాధవీలత, పడాల రామారావు, గుత్పప్రసాద్, శారదాలక్ష్మణ్, శారద, రాజేశ్వర్ గంగాధర్ తమ కవితలలో తెలంగాణ వీరుల శౌర్యాన్ని వ్యక్తం చేశారు. ఎస్.సత్యనారాయణ, మల్లవరపు చిన్నయ్య, మల్లవరపు విజయ, మేక సుధాకర్, అయ్యవార్ల మురళి, పబ్బ మురళి, డాక్టర్ మల్లేశ్, పద్మనాభశాస్త్రి్త్ర, శ్రీదేవి, గిరిజా గాయత్రిల కవితాగానం ఆకట్టుకుంది. ప్రేరణి, ప్రణతి ఆలపించిన భక్తిగీతాలు, సిర్పలింగం, సాయిలవోల, రఘుల స్వీయ గేయాలు, సతీశ్, డప్పు రాజుల హాస్య విన్యాసాలు రక్తికట్టించాయి. కవి సమ్మేళనంలో జిల్లావ్యాప్తంగా అరవై మంది కవులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు చెన్న రవీందర్, సేనాపతి నరసింహమూర్తి, పోశెట్టి, సాహితీప్రియులు పాల్గొన్నారు.