
ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్, సీఎస్ ఎస్పీసింగ్, కడియం, తుమ్మల, చందూలాల్
సాక్షి, హైదరాబాద్: సాహిత్య, భాషా ప్రాధాన్యంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మహాసభల ప్రధాన వేదికైన ఎల్‌బీ స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులూ సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15–19 మధ్య ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభల ఏర్పాట్లను సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ‘‘ప్రపంచ తెలుగు మహా సభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించి వారికి చక్కని సౌకర్యాలు కల్పించాలి. భారతీయ భాషల్లో జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన కవులు, రచయితలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరిద్దాం. పలు భాషలకు చెందిన మహానుభావులను సన్మానించిన కీర్తి తెలుగు మహాసభలకు దక్కాలి. పెద్ద ఎత్తున బాణసంచా వెలుగులతో అట్టహాసంగా మహాసభలు ప్రారంభమవాలి. కీలకమైన ప్రారంభ, ముగింపు సమావేశాల నిర్వహణ పక్కాగా, పకడ్బందీగా ఉండేలా చూడండి. సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటేలా ఉండాలి. ఐదు రోజుల్లో ఒక రోజు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలి’’అని ఆదేశించారు.
ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరవుతున్నారని, ముగింపు కార్యక్రమంలో స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటున్నారని సీఎం గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సభల సన్నాహకాలపై సాహిత్య అకాడమీ చైర్మన్ తదితరులను పలు విషయాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, చందూలాల్, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.
సీఎం చేసిన సూచనలు
- 8,000 వేల మందికి పైగా సభలకు హాజరవుతున్నందున ఎల్‌బీ స్టేడియం సహా ఒక్కో వేదిక పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పగించాలి. భోజనాలు, వసతి తదితర సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి
- ప్రతినిధులు ఇతర వేదికలకు, సాయంత్రం ప్రధాన వేదికకు చేరేందుకు రవాణా సదుపాయం కల్పించాలి
- ఎల్‌బీ స్టేడియంలో కార్యక్రమాల ప్రారంభానికి గంట ముందే ఇతర వేదికల్లో కార్యక్రమాలను ముగించాలి
- తెలంగాణపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రధాన వేదిక వద్ద ప్రదర్శించాలి. సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలి
- విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. ప్రారంభ, ముగింపు సమావేశాల్లో వారు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
- ఎల్‌బీ స్టేడియం వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి
- తొలిరోజు నుంచే ఫుడ్ కోర్టులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి
- జిల్లాల నుంచి తెలుగు ఉపాధ్యా యులు, లెక్చరర్లు, ఆచార్యులు, పలు రచయితల సంఘాల సభ్యులు, తెలుగులో పాండిత్యమున్న వారు, సాహిత్యాభిలాషులు మహాసభలకు వచ్చేందుకు రవాణా, భోజన సదుపాయాలను జిల్లా కలెక్టర్లు కల్పించాలి
- హైదరాబాద్ పరిసరాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న సాహిత్యాభిలాషులు సభలకు హాజరయేలా చూడాలి
- ‘ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే’ అన్న సందే శాన్ని అందరికీ చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలి
- నమోదు చేసుకున్న ప్రతినిధులకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలుండాలి
- పలు సాహిత్య వేదికల్లో పాల్గొనే వారికి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియాకు వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేయాలి