నాటి మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాల.. ఓ శనివారం.. ముందు పెట్టుకున్న నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి ఏదో అంశంపై మాట్లాడటమో, కవిత చెప్పటమో చేయాలి.. ఇంతలో బక్క పలచని ఎనిమిదో తరగతి విద్యార్థి లేచి నాటి సామాజిక పరిస్థితిని ఓ పద్యం, కొన్ని మాటల్లో చకచకా వివరించాడు. ఉపాధ్యాయులు చూస్తూ ఉండిపోయారు. ఈ పద్యాలు, ఆ మాటలుæ నీకెక్కడివిరా అనేసరికి.. ‘పద్యమంటే నాకు ఇష్టం, నా మాటలను పద్యంగా చెప్పటం ఇంకా ఇష్టం’ అన్నాడు!
40 ఏళ్లు గడిచాయి...
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. లక్షల సంఖ్యలో జనం ఒకచోటకు చేరారు. భారీ బహిరంగ సభలో ఓ బక్క పలచని వ్యక్తి వేదిక మీదకు వచ్చి పిడికిలి బిగించి చూపేసరికి జనంలో హోరు మొదలైంది. ఆ తర్వాత మాటలు.. వాటిని మించిన పద్యాలు.. ఆ తర్వాత పిట్ట కథలు.. తూటాల్లా పేలేసరికి ఆ ప్రాంగణం చప్పట్లు, ఈలల హోరుతో మార్మోగిపోయింది.
ఆ బక్క పలచని వ్యక్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఆయన వాగ్ధాటిలో అడుగడుగునా వినిపించే విరుపులు, పిట్ట కథలు, సూటిగా తాకే తూటాల్లాంటి మాటలు.. ఆ వాగ్ధాటి కొద్దిమందికే సాధ్యం. స్వతహాగా మంచి మాటకారి అయినప్పటికీ, ఆ మాటకు కొత్త పల్లవినిచ్చింది మాత్రం పద్యమే. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, శతకాలు ఓ మంత్ర దండంగా పనిచేసి ఆయన మాటకు వెలుగునిచ్చాయి.
ఈ మాట చెబుతోంది ఎవరో కాదు.. కేసీఆర్‌కు చిన్నప్పుడు తెలుగు సాహిత్యాన్ని బోధించిన గురువు వేలేటి మృత్యుంజయ శర్మ!ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం రోజున సభ మొదలుపెట్టేముందు వేదికపై ఈ గురువుకు ముఖ్యమంత్రి గురువందనం నిర్వహించారు. చిన్నప్పుడు తనకు పద్యాలు నేర్పింది ఈ గురువే అంటూ పాదాభివందనం చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే క్రమంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న తపన రావటానికి నాడు కేసీఆర్ తెలుగు సాహిత్యం చదవటమే కారణమంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మంచి మాట అవసరం. ఆ మాట మధురంగా ఉండాలి, అవసరమైతే కఠినంగా వినిపించాలి. కానీ ఎదుటివాడిని ఆకట్టుకునేలా ఉండాలి. గాలివాటం మాట ప్రభావాన్ని చూపదు. ఆ మాటకు ఏదో ఓ మాయ ఉండాలి. అది చేరాలంటే మన నోట సాహిత్యం పలకాలి. సాహిత్యమంటే అర్థం కాని గ్రాంథికమే కావాల్సిన అవసరం లేదు. జనం నోట కమ్మగా వినిపించే పద్యం చాలు. అలాంటి పద్యాలు రావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. ఇదంతా ఓ కృషి. అది ఆసక్తి ఉంటేనే సాధ్యం.
కేసీఆర్‌కు అదే బలం..: తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై అలవోకగా కేసీఆర్ నోట వచ్చిన పద్యాలు ఆయన ఇప్పుడు నేర్చుకున్నవి కాదు. చిన్నప్పుడు భాష వెంటపడి ఔపోసన పట్టినవే. అప్పుడు నేర్చిన పద్యాలు ఆయన్ను మాటల మాంత్రికుడిని చేశాయి. అది భాష గొప్పదనం. సాహిత్యం చదివిన వాడు తన మాటతో ప్రపంచాన్నే జయించగలడు. అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చి చూపిన కేసీఆర్‌కు ఆ భాషే బలం. సభ తొలిరోజు ఆయన పద్యాలు చదివిన తీరు లక్షల మందిలో కొత్త ఆలోచనను రేకెత్తించి ఉంటాయి. వారూ పద్యాలు నేర్చుకోవాలనే తపన తెచ్చుకుని ఉంటారు. మన అమ్మ భాషలోని కమ్మదనాన్ని ఆస్వాదించిన నాడు, అందులో కొంతలో కొంత వంటపట్టించుకున్న నాడు మనను గుర్తించే సమాజం ఆవిష్కృతమవుతుంది. ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం... ఏదైనా కావచ్చు మనకు కలిసి వస్తుంది.
ఎనిమిదో తరగతితో మొదలు..: నేను దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వెళ్లినప్పుడు కేసీఆర్ ఎనిమిదో తరగతిలో ఉన్నాడు. ఓ రోజు ఉత్తర గోగ్రహణంలోని ‘భీష్మద్రోణ కృపాదిధన్వినికరాభీలంబు...’ పద్యం చెప్పా. దాన్ని మరుసటి రోజు పుస్తకం చూడకుండా అప్పగించిన వారికి నోటు పుస్తకం బహుమతిగా ఇస్తానన్నా. కానీ ఓ ఐదు సార్లు దాన్ని చదివి అప్పటికప్పుడు కే సీఆర్ అప్పగించటంతో ప్రధానోపాధ్యాయుడి చేతిమీదుగా ఆయనకు పుస్తకం బహుమతిగా ఇచ్చా. ఆ రోజే భాషపట్ల ఆ విద్యార్థికి ఉన్న అనురక్తి గుర్తించా. మా ఇంటికి పాలు తెస్తూ..: ఆయన అప్పట్లో రాఘవరెడ్డి అనే మరో ఉపాధ్యాయుడి వద్ద ఉండి చదివేవాడు. ఆయన ఉన్న ఇంటికి సమీపంలోని ఇంటివారు మాకు పాలుపోసేవారు. ఓసారి కేసీఆర్ ఆ పాలు తీసుకుని మా ఇంటికి ఉదయం ఐదున్నరకు వచ్చాడు. వచ్చేసరికి నేను గ్రంథపఠనంలో ఉన్నాను. కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా విన్నాడు. అలా రోజూ రావటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొత్త విషయాలు, కొత్త పద్యాలు నేర్చుకునేవాడు. అలా రెండేళ్లు మా సాంగత్యం కొనసాగింది. తర్వాత నేను బదిలీపై మరో గ్రామానికి వెళ్లిపోయా. కానీ కేసీఆర్ మాత్రం తెలుగు భాషపై పట్టు పెంచుకుంటూ పోయాడు. సాయంత్రం వేళ చింతమడక గ్రామానికి చేరువలో ఉండే రామసంద్రం ఊరు చెరువు గట్టుపైకి వెళ్లి సొంతంగా పద్యరచన చేసేవాడు.
ప్రతి ఒక్కరికి ఉపయోగం: తెలుగులో మాట్లాడ్డమే మర్చిపోతున్న నేటి తరం భాష ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారైనా సరే, తెలుగు సాహిత్యంపై కొంత మక్కువ పెంచుకోవాలి. అది తదుపరి రోజుల్లో వారి మాట శుద్ధికి ఉపయోగపడుతుంది. అది వేరే భాషలు నేర్చుకోవటంలోనూ ఉపకరిస్తుంది. పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, పలుకుబడులు, జాతీయాలు, మన సాహితీ చరిత్రలను నేర్చుకుంటే మాటతో ముందడుగు వేస్తారు. వారి చుట్టూ జనం చేసి, వారి సాంగత్యం కోసం పరితపించే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు భాషకు ఉన్న శక్తి అలాంటిది. దానికి కేసీఆరే నిదర్శనం.
– గౌరీభట్ల నరసింహమూర్తి
పద్యం నేర్చుకుంటే మీరూ కేసీఆర్ కావొచ్చు!
Published Tue, Dec 19 2017 12:53 AM | Last Updated on Tue, Dec 19 2017 12:53 AM
Comments
Please login to add a commentAdd a comment