నిందితురాలు అనితా
బనశంకరి: కురబరహళ్లి జేసీ నగర్‌లో గురువారం జరిగిన నరసింహమూర్తి హత్యోదంతం మిస్టరీ వీడింది. తన అనైతిక సంబంధం భర్తకు తెలియడం, దీనిని నిత్యం ప్రశ్నిస్తుండటంతోనే ప్రియుడితో కలిసి నరసింహమూర్తిని అంతమొందించినట్లు భార్య అనిత వెల్లడించిందని పోలీసులు తెలిపారు. వివరాలు... మాగడి ప్రాంతానికి చెందిన అనితకు ఏడేళ్ల క్రితం నరసింహమూర్తి అనే వ్యక్తితో వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అనితకు ఆరునెలల క్రితం టీ.నరసీపుర నివాసి రోషన్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. రోషన్ కంతూరు చక్కెర ప్యాక్టరీలో ఏసీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.ఫేస్‌బుక్ స్నేహం ఇద్దరిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పసిగట్టిన భర్త నరసింహమూర్తి అనితను వేధించేవాడు. దీంతో భర్తను హత్య చేసి రోషన్‌ను వివాహం చేసుకోవాలని అనిత కుట్ర పన్నింది. ఇందుకు రోషన్ కూడా అంగీకరించాడు. గురువారం రాత్రి నరసింహమూర్తి భోజనం చేసిన తర్వాత అనిత రోషన్‌కు ఫోన్ చేసింది.
దీంతో రోషన్ తన కంపెనీలోనే పని చేస్తున్న సోమరాజుతో కలిసి అనితా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి నరసింహమూర్తిని తాళ్లతో బంధించి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి మంచం కిందికి తోసేశారు. రక్తపుమరకలను శుభ్రం చేశారు. వేకువజామున 4.30 సమయంలో మృతదేహాన్ని తరలించడానికి యత్నించగా కిందిఅంతస్తులో ఉన్న ఇంటి యజమాని నిద్రలేచారు. ఇరుగుపొరుగు వారు వాకింగ్ వెళ్లడంతో దీనితో మృతదేహాన్ని తరలించడం సాద్యం కాలేదు. 6 గంటలకు రోషన్, సోమరాజు ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం 8 గంటల సమయంలో అనిత తన అత్త హనుమమ్మ, ఇతరులకు ఫోన్ చేసి భర్త కనబడలేదని తెలిపింది. అనుమానం వచ్చిన హనుమమ్మ మంచం కింద ఉన్న మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. మహాలక్ష్మీలేఔట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనితా, ఆమె పాత ప్రియుడు ప్రవీణ్‌పై అనుమానం ఉందని హనుమమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు ప్రవీణ్ పాత్రలేదని విచారణలో తేలింది. అనితను మరింత లోతుగా విచారణ చేయగా రోషన్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment