
సాక్షి, హైదరాబాద్ : ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతి ఒక్కరం చేయి చేయి కలపాలి’’అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన తెలుగులోనే ప్రసంగించారు.
‘‘తెలుగు మహాసభలు ముగిశాయి. కానీ మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. మాతృభాష పరిరక్షణ కుటుంబం నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లి, తండ్రి, గురువు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాలప్పుడు ఒక తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నా. ఐదు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అమ్మభాషకు తెలంగాణ ప్రణమిల్లింది. 15 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి విచ్చేసిన భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. అవధానాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, గోష్టులు, ఇతర సాహిత్య రూపాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, ఇంత గొప్ప పండుగలో పాలుపంచుకున్న వారికి, భాగస్వాములైన వారికి అభినందనలు’అని ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment