సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యేలా.. తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా.. తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపేలా.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యం ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా కలసి ఎలా పనిచేశారో, అంతే పట్టుదలతో, సమన్వయంతో తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగింది. తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారు. ప్రతిభా పాటవాలకు కొదవలేదు. కానీ తెలంగాణ వారి ప్రతిభ రావాల్సినంతగా వెలుగులోకి రాలేదు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలి. అన్ని భాషా ప్రక్రియలపై ప్రత్యేక కార్యక్రమాలుండాలి. చిత్ర లేఖనం తో పాటు ఇతర కళలకు ప్రాధాన్యం ఉండాలి. అముద్రిత గ్రంథాలను ముద్రించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలని, తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
‘భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లుండాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలి. హైదరాబాద్‌లో వివిధ వేదికలు ఏర్పాటు చేసి, ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలి’అని సీఎం చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టును ఖచ్చితంగా బోధించాలనే నిబంధన పెట్టింది. ఉర్దూ మీడియం స్కూళ్లలో కూడా ఈ విధానం అమలు చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. ఇది మంచి పరిణామం. తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరికే విధానం అమలు చేస్తాం. అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి’అని సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ కవిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
మరో రెండు కమిటీల ఏర్పాటు..
తెలుగు మహాసభలను పురస్కరించుకుని ప్రభుత్వం మరో రెండు నిర్వాహక క మిటీలను ప్రకటించింది. వేదిక, మీడియా కు సంబంధించి అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వేదిక కమిటీలో రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ, హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్, సాహిత్య అకాడమీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ చైర్మన్‌గా మీడియా కమిటీలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
సీఎం చేసిన మరికొన్ని సూచనలు..
- ఇక నుంచి ఏటా ఒక రోజు తెలంగాణ తెలుగు సభ నిర్వహిస్తాం.
- సభల నిర్వహణకు సాహితీవేత్తలతో ఉప సంఘాలు వేయాలి.
- మహాసభల వేదికపై కచ్చితంగా మహిళా సాహితీవేత్తల ప్రాతినిధ్యం ఉండాలి.
- లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభ, ముగింపు సమావేశాలు నిర్వహించాలి. అక్కడే తెలుగు శాసనాలను ప్రదర్శనకు పెట్టాలి.
- తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- ముఖ్య కూడళ్లకు తెలంగాణలోని తెలుగు భాషా ప్రముఖుల పేర్లు పెట్టాలి.
- మహాసభల సందర్భంగా ఇతర భాషల్లోని ప్రముఖులను గుర్తించి, సన్మానించాలి.
- ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రముఖుల జీవిత గాథలతో పుస్తకాలు ముద్రించాలి.
Comments
Please login to add a commentAdd a comment