తెలంగాణలో తొలితెలుగు పత్రిక | First Telangana News paper | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తొలితెలుగు పత్రిక

Published Mon, Dec 18 2017 1:13 AM | Last Updated on Mon, Dec 18 2017 1:13 AM

First Telangana News paper - Sakshi

మహబూబ్‌ నగర్‌ నుంచి 1913లో  వెలువడిన ‘హితబోధిని’ తొలి తెలంగాణ పత్రికగా చాలాకాలం వరకూ ప్రచారంలో ఉండేది. అయితే అంతకు మూడు దశాబ్దాల కిందటే ఉర్దూ మాతృకకు అనువాదంగా వెలువడిన ‘శేద్య చంద్రిక’ గురించి చాలాకాలం వరకూ చరిత్రకు అందలేదు. మద్రాసు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్స్‌ లైబ్రరీ (ప్రాచ్యలిఖిత గ్రం«థాలయం)లో దీని ప్రతి దొరికింది.

ప్రసిద్ధ పరిశోధకుడు స్వర్గీయ బంగోరె (బండి గోపాలరెడ్డి), ఆయన సన్నిహితుడైన డాక్టర్‌ పీఎస్‌ గోపాలకృష్ణ (ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేసి హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యోగ విరమణ చేశారు) ఒక సందర్భంలో మరేదో పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళ కంటబడింది. చాలా ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, వాళ్ళ దృష్టి వేరే విషయం మీద నిమగ్నమై ఉండటం వలన దాన్ని పక్కనబెట్టారు.

ఈ విషయాన్ని గోపాలకృష్ణ గారు నాతో పంచుకోవటంతో ఓరియెంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీకి వెళ్ళి వెతకటం మొదలు పెట్టా. అప్పట్లో పుస్తకాలుగాని, లిఖిత ప్రతులుగాని, తాళపత్రాలు గాని ఏవీ ఒక క్రమ పద్ధతిలో లేవక్కడ. బీరువాలు నింపేసి ఉన్నాయి. దీంతో రోజూ ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఆరు వరకూ వరుసగా అన్ని బీరువాలు వెతుకుతూ వస్తే మూడో రోజు ఇది కంటబడింది. లైబ్రరీ రికార్డుల ప్రకారం చూస్తే 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ లో జరిగిన ప్రదర్శనలో శేద్య చంద్రికను కూడా ప్రదర్శించారు. బహుశా ఎవరి దృష్టిలోనూ పడి ఉండకపోవచ్చు.

శేద్య చంద్రిక మొత్తం 40 పేజీలుంది. చెక్కమీద చెక్కి ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నారని ముద్రణాసాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధించిన వారు ఆ తరువాత తేల్చారు. ఉర్దూ్దలో వెలువరించిన ఫునూన్‌ అనే పత్రికకు ఇది అనువాదమని పత్రిక సంపాదకీయాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అప్పట్లో జనం భాషలో ఉర్దూ పదాలు దొర్లేవనటానికి నిదర్శనంగా తెలుగు అనువాదంలోనూ అనేక ఉర్దూ పదాలు కనిపిస్తాయి.

ముఖపత్రం గమనిస్తే నిజాం ఆదేశాలకు అనుగుణంగా రైతుల క్షేమం కోసం ప్రచురించినట్టు చెప్పుకోవటం కనిపిస్తుంది. పబ్లిషర్‌ గా మున్షీ మహమ్మద్‌ ముష్తాక్‌ అహ్మద్‌ పేరు చెబుతూ ఫునూన్‌ పేరు ప్రస్తావించారు. హైదరాబాద్‌ పత్తర్‌ ఘట్టి లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ (చాప్‌ ఖానా)లో ముద్రణ జరిగినట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రచురించిన పత్రిక ఇది. 6వ నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలి పాలనలో 1875–1910 మధ్య కాలంలో వెలువడిన అనేక ఉర్దూ పత్రికలలో ఫునూన్‌ ఒకటి. తెలుగు ప్రజల కోసం....  ముఖ్యంగా రైతుల కోసం తెలుగు అనువాద పత్రికను అందిస్తున్నట్టు శేద్యచంద్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు.

‘‘ ... ఈ విషయంలో ఆత్మ సంతోషకరమైన అభిప్రాయంను తెల్యిజేసి ఉండిరి కదా– రిసాలా పూనూను తరజుమా దేశ భాలో ఛాపాయించవలెను –  ఆ రీతి చేశినట్టయితే రచయితలకు చాల ఫాయిదా కాగలదు. కాబట్టి మేము మొదలు ప్రస్తుతం తెన్గు భాషలో రిసాలా చేసి వున్నాము రయిత్లు యింద్లు గవురవం చేశినట్లయితే హాకంలు యిందుపైన మతవఝా అయినట్టయితె తిర్గి మాహారాష్ట్రం భాషలో కూడా ఛపాయించుటం కాగలదు.’’

శేద్య చంద్రికకు లభించే ఆదరణను బట్టి నిజాం ఏలుబడిలో ఉన్నప్రాంతీయ భాషల్లో కూడా ప్రచురించాలనే ఆలోచనతో ఉన్నట్టు పేర్కొనటం గమనార్హం. బహుశా ఆ తరువాత కాలంలో మరాఠీ, కన్నడ భాషల్లో కూడా ప్రచురించాలనుకొని ఉండవచ్చు. పాలకులు ఆశించిన విధంగా శేద్య చంద్రికకు ఆదరణ లభించిందా, ఇతర భాషలకూ విస్తరించారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

రైతులకు తెలియాల్సిన మెలకువల గురించి, ఆధునిక పోకడల గురించి, ఇతర దేశాల నుంచి అందుతున్న సమాచారం గురించి చెప్పటానికి ఇందులో ప్రాధాన్య మిచ్చారు. అదే సమయంలో వైద్య చిట్కాల వంటివి కూడా పత్రికలో చేర్చారు. రెవెన్యూ వసూళ్ళ వివరాలు, బకాయిల వివరాలు పేర్కొనటంతోబాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరెవరు ఎక్కడికి బదలీ అయ్యారో ఆ సమాచారం కూడా శేద్య చంద్రికలో పొందుపరచారు. వ్యవసాయం లాభదాయకంగా సాగటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే పేరుకు తగినట్టుగా ఇది పూర్తిగా రైతుల పత్రిక. తెలుగు మాత్రమే తెలిసిన  రైతుల కోసం చేసిన ప్రయత్నమే ఇది.  

అయితే, శేద్య చంద్రిక వెలుగు చూసిన తరువాత కేవలం అందులోని విషయాలనే ప్రస్తావిస్తూ, అప్పటికే తెలిసిన పత్రికల చరిత్రను జోడించిన పరిశోధకులు అంతకుమించి శోధించలేదు. శేద్య చంద్రిక ఆ తరువాత ఎన్ని సంపుటాలు ప్రచురితమైందని గాని, ఇతర భాషల్లో కూడా ప్రచురితమైందా, లేదా అనే విషయం గాని తేల్చలేదు. ఆ మాటకొస్తే, శేద్య చంద్రికను పరిశీలించిన ఆరుద్ర, తిరుమల రామచంద్ర ఇది 1883 నాటిదని లెక్కగట్టగా మరికొందరు దీన్ని 1886 నాటిదని అంటున్నారు. ఇది కూడా నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తేలాల్సిన విషయమే.

-తోట భావనారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement