అందరూ ఆహ్వానితులే! | kadiam srihari to oversee arrangement of world telugu conference | Sakshi
Sakshi News home page

అందరూ ఆహ్వానితులే!

Published Fri, Dec 8 2017 4:25 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

kadiam srihari to oversee arrangement of world telugu conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విదేశాలకు చెందిన 37 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 56 మందిని మహాసభలకు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. వీరి రవాణా ఖర్చులతోపాటు భోజన వసతి సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. గురువారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు కోసం ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం తొలిసారిగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం కడియం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, చందూలాల్‌తోపాటు మహాసభల నిర్వహణ కమిటీతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ, డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ 5 వరకు ప్రతినిధుల నమోదు చేపట్టామని.. మొత్తం 7,900 మందికిపైగా ప్రతినిధులు తెలుగు మహాసభలకు పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. 40 దేశాల నుంచి 160 మంది, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 1,167 మంది, తెలంగాణ నుంచి 6 వేల మంది నమోదు చేసుకున్నారని చెప్పారు.  

పుస్తక ప్రదర్శన, ఫుడ్‌ స్టాళ్లు..
ప్రతినిధులుగా నమోదు చేసుకోని వారు కూడా మహాసభలకు హాజరుకావచ్చని కడియం తెలిపారు. తెలంగాణ భాషను, యాసను, జీవన విధానాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజువారీగా కార్యక్రమాల షెడ్యూలు, నిర్ణీత వేళలు అందరికీ ముందుగానే తెలిసేందుకు ప్రచారం చేస్తామని అన్నారు. తెలంగాణ రచనలను, పుస్తకాలను పరిచయం చేసేందుకు వీలుగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఆహారపు అలవాట్లను తెలియజేసేందుకు ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణకు ప్రత్యేకంగా పేరు తెచ్చిన హస్త కళలు, చేనేత చీరల స్టాళ్లు ఉంటాయన్నారు. ఏపీకి చెందిన తెలుగు భాషా పండితులు, సాహిత్యాభిమానులను మహాసభలకు ఆహ్వానించామని, ప్రత్యేకంగా కొందరికి సన్మానం చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు కడియం తెలిపారు. మహాసభల్లో భాగంగా ఈనెల 18న సినీ సంగీత విభావరిని నిర్వహించడంతోపాటు సినీ ప్రముఖులకు సన్మానం చేస్తామన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement