
సాక్షి, హైదరాబాద్: తెలుగుతల్లి, తెలంగాణ తల్లి వేర్వేరు అని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సభలు తెలంగాణ సభలా, తెలుగు సభలా అనేది చెప్పాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుతల్లి లేదని, తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే తెలుగుతల్లి ఏం చేసిందని ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
పుంటికూర–గోంగూర, ఆనపకాయ–సొరకాయ వేర్వేరు అని, తెలుగుతల్లి, తెలంగాణ తల్లి కూడా వేర్వేరు అంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలుగు మహాసభలను బహిష్కరించాలని అప్పుడు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు నిర్వహిస్తున్నందుకు ముందుగా తెలంగాణ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరూరా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏం చేద్దామో చెప్పాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’గీతం ఉంటుందా అని ప్రశ్నించారు. గద్దర్, అందెశ్రీ, విమలక్క, గోరటి వెంకన్న పాటలు ఉంటాయా అని ప్రశ్నించారు. వీళ్లంతా గజ్జెలుకట్టి ఆడిపాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు.