సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఉద్యమ నేతగా చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు తీసేస్తామనే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారారా అని ప్రశ్నించింది. ఆదివారం ఈ మేరకు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.
అప్పటి పాలకులు మీలాగే ఎస్మా, గిస్మా అని ఉంటే ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా, అని ప్రశ్నించారు. ఆర్టీసీపై ఉమ్మ డి పాలకులు నిర్లక్ష్యం చేశారని ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు చెప్పిన మీరే.. ఇప్పుడు అదే దారిలో నడుస్తారా అని నిలదీశారు. దేశంలో ఒక్క మన ఆర్టీసీనే నష్టాల్లో లేదని, చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీలు నష్టాల్లోనే ఉన్నాయన్నారు. ఉచిత బస్సు పాస్‌ల రీయింబర్స్‌మెంట్, ఇంధన నష్టాలు, అప్పులపై వడ్డీలు ఆర్టీసీపై రుద్దుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment