
సాక్షి, హైదరాబాద్ : ‘‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దక్షిణ భారతీయుణ్ని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని..’’ అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు ఏనాడూ లేని విధంగా తెలుగులో మాట్లాడిన ఓవైసీ.. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని గుర్తుచేశారు.
అసద్ ప్రసంగం ఇలా సాగింది.. ‘‘గౌరవ సభా పెద్దలు, సోదరసోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరుగుతుండటం సంతోషకరమైన విషయం. తెలుగు, ఉర్దూ భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషిచేస్తున్నారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యమత్యంగా ఉన్నారు.. పాలు-నీళ్లలా కలిసిపోయారు. తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.పాతబస్తీకి చెందిన హమీదుల్లా షరీఫ్.. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. గఫూర్ గారు తెలుగులో ఎన్నో సాహితీప్రక్రియలు రాశారు. నేను ఢిల్లీలో దక్షిణ భారతీయుడిని, తెలంగాణలో తెలంగాణవాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబాదీని. సమస్త ప్రపంచంలో మనది ఒక దేశం. వేలకొద్దీ భాషలు, సంస్కృతులు ఉన్నాయి. మనందరం ఇక్కడికి వచ్చి.. ఇదీ మన సంస్కృతి అని ప్రపంచానికి చాటి చెబుతున్నాం’’ అని తెలుగులో పేర్కొన్నారు.
తప్పులుంటే మన్నించండి : తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్ ఓవైసీ.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు.
తెలుగులో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం వీడియో
Comments
Please login to add a commentAdd a comment