సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని తెలంగాణ ఎన్నారైలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సీఎం ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో విందు ఇచ్చారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని వారికి వివరించారు. ‘‘చైనాలో సంస్కరణలు మొదలయ్యాక.. వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట తమ స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.. దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారు. తెలంగాణ ఎన్నారైలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి...’’అని కేసీఆర్ కోరారు.
పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం..
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ అస్తిత్వాన్నే ఎవరూ గుర్తించలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సమైక్య రాష్ట్రానికి 70 శాతం ఆదాయం తెలంగాణ నుంచే వచ్చేది. కానీ 10–15 శాతం కూడా ఈ ప్రాంతం కోసం ఖర్చు చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్థికవేత్త హనుమంతరావు వంటివారు 1956 నుంచి లెక్కలు తీసి దీనిని నిరూపించారు. నీటి వాటాలో, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది. భాష, సంస్కృతిపై దాడి జరిగింది. సినిమాల్లో తెలంగాణ వారిని జోకర్లుగా చూపెట్టేవారు.
అలాంటి స్థితి నుంచి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం..’’అని వివరించారు. చిమ్మ చీకట్లు అలుముకున్న స్థితి నుంచి కోతల్లేని 24 గంటల విద్యుత్ అందించే స్థాయికి వచ్చామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయాలన్నీ ప్రపంచానికి చెప్పి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఎన్నారైలను కోరారు. సమావేశంలో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎన్నారైల కో–ఆర్డినేటర్ మహేశ్ బిగాల తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో దూసుకు పోతున్నాం..
ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో.. ఇప్పుడు అదే విధంగా దూసుకుపోతోందని, 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ చెప్పారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు.
భారీగా ప్రాజెక్టులు చేపట్టామని, రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎన్నారైలకు వివరించారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ చాలా బాగుందని, మంచి వాతావరణం ఉందని చెప్పారు. అవినీతికి ఆస్కారమివ్వని, 15 రోజుల్లోనే అనుమతులిచ్చే పారిశ్రామిక విధానం అమలవుతోందని తెలిపారు. ఈ విషయాలను ప్రపంచవ్యాప్తంగా వివరించి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కృషి చేయాలని.. తెలంగాణ బిడ్డలుగా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment