సాక్షి, హైదరాబాద్: తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకోలేదా..? నో ప్రాబ్లమ్.. రిజిస్ట్రేషన్‌తో ప్రమేయం లేకుండా సభా ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని కార్యక్రమాలు వీక్షించొచ్చు. ఈ మేరకు నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. అయితే.. ప్రాంగణంలోని వారికి ఉచిత భోజనం మాత్రం అందుబాటులో ఉండదు. సబ్సిడీ ధరలపై విక్రయించే భోజన పదార్థాలు కొనుక్కోవాలి. బస కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నందున వీలైనంత ఎక్కువమంది హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌లతో ప్రమేయం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలో నిర్వహించిన సభల్లో భోజనానికి ప్రజలు ఇబ్బంది పడిన నేపథ్యంలో.. ఈసారి ఆ పరిస్థితి రాకుండా భోజన ఏర్పాట్లపై దృష్టి సారించింది. భోజనం, వసతి విషయమై గందరగోళం లేకుండా రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది. పేర్లు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా భోజనం, వసతి కల్పించనుంది.
వీక్షకుల గ్యాలరీలో..
రిజిస్ట్రేషన్ గడువు పూర్తవడంతో మహాసభల నిర్వహక కమిటీ తాజాగా స్పష్టతనిచ్చింది. పేర్లు నమోదు చేసుకోని వారు కూడా నేరుగా సభా వేదిక వద్దకు వచ్చి గ్యాలరీలో కూర్చుని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా 2,611 మంది.. నేరుగా 4,293 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆహ్వానాల రూపంలో మరో 1,000 మంది కలిపి మొత్తంగా 8,000 మందికి ఉచితంగా భోజనం, రవాణా, వసతి కల్పిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఎంత మంది వచ్చినా ఎల్బీస్టేడియంలో మైదానం చుట్టూ ఉండే వీక్షకుల గ్యాలరీ (మెట్ల రూపంలో ఉండే ప్రాంతం)లో కూర్చునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు మైదానం మధ్యలో ప్రధాన సభా ప్రాంగణంలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ బారికేడింగ్ ఉంటుంది. వాటి వెలుపల రిజిస్ట్రేషన్ చేసుకోనివారిని అనుమతిస్తారు.
కార్టూన్లకు ఆహ్వానం
తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం పలుకుతున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగలు, సామెతల ఆధారంగా గీసే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు శంకర్, మృత్యుంజయ్, నర్సిం వ్యవహరిస్తారు. కార్టూన్లను ఏ–3 సైజులోనే వేయాలి. డిసెంబర్ 10 లోపు wtmscartoon@ gmail.comకు ఈ–మెయిల్ చేయాలి. వ్యాఖ్య తెలుగులోనే ఉండాలి. కార్టూన్‌తో పాటు కార్టూనిస్ట్ ఊరు, జిల్లా పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో హామీ పత్రం జతచేసి పంపాలి. ఇప్పటికే ఈ ప్రదర్శన నిమిత్తం కార్టూన్లు పంపిన వారు మళ్లీ పంపాల్సిన అవసరం లేదు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతి అందజేస్తారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించే కార్టూన్లను పుస్తక రూపంలో అచ్చువేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment