no registration
-
రామఫోసా గద్దెదిగే ప్రసక్తే లేదు: ఏఎన్సీ
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా రాజీనామా చేయబోరని పార్టీ స్పష్టం చేసింది. ఐక్య కూటమి ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని పేర్కొంది. ఎన్నికల్లో ఏఎన్‌సీకి 40 శాతం, డెమొక్రటిక్ అలయెన్స్‌కు 20 శాతం, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సారథ్యంలోని ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు రావడం తెలిసిందే. 1994లో వర్ణ వివక్ష అంతమైన ఎన్నికలు జరిగినప్పటి ఏఎన్‌సీకి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి. -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
పేరు నమోదు చేసుకోలేదా..?
సాక్షి, హైదరాబాద్: తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకోలేదా..? నో ప్రాబ్లమ్.. రిజిస్ట్రేషన్‌తో ప్రమేయం లేకుండా సభా ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని కార్యక్రమాలు వీక్షించొచ్చు. ఈ మేరకు నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. అయితే.. ప్రాంగణంలోని వారికి ఉచిత భోజనం మాత్రం అందుబాటులో ఉండదు. సబ్సిడీ ధరలపై విక్రయించే భోజన పదార్థాలు కొనుక్కోవాలి. బస కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నందున వీలైనంత ఎక్కువమంది హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లతో ప్రమేయం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలో నిర్వహించిన సభల్లో భోజనానికి ప్రజలు ఇబ్బంది పడిన నేపథ్యంలో.. ఈసారి ఆ పరిస్థితి రాకుండా భోజన ఏర్పాట్లపై దృష్టి సారించింది. భోజనం, వసతి విషయమై గందరగోళం లేకుండా రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది. పేర్లు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా భోజనం, వసతి కల్పించనుంది. వీక్షకుల గ్యాలరీలో.. రిజిస్ట్రేషన్ గడువు పూర్తవడంతో మహాసభల నిర్వహక కమిటీ తాజాగా స్పష్టతనిచ్చింది. పేర్లు నమోదు చేసుకోని వారు కూడా నేరుగా సభా వేదిక వద్దకు వచ్చి గ్యాలరీలో కూర్చుని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 2,611 మంది.. నేరుగా 4,293 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆహ్వానాల రూపంలో మరో 1,000 మంది కలిపి మొత్తంగా 8,000 మందికి ఉచితంగా భోజనం, రవాణా, వసతి కల్పిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఎంత మంది వచ్చినా ఎల్బీస్టేడియంలో మైదానం చుట్టూ ఉండే వీక్షకుల గ్యాలరీ (మెట్ల రూపంలో ఉండే ప్రాంతం)లో కూర్చునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు మైదానం మధ్యలో ప్రధాన సభా ప్రాంగణంలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ బారికేడింగ్ ఉంటుంది. వాటి వెలుపల రిజిస్ట్రేషన్ చేసుకోనివారిని అనుమతిస్తారు. కార్టూన్లకు ఆహ్వానం తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం పలుకుతున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగలు, సామెతల ఆధారంగా గీసే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు శంకర్, మృత్యుంజయ్, నర్సిం వ్యవహరిస్తారు. కార్టూన్లను ఏ–3 సైజులోనే వేయాలి. డిసెంబర్ 10 లోపు wtmscartoon@ gmail.comకు ఈ–మెయిల్ చేయాలి. వ్యాఖ్య తెలుగులోనే ఉండాలి. కార్టూన్‌తో పాటు కార్టూనిస్ట్ ఊరు, జిల్లా పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో హామీ పత్రం జతచేసి పంపాలి. ఇప్పటికే ఈ ప్రదర్శన నిమిత్తం కార్టూన్లు పంపిన వారు మళ్లీ పంపాల్సిన అవసరం లేదు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతి అందజేస్తారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించే కార్టూన్లను పుస్తక రూపంలో అచ్చువేయనున్నారు. -
చైనా, రష్యా డిగ్రీలు చెల్లని నాణేలు
సాక్షి, హైదరాబాద్: వైద్యచదువుల మోజుతో పలు దేశాల కెళ్లి డిగ్రీలు చేతబట్టుకుని స్వరాష్ట్రంలో వైద్యం చేసుకుందామనుకున్న వేలాది మంది అభ్యర్థుల ఆశలపై భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నీళ్లు చల్లింది. చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు వెళ్లి పీజీ మెడిసిన్ చేసి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లకు రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తే లేదని ఎంసీఐ తేల్చిచెప్పింది. వారి పీజీ డిగ్రీలకు రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కాదు, వారికి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేదని చెబుతోంది. దీంతో లక్షలు పోసి చదువుకుని వచ్చిన వేలాది మంది అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. అక్కడైతే చౌకగా మెడిసిన్ చదివి రావడమే కాదు, సులభంగా అడ్మిషన్లు లభిస్తాయని, అంతకంటే సులభంగా పాసై రావచ్చునన్న ఆశతో ఇక్కడ సీట్లురాని వారు చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి చదువుకున్నారు. అక్కడి పీజీ సర్టిఫికెట్లు చెల్లవని, వాటికి రిజిస్ట్రేషన్ చేయవద్దని అన్ని రాష్ట్రాల కౌన్సిళ్లకు భారతీయ వైద్యమండలి ఆదేశించింది. ఈ పరిణామంతో విదేశీ పీజీ వైద్య డిగ్రీ చదివిన అభ్యర్థులు హడలిపోతున్నారు. ఆ ఐదు దేశాలకు వెళ్లే అవకాశముంది ఇష్టమొచ్చినట్టు ఏ దేశంలో పడితే ఆ దేశంలో మెడిసిన్ చదివి ఇక్కడ ప్రాక్టీస్ అంటే కుదరదని, ఆ ఐదు దేశాల్లో చదివిన వారికి అనుమతిస్తామని ఎంసీఐ చెబుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మాత్రమే చదివిన వారి సర్టిఫికెట్లకు భారతీయ వైద్యమండలిలో రిజిస్ట్రేషన్ లభిస్తుంది. అంతేగాకుండా ఇకపై యూజీ (ఎంబీబీఎస్) కోర్సుకు చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లే అభ్యర్థులు కూడా ఇంటర్ పరీక్ష పూర్తి కాగానే ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. ఎల్జిబిలిటీ తీసుకోకుండా ఎంబీబీఎస్ చదివి వస్తే వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు. నేపాల్ లాంటి కొన్ని సార్క్ దేశాల్లో చదివే అవకాశముందనేది ఎంసీఐ వాదన. నిమ్స్, జీఎంసీలకే అనుమతి లేదు ఇది మరీ దారుణమైన పరిస్థితి. విదేశీ వైద్య పీజీ డిగ్రీలు చెల్లవంటే ఏమో అనుకోవచ్చు. కానీ గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ), నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), కాటూరి మెడికల్ కాలేజీ వంటి కళాశాలల్లోనే పీజీ రేడియాలజీ సీట్లకు అనుమతి లేదు. అయినా ఎన్టీఆర్ వర్సిటీ ఈ కోర్సులకు అడ్మిషన్లు ఇస్తోంది. ఎంసీఐ వీటి సర్టిఫికెట్లను అనుమతించడం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ కోర్సు ఒక్క ఉస్మానియా కళాశాలకు మినహా మరెక్కడా లేదు. అయినా సరే పర్మిటెడ్ సీట్ల కింద చేర్చుకుంటున్నారు. పైన పేర్కొన్న కళాశాలల్లో పీజీ రేడియాలజీ చేసిన వారికి ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. తమ అనుమతి లేకుండా సీట్లు ఇవ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఎంసీఐ చెబుతోంది. అభ్యర్థులు బలిపశువులవుతున్నారు ఇప్పటికీ చాలాసార్లు ఎంసీఐ పర్యవేక్షణలో నోటిఫికేషన్లు జారీ చేశాం. ఫలానా దేశాలకు వెళ్లి పీజీ చేయవద్దని కోరాం. అయినా వెళుతున్నారు. చివరకు బలిపశువులుగా మారుతున్నారు. వాళ్ల సర్టిఫికెట్లకు రిజిస్ట్రేషన్లుచేయద్దని ఎంసీఐ విధిగా ఆదేశించింది. ప్రభుత్వ కళాశాలల్లోనూ అనుమతి లేకుండా కోర్సులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన చేస్తే అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది. –డా.ఎం.జయచంద్రనాయుడు, వైస్ చైర్మన్, ఏపీ మెడికల్ కౌన్సిల్