చైనా, రష్యా డిగ్రీలు చెల్లని నాణేలు
సాక్షి, హైదరాబాద్: వైద్యచదువుల మోజుతో పలు దేశాల కెళ్లి డిగ్రీలు చేతబట్టుకుని స్వరాష్ట్రంలో వైద్యం చేసుకుందామనుకున్న వేలాది మంది అభ్యర్థుల ఆశలపై భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నీళ్లు చల్లింది. చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు వెళ్లి పీజీ మెడిసిన్ చేసి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లకు రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తే లేదని ఎంసీఐ తేల్చిచెప్పింది. వారి పీజీ డిగ్రీలకు రిజిస్ట్రేషన్ చేయకపోవడమే కాదు, వారికి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేదని చెబుతోంది. దీంతో లక్షలు పోసి చదువుకుని వచ్చిన వేలాది మంది అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. అక్కడైతే చౌకగా మెడిసిన్ చదివి రావడమే కాదు, సులభంగా అడ్మిషన్లు లభిస్తాయని, అంతకంటే సులభంగా పాసై రావచ్చునన్న ఆశతో ఇక్కడ సీట్లురాని వారు చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లి చదువుకున్నారు. అక్కడి పీజీ సర్టిఫికెట్లు చెల్లవని, వాటికి రిజిస్ట్రేషన్ చేయవద్దని అన్ని రాష్ట్రాల కౌన్సిళ్లకు భారతీయ వైద్యమండలి ఆదేశించింది. ఈ పరిణామంతో విదేశీ పీజీ వైద్య డిగ్రీ చదివిన అభ్యర్థులు హడలిపోతున్నారు.
ఆ ఐదు దేశాలకు వెళ్లే అవకాశముంది
ఇష్టమొచ్చినట్టు ఏ దేశంలో పడితే ఆ దేశంలో మెడిసిన్ చదివి ఇక్కడ ప్రాక్టీస్ అంటే కుదరదని, ఆ ఐదు దేశాల్లో చదివిన వారికి అనుమతిస్తామని ఎంసీఐ చెబుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మాత్రమే చదివిన వారి సర్టిఫికెట్లకు భారతీయ వైద్యమండలిలో రిజిస్ట్రేషన్ లభిస్తుంది. అంతేగాకుండా ఇకపై యూజీ (ఎంబీబీఎస్) కోర్సుకు చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లే అభ్యర్థులు కూడా ఇంటర్ పరీక్ష పూర్తి కాగానే ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. ఎల్జిబిలిటీ తీసుకోకుండా ఎంబీబీఎస్ చదివి వస్తే వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు. నేపాల్ లాంటి కొన్ని సార్క్ దేశాల్లో చదివే అవకాశముందనేది ఎంసీఐ వాదన.
నిమ్స్, జీఎంసీలకే అనుమతి లేదు
ఇది మరీ దారుణమైన పరిస్థితి. విదేశీ వైద్య పీజీ డిగ్రీలు చెల్లవంటే ఏమో అనుకోవచ్చు. కానీ గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ), నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), కాటూరి మెడికల్ కాలేజీ వంటి కళాశాలల్లోనే పీజీ రేడియాలజీ సీట్లకు అనుమతి లేదు. అయినా ఎన్టీఆర్ వర్సిటీ ఈ కోర్సులకు అడ్మిషన్లు ఇస్తోంది. ఎంసీఐ వీటి సర్టిఫికెట్లను అనుమతించడం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ కోర్సు ఒక్క ఉస్మానియా కళాశాలకు మినహా మరెక్కడా లేదు. అయినా సరే పర్మిటెడ్ సీట్ల కింద చేర్చుకుంటున్నారు. పైన పేర్కొన్న కళాశాలల్లో పీజీ రేడియాలజీ చేసిన వారికి ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. తమ అనుమతి లేకుండా సీట్లు ఇవ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఎంసీఐ చెబుతోంది.
అభ్యర్థులు బలిపశువులవుతున్నారు
ఇప్పటికీ చాలాసార్లు ఎంసీఐ పర్యవేక్షణలో నోటిఫికేషన్లు జారీ చేశాం. ఫలానా దేశాలకు వెళ్లి పీజీ చేయవద్దని కోరాం. అయినా వెళుతున్నారు. చివరకు బలిపశువులుగా మారుతున్నారు. వాళ్ల సర్టిఫికెట్లకు రిజిస్ట్రేషన్లుచేయద్దని ఎంసీఐ విధిగా ఆదేశించింది. ప్రభుత్వ కళాశాలల్లోనూ అనుమతి లేకుండా కోర్సులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన చేస్తే అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది.
–డా.ఎం.జయచంద్రనాయుడు,
వైస్ చైర్మన్, ఏపీ మెడికల్ కౌన్సిల్