గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం తాజా ఆర్థిక బడ్జెట్‌లో హైదరాబాద్‌కు మరిన్ని వరాలు ఇచ్చింది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం తాజా ఆర్థిక బడ్జెట్‌లో హైదరాబాద్‌కు మరిన్ని వరాలు ఇచ్చింది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చిన ఈటెల.. ఎక్కడ క్రైం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు చేరుకునేలా 1500 బైక్‌లు ఇస్తున్నామని, మరిన్ని రక్షక్ వాహనాలు ఇస్తున్నామని ప్రకటించారు. మహానగరంలో ఏకంగా లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటన్నింటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో స్కై వే ఏర్పాటుకు రూ.1600 కోట్లు, మెట్రో రైల్‌కు రూ.416 కోట్లు కేటాయించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా, మురుగు నీటి కాల్వల శుభ్రతకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గ్రేటర్‌లో ఉంటున్న ఎస్టీలను ఆకట్టుకునేందుకు వాల్మీకీ బోయ, కాయితీ లంబాడా కులాల్ని STలలో చేర్చేందుకు విచారణ సంఘం ఏర్పాటు చేస్తున్నామని, బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌ల ఏర్పాటు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.