
జగిత్యాల/వెల్గటూర్: ప్రశ్నించే గొంతునై.. పట్టభద్రులు, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏకపక్ష తీర్పుతో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. జగిత్యాలలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులు ఓడిపోవడం ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని చెప్పారు. 83 శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు ఓటు వేశారని, టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థికి ఏడు శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ఎప్పటికైనా మునిగిపోయే నావ
‘సీఎం కేసీఆర్ బుద్ధిగా రాజ్యమేలుకో.. ప్రజలు నీకు ఐదేళ్లు పాలించేందుకు అవకాశం ఇచ్చారు. కాదని మా పార్టీ వారిని ప్రలోభాలకు గురిచేస్తూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్పుతారు..’అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. పెద్దపెల్లి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రరశేఖర్‌కు మద్దతుగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ఎప్పటికైనా మునిగిపోయే నావ అని విమర్శించారు. పేదలకు అండగా ఉండే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.