Bengaluru FC
-
చాంపియన్ మోహన్ బగాన్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మోహన్ బగాన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)పై విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో ఐఎస్ఎల్ టైటిల్ కావడం విశేషం. 2024–25 లీగ్ దశలో అద్వితీయ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి లీగ్ షీల్డ్ దక్కించుకున్న మోహన్ బగాన్ జట్టు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. తుదిపోరులో మోహన్ బగాన్ జట్టు తరఫున జాసన్ కమిన్స్ (72వ నిమిషంలో), జేమీ మెక్లారెన్ (96వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మోహన్ బగాన్ జట్టు స్ట్రయికర్ అల్బెర్టో రోడ్రిగ్జ్ (49వ నిమిషంలో) సెల్ఫ్ గోల్‌తో బెంగళూరు ఖాతా తెరిచింది. మోహన్ బగాన్ ఆటగాళ్ల తప్పిదం వల్ల ఆట 49వ నిమిషంలోనే బెంగళూరు గోల్స్ ఖాతా తెరవగా... ద్వితీయార్ధంలో చెలరేగిపోయిన మోహన్ బగాన్ రెండు గోల్స్‌తో విజయ పతాక ఎగరవేసింది. మోహన్ బగాన్ జట్టు 20 షాట్స్ ఆడగా... అందులో ఆరింటిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై సంధించగలిగింది. బెంగళూరు జట్టు 18 షాట్స్‌లో నాలుగింటిని ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి కొట్టింది. మ్యాచ్‌లో అత్యధిక శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకోగలిగిన బెంగళూరు... ఫినిషింగ్ లోపాలతో గోల్స్ చేయలేకపోయింది. స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 62 శాతం బంతిని తమ ఆధినంలో ఉంచుకున్న బెంగళూరు జట్టు 512 పాస్‌లు కొట్టగా... 38 శాతం బంతిని నియంత్రించిన మోహన్ బగాన్ జట్టు 318 పాస్‌లు ఇచ్చుకుంది. పాస్‌ల కచ్చితత్వంలోనూ బెంగళూరు 78 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబర్చగా... మోహన్ బగాన్ 65 శాతంతో వెనుకబడింది. 2022–23 సీజన్లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఐఎస్ఎల్ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా బెంగళూరుపై మోహన్ బగాన్ జట్టు విజయం సాధించింది. -
ఎవరిదో కిరీటం?
కోల్‌కతా: 13 జట్లు... 162 మ్యాచ్‌లు... 210 రోజులు... 465 గోల్స్‌తో సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మధ్య నేడు ఫైనల్ జరగనుంది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకున్న మోహన్ బగాన్ జట్టు... సొంతగడ్డపై జరగనున్న తుదిపోరులో గెలిచి రెండోసారి చాంపియన్‌గా నిలవాలని భావిస్తుంటే... ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫైనల్‌కు చేరిన బెంగళూరు ఎఫ్‌సీ కూడా రెండోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. 2022–23 సీజన్లో చాంపియన్‌గా నిలిచిన మోహన్ బగాన్ జట్టు... 2023–24 సీజన్లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజా సీజన్ లీగ్ దశలో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన మోహన్ బగాన్... ఇప్పటికే లీగ్ షీల్డ్ విన్నర్‌గా నిలిచింది. 2024–25 లీగ్ దశలో 24 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 17 విజయాలు, 2 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 56 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘టేబుల్ టాపర్’గా నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లతో కలుపుకొని 26 మ్యాచ్‌ల్లో మోహన్ బగాన్ 50 గోల్స్ చేసింది. అంటే సరాసరిగా ఈ సీజన్లో మ్యాచ్‌కు రెండు గోల్స్ చొప్పున కొట్టింది. ఇక బెంగళూరు జట్టు గ్రూప్ దశలో 24 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 8 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 38 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. నాకౌట్ మ్యాచ్‌లతో కలుపుకొని బెంగళూరు 27 మ్యాచ్‌ల్లో 48 గోల్స్ చేసింది. సమఉజ్జీల సమరం... దూకుడుకు మారుపేరైన ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే కాగా... ఈ సీజన్లో మోహన్ బగాన్ ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బగాన్ జట్టు ప్రత్యర్థులకు 18 గోల్స్ మాత్రమే ఇచ్చుకోగా... బెంగళూరు జట్టు 33 గోల్స్ సమరి్పంచుకుంది. ఈ గణాంకాలు చాలు మోహన్ బగాన్ జట్టుపై గోల్ కొట్టడం ఎంత కష్టమో చెప్పేందుకు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐఎస్ఎల్ ఫైనల్‌కు చేరిన బెంగళూరు జట్టు... 2018–19 సీజన్లో చాంపియన్‌గా అవతరించింది. 2017–18, 2022–23 సీజన్లలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2022–23 సీజన్లో మోహన్ బగాన్, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ నిర్ణీత సమయంలో 2–2 గోల్స్‌తో ‘డ్రా’ కాగా... షూటౌట్లో మోహన్ బగాన్ జట్టు 4–3 గోల్స్ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునేందుకు బెంగళూరుకు చక్కటి అవకాశం ఉంది. భారత స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సుభాశీష్ బోస్ కెప్టెన్సీలో మోహన్ బగాన్ బరిలోకి దిగుతోంది. ‘ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సీజన్ చాలా బాగా సాగింది. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని భావిస్తున్నాం. కోల్‌కతా నగరం మాకు రెండో ఇల్లు లాంటింది. జట్టు ప్రదర్శన బాగుంది. సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. వారి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని మోహన్ బగాన్ సారథి సుభాశీష్ బోస్ అన్నాడు. ఆడిన ఎనిమిది సీజన్లలో బెంగళూరు జట్టు నాలుగోసారి ఫైనల్‌కు చేరగా... ఐఎస్ఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. మోహన్ బగాన్ తరఫున అల్బెర్టో రోడ్రిగ్స్, లిస్టన్ కొలాకో, అనిరుధ్ థాపా, సుభాశీష్ కీలకం కానుండగా... బెంగళూరు జట్టు గోల్‌కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, అల్బెర్టో నొగురె, ఎడ్గర్ మెండెజ్పై భారీ ఆశలు పెట్టుకుంది. -
ISL 2023: బెంగళూరును గెలిపించిన సునీల్ ఛెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మొద టి సెమీ ఫైనల్ తొలి అంచెలో ముంబై సిటీ ఎఫ్‌సీపై బెంగళూరు ఎఫ్‌సీ పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ 79వ నిమిషంలో స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన ఏకైక గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది. అయితే ఈ గెలుపుతో బెంగళూరు ఫైనల్ చేరడం ఖాయం కాలేదు. ఇంటా, బయటా పద్ధతిలో ఒక సెమీస్ మ్యాచ్‌ను రెండు అంచెలుగా నిర్వహిస్తుండగా... ఇరు జట్లు ఆదివారం బెంగళూరులో జరిగే రెండో అంచె పోరులో మళ్లీ తలపడతాయి. మరో వైపు రెండో సెమీఫైనల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య గురువారం హైదరాబాద్‌లో తొలి అంచె మ్యాచ్ జరుగుతుంది. -
Durand Cup: ముంబైని ఓడించి తొలిసారి విజేతగా బెంగళూరు.. ప్రైజ్‌మనీ ఎంతంటే
Durand Cup 2022 Final- కోల్‌కతా: భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది. బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్ -
ఐఎస్ఎల్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ముంబైలో ఆదివారం జరిగిన ఫైనల్లో బెంగళూరు 1–0తో గోవా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోని తొలి భాగంలోనూ గోల్ నమోదు కాలేదు. మరో నాలుగు నిమిషాల్లో అదనపు సమయం కూడా ముగుస్తుందనగా రాహుల్ భాకే గోల్ చేసి బెంగళూరుకు టైటిల్‌ను ఖాయం చేశాడు. -
కుంబ్లేకు 'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
బెంగళూరు: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే 'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. సోమవారం స్పోర్ట్స్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు(స్వాబ్) ప్రకటించిన అవార్డుల్లో కుంబ్లేకు కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. 2016, జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు కుంబ్లే పర్యవేక్షణలోని భారత్ జట్టు వరుసగా ఐదు టెస్టు సిరీస్‌ల్లో ఘన విజయాలు సాధించడంతో ఈ అవార్డును అతనికి అందజేస్తున్నట్లు స్వాబ్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నగరంలోని తాజ్ వివంతాలో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో భారత మహిళా హాకీ జట్టు కోచ్ హరేందర్ సింగ్ చేతుల మీదుగా అనిల్ కుంబ్లే అవార్డును అందుకున్నారు. అవార్డు స్వీకరణ అనంతరం కుంబ్లే మాట్లాడుతూ.. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 'కర్ణాటక రాష్ట్రంలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో స్వాబ్ ఎప్పుడూ ముందుంటుంది. మీ సహకారం లేకపోతే.. నా క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే అవార్డులను దక్కించుకునేవాడిని కాదేమో. ఇప్పుడు నా ముందు కూర్చున్న చాలా మంది స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు నాకు సుదీర్ఘకాలంగా తెలుసు. నా స్కూల్ క్రికెట్ నుంచి నా కెరీర్ రిటైర్మెంట్.. తర్వాత కోచ్ బాధ్యతలు ఇలా అన్ని సమయాల్లోనూ వారు నా గురించి వార్తలు రాశారు. ఈ మీ ప్రోత్సాహం మరువులేనిది.. ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని కుంబ్లే పేర్కొన్నాడు. అవార్డుల విజేతల పేర్ల జాబితా.. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(పురుషులు): సునీల్ చెత్రి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(మహిళలు):అదితి అశోక్ టీమ్ ఆఫ్ ద ఇయర్: బెంగళూరు ఎఫ్‌సీ కోచ్ ఆఫ్ ద ఇయర్: అనిల్ కుంబ్లే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: ఎమ్పీ గణేశ్ బెస్ట్ జూనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(పురుషులు): అర్జున్ మైనీ బెస్ట్ జూనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(మహిళలు): దామిని గౌడ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్: కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్ -
ఆ క్రెడిట్ కెప్టెన్ ఒక్కడిదే కాదు: కోచ్ రోకా
బెంగళూరు: తాము కేవలం ఒకే ఆటగాడి ప్రదర్శనపై ఎప్పూడు ఆధారపడి లేమని బెంగళూరు ఎఫ్‌సీ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా స్పష్టంచేశాడు. స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు అద్బుత గోల్స్ చేయడంతో బెంగళూరు జట్టు ఏఎఫ్ సీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు, టెక్నికల్ స్టాఫ్ అందరి శ్రమ ఇందులో దాగి ఉందన్నాడు. సెమిఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జోహర్ దరుల్ టాజిమ్ పై 3-1 గోల్స్ తేడాతో బెంగళూరు నెగ్గింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వల్లే బెంగళూరు ఫైనల్ చేరిందని వస్తున్న కామెంట్లపై ఆ టీమ్ కోచ్ అల్బర్ట్ రోకా తీవ్రస్థాయిలో స్పందించాడు. ఏఎఫ్ సీ కప్ ఫైనల్లోకి ఓ భారత జట్టు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఛెత్రి కెప్టెన్సీలో ఆటగాళ్లందరూ రాణించడం వల్ల బెంగళూరు నెగ్గిందనీ.. అంతేకానీ వన్ మ్యాన్ షో అని అనడం సరికాదని సూచించాడు. మరోవైఫు ఫైనల్స్ చేరిన ఇరాక్ జట్టు ఎయిర్ ఫోర్స్ ఎఫ్‌సీ ఈ టోర్నీలో 26 గోల్స్ చేసిందని, ముందు ఆ విషయంపై తమ జట్టు ఫోకస్ చేస్తోందని బెంగలూరు కోచ్ రోకా వివరించారు. -
బెంగళూరు ఎఫ్‌సీ అరుదైన ఘనత
సింగపూర్: ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్స్ (ఎఎఫ్సీ) కప్‌లో బెంగళూరు ఎఫ్‌సీ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్లబ్ కాంపిటేషన్‌లో భాగంగా రెండంచెల క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ 1-0 తో తంపినెస్ రోవర్స్(సింగపూర్)పై పైచేయి సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. తద్వారా ఎఎఫ్సీ కప్‌లో భారత్ నుంచి సెమీస్ కు చేరిన మూడో జట్టుగా బెంగళూరు గుర్తింపు సాధించింది. ఇరు జట్లు మధ్య బుధవారం జరిగిన ఫస్ట్ లెగ్ క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు విజయం సాధించగా, సెకండ్ లెగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దీంతో బెంగళూరు 1-0తో సెమీస్ కు చేరింది. గతేడాది రౌండ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టిన బెంగళూరు.. ఈసారి మాత్రం అంచనాలు మించి రాణించింది. ఇప్పటివరకూ ఎఎఫ్సీ కప్‌లో మూడు భారత క్లబ్ జట్లు మాత్రమే సెమీస్ కు చేరాయి. గతంలో డెంపో(2008), ఈస్ట్ బెంగాల్(2013)లో మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన జట్లుగా నిలిచాయి.