Government education system
-
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్‌గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్‌కి మోడల్ స్కూల్‌గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి -
శ్రమకు తగిన వేతనమేదీ?
సాక్షి, నెట్వర్క్: ప్రైవేట్ విద్యాసంస్థల్లో శ్రమ దోపిడీ జరుగుతోందని, శ్రమకు తగ్గవేతనం ఇవ్వడంలేదని ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగ భర్తీలు లేనందువల్లే ప్రైవేట్ సంస్థల్లో పనిచేయాల్సి వస్తోందని, అక్కడ తమకు కనీస హక్కులు కూడా ఉండటం లేదని వివరించారు. శనివారం ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడంవల్లే విద్యార్థులు ప్రైవేట్ రంగం వైపు మళ్లుతున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్నారు. తమ సెలవులు తమకు ఇవ్వాలని, యాజమాన్యం సెలవు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఉద్యోగిగా గుర్తింపు ఉండడంలేదన్నారు. రోజుకు 10 గంటలకుపైగా పనిచేయించుకుంటున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నామని, తమ జీవితాలతో ఆడుకోవద్దని సంస్థలను అభ్యర్థించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ తర్వాత జీవనోపాధి కల్పించే పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఏటా జీతం పెంచాలని, అధిక పనిగంటల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, అధ్యాపకులకు ఆదివారం, రెండో శనివారం సెలవులు ఇవ్వాలని, అధిక పని గంటలను నియంత్రించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని, జీవో నంబరు 1ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు.. విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, అద్యాపకుల యూనియన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా అధ్యక్షుడు డక్కిలి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్ ఎదుట పీటీఎల్‌యు (ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. బోధనావృత్తిపై మమకారంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉద్యోగాలు లేకపోవడంతో వేరే వృత్తి చేపట్టలేక ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అసలు జాతీయ సెలవులు ఇవ్వరని, కొన్ని విద్యా సంస్థల్లో కనీసం ఆదివారం కూడా సెలవులు ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యా సంస్థల్లో మహిళా టీచర్లు గర్భవతులు కాకూడదంటూ అగ్రిమెంట్లు కూడా చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. కోతలు లేకుండా జీతాలు ఇవ్వాలి అనంతపురం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పీటీఎల్‌యు జిల్లా అధ్యక్షుడు బి.కాసన్న మాట్లాడుతూ.. సెలవు దినాల్లో వేతన కోత లేకుండా 12 నెలలకూ జీతం ఇవ్వాలన్నారు. ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సిబ్బందికి అడ్మిషన్ టార్గెట్లు ఇవ్వడం, ప్రచారకర్తలుగా వినియోగించడం నిషేధించాలన్నారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పీటీఎల్యూ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంబేడ్కర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుల పేరుతో విద్యార్థులను, ఉద్యోగాల పేరుతో ఉపాధ్యాయులను దోచుకుంటున్నారన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలో నేతలు మాట్లాడుతూ.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ధర్నాలో పలువురు టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నకిరేకల్ బడి.. మస్తుంటది మరి..
- ప్రభుత్వ స్కూళ్లకు ‘ఉద్దీపన’తో జీవం పోస్తున్న నకిరేకల్‌వాసులు - గతేడాది 30.. ఈ ఏడాది 100 ప్రభుత్వ విద్యావ్యవస్థకు రక్షణ కవచంగా ‘ఉద్దీపన’ పేరిట ఓ కార్యక్రమం నకిరేకల్ నియోజకవర్గంలో గతేడాది మొదలైంది. ఇందులో భాగంగా చిట్యాల, నకిరేకల్ మండలాల్లోని 30 పాఠశాలల్లో నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తన అభివృద్ధి నిధులతో పాటు వేతనాన్నీ ఇచ్చి 2016–17లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 178 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలుండగా 100 పాఠశాలల్లో కార్యక్రమం చేపడుతున్నారు. స్థానికులు, అ«ధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో 25 మంది కేరళ టీచర్లు, 115 మంది విద్యావలంటీర్లకు సొంతంగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది రూ.1.2 కోట్లు ఖర్చవుతుందన్న అంచనా మేరకు దాతల నుంచి విరాళాలు కూడా తీసుకుంటున్నారు. గతేడాది నియోజకవర్గ వ్యాప్తంగా 3,239 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చేరగా, ఈ ఏడాది ఆ సంఖ్య 6,670కి పెరిగింది. వట్టిమర్తి.. నిజంగా స్ఫూర్తి చిట్యాల మండలం వట్టిమర్తికి ఓ ప్రత్యేకత ఉంది. నకిరేకల్ నియోజకవర్గానికి కమ్యూనిస్టు ఓనమాలు దిద్దిన నర్రా రాఘవరెడ్డి స్వగ్రామమిది. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 2015–16 సంవత్సరంలో విద్యార్థులు 22. రేపోమాపో బడిని మూసేసే పరిస్థితులుండగా, అప్పుడే ప్రారంభమైంది ఈ ఉద్దీపనోద్యమం. గ్రామస్తులందరినీ కూర్చోబెట్టిన ఎమ్మెల్యే వీరేశం.. పాఠశాల బతకాలంటే అందరూ ఓ మాట మీద ఉండాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా గ్రామంలోని ఏ విద్యార్థినీ ‘ప్రైవేట్’కు పంపొద్దని తీర్మానించుకున్నారు. గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల వాహనాలను నిషేధించారు. ఇంకేముంది.. ఇప్పుడు ఆ పాఠశాలలో 247 మంది విద్యార్థులున్నారు. గ్రామానికి పక్కనే ఉన్న వనిపాకల, గుమ్మళ్లబావి, గోపలాయిపల్లి, ఇండస్ట్రియల్ ప్రాంతానికి చెందిన 40 మంది ఆటోల్లో వస్తున్నారు. ప్రస్తుతమున్న పాఠవాలలో గదులు సరిపోకపోవడంతో ఎమ్మెల్యే ఇచ్చిన రూ.5 లక్షల నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. పార్టీలకతీతంగా సహకారం.. ఈ ‘ఉద్దీపన’ ప్రయత్నం వెనుక నియోజకవర్గంలోని అందరి సహకారమూ ఉంది. ఎమ్మెల్యే వీరేశం తన పూర్తి వేతనాన్ని ఇందుకు ఖర్చు చేస్తుండగా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ఉపాధ్యాయులు తమవంతు పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గానికి చెంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు, ఎన్నారైల సహకారమూ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ‘ప్రభుత్వ విద్య’ను బలోపేతానికి నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలూ ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే.. అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మేధావులు సభ్యులుగా ఉన్నారు. మండల స్థాయిలోనూ పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ్యులుగా కొనసాగుతుండటం విశేషం. నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 100 పాఠాలు బోధిస్తున్న కేరళ టీచర్ల సంఖ్య 25 విద్యావలంటీర్ల సంఖ్య 115 ఈ ఏడాది దాతల సహకారంతో చేసిన ఖర్చు (కోట్లలో) 1.20 2017–18లో గతేడాదికంటే 3,000లకు పైగా ఎన్రోల్మెంట్ అవకాశాల్లేనివారికో అవకాశం ప్రైవేట్ పాఠశాలలపై మోజు పెరగడంతో అవకాశం లేని వారే గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లలో చదువుతున్నారు. వీరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనే మాలో స్ఫూర్తి నింపింది. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థను బతికించాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ఎమ్మెల్యే వీరేశం బాధ్యతంతా మాదే మా గ్రామంలోని పాఠశాలను మూసేయకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలోని వారంతా ఈ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమమూ అందుబాటులోకి వచ్చినందున తల్లిదండ్రులూ వెనుకాడటం లేదు. ఇప్పుడు స్కూల్‌ను కాపాడుకునే బాధ్యత మా గ్రామస్తులదే. – కప్పల లింగయ్య, ఉపసర్పంచ్, వట్టిమర్తి