నకిరేకల్‌ బడి.. మస్తుంటది మరి.. | English medium was started in 30 nursery schools | Sakshi
Sakshi News home page

నకిరేకల్‌ బడి.. మస్తుంటది మరి..

Published Mon, Sep 18 2017 1:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

నకిరేకల్‌ బడి.. మస్తుంటది మరి..

నకిరేకల్‌ బడి.. మస్తుంటది మరి..

- ప్రభుత్వ స్కూళ్లకు ‘ఉద్దీపన’తో జీవం పోస్తున్న నకిరేకల్‌వాసులు
గతేడాది 30.. ఈ ఏడాది 100
 
ప్రభుత్వ విద్యావ్యవస్థకు రక్షణ కవచంగా ‘ఉద్దీపన’ పేరిట ఓ కార్యక్రమం నకిరేకల్‌ నియోజకవర్గంలో గతేడాది మొదలైంది. ఇందులో భాగంగా చిట్యాల, నకిరేకల్‌ మండలాల్లోని 30 పాఠశాలల్లో నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తన అభివృద్ధి నిధులతో పాటు వేతనాన్నీ ఇచ్చి 2016–17లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 178 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలుండగా 100 పాఠశాలల్లో కార్యక్రమం చేపడుతున్నారు. స్థానికులు, అ«ధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో 25 మంది కేరళ టీచర్లు, 115 మంది విద్యావలంటీర్లకు సొంతంగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది రూ.1.2 కోట్లు ఖర్చవుతుందన్న అంచనా మేరకు దాతల నుంచి విరాళాలు కూడా తీసుకుంటున్నారు. గతేడాది నియోజకవర్గ వ్యాప్తంగా 3,239 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చేరగా, ఈ ఏడాది ఆ సంఖ్య 6,670కి పెరిగింది.  
 
వట్టిమర్తి.. నిజంగా స్ఫూర్తి 
చిట్యాల మండలం వట్టిమర్తికి ఓ ప్రత్యేకత ఉంది. నకిరేకల్‌ నియోజకవర్గానికి కమ్యూనిస్టు ఓనమాలు దిద్దిన నర్రా రాఘవరెడ్డి స్వగ్రామమిది. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 2015–16 సంవత్సరంలో విద్యార్థులు 22. రేపోమాపో బడిని మూసేసే పరిస్థితులుండగా, అప్పుడే ప్రారంభమైంది ఈ ఉద్దీపనోద్యమం. గ్రామస్తులందరినీ కూర్చోబెట్టిన ఎమ్మెల్యే వీరేశం.. పాఠశాల బతకాలంటే అందరూ ఓ మాట మీద ఉండాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా గ్రామంలోని ఏ విద్యార్థినీ ‘ప్రైవేట్‌’కు పంపొద్దని తీర్మానించుకున్నారు.

గ్రామంలోకి ప్రైవేట్‌ పాఠశాలల వాహనాలను నిషేధించారు. ఇంకేముంది.. ఇప్పుడు ఆ పాఠశాలలో 247 మంది విద్యార్థులున్నారు. గ్రామానికి పక్కనే ఉన్న వనిపాకల, గుమ్మళ్లబావి, గోపలాయిపల్లి, ఇండస్ట్రియల్‌ ప్రాంతానికి చెందిన 40 మంది ఆటోల్లో వస్తున్నారు. ప్రస్తుతమున్న పాఠవాలలో గదులు సరిపోకపోవడంతో ఎమ్మెల్యే ఇచ్చిన రూ.5 లక్షల నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు.  
 
పార్టీలకతీతంగా సహకారం.. 
ఈ ‘ఉద్దీపన’ ప్రయత్నం వెనుక నియోజకవర్గంలోని అందరి సహకారమూ ఉంది. ఎమ్మెల్యే వీరేశం తన పూర్తి వేతనాన్ని ఇందుకు ఖర్చు చేస్తుండగా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ఉపాధ్యాయులు తమవంతు పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గానికి చెంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు, ఎన్నారైల సహకారమూ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ‘ప్రభుత్వ విద్య’ను బలోపేతానికి నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలూ ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే.. అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మేధావులు సభ్యులుగా ఉన్నారు. మండల స్థాయిలోనూ పార్టీలకతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ్యులుగా కొనసాగుతుండటం విశేషం.  
 
నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 100
పాఠాలు బోధిస్తున్న కేరళ టీచర్ల సంఖ్య 25
విద్యావలంటీర్ల సంఖ్య 115
ఈ ఏడాది దాతల సహకారంతో చేసిన ఖర్చు (కోట్లలో) 1.20
2017–18లో గతేడాదికంటే 3,000లకు పైగా ఎన్‌రోల్‌మెంట్‌ 
 
అవకాశాల్లేనివారికో అవకాశం 
ప్రైవేట్‌ పాఠశాలలపై మోజు పెరగడంతో అవకాశం లేని వారే గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లలో చదువుతున్నారు. వీరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనే మాలో స్ఫూర్తి నింపింది. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థను బతికించాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– ఎమ్మెల్యే వీరేశం 
 
బాధ్యతంతా మాదే 
మా గ్రామంలోని పాఠశాలను మూసేయకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలోని వారంతా ఈ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమమూ అందుబాటులోకి వచ్చినందున తల్లిదండ్రులూ వెనుకాడటం లేదు. ఇప్పుడు స్కూల్‌ను కాపాడుకునే బాధ్యత మా గ్రామస్తులదే.
– కప్పల లింగయ్య, ఉపసర్పంచ్, వట్టిమర్తి

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement