విశ్వమూ భ్రమిస్తోంది
భ్రమణం జీవలక్షణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది గనుకే రాత్రింబవళ్లు ఏర్పడతాయి. జీవకోటి యాత్ర సజావుగా సాగుతుంది. ఆ మాటకొస్తే చంద్రుని వంటి ఉపగ్రహాలు మొదలుకుని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము నిత్యం తిరుగుతూనే ఉంటాయన్నది తెలిసిందే. చివరికి సూర్యుడు కూడా ఇందుకు అతీతుడు కాదు. ఆ మాటకొస్తే పాలపుంత కూడా తనచుట్టూ తాను తిరుగుతూ ంటుంది. మరి విశ్వం? విశ్వానికి భ్రమణమనేది లేదన్నది ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం. అది నిత్యమూ అన్ని దిశలకూ సమానంగా విస్తరిస్తూ ఉంటుందన్నది సైంటిస్టుల భావన. కనుక విశ్వం తనచుట్టూ తాను తిరగదని సూత్రీకరించారు. కానీ అది నిజం కాదంటోంది తాజా పరిశోధన ఒకటి. విశ్వం కూడా తనచుట్టూ తాను తిరుగుతుందని పేర్కొంది. అయితే అది అత్యంత నెమ్మదిగా జరుగుతోందట. ఎంత మెల్లిగా అంటే, విశ్వం ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఏకంగా 50 వేల కోట్ల ఏళ్లుపడుతుందని ఆ పరిశోధన తేల్చింది! దాని అధ్యయన వివరాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు.‘హబుల్’ముడి వీడినట్టే! తాజా పరిశోధనకు హవాయి యూనివర్సిటీలోని ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ ఇస్ట్వాన్ జపుదీ సారథ్యం వహించారు. అంతరిక్ష శా్రస్తానికి సంబంధించి ఇప్పటిదాకా అతి పెద్ద ప్రహేళికల్లో ఒకటిగా మిగిలిపోయిన ‘హబుల్ టెన్షన్’ను పరిష్కరించేందుకు కూడా ఇది దోహదపడుతుందని సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వం తనచుట్టూ తాను తిరగడం లేదంటూ ఇప్పటిదాకా విశ్వసిస్తూ రావడం తెలిసిందే. విశ్వ విస్తరణ వేగానికి సంబంధించిన రెండు పరస్పర విరుద్ధ సమీకరణాలను వివరించడంలో ఈ సిద్ధాంతం విఫలమవుతోంది. వాటిలో ఒకటి సుదూరాల్లోని సూపర్నోవాలు, నక్షత్ర మండలాల దూరాల ఆధారంగా రూపొందించినది. మరొకటి దాదాపు 1,300 ఏళ్ల కింద విశ్వం ఆవిర్భవించిన నాటి కాస్మిక్ రేడియేషన్ నేపథ్యం ఆధారంగా సూత్రీకరించినది. రెండింట్లో ప్రతిపాదించిన విశ్వ విస్తరణ రేటులో తేడా ఉంది. దీన్ని అంతరిక్ష శాస్త్ర పరిభాషలో ‘హబుల్ టెన్షన్’గా పిలుస్తారు. జపుదీ బృందం అభివృద్ధి చేసిన గణిత సిద్ధాంతం ఈ సమస్యకు పరిష్కారం చూపడం విశేషం! అందులో భాగంగా విశ్వ విస్తరణ సిద్ధాంతానికి కొద్దిపాటి భ్రమణ సూత్రాన్ని జోడించారు. తద్వారా రెండు సమీకరణాలూ సరైనవేనని తేలినట్టు సైంటిస్టులు వివరించారు. ‘‘ప్రతిదీ విధిగా తనచుట్టూ తాను తిరుగుతుందన్న గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ సూత్రాన్ని నమ్మి రంగంలోకి దిగాం. ఇంతవరకూ వచ్చాం. విశ్వం ఒక భ్రమణానికి 500 బిలియన్ ఏళ్లు తీసుకుంటుందన్న మా సూత్రీకరణ చాలా హేతుబద్ధంగా ఉంది. పైగా ప్రస్తుత భౌతికశాస్త్ర సూత్రాలు వేటినీ ఉల్లంఘించడం లేదు. కనుక రెట్టించిన ఉత్సాహంతో తర్వాతి దశకు పరిశోధనకు సిద్ధమవుతున్నాం. విశ్వభ్రమణ సిద్ధాంతాన్ని మరింతగా పరిశోధించేందుకు సమగ్ర కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రయోగాలు చేపట్టనున్నాం’’అని జపుదీ వివరించారు. ఈ సిద్ధాంతం పూర్తిస్థాయిలో నిరూపణ అయితే విశ్వం తాలూకు మన అవగాహన మరింత విస్తరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్