IIT Admission Test
-
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
బిహార్ గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ‘ఐ.ఐ.టి. విలేజ్’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐ.ఐ.టి ర్యాంకులు సాధించివారు విపరీతంగా ఉంటారు. ఐ.ఐ.టి 2025 రిజల్ట్స్‌లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేతవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుంచి ఇంటికొక ఇంజనీర్ ఉండటం విశేషం. ఇదెలా జరిగింది?ఎవరో ఒకరిద్దరు తలుచుకుంటే ఏ మార్పూ రాదని కొందరు అనుకుంటారు. కాని ఒక మనిషి తలుచుకున్నా మార్పు వస్తుంది. వచ్చింది.1991.బిహార్‌లోని గయ జిల్లాలోని పట్వాటోలి అనే చిన్న గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐ.ఐ.టి.లో ర్యాంక్ వచ్చింది. ఆ ఊరి నుంచి ఎవరికైనా అలాంటి ర్యాంక్ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. స్థిరపడ్డాడు. కాని ఊరికే ఉండలేదు. ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు.దేనికంటే ఆ ఊరు అప్పటికే తన ప్రాభవం కోల్పోయింది.పట్వాటోలిని ఒకప్పుడు అందరూ ‘మాంచెస్టర్ ఆఫ్ బిహార్’ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేతపని వారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచేశాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువులవైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్తు మారుతుందని భావించాడు జితేంద్ర పట్వా.2013లో అతడు ఊరికి వచ్చి ‘వృక్ష సంస్థాన్’ పేరుతో ఒక ఎన్.జి.ఓ మొదలెట్టాడు. పేద నేతగాళ్ల పిల్లలకు, దిగువ మధ్యతరగతి ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐ.ఐ.టి కోచింగ్ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఆ ఊరిలో టెన్త్ తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు టెన్త్ సమయం నుంచే ఐ.ఐ.టి. కోచింగ్ మొదలెడుతున్నారు.అయితే ఇది ఆషామాషీగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐ.ఐ.టి. చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో గైడ్ చేస్తారు. అలాగే ఐ.ఐ.టి. చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికొచ్చి క్లాసులు చెబుతారు. కొత్తల్లో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ.ఐ.టి.కి వెళ్లినవాళ్లు క్లాసులు చెబుతున్నారు.అంటే ఈ ఫ్రీ కోచింగ్ ఎన్నాళ్లైనా కొనసాగే విధంగా ఇక్కడి విద్యార్థులే నిష్ణాతులయ్యారన్న మాట. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జె.ఇ.ఇ.– 2025 రిజల్ట్స్‌లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో శరణ్య అనే అమ్మాయి టాపర్‌గా నిలిచి 99.64 పర్సంటేజ్ సాధించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి కూడా ఎందరో ఐ.ఐ.టి. సాధించారు. వారు ఇలాంటి అడుగు వేస్తే ప్రతి పల్లెటూరి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు గొప్ప చదువులకు వెళతారు. గ్రామాల దశను మారుస్తారు. -
JEE Advanced Result 2021: అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. ఇందులో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా టాప్–10లో ర్యాంక్‌ల్లో మూడు మనోళ్లు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి.. 4వ ర్యాంక్, పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి.. 5వ ర్యాంక్, మొదుళ్ల హృషికేష్‌రెడ్డి 10వ ర్యాంక్ దక్కించుకున్నారు. వీరితో పాటు సవరం దివాకర్ సాయి 11వ ర్యాంక్, ఆనంద్ నరసింహన్ 17వ ర్యాంకు సాధించారు. రిజర్వ్ కేటగిరీల్లో నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరిలో రామస్వామి సంతోష్‌రెడ్డి(ఈడబ్ల్యూఎస్), నందిగామ నిఖిల్(ఎస్సీ), బిజిలి ప్రచోతన్ వర్మ(ఎస్టీ), గొర్లె కృష్ణచైతన్య(ఓబీసీ–పీడబ్ల్యూడీ) ఉన్నారు. జోన్లవారీగా ర్యాంక్‌లు చూస్తే... టాప్–100లో ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. ఈసారి జేఈఈ ర్యాంక్‌ల్లో విద్యార్థినుల వెనుకబాటు కనిపించింది. జాతీయస్థాయిలో టాప్–100లో ఒక్కరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగు విద్యార్థినుల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన 107వ ర్యాంక్‌తో అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మంది అర్హత... జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1,51,193 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 1,41,699 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,862 మంది అర్హత మార్కులు సాధించారు. అర్హత మార్కులు సాధించిన వారిలో 6,452 మంది విద్యార్థినులున్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకుగాను 348 మార్కు లు వచ్చాయి. ఇక, మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభిం చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రా శారు. వీరిలో సుమారు 7 వేల మంది అర్హత మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. టాప్ 500 ర్యాంక్‌ల్లో మనోళ్లు... ఐఐటీ హైదరాబాద్ పరిధిలో టాప్ 500 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు 135 మం ది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏడు జోన్లు ఉం డగా.. అందులో అత్యధికంగా ఐఐటీ బాం బే పరిధిలో 137 మంది ర్యాంక్‌లు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ–108, ఐఐటీ గౌహతి–9, ఐఐటీ కాన్పూర్–24, ఐఐటీ ఖరగ్‌పూర్–38, ఐఐటీ రూర్కీ–49 ర్యాంక్‌లు సాధించాయి. 27న తొలి విడత సీట్లు... జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంక్‌లు వెలువడటంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాలి. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. సంస్థాన్ నారాయణపురం: జేఈ ఈ అడ్వాన్స్‌డ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాం క్, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. మెయిన్స్‌లో 4 ర్యాంక్ దక్కించుకుంది. భావన మాట్లాడుతూ.. అ«ధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించానని పేర్కొంది. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా.. కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నందిగామ నిఖిల్ జాతీయస్థాయిలో ఎస్సీ కేటగిరీ లో మొదటిర్యాంక్ సాధించాడు. 360 మార్కులకుగాను 283 మా ర్కులు సాధించాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నదే తన ఆశయమని నిఖిల్ తెలిపాడు. మిర్యాలగూడ విద్యార్థికి 19వ ర్యాంక్ మిర్యాలగూడ అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కుర్ర శ్రీనివాస్ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు అభినందించారు. -
ఈ నెల 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేసేందుకు ఐఐటీ (రూర్కీ) ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కసరత్తు చేస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ (వెబ్ ఆప్షన్లు) ప్రారంభిస్తామని, 27న మొదటి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని ఎన్ఐటీ, ఐఐటీలకు జోసా తెలియజేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయడంతో పాటు చాయిస్ ఫిల్లింగ్‌కు వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు చాయిస్ ఫిల్లింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ఎన్ఐటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి. రమణరావు తెలిపారు. -
విద్యార్ధి ఉసురుతీసిన ఐఐటీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఐఐటీలో ర్యాంకు రాలేదన్న భయంతో నేరేడ్మెట్ బాలాజీనగర్‌లో ఇంటర్ విద్యార్ధి సోహెల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆకాష్ ఇన్స్టిట్యూట్లో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌గా పనిచేశాడు. ఇంటర్లో బ్యాక్‌లాగ్‌లపై తండ్రి మందలించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన సోహెల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో తన బెడ్రూమ్లోనే గన్‌తో కాల్చుకుని సోహెల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఫలితాలపై బెంగతోనే సోహెల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. -
2018 నుంచి ఐఐటీ ప్రవేశపరీక్ష ఆన్లైన్లోనే
చెన్నై: ఐఐటీ ప్రవేశపరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తామని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తెలిపింది. ఐఐటీల్లో అడ్మిషన్ల విధివిధానాలను రూపొందించే జేఏబీ ఆదివారం నాడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్, జేఏబీ చైర్మన్ ప్రొ.భాస్కర్ రామమూర్తి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించాం. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర అంశాలను సమయానుగుణంగా వెల్లడిస్తామ’ని పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇంతకుముందే విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో రాసే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది మెయిన్స్ రాసిన 13 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 10% మంది మాత్రమే ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకున్నారు.