చెన్నై: ఐఐటీ ప్రవేశపరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తెలిపింది. ఐఐటీల్లో అడ్మిషన్ల విధివిధానాలను రూపొందించే జేఏబీ ఆదివారం నాడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్, జేఏబీ చైర్మన్ ప్రొ.భాస్కర్ రామమూర్తి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షను 2018 నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించాం.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర అంశాలను సమయానుగుణంగా వెల్లడిస్తామ’ని పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇంతకుముందే విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ మెయిన్స్ పరీక్షను ఆన్‌లైన్‌లో రాసే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది మెయిన్స్ రాసిన 13 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 10% మంది మాత్రమే ఆన్‌లైన్ విధానాన్ని వినియోగించుకున్నారు.