Sri Rajarajeshwara Temple
-
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, విస్తరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు దశల్లో ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేయబోతోంది. ఇందులో తొలి దశ పనులను జూన్లో ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 15 నుంచి ప్రధాన దేవాలయంలోకి భక్తులను అనుమతించరు. కేవలం నిత్య పూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భాలయంలో నిర్వహిస్తారు. భక్తులకు స్థానిక భీమేశ్వరాలయంలో స్వామి దర్శనం కొనసాగుతుంది. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు. అప్పటి వరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్సవ మూర్తులను భీమేశ్వరాలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు, కైంకర్యాలు కొనసాగిస్తారు. ఈ పనులకు సంబంధించి గురువారం వేములవాడలో ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించనున్నారు. ఇందులో చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. మొత్తం పనులకు రూ.550 కోట్లు అవసరం బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. గర్భాలయంలోని మూల విరాట్టు ప్రాంగణాన్ని అలాగే ఉంచి మిగతా మొత్తం ఆలయం స్థానంలో పూర్తి కొత్త ఆలయాన్ని నిర్మించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాన్ని తొలగించటం పట్ల భక్తుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వేములవాడ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శృంగేరీ శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రధాన గర్భాలయం, మండప భాగాన్ని పటిష్ట పరిచి దాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తారు. పురాణ నేపథ్యంలో ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా 40 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్సు, వసతి గృహాలు, రెండు ప్రాకారాలు, కార్యాలయం, కోనేరు, కల్యాణ కట్ట, కోడె మొక్కుల ప్రాంతం.. ఇలా అన్నీ కొత్తగా నిర్మిస్తారు. భీమేశ్వరాలయం సహా అనుబంధ దేవాలయాలను అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం పనులకు రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన దేవాలయానికి సంబంధించి రూ.76 కోట్లకు, కల్యాణ మండపానికి సంబంధించి రూ.33 కోట్లకు నిధులు మంజూరు చేసింది. ఇటీవలి బడ్జెట్లో మరో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. వీటితో పనులు కొనసాగిస్తూ, తదుపరి విడతలకు మరిన్ని నిధులు మంజూరవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వ ‘ప్రసాద్’పథకంలో భాగంగా 96 గదులతో కూడిన వసతి గృహ నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరయ్యాయి. దీనికి మరిన్ని నిధుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. » ఆలయం 15 డిగ్రీల కోణంలో ఆగ్నేయం దిశ వైపు మళ్లి ఉంటుంది. ఇప్పుడు గర్భాలయం, సభా మండపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా భాగాన్ని నేరుగా ఉండేలా సరిద్దిది విస్తరిస్తారు.» చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అన్ని భాగాలను, పురాణాలు, పురాతన గ్రంథాలు, 1970లో వెలుగు చూసిన రాతి శాసనాల్లో పేర్కొన్న విధంగా ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా విస్తరిస్తారు. కొన్ని నిర్మాణాలు తదనంతరం వెలిశాయి. వాటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.» అన్నాదాన సత్రాన్ని రెండెకరాల విస్తీర్ణంలో రెండంతస్తులుగా లక్షన్నర చ.అ. మేర రూ.35.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.» ప్రస్తుత ప్రధాన ఆలయం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దాన్ని 4.6 ఎకరాల విస్తీర్ణానికి పెంచనున్నారు.» సరైన ప్రణాళిక లేకపోవటంతో గతంలో ఆలయ పునరుద్ధరణ వంకరటింకరగా జరిగింది. ఇప్పుడు దాన్ని రెండు ప్రాకారాలు, రెండు వీధులతో క్రమపద్ధతిలోకి మార్చనున్నారు. » ప్రస్తుతం ఇరుకుగా ఉన్న వీధులను రూ.47 కోట్ల వ్యయంతో 80 అడుగుల మేర విస్తరించనున్నారు.» అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను 9 రోజులు నిర్వహిస్తే, ఒక్క వేములవాడలో ఏడు రోజులు మాత్రమే జరుగుతుంది. బతుకమ్మ పుష్పం నుంచే ఆలయం ఉద్భవించిందన్న పౌరాణిక గాథ ఉంది. దాన్ని ప్రతిబింబించే తరహా గుర్తులను నిర్మాణంలో చూపనున్నారు.» పునరుద్ధరణ క్రమంలో గతంలో కొన్ని నిర్మాణాల్లో వేములవాడ చాళుక్యుల శైలి లోపించింది. ఇప్పుడు కొత్త నిర్మాణం యావత్తు ఆ శైలిలోనే ఉండనుంది. -
శరభ.. శరభ
వేములవాడ: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివకల్యాణోత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించి పులకించిపోతారు. కానీ వేములవాడలో శివకల్యాణం సందర్భంగా అత్యధిక మంది శివుడిని పెళ్లాడటం ఆనవాయితీ. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తే స్వామినే పెళ్లాడుతామని మొక్కుకుంటారు. ఆ నమ్మకంతో కష్టాలు తొలగిపోయిన వారు ఏటా శివకల్యాణోత్సవం సందర్భంగా త్రిశూలం పట్టుకొని స్వామిని వివాహమాడుతుంటారు. శివకల్యాణోత్సవాల్లో ఆకట్టుకునే మరో ప్రత్యేకత వీరశైవులు (జంగమయ్యలు) వీరభద్రుడికి ఆహ్వానం పలికే వేడుక. వీరభద్రుడికి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడి జంగమయ్యలు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరశైవ అర్చకులు దండకాలు (ఖడ్గాలు) వేస్తూ స్వామిని ఆహ్వానిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన 28 కుటుంబాలు పాల్గొంటాయి. స్మార్థ వైదిక పద్ధతిని అనుసరించి.. రాష్ట్రంలోని మిగతా శైవక్షేత్రాలలో ‘కారణాగమము’అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు చేస్తుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరిపిస్తుంటారు.ఈశ్వరుడు తపస్సులో ఉండగా, మన్మథుడు తన బాణాన్ని సంధించి తపస్సును భగ్నం చేశాడని, దీంతో ఈశ్వరునికి కోపమొచ్చి మన్మథున్ని త్రినేత్రంతో దహనం చేశాడని, అందుకోసమే కామదహనం తర్వాత మరుసటి రోజున ఈశ్వరుడు పార్వతిని కల్యాణం చేసుకుంటాడని అర్చకులు చెబుతున్నారు. ఇల్లు సల్లంగుండాలని.. ఏటా రాజన్నను పెళ్లాడే శివపార్వతులు ముందుగా ఇల్లు సల్లంగుండాలని రుద్రాక్ష పూజ చేసుకుంటారు. తమ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని, కుటుంబ సమస్యలు తీరాలని, మానసిక పరిస్థితులు మెరుగుపడాలని ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వారంతా వయో, లింగభేదం లేకుండా ఇక్కడి వీరశైవులతో రుద్రాక్షపూజ నిర్వహించుకుంటారు. అనంతరం రాజన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇక్కడి వీరశైవులు వీరికి ప్రత్యేక పూజలు చేసి రుద్రాక్షధారణ నిర్వహిస్తారు. అనంతరం వారంతా రాజన్న సేవలో తపించడంతోపాటు తమతమ కుటుంబ వ్యవహారాల్లోనూ కొనసాగుతుంటుంటారు. రాజన్నకు ఉచిత ప్రచార కర్తలుగా పని చేస్తుంటారు. -
వేములవాడ రాజన్న దశ మారేనా?
వేములవాడ అర్బన్ : పేదల దేవుడు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని రూ.145 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయూరు చేశారు. వీటిని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేసినట్లు తెలిసింది. ఇతర ఆలయూలకు రూ.కోట్లు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్.. ఎములాడ రాజన్నను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులతో కసరత్తు చేయించారు. పలు అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే జర్మనీ పర్యటన ముగిశాక సీఎం పర్యటన తేదీ ఖరారవుతుందని అంటున్నారు. కేసీఆర్పైనే ఆశలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు వెచ్చిస్తామని, రాజన్న భక్తుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చుతామని 2012 వేములవాడ పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ కావడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తాసుకుంటారని పట్టణవాసులతో పాటు రాజన్న భక్తుల ఆశించారు. తొలుత యాదగిరిగుట్టపై దృష్టి సారించిన సీఎం.. అక్కడి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించడమే కాకుండా ప్రతీ బడ్జెట్లో రూ.వందకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రక టించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రాజన్నకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య రూ.145 కోట్ల వ్యయంతో దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. దీంతో పనుల్లో కదలిక ప్రారంభమైనట్లు భక్తులు భావిస్తున్నారు. అరుుతే, వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ హాజరైతే స్పష్టత వస్తుందని వారు ఆశిస్తున్నారు. -
వేములవాడలో పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులోనూ రెండవ కార్తీక సోమవారం కావడంతో అమ్మ శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తజనం పోటెత్తింది. దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ ప్రాత:కాలమే పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం కోసం నిర్దేశించిన క్యూల్లో వేచివున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా శ్రీరాజరాజేశ్వరి నామాన్నిస్మరిస్తూ బారులు తీరారు. దాంతో అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.