Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Public Suffering with Power Cuts In Chandrababu TDP Govt1
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు

చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్‌ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్‌ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్‌ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికా­రికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్‌ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్‌సీ, లైన్ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్‌ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్‌ యూనిట్ల వినియో­గం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్‌ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్‌ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్‌ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూత­పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రా­మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్‌ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్‌ కోసం..భవిష్యత్‌లో విద్యుత్‌ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజె­క్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్‌ డిమాండ్‌ ప్రధాన సూచి­కగా భావిస్తుంటారు. వినియోగ­దా­రులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్‌ సరఫ­రాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్‌ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్‌ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్‌ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్‌ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్‌ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్‌ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్‌ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్‌ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్‌ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్‌ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్‌ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్‌ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్‌ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్‌ ఫార్మర్‌ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్‌ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్‌ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్‌ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్‌ మహమ్మద్‌ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్‌ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా

YS Jagan Wishing speedy recovery For KTR2
బ్రదర్‌ కేటీఆర్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

India Warns Pakistan At UN Over Pahalgam Incident3
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్‌ హెచ్చరిక

న్యూయార్క్‌: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఎండగట్టింది. పాకిస్తాన్‌ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్‌ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్‌ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్‌ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్‌ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW— Press Trust of India (@PTI_News) April 29, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

Nawaz Sharif Warns Pakistan PM Shehbaz Sharif Over India4
భారత్‌తో జాగ్రత్త.. పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్‌ హెచ్చరిక

లాహోర్‌: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్‌ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్‌ సలహా ఇచ్చారు.పాకిస్తాన్‌ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌తో షహబాజ్‌ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్‌ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్‌ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్‌ కుమార్తె, పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్‌(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్‌ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు.

Canada Election Results Mark Carney Liberals Lead First Polls5
కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్‌ పార్టీ

అ‍ట్టావా: కెనడా (Canada)లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కెనడాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ కూడా గట్టి పోటీనిస్తోంది.ఇక, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. లిబరల్‌ పార్టీ 59 స్థానాల్లో గెలుపొందగా.. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, కన్జర్వేటివ్‌ పార్టీ 56 స్థానాలు దక్కించుకొని.. మరో 76 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్‌ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, కెనడా (Canada) పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 28న పోలింగ్‌ జరగగా.. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి.కెనడాలో నాలుగు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వాటిలో లిబరల్ పార్టీ (Liberal party), కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party), న్యూ డెమోక్రాట్స్ (NDP), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.🚨🚨 The election in Canada is now a toss up.Conservative Party (Blue in Canada) massively outperforming expectations in early results. pic.twitter.com/Dd1eVSP2Rt— Spencer Hakimian (@SpencerHakimian) April 29, 2025ఇదిలా ఉండగా.. రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా పనిచేసిన మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయనాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కెనడాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.మరోవైపు.. అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్‌తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.BREAKING: Pierre Poilievre's Conservatives are TIED with the Liberals in Atlantic Canada..This election is gonna be an absolute blowout lol pic.twitter.com/Bri2eDwIvn— Jinglai He 🇨🇦 (@JinglaiHe) April 29, 2025

First 100 days of the second Term Donald Trump presidency6
100 రోజుల ట్రంపరితనం 

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్‌ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్‌ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్‌ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్‌ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్‌ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్‌.. ఓవర్‌ డోస్‌ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్‌ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్‌ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్‌ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్‌ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్‌స్కీకి అవమానం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్‌ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్‌స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్‌ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్‌ చివరికి ఆయన్ను వైట్‌హౌస్‌ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్‌ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్‌ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్‌ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్‌ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్‌ఎన్‌ పోల్‌ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్‌ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్‌ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్‌ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్‌ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్‌ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్‌ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్‌ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ మాత్రం ట్రంప్‌ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్‌ కేర్‌’ అనేసింది.

Director Sampath Nandi TO Big Chance To Dimple Hayathi In Sharwanand Movie7
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌

చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్‌ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్‌ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్‌ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్‌ హిట్‌ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్‌(Sharwanand) కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్‌ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్‌ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi)

Akshaya Tritiya 2025 Gold Jewellery Offers8
అక్షయ తృతీయ ఆఫర్లు షురూ

కోల్‌కతా: బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గకుండా జ్యుయలర్లు మార్కెటింగ్‌ సన్నాహాలు మొదలుపెట్టారు. మరిన్ని అమ్మకాలు సాధించేందుకు వీలుగా డిస్కౌంట్‌లు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) అన్న విషయం తెలిసిందే. ఏటా ఆ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఈ ఏడాది అధిక ధరల నేపథ్యంలో అమ్మకాలపై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. దీంతో ప్రముఖ బ్రాండ్లు తనిష్క్, సెంకో గోల్డ్, ఎంపీ జ్యుయలర్స్, పీసీ చంద్ర జ్యుయలర్స్‌ ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. → టాటా బ్రాండ్‌ తనిష్క్ బంగారం ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. → బంగారం ధరపై రూ.350 డిస్కౌంట్‌ను సెంకో గోల్డ్‌ ఆఫర్‌ చేస్తోంది. అలాగే తయారీ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తోంది. డైమండ్‌ ఆభరణాలపై తయారీ చార్జీల్లో 100 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. → ఎంపీ జ్యుయలర్స్‌ గ్రాము బంగారంపై రూ.300 డిస్కౌంట్‌ ప్రకటించింది. తయారీ చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తోంది. → పీసీ చంద్ర జ్యుయలర్స్‌ గ్రాము బంగారంపై రూ.200.. తయారీ చార్జీల్లో 15 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. డైమండ్‌ జ్యుయలరీపై 10 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. మంచి డిమాండ్‌ ఉంటుంది.. ‘‘అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు మంచిగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల్లో బంగారం పట్ల విశ్వాసం బలంగా ఉంది’’అని అంజలి జ్యుయలర్స్‌ డైరెక్టర్‌ అనర్గ ఉట్టియ చౌదరి తెలిపారు. దీంతో తయారీ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత సాధనంగా చూస్తున్నట్టు చెప్పారు. దీంతో బంగారంపై మరింత పెట్టుబడులకు కొనుగోలుదారులు మొగ్గు చూపించొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే బంగారం ధరలు స్వల్పకాలంలో మరో 5–7 శాతం వరకు పెరగొచ్చని.. సమీప కాలంలో దిద్దుబాటు అవకాశాలు కనిపించడం లేదన్నారు. ధరలు పెరగడంతో అమ్మకాల పరిమాణం తగ్గినట్టు సెంకో గోల్డ్‌ ఎండీ, సీఈవో సువాంకర్‌ సేన్‌ తెలిపారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్‌ బలంగా ఉండొచ్చన్న అంచనాతో ఉన్నారు. ముత్యాలు, రత్నాలను చేర్చడం ద్వారా వివాహ ఆభరణాల ధరలను 25–30 శాతం వరకు తగ్గించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జియో ఫైనాన్స్‌ యూజర్లకు గోల్డెన్‌ ఆఫర్‌ముంబై: అక్షయ తృతీయను పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లకు సంబంధించి జియో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియోఫైనాన్స్, మైజియో యాప్‌ యూజర్లకు జియో గోల్డ్‌ 24కే డేస్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు రూ. 1,000 నుంచి రూ. 9,999 వరకు విలువ చేసే డిజిటల్‌ గోల్డ్‌ను కొనుగోలు చేసే వారు జియోగోల్డ్‌1 కోడ్‌ను ఉపయోగించి అదనంగా 1 శాతం పసిడిని ఉచితంగా దక్కించుకోవచ్చు. రూ. 10,000కు మించిన కొనుగోళ్లపై జియోగోల్డ్‌ఎట్‌100 ప్రోమో కోడ్‌తో 2 శాతం పసిడి అందుకోవచ్చు. ఆఫర్‌ వ్యవధిలో ఒక్కో యూజరు 10 లావాదేవీల వరకు, గరిష్టంగా రూ. 21,000 వరకు విలువ చేసే పసిడిని పొందవచ్చు. గోల్డ్‌ సిప్‌లు కాకుండా ఏకమొత్తంగా చేసే పసిడి కొనుగోళ్లకు ఇది వర్తిస్తుంది.

IPL 2025: Rajasthan Royals beat Gujarat Titans9
IPL 2025: విధ్వంసంలో వైభవం

సచిన్‌ వేగాన్ని ఆరాధించాం.సెహ్వాగ్‌ దూకుడును చూశాం. రో‘హిట్స్‌’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. కానీ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్‌లో సెర్చ్‌ చేస్తారు. ‘లైక్‌’లు కొట్టే షాట్లను ఫోన్‌ కెమెరాల్లో బంధించారు. ‘షేర్‌’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్‌ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్‌ స్క్రైబ్‌’ అయిపోయారు. ఐపీఎల్‌ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్‌: ఐపీఎల్‌ 2008లో పుట్టింది. లీగ్‌ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్‌ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్‌ సూర్యవంశీ. ఐపీఎల్‌లో అతనొక సంచలనం. బ్యాటింగ్‌ మెరుపులకే వై¿ోగం. క్రికెట్‌ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్‌లకే ఫిక్స్‌ అయినట్లు... అతని బ్యాట్‌ షాట్‌లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు. వైభవ్‌ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) శతకానికి జైపూర్‌లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్‌లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీ పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్‌ ఆట అసాంతం హైలైట్స్‌నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్‌ల తుఫాన్‌ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్‌ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్‌ పరుగుతో మొదలైన తొలిఓవర్‌ వైభవ్‌ సిక్సర్‌తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్‌ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్‌ మూడో ఓవర్లో జైస్వాల్‌ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్‌ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్‌ నాలుగో ఓవర్‌తో అతని షో మ్యాచ్‌ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్‌ బౌండరీ, సింగిల్‌ తీసివ్వగా, వైభవ్‌ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్‌ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్‌లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్‌ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్‌–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్‌ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్‌ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్‌ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన కరీమ్‌ జనత్‌ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్‌ వీరబాదుడికి సిక్స్, ఫోర్‌ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్‌ఖాన్‌ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్‌వికెట్‌ మీదుగా బాదిన సిక్స్‌తో వైభవ్‌ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్‌ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్‌ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా ప్రసిధ్‌ కృష్ణ తొలివికెట్‌ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్‌ వికెట్‌కు తెరపడింది. నితీశ్‌ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 39; గిల్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 84; బట్లర్‌ (నాటౌట్‌) 50; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్‌ 9; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్‌వీర్‌ 3–0–38–0, సందీప్‌ శర్మ 4–0–33–1, పరాగ్‌ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 70; వైభవ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 101; నితీశ్‌ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 4; పరాగ్‌ (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–24–0, ఇషాంత్‌ 2–0–36–0, సుందర్‌ 1.5–0–34–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–47–1, రషీద్‌ 4–0–24–1, కరీమ్‌ 1–0–30–0, సాయి కిషోర్‌ 1–0–16–0. వైభవ్‌ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్‌ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్‌ విజయ్‌ జోల్‌ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్‌లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్‌ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్‌ పరాగ్‌ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్‌ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్‌గానూ వైభవ్‌ గుర్తింపు పొందాడు. యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్‌పై) తర్వాత ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్‌ చేయడం సులువవుతుంది. ఐపీఎల్‌లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. –వైభవ్‌ సూర్యవంశీ

Rasi Phalalu: Daily Horoscope On 29-04-2025 In Telugu10
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.విదియ రా.8.33 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: కృత్తిక రా.9.51 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.10.39 నుండి 12.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృత ఘడియలు: రా.7.40 నుండి 9.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం... పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.వృషభం... ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వస్తు,వస్త్రలాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.మిథునం.. రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విందువినోదాలు.కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వాహనయోగం.సింహం..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.తుల... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.వృశ్చికం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు.ధనుస్సు... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.మకరం..... పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. కుటుంబ, ఆర్థిక సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవచింతన. విద్యార్థులకు ఒత్తిడులు.కుంభం... వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయదర్శనాలు.మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement