
ఇటుకల కోటలు
ఇటుకల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బట్టీల యజమానులు సతమతమవుతున్నారు. ఇటుక బలంగా తయారు కావడానికి బంకమట్టి, వరిపొట్టు మిశ్రమం అవసరం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. మరో పక్క కొనుగోలుదారులు లేక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. తయారైన ఇటుకలు.. భారీ వర్షాల వల్ల పాడైపోవడంతో నష్టం ఏర్పడింది. దీంతో బట్టీలు మూతపడుతున్నాయి.
కూలుతున్న
ముంచంగిపుట్టు: ఇటుకల వ్యాపారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా అమ్మకాలు లేక నష్టాలను చవిచూస్తున్నారు.రోజు రోజుకు ఊక,కర్రలు వంటి ముడి సరకుల ధరలు పెరుగుతూ ఉండడంతో పాటు కూలీల వ్యయం అధికం కావడంతో బట్టీలు మూతపడుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలల్లో సుమారు 50 బట్టీలున్నాయి. వీటిలో అత్యధిక బట్టీల్లో రెండు నెలలుగా ఇటుకల తయారీ నిలిపివేశారు. సరిహద్దులో సుమారు 150 కుటుంబాలు ఇటుకల బట్టీల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఒడిశా రాష్ట్రం జయపురం, కోరాపుట్, సిమిలిగూడ, మల్కన్‌గిరి,రాయపూరు వంటి పట్టణాల నుంచి ఇటుకల తయారీకి కోసం ప్రతి ఏడాది 150 కుటుంబాల వారు వస్తారు. డిసెంబర్ నుంచి మే వరకు ఆరు నెలల పాటు ఇటుకలను తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో బట్టీలో వారానికి 50 వేల ఇటుకలు తయారవుతాయి. ఈ లెక్కన ఆరు నెలల్లో సుమారు 12 లక్షల ఇటుకలు తయారు చేస్తారు. ఒక్కో ఇటుక రూ.5.50 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది వరకు విక్రయాలు బాగున్నాయి. సిమెంట్ ఇటుకల కారణంగా ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గిపోయాయి. సుమారు ఐదు లక్షల ఇటుకలు తయారీదారుల వద్ద ఉండిపోయాయి. సిమెంట్ ఇటుక ధర రూ.20 ఉన్నా... పని త్వరగా పూర్తవుతుండడంతో ఆ ఇటుకల వినియోగంపై ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
580 గ్రామాలకు సరఫరా
సరిహద్దులోని 580 గ్రామాలకు చెందిన వారు ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల నుంచే ఇటుకలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారైన ఇటుకలకు నాణ్యత,సైజ్ పరంగా మంచి గుర్తింపు ఉంది. అయితే గత మూడు నెలలుగా ఇటుకల అమ్మకాలు లేకపోవడంతో నిల్వలు అధికంగా పేరుకుపోయాయి. దీనికి తోడు గత రెండు నెలలుగా సరిహద్దులో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి.తయారు చేసిన ఇటుకలు తడిసిపోయి పాడైపోతున్నాయి. దీంతో చాలా మంది ఇటుకల వ్యాపారులు నష్టాలను భరించలేక బట్టీలను తాత్కాలికంగా మూసివేశారు.
పెరిగిన ముడిసరకుల ధరలు
ఇటుకల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఊక ధర గత ఏడాది కిలో రూ.3 ఉంటే ప్రస్తుతం రూ.6 ఉంది.కట్టెలు ట్రాక్టర్ లోడు గత ఏడాది రూ.4వేలు ఉంటే ప్రస్తుతం రూ.6వేలకు చేరింది. బొందు ఇసుక వ్యాన్ లోడు గత ఏడాది రూ.6,500 ఉంటే ప్రస్తుతం రూ.10వేలు ఉంది. దీనికి తోడు రోజుకు వెయ్యి ఇటుకలు తయారీ చేస్తే రూ.1,300 కూలి చెల్లించాలి. వర్షం, ఇతర కారణాల వల్ల ఇటుకలు పాడైతే ఆ నష్టాన్ని బట్టీ నిర్వాహకుడే భరించాలి. రూ.4,500 ఖర్చు చేసి వెయ్యి ఇటుకలు అమ్మకానికి సిద్ధం చేస్తే మార్కెట్‌లో రూ.5వేలు నుంచి రూ.5,500 ధర మాత్రమే లభిస్తోంది.
దుర్భర పరిస్థితుల్లో వలస కూలీలు
ఈ ఏడాది మూడు నెలలకే ఇటుకల తయారీని బట్టీల నిర్వాహకులు నిలిపివేసి, కూలీలను తిరిగి ఇంటికి పంపించేశారు.దీంతో ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వచ్చిన వందలాది మంది ఇటుకల తయారీ వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. గత 10 సంవత్సరాలుగా ఏటా సరిహద్దులో ఇటుకల తయారీకి వచ్చి ఆరు నెలల పాటు ఉపాధి పొందే కూలీలు నేడు అవస్థలు పడుతున్నారు. ఇటుకల తయారీ పనినే నమ్ముకుని జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది.రానున్న రోజుల్లో ఇటుకల తయారీ పనిని వదులుకుని మరేదైనా పని చేసుకుంటే తప్ప కుటుంబాలను పోషించుకోలేమని వలస కూలీలు వాపోతున్నారు.
పనిలేకఇబ్బందులు
పడుతున్న వలసకూలీలు
మూతపడుతున్న బట్టీలు
నష్టాల్లో
తయారీదారులు
భారీగా
పెరిగిన
ముడిసరకుల ధరలు
కొనుగోలు
దారులు లేక
పేరుకుపోతున్న నిల్వలు
మండలం మొత్తం మూతపడినవి
బట్టీలు
ముంచంగిపుట్టు 20 06
పెదబయలు 14 06
జి.మాడుగుల 10 04
హుకుంపేట 07 06
వర్షాలతో
పాడైపోతున్న
ఇటుకలు
ఈ పనే మాకు ఆధారం
ఇటుకలు తయారు చేసేందుకు ఒడిశాలోని జయపురం నుంచి వచ్చాను. గత ఏడాది ఆరు నెలల పాటు పని చేశాను. రూ.లక్ష వరకు ఇంటికి తీసుకు వెళ్లాను.ఈ ఏడాది మూడు నెలలు పని చేసి, రూ.20 వేలు కూడా సంపాదించలేకపోయాను.ఇటుకలకు డిమాండ్ లేక నిర్వాహకులు ఇంటికి వెళ్లి పోవాలని చెప్పారు. ఈ పని లేకపోతే కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతుంది.
– హరిజన్, వలస కూలీ,జయపురం,ఒడిశా రాష్ట్రం
రూ.3 లక్షల నష్టం వచ్చింది
ఇటుకల బట్టీల నిర్వహణ చాలా కష్టంగా ఉంది.ప్రస్తుతం సిమెంట్ ఇటుకలకు డిమాండ్ ఉంది. కొనుగోలు దారులు లేక మట్టి ఇటుకల నిల్వలు పెరిగిపోయాయి. ఊక,కర్రలు తదితర ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలకు ఇటుకలు పాడైపోయాయి. ఈ ఏడాది రూ.3లక్షల వరకు నష్టం వచ్చింది.
– బొరగం శ్రీనివాసరావు, ఇటుకల బట్టీ నిర్వాహకుడు, పెద్దపుట్టు గ్రామం

ఇటుకల కోటలు

ఇటుకల కోటలు