
యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి
అనంతపురం అర్బన్: ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబ్‌మేళాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి 8 జాబ్‌మేళాలు నిర్వహించాల్సి ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధిపై కార్యాచరణ పక్కాగా అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు పరిశ్రమలను అనుసంధానించాలన్నారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే పథకం ద్వారా 205 బ్యాచ్‌ల్లో 6 వేల మందికి శిక్షణ ఇచ్చారని, 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ఏర్పాటు పనులు వేగంగా చేపట్టాలన్నారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక జాబ్‌మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతపురం అర్బన్‌కు సంబంధించి ఏప్రిల్ 25న, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మే 2న, కళ్యాణదుర్గానికి సంబంధించి మే 16, రాయదుర్గం మే 23, గుంతకల్లు మే 30, తాడిపత్రి జూన్ 6, శింగనమల జూన్ 13, ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి జూన్ 27న జాబ్‌మేళా నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, జేఎన్‌టీయూ ప్లేస్‌మెంట్ సీఈఓ శ్రీనివాసులు, ఎస్‌కేయూ అధికారి సీహెచ్‌కృష్ణ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, జేడీఎం సూర్య నారాయణ, కార్మిక శాఖ ఏసీ రమాదేవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి, రూడ్‌సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్‌కుమార్
‘ఉల్లాస్’ లక్ష్యం సాధించాలి
‘ఉల్లాస్’ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించాల్సి ఉందన్నారు. మే 5 నుంచి సెప్టెంబరు వరకు అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డీడీ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.