
అగ్నిహోత్ర పిడకలు.. ఆరోగ్యధాతువులు
నగరి మండలం రాజులకండ్రిగలో తయారీ
ఒక్కో పిడక తయారీకి రూ.25 ఖర్చు
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న వైనం
ఆరోగ్యాన్ని పంచడమే లక్ష్యమంటున్న రైతు సుబ్బరాజు
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు.
ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు.
నగరి : పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చిత్తూరు జిల్లా నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు.
హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు.
ఒక్కో పిడక రూ.30
10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు
చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు.
తయారీ ఇలా....
దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శా్రస్తోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.
వినియోగించడం ఎలా..
ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాతి్మకతను సంతరించుకుంటుంది.
ఆరోగ్యం కోసమే చేస్తున్నా
ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు.
ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ