
సైన్యంలో పనిచేసినందుకు రైతు తండ్రికి ఇచ్చిన భూమిని ఆక్రమించిన టీడీపీ నేతలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా జరగని న్యాయం
ఆక్రమణదారులకే వత్తాసు పలికిన తహశీల్దార్
మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకున్న రైతు
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో దారుణం
కలికిరి(వాల్మికిపురం): భారత సైన్యంలో పనిచేసినందుకు తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించడం.. అధికారులు కూడా వారికే వత్తాసు పలకడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన గురువారం అన్నమయ్య జిల్లా వాల్మికిపురం మండలంలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మికిపురం మండలం మూరేవాండ్లపల్లికి చెందిన రామయ్య భారత సైన్యంలో ఉద్యోగం చేశారు.
ఆయన రిటైర్‌మెంట్ అనంతరం ప్రభుత్వం జీవనాధారం కోసం 1975వ సంవత్సరంలో అదే మండలంలోని తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.1051లో 5.53 ఎకరాల విస్తీర్ణానికి పట్టా మంజూరు చేసింది. రామయ్య మరణానంతరం అతని కుమారుడు రైతు వెంకటాద్రి తన పేరుపై భూమిని ఆన్‌లైన్ చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఆ భూమిపై కన్నేసిన మూరేవాండ్లపల్లికి చెందిన మోహన్‌రెడ్డి, పెద్దవంకపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి.. ఇటీవల దానిని ఆక్రమించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెంకటాద్రి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలకడంతో పాటు ఆ భూమితో సంబంధం లేదంటూ వెంకటాద్రితో సంతకాలు చేయించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటాద్రి గురువారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
తన చావుకు నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తహశీల్దారు పమిలేటి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అదే విషయాన్ని చేతిపైనా రాసుకున్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆత్మహత్య తర్వాతైనా.. ఆ భూమిని తన కుమారుడు, కుమార్తె పేరిట ఆన్‌లైన్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, వెంకటాద్రి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.